close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
జీవిత పాఠాలు నేర్పే బడి

జీవిత పాఠాలు నేర్పే బడి

ఐఐటీ ఖరగ్‌పూర్‌, ఐఐఎమ్‌ అహ్మదాబాద్‌లలో చదువుకున్న అతడు... ఓ ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకుకి మేనేజర్‌గా పనిచేశాడు. అయితే, అక్కడ ఉద్యోగాల్లో చేరేవాళ్లలో చాలామందికి ప్రాథమిక అంశాల్లోనూ అవగాహన లేకపోవడాన్ని గమనించాడు. అప్పుడే అతడికి అనిపించింది... ‘అది వారి లోపం కాదు, విద్యా వ్యవస్థ లోపం’ అని. ఆ సమస్య పరిష్కారానికి నడుం బిగించాడిలా...
ప్రభుత్వ పాఠశాలలోనే చదువుకున్న ఆర్ఘ్య బెనర్జీ కోచింగ్‌ తీసుకోకుండానే ఐఐటీ, ఐఐఎమ్‌లకు ఎంపికయ్యాడు. విద్య అంటే డిగ్రీలు కాదు, దైనందిన జీవితంలో పనులు చేసుకోవడం, సాంకేతిక మార్పుల్ని తెలుసుకోవడం, సంఘజీవిగా బతకగలగడం... అని నమ్మినవాడు ఆర్ఘ్య. అందుకే లక్షల జీతం వచ్చే ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకర్‌ ఉద్యోగాన్ని వదులుకొని తన ఆలోచనలతో స్కూల్‌ని స్థాపించాలనుకున్నాడు. దానికోసం చెన్నై వదిలి సొంత రాష్ట్రం పశ్చిమ్‌బంగాకి తిరిగొచ్చి... కోల్‌కతాకి 200 కి.మీ. దూరంలోని తన సొంతూరు సువూరిలో ‘లెవెల్‌ఫీల్డ్‌ స్కూల్‌’ స్థాపించాడు. నాణ్యమైన చదువులు మెట్రో నగరాల్లో ఉండేవారికే కాదు, పట్టణ స్థాయిలోనూ అందించాలనేదే బెనర్జీ ఉద్దేశం.
ఏం చెబుతారంటే...
లెవెల్‌ఫీల్డ్‌ పాఠశాలలో పాఠ్యపుస్తకాలు ఎక్కువగా కనిపించవు. క్లాసులో టీచర్లు చెప్పడం-విద్యార్థులు వినడం లాంటివి ఉండవు. ఒక్క మాటలో చెప్పాలంటే సాధారణ స్కూళ్లలో ఏం జరుగుతుందో అది అక్కడ కనిపించదు. ఇక్కడ గణితం నేర్చుకోవడం అంటే కేవలం పుస్తకాల్లో ఉన్న లెక్కలు చేయడం కాదు... పజిల్స్‌, సుడోకు లాంటివీ చేయడం. సైన్స్‌ నేర్చుకోవడం అంటే ల్యాబ్‌లోనే ప్రయోగాత్మకంగా తెలుసుకోవడం. నేర్చుకోవడం అంటే దేన్నైనా ఎందుకు, ఏమిటి, ఎలా, ఎప్పుడు... లాంటి కోణాల్లో తెలుసుకోవడం తప్ప ప్రశ్నలూ జవాబుల తరహా చదువు ఉండదు. సబ్జెక్టులకంటే కాన్సెప్టులపైన ఎక్కువ దృష్టిపెడతారు. యానిమల్‌ ఫామ్‌, గలివర్‌ ట్రావెల్స్‌, మ్యాక్‌బెత్‌ లాంటి రచనల్ని ఏడెనిమిది తరగతుల పిల్లలు చదవడమే కాదు, వాటిలో అంతర్లీనంగా ఉన్న విషయాన్నీ పట్టేయగలరు. ఒకటి, రెండు తరగతుల పిల్లలైతే తడబడకుండా ఇంగ్లిష్‌లో మాట్లాడగలరు. ఈ స్కూల్లో సినిమాలకీ ప్రాధాన్యం ఉంటుంది. గాంధీ, జడ్జ్‌మెంట్‌ ఎట్‌ నురెమ్‌బెర్గ్‌, హోటల్‌ రువాండా, ద పియనిస్ట్‌ అండ్‌ ఇన్‌హెరిట్‌ ద విండ్‌, రివల్యూషనరీ రోడ్‌ లాంటి సినిమాలు చూపించి వాటిద్వారా జీవిత పాఠాల్ని తెలియజేస్తారు. చరిత్రకు సంబంధించిన డాక్యుమెంటరీలను ప్రదర్శించి ఆరోజుల్ని కళ్లకు కడతారు. వెయ్యిలో ఒక్కరు డాక్టరూ, వందలో ఒక్కరు ఇంజినీరూ అవుతారు. మిగతా వారి సంగతి ఏంటి...
అందుకనే సైన్స్‌కంటే కూడా విద్యార్థుల్ని సామాజిక శాస్త్రాలూ, కళలవైపు ప్రోత్సహిస్తారిక్కడ. స్కూల్లో పిల్లలందరికీ ట్యాబ్‌లు ఇస్తారు. అందులో స్కూల్‌ సొంతంగా అభివృద్ధి చేసిన ఆండ్రాయిడ్‌ ఆప్‌లు ఉంటాయి. వీటిని ఇతర స్కూళ్లవాళ్లూ వాడుకునేందుకు వీలుగా ప్లేస్టోర్‌లో ఉంచారు. ఇంకా, ఇక్కడి స్కూల్‌ క్యాంటీన్‌ని పిల్లలే నిర్వహించుకుంటారు. అందరికీ కంప్యూటర్‌ కోడింగ్‌ నేర్పుతారు. స్కూల్‌ బ్లాగ్‌నీ, ట్విటర్‌ పేజీనీ, ఐటీ సంబంధ వ్యవహారాలన్నింటినీ విద్యార్థులే పర్యవేక్షిస్తారు. కింది తరగతుల పిల్లలకు పెద్ద పిల్లలు మార్గనిర్దేశం చేస్తారు. పాఠశాల వార్షిక ఉత్సవాలు వారి ఆధ్వర్యంలోనే జరుగుతాయి. వీటిద్వారా ఒక బృందంలో సభ్యుడిగా మెలగడం, నిర్వహణ సామర్థ్యం, సమస్యల్ని పరిష్కరించుకోవడం లాంటి నాయకత్వ లక్షణాల్ని స్కూల్‌ దశలోనే నేర్చుకుంటారు.
బీఈడీలు వద్దు
2010లో ప్రారంభించినపుడు ఈ స్కూల్లో ఆరేళ్లలోపు పిల్లలు 70 మంది చేరారు. ప్రస్తుతం తొమ్మిదో తరగతి వరకూ 500 మంది చదువుతున్నారు. ప్రారంభంలో తల్లిదండ్రులకూ కొంత అనుమానం ఉండేది. కానీ...‘చదువంటే కేవలం సమాచారం కాదు, పిల్లల ఆలోచనా పరిధిని పెంచడం’ అన్న బెనర్జీ మాటలు ఏడాది తిరిగేసరికే వారికి అర్థమయ్యాయి. వచ్చిన పిల్లలందరినీ చేర్చుకోరు. ఈ విద్యా విధానంపైన తల్లిదండ్రుల మద్దతు పూర్తిగా ఉంటేనే చేర్చుకుంటారు. బోధకులుగా బీఈడీ లేనివారినే తీసుకుంటారు. విజ్ఞానం, ఆలోచనలూ, వ్యక్తిత్వం...ఈ అంశాల ప్రాతిపదికన వారిని ఎంపికచేస్తారు. వీరిలో చాలామంది లెవెల్‌ఫీల్డ్‌ (levelfieldschool.com) చేస్తున్న ప్రయత్నం గురించి తెలుసుకుని ఇష్టంతో పాఠాలు చెప్పడానికి వచ్చినవారే. ఈ స్కూల్‌ నుంచి వచ్చే విద్యా సంవత్సరంలో పదోతరగతి పరీక్షలకు మొదటి బ్యాచ్‌ వెళ్తుంది. వీళ్లు కేంబ్రిడ్జ్‌ నిర్వహించే (ఐజీసీఎస్‌ఈ) పరీక్షలు రాయనున్నారు. ‘సీబీఎస్‌ఈ విధానం ఎక్కువగా రాతకే ప్రాధాన్యం ఇస్తుంది. అందుకే ఐజీసీఎస్‌ఈ పరీక్షలు రాయిస్తున్నాం. ఇలాంటి స్కూళ్లు అన్నిచోట్లా వస్తే బావుంటుంది. మీమీ ప్రాంతాల్లో ఎవరైనా ప్రారంభించాలనుకుంటే, మా విధానాలపైన అవగాహన కల్పిస్తాం’ అని చెబుతారు బెనర్జీ.
ఇక్కడికి రవీంద్రుడి శాంతినికేతన్‌ 33కి.మీ. దూరంలో ఉంటుంది. ఆ విద్యాలయాన్ని గుర్తించినట్టే లెవెల్‌ఫీల్డ్‌ తెస్తున్న మార్పునీ ప్రపంచం గుర్తించాలని ఆశిద్దాం!

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.