close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ఈ చర్చికి 400 ఏళ్లు..!

ఈ చర్చికి 400 ఏళ్లు..!

‘మీరు నన్ను ప్రేమించినట్టు, నేను మిమ్మల్ని ప్రేమించినట్టు, ఇతరులనూ ప్రేమించండి’ అంటూ బోధనలు చేసిన ప్రేమస్వరూపుడు ఏసుక్రీస్తు. లోకరక్షకుడిగా భువికి చేరిన ప్రభువుని స్తుతిస్తూ, ఆయన పవిత్ర బోధనలు విశ్వవ్యాప్తం చేసే ప్రభు మందిరాలు ఎప్పుడూ ప్రత్యేకమే. వాటిల్లో యునెస్కో ప్రపంచవారసత్వ సంపదగా గుర్తింపు పొందింది గోవాలోని బెసిలికా ఆఫ్‌ బోమ్‌ జీసెస్‌ చర్చ్‌.
క్రైస్తవులకు అత్యంత పవిత్రమైన పండగ క్రిస్మస్‌. ముందురోజు రాత్రి నుంచే దేశంలోని చర్చిలన్నింటా ప్రత్యేక ప్రార్థనలు జరుగుతాయి. ఏసు కీర్తనలు లయబద్ధంగా చెవులకు వినిపిస్తాయి. బైబిల్‌లోని వాక్యాలను మతబోధకులు ఉద్వేగంగా వివరిస్తారు. అలాంటి చర్చిల్లో ప్రపంచవ్యాప్తంగా పేరొందిన చర్చి గోవాలోని బెసిలికా ఆఫ్‌ బోమ్‌ జీసెస్‌. నాలుగు వందల ఏళ్ల క్రితం క్రైస్తవ మతబోధకుడిగా పనిచేసిన సెయింట్‌ ఫ్రాన్సిస్‌ జేవియర్‌ పవిత్ర దేహం ఇప్పటికీ ఇక్కడ దర్శనమిస్తుంది. ఆ పవిత్ర దేహాన్ని చూడటానికి ప్రపంచం నలుమూలల నుంచీ లక్షల సంఖ్యలో విశ్వాసులు ఇక్కడికి వస్తుంటారు.
ప్రభు సేవలోనే...
‘సమాజంలో ఉప్పులా వ్యవహరించి, నిశ్శబ్దంగా, నిరాడంబరంగా మన పనిని మనం చేసుకుపోవాలి’, ‘మంచిమార్గం ఇరుకుగా ఉన్నా సరే ఆ మార్గంలోనే ప్రయాణించండి’ అన్న ప్రభువు బోధనలను జీవితాంతం ఆచరించిన వ్యక్తి ఫ్రాన్సిస్‌ జేవియర్‌. సొసైటీ ఆఫ్‌ జీసెస్‌ స్థాపకుల్లో జేవియర్‌ ఒకరు. ఏసుక్రీస్తు గొప్పతనాన్ని విశ్వవ్యాప్తం చేయడానికి అనేక దేశాల్లో పర్యటించారాయన. ఇందులో భాగంగానే చైనాకి వెళుతూ 1552 డిసెంబరు 13న మార్గమధ్యంలో తుదిశ్వాస విడిచారు. సెయింట్‌ ఫ్రాన్సిస్‌ జేవియర్‌ మృతదేహాన్ని ముందుగా పోర్చుగీస్‌లో
మలక్కాకీ, రెండేళ్ల తర్వాత గోవాకీ తరలించారు. పరమపదించి రెండేళ్లు గడిచినా జేవియర్‌ పార్థివదేహం చనిపోయిన రోజు ఎంత కాంతిమంతంగా ఉందో గోవాకి తీసుకొచ్చినప్పుడు కూడా అంతే కాంతిమంతంగా ఉందని చెప్పుకుంటారు. ఇప్పటికీ ఆయన పవిత్ర దేహమున్న ప్రదేశాన్ని చూసేందుకు క్రిస్టియన్లతోపాటు ఇతర మతస్థులూ పెద్ద సంఖ్యలో ఈ చర్చికి చేరుకుంటారు. ప్రతి పదేళ్లకొకసారి ఆయన మృతదేహం నుంచి కాంతి వస్తుందనీ ఆ కాంతికి అనారోగ్య సమస్యలను దూరం చేసే శక్తి ఉందనీ నమ్ముతారు.
నిర్మాణమూ ప్రత్యేకమే...
భారతదేశంలో ఉన్న పురాతన చర్చిల్లో బెసిలికా ఆఫ్‌ బోమ్‌ జీసెస్‌ ఒకటి. అంతేకాదు, ఈ చర్చి లోపలి భాగంలోని నేలంతా ప్రత్యేకమైన పాలరాతితో నిర్మించారు. ఈ చర్చిలో మరో ప్రధాన ఆకర్షణ సెయింట్‌ ఫ్రాన్సిస్‌ జేవియర్‌తోపాటు ఉన్న సెయింట్‌ ఇగ్నేషియస్‌ ఆఫ్‌ లయోలా విగ్రహం. నిజానికి సెయింట్‌ జేవియర్‌ ఆయన ప్రభావంతోనే సెయింట్‌గా మారినట్లు చెబుతారు. ఈ విగ్రహాన్ని చూస్తున్నప్పుడు ప్రకాశవంతమైన కాంతికిరణాలు మనల్ని తాకుతున్న అనుభూతి కలుగుతుందట. దీనిపైనే క్రీస్తు తన అనుచరులతో కలిసి చేసిన చివరి భోజన దృశ్యం చెక్కి ఉంటుంది. క్రీస్తు జీవితంలోని కొన్ని ముఖ్యమైన సంఘటనలూ, సెయింట్‌ ఫ్రాన్సిస్‌ జేవియర్‌ జీవితంలోని ముఖ్య ఘట్టాలను సూచించే చిత్రాలూ ఈ చర్చిలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ప్రతి పదేళ్లకొకసారి (డిసెంబరు మూడో తేదీన సెయింట్‌ జేవియర్‌ వర్థంతి రోజున) ఆయన పవిత్ర దేహాన్ని సందర్శకులకు చూపిస్తారు.
ఈ సందర్భంగా దేశదేశాల నుంచీ వచ్చిన క్రైస్తవులూ ఇతర మతస్థులతో ఈ మందిరం నిండిపోతుంది.
ప్రత్యేక ప్రార్థనలు...
ఎన్నో పురాతన చర్చిలకు కేంద్రమైన గోవాలో డిసెంబరు నెలంతా పండగ వాతావరణం సంతరించుకుంటుంది. బెసిలికా ఆఫ్‌ బోమ్‌ జీసెస్‌ చర్చిని విద్యుద్దీపాలతో అందంగా అలంకరిస్తారు. క్రీస్తు జననానికి సంబంధించిన బొమ్మలతో అక్కడ చేసే ఏర్పాట్లు సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటాయి. జేవియర్‌ పవిత్ర దేహం ఉన్న ఈ స్థలంలో ప్రత్యేక ప్రార్థనలు చేసేందుకు విదేశాల నుంచి సైతం ఇక్కడికి విశ్వాసులు వస్తారు. వీరిలో పోర్చుగీసు వారికి ఈమందిరం మరింత ప్రత్యేకం. వీరు ఏసుక్రీస్తు తర్వాత అంత ప్రాధాన్యం సెయింట్‌ ఫ్రాన్సిస్‌ జేవియర్‌కే ఇస్తారు.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.