close
క్రిస్మస్‌ శుభాకాంక్షలు!

క్రిస్మస్‌ శుభాకాంక్షలు!

ప్రేమభాష్యంతో మనుషుల్లో దయా క్షమా గుణాలను పెంపొందించి వాళ్లను సన్మార్గంలో నడిపేందుకు భూమ్మీదకొచ్చిన దైవకుమారుడిని చూసిన ఆనందంతో ప్రకృతి పులకరించింది. తారాతీరం తళుకులీనింది. ఘంటానాదం మిన్నంటింది. ప్రాణికోటి గొంతెత్తి ప్రార్థనాగీతం ఆలపించింది. కానుకలు ఇచ్చిపుచ్చుకుంది. అన్నీ కలిసి పచ్చని చెట్టుకి అలంకారమై శోభించాయి. అదే క్రిస్మస్‌ పండగ... కరుణామయుడి జన్మదిన వేడుక..!
అత్యంత భక్తిశ్రద్ధలతో క్రైస్తవులు జరుపుకునే పండుగే క్రిస్మస్‌. క్రీ.శ.350వ సంవత్సరంలో రోమ్‌ బిషప్‌ అయిన పోప్‌ జూలియస్‌ డిసెంబర్‌ 25ని క్రిస్మస్‌ పర్వదినంగా అధికారికంగా ప్రకటించాడు. ఆ రోజునుంచీ అంతటా ఈ వేడుకలను జనవరి 5వరకూ ఆనందంగా జరుపుకుంటారు. జులియన్‌ క్యాలెండర్‌ను అనుసరించే దేశాల్లో జనవరి 7 నుంచి 19 వరకూ చేసుకుంటారు. ఎంతో పవిత్రంగా జరుపుకునే ఈ వేడుకలో క్రైస్తవులు బహుమతులు ఇచ్చిపుచ్చుకోవడం, క్రిస్మస్‌ ట్రీని అలంకరించడం, కేరల్స్‌ పాడటం, చర్చికి వెళ్లి బైబిల్‌ చదవడం, క్రీస్తు పుట్టిన బెత్లెహెమ్‌, నడయాడిన జెరూసలెం... వంటి పవిత్ర స్థలాలని సందర్శించడం చేస్తారు. బెత్లెహెమ్‌లో క్రీస్తు పుట్టిన స్థలంగా భావించే ‘చర్చ్‌ ఆఫ్‌ ద నేటివిటీ’ని క్రైస్తవులు పవిత్రస్థలంగా భావిస్తారు. జెరూసలెంలో క్రీస్తుని శిలువ వేసి, సమాధి చేసిన చోట నిర్మించిన చర్చినీ చివరిసారి జీసస్‌ ప్రార్థించిన స్థలాన్నీ, బాలక్రీస్తు పెరిగిన నాజరత్‌ పట్టణాన్నీ భక్తితో సందర్శిస్తారు.

పవిత్రగ్రంథం!

  బైబిలు పఠనం ద్వారానే క్రీస్తుని ప్రార్థిస్తారు క్రైస్తవులు. పరిశుద్ధాత్మకు ప్రతినిధులుగా చెప్పే 40 మంది రచయితలు బైబిల్‌ సృష్టికర్తలు. వీరిలో గొర్రెల కాపరులూ, రైతులూ, వైద్యులూ, మత్స్యకారులూ, మతగురువులూ, తత్త్వవేత్తలూ, రాజులూ... ఇలా అన్ని రకాల వృత్తులవాళ్లూ ఉన్నారు. వారి వారి వృత్తులకు అతీతంగా అనేక శతాబ్దాల తరబడి వాళ్లు రూపుదిద్దిన అద్భుత గ్రంథమే బైబిల్‌. ఇది మొత్తం 66 పుస్తకాలుగా ఉంటుంది. అందులో 39 పుస్తకాలను ఓల్డ్‌ టెస్టమెంట్‌ అనీ 27 పుస్తకాలను న్యూ టెస్టమెంట్‌ అనీ అంటారు. మొదటి ఐదు పుస్తకాలనూ మోజెస్‌ రాశాడు. అందుకే ఆయన్ని బైబిల్‌కి ఆద్యుడుగా పేర్కొంటారు. క్రీ.పూ. 1450 నుంచి క్రీ.శ. 100 సంవత్సరం వరకూ... అంటే జీసస్‌ పుట్టి మరణించి పునర్జీవించేవరకూ ఇందులో ఉంటుంది. అత్యధికంగా 500 కోట్లకు పైగా ముద్రితమైనదీ; అనేకసార్లు దొంగిలించబడ్డదీ బైబిలేనట. ఏటా పదికోట్లకు పైగా పుస్తకాలు ముద్రితమవుతుంటే, నిమిషానికి 50 చొప్పున అమ్ముడుపోవడం విశేషం.

పచ్చని చెట్టు

క్రిస్మస్‌కు సంకేతంగా అలంకరించే ఫిర్‌ లేదా పైన్‌ చెట్టుని సుమారు 15 సంవత్సరాలపాటు పెంచుతారు. అప్పుడే అది ఆరేడు అడుగుల ఎత్తు పెరుగుతుంది. రోజురోజుకీ డిమాండ్‌ పెరిగిపోతుండటంతో నాలుగు నుంచి ఏడేళ్ల వయసు చెట్లనీ విక్రయిస్తున్నారు. ఏటా సుమారు మూడు కోట్లా అరవై లక్షల చెట్లని పెంచుతున్నారు. ఒక ఎకరంలో పెరిగే క్రిస్మస్‌ చెట్లు కోటీ 80 లక్షల మందికి ఒకరోజుకి సరిపడా ఆక్సిజన్‌ను విడుదల చేస్తాయి. అందుకే వీటిని గ్రీన్‌ ట్రీస్‌గా చెబుతారు. ప్రారంభంలో క్రిస్మస్‌ చెట్టుని ఆడమ్‌, ఈవ్‌లకు గుర్తుగా యాపిల్స్‌తోనే అలంకరించేవారట. క్రమంగా వాటికి గంటలూ రంగుల లైట్లూ బుడగలూ ఇలా అన్నీ తోడయ్యాయి.

దారిచూపిన వెలుగుచుక్క

క్రిస్మస్‌ వేడుకలో నక్షత్ర అలంకరణ సర్వసాధారణం. తమకు వెలుగుమార్గాన్ని చూపేందుకు భూమ్మీదకొచ్చిన ఆ దైవ కుమారుడిని వెతుక్కుంటూ తూర్పు జెరూసలెం నుంచి వచ్చిన ముగ్గురు జ్ఞానులకు ఆయన పుట్టిన ప్రదేశమైన బెత్లెహెమ్‌కు దారి చూపినది ఓ నక్షత్రమేనట. దాన్నే వెలుగుచుక్క అనీ స్టార్‌ ఆఫ్‌ బెత్లెహెమ్‌ అనీ పిలుస్తారు.

చర్చిగంటలు...

‘జింగిల్‌బెల్స్‌ జింగిల్‌బెల్స్‌ జింగిల్‌ ఆల్‌ ద వే...’ అంటూ ఆనందంగా పాడుకునే ఆ క్రిస్మస్‌ గంటల సంప్రదాయం ఎలా వచ్చిందనేది ఎవరికీ సరిగ్గా తెలీదు. కానీ అప్పట్లో గంట మోగిస్తే దుష్టశక్తులు పారిపోతాయని నమ్మేవారట. అందులో భాగంగానే క్రీస్తు పుట్టిన సంతోషంతో దుష్టుల్ని హెచ్చరిస్తూ గంట మోగించారన్నది కథనం. ఆ తరవాత ముఖ్యప్రకటన చేయాలన్నా ఎవరైనా పుట్టినా పెళ్లి జరిగినా చర్చిలో గంట మోగించడం మొదలైందట. క్రమంగా క్రీస్తు జన్మదిన వేడుక అలంకరణలోనూ అవి భాగమై క్రిస్మస్‌ సంకేతంగా మారాయి.

కార్టూన్‌ గీతే ‘తాత’..!

ఫర్‌కోటు, పండుగడ్డం, గుబురుమీసాల మాటున ఆప్యా యమైన నవ్వు, మూసుకున్న కనురెప్పలు, ఒంటినిండా కానుకల మూటలతో నిండుగా కనిపించే దయార్ధ్రహృదయుడైన వృద్ధుడి చిత్రాన్ని థామస్‌ నెస్ట్‌ అనే కార్టూనిస్ట్‌ తొలిసారిగా 1881లో హార్పర్స్‌ వీక్లీలో ప్రచురించాడు. టర్కీకి చెందిన చారిత్రక ప్రముఖుడూ దయార్ద్రహృదయుడూ అయిన బిషప్‌ సెయింట్‌ నికోలస్‌ను ఊహిస్తూ గీసిన ఈ కార్టూనే శాంటాక్లాజ్‌గా అవతారమెత్తి ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్‌ వేడుకలకు ప్రామాణికంగా మారింది. బహుమతులు ఇచ్చే సంప్రదాయం కూడా హాలెండ్‌లోనే మొదలైందట. పేదరికంతో ముగ్గురు కూతుళ్లకు పెళ్లి చేయలేక బాధపడుతోన్న ఓ వ్యక్తికి సెయింట్‌ నిక్‌, స్టాకింగుల నిండా బంగారాన్ని నింపి వాళ్లింట్లోకి జారవిడిచాడట. అప్పటినుంచి క్రిస్మస్‌కి ముందు పిల్లలు బహుమతులకోసం పాతసాక్సుని ఇంటిబయట ఉంచడం ఆచారంగా వచ్చిందట.

క్రిస్మస్‌... విశేషాలెన్నో..!

బొలీవియాలో క్రిస్మస్‌ సందర్భంగా ‘మాస్‌ ఆఫ్‌ ది రూస్టర్‌’ అనే వేడుకని జరుపుకుంటారు. అర్ధరాత్రివేళ కోడిపుంజులను అరిపిస్తారు. క్రీస్తుపుట్టుకగురించి ప్రపంచానికితెలిసింది కోడికూతవల్లేనన్నది నమ్మకం. 
* పోలాండ్‌లోనూ ఉక్రెయిన్‌లో క్రిస్మస్‌ చెట్టు అలంకరణలో సాలెగూళ్లు తప్పక కనిపిస్తాయి. అమ్మ పొత్తిళ్లలో కళ్లు తెరిచిన జీసస్‌కి చలి వేయకుండా సాలెగూళ్లే దుప్పటిలా అల్లుకున్నాయట. అందుకే వాళ్లు వాటిని మంచికి సంకేతంగా భావిస్తారు.
* క్రీస్తు పుట్టినస్థలంగా భావించే పశువుల చావిడిని ప్రతిబింబించే నేటివిటీ సీన్‌ని చాలామంది ఇంట్లోనే ఏర్పాటుచేస్తారు. తూర్పుదేశాల్లోని సంప్రదాయరీతుల్ని ఆచరించే క్రైస్తవులు క్రిస్మస్‌కు ముందు 40 రోజులపాటు ‘నేటివిటీ ఫాస్ట్‌’ పేరుతో ఉపవాస దీక్ష చేస్తారు. 
* క్రిస్మస్‌ సంప్రదాయ వర్ణాలు బంగారు, ఆకుపచ్చ, ఎరుపు. కీస్తు జననం, పునర్జననాలకు గుర్తుగా ఆకుపచ్చనీ జీసస్‌ రక్తానికి సంకేతంగా ఎరుపునీ సిరిసంపదలకు చిహ్నంగా బంగారు వర్ణాన్నీ భావిస్తారు. అందుకే క్రిస్మస్‌చెట్టు అలంకరణలో ఆ మూడురంగుల్నీ అలంకరిస్తారు.
* క్రిస్మస్‌కి ప్రతి పదిమందికీ ఒకరు తప్పక బహుమతిని అందుకుంటారట. గతేడాది అమెరికన్‌ పోస్టల్‌ సర్వీసు ఒక్కరోజులో 2 కోట్ల 82వేల బహుమతుల్ని పంచి, తన రికార్డును తనే అధిగమించిందట. 
* యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌కి చెందిన అబుదాబిలోని ఎమిరేట్స్‌ ప్యాలెస్‌లో గతంలో ఏర్పాటుచేసిన క్రిస్మస్‌ చెట్టు విలువ సుమారు 70 కోట్ల రూపాయలు. గంటలు, నక్షత్రాలు, దీపాలతోపాటు వజ్రాలు, ముత్యాలు, పచ్చలు, నీలాలు... పొదిగిన విలువైన 
వస్తువులతో ఈ చెట్టుని అలంకరించింది హోటల్‌ యాజమాన్యం. 

శాంటాక్లాజ్‌ గ్రామం...

కార్టూన్‌ గీతల్లో పుట్టిన క్రిస్మస్‌ తాత సొంతూరే శాంటాక్లాజ్‌ విలేజ్‌. ఏడాదిలో ఆరునెలలపాటు మంచుతో నిండి ఉండే ఉత్తర ధ్రువంలోని ఫిన్లాండ్‌లో నిర్మించిన ఈ గ్రామంలో రోజూ పండగ వాతావరణమే. నిజానికి గత శతాబ్దంలో ఇయర్‌ మౌంటెయిన్‌గా పిలిచే రొవానియెమి తన స్వస్థలమని శాంటాక్లాజ్‌ ప్రకటించాడన్న వార్త అప్పట్లో వ్యాపించిందట. అయితే అది బయటకు రాకుండా ఉండేందుకు ఎల్ఫ్‌ అనే స్థానిక తెగ, అమ్యూజ్‌మెంట్‌ పార్కు తరహాలో ఓ గ్రామాన్ని నిర్మించింది. అప్పటినుంచీ ఆయన్ని చూడ్డానికి లక్షలాదిమంది ఆ ప్రాంతాన్ని సందర్శించి, ఆ వేషధారణలో ఉన్న శాంటాతో కబుర్లుచెప్పి ఫొటోలు తీయించుకుని వస్తుంటారు. అక్కడి పోస్టాఫీసుకి శాంటాక్లాజ్‌ని ఉద్దేశిస్తూ ఏటా ఆరులక్షల పైనే ఉత్తరాలు వస్తుంటాయి. క్రిస్మస్‌కు సంబంధించిన కార్డులూ సీడీలూ బహుమతులూ కూడా అమ్ముతుంటారట.

జీసస్‌ విగ్రహం!

ప్రపంచవ్యాప్తంగా ఎత్తెన క్రీస్తు విగ్రహాలు ఎన్నో ఉన్నాయి. అయితే సందర్శకుల్ని ఎక్కువగా ఆకర్షించేది మాత్రం బ్రెజిల్‌లోని రియోడి జనైరొలో ఉన్న రీడీమర్‌ విగ్రహం. అధికారికంగా ఈ విగ్రహాన్ని ‘క్రిస్టొ రెడెంటర్‌’ అని అంటారు. టిజుకా నేషనల్‌ పార్కులోని కార్‌కొవాడొ పర్వతంమీద 30 మీటర్ల ఎత్తుతో ఆకాశపుటంచుల్లోకి ఎదిగినట్లుగా ఉండే ఈ విగ్రహం రియో సందర్శకులందరినీ రారమ్మని ఆహ్వానిస్తున్నట్లుగా ఉంటుంది. 2007లో నమోదుచేసిన ఆధునిక ప్రపంచ వింతల్లో ఇదీ ఒకటి.
* పోలాండ్‌లోని స్వీబాడ్‌జిన్‌ ఓ చిన్న పట్టణం. అయితేనేం... అక్కడ ప్రపంచంలోకెల్లా పొడవైన(108 అడుగులు) జీసస్‌ విగ్రహం ఉంది.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.