close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
కేరళ... ఓ అందాల భరిణె..!

‘ఎటు చూసినా ఆకాశాన్ని తాకుతున్నట్లున్న పచ్చని చెట్లూ, చేయి ఎత్తితే అందేంత దగ్గరలో తెల్లని మబ్బులూ, కళ్లు తిరిగిపోయే లోతైన లోయలూ, పచ్చటి దుప్పటి పరిచినట్లుగా ఉన్న తేయాకుతోటల కొండలూ, కొబ్బరిచెట్ల సౌందర్యంతో తడిసిముద్దవుతోన్న బ్యాక్‌వాటరూ... అవన్నీ చూస్తుంటే జన్మ ధన్యమైనట్లే అనిపించింది’ అంటూ కేరళ అందాల గురించి చెప్పుకొస్తున్నారు వరంగల్‌కు చెందిన బండి రవీందర్‌.
నేషనల్‌ జియోగ్రాఫిక్‌ ట్రావెలర్‌ సర్వే ప్రకారం ప్రపంచంలో చూడదగ్గ మొదటి 50 ప్రదేశాల్లో కేరళ ఉండటంతో కేరళ అందాలను చూడాలనుకుని ఉపాధ్యాయ కుటుంబ మిత్రులమంతా కలిసి 80 మందిమి బయలుదేరాం. వరంగల్‌ నుంచి ఎర్నాకుళం జంక్షన్‌కు 24 గంటల ప్రయాణం. రెండు ట్రావెల్‌ బస్సుల్లో కొచ్చీకి వెళ్లి ముందే బుక్‌ చేసుకున్న హోటల్లో దిగాం. స్నానపానాదులు అయ్యాక డచ్‌ ప్యాలెస్‌, మ్యూజియంలను చూసి సాయంత్రం హార్బర్‌కు వెళ్లాం. ఇది ప్రకృతి సిద్ధమైన హార్బర్‌. మనదేశంలోని పోర్టుల్లోకెల్లా పెద్దది. ఆ రాత్రి బోటు అద్దెకు తీసుకుని అర్ధరాత్రి 12 గంటల వరకూ ఆనందంగా గడిపాం.

గురువాయూర్‌లో...
తెల్లవారి త్రిసూర్‌ జిల్లాలోని గురువాయూర్‌కి బయలుదేరాం. దారి పొడవునా కొబ్బరిచెట్లే. వేలు, లక్షల కొబ్బరిచెట్లను చూస్తుంటే ఎంతో ఆహ్లాదంగా అనిపించింది. మూడుగంటల ప్రయాణం తరవాత గురువాయూర్‌కి చేరుకున్నాం. ఈ దేవాలయానికి 500 సంవత్సరాల చరిత్ర ఉంది. దీన్ని భూలోక వైకుంఠంగా చెబుతారు. తెలుగువారికి తిరుపతి, శ్రీశైలం ఎలానో కేరళీయులకి గురువాయూర్‌, శబరిమల అలాగే. ఇందులోకి హిందువులకు మాత్రమే ప్రవేశం. ఆడవాళ్లు తెల్లని చీరలూ మగవాళ్లు చొక్కా లేకుండా తెల్లని అంగవస్త్రం, లుంగీతో దేవుణ్ణి దర్శించుకోవాలి. అయస్కాంత లక్షణాలున్న నల్లని రాయితో మలిచిన చిన్నికృష్ణుని విగ్రహాన్ని దర్శించుకుని తన్మయత్వానికి లోనయ్యాం. గురువు అంటే బృహస్పతి, వాయు అంటే వాయుదేవుడు. ఊర్‌ అంటే స్థలం. బృహస్పతి, వాయుదేవుడు కలిసి ఈ స్థలంలో స్వయంగా కృష్ణుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు కాబట్టి గురువాయూర్‌ అని పేరొచ్చిందట. గురువాయురప్పన్‌గా పిలుచుకునే ఇక్కడి చిన్నికృష్ణుడి దర్శనం సమస్త పాపహరణంగా భావిస్తారు. ఏటా ఫిబ్రవరిలో గురువాయూర్‌ ఉత్సవం పదిరోజులపాటు అంగరంగ వైభోగంగా జరుగుతుంది. మొదటిరోజు అనయోట్టం ఉత్సవం ఏనుగుల పరుగుపందెంతో మొదలవుతుంది. పందెంలో గెలిచిన ఏనుగు ఏడాదిపాటు దేవుని ఉత్సవ విగ్రహాన్ని మోసే అవకాశాన్ని దక్కించుకుంటుంది. ఇక్కడి ఏనుగులను నడిచే గురువాయురప్పన్‌లుగా భావిస్తారు. అందుకే ఎంతోమంది ఏనుగులను దేవాలయానికి విరాళంగా ఇస్తుంటారు. వాటిని ప్రత్యేక క్యాంపులో సంరక్షిస్తున్నారు. దైవదర్శనం తరవాత ఏనుగుల క్యాంపు చూడ్డానికి వెళ్లాం. అక్కడ 56 ఏనుగులు ఉన్నాయి. అవన్నీ మగవే కావడం విశేషం. నాలుగు దశాబ్దాలపాటు దేవాలయంలో సేవచేసి 1976లో మరణించిన కేశవన్‌ సేవలకు గుర్తుగా విగ్రహాన్ని నిర్మించారు. ఆ మధ్యాహ్నం మున్నార్‌కు బయలుదేరాం.

మున్నార్‌లో...
ఇడుక్కి జిల్లాలో ఉన్న మున్నార్‌, గురువాయూర్‌కి 180 కి.మీ. దూరంలో సముద్రమట్టానికి 1800 మీ. ఎత్తులో ఉంది. ఆ దారిలో ఎత్తయిన కొండలూ లోతైన లోయలూ కొండలమీద నుంచి ఉరికే జలపాతాలూ మనల్ని మంత్రముగ్ధుల్ని చేస్తాయి. జలపాతం కనిపించినప్పుడల్లా ఆగుతూ సాగిన మా ప్రయాణం ఎంతో ఆహ్లాదకరంగా అనిపించింది. రాత్రి ఎనిమిది గంటలకు మున్నార్‌కి చేరుకున్నాం. ఉదయం కర్టెన్లు తీసి చూస్తే, వెనక వైపంతా పెద్దలోయా, పచ్చనిచెట్లూ, కొండలూ, వాటి మధ్యలో అందమైన ఇళ్లూ... చిత్రకారుడు గీసిన చిత్రంలా ఎంతో అందంగా అనిపించింది. అల్పాహారం తిన్నాక మున్నార్‌ అందాలను చూడ్డానికి బయలుదేరాం. ఎటుచూసినా ఆకాశాన్ని తాకే పచ్చని చెట్లూ, చేతికి అందుతాయేమోనన్నంత దగ్గరగా తెల్లని మబ్బులూ, చూస్తేనే కళ్లు తిరిగిపోతాయనిపించే లోతైన లోయలూ, కొండలనిండా పచ్చటి దుప్పటి పరిచినట్లుగా ఉన్న తేయాకుతోటలూ... మరోలోకంలో విహరిస్తున్నట్లే అనిపించింది. ఇక్కడ 30కి పైగా టీ ఎస్టేట్స్‌ ఉన్నాయి. దారిలో రెండుమూడు తోటల్లో బస్సు ఆపి కాసేపు వాటిల్లో తిరిగి, దగ్గర్లోని టాటా టీ మ్యూజియం చూడ్డానికి వెళ్లాం. లోపల తేయాకుని వివిధ దశల్లో ఎలా ప్రాసెసింగ్‌ చేస్తారో గైడ్‌ చూపించాడు. కమ్మని రుచిగల టీని ఉచితంగా అందించారు. అక్కడి అవుట్‌లెట్స్‌లో రకరకాల టీ పొడులు కొనుక్కోవచ్చు.

అక్కడినుంచి 13 కి.మీ. దూరంలోని మట్టుపెట్టి డ్యామ్‌కు వెళ్లాం. దీన్ని 1953లో రెండుకొండల మధ్యలో నిర్మించారు. జలవిద్యుచ్ఛక్తి తయారీతోబాటు వేల ఎకరాలకు సాగునీటిని అందిస్తోందీ డ్యామ్‌. ఇక్కడే బోటింగ్‌ సౌకర్యం కూడా ఉంది. తరవాత 20 కి.మీ. దూరంలోగల ఎరవికుళం వైల్డ్‌లైఫ్‌ పార్కుకి బయలుదేరాం. కేరళలో ఏర్పాటుచేసిన మొట్టమొదటి వైల్డ్‌లైఫ్‌ పార్కు ఇదేనట. ఇక్కడ అంతరించిపోతున్న నీలిగిరి థార్‌, లాంగర్‌, సాంబార్‌, గౌర్‌, ఇంకా కొన్ని ఏనుగులు ఉన్నాయట. ఇక్కడ ప్రతి 12 సంవత్సరాలకు ఒక్కసారి పుష్పించే నీలకురింజి మొక్కలు ఉన్నాయి. అవి పూలుపూసిన సంవత్సరం పార్కులోని కొండలు మొత్తం నీలంరంగులో కనిపిస్తాయి. పశ్చిమ కనుమల్లోని అనాముడి అనే ఎత్తయిన కొండ ఈ పార్కులోనే కనిపిస్తుంది. ఈ కొండ పెద్ద ఏనుగు తల రూపంలా ఉండటంవల్ల అనాముడి (మలయాళంలో ఏనుగుతల)అని పిలుస్తారు. దీన్ని దక్షిణ భారత ఎవరెస్ట్‌ అనీ అంటారు.

తరవాత మజిలీ 90 కి.మీ. దూరంలోని తెక్కడి. ఈ దారిలో అన్నీ సుగంధద్రవ్యాల తోటలే. దారిలో మైలాదుమ్‌పురా వద్ద సుగంధద్రవ్యాల పార్కుకి వెళ్లాం. మిరియాలు, యాలకులు, లవంగాలు, దాల్చినచెక్క...వంటి మొక్కలను  ప్రత్యక్షంగా చూడొచ్చు. అన్ని భాషల్లో వివరించడానికి గైడ్లు ఉన్నారు. ఈ మొక్కలు ఎలా పెరుగుతాయో వాటిని ఎలా ప్రాసెస్‌ చేస్తారో అన్నీ చక్కగా తెలుగులో వివరించారు. అక్కడి షాపుల్లో తాజా దినుసుల్ని కొనుక్కున్నాం. మిరియాల తరవాత ఎక్కువగా కనిపించేవి రబ్బర్‌ తోటలే. రబ్బరు ఉత్పత్తిలో 90 శాతం కేరళ రాష్ట్రానిదే. ఈ చెట్లన్నింటికీ కాండం దగ్గర చేతికి అందే ఎత్తులో కవర్లు కట్టి ఉన్నాయి. ఆ కవర్లలోకి తెల్లని ద్రవం(లేటెక్స్‌) వస్తుందనీ దాన్నే రబ్బురుగా మలుస్తారనీ చెప్పారు. సాయంత్రానికి తెక్కడికి చేరుకున్నాం. అక్కడ పెరియార్‌ వైల్డ్‌లైఫ్‌ శాంక్చ్యురీ ఉంది. ఇందులో పులులూ, ఏనుగులూ, సాంబార్‌లూ, కోతులూ ఉన్నాయి. వీటిని చూడ్డానికి అడవి చుట్టూ సరస్సును ఏర్పాటుచేశారు. పడవలో వెళ్లి చూడాలి. ఆ రాత్రికి తెక్కడిలోని మార్షల్‌ ఆర్ట్‌ థియేటర్‌కు వెళ్లి, కలారిపట్టు అనే యుద్ధవిద్యనుచూసి, అలెప్పీకి బయలుదేరాం.

అలెప్పీలో...
బ్యాక్‌ వాటర్‌ సందర్శక కేంద్రంగా దీనికి పేరు. హౌస్‌ బోటులకీ స్నేక్‌ బోటులకీ ఇది పేరొందిన ప్రదేశం. మున్నార్‌ నుంచి 170 కి.మీ. దూరంలో ఉన్న అలెప్పీ అలప్పుజా జిల్లా ముఖ్య కేంద్రం. బస్సులో వస్తుంటే ఇరువైపులా పంటకాలువలూ పడవలూ కొబ్బరిచెట్లూ ఎవరో అందంగా తీర్చిదిద్దినట్లుగా ఉందీ ప్రాంతం. ఇక్కడ పడవలే ప్రయాణసాధనాలు. అలెప్పీ అందాలను పర్యటకులకు చూపించడానికి దాదాపు వెయ్యి హౌస్‌బోటులు రెడీగా ఉన్నాయి. మనం చెల్లించే ధరనుబట్టి వీటిల్లో ప్రీమియం, డీలక్స్‌, లగ్జరీ రకాలు ఉన్నాయి. పడవలో సిట్టింగ్‌, లివింగ్‌, డైనింగ్‌, బెడ్‌రూమ్‌, కిచెన్‌.... అన్నీ దేనికది ఉంటాయి. ఏసీ, గీజర్‌, శాటిలైట్‌ టీవీ అన్ని సదుపాయాలూ ఉన్నాయి. పడవమీద ఎక్కి కూర్చోవడానికి సన్‌డెక్‌ ఉంటుంది.

ఈ పడవలో సుమారు 10, 12 కి.మీ. బ్యాక్‌వాటర్లో తీసుకెళ్లి రాత్రంతా ఒకచోట ఆపి ఉదయం తిరిగి మనం ఎక్కినచోట వదిలిపెడతాయి. మన ఇష్టాన్నిబట్టి ఒక రాత్రిగానీ ఒక పగలూరాత్రి కలిపిగానీ ప్యాకేజీ మాట్లాడుకోవచ్చు. అల్పాహారం, లంచ్‌, డిన్నర్‌, కాఫీ, టీలు అన్నీ మన వెంటే ఉన్న కుక్‌ బోటులోని కిచెన్‌లోనే వండి వడ్డిస్తాడు. మేం రెండు బోట్లు అద్దెకు తీసుకుని వెళ్లాం. మధ్యలో ఒకచోట రెండు గంటలు ఆపుతారు. అక్కడ హోటళ్లు ఉన్నాయి. వాటిల్లో మనముందే చేపలను పట్టేసి, వేయించి వడ్డిస్తారు. వాటి రుచి అద్భుతంగా ఉంది. ఇక్కడ ప్రయాణిస్తుంటే ఒకవైపంతా ఇళ్లూ
మరోవైపంతా కొబ్బరిచెట్లూ పంటపొలాలూ ఉన్నాయి. ఇళ్లముందు నుంచే బోట్లు వెళ్తుంటాయి. ఇంటింటికీ ఓ పడవ ఉంటుంది.

అలెప్పీ నెహ్రూట్రోఫీ బోట్‌ రేసింగ్‌కు ప్రసిద్ధి. ఏటా ఆగస్టు నెలలో రెండో శనివారం జరుగుతాయివి. వీటినే స్నేక్‌ బోట్‌ రేసెస్‌ అనీ అంటారు. పడవ వెనక భాగం 15 అడుగుల ఎత్తులో లేచి పాములా కనిపిస్తుంది. 140 అడుగుల పొడవున్న ఈ పడవలను 110 మంది నడుపుతూ పందెంలో పాల్గొంటారు. దాదాపు 20 బృందాలు పోటీలో పాల్గొంటాయి. దీన్ని లక్షలమంది స్థానికులూ పర్యటకులూ వీక్షిస్తారు. వందమంది ఒకే పడవను ఒకేసారి తెడ్డువేయడం గమ్మత్తుగా అనిపిస్తుంది. అక్కడి నుంచి త్రివేండ్రం వెళ్లి, పద్మనాభస్వామి గుడినీ కోవలం బీచ్‌నీ సందర్శించి వెనుతిరిగాం.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.