close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
చర్చిద్దాం రండి!

చర్చిద్దాం రండి!

చర్చలే పరిష్కారం... అది అంతర్జాతీయ సమస్య అయినా, స్థానిక సమస్య అయినా! నలుగురితో లోతుగా చర్చించినపుడే సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. ఆ చర్చలో మేధావులూ ఉంటే మరింత ఫలప్రదమవుతుంది.గత 200 వారాలుగా ఆ ప్రయత్నమే చేస్తోంది వరంగల్‌ నగరంలోని ‘తెలంగాణ జన వేదిక’.
ఆదివారం... అంటే ఆటవిడుపు. ఆరోజు ఇష్టమైన పనులు చేస్తాం, కుటుంబ సభ్యులతో కాలక్షేపం చేస్తాం. కానీ వరంగల్‌ నగరంలోని కొందరు వ్యక్తులకు ఓ చర్చాకార్యక్రమంలో పాల్గొనడం కూడా ఆరోజు చేయాల్సిన ముఖ్యమైన పనుల్లో ఒకటి. సాయంత్రం 5:30 అయ్యిందంటే చాలు... వారందరూ ‘తెలంగాణ జన వేదిక’కు చేరిపోతారు. రెండు గంటలపాటు జరిగే చర్చా కార్యక్రమంలో భాగమైపోతారు. ఆ చర్చల్లో కొన్ని వారి జీవితాల్ని మార్చేవి కాగా, మరికొన్ని సమాజాన్ని మేల్కొలిపేవి. ఈ వేదికకు ఆద్యులు మాజీ మంత్రి తక్కళ్లపల్లి పురుషోత్తమరావు. రాజకీయాల్లో ఆయనది సుదీర్ఘ అనుభవం. తెలంగాణ తొలి, మలి దశ ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. రాజకీయ నాయకుడిగా, ఉద్యమ నాయకుడిగా ఎన్నో చర్చా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వివిద రంగాల్లో ఊడలూనుకున్న అవినీతి, అన్యాయాల్ని ప్రశ్నించాలన్నా, వ్యవస్థను ప్రక్షాళన చేయాలన్నా... తొలుత ఆ సమస్యలపైన సామాన్యుడికి లోతైన అవగాహన ఉండాలని భావించారాయన. మేధోపరమైన చర్చ జరిగితేనే దీనికో సమాధానం దొరుకుతుందని 2013 సెప్టెంబరు 17 (తెలంగాణ విమోచన దినం)న ‘తెలంగాణ జన వేదిక’ను ప్రారంభించారు. హన్మకొండ హంటర్‌ రోడ్డులోని తక్కళ్లపల్లి ఇంటి ప్రాంగణమే దీనికి వేదిక.
అంశాల ఎంపిక
ఈ వేదిక మీద చర్చించిన మొదటి అంశం ‘ప్రపంచీకరణ- పరిణామాలు’. ఎలాంటి ప్రచారం లేకుండా ప్రారంభించిన మొదటి చర్చా కార్యక్రమానికి 20 మంది వచ్చి ఆసక్తిగా విన్నారు. కొందరు తమ అభిప్రాయాల్నీ పంచుకున్నారు. వర్తమాన రాజకీయాలూ, సామాజిక పరిణామాలు- కుటుంబ స్వామ్య వ్యవస్థ... ఇలా కొత్త కొత్త అంశాల్ని చర్చిస్తుండటంతో భిన్నవర్గాల వారు రావడం ప్రారంభించారు. ఎక్కువగా సమకాలీన అంశాలపైనే చర్చలు జరుగుతాయి. ‘చిన్న రాష్ట్రాల ఆవశ్యకత’, ‘తెలుగు రాష్ట్రాలు- నీటి సమస్యలు’ పెద్ద నోట్ల రద్దు, జీఎస్‌టీ మొదలైన అంశాలపైన చర్చలు జరిగాయి. హైదరాబాద్‌లో ప్రపంచ పారిశ్రామిక సదస్సు(జీఈఎస్‌) జరిగిన నేపథ్యంలో ‘అంతర్జాతీయ ఔత్సాహిక పారిశ్రామిక అభివృద్ధి’పైన 200వ వారంలో సమగ్రంగా చర్చించారు. ఈ చర్చలు   సామాన్యుల ఆలోచనల్లో మార్పు తెచ్చేవిగానూ ఉపయోగపడుతున్నాయి. వ్యాపారం, రాజకీయం, చారిత్రకం, సాంస్కృతికం... ఇలా ప్రతి అంశంపైనా చర్చలు జరుపుతారు. ఈ చర్చల్లో స్థానిక అంశాలకూ ప్రాధాన్యం ఇస్తారు. వరంగల్‌కు స్మార్ట్‌సిటీ పథకం దక్కినపుడు అదే అంశాన్ని ఎంచుకొని ఆకర్షణీయ నగరాలతో కలిగే లాభాలపైనా పథకం అమలైతే ఓరుగల్లులో వచ్చే మార్పులపైనా చర్చించారు. చర్చకు ఎంపిక చేసుకున్న అంశాన్నిబట్టి ఆయా రంగాల్లో నిష్ణాతుల్ని ముఖ్య అతిథిగా ఆహ్వానిస్తారు. అలా ఇప్పటి వరకూ విశ్వవిద్యాలయాల ఆచార్యులూ, న్యాయవాదులూ, విద్యావేత్తలూ, వ్యాపారవేత్తలూ, కవులూ, కళాకారులూ ఇలా భిన్న రంగాలకు చెందినవారు హాజరై తమ అమూల్యమైన అభిప్రాయాల్నీ, ఆలోచనల్నీ ఈ వేదికపైన పంచుకున్నారు. మొదటితో పోల్చితే ఇప్పుడు చర్చల్లో మహిళల సంఖ్య కూడా పెరుగుతోంది. భవిష్యత్తు విద్యార్థులదే కాబట్టి ఈ మేధో చర్చలో వాళ్లనీ భాగం చేసేందుకు విద్య, స్వయం ఉపాధి, ఉద్యోగాలు, ఐటీలో అవకాశాలు... తదితర అంశాలను కూడా ఇక్కడ చర్చకు పెడుతున్నారు.
పరిష్కారాల దిశగా
ప్రతీ వారం సదస్సుకు వందమందికిపైగా వస్తారు. ఒకసారి వచ్చి పేరు, మొబైల్‌ నంబరు నమోదు చేస్తే, శనివారమే వారికి చర్చ జరిగే అంశాన్ని మెసేజ్‌చేసి చెబుతారు నిర్వాహకులు. సదస్సులో మాట్లాడేందుకు ఓ మైకు, పక్కన ముఖ్య అతిథితోపాటు నిర్వాహకులు కూర్చోడానికి నాలుగు కుర్చీలు, ఎదురుగా సదస్సుకు వచ్చిన వారి కోసం కుర్చీలు ఏర్పాటు చేస్తారు.
ఏ విషయంపైనైనా అవగాహన ఉన్నవారే మాట్లాడతారు. సమస్యకు కారణాలేంటో వెతుకుతారు, పరిష్కారాల్ని కూడా వక్తలు సూచిస్తారు. పెరుగు చిలికి వెన్నను తీసినట్టు చివరకు ఒక చక్కని పరిష్కారాన్ని  చెబుతారు. ‘తెలంగాణ జన వేదిక’ను చర్చలకే కాకుండా, పరిష్కారానికీ వేదికగా మార్చాలనే లక్ష్యంతో ముందుకెళుతున్నారు సభ్యులు. ఈ వేదికకు అనుబంధంగా ‘రైతు జన వేదిక’ను ఏర్పాటుచేశారు. దీని ద్వారా గ్రామాల్లో రైతులతో సదస్సులు ఏర్పాటుచేసి, వారి సమస్యలను అధికార యంత్రాంగం దృష్టికి తీసుకెళ్తూ వాటికి పరిష్కార మార్గాల్నీ చూపిస్తున్నారు. త్వరలో నగర సమస్యలపైనా పోరాటం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆపైన ఇంకోటి! ఈ మార్పు చర్చలతోనే మొదలైంది!

- జి.పాండురంగశర్మ, ఈనాడు, వరంగల్‌
ఫొటోలు: ఎ.సంపత్‌

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.