close
అత్తగారూ - ఆవకాయా

అత్తగారూ - ఆవకాయా
- భానుమతీ రామకృష్ణ

తెలుగువారికి పరిచయం అక్కర్లేని బహుముఖ ప్రజ్ఞాశాలి భానుమతి. ఆమె సృష్టించిన ‘అత్తగారు’ ఆధునిక తెలుగు సాహిత్యంలో చిరస్థాయిగా నిలచిపోయే మరపురాని పాత్ర. ఈరోజు భానుమతి వర్ధంతి సందర్భంగా- ఆమె కలం నుంచి జాలువారిన అచ్చతెలుగు అత్తగారి కథల్లో ఒకటి మీకోసం...

సాధారణంగా మద్రాసులో ఉండే తెలుగు జనాభాకు ఆవకాయ తినే ప్రాప్తం కలగడం అదృష్టంలో ఒక భాగం అని చెప్పాల్సిందే. విజయవాడ దగ్గర్నుండి విశాఖపట్నం వరకూ ఉండే ఊళ్ళల్లో బంధువులో తెలిసినవాళ్ళో ఉండి ఆవకాయ జాడీలు మద్రాసుకు రవాణా చేస్తే తప్ప, బంధువులూ, తెలిసినవాళ్ళూ, కనీసం ఆవకాయ సప్లయి చేసే రకం బంధువులు - ఇద్దరూ లేని తెలుగువాళ్ళు మద్రాసులో కాసే మామిడికాయలు తినాల్సిందే కానీ ఆవకాయ తినే అవకాశం లేదు. ఆవకాయ పెట్టడం తెలిసిన బామ్మగార్లు ఉండే కుటుంబాలకు బాధేలేదు. నూజివీడు రసాల కాయలూ, సామర్లకోట పప్పునూనే తెప్పించలేకపోయినా మద్రాసు మామిడికాయలతోనైనా ఘుమఘుమలాడే ఆవకాయ పెట్టగలరు. ఎటొచ్చీ తింటం తెలిసి, ఆవకాయ పెట్టడం తెలియని మాబోటివాండ్లకే అవస్థ. పోయిన సంవత్సరం వరకూ తెలిసినవాండ్లు బెజవాడ ప్రాంతాల నుండి ప్రతి ఏటా ఆవకాయ పంపుతూండేవాళ్ళు- రెండు మూడు పెద్ద జాడీల్లో. ఈ సంవత్సరం వారింట్లో రెండు మూడు పెండ్లిండ్లు జరగడం వల్ల మాకు ఆవకాయ పంపే వ్యవధి వారికి లేకుండా పోయింది. ఇన్నాళ్ళూ ఆవకాయను గురించి ఆలోచించని నాకు ‘ఇంట్లో ఆవకాయ లేదు, ఈ సంవత్సరం రాదు’ అని తెలియగానే గుండె గతుక్కుమంది.

కొన్ని వస్తువులు ఉన్నప్పటికంటే లేనప్పుడు ఎక్కువ అగ్రస్థానం వహిస్తాయి మనుషుల మనసుల్లో. అలాగే ఆవకాయ ప్రతి ఏటా వస్తున్నప్పుడు మా వంటచేసే అయ్యరు అన్నం వడ్డించిన వెంటనే ‘ఆవహా ఊరహా వేణుమా’ అంటే మేము ‘వేండాబ్బా, ఎప్పుడూ ఆవకాయేనా దరిద్రం’ అన్న రోజులు కూడా ఉన్నాయి. ఆవకాయ ఉన్నప్పుడు మా వంట అయ్యరు పచ్చళ్ళు చేయటానికి బద్ధకించేవాడు. ఈ సంవత్సరం ఆవకాయ లేకపోయేసరికి మా వంట అయ్యరు చేసే వంటలోని లోపాలన్నీ ఒక్కొక్కటే బయటపడ్డం మొదలెట్టాయి. ఈ సంవత్సరం వంట అయ్యరు ఏం చేస్తే అది తిని, నోరు మూసుకుని ఊరుకోవాలి గాబోలునని అనుకున్నప్పుడంతా ఆవకాయ కోసం నోరూరడం మొదలెట్టింది. ఆవకాయ కోసం మా ఇంటికి మావారి మిత్రులు కొందరు కుటుంబాలతో సహా భోజనానికి వచ్చేవారు. అప్పుడప్పుడు, ‘ఆహా, ఎన్నాళ్ళకు తినగలుగుతున్నామండీ మనదేశపు ఆవకాయ’ అని వాళ్ళంతా లొట్టలు వేస్తూ తింటుంటే, మేము చాలా నిర్లక్ష్యంగా ‘ఆఁ, ఆవకాయకేం భాగ్యమండీ! మాకు ప్రతి ఏటా వస్తూంటుంది ఆవకాయ’ అనేవాళ్ళం గర్వంగా.

ఆ వచ్చినవాళ్లు అందరూ సగం జాడీ తినేసి, సగం జాడీ ఇంటికి పట్టుకుపోయేవాళ్ళు తలా కాస్తా.
‘అయినా అంత ఆవకాయ పట్టుకెళ్ళిపోయారే!

ఈ సంవత్సరం మన ఇంటికి చాల్తుందో లేదో’ అని నేను అనుకుంటుంటే ‘అబ్బ, చాలకపోతే పోనిస్తూ... ఎంతని తింటాం ఆవకాయ! నాకు వద్దనే వద్దు. నీకు కావాలంటే మిగిలిన ఆవకాయ దాచిపెట్టి తింటూండు’ అన్నారు మావారు ఎగతాళిగా. అలాంటి మావారు ఈ సంవత్సరం ఆవకాయ ఇంట్లో లేదని తెలిసిన తర్వాత తనేమన్నది కూడా మరిచిపోయి ‘అయ్యరుగాడు చేసే ఈ పచ్చళ్ళు తినటం చాలా కష్టం. ఆవకాయ ఉంటే బాగుండేది’ అంటం మొదలెట్టారు. మా అత్తగారు మడిలో ఉంచిన నిమ్మకాయ ఊరగాయ తప్ప ఇంట్లో వేరే ఏ ఊరగాయా లేదు. మా అత్తగారు కారంలేని నిమ్మకాయ ఊరగాయ తింటుంది. మాకు సయించదు. అదే ఆమె మడితో ఒక మూల దాచిన బూజుపట్టిన నిమ్మకాయ జాడీని ఎవరూ ముట్టుకోకపోవడానికి కారణం.

మావారు ఒకరోజు మధ్యాహ్నం భోంచేస్తూండగా ‘కొడుకు ఆవకాయలేదని పలవరిస్తున్నాడే’ అని ఎంతో ప్రేమగా మడినిమ్మకాయ ఊరగాయ తెచ్చి కొడుకు కంచంలో వడ్డించారు మా అత్తగారు. కొడుకు ఆ నిమ్మకాయ ఊరగాయను ముట్టుకోకపోగా కంచంలోంచి తీసి కిందపడేశారు. మా అత్తగారు చూడలేదుగానీ చూస్తే చాలా నొచ్చుకునేదే పాపం. తర్వాత నన్నడిగింది ‘‘అబ్బాయి ఊరగాయ ఎట్లా ఉందన్నాడూ?’’ అని.

‘‘చాలా బావుందన్నారు కానీ, ఆవకాయ ఊరగాయంటేనే ఆయనకెక్కువ ఇష్టం.

ఈ సంవత్సరం ఆవకాయ రాలేదే, ఏం చేయడం, ఎవర్ని అడగడం అన్న దిగులు పట్టుకుంది’’ అన్నాను.

‘‘ఆ నీదంతా చోద్యమే మరీనూ. ఎవర్నో ఎందుకడగడం? ఆవకాయ పెట్టడం ఏం బ్రహ్మవిద్య గనకనా, తెలీకడుగుతా! అయినా అంత కారం, అంత నూనె వేసిన ఆ ఉత్తరాదివాండ్ల ఆవకాయ మీరంతా లొట్టలేస్తూ తింటూంటే నా కళ్ళవెంట నీళ్ళే కార్తాయి. అయినా మనకెందుకులే అని ఊరుకున్నాను. అసలు అంత కారంగా ఉండే ఆవకాయ తింటే మీ ఒళ్ళు గతి ఏం కానూంట!’’

‘‘ఏదో వారికిష్టం’’ అన్నాను నేను.

‘‘నేను పెట్టిస్తానుండు ఆవకాయ’’ అన్నారు మా అత్తగారు, దర్జాగా కూర్చుంటూ.

నా ప్రాణం లేచివచ్చినట్లయింది. ‘‘అంతకంటేనా, మీరు గనక ఆవకాయ పెడితే యింక మనకు ఆవకాయ లేదన్న లోటు ఉండదు ఈ సంవత్సరం’’ అన్నాను సంతోషంగా.
‘‘ఆఁ నీదంతా చాదస్తమే మరీనూ!

ఏ సంవత్సరమైనా మనింట్లోనే పెట్టుకోవచ్చు ఆవకాయ. ఏం బ్రహ్మవిద్యంటాను? నిమ్మకాయెంతో ఆవకాయా అంతే’’ అన్నారు తేలిగ్గా మా అత్తగారు.

‘‘అంతే, అంతే’’ అన్నాను ఆవిడేమన్నదో అర్థంగాక నేను.

కానీ, నాకో సందేహం కలిగింది. మా అత్తగారి పుట్టినిల్లు చెంగల్‌పట్‌, మెట్టినిల్లు నంద్యాల. ఆవకాయకూ మా అత్తగారికీ ఎలాంటి సంబంధం ఉంటుందా అని చాలాసేపు ఆలోచించాను. అడుగుదామనుకున్నాను. మళ్ళీ ‘ఆక్షేపిస్తోంది’ అనుకుంటుందని
ఊరుకున్నాను.
‘‘అయితే ఏమేం వస్తువులు కావాల్సుంటాయి ఆవకాయ వేయడానికి’’ అని అడిగాను.

తెల్లకాగితం, పెన్సిలు చేతపుచ్చుకుని, ఆవిడగారి గుమస్తాలాగా. వెంటనే మా అత్తగారు కాలు మీద కాలు, మూతి మీద వేలు వేసుకుని ఒక్క క్షణం ఆలోచించారు.
‘‘మామిడికాయలు కావాలిగా?’’ అన్నాను, మా అత్తగారి ఆలోచనకు అంతరాయం కలిగిస్తూ.

‘‘అబ్బే, ఎందుకే?’’ అన్నారు అలక్ష్యంగా చప్పరిస్తూ. నేను తెల్లబోయి ఆమెకేసి చూశాను.

‘‘పదిహేనెకరాల మామిడితోటలో మనం ఉంటూ, లక్షణంగా కాసే మామిడిచెట్లు పెట్టుకుని, ఇంకా కాయలెందుకే మనకూ’’ అన్నారు చిరునవ్వు లొలకబోస్తూ.

‘‘అయితే మన తోటలోని పండ్లకాయలే వేస్తానంటారా ఆవకాయా?’’ అన్నాను.

‘‘ఓ! భేషుగ్గా వెయ్యొచ్చు. ఆవకాయకు కావలసింది మామిడికాయేగా. ఏ కాయయితేనేం, మన తోటలో దక్షిణం వైపు చెట్లన్నీ భేషైన కాయలు కాస్తాయి. పడమటివైపు చెట్లు ఎంత కండగల కాయలనుకున్నావు - పోయిన సంవత్సరం తోటంతా విరగకాశాయి కాయలు. ‘మరి నాలుగు వందలు ఎక్కువ చెప్పి కౌలు కివ్వవే’ అంటే విన్నావు కాదు. వాడికెంత లాభం వచ్చిందో తెలుసా... మన తోటవాడు చెప్పాడు. ఈ సంవత్సరమూ అంతే, వాడికింకా లాభం వస్తుంది. అట్లా కాసింది తోటంతా.’’

‘‘పోనీలెండి, ఏటా కౌలుకు తీసుకునేవాడు... నాలుగు డబ్బులు సంపాదించుకోనివ్వండి. పై సంవత్సరం అడగవచ్చు ఎక్కువ డబ్బు’’ అన్నాను.

‘‘హా- ఇస్తాడు, మళ్ళీ ఏ నష్టమో వచ్చిందంటాడు. అందుకే ఇప్పుడు ఆవకాయ పెట్టబోతున్నానుగా, అయిదువేల కాయలూ అడిగి పుచ్చుకుంటే సరి’’ అన్నారు మా అత్తగారు, దిట్టంగా బాసీపెట్టు వేసి కూర్చుంటూ.

‘‘అయితే, అయిదువేల కాయలూ ఆవకాయ పెడతానంటారా?’’ అన్నాను ఆశ్చర్యంగా.‘‘కాకపోతే! మీ చెల్లెళ్ళ ఇండ్లకూ ఇంకా తెలిసినవాండ్ల ఇళ్ళకూ పంపాల్సి ఉంటుందిగా! కొద్దిగా పెడితే ఏం చాలుతుంది మనింటికి? వాడిని మటుకు అయిదువేల కాయలూ
అడగాల్సిందే. డబ్బూ తక్కువిచ్చి, కాయలూ ఇవ్వకపోతే ఎట్లా?’’ అన్నారు కౌలువాడిమీద కత్తికట్టిన మా అత్తగారు.

‘‘అయిదువేల కాయలు వాడివ్వడేమో. మామూలుగా వాడివ్వాల్సిన కాయలు వెయ్యి. నేను అయిదు వందల కాయలు చాలన్నాను. ఎటుతిరిగీ మనకు ఎవరో ఒకరు తెలిసినవాండ్లు రసాలూ, బంగినపల్లి పండ్లూ పంపుతూనే ఉంటారు గదా! ఇంకా మన తోటలోని పండ్లన్నీ ఎవరు తింటారనే ఉద్దేశ్యంతో తగ్గించి ఇమ్మన్నాను. మళ్ళీ ఇప్పుడు అన్నీ కాయలూ గావాలంటే ఏం బావుంటుందీ’’ అన్నాను.

‘‘ఆఁ, నీదంతా చోద్యమే! నీవడక్కపోతే నేనడుగుతానుండు అన్నట్లు వాడి పేరేమిటీ... జటాయువా, జానకిరామా?’’నాకు ఫక్కున నవ్వొచ్చింది. ముసలి వాళ్ళందరికీ జటాయువంటే ఎందుకో అంత అభిమానం అని. ‘‘వాడి పేరు జటాయువూ కాదు, జానకిరామూ కాదు... దశరథుడు’’ అన్నాను నవ్వాపుకుంటూ.

‘‘ఆ- ఏ అతిరథుడో... ఎవడికి జ్ఞాపకం. వెంటనే వాడికి కబురు పంపి పిలిపించు. వాడిచేత అయిదువేల కాయలూ కక్కిస్తాను. పదిహేనెకరాల మామిడితోట కౌలుకు తీసుకుని, తక్కువ డబ్బిచ్చి దగా చేసేది కాకుండా మామూలుగా మనకిచ్చే మామిడికాయలు కూడా తక్కువిస్తే ఎట్లాగంట’’ అన్నారు మా అత్తగారు పాయింటు దొరికిన ప్లీడర్‌ గారికిమల్లే.

‘‘ఒక్క మామిడికాయతోనే ఆవకాయ కాదుగా... నూనె కావొద్దూ’’ అన్నాను.

‘‘ఎందుకూ?’’ అన్నారు.

‘‘ఎందుకేమిటీ, ఆవకాయలో నూనె వెయ్యరూ!’’ అన్నాను ఆశ్చర్యపోతూ.

‘‘వేస్తారు సరేనే - నూనె కొనటం ఎందుకంట! మన తామ్రం చేలో పండిన నువ్వులు ఎనిమిది బస్తాలూ ఏమయ్యేట్టు? మన ఇంటికి సంవత్సరానికి ఆరు బస్తాల నువ్వులనూనె చాలు. పై రెండు బస్తాల నూనె వంటవాడు పోయిలోనే పోస్తున్నాడు.’’
‘‘ఆ నూనె మీరు ఆవకాయలో పోస్తానంటారు. అయితే రెండు బస్తాల నువ్వులనూనె అయిదువేల కాయలకు కావాలంటారు’’ అన్నాను వ్రాసుకోబోతూ.

‘‘అబ్బే, ఎందుకే? వెయ్యికి శేరు నూనె. అయిదువేలకూ అయిదు శేర్ల నూనె ఎక్కువ’’ అన్నారు మా అత్తగారు.

‘‘పప్పునూనెగదూ’’ అన్నాను.

‘‘ఏం పప్పూ! కందిపప్పూ! ఎందుకే, నీదంతా చాదస్తం. ఇంట్లో ఉండే నూనె చాలు. మొన్న ఆడించిన ఆరు శేర్ల నూనె అలాగే ఉందిగా - అసలు నూనె ఎక్కువేస్తే మాకు సయించదు’’ అన్నారు మా అత్తగారు.

ఆవకాయ అజపజ తెలియని నేను మా అత్తగారు చెప్పినవన్నీ భక్తితో లిస్టు రాసుకోవడం మొదలెట్టాను. మధ్యమధ్య తెలిసీ తెలియని సందేహాలను ఒకవైపు నెడుతూ, ఆవకాయ విషయంలో పూర్తిగా మా అత్తగారి మీద ఆధారపడదల్చుకున్నాను.

‘‘మరి కారం?’’ అన్నాను.

‘‘అదీ అంతే! మన చేలో పండిన మిరపకాయలు అయిదు బస్తాలు స్టోరు రూములో మూలుగుతున్నాయి. ఒక్క బస్తా మాత్రం వాడుక్కు బయట ఉంచాను.’’
‘‘అయితే మిగతా నాలుగు బస్తాల మిరపకాయల కారం అయిదువేల కాయలకు వేస్తానంటారా?’’ అన్నాను ఆశ్చర్యంగా.

‘‘ఇంకా నయం- అయ్యో పిచ్చిపిల్లా’’ అంటూ మా అత్తగారు తన ఏనుగు దంతాలవంటి రెండుకోరల బోసి నోటితోనూ విరగబడి నవ్వారు.

‘‘మరి ఎంత కారం కావాలంటారు?

కొట్టించాలిగా కారం’’ అన్నాను.

‘‘ఎందుకే, నీదంతా సింగినాదం మరీనూ! కారం కొట్టించడం మా తాతలనాడే లేదు- ఇప్పుడెందుకే? మిషను వేయిస్తే సరి.

ఒక్క వీశ కాయలు చాలు- మాకసలు కారం సయించదన్నానుగా!’’

‘‘మరి వీశ కాయల కారం అయిదువేల మామిడికాయలకు చాలా!’’ అన్నాను ఉండబట్టలేక.

‘‘ఆ, చాలకేమొచ్చిందే! ఉత్తరాదివాళ్ళలాగా అంత కారం నే వేయనమ్మా- అంతగా చాలకపోతే తర్వాత కాస్త వేసుకోవచ్చులే. మొన్న నేను నిమ్మకాయకు అసలు కారమే వేయలేదు. చూశావుగా... అయినా నాలిక చుర్రుమంటూనే ఉంది’’ అన్నారు మా అత్తగారు.

మధ్యాహ్నం మావారు పారేసిన నిమ్మకాయ అదే గదా అనుకుని మనసులోనే నవ్వుకున్నాను.

‘‘అయితే, కారం చాలకపోతే తర్వాత వేసుకోవచ్చంటారు’’ అన్నాను కారం చాలదనే సందేహం వదలక.

‘‘ఓ, భేషుగ్గా వేసుకోవచ్చు. నిమ్మకాయకు వేయడంలా... ఉప్పూ కారం కావాలంటే... అంతే! నిమ్మకాయెంతో ఆవకాయంతే’’అన్నారు మళ్ళీ.

‘‘అయితే మరి ఆవపిండో!’’ అన్నాను. అన్నీ నేనే అందిస్తూ వస్తున్నాను.

‘‘ఆ... ఆ... ఆవాలు మాత్రం కొద్దిగా కొనాలి. మిగతా అన్నీ మనింట్లోనే ఉన్నాయి. ఉప్పూ పసుపూ మెంతీ గింతీని. ఆవపిండి మనకెంత సయిస్తే అంతే వేసుకోవచ్చు.

అయిదువేల కాయలకూ ఒక సేరు ఆవపిండి చాలని నా అభిప్రాయం. ఎక్కువయితే వేడిమి చేస్తుంది. నన్నడిగితే ఉప్పెంతో కారం అంత, కారం ఎంతో ఆవపిండి అంత. అవన్నీ ఎంతో నూనె అంత, నిమ్మకాయెంతో ఆవకాయంతా’’ అని ముగించారు అత్తగారు. ఆవిడ చెప్పినవన్నీ శ్రద్ధగా రాసుకున్నాను కాగితం మీద.

అన్నట్లు ఆ కౌలువాడి పేరేమిటో మరిచిపోయాను. వాణ్ణి పిలిపించు, తక్షణం- వాడితో మాట్లాడో పోట్లాడో అయిదువేల కాయలూ తీసుకున్నదాకా నిద్రపట్టదు నాకు’’ అంటూ లేచి గోల్కొండ వ్యాపార్ల గోచి సరిచేసుకుంటూ వంటింటివైపు వెళ్ళారు మా అత్తగారు.

***

నేను అత్తగారి అజ్ఞానుసారం మామిడితోట కౌలుకు తీసుకున్న దశరథుడికి కబురుపెట్టాను.

దశరథుడు చేతులు కట్టుకుని వినయంగా వచ్చి మా అత్తగారి ముందు నిలబడ్డాడు. నేనుంటే మరీ ఏడ్చిపోతాడని పులి ముందు మేకపిల్లను వదలిపెట్టినట్లు, మా అత్తగారి ముందు దశరథుడిని వదలి నేను వెళ్ళి వంటింటి ముందున్న వడ్లబస్తాల మీద
కూర్చున్నాను.

మా అత్తగారు హైకోర్టులో వాదించే లాయర్లకు మల్లే దశరథుడితో వాదిస్తోంది. వాడి కాలికివేసీ మెడకువేసీ చివరకు అయిదువేల కాయలూ ఇవ్వకపోతే మామిడితోట విడిచిపెట్టి పొమ్మన్నారామె. ఇచ్చిన అడ్వాన్సు డబ్బు కావాలంటే తిరిగి ఇచ్చేస్తానని కూడా దబాయించింది. దాంతో నిజంగానే దశరథుడు భయపడిపోయాడు.

‘‘అయితే, అమ్మగారూ... అయిదువేల పండ్లయితే నేనిస్తాను అప్పుడప్పుడు. కాయలేం చేసుకుంటారు తల్లీ’’ అన్నాడు భయపడుతూన్న దశరథుడు.

‘‘ఆవకాయ వేస్తాన్రా... ఆవకాయా!

అయినా ఏం చేస్తామో నీతో చెపితేనే ఇస్తావా కాయలు?’’ అని గద్దించి అడిగారు మా అత్తగారు.

‘‘అదికాదండీ అమ్మగారూ, అయిదువేలూ పండ్లు వేస్తారా, కాయలుగా కావాలా అని అడిగానండీ. ఇప్పటికే బాగా ముదిరి పండబారి పొయ్యాయి కాయలన్నీ’’ అన్నాడు దశరథుడు.

ఆ మాట విన్న నా గుండె గతుక్కుమంది. మా అత్తగారు పండావకాయ పెట్టబోతారేమోనని భయపడ్డాను.

‘‘ఆ ముదిరి పండబారిన కాయలు పిల్లలు తింటారు. కానీ, నువ్వు మాత్రం అయిదువేల కాయలకూ ఒక్కటి తక్కువిచ్చినా తీసుకోను జాగ్రత్త’’ అని మా అత్తగారు దశరథుడిని పంపించేశారు.

మామూలుకంటే జోరుగా నడుస్తూ వచ్చారు మా అత్తగారు వంటింట్లోకి.

‘‘ఏమన్నాడు’’ అన్నాను ఏమీ విననట్లు.

‘‘ఏమంటాడు, కుక్కిన పేనల్లే దక్కిస్తూ ఇస్తాడు అయిదువేల కాయలూనూ. లేకపోతే తోట విడిచి పొమ్మన్నాను. వచ్చే ఏడు డబ్బు కూడా ఇలాగే దబాయించి తీసుకోవాలిగానీ, వాడెంతంటే అంతకు నిక్షేపంలాంటి మామిడితోట వదుల్తారటే?’’ అన్నారు సింహలగ్నంలో పుట్టిన మా అత్తగారు. నేను గుడ్లప్పచెప్పి ఆమెకేసి చూస్తూ ఉండిపోయాను.

***

మర్నాడు తెల్లవారుజామున మా అత్తగారు హడావిడిగా ఇంటిల్లిపాదినీ నిద్ర లేపారు. వంటచేసే అయ్యరు పక్కింటి నుంచి రెండు కత్తులూ ఎదురింటి నుంచి రెండు కత్తిపీటలూ తెచ్చాడు. ఇంట్లో మూల పారేసిన మొద్దు కత్తులూ తుప్పు పట్టిన కత్తిపీటలూ తీసుకుని రణరంగానికి బయలుదేరినట్లు
పనివాళ్ళూ నేనూ మా అత్తగారూ వంటింటి ముందు వసారాలో చేరాం.

అయిదువేల కాయలూ పెరటివేపు వరండాలో రాశి పోసి ఉన్నాయి. మా అత్తగారు ఆ రాశి చూస్తూనే... ‘‘చాలా కాయలొచ్చాయే! మనం అయిదు వేలేగా అడిగింది! వెధవ, భయపడి పదివేల కాయలు కక్కినట్లున్నాడే!’’ అన్నారు.

‘‘వాడు ప్రస్తుతం కక్కిందీ అయిదువేల కాయలే’’ అన్నాను నవ్వు ఆపుకుంటూ.

మా అత్తగారి ముఖం వెలవెలబోయింది.

మొదటిరోజు రెండు వందల కాయలూ రెండవరోజు మూడు వందల కాయలూ తెగేసరికి రెండు కత్తులూ పిళ్ళూ విరిగాయి. ఒక కత్తి పూర్తిగా రెండు తునకలయింది. రెండు కత్తిపీటలు వంగిపోయాయి. మిగతా నాలుగువేలా అయిదు వందల కాయలూ పండ్లయిపోయాయి మూడోనాటికి.
మా అత్తగారి ముఖం నల్లబడిపోయింది.

‘‘పోనీ, ముందీ అయిదు వందల కాయలకూ పిండీ నూనే వెయ్యండి’’ అన్నాను, అప్పటికే ఆవకాయకు నీళ్ళు వదిలేసిన నేను ఉసూరుమంటూ.

‘‘ఆ, అంతే చేయాలి. వెధవ... పండబారిన కాయలిచ్చి దగా చేశాడు’’ అన్నారు,

తప్పుకోవడానికి ప్రయత్నించే మా అత్తగారు.

‘‘వాడేం దగా చేయలేదు. వాడు ముందే చెప్పాడు... పండబారాయి కాయలన్నీ అని’’ అన్నాను లోపల్నుంచి వచ్చే కోపాన్నంతా మింగుతూ.

‘‘ఆ- అదేలే, అయితే ముందీ ముక్కలకు కారం, ఉప్పూ పిండీ పట్టిస్తానూ, ఏం’’ అన్నారు మాట మారుస్తూ మా అత్తగారు.

‘‘మీ ఇష్టం, అలాగే కానివ్వం’’డన్నాను నేను నీరసంగా.

అయిదు వందల కాయల ముక్కలే ఒక పెద్ద గంగాళం నిండా ఉన్నాయి. ఇంట్లో ఉన్న చిన్న జాడీలు నాలుగూ తెచ్చి మా అత్తగారి ముందు పెట్టాను.

పిండీ నూనె కలపకుండానే ముక్కలన్నీ నాలుగు జాడీలకు పట్టించడం మొదలెట్టారు. ఇంకా సగం ముక్కలు మిగిలిపోయాయి. నాలుగు జాడీలూ నిండిపోయాయి. మా అత్తగారు గుడ్లు తేలేశారు. నేను వెంటనే మరో నాలుగు జాడీలు టౌను నుంచి తెప్పించి ఆవిడ ముందుంచాను. మిగతా ముక్కలన్నీ కొత్తగా వచ్చిన నాలుగు జాడీలకూ సరిపోయాయి. అయిదు వందల కాయలకే ఎనిమిది జాడీలయితే అయిదువేల కాయలకు ఎన్ని జాడీలు కావాల్సివచ్చేదో తల్చుకుని హడలెత్తిపోయాను.

ఎనిమిది జాడీల్లోనూ గుప్పెడు గుప్పెడు కారం, ఉప్పూ ఆవపిండీ వేసి ఒక్కో జాడీకి రెండు గరిటెలు నూనె పోసి మూతపెట్టి ‘కృష్ణా’ అంటూ లేచారు మా అత్తగారు.

‘‘ఆవకాయ పెట్టడం అయిపోయిందా?’’ అన్నాను.

‘‘ఆహా, ఒక వారం రోజులు ఆ జాడీల వైపు వెళ్ళకుండా ఉంటే సరి’’ అన్నారు

మా అత్తగారు చేయి కడుక్కుంటూ.

‘ఆవకాయ వేయడం ఇంత సులభమని తెలిస్తే నేనే వేసి ఉండేదాన్నే’ అనుకున్నా మనసులో.

***

వారం రోజుల తర్వాత ‘మా ఇంటిలో మా అత్తగారు ఆవకాయ వేశారు కాబట్టి భోజనానికి రావాల్సింది’ అంటూ మా చెల్లిళ్ళకూ తెలిసినవాళ్ళకూ కబురు పంపాను. ఆవకాయ కోసం ముఖం వాచిన మా చెల్లిళ్ళూ మరుదులూ అందరూ పిల్లాజెల్లాతో సహా వచ్చేశారు.
అంతా భోజనానికి కూర్చున్నారు. మా అత్తగారు వంటింట్లో హడావిడి పడుతున్నారు. ఆవకాయ కోసం నేను వెళ్ళేసరికి ఏముందీ... మూతలు తీసి చూస్తే ఆవకాయ లేదు - మామిడిపండ్ల ముక్కలున్నాయి - బూజుపట్టి. మా అత్తగారి ముఖాన కత్తివాటుకు
నెత్తురు చుక్కలేదు.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.