close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
అమ్మకు ప్రేమతో...

అమ్మకు ప్రేమతో...

వమాసాలూ మోసి, బిడ్డకు ఊపిరి పోస్తుంది అమ్మ. ప్రాణానికి ప్రాణంగా పెంచి ప్రయోజకుల్ని చేస్తుంది. కానీ వయసొచ్చేసరికి ఆమె ప్రేమనే కాదు, తమను భూమ్మీదికి తెచ్చింది ఆ తల్లే అన్న విషయాన్ని కూడా మర్చిపోయి అమ్మను అనాథను చేస్తున్నవారెందరో. కానీ చైనాకు చెందిన యాభయ్యేళ్ల చెన్‌ జిన్‌యిన్‌ రెండు చేతుల్లేకపోయినా కన్నతల్లిని కళ్లలో పెట్టుకుని చూసుకుంటున్నాడు. అందుకే, ఇప్పుడు ఇంటర్నెట్‌, వాట్సాప్‌లలో ఎందరో బిడ్డలకు స్ఫూర్తినిచ్చే సూపర్‌స్టార్‌ అయ్యాడు. ఏడేళ్ల వయసులో కరెంటు షాక్‌ కొట్టి రెండు చేతుల్నీ కోల్పోయాడు చెన్‌. కుటుంబాన్ని పోషిస్తున్న తండ్రి అతడికి ఇరవయ్యేళ్లొచ్చేసరికే కన్నుమూశాడు. అప్పటికే చెన్‌ అన్నదమ్ములు ఇల్లొదిలి వెళ్లిపోవడంతో ఇంటి బాధ్యతను తల్లి భుజానవేసుకుంది. పశువుల్ని కాస్తూ చిన్న చిన్న పనుల్లో ఆమెకు తోడుగా ఉండేవాడు చెన్‌. కానీ వయసుమీద పడటంతో ఆరోగ్యం క్షీణించి కొన్నేళ్లనుంచీ మంచం పట్టిందామె. అప్పుడు చుట్టుపక్కల వాళ్లు కొందరు ‘ఇక నువ్వు ఏ పట్టణానికో వెళ్లి అడుక్కోవడం మంచిది’ అని చెన్‌కి సలహా ఇచ్చారు. దానికి అతడు కోపంగా ‘నాకు చేతుల్లేకపోయినా కాళ్లతో నా పనులు చేసుకోగలను’ అని సమాధానం ఇచ్చాడట. అనడమే కాదు, కాళ్లతోనే అన్ని పనులూ చేసుకోవడం నేర్చుకున్నాడు కూడా. ప్రస్తుతం తనకున్న కొద్దిపొలంలో సాగు చేసుకోవడంతో పాటు, ఇంట్లో కూరగాయలు కోసుకోవడం, వంట చేసుకోవడం, గిన్నెలు తోముకోవడం అన్ని పనులూ కాళ్లతోనే చేస్తున్నాడు. ఇక, తల్లికి పక్షవాతం వచ్చి చెయ్యి కదపలేని పరిస్థితిలో ఉంటే తన నోటితోనే స్పూను పట్టుకుని ఆమెకు తినిపిస్తున్నాడు. మాతృదేవోభవ... అంటాం. ఇలాంటి కొడుకులుంటే పుత్రులూ దేవుడితో సమానమే.

ఇవేంటో చెప్పుకోండి చూద్దాం..!  

ళ్లకు కనిపించేదంతా నిజం కాదు. ఇక్కడ కనిపిస్తున్నవాటి వెనుక ఉన్న రహస్యం తెలిస్తే... ఆమాట ముమ్మాటికీ నిజం అని మరోసారి అనిపించకతప్పదు. అచ్చం పిజ్జా, చికెన్‌, నూడుల్స్‌, బర్గర్‌లా ఉన్న ఈ ఫొటోల్లోనివన్నీ అసలు సిసలైన కేకులు మరి. బ్రిటన్‌కి చెందిన 24 ఏళ్ల లారా లౌకైడ్స్‌ కేకుల్ని ఫాస్ట్‌ఫుడ్‌లా రూపొందిస్తే ఎలా ఉంటుందన్న ఆలోచనతో వీటిని తయారుచేసి ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టింది. ఇక, ఇంతలా కళ్లను మాయ చేస్తున్న అవి అంతర్జాతీయంగా ప్రాచుర్యం పొందాయనడంలో ఆశ్చర్యం ఏముందీ! వీటిని తయారుచెయ్యాలనుకునేవారి కోసం లారా తన వెబ్‌సైట్లో క్లాసులు కూడా చెబుతోంది.

అక్కడ సుదీప్‌ దేవుడు!

‘వాడు ఆ హీరోకి పెద్ద అభిమానిరా... గుండెల్లో గుడి కట్టి ఆరాధించేస్తుంటాడు’... ఎవరైనా ఓ హీరోని బాగా అభిమానిస్తుంటే ఇలా అనడం సహజం. కానీ నిజంగానే ఓ ఊరి జనమంతా తమ అభిమాన నటుడి ఫొటోను రోజూ పూజిస్తారంటే నమ్మగలరా... కర్ణాటకలోని చిత్రదుర్గలోని బగ్గనాడు గ్రామం గురించి తెలిస్తే కచ్చితంగా నమ్మాల్సిందే. ఈ ఊరి ప్రజలు హీరో సుదీప్‌ అంటే ప్రాణం పెట్టేస్తారు. అదేనండీ ‘ఈగ’ సినిమాలో విలన్‌గా చేశాడు కదా ఆ సుదీప్‌. అతడు శాండల్‌వుడ్‌(కన్నడ చిత్రసీమ)లో పెద్ద హీరో. పదిహేనేళ్ల కిందట ‘కిచ్చ’ సినిమాతో కిచ్చ సుదీప్‌గా ప్రాచుర్యం పొందిన సుదీప్‌ని అప్పట్నుంచీ దేవుడిలా కొలుస్తున్నారట బగ్గనాడు గ్రామస్థులు. ఇళ్లలోనూ దుకాణాల్లోనూ సుదీప్‌ ఫొటోని పెట్టుకుని రోజూ అగరవత్తులు వెలిగించడమే కాదు, ప్రతి మంగళవారం స్థానికంగా ఉండే కరియమ్మదేవి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిపేటపుడు కూడా సుదీప్‌ ఫొటోకి పూజలు చేస్తారు. ఇక, కార్తీకమాసంలోనూ సుదీప్‌ పుట్టినరోజునాడూ అతడి కటౌట్లు పెట్టి అక్కడ పెద్ద ఎత్తున జాతరలే నిర్వహిస్తారు. అయితే, అది మారుమూల గ్రామం కావడంతో ఈ విషయం మొన్నమొన్నటి వరకూ సుదీప్‌కి కూడా తెలియదట. తెలియగానే ఆశ్చర్యపోయి అంతటి అభిమానం ఉన్నవారిని వెంటనే కలవాలని వెళ్లాడట.

ఒకటేం... రెండు కొనుక్కో

రి, అతని స్నేహితులు ముగ్గురూ బార్‌లో ఓ టేబుల్‌ చుట్టూ కూర్చున్నారు. మందు పార్టీ జోరుగా సాగుతోంది. అందరూ సెల్‌ఫోన్లను టేబుల్‌మీదే ఉంచారు. కాసేపయ్యాక వాళ్ళలో ఇద్దరు బాత్‌రూమ్‌కి వెళ్ళారు. ఇంతలో టేబుల్‌ మీద ఉన్న ఫోన్లలో ఒకటి మోగింది. హరి ఆ ఫోనెత్తాడు... ‘ఏమండీ, మీ లాకర్లో డబ్బులు తీసుకుని నేనో నెక్లెస్‌ కొనుక్కుంటున్నా.’
‘ఒక్కటేం, రెండు కొనుక్కో’ అన్నాడు హరి. ‘పట్టుచీర కూడా కొనుక్కుందామనుకుంటున్నా.’ ‘అవీ రెండు తీసుకో.’ ‘మరి వడ్డాణమో...’ ‘నచ్చితే వడ్డాణాలు కూడా రెండు కొనుక్కో.’
పక్కనున్న మిత్రుడికి నోటమాట రావట్లేదు. ఫోన్‌ పెట్టేశాక అడిగాడు... ‘నీకు నీ భార్యంటే చాలా ఇష్టంలా ఉందే.’ ‘ఇష్టమా పాడా... ఆ ఫోన్‌ నాది కాదు’ చల్లగా చెప్పాడు హరి.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.