close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
నల్లకోడి... కిలో వెయ్యి రూపాయలా?!

నల్లకోడి... కిలో వెయ్యి రూపాయలా?!

‘నలుపే నాణ్యం’ అన్నది మధ్యప్రదేశ్‌లోని ఆదివాసీలకు ఏనాడో తెలుసు. అందుకే తరాలనుంచీ ఆ నల్లకోడినే పెంచుతూ వచ్చారు. తమ నట్టింట్లో తిరిగే ఆ నల్లకోడినే నమ్ముకున్నారు. అదే ఈ రోజు వాళ్లకు కాసులవర్షం కురిపిస్తోంది. అరుదైన ఆ నల్లకోడి పేరే కడక్‌నాథ్‌..!

ఝాబువా, అలీరాజ్‌పుర్‌... ఈ రెండూ మధ్యప్రదేశ్‌లో వెనకబడిన ప్రాంతాలు... వర్షాలు లేక పంటలు పండక, అంతా పట్టణబాట పట్టేవారు. ఇటీవల ఆ వలస ఆగింది. కారణం ఝబువా కృషివిజ్ఞానకేంద్రమే. దాని సహకారంతో స్థానిక ఆదివాసీ రైతులంతా నల్లకోళ్ల పెంపకాన్నే వృత్తిగా మలచుకుని, దేశవిదేశాలకు కోళ్లనీ మాంసాన్నీ ఎగమతి చేస్తూ ఆదాయాన్ని పొందుతున్నారు. దాంతో చుట్టుపక్కల ప్రాంత రైతులు కూడా నల్లకోడి పేరునే పలవరిస్తున్నారు.

భీల్‌, భిలాలా తెగ ప్రజలు అక్కడి వాతావరణాన్ని తట్టుకుని జీవించే నల్లకోడిని వందల ఏళ్ల నుంచీ పెంచుతున్నారు. ఒళ్లంతా కారు నలుపులో ఉండటంతో దీన్ని వాళ్లు ‘కలి మసి’ అంటారు. రుచితోబాటు దాని ప్రత్యేకమైన రంగు కారణంగా అందులో ఎన్నో ఔషధగుణాలు ఉన్నాయని వాళ్లు నమ్మేవారు. ఆ విషయాన్ని మైసూర్‌లోని కేంద్ర పరిశోధన ఆహార పరిశోధనా సంస్థ పరిశీలించి చెప్పడంతో ఇది ఒక్కసారిగా వెలుగులోకి వచ్చింది. పైగా ఇండొనేషియా, బాలి దీవుల్లోని ఆయమ్‌ సెమనీగా పిలిచే నల్లకోళ్లూ; చైనాలోని సిల్కీ... రకాల్లోకే ఇదీ చెందుతుందనీ అవన్నీ ఆరోగ్యానికీ మంచిదన్న కార ణంతో ఆయా దేశాల్లో వాటి ధర వేలల్లోనూ లక్షల్లోనూ పలకడంతో ఈ స్వదేశీ కోళ్లకు  డిమాండ్‌ ఒక్కసారిగా ఊపందుకుంది.

ఎందుకో అంత డిమాండ్‌?
సహజంగానే నాటుకోడి రుచి అయితే, ఈ నల్లకోడి యమా రుచి అట. పైగా ఇతర కోళ్లతో పోలిస్తే ప్రొటీన్ల శాతం ఇందులో చాలా ఎక్కువ. సాధారణ కోళ్లలో ప్రొటీన్‌ 18-20 శాతం ఉంటే, కడక్‌నాథ్‌లో 25 శాతం ఉంటుంది. కొలెస్ట్రాల్‌ శాతం తెల్లకోళ్లలో 13 - 25 శాతం ఉంటే, ఈ నల్లకోడిలో కేవలం 0.73- 1.05 శాతం మాత్రమే. బి1, బి2, బి6, బి12, సి, ఇ, నియాసిన్‌, కాల్షియం, ఫాస్ఫరస్‌, నికోటినిక్‌ ఆమ్లం... వంటివన్నీ కడక్‌నాథ్‌లో పుష్కలంగా ఉంటాయట. మామూలు కోళ్లలో కన్నా ఐరన్‌ శాతం పదిరెట్లు ఎక్కువ.
నరాలవ్యాధిని తగ్గించే హోమియో మందుల తయారీకి అవసరమైన గుణాలూ ఇందులో ఉన్నాయట. గుండెజబ్బు, క్షయ, ఆస్తమాలతో బాధపడేవారికీ, తీవ్రమైన తలనొప్పి, ఫిట్స్‌ రోగులకీ కూడా ఈ కోడిమాంసం మంచిదనీ; ఈ గుడ్డులోని ప్రోటీన్‌ బీపీ, కొలెస్ట్రాల్‌తో బాధపడేవాళ్లకీ మేలనీ చెబుతున్నారు. దీని రక్తాన్ని ఆదివాసీలు దీర్ఘకాలిక వ్యాధులకు మందుగానూ మాంసాన్ని శృంగారప్రేరితంగానూ వాడుతుంటారు. వయాగ్రా లేదా సిల్‌డెనాఫిల్‌ సిట్రేట్‌ల మాదిరిగానే ఇందులోని మెలనిన్‌ గుండెకు రక్త సరఫరాను పెంచుతుందని నిపుణులు సైతం చెప్పడంతో ఈ చికెన్‌కు డిమాండ్‌ పెరిగింది. కిలో మాంసం 700 నుంచి వెయ్యి రూపాయలు. గుడ్డు ధర నలభై నుంచి యాభై రూపాయలు పైనే.

ఆ నల్ల రంగెలా వచ్చింది?
ఈ కోళ్లలో కేవలం ఈకలే కాదు, కాలిగోళ్ల నుంచి లోపలి ఎముకల వరకూ అన్నీ నలుపే. వీటిల్లో ఉండే ఓ జన్యువు కారణంగా కణజాలాల్లో మెలనిన్‌ అనే వర్ణద్రవ్యం, అధికంగా పేరుకుంటుంది. ఈ స్థితినే ఫైబ్రోమెలనోసిస్‌ అంటుంటారు. అయితే గుడ్లు గోధుమరంగులోనే ఉంటాయి. పిల్లలు నీలం, నలుపూ తెలుపూ చారలతో ఉండి, క్రమంగా నలుపెక్కుతాయి.
గతంలో ఆదివాసీ మహిళలు సంప్రదాయ పద్ధతిలో పెంచడం, సరైన వ్యాధినివారణ చర్యలు చేపట్టకపోవడం వంటి కారణాలవల్ల అవి అంతరించిపోసాగాయి. ఆ విషయాన్ని గుర్తించిన జబువా కృషి విజ్ఞాన కేంద్రానికి చెందిన శాస్త్రవేత్తలు అక్కడ పర్యటించి ఆ కోళ్ల పెంపకంపట్ల శాస్త్రీయ అవగాహన కలిగించారు. భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలికి చెందిన జాతీయ వ్యవసాయ ఆవిష్కరణ ప్రణాళిక సంస్థ అందుబాటులో ఉన్న వనరులతో తక్కువ ఖర్చుతోనే కోళ్లఫారాలను ఏర్పాటుచేసింది. కృషివిజ్ఞానకేంద్రం ప్రతినెలా ఐదువేల కోడిపిల్లల్ని ఉత్పత్తి చేసి, రైతులకు అందిస్తోంది.
కడక్‌నాథ్‌ కోళ్లు ఐదునెలలకు అమ్మకానికి వస్తాయట. జాగ్రత్తగా పెంచితే ఒక్కో రైతుకీ వంద కోళ్లకి ఏడాదికి లక్ష రూపాయలు మిగులుతుందట. ఝాబువా జిల్లా వాసులు సాధించిన ఈ విజయాన్ని చూసి చుట్టుపక్కల ప్రాంతాల్లోని ఆదివాసీలే కాదు, ఉత్తరాది, దక్షిణాది రైతులు సైతం వీటిని పెంచేందుకు ఆసక్తి ప్రదర్శిస్తున్నారంటే నల్లకోడి అందరినీ ఎంతగా చవులూరిస్తోందో తెలుస్తోంది..!

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.