close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
అనుబంధాల సంపద

అనుబంధాల సంపద
ఆదోని బాషా

‘‘రోజా, శుక్రవారం సాయంత్రం ట్రైనుకి ఆఫీసు పనిమీద బెంగళూరు వెళుతున్నాను. వీలైతే తిరుగు ప్రయాణంలో అనంతపురంలో దిగి అన్నయ్యతో మాట్లాడి వస్తాను’’ ఆఫీసు నుంచి ఇంటికి రాగానే భార్యకి చెప్పాడు రాంబాబు.
భర్త మాటలు వినగానే రోజా ముఖం చిట్లించింది. ‘‘మీ అన్నయ్యతో మాట్లాడటానికి అంత దూరం వెళ్ళాల్సిన అవసరమేముంది? ఫోన్‌లో మాట్లాడొచ్చు కదా. అనవసరమైన ఖర్చులెందుకు?’’ చిరాగ్గా అంది.
‘‘ఇందులో ఖర్చయ్యేదేముంది? బెంగళూరు దారిలోనే అనంతపురం ఉంది కదా.’’
‘‘ఉంటే మాత్రం... మీ అన్నయ్య ఇంటికి మీరు ఖాళీ చేతులతో వెళతారా? పిల్లల కోసం ఖరీదైన కానుకలు తీసుకెళతారు. తిరిగొచ్చే సమయంలో మీ వదిన చేతిలో ఎంతోకొంత డబ్బు పెట్టి వస్తారు’’ మూతి మూడువంకర్లు తిప్పుతూ అంది రోజా.
‘‘పిచ్చిగా మాట్లాడకు. వదిన సంగతి నీకు తెలీదు. నేనిచ్చే డబ్బుని ఆమె ముట్టుకోదు. అన్నయ్యలాగే ఆమెక్కూడా అభిమానమెక్కువ. భర్తకు ఇష్టంలేని పని అసలు చేయదు’’ చివరి మాటను ఒత్తి పలుకుతూ అన్నాడు రాంబాబు.
‘‘అంటే, మీ వదిన మహా పతివ్రత, నేను గయ్యాళినని మీ ఉద్దేశమా?’’ నిలదీసింది రోజా.
‘‘నా ఉద్దేశం అది కాదు... అన్నా వదినలది ఒకే రకమైన మనస్తత్వమంటున్నాను. ఒకరికి ఇవ్వటమేగానీ పుచ్చుకోవటం అన్నయ్యకి తెలియదు. నాన్నగారు హఠాత్తుగా పోయాక చదువు మానేసి కుటుంబ బాధ్యత తన భుజాలపై వేసుకున్నాడు. చెల్లెలి పెళ్ళి చేసేవరకూ తను పెళ్ళి చేసుకోలేదు. నన్ను ఎంబీఏ వరకూ చదివించాడు. బాగా కట్నం ఇచ్చేవారి సంబంధం చూశాడు. కానీ, నేను నిన్ను ప్రేమించానని చెప్పగానే ఆ సంబంధం వదిలేసి, కట్నం లేకుండా నీతోనే పెళ్ళి జరిపాడు. ఈరోజు నేనీ స్థితిలో ఉన్నానంటే దానికి కారణం మా అన్నయ్యే...’’
‘‘మీ అన్నయ్య మిమ్మల్ని చదివించి ఉండొచ్చు. కానీ, మీకీ ఉద్యోగం ఇప్పించింది మాత్రం మా నాన్నగారే. ఆ సంగతి మర్చిపోయారా?’’ ఉక్రోషంగా అంది రోజా.
‘‘కానీ, మీ నాన్నగారు నాకీ ఉద్యోగం ఊరికే ఇప్పించలేదు. మేం కట్నం వదులుకుంటేనే ఉద్యోగం ఇప్పిస్తానని ఆయన పెళ్ళికి ముందే షరతు విధించాడు. దానికి అన్నయ్య ఒప్పుకున్నాడు. అన్నయ్య పట్టుబట్టి కట్నమే తీసుకుని ఉంటే ఆ డబ్బుతో నా చదువు కోసం చేసిన అప్పుల్ని తీర్చేసి, మిగతా డబ్బును తన పిల్లల చదువు కోసం ఖర్చుపెట్టుకునేవాడు. కానీ, ఆయన నా భవిష్యత్తు గురించి ఆలోచించాడు తప్ప, తన స్వార్థం చూసుకోలేదు. ఇప్పుడు డబ్బుల్లేక తన పిల్లల్ని గవర్నమెంటు స్కూల్లో చదివిస్తున్నాడు.’’
‘‘అందువల్ల మీ అన్నయ్య మీ దృష్టిలో దేవుడైపోయాడు. కానీ, ఆయన తన కష్టానికి తగిన ప్రతిఫలాన్ని దక్కించుకున్నాడు. మీ నాన్నగారి వ్యాపారంతోపాటు ఇల్లు కూడా తనే తీసుకున్నాడు. మీరు కష్టపడి చదివి ఉద్యోగం తెచ్చుకున్నారు కాబట్టి సరిపోయింది. లేకపోతే మీకాయన ఇంట్లోనూ వ్యాపారంలోనూ సగం వాటా ఇవ్వాల్సివచ్చేది.’’
‘‘ఆ ఇల్లు పెద్ద ఖరీదైనదేమీ కాదు. ఊరి చివర్లో ఉన్న పాత మట్టికొంప అది. పైగా దానిపై ఉన్న అప్పును అన్నయ్యే తీర్చాడు. ఇక వ్యాపారమంటావా... చిన్న బట్టల అంగడిలో వచ్చే ఆదాయం అన్నయ్య కుటుంబ పోషణకే
సరిపోదు’’ ఆవేదనగా అన్నాడు రాంబాబు.
‘‘మీ అన్నయ్య పరిస్థితి ఎలా ఉన్నా నాకు అనవసరం. మీరు మాత్రం అనంతపురం వెళ్ళటానికి వీల్లేదు’’ కరాఖండీగా చెప్పేసి వంటింట్లోకి వెళ్ళిపోయింది రోజా.
‘కుక్కతోక వంకర అన్నట్టు ఈ గయ్యాళికి ఎంత చెప్పినా తలకెక్కదు’ గొణుక్కుంటూ బాత్‌రూమ్‌లోకి దూరాడు రాంబాబు.

                        *

హైదరాబాదులోని ఓ ప్రైవేటు సంస్థలో పనిచేస్తున్న రాంబాబు సొంత ఊరు అనంతపురం. అతను ఆరో తరగతి చదివేటప్పుడు తండ్రి గుండెపోటు వల్ల మరణించాడు. అప్పుడతని అన్న హరిబాబు డిగ్రీ చదువుతున్నాడు. సోదరి పదో
తరగతిలో ఉంది. వస్త్ర వ్యాపారి అయిన రాంబాబు తండ్రికి ఓ పాత మట్టి ఇల్లు తప్ప మరో ఆస్తి లేదు. అద్దె షాపులో బట్టల వ్యాపారం చేసేవాడు. కుటుంబాన్ని పోషించే ఏకైక వ్యక్తి చనిపోవటంతో రాంబాబు కుటుంబం రోడ్డునపడే పరిస్థితి ఏర్పడింది. అప్పుడు హరిబాబు చదువు మానేసి తండ్రి వ్యాపారాన్ని కొనసాగించాడు. రేయింబగళ్ళు కష్టపడి పనిచేస్తూ కుటుంబాన్ని పోషించాడు. కొన్నాళ్ళకు అనారోగ్యంతో తల్లి కూడా చనిపోయింది. హరిబాబు అధైర్యపడకుండా తానే తల్లీ తండ్రిగా మారి చెల్లినీ తమ్ముణ్ణీ చదివించాడు. చెల్లెలి పెళ్ళి చేసేవరకూ తాను పెళ్ళి చేసుకోలేదు. రాంబాబుని ఎంబీఏ వరకూ చదివించాడు.
రాంబాబుకి ఇంకా ఉద్యోగం రాకముందే పెళ్ళి సంబంధాలు రావటం మొదలైంది. తమ కూతుర్ని పెళ్ళి చేసుకుంటే అయిదారు లక్షలు కట్నమిస్తామని కొందరు ప్రతిపాదనలు పంపసాగారు. అందులోని ఓ మంచి సంబంధాన్ని చూసి తమ్ముడి పెళ్ళి జరపాలనుకున్నాడు హరిబాబు. అంతలో రాంబాబు తను రోజాని ప్రేమించిన సంగతి బయటపెట్టాడు. దాంతో హరిబాబు అన్ని సంబంధాల్నీ వదులుకుని రోజాతోనే రాంబాబు పెళ్ళి ఖాయం చేశాడు. కానీ రోజా తండ్రి తను కట్నం ఇవ్వలేననీ, దానికి బదులు రాంబాబుకి ఉద్యోగం ఇప్పిస్తానన్నాడు. హరిబాబు దానికి ఒప్పుకుని పెళ్ళి జరిపాడు. తర్వాత రోజా తండ్రి రాంబాబుకి హైదరాబాదులోని ఓ ప్రైవేటు సంస్థలో ఉద్యోగం ఇప్పించాడు. అలా రాంబాబు హైదరాబాదులో స్థిరపడ్డాడు.
పెళ్ళయిన కొత్తలో రోజా బాగానే ఉన్నా రానురాను ఆమెలో మార్పొచ్చింది. తన తండ్రి అండతో ఉద్యోగం పొందిన భర్తపట్ల ఆమెలో చులకన భావం ఏర్పడింది. భర్తని తన చెప్పుచేతల్లో ఉంచుకోవాలని ప్రయత్నించసాగింది. ప్రతి నెలా భర్త జీతం రాగానే దాన్ని బ్యాంకులోంచి తీయించి తన దగ్గర ఉంచుకునేది. భర్త చేతిలో డబ్బు ఉంటే తన అన్న కుటుంబానికి సాయపడతాడని అనుమానించేది. రాంబాబు తన రోజువారీ ఖర్చులకు సైతం భార్య ముందు చెయ్యి చాచాల్సివచ్చేది. రాంబాబు ఎంత ప్రయత్నించినా భార్యలో మార్పు రాలేదు. దాంతో రాంబాబే మారాడు. అబద్ధాలు చెప్పటం నేర్చుకున్నాడు. ఏదో ఒక సాకుతో తరచుగా భార్య వద్ద డబ్బు
తీసుకునేవాడు. ఆమెకు తెలియకుండా మరో బ్యాంకు ఖాతాలో ఆ డబ్బు దాచేవాడు. అలా ఇంతవరకూ అతను రెండు లక్షలకు పైగా కూడబెట్టాడు.
ఆ డబ్బుతో అన్న కుటుంబానికి సాయపడాలనుకున్నాడు. కానీ, ఎన్నిసార్లు ప్రయత్నించినా అన్న హరిబాబు తమ్ముడి సాయాన్ని సున్నితంగా తిరస్కరించేవాడు. ‘నువ్వెంత ఎదిగినా నాకన్నా చిన్నవాడివిరా... నీ డబ్బు నేను తీసుకోకూడదు’ అనేవాడు. హరిబాబుకి అభిమానమెక్కువ. అందుకే ఎన్ని కష్టాలొచ్చినా తమ్ముడి సాయాన్ని స్వీకరించలేదు.
నేరుగా డబ్బు ఇవ్వబోతే అన్న తీసుకోడు కాబట్టి దొడ్డిదారిలో అన్నకు సాయపడాలనుకున్నాడు రాంబాబు. అలాంటి అవకాశం కోసమే ఎదురుచూస్తుంటే ఈరోజు ఉదయం అనంతపురం నుంచి రాంబాబు బాల్యమిత్రుడు ప్రకాష్‌ ఫోన్‌ చేసి చెప్పిన విషయం,
ఆ అవకాశాన్ని కల్పించింది. ‘‘ఒరేయ్‌ రాం, షాపు ఓనర్‌ మీ అన్నయ్య షాపుని ఖాళీ చేయించాడు. మీ అన్న మెయిన్‌రోడ్డులో పెద్ద షాపు తెరవాలనుకుంటున్నాడు. దానికోసం అయిదు లక్షలు కావాలి. అప్పుకోసం ఆయన మార్వాడీ రాధేశ్యాం చుట్టూ తిరుగుతున్నాడు. కానీ, రాధేశ్యాం అప్పు ఇవ్వటం లేదు’’ అన్నాడు ప్రకాష్‌.
వెంటనే రాంబాబు తన మనసులో ఉన్నమాట మిత్రుడికి చెప్పాడు. దానికి ప్రకాష్‌ సానుకూలంగా స్పందిస్తూ ‘‘అలాగే చేద్దాం. నువ్వు వెంటనే ఇక్కడికొచ్చెయ్‌’’ అన్నాడు.
రాంబాబు వెంటనే అనంతపురం వెళ్ళాలని నిశ్చయించుకున్నాడు. అయితే తను అన్న ఊరికి వెళుతున్నానని తెలిస్తే భార్య పెద్ద గొడవ చేస్తుంది. ఇల్లంతా పీకి పందిరేస్తుంది. అందుకే బెంగళూరు వెళుతున్నట్టు ఆమెకు అబద్ధం చెప్పాడు. ఆమెకు అనుమానం రాకుండా బెంగళూరుకే టికెట్‌ రిజర్వేషన్‌ చేయించాడు. భార్య అనుమాన పిశాచి.
ఒకవేళామె ఆఫీసుకి ఫోన్‌ చేసి వాకబు చేసినా తను బెంగళూరుకే వెళ్ళినట్టు చెప్పమని ఆఫీసులో తన కొలీగ్‌కి ముందే చెప్పి పెట్టాడు. ఇన్ని జాగ్రత్తలు తీసుకున్న తరవాత శుక్రవారం సాయంత్రం బెంగళూరు ట్రైన్‌ ఎక్కాడు.
అర్ధరాత్రి దాటాక ట్రైన్‌ అనంతపురం చేరుకుంది. రాంబాబు ట్రైన్‌ దిగి స్టేషన్‌ పక్కనే ఉన్న లాడ్జిలో బస చేశాడు. ఉదయం ప్రకాష్‌కి ఫోన్‌ చేయగానే అతను లాడ్జికి చేరుకున్నాడు.
తరవాత ఇద్దరూ కలిసి మార్వాడీ రాధేశ్యాం దగ్గరికి వెళ్ళారు. ప్రకాష్‌కి రాధేశ్యాం ముందే తెలుసు. అతను రాంబాబుని రాధేశ్యాంకి పరిచయం చేశాడు. రాంబాబు రాధేశ్యాంకి తన అన్న గురించి చెబుతూ ‘‘అన్నయ్య
నీతిమంతుడు. జీవితంలో చేసిన అప్పులన్నీ సక్రమంగా తీర్చాడు. మీరు నిస్సంకోచంగా అప్పు ఇవ్వండి. కావాలంటే ఆయనకు గ్యారంటీ నేనిస్తాను’’ అన్నాడు.
‘‘వడ్డీ వ్యాపారంలో సెంటిమెంట్లు పనిచేయవు. ఎంత మంచివారైనా బంగారమో, ఆస్తిపాస్తులో తాకట్టు పెడితేనే అప్పు దొరుకుతుంది. మీ అన్నయ్య అయిదు లక్షలు అప్పు కావాలన్నాడు. కానీ, ఆయనకున్న పాత ఇల్లు అంత విలువైనది కాదు, అందుకే అప్పు ఇవ్వలేదు.’’
‘‘మీరు మీ డబ్బు అన్నయ్యకి ఇవ్వనక్కర్లేదు. నేను అయిదు లక్షలు తెచ్చి మీ చేతికిస్తాను. దాన్ని మీ డబ్బుగా అన్నయ్యకు అప్పు ఇవ్వండి’’ అన్నాడు రాంబాబు.
రాధేశ్యాం ఆశ్చర్యపోయాడు. ‘‘మీరే నేరుగా డబ్బు ఇవ్వొచ్చు కదా?’’ అన్నాడు.
‘‘మా అన్నయ్య సంగతి మీకు తెలియదు. ఆయనకి అభిమానమెక్కువ. నేను డబ్బు ఇస్తే తీసుకోడు. అందుకే మీ ద్వారా ఇవ్వాలనుకుంటున్నాను. నేనిచ్చే అయిదు లక్షల్ని అన్నయ్యకి అప్పుగా ఇచ్చి ఆయన చేత ప్రామిసరీ నోటు రాయించుకోండి. అంతకుముందే మీరు కూడా నాకొక నోటు రాసివ్వండి. అన్నయ్య చెల్లించే కంతుల డబ్బుని నా బ్యాంకు ఖాతాలో వేసెయ్యండి.’’
‘‘దీనివల్ల నాకేం లాభం?’’ రాంబాబు మాటల్ని మధ్యలోనే అడ్డుకున్నాడు రాధేశ్యాం.
‘‘అన్నయ్య ఇచ్చే వడ్డీలో అరశాతం మీరు తీసుకోండి. అన్నయ్య అప్పు మొత్తం తీర్చేవరకూ మీకు వడ్డీ ముడుతూనే ఉంటుంది’’ రాంబాబు మాటలు వినగానే రాధేశ్యాం కళ్ళు మెరిశాయి. ఆ ప్రతిపాదనకు వెంటనే ఒప్పుకున్నాడు.

                        *

హైదరాబాదుకి తిరిగొచ్చాక రాంబాబు డబ్బు వేటలోపడ్డాడు. భార్యవద్ద లక్షలు మూలుగుతున్నా ఆమె చిల్లిగవ్వ కూడా ఇవ్వదని అతనికి తెలుసు. రాంబాబు బ్యాంకు ఖాతాలో రెండు లక్షలున్నాయి. మిగతా మూడు లక్షల్ని అతను రకరకాల మార్గాల్లో సేకరించాడు. ఇన్నాళ్ళూ తను ధరించకుండా అల్మారాలో దాచిన బంగారు చైను, ఉంగరాల్ని అమ్మేశాడు. తన జీవితబీమా పాలసీ మీద అప్పు తీశాడు. ఇంకా స్నేహితుల వద్ద కొంత అప్పు తీసుకున్నాడు. మొత్తంమీద అయిదు లక్షలు జమ చేశాక రాధేశ్యాంకి ఫోన్‌ చేసి అనంతపురంకి బయల్దేరాడు. ఈసారి కూడా ఆఫీసు పనిమీద బెంగళూరు వెళుతున్నట్టు భార్యకు అబద్ధం చెప్పాడు.
అనంతపురంలో ప్రకాష్‌తో కలసి రాధేశ్యాం దగ్గరికెళ్ళాడు. రాధేశ్యాంకి అయిదు లక్షలిచ్చి ప్రామిసరీ నోటు రాయించుకున్నాడు. రాధేశ్యాం వెంటనే హరిబాబుకి ఫోన్‌ చేసి ఇంటిపత్రాలు తీసుకుని తన దగ్గరికి రమ్మని పిలిచాడు. కాసేపట్లో హరిబాబు వచ్చాడు. అతని కంటపడకుండా రాంబాబు, ప్రకాష్‌లు పక్క గదిలో కూర్చున్నారు.
హరిబాబు రాధేశ్యాంకి ఇంటి పత్రాలు ఇచ్చాడు. రాధేశ్యాం వాటిని పరిశీలించాక ‘‘చూడు హరిబాబూ, నీ పాత ఇంటిపైన అయిదులక్షల అప్పు ఎవరూ ఇవ్వరు. అయితే, ఊర్లో నీకు మంచి పేరుంది. అందుకే ఇంటిని తాకట్టు కూడా పెట్టుకోకుండా ఇంటిపత్రాలు మాత్రమే నావద్ద ఉంచుకుని, నీకు అయిదు లక్షలు ఇస్తున్నాను. ప్రామిసరీ నోటుపైన సంతకం చేసి డబ్బు తీసుకెళ్ళు’’ అన్నాడు. హరిబాబు ఆనందంగా ప్రామిసరీ నోటు మీద సంతకం చేసి డబ్బు తీసుకుని వెళ్ళిపోయాడు. అన్న ముఖంలో ఆనందం చూసిన రాంబాబు తృప్తిగా ఊపిరి పీల్చుకున్నాడు.
రాంబాబు హైదరాబాదుకి తిరిగొచ్చాక రోజూ ప్రకాష్‌కి ఫోన్‌ చేసి అన్న వ్యాపారం గురించి తెలుసుకోసాగాడు. హరిబాబు తెరిచిన కొత్త అంగడికి పెద్దగా గిరాకీ లేదని తెలిసింది. నెల గడిచినా హరిబాబు అంగడి బాడుగ పదివేలు కట్టలేకపోయాడు. దాంతో అంగడి యజమాని అతన్ని చివాట్లు పెట్టాడని ప్రకాష్‌ చెప్పాడు. రాంబాబు అన్నని ఆదుకోవాలనుకున్నాడు.
‘‘ప్రకాష్‌, ఈరోజే నీ బ్యాంకు ఖాతాలో పదివేలు వేస్తాను. ఆ డబ్బుతో అన్నయ్యకు తెలియకుండా అంగడి బాడుగ కట్టెయ్‌. అన్నయ్య బాడుగ ఇచ్చేవరకూ తనని ఇబ్బందిపెట్టవద్దని అంగడి యజమానికి చెప్పు. అన్నయ్య బాడుగ ఇచ్చాక మా డబ్బు తిరిగి ఇమ్మను’’ అంటూ ప్రకాష్‌కి సూచించాడు. రాంబాబు ప్రకాష్‌ ఖాతాలో డబ్బు వేశాక అతను రాంబాబు చెప్పినట్టే చేశాడు. బాడుగ ముట్టడంతో అంగడి యజమాని హరిబాబుని ఇబ్బందిపెట్టలేదు. తర్వాత కొద్దిరోజులకు హరిబాబు బాడుగ చెల్లించాక ఆ డబ్బుని ప్రకాష్‌కి తిరిగి ఇచ్చేశాడు. రెండోనెల కూడా హరిబాబు బాడుగ కట్టడానికి ఇబ్బందిపడితే రాంబాబు మరోసారి ఇలాగే ఆదుకున్నాడు.
అయితే, ఇలా ఎంతోకాలం అన్నకు సాయపడటం సాధ్యంకాదని గ్రహించిన రాంబాబు వీలైనంత తొందరగా హరిబాబు కొత్త అంగడిలో వ్యాపారం పుంజుకొనేలా చెయ్యాలనుకున్నాడు. దానికో మార్గం కన్పించింది. వెంటనే ప్రకాష్‌కి ఫోన్‌ చేశాడు- ‘‘హోల్‌సేల్‌లో బట్టలు కొని, పల్లెలకు తీసుకెళ్ళి రిటైల్‌గా అమ్మే చిల్లర వ్యాపారస్థులెవరైనా నీకు తెలుసా?’’ అనడిగాడు.
‘‘మా అమ్మది పల్లెటూరే కదా... ఆమె ఊరికి చెందిన వీరేష్‌ అనే వ్యక్తి అదే వ్యాపారం చేస్తాడు. వాడు నాకు బాగా తెలుసు’’ అన్నాడు ప్రకాష్‌.
‘‘అలాగైతే ఆ వీరేష్‌తో ఒక ఒప్పందం చేసుకో. హోల్‌సేల్‌ అంగట్లో బట్టలు కొనే బదులు మా అన్నయ్య అంగట్లో బట్టలు కొనమను. హోల్‌సేల్‌ ధరకన్నా ఎక్కువ చెల్లించిన సొమ్ముని మేం తిరిగి ఇస్తామని చెప్పు. అంతేకాదు, అతని బస్సు ఛార్జీ, భోజనం ఖర్చుల్ని కూడా భరిస్తామని చెప్పు. అయితే, అతనీ సంగతి అన్నయ్యకి చెప్పకూడదు’’ అన్నాడు రాంబాబు.
‘‘ఇలా చేస్తే మీ అన్నయ్య వ్యాపారం పుంజుకుంటుందా?’’ సందేహం
వెలిబుచ్చాడు ప్రకాష్‌.
‘‘ఎంతోకొంత పుంజుకుంటుంది. ఇది దుబారా ఖర్చులా అన్పించినా... దీన్ని వ్యాపారాభివృద్ధి కోసం చేసిన ఖర్చుగానే భావించాలి’’ అన్నాడు రాంబాబు.
తరవాత రాంబాబు ఆలోచనని ప్రకాష్‌ అమలుచేశాడు. వీరేష్‌ చేత హరిబాబు అంగట్లో బట్టలు కొనుగోలు చేయించి అతను హోల్‌సేల్‌ ధరకన్నా ఎక్కువ చెల్లించిన డబ్బును తిరిగి ఇచ్చాడు. దాంతోపాటు అతని బస్సు ఛార్జీ, భోజనం ఖర్చులకు కూడా డబ్బు ఇచ్చాడు. ఇది లాభసాటిగా కనిపించడంతో వీరేష్‌ క్రమం తప్పకుండా హరిబాబు అంగట్లోనే బట్టలు కొనసాగాడు.
దీనివల్ల హరిబాబు వ్యాపారం కొద్దిగా పుంజుకుంది. ఇప్పుడతను సకాలానికి అంగడి అద్దె చెల్లించసాగాడు. అయితే రాధేశ్యాంకి మాత్రం ఏమీ కట్టలేకపోయాడు. తర్వాత రాంబాబు- ప్రకాష్‌ ద్వారా మరో ఇద్దరు చిల్లర వ్యాపారస్థుల్ని సంప్రదించి వారు కూడా హరిబాబు అంగట్లోనే కొనుగోళ్ళు జరిపేలా ఏర్పాట్లు చేశాడు. ప్రకాష్‌ ఖాతాలో అవసరమైనప్పుడల్లా డబ్బు వేయసాగాడు.
చివరికి రాంబాబు కృషి ఫలించింది.
చిల్లర వ్యాపారస్థులు తరచుగా కొనుగోళ్ళు చేస్తుండటంతో హరిబాబు అంగట్లో జనసందడి పెరిగింది. సహజంగానే జనసందడి ఉన్న దుకాణాలే కొత్త కొనుగోలుదార్లని ఆకర్షిస్తాయి. గిరాకీ రోజురోజుకీ పెరగసాగింది. దానికితోడు హరిబాబుకున్న మంచిపేరు వల్ల కూడా అంగడి నిత్యం జనంతో కళకళలాడసాగింది. వ్యాపారం బాగా పెరగటంతో హరిబాబు హోల్‌సేల్‌ వ్యాపారం కూడా మొదలుపెట్టాడు. ఇప్పుడు రాంబాబు- వీరేష్‌ లాంటి చిల్లర వ్యాపారస్థులకు ఎలాంటి రాయితీలూ ఇవ్వకపోయినా వారు హరిబాబు దగ్గరే బట్టలు కొనసాగారు.
మొత్తానికి ఎంబీఏ చదివిన రాంబాబు వ్యాపార సూత్రాల్ని పాటించి కొద్ది నెలల్లోనే తన అన్న వ్యాపారం ఎన్నో రెట్లు పెరిగేలా చేయగలిగాడు.

                        *

హరిబాబు వ్యాపారం దినదినాభివృద్ధి చెందుతున్నా అతను రాధేశ్యాంకి బాకీ తీర్చలేదు. ఇంకొన్నాళ్ళు గడువు ఇమ్మని కోరాడు. వచ్చిన లాభాన్ని వచ్చినట్టే మళ్ళీ పెట్టుబడి పెట్టి మరింత లాభాన్ని ఆర్జించసాగాడు. రాంబాబు రాధేశ్యాంకి ఫోన్‌ చేసి బాకీ కోసం అన్నపై ఒత్తిడి తీసుకురావద్దని కోరాడు.
ఇలా ఏడాదిన్నర గడిచాక ఓరోజు రాధేశ్యాం రాంబాబుకి ఫోన్‌ చేశాడు. ‘‘మీ అన్నయ్య బాకీ మొత్తం కట్టేశాడు. వెంటనే ఇక్కడికొచ్చి మీ డబ్బు తీసుకెళ్ళండి’’ అన్నాడు.
రాంబాబు వెంటనే అనంతపురం చేరుకుని ప్రకాష్‌తో కలిసి రాధేశ్యాం దగ్గరికెళ్ళాడు.
రాధేశ్యాంకి ప్రామిసరీ నోటు ఇచ్చేసి తన డబ్బు తీసుకున్నాడు. ఆ డబ్బు మొత్తం ఏడు లక్షలు ఉండటం చూసి ఆశ్చర్యపోయాడు. ‘‘పొరపాటున డబ్బు ఎక్కువ ఇచ్చినట్టున్నారు’’ అన్నాడు రాధేశ్యాంతో.
‘‘నేను సరిగ్గానే ఇచ్చాను. మీ అన్నయ్య ఏడాదిన్నర వడ్డీ ఒకేసారి చెల్లించాడు. నేను వద్దన్నా వినకుండా చక్రవడ్డీ వేసి ఇచ్చాడు’’ అన్నాడు రాధేశ్యాం.
‘‘వడ్డీలో అరశాతం మీకిస్తానన్నాను. అది లెక్కచేసి తీసుకోండి’’ అన్నాడు రాంబాబు.
‘‘ఈ వ్యవహారంలో నేను చేసిందేమీ లేదు. అందువల్ల మీ వడ్డీలో నేను కమీషన్‌ తీసుకోవటం న్యాయం కాదు’’ అన్నాడు రాధేశ్యాం. ఆ వడ్డీ వ్యాపారిలో వచ్చిన మార్పు చూసి రాంబాబు, ప్రకాష్‌లు ఆశ్చర్యపోయారు.
తరవాత ఇద్దరూ అతనికి ధన్యవాదాలు చెప్పి వెళ్ళిపోయారు. వారిద్దరూ బయటికెళ్ళగానే అంతవరకూ పక్కగదిలో కూర్చున్న హరిబాబు బయటికొచ్చాడు.
‘‘హరిబాబూ, నువ్వు కోరినట్టే నీ తమ్ముడిచ్చిన డబ్బుని చక్రవడ్డీతో సహా తిరిగిచ్చేశాను. అన్నట్టు... నీ తమ్ముడు రహస్యంగా నీకు సాయం చేస్తున్న సంగతి నువ్వెలా గ్రహించావ్‌?’’ కుతూహలంగా అడిగాడు రాధేశ్యాం.
‘‘రాధేశ్యాంగారూ, నా తమ్ముడు ఎంబీఏ చదివి ఉండొచ్చు. కానీ, నేను జీవితపాఠాలు చదివినవాణ్ణి. అందుకే ఈ విషయం గ్రహించాను. అయితే ఇది గ్రహించటానికి నాకు చాలా సమయం పట్టింది. మొదట నాకు అప్పు ఇవ్వటానికి నిరాకరించిన మీరే తరవాత పిలిచి అప్పు ఇవ్వటం చూసి అనుమానం కలిగినా, అదంతా నా నిజాయతీకి లభించిన గుర్తింపు అనుకున్నాను. తరవాత అంగడి యజమాని నాపట్ల చూపిన ఔదార్యం, చిల్లర వ్యాపారుల కొనుగోళ్ళు... నాకున్న మంచిపేరు వల్లనే జరుగుతున్నాయనుకున్నాను. హఠాత్తుగా ప్రపంచంలో మంచితనం పెరిగిందనిపించింది. కానీ, ఈ మంచితనం వెనుక నా తమ్ముడి ఎంబీఏ బుర్ర ఉందని తరవాత బోధపడింది. అయితే, ఆలోగా
నా వ్యాపారం పుంజుకుంది. నాకు ఇంతగా తోడ్పడిన నా తమ్ముడి డబ్బుని తొందరగా ముట్టజెప్పాలని పట్టుదలగా ప్రయత్నించి చివరికి ఈరోజు ఆ పని చేయగలిగాను. ఇప్పుడు నాకెంతో తృప్తిగా ఉంది. ఇక తమ్ముడు మీకిస్తానన్న అరశాతం వడ్డీ కూడా నేనే ఇస్తాను’’ అంటూ జేబులోంచి డబ్బు తీశాడు హరిబాబు. కానీ రాధేశ్యాం డబ్బు తీసుకోవటానికి నిరాకరించాడు.
‘‘హరిబాబూ, నీ దగ్గర నేను చిల్లిగవ్వ కూడా తీసుకోను. మీ అన్నదమ్ముల ఆత్మీయత చూసి నా కళ్ళు తెరుచుకున్నాయి. మీరిద్దరూ ఒకరికి తెలియకుండా మరొకరు సాయం చేసిన తీరు చూశాక ఈ ప్రపంచంలో అనుబంధంకన్నా గొప్ప సంపద మరొకటి లేదని నాకు అర్థమైంది. వ్యాపారంలో దెబ్బతిన్న నా తమ్ముణ్ణి నేనింతవరకూ పట్టించుకోలేదు. కానీ కష్టాల్లో ఉన్న మన ఆప్తుల్ని ఆదుకుంటే ఎంతటి ఆనందం లభిస్తుందో ఇప్పుడు నేను కళ్ళారా చూస్తున్నాను. ఈరోజే నా తమ్ముడికి చేతనైన సాయం చేస్తాను. మీలాగే నేను కూడా అనుబంధాల సంపదని పొందుతాను. నాకు కనువిప్పు కలిగించిన మీ అన్నదమ్ములిద్దరికీ నేను సదా రుణపడి ఉంటాను’’
ఉద్వేగంగా పలికాడు రాధేశ్యాం.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.