close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
శీతవేళ రంగులహేల!

శీతవేళ రంగులహేల!

శీతకాలం... తెలిమబ్బుతెరలూ, మంచుపూలవానలూ, హేమంతసమీరాలూ, వాటిని చీల్చుకుంటూ వచ్చే ఆదిత్యుని అరుణారుణ కిరణాలూ... ఆ వర్ణసోయగాన్ని వర్ణించతరమా! అందుకే అంతర్జాతీయ పాంటోన్‌ నిపుణుల బృందం, ఆ రంగుల్ని అందంగా ఒడిసిపట్టేసి చలికాలపు ఫ్యాషన్లకు తెరతీసిందిలా...

ప్రకృతికి రంగులంటే ఎంతిష్టమో... నింగీ నేలా, నీరూ నిప్పూ, చెట్టూ పుట్టా, కొండలూ గుట్టలూ, పక్షులూ పశువులూ... అన్నీ రంగురంగుల్లో అందాలవిందు చేస్తుంటాయి. అందులోనూ చలికాలంలో శీతలదేశాల్లోని చెట్ల ఆకులు పసుపూ నారింజా గులాబీ ముదురుగోధుమా, వంకాయ... ఇలా రకరకాల రంగుల్ని సంతరించుకుంటుంటాయి. ఆ వర్ణ విన్యాసంలోని కొన్ని ఛాయల్ని ఏరికోరి దుస్తుల్లోనూ యాక్సెసరీల్లోనూ చొప్పించేస్తుంటారు ఫ్యాషన్‌ మహాశయులు. అలా ఈ ఏడాది మనముందుకి వచ్చినవే ఈ చలికాలపు అందాల వర్ణాలు...

‘పచ్చని’ సోయగం 

గోల్డెన్‌ లైమ్‌... ఆకుపచ్చ వర్ణంలో పసుపు కలిసిన దీన్ని అసలు సిసలైన శీత వర్ణం అంటుంటారు ఫ్యాషనిస్టులు. నాచు ఆకుపచ్చ రంగు అనీ పిలుస్తారు. నలుపూ తెలుపూ పసుపూ నీలం... ఇలా ఏ రంగుతోనయినా ఇది చక్కగా జోడీ కట్టేస్తుంది. గులాబీ ఎరుపు రంగులయితే దీనికి అందమైన ఆపోజిట్‌ కలర్స్‌. కాబట్టి ఆ కాంబినేషన్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. ఆ రంగుల మేళవింపులో అమ్మాయిలంతా ప్రెట్టీక్వీన్సే. మరీ ప్రకాశవంతంగా ఉండని ఈ రంగుకి లేత పసుపు జోడిస్తే పచ్చని చెట్లకు విరిసిన పసుపు గన్నేరుపూల సోయగం నడిచొచ్చినట్లే ఉంటుంది మరి.

మనసుదోచే ‘నీలం’  

నేవీ పియోనీ(బ్లూ)... నమ్మకం, విశ్వాసం, నిబద్ధత, బాధ్యత, విజయం, సృజన, ఆత్మవిశ్వాసానికీ ప్రతిబింబమే ముదురు నీలం లేదా నేవీ బ్లూ. అందుకే ఇది అబ్బాయిల రంగుగా ముద్రపడిపోయింది. ఈ రంగు ధరించిన అబ్బాయిలు అమ్మాయిల్ని బాగా ఆకర్షించగలరన్న నమ్మకం ఉండనే ఉంది. అది చెరిపేందుకా అన్నట్లు ఇప్పుడు ఇది అమ్మాయిల ఫ్యాషన్లలోనూ చొరబడి, అందమైన ఆత్మవిశ్వాసానికి ప్రతీకలా వెలుగొందుతోంది. చూడ్డానికి ప్రశాంతంగా ఉండే ఈ రంగు, కెమెరా క్యాచింగ్‌ కలర్‌ కూడా. అందుకే ఈ రంగు డిజైనర్ల ఆల్‌టైమ్‌ ఫేవరేట్‌.

నులివెచ్చని ‘బచ్చలి’

టానీపోర్ట్‌... ఎరుపుశాతం ఎక్కువగా ఉండే ఈ ముదురు బచ్చలి వర్ణం అమ్మాయిలకే కాదు, అబ్బాయిలకీ నులివెచ్చని అందమే. అందుకే దీన్ని చలికాలపు రంగుల జాబితాలోకి చేర్చేశారు. కోట్లూ సూట్లూ బూట్లూ బ్యాగులూ అన్నీ ఈ రంగుల్లో పలకరిస్తుంటాయి. పైగా ఈ రంగుని వేసుకుంటే ఏదో తెలియని శక్తి మనలోకి ప్రవహిస్తుందట. ఇది పవిత్రతకీ ఆధ్యాత్మికతకీ కూడా చిహ్నమేనట. అంతేకాదు, అందంతోబాటు, రాజరికపు హోదానీ ప్రస్ఫుటిస్తుంటుందని సెలవిస్తుంటారు ఫ్యాషన్‌ నిపుణులు.

అందాల ‘నారింజ’

టమ్‌ మ్యాపల్‌... మంచుకురిసే వేళల్లో మనసును మైమరిపించే వైబ్రంట్‌ కలర్‌. ఇంకా చెప్పాలంటే కాస్త నల్లబడ్డ నారింజవర్ణం అని చెప్పవచ్చు. ఆకలిని పెంచడంలోనే కాదు, మెదడును చురుగ్గానూ ఉంచుతుందని పరిశోధనల్లోనూ తేలడంతో ఈ కాలంలో ఈ రంగే ఎక్కువగా ధరించమంటారు నిపుణులు. గోరువెచ్చని అందాలకు ప్రతీకగా పిలిచే ఈ రంగు దుస్తులు ఒంటిఛాయతో సంబంధం లేకుండా ఎవరికైనా చక్కగా నప్పేస్తాయి. కంటికీ ఎంతో హాయిగా ఉంటుంది. అబ్బాయిలు సైతం ఈ రంగులో హుందాగా కనిపిస్తారు. ఈ రంగుమీదకి ధరించే యాక్సెసరీలు అదే రంగు లేదా నలుపైతే బెటరన్నది ఫ్యాషనిస్టుల ఉవాచ.

నాజూకైన ‘గులాబీ’

బ్యాలె స్లిప్పర్‌... సున్నితత్వం తొణికిసలాడుతున్నట్లు ఉండే ఈ లేత గులాబీ రంగుకి ఏ అమ్మాయి అయినా ఫిదా కావాల్సిందే. లేలేత ఊదాను తలపించే ఈ రంగుకి మహారాణులయినా ముచ్చటపడాల్సిందే మరి. అందుకే ఏ ఫ్యాషన్‌ వేదికమీదయినా ఏదో ఒక ఛాయలో ఈ రంగు హొయలొలికిస్తుంటుంది. దీనికి నలుపో నేవీ బ్లూనో జోడిస్తే ఆ లుక్సే వేరు. అందుకే ఆధునిక, సంప్రదాయ దుస్తులతోబాటు యాక్సెసరీలూ చలికోట్లూ అన్నీ ఈ నాజూకు గులాబీ అందాలతో గుబాళిస్తూ అమ్మాయిల్ని ఆకర్షిస్తున్నాయి. శాండల్స్‌, గోళ్లరంగుల్లో అయితే ఈ రంగుకి తిరుగేలేదట.

మైమరిపించే ‘ఎరుపు’

గ్రెనాడిన్‌... పేరులో కొత్తస్వరం వినిపిస్తున్నప్పటికీ ఇది మనందరికీ తెలిసిన దానిమ్మ ఎరుపే. ప్రకాశవంతంగా మెరిసే ఈ రంగు, మునగదీసుకుని కూర్చున్నవాళ్లనయినా ఆ మూడ్‌లోంచి బయటపడేస్తుంది. అంతకన్నా ఎక్కువగా ఏ రంగువాళ్లకయినా చక్కగా నప్పేస్తుంది. సంప్రదాయం, ఆధునికం... మోడలేదయినా ఈ రంగు దుస్తులు ఒంటిమీద ఉంటే మీ బాయ్‌ఫ్రెండ్‌ మీనుంచి చూపుతిప్పుకోవడం కాస్త కష్టమే సుమా. అందుకేనేమో కాలంతో పనిలేకుండా అబ్బాయిలు అమ్మాయిలకిచ్చే బహుమతుల్లోనే కాదు, లిప్‌స్టిక్కుల్లోనూ ఈ రంగుదే హవా. చిక్కని ఈ ఎరుపురంగు దృఢమైన బంధానికీ వీడని అనుబంధానికీ కూడా ప్రతీకే.

మెరిసె... మెరిసె...

‘మెరీనా’ మెరీనా... దీన్ని ఎలక్ట్రిక్‌ బ్లూగానూ చెప్పవచ్చు. మసకవెలుతురుతో బిర్రబిగుసుకుపోయినట్లుండే చలికాలపు ఒంటిని మెరిపించే అందమైన రంగుల్లో ఒకటి మెరీనా. అందుకే తాజాదనాన్నీ ఒకరకమైన మెరుపునీ తీసుకువచ్చే వైబ్రెంట్‌ ఫ్యాషన్‌ కలర్‌గా దీన్ని భావిస్తారు డిజైనర్లు. అందుకే ర్యాంప్‌మీద యాక్సెసరీల్లోనయినా ఈ రంగుని చొప్పించేస్తుంటారు. దుస్తుల్లోనే కాదు, ఈ రంగు కార్లకీ తిరుగే లేదు. ఎండలో మెరిసే నీలిసాగరాన్ని తలపించే ఈ వర్ణం ఎంత దూరంలో ఉన్నా కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. అందుకే హ్యూండయ్‌, బీఎండబ్యూలు తమ కార్లకు మెరీనా పెయింట్‌ను వేసేందుకు పోటీపడుతున్నాయి. 

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.