close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
అతని కోసం ఊళ్లు కదిలాయి!

అతని కోసం ఊళ్లు కదిలాయి!

అత్యాచారం జరుగుతుంటే వీడియోలు తీసేవాళ్లూ, హత్యచేస్తుంటే ఫొటోలు తీసేవాళ్లను చూస్తుంటే మానవత్వం మంటగలిసిపోతోందా అనిపిస్తుంటుంది. కానీ తమ ఊరికి పొట్టపోసుకోవడానికి వచ్చిన ఓ వ్యక్తి ప్రాణం నిలబడాలంటే లక్షల రూపాయల సొమ్ముకావాలని తెలిసినప్పుడు మేమున్నామంటూ నిలబడ్డ పల్లెటూరి జనం గురించి వింటేమాత్రం అది బతికే ఉందన్న భరోసా వస్తుంది. ఓ నిరుపేదకు బతుకునిచ్చేందుకు రెండు ఊళ్లు

పోగుచేసింది ఏకంగా పదకొండు లక్షల రూపాయలు మరి!
ఆరోజుకు అన్నం తింటే చాలన్నట్టుంటుంది చిన్నాచితకా పనులు చేసుకునే వాళ్ల జీవితం. ఆ జానెడు పొట్ట కోసమే ఉన్న ఊరినీ కన్నవాళ్లనూ వదిలి ఏమాత్రం పరిచయంలేని ప్రాంతాలకు వలసలు వెళుతుంటారు. అలాంటి వాళ్లకు లక్షల రూపాయల ఖర్చయ్యే రోగాలు చుట్టుముడితే... బతుకు మీదే ఆశపోతుంది. అదే జరిగింది కేరళరాష్ట్రం కొట్టాయం జిల్లా చింగవనంలో జీవిస్తున్న నలభై అయిదేళ్ల కులతుపరంబిల్‌ జయన్‌కు. తమిళనాడు రాష్ట్రం నుంచి  ఈ ప్రాంతానికి వలస వచ్చిన అతను ఇరవై ఏళ్లుగా ఇక్కడే ఇస్త్రీ చేస్తూ బతుకుతున్నాడు. సుమారు ఏడేళ్ల నుంచి అతనికి మూత్రపిండాల జబ్బు ఉంది. అయితే ఆర్నెల్ల క్రితం అది మరీ ముదిరి జయన్‌ని మూలన పడేలా చేసింది. వారానికి రెండు సార్లు డయాలసిస్‌ చేస్తున్నా, పూర్తిగా కిడ్నీమార్చితేనే బతుకుతాడని డాక్టర్లు తేల్చారు. భార్య కిడ్నీ ఇస్తానన్నా, ఆ కిడ్నీని మార్చేందుకే కనీసం పదిలక్షల రూపాయల సొమ్ము కావల్సి వచ్చింది. ఇక, తను జీవించడం కష్టమనుకున్న  తరుణంలో, అతను నివసిస్తున్న ఊరివాళ్లే అతని ప్రాణాలు కాపాడేందుకు కదిలారు. అక్టోబరు 15న డబ్బా చేత్తో పట్టుకుని  ఇంటింటికీ తిరిగారు. అతని ప్రాణానికి మేమున్నామంటూ అండగా నిలిచారు. కేవలం ఐదు గంటల్లో మొత్తం పదకొండు లక్షల పాతికవేల రూపాయలను పోగుచేశారు.

అందరూ కదిలారు...
చింగవనంతో పాటు పల్లం అనే మరో ఊళ్లోనూ ఇస్త్రీ బండిని నడిపేవాడు జయన్‌. మాటలో సౌమ్యుడు. వేరే ఊరి నుంచి వచ్చినా ఎన్నో ఏళ్లుగా ఇక్కడి వాళ్లతో కలిసిపోయాడు. ఉన్నట్టుండి అతనికింత కష్టం రావడం వాళ్లందరికీ బాధ కలిగించింది. కేవలం డబ్బు లేకపోవడం వల్ల అతను చనిపోబోతున్నాడన్న విషయం వాళ్లను నిలబడనీయలేదు. అందరూ కలిసి ఏదో ఒకటి చేయాలని నిశ్చయించుకున్నారు. డబ్బు పోగేసేందుకు నెలరోజుల ముందు, ఆ రెండు ఊళ్లలోని ఐదుగురు ప్రజా ప్రతినిధుల సారథ్యంలో ‘జయన్‌ లైఫ్‌ సేవింగ్‌ సమితి’ని ఏర్పాటు చేశారు. అక్కడి క్రైస్తవ మత ప్రబోధకుడు ఫాదర్‌ సెబాస్టియన్‌ పున్నస్సేరి వీళ్లకు తోడుగా నిలిచారు. ‘పెద్ద మొత్తంలో డబ్బు అవసరమయ్యే ప్రాణాపాయం ఎవరికైనా ఎప్పుడైనా రావచ్చు, అలాంటప్పుడు వారికి సాధ్యమైనంత సాయం చేసి అండగా నిలబడటమే ఎవరి జీవితానికైనా సాఫల్యాన్నిచ్చే విషయం, అదే మానవత్వం కూడా, అందుకే జయన్‌ కోసం పెద్దమనసుతో డబ్బును దానం చేయండి’ అంటూ ఆయన ఆ ఊళ్ల ప్రజల్ని చైతన్యపరిచారు. ప్రజాప్రతినిధులూ, ఈయనా కలిసి రెండు ఊళ్లలో ఒక్కో ప్రాంతంలో జయన్‌ కోసమే సభలు ఏర్పాటుచేశారు. జనాన్ని పోగుచేశారు. ఊరంటే మనం మాత్రమే కాదు, మనకిష్టమైన వాళ్లూ, మనతోటివాళ్లూ అందరూ కలిసి మెలిసి ఉండటం, ఎవరికి కష్టమొచ్చినా ఒకరికొకరు సాయం చేసుకునేలాంటి బంధాలతో కలిసి ఉండటం అన్న మాటల్ని నూరిపోశారు. జయన్‌ అంటే చాలా మందికి ముందే బాగా అభిమానం. ఈ సమితితో అలాంటి వాళ్లంతా ఒక్కటయ్యారు. జయన్‌కోసం డబ్బు జమచేసేందుకు ఫలానా రోజు ఇంటింటికీ వస్తామంటూ ప్రచారం చేశారు. అక్టోబరు 15న అందరం కలిసి ఈ కార్యక్రమం చేద్దామంటూ పిలుపునిచ్చారు. సమితి సభ్యులంతా బృందాలుగా ఏర్పడి ఆ రోజు ఉదయం తొమ్మిది గంటల నుంచి రెండు గంటల దాకా డబ్బాలు చేత్తో పట్టుకుని ఆ రెండు ఊళ్లలోని ప్రతి ఇంటికీ తిరిగారు. ఆ రోజు వాళ్లంతా సుమారు రెండున్నర వేల గడపలు తొక్కారు. అలా, పదిలక్షలు అవసరమైన చోట పదకొండు లక్షల పాతికవేల రూపాయల్ని పోగుచేశారు. ఈ దానం చేసిన వాళ్లంతా ధనవంతులేం కాదు - మధ్యతరగతి ప్రజలూ, రైతులూ, నిరుపేద కూలీలూ. వీళ్లలో కూలీలను కనీసం ఒక్కరోజు వేతనం (రూ.500) సహాయంగా అందించమని అడిగింది సమితి. వాళ్లు సరేనన్నారు. ఈ డబ్బంతా జయన్‌ పేరు మీద బ్యాంకులో జమ చేశారు. మరికొద్ది రోజుల్లోనే అతనికి కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స జరగబోతోంది. పల్లెటూరి జనం వేసిన ఈ బాటలో మరిన్ని ఊళ్లు ప్రయాణించి మానవత్వపు పరిమళాలను వెదజల్లాలనీ, ఇలాంటి జయన్‌లు నిండు నూరేళ్లూ బతకాలనీ ఆశిద్దాం!

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.