close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
మీ కాలేజీలో ఎనేక్టజ్‌ ఉందా!

మీ కాలేజీలో ఎనేక్టజ్‌ ఉందా!

నేర్చుకోవడం అంటే కేవలం పుస్తకంలోని విషయాల్ని చదువుకోవడం, తరగతి గదిలో ఉండి ప్రపంచాన్ని ఊహించడం కాదు... సమాజాన్ని నేరుగా పరిశీలించడం, అక్కడి సమస్యలను పరిష్కరించడం అదే నిజమైన విద్య, అప్పుడే విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలూ మెరుగవుతాయి అంటోంది... ఎనేక్టజ్‌ అంతర్జాతీయ సంస్థ.

దైనా సమస్య పరిష్కారం కావాలంటే అక్కడ నాయకత్వం అవసరం ఉన్నట్టే. భారత స్వాతంత్య్ర పోరాటం ద్వారా గాంధీలోని గొప్ప నాయకుడు బయటకు వచ్చాడు. ఏ సమస్య పరిష్కారం అవ్వాలన్నా దానికి ఒక వ్యక్తో, బృందమో కృషి చేయాలి. ఇదే సిద్ధాంతం ఆధారంగా పనిచేస్తోంది enactus. కెనడా కేంద్రంగా పనిచేస్తున్న ఈ సంస్థకు ప్రపంచవ్యాప్తంగా 36 దేశాల్లో శాఖలు ఉన్నాయి. అందులో భారత్‌ ఒకటి. తాముండే ప్రాంతాల్లో ప్రజలు ఎదుర్కొనే సమస్యలకు ఓ వినూత్న పరిష్కారం చూపిస్తూ వారి ఆర్థిక అభివృద్ధికి సాయపడే ప్రాజెక్టులు చేపడుతున్న కాలేజీ, విశ్వవిద్యాలయాల విద్యార్థి బృందాలకు ఈ సంస్థలో సభ్యత్వం ఉంటుంది. అలాంటివారికి విద్య, వ్యాపార రంగాల్లోని నిపుణులచేత వ్యాపార సంస్థల నిర్వహణపైన శిక్షణా, మార్గనిర్దేశమూ అందుతాయి.

బిట్స్‌, హైదరాబాద్‌
మన దేశంలో బిట్స్‌ పిలానీ గోవా, దిల్లీ స్కూల్‌ ఆఫ్‌ ఎకనమిక్స్‌, గీతమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌, కొన్ని ఐఐటీలూ, మరెన్నో కాలేజీలకూ, విశ్వవిద్యాలయాలకూ ఎనేక్టజ్‌లో సభ్యత్వం ఉంది. బిట్స్‌ పిలానీ హైదరాబాద్‌కు చెందిన విద్యార్థులు తాము చేపడుతున్న ‘ప్రాజెక్టు వ్యంజన్‌’ ద్వారా దీన్లో స్థానం పొందారు. హైదరాబాద్‌ శివారులో ఉన్న బిట్స్‌ క్యాంపస్‌ చుట్టుపక్కల గ్రామాలకు చెందిన కుటుంబాల్లో పేదరికాన్ని చూసిన ఈ విద్యార్థులు వారి కోసం ఏదైనా చేయాలనుకున్నారు. మగవాళ్లంతా నగరానికి వెళ్లి ఏదో ఒక పనిచేసుకుంటూ ఉపాధి పొందుతుండగా, మహిళలు ఇళ్లకే పరిమితం కావడాన్ని వీరు గమనించారు. ఆ మహిళల్లో చాలామందికి వంటలో ప్రవేశం ఉంది. మరోవైపు కాలేజీలో విద్యార్థులంతా అమ్మ చేతి వంటకు దూరమయ్యారు. ఆ పక్కనే ఎందరో అమ్మలు వండటానికి సిద్ధంగా ఉన్నారు... విద్యార్థులకో ఆలోచన వచ్చింది. కొందరు మహిళల్ని ఎంపికచేసి వారిచేత తమ కాలేజీ క్యాంటీన్‌లో ప్రత్యేక కౌంటర్‌ తెరిపించారు. దాంతో విద్యార్థులకు ఇంటి తిండి అందినట్టూ, మహిళలకు ఉపాధి దొరికినట్టూ అయింది. తర్వాత కాలంలో ఆ మహిళలకు నిపుణులచేత కొత్త వంటకాల తయారీలోనూ శిక్షణ ఇప్పించారు. కాలేజీలో జరిగే ప్రతి ఫెస్ట్‌లోనూ వీరి స్టాల్‌ ఉండేలా యాజమాన్యాన్ని ఒప్పించారు.
ఈ మార్పులతో ఆ మహిళలు తమ ఊళ్లోనే ఉంటూ ఉపాధి పొందుతున్నారు. ప్రస్తుతం ‘ప్రాజెక్ట్‌ వ్యంజన్‌’లో భాగంగా మరికొన్ని చేతి వృత్తులవారికీ సాయం చేస్తున్నారు. వీరి సేవలకు మెచ్చి ‘వాల్‌మార్ట్‌’ కూడా సహకారం అందిస్తోంది. విశాఖపట్నంలోని గీతమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ విద్యార్థులు తమ క్యాంపస్‌కు సమీపంలోని ఒక గ్రామాన్ని ఎంపికచేసి స్థానిక యువతకు కంప్యూటర్‌ విద్యను బోధిస్తూ ఉపాధి అవకాశాల్ని పెంపొందిస్తున్నారు.

ప్రపంచకప్‌ మనదే...
ఎనేక్టజ్‌లో భాగంగా ఉన్న ప్రాజెక్టులకు ఏటా పోటీలు ఉంటాయి. ప్రతి దేశం నుంచీ ఒక సంస్థను జాతీయ ఛాంపియన్‌గా ఎంపికచేస్తారు. వీటిలోంచి ఒక సంస్థకు ప్రపంచకప్‌ని అందజేస్తారు. ఈ పోటీల్లో తమ ప్రాజెక్టుల గురించీ, వాటిద్వారా ఇప్పటివరకూ సాధించిన ప్రగతి గురించీ విద్యార్థులు వివరించాలి. ఏ ప్రాజెక్టయినా దీర్ఘకాలంలో విద్యార్థులు లేకుండానే మనుగడ సాగించేలా తీర్చిదిద్దడం అంతిమ లక్ష్యం. ఏటా 3500 మంది విద్యార్థులు ప్రపంచ సదస్సుకు హాజరయ్యే అవకాశం ఉంటుంది. 36 దేశాల్లోని 1700 విద్యాసంస్థలకు చెందిన 72వేల మంది విద్యార్థులు పోటీ పడిన 2017 ప్రపంచకప్‌ను భారత్‌ గెల్చుకుంది. సెప్టెంబరులో లండన్‌లో జరిగిన పోటీల్లో ‘షహీద్‌ సుఖ్‌దేవ్‌ కాలేజ్‌ ఆఫ్‌ బిజినెస్‌ స్టడీస్‌ దిల్లీ’ విద్యార్థులు  ఈ కప్‌ను అందుకున్నారు. ఈ కాలేజీ విద్యార్థులు చేపడుతున్న ప్రాజెక్టులు రాహత్‌, ఉడాన్‌లకు గానూ ప్రపంచకప్‌ అందింది. వీటిలో ఉడాన్‌ ద్వారా గ్రామీణ యువతకు, ముఖ్యంగా మహిళలకు కంప్యూటర్‌ విద్యలో శిక్షణ ఇచ్చి వారి ఉపాధి అవకాశాల్ని పెంచుతున్నారు. హర్యానాలోని ఝజ్జర్‌ జిల్లా కలోయి గ్రామంలో ఈ ప్రాజెక్టుని నిర్వహిస్తున్నారు. మున్ముందు మరిన్ని గ్రామాలకు సేవల్ని విస్తరించాలనేది వీరి ప్రణాళిక. రాహత్‌ ద్వారా దిల్లీలోని మూడు మురికివాడల్లో సామాజిక మరుగుదొడ్లని నిర్మించి పారిశుద్ధ్య ఆవశ్యకతపైన అవగాహన తెచ్చారు. ఈ రెండు ప్రాజెక్టులపైనా 34 మంది విద్యార్థులు పనిచేస్తున్నారు. విజేతకు ఫోర్డ్‌ సంస్థ రూ.35 లక్షల నగదు బహుమతిని అందించింది.

తమ తమ కాలేజీల్లో ఇలాంటి ప్రాజెక్టులు చేపడుతున్న విద్యార్థులెవరైనా ఎనేక్టజ్‌లో సభ్యత్వం పొందొచ్చు. ఎనేక్టజ్‌ ప్రయత్నం నచ్చిన విద్యావేత్తలూ, వాణిజ్యవేత్తలూ మార్గదర్శకులుగా ఉండాలనుకుంటే తమ వివరాల్ని enactus.org లో నమోదు చెయ్యవచ్చు.విద్యార్థులకు తాము నేర్చుకుంటూ, సమాజాన్ని మార్చే అవకాశాన్ని ఇస్తున్న ఎనేక్టజ్‌ ప్రయత్నం ఎంతైనా ప్రశంసనీయం.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.