close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
చెవిలో పూలు పెట్టారు..!

చెవిలో పూలు పెట్టారు..!

‘బాలి ద్వీపంలో నేను వెళ్లిన ప్రతిచోటా దైవాన్ని చూడగలిగాను’ అన్నారు రవీంద్రనాథ్‌ ఠాగూర్‌. అందుకే దాన్ని కళ్లారా చూడాలనుకుని ఆ ద్వీపంలో అడుగుపెట్టాం’ అంటూ ఆ వివరాలను మనతో పంచుకుంటున్నారు

హైదరాబాద్‌కు చెందిన కె.వి.ఎస్‌. జగదీశ్వరి.

కిన్నెర ఆర్ట్‌ థియేటర్స్‌, దిల్లీ తెలుగు అకాడమీ సభ్యులమైన మేం 43 మందిమి కలిసి బాలి చూడ్డానికి బయలుదేరాం. కౌలాలంపూర్‌లో దిగి అక్కడి నుంచి మరో విమానంలో బాలీకి చేరుకున్నాం. మాకు ఆతిథ్యం ఏర్పాట్లుచేసినవాళ్లు వెళ్లగానే దేవగన్నేరు పూలమాలలతో స్వాగతం పలికారు. అక్కడి నుంచి అందరం రెండు బస్సుల్లో ఎక్కి, కుటలోని జియా హోటల్‌కు బయలుదేరాం. దారిలో నాలుగురోడ్ల కూడలి ఎక్కడ వచ్చినా హిందూ దేవతల విగ్రహాలు ఉన్నాయి. శబ్ద కాలుష్యం లేదు. వాహనాలూ పాదచారులూ ఓ పద్ధతిలో వెళుతున్నారు. వీధులు కాస్త ఇరుగ్గానే ఉన్నప్పటికీ ట్రాఫిక్‌ నిర్వహణ తీరు బాగుంది. ఆటోలు ఎక్కడా కనిపించలేదు. అక్కడ ఇళ్లు చూస్తుంటే రవీంద్రనాథ్‌ టాగూర్‌ మాటలతోబాటు,. ‘అడుగుడుగున గుడి ఉంది... అందరిలో గుడి ఉంది’ అన్న దేవులపల్లి పాటా పెదవులపై కదలాడింది. ఎందుకంటే ప్రతి ఇల్లూ ఓ గుడిలానే అనిపించింది. రోడ్ల పక్కన కూడా దేవాలయాల్లో ఉండే ధ్వజ స్తంబాలు ఉన్నాయి. వాటిదగ్గరా నైవేద్యాలు పెడతారట. ఇంతలో మేం దిగాల్సిన హోటల్‌ వచ్చేసింది. అక్కడే మా ఐదు రోజుల మకాం.

ఎటు చూసినా దైవత్వమే...
ఈ అనంత విశ్వంలో మూడు లోకాలు ఉన్నాయి. అవి స్వర్గం, భువనం, నరకం అన్నది బాలి హిందువుల భావన. మార్కండేయుడు, అగస్త్యుడు, భరద్వాజుడు... వంటి రుషుల గురించి అక్కడి పాఠ్య పుస్తకాల్లోనూ ఉంటుంది. 2010 జనాభా లెక్కల ప్రకారం ఇండోనేషియాలో మొత్తం హిందువుల జనాభా 1.7 శాతం ఉంటే, బాలిలో 83.5 శాతం ఉందని తేలింది. అది ప్రస్తుతం 93 శాతానికి చేరిందట. అందువల్లే అక్కడ ఎక్కడ చూసినా హిందూ ధర్మమే కనిపిస్తుంటుంది. ప్రతి ఇంటి ఆవరణలోనూ కొంత స్థలాన్ని దేవుళ్లకోసం కేటాయిస్తారు. దాన్ని పుణ్యస్థలి అంటారు. దాన్ని చూస్తే ఓ గుడిలానే అనిపిస్తుంది. అక్కడ దుష్టశక్తుల్ని పారద్రోలే క్షేత్రపాలకుల బొమ్మలు ఉంటాయి. కానీ ప్రధాన దేవుళ్ల విగ్రహాలు ఉండవు. చిన్న సింహాసనం మాత్రం ఉంటుంది. అదే దైవస్థానం. అక్కడ నైవేద్యం ఉంచుతారు. ‘దుష్టశక్తులబారి నుంచి దైవం కాపాడతాడు’ అనేది బాలిలోని హిందువుల నమ్మకం.

కొంతమంది ఇళ్ల ద్వారాలమీద వినాయకుడి ప్రతిమలను ఉంచారు. రోడ్లమీదా ఇళ్లలోనూ ఉండే ప్రతిమలకు నలుపూ తెలుపూ గళ్లతో కూడిన వస్త్రాలను చుట్టారు. దేవాలయాల్లోనూ ఇళ్లలోనూ రోడ్లపక్కనా ఉన్న దైవస్థలాల్లో పెట్టే నైవేద్యాల అమరిక చాలా అందంగా ఉంది. లేత తాటాకులతో అల్లిన దోనెల్లో మందార, బంతి, దేవగన్నేరు పూలూ; అన్నం, పప్పు, పండ్లముక్కలు, బిస్కట్లు... వంటి ఆహార పదార్థాలనూ ఉంచారు.

రుద్రుడు, వినాయకుడు, వరుణుడు, విష్ణుమూర్తి, లక్ష్మీదేవి, రాముడు, సీత, సరస్వతి, కృష్ణుడు...  ఈ దేవుళ్లందరినీ వాళ్లూ కొలుస్తారు. రామాయణ, భారత కథలు వాళ్లకి ఆదర్శాలు. వేదాలు, ఉపనిషత్తులు, చతుర్విధపురుషార్థాలు, ఇలవేల్పులు, త్రికాల సంధ్య... వంటివన్నీ అక్కడ ఆచరణలో ఉన్నాయి. కుంకుమ ధరించరు. విభూతి, అక్షతలు పెట్టుకుంటారు. మగవారు ధోతీలూ ప్యాంటూ షర్టులూ ధరిస్తే, ఆడవాళ్లు లుంగీ, కుర్తీ వేసుకుంటారు.

బాలిలో చిన్నాపెద్దా దేవాలయాలను కలిపితే మొత్తం వెయ్యికి పైగా ఉంటాయట. వాటిల్లో కొన్ని ప్రధాన ఆలయాలనే చూశాం. ఇవన్నీ ఎనిమిది, తొమ్మిది శతాబ్దాలనాటివే. పదకొండో శతాబ్దంలో  పునర్నిర్మాణం జరిగాయట.

పవిత్ర జలదేవాలయం!
ముందుగా తంపక్‌సిరింగ్‌ జిల్లాలోని మనుకాయ గ్రామంలో ఉన్న జలదేవాలయాన్ని చూడ్డానికి వెళ్లాం. దీన్నే తీర్థ ఎంపల్‌ ఆలయం అనీ అంటారు. అక్కడ చాలా కోనేరులు ఉన్నాయి. వాటిల్లోకి దేవాలయంలోనే ఉన్న ఓ నీటి ఊట నుంచి పవిత్రజలం వస్తుందట. ఈ ఆలయం ఇంద్రుడి సృష్టి అనీ ఈ నీళ్లలో స్నానం చేసినా, తలపై జల్లుకున్నా పవిత్రత సిద్ధిస్తుందనీ వాళ్ల నమ్మకం. మేం కూడా అలాగే చేశాం. వీటిల్లోని నీళ్లన్నీ సమీపంలో ప్రవహించే తుకుద్‌ పకేరిసన్‌ నదిలో కలుస్తాయట.

తరవాత పెకాటు గ్రామంలోని ఉలువతు దేవాలయానికి వెళ్లాం. సముద్ర అలలు తాకుతున్న ఓ ఎత్తైన కొండ అంచుమీద కట్టిన దేవాలయం ఇది. ఉలు అంటే అంచు, వతు అంటే ఎత్తైన కొండ అనీ అర్థమట. ఆలయంలోపల ఉన్న ప్రధాన దైవం రుద్రుడు. అక్కడ పెద్ద శివలింగం ఉంది. పద్మాసన అనే ప్రార్థనాస్థలం కూడా ఉంది. దేవాలయం అంచులకు సముద్రపు అలల తాకిడి చూస్తుంటే ఆ అలలు నృత్యం చేస్తున్నాయా అనిపిస్తుంది. ఇక్కడ సూర్యాస్తమ దృశ్యం కూడా ఎంతో అందంగా ఉంటుందట. తరవాత ఉబుద్‌ గ్రామానికి బయలుదేరాం.

గజ గుహాలయం!
బెడలు గ్రామంలో గజా నదీ ప్రవాహ సమీపంలో ఓ గుహ ఉంటుంది. పచ్చని చెట్లూ రంగురంగుల పూలూ కోనేరూ దేవతా విగ్రహాలూ... ఇవన్నీ ఒక ఎత్తయితే, ఈ గుహ మరో విశేషం. గుహ ముఖ ద్వారం, చుట్టూ ఉన్న చెక్క శిల్పాలూ మన పాత జానపద చిత్రాల్లోని గుహల్ని గుర్తుకుతెచ్చాయి. గుహ లోపల ఓ వైపు వినాయకుడు, మరో వైపు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల విగ్రహాలు ఉన్నాయి. చిత్రమేమిటంటే అక్కడ ఏ గుడిలోనూ పూజారి ఉండడు.
తీర్థ ప్రసాదాలు అసలే ఉండవు. అన్ని  కాలాల్లోనూ పూజారులు దేవుడికి పూజ చేసి, నైవేద్యం పెట్టి వెళ్లిపోతారు. దేవాలయానికి వెళ్లే ప్రతీ వ్యక్తీ ధోతీ ధరించాలి. స్త్రీలు నడుముకు కాషాయరంగు వస్త్రాన్ని కట్టుకోవాలి.

మర్నాడు మేం పాండవబీచ్‌కు వెళ్లాం. దీనికి దగ్గరలో ఉన్న గుహల్లో కుంతీ దేవి, పంచపాండవుల విగ్రహాలు ఉన్నాయి. అరణ్యవాసంలో పాండవులు ఇక్కడ కొంతకాలం ఉన్నారని బాలివాసుల నమ్మకం. బాలిలో అత్యంత ముఖ్యమైన తనహ్‌ లాట్‌  దేవాలయం దగ్గర సూర్యాస్తమయం బాగుంటుందని చెప్పడంతో అటు వెళ్దామనుకున్నాం. కానీ వాతావరణం అనుకూలించక అది చూడలేకపోయాం.

ఎటుచూసినా ప్రకృతి అందాలే...
బాలిలో ఎక్కడ చూసినా పచ్చని చెట్లూ రంగురంగుల పూలూ కనువిందు చేస్తుంటాయి. సముద్రతీరాలు కూడా ఎంతో అందంగా ఉంటాయి. కింతామణి అనే అగ్నిపర్వతం ఈ ద్వీపానికే ప్రత్యేకత. వర్షం వల్ల ఆ ప్రాంతం అంతా పొగమంచు కమ్మేసినట్లుగా ఉంది. అయినా చూడ్డానికి ఎంతో అందంగా ఉంది. వెదురు గడలతో కట్టిన వంతెనలూ, రోడ్ల పక్కన చెక్కతోనూ రాతితోనూ చేసిన రకరకాల బొమ్మలూ, అందమైన వస్తువులతో కూడిన అక్కడి దుకాణాలూ సందర్శకుల్ని ఆకర్షిస్తుంటాయి. మాకు నచ్చినవి కొనుక్కున్నాం. వెండి నగిషీ వస్తువుల తయారీకి కూడా బాలి ద్వీపం ప్రసిద్ధి చెందింది. అవి కళ్లు చెదిరే అందాలతో మెరుస్తున్నాయి.

రామాయణ భారత కథలూ, ధర్మసంరక్షణకోసం పోరాడిన వారి గాథలూ, ప్రాచీన, ఆధునిక నాగరికతలు ప్రతిబింబించే అనేకానేక కార్యక్రమాలను బాలిలో విభిన్న రూపాల్లో నిత్యం ప్రదర్శిస్తుంటారు. మనదేశంలో వాల్మీకి రామాయణం ప్రాచుర్యంలో ఉంటే, అక్కడ కంబ రామాయణం ప్రసిద్ధి.. ఉలువతు స్టేడియంలో ప్రతిరోజూ రామాయణ జానపద నృత్య ప్రదర్శన చేస్తుంటారు. అది చూడ్డానికే ఒకరోజు పనిగట్టుకుని వెళ్లాం. అందులో సీతాపహరణం, లంకాదహనం... వంటి ఘట్టాలు ఆకట్టుకున్నాయి.

అక్కడి రామాయణంలో సీతాదేవి ఓ శక్తి స్వరూపం. లక్ష్మణరేఖ వృత్తాకారంలో ఉంటుంది. అందుకు సంకేతంగా గాయక గణం వృత్తాకారంలో కూర్చుని నోటితో  రకరకాల సంగీత శబ్దాలు చేస్తూ, దృశ్యానికి అనుగుణంగా కదులుతూ ఉన్నారు. ఏ విధమైన సంగీత వాద్యాలూ ఉపయోగించలేదు. ఆ వృత్తానికి మధ్యలో నర్తకులు నర్తించారు. ఈ ప్రదర్శనలో ముఖ్య విశేషమేమంటే- హనుమంతుడు ఒక ద్వారం నుంచి ప్రదర్శనా స్థలంలోకి దూకుతాడు. రావణ సైనికులు హాస్యగాళ్లుగా నటిస్తారు. లంకాదహనం, అగ్నివలయం... వంటి ఘట్టాలను హాస్యంగా చూపించడంతో అది అందరినీ ఆకట్టుకుంది.

ఆ తరవాత బరాంగ్‌ అండ్‌ క్రిస్‌ నృత్యం అనే మరో రూపకాన్ని చూశాం. అది ధర్మంకోసం అసురులతో చేసే పోరాటానికి సంకేతం. మేం వెళ్లినరోజున రంగడ అనే రాక్షసితో సహదేవుడు చేసిన పోరాటాన్ని  ప్రదర్శించారు. దానికి నేపథ్యంగా వాడిన డేంగ్‌డట్‌ సంగీతం మన హిందుస్థానీ  సంగీతాన్ని పోలి ఉండటం విశేషం.  తరవాత నూసాడువా బీచ్‌కి వెళ్లాం. అక్కడ జలక్రీడలూ, సాహసక్రీడలూ ఉన్నాయి. ఆసక్తికి అనుగుణంగా అందరం వాటిల్లో పాల్గొన్నాం. తరవాత బినోవా హార్బరులోని బౌంటీక్రూయిజ్‌కి వెళ్లాం. అది చాలా బాగుంది. నిర్వాహకులు మా చెవిలో దేవగన్నేరు పూలు పెట్టారు. అది వారి  సంప్రదాయంలో గౌరవసూచకం అట. అక్కడ దేవగన్నేరు పుష్పాలకు ఉన్న విలువ అంతా ఇంతా కాదనిపించింది.

ప్రముఖ నటరాజ రామకృష్ణగారి జన్మస్థలం కూడా బాలి. అది గుర్తుకు రాగానే ఆయన నాట్యకళారీతులు కళ్లముందు సాక్షాత్కరించాయి. ఆధ్యాత్మిక, వినోద, సాంస్కృతిక  కార్యక్రమాలతో సమయం ఇట్టే గడిచిపోయింది. తిరుగు ప్రయాణమయ్యే రోజు వచ్చేసింది. మేం వచ్చే ఆరోజు శ్రావణ పూర్ణిమ. అది బాలీలోని హిందువులకు ఎంతో  ముఖ్యమైన రోజు. పురుషులు ధోతీ చొక్కా తలపాగా టోపీ ధరిస్తే, స్త్రీలు లుంగీ, కుర్తీ, తలకు స్కార్ఫ్‌ ధరించారు. వాళ్లను చూస్తుంటే ఎంతో ముచ్చటగా అనిపించింది. చూడాలేగానీ బాలిలో ఎన్నో ప్రకృతి అందాలూ... హిందూ ఆలయాలూ...  అవన్నీ తిరగాలంటే మరోసారి రావాల్సిందే అనుకుంటూ వెనుతిరిగాం.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.