close
చలికాలంలో గ్లిజరిన్‌ ‘అందాలు’

గ్లిజరిన్‌దీ సినిమావాళ్లదీ విడదీయలేని అనుబంధం. పాత సినిమా హీరోయిన్లకయితే మరీ ఎక్కువ. ఒక్క ఏడుపు సీన్‌ చిత్రీకరించాలంటే బాటిళ్లకొద్దీ గ్లిజరిన్‌ కంట్లో నుంచి కారాల్సిందే. హీరోయిన్లతో కంటతడి పెట్టించేందుకే కాదు, ఎండిపోయినట్లున్న ఒంటిని తేమతో మృదువుగా మెరిపించాలన్నా ఆ గ్లిజరిన్‌ను రుద్దాల్సిందే మరి. అందుకే అది సబ్బు రూపంలోనూ రోజురోజుకీ కొత్తందాలను సంతరించుకుంటోంది. వేలకోట్ల రూపాయలతో మార్కెట్టును శాసిస్తోంది. ఒకప్పుడు ఒకటో రెండు కంపెనీలు మాత్రమే గ్లిజరిన్‌ సబ్బుల్ని తయారుచేసేవి. కానీ ఇటీవల అన్ని ప్రముఖ కంపెనీలూ అదే బాటలో నడుస్తూ సుతిమెత్తని గ్లిజరిన్‌ మెరుపుల్ని వెదజల్లుతున్నాయి.

అసలేమిటీ గ్లిజరిన్‌?
ఇది సహజమైన కర్బనపదార్థం. జంతువులు, మొక్కల కొవ్వు ఆమ్లాల్లో దొరుకుతుంది. రసాయన భాషలో చెప్పాలంటే ట్రైగ్లిజరైడ్స్‌ రూపంలోని కొవ్వు ఆమ్లాలన్నింటిలోనూ అంతర్లీనంగా ఉండేదే గ్లిజరిన్‌ లేదా గ్లిజరాల్‌. ఎక్కువగా సోయాగింజలు, పామాయిల్‌ వంటి శాకాహార నూనెలతోబాటు కొన్నిరకాల జంతుకొవ్వుల నుంచీ గ్లిజరిన్‌ను సేకరిస్తుంటారు. బయోడీజిల్‌ తయారీలో సహఉత్పత్తిగానూ లభ్యమవుతుంటుంది. కృత్రిమంగా కూడా రూపొందిస్తారు.

గ్లిజరిన్‌కి రంగు ఉండదు. వాసనా లేదు. తియ్యగా ఉంటుంది. అందుకే దీన్ని కుకీలూ కేకులూ ఇతరత్రా అనేక ఆహారపదార్థాల్లో స్వీటెనర్‌గానూ, ఇతర పదార్థాలను కరిగించే ద్రావణంగానూ తేమకోసమూ కూడా వాడతారు. మందుల తయారీలోనూ ఉపయోగిస్తుంటారు. ఇక, సబ్బులూ క్రీములూ లోషన్లూ మాయిశ్చరైజర్లూ... వంటి సౌందర్యోత్పత్తుల్లో అయితే సరేసరి. అన్నింట్లోనూ గ్లిజరిన్‌ పడాల్సిందే. ముఖ్యంగా గ్లిజరిన్‌ సబ్బుల్లో- గ్లిజరిన్‌ అధిక శాతంలో ఉండటంతో అవి శరీరాన్ని తేమగా మృదువుగా ఉంచుతాయని చెబుతుంటారు.

గ్లిజరిన్‌ను సబ్బు రూపంలోనే కాదు, ఏ రూపంలో వాడినా మంచిదే. అన్ని రకాల చర్మానికీ కూడా  మేలేనట. సున్నితమైన చర్మం ఉన్నవాళ్లకీ, మొటిమలూ దురదలతో బాధపడేవాళ్లకీ, తరచూ అలర్జీలు వచ్చేవాళ్లకీ, వృద్ధాప్య ముడతల నివారణకీ కూడా గ్లిజరిన్‌ మంచిదనీ దీన్ని ఒంటికి రాసుకోవడం వల్ల ఫలితం ఉంటుందనీ చర్మం సహజంగా ఉంటుందనీ డెర్మటాలజిస్టులు చెబుతుంటే; ఇది పెదాలూ మడమల పగుళ్లనీ తగ్గిస్తుంది. కొంతవరకూ సన్‌స్క్రీన్‌లానూ పనిచేస్తుంది. నెయిల్‌పాలిష్‌ను రిమూవర్‌తో తుడిచాక గ్లిజరిన్‌తో ఓ కోటింగ్‌ వేస్తే గోళ్లు పగిలిపోకుండా ఉంటాయి. దీన్ని ఒంటికి రాయడం వల్ల చర్మం మృదువుగా ఉంటుందని సౌందర్యనిపుణులు చెబుతుంటారు.

ఇన్ని మంచి లక్షణాలతోబాటు గాజులా మెరిసే పారదర్శక గుణం కూడా ఉండటంవల్లే గ్లిజరిన్‌ను అందమైన సబ్బుల రూపంలోనూ తయారుచేస్తూ వినియోగదారుల్ని ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నాయి సబ్బుల కంపెనీలు. దాంతో చాలామంది చర్మం పొడిబారిపోకుండా ఉంటుందన్న కారణంతో చలికాలాన్ని గ్లిజరిన్‌ సబ్బుబిళ్లతో ఆహ్వానిస్తుంటారు.

గ్లిజరినే ఎందుకు?
సాధారణ సబ్బులతో పోలిస్తే గ్లిజరిన్‌ సబ్బుల్లో క్షారగుణం తక్కువ. ఇంకా చెప్పాలంటే, శాకాహార లేదా జంతువుల కొవ్వునూనెలకు లవణాల(క్షారాల)ను కలిపి చేసేదే సబ్బు. అలాకాకుండా గ్లిజరిన్‌కి పాలీగ్లైకాల్‌ రూపంలోని ఆల్కహాల్‌నూ పరిమళ తైలాలనూ చేర్చి చేసేదే గ్లిజరిన్‌ సోప్‌. అందుకే ఇది మిగిలినవాటికి భిన్నంగా పారదర్శకంగా మెరుస్తూ ఉంటుంది. అయితే ఇటీవల ప్రముఖ కంపెనీలు చర్మం పొడిబారిపోకుండా కోమలంగా ఉండేందుకు  ఇతరత్రా పదార్థాలతోనూ సబ్బుల్ని తయారుచేస్తున్నాయి. అయితే అవేవీ పారదర్శకంగా ఉండవు. అందుకే చలికాలంలో అనేకమంది గ్లిజరిన్‌ అందాల పట్ల ఆకర్షితులవుతుంటారు.

గ్లిజరిన్‌కు గాలి నుంచి నీటిని పీల్చుకునే గుణం ఉంటుంది. దాంతో ఆ సబ్బుతో రుద్దాక అది చర్మంమీద ఓ పొరలా అతుక్కునే ఉండి, గాల్లోని తేమను పీల్చుకుని చర్మం పొడిబారిపోకుండా చేస్తుంది. పైగా చలికాలంలో వాతావరణంలో తేమ ఉండదు. దాంతో మన చర్మం నుంచి కనిపించకుండా నీరంతా ఆవిరైపోతుంటుంది. చెమట పట్టడం లేదు కదా చర్మానికి డీహైడ్రేషన్‌ లేదనే అనుకుంటాం. దాంతో చర్మం సహజంగానే మృదుత్వాన్ని కోల్పోయి, పొడిబారి పగిలినట్లుగా అవుతుంది. అందుకే ఆ కాలంలో  క్షారగుణం అత్యంత తక్కువగా ఉండే గ్లిజరిన్‌ సబ్బులు వాడమనీ, వాటిల్లోనూ సహజనూనెలతో తయారయ్యేవి చర్మాన్ని మరింత కోమలంగా ఉంచుతాయని చర్మనిపుణులూ చెబుతుంటారు. దానికితోడు ఇటీవల కాలంతో పనిలేకుండా ఇంటాబయటా ఏసీలే. ఇక, ఒంటిమీద చెమటచుక్కకి స్థానమెక్కడ... దాంతో అన్ని కాలాల్లోనూ గ్లిజరిన్‌ అందాలనే కోరుకుంటోంది నేటి తరం. ఫలితం... గ్లిజరిన్‌ సబ్బుల్ని రకరకాలుగా తయారుచేస్తూ వినియోగదారుల్ని ఆకర్షిస్తున్నాయి సదరు కంపెనీలు.

కవితకే కాదు, ‘కాదేదీ కళకనర్హం’ అన్నట్లు గ్లిజరిన్‌ సబ్బుబిళ్లనీ కళ కట్టించేవాళ్లూ ఉన్నారు. పూలూ పండ్లూ జంతువులూ ఇలా రకరకాల ఆకారాల్లోనూ నియాన్‌ రంగుల్లోనూ గ్లిజరిన్‌ సబ్బు మిలామిలా మెరుస్తోంది. అంతేనా... మిగిలిన సబ్బుల్లో మాదిరిగానే రకరకాల పండ్లరసాలనీ ఔషధమొక్కల పొడుల్నీ పూలరేకుల్నీ జోడించి మరీ గ్లిజరిన్‌ సౌందర్యానికి మెరుగులు దిద్దుతున్నారు. పారదర్శకతే దాని అసలైన అందంగా భావించి బొమ్మల్నీ పండ్లముక్కల్నీ పూలనీ ఆకుల్నీ... ఇలా అనేక వస్తువుల్ని చొప్పించి, అటు పిల్లల్నీ ఇటు పెద్దల్నీ కూడా ఆకట్టుకుంటోంది ఈనాటి గ్లిజరిన్‌ సోపు. సో... ఇదండీ గ్లిజరిన్‌ కథాకమామీషు..!

ఈ సబ్బులు... ఖరీదైన సోకులు! 

లూస్‌ గోల్డ్‌ సోప్‌... ఈ పేరు ఎప్పుడైనా విన్నారా... అవకాశమే లేదు. ఎందుకంటే ఇది అందరూ రుద్దుకోగలిగేది కాదు, ప్రపంచంలోనే ఖరీదైన గ్లిజరిన్‌ సోపట. అచ్చంగా గ్లిజరిన్‌తో చేసిన ఈ హ్యాండ్‌మేడ్‌ సబ్బు, గాజును మరిపించే పారదర్శకతతో మెరుస్తుంటుంది. దీన్ని రుద్దుకుంటే, పూరేకులు సైతం నివ్వెరబోయే కోమలత్వం సొంతమవుతుందో లేదో తెలీదుకానీ, అది అరిగేకొద్దీ బంగారం మాత్రం వరిస్తుంది. అందులో 31 గ్రా. పరిమాణం గల పసిడి నాణెం ఉంటుంది. అయితే దీనికన్నా ఖరీదైన సబ్బు ఒకటుంది... బంగారం, వజ్రాల పొడులకు తేనెను చొప్పించి చేసిన ఈ సబ్బును ఖతార్‌ రాజకుటుంబానికి బహుమతిగా ఇచ్చేందుకు లెబనాన్‌కు చెందిన బాదర్‌ హసోన్‌ అండ్‌ సన్స్‌ కంపెనీ తయారుచేసిందట. 160 గ్రా. ఈ సబ్బు ధర సుమారు 2 లక్షల రూపాయలు.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.