close
మార్గశిర మాహాలక్ష్మి!

మార్గశిర మాహాలక్ష్మి!

వీసమెత్తు బంగారం కొనుక్కున్నా, ఆస్తిపాస్తులు కలిసొచ్చినా, ఉద్యోగం వరించినా, పెళ్లి సంబంధం కుదిరినా, సంతానం కలిగినా... అదంతా అమ్మ అనుగ్రహంగానే ఆ ప్రాంతవాసులు భావిస్తారు. ఈ భక్తిభావనే అమ్మపట్ల వారికున్న అచంచలమైన విశ్వాసాన్ని వెల్లడిస్తోంది. పిలిస్తే పలికే తల్లిగా, కోరిన వరాలను తీర్చే కనకమహాలక్ష్మిగా భక్తులు అమ్మవారిని ఆరాధిస్తారు. గర్భాలయం, ప్రత్యేక మందిరం లాంటి ఏర్పాట్లు లేకుండా బహిరంగ మండపంలో కొలువుదీరిన అమ్మరూపం కడు రమణీయం.

‘లక్ష్మీ ర్భూషయతే రూపం, లక్ష్మీ ర్భూషయతే కులమ్‌, లక్ష్మీ ర్భూషయతే విద్యాం, సర్వా లక్ష్మీ ర్విశిష్యతే...’ అంటూ శంకర భగవానుడు స్తుతించినా, ‘కలశాబ్ధి కూతురట గంభీరాలకే మరుదు, తలపలోక మాతయట దయ మరి ఏమరుదు...’ అంటూ అన్నమాచార్యులు కీర్తించినా అవన్నీ అమ్మ విశిష్టతను తెలిపేవే. అంతటి మహిమగల తల్లి విశాఖపట్నంలోని బురుజుపేట ప్రాంతంలో కనకమహాలక్ష్మిగా ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్యదైవంగా భాసిల్లుతోంది.

స్థలపురాణం
పూర్వం విశాఖనగరాన్ని పాలించిన రాజులు అమ్మవారిని వైశాఖేశ్వరి పేరుతో కొలిచేవారు. వీరితోపాటూ కళింగరాజులూ కనక మహాలక్ష్మిని ఆరాధించేవారనీ, మొక్కులూ, కానుకలూ చెల్లించేవారనీ స్థలపురాణాలు తెలియజేస్తున్నాయి. విశాఖ రాజుల కోటబురుజు ఈ ప్రాంతంలోనే ఉండేదనీ అది కాలక్రమేణా బురుజుపేటగా స్థిరపడిందనీ ఇక్కడివారు చెబుతారు. ఓసారి కొందరు శత్రు రాజులు వైశాఖీరాజ్యం మీద దండెత్తినప్పుడు తమ ఇలవేల్పును వారికి దొరక్కుండా ఉంచడం కోసం వైశాఖేశ్వరి విగ్రహాన్ని పక్కనే ఉన్న బావిలో పడేశారు. ఈ క్రమంలో అమ్మవారి వామహస్తం విరిగిపోయింది. కొంతకాలం తర్వాత అమ్మవారు ఒక భక్తురాలి కలలో కనిపించి, ‘నేను కనకమహాలక్ష్మీదేవిని.
ఈ బావిలో ఉన్నాను. నన్ను బయటకు తీసి, గుడి కట్టించమని’ ఆజ్ఞాపించింది. ఆ భక్తురాలు బావి దగ్గరకు వెళ్లి చూసేసరికి దివ్యకాంతులు కనిపించాయి. దాంతో తనకు వచ్చింది కల కాదనీ అది కనకమహాలక్ష్మి అమ్మవారి ఆజ్ఞనీ భావించిన ఆ భక్తురాలు విగ్రహాన్ని బయటకు తీసి గుడిని ఏర్పాటు చేసిందని భక్తులు చెబుతారు.

ఒకప్పుడు ఇరుకు వీధులతో ఉండేదీ ప్రాంతం. 1917వ సంవత్సరంలో వీధి వెడల్పు చేసేందుకు విశాఖ మున్సిపాలిటీ అధికారులు ఈ విగ్రహాన్ని మూలస్థానం నుంచి 30 అడుగుల దూరం జరిపించారు. అదే సమయంలో ఈ ప్రాంతంలో ప్లేగు వ్యాధి ప్రబలి, ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోడంతో విశాఖ వాసులు భయభ్రాంతులకు గురయ్యారు. ఇదంతా అమ్మవారి విగ్రహాన్ని కదిలించడం వల్లే జరిగిందని భావించిన ప్రజలు ఆ విగ్రహాన్ని తిరిగి యథాస్థానంలో ప్రతిష్ఠించారట. దాంతో ప్లేగు వ్యాధి తగ్గి ప్రజలు ఆరోగ్యవంతులయ్యారనీ, ఇదంతా కనక మహాలక్ష్మి
మహిమేననీ పూర్వీకులు చెబుతారు.

గోపురం లేని ఆలయం..
శతాబ్దాల చరిత్ర ఉన్న ఈ ఆలయానికి గోపురం లేదు. గతంలో ఎన్నోసార్లు గోపురాన్ని నిర్మించడానికి ప్రయత్నించినా ఏవేవో ఆటంకాలు ఎదురయ్యేవి. దాంతో అమ్మవారి అభీష్టం మేరకు బహిరంగ మండపంలో ఉంచి, పూజాదికాలనూ, ఉత్సవాలనూ సంప్రదాయబద్ధంగా నిర్వహిస్తున్నారు. ఆలయానికి వచ్చిన భక్తులు ఎవరికి వారే సిరుల తల్లిని పసుపు, కుంకుమలతో
పూజించడం ఈ ఆలయం ప్రత్యేకత. పసిబిడ్డలనూ, కొత్తగా కొన్న బంగారాన్నీ మొదట కనకమహాలక్ష్మి వద్దకే తీసుకురావడం పూర్వం నుంచీ వస్తున్న ఆనవాయితీ.

మార్గశిరంలో విశేష ఉత్సవాలు...
కనకమహాలక్ష్మి అమ్మవారికి ఏటా మార్గశిర మాసంలో విశేష ఉత్సవాలు నిర్వహిస్తారు. మార్గశిర గురువారం చల్లని తల్లికి అత్యంత ప్రీతిపాత్రమైనదనీ, ఆ రోజున అమ్మను దర్శించుకుంటే సకల శుభాలూ చేకూరుతాయనీ భక్తుల విశ్వాసం. అందుకే మార్గశిర మాసంలో ప్రతి బుధవారం రాత్రి 12 గంటల నుంచే నాదస్వర వాయిద్యాలూ, వేద మంత్రాలతో శ్రీలక్ష్మికి అభిషేకాలూ, కుంకుమ పూజలూ ప్రారంభమవుతాయి. ఈ ప్రక్రియల అనంతరం అమ్మవారి దర్శనం ఓ సంబరంలా కొనసాగుతుంది. ఆలయంలో రథోత్సవ వేడుకను కన్నుల పండగగా నిర్వహిస్తారు. శ్రావణమాసంలో మంగళ, గురు, శుక్రవారాలూ, పూర్ణిమ తిథి లాంటి పర్వదినాల్లో మహిళలు పెద్దసంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలూ, నోములూ, వ్రతాలూ నిర్వహిస్తారు. తిరుపతిలో మాదిరిగానే ఇక్కడ కూడా అమ్మవారికి అష్టదళ సువర్ణ పద్మారాధన జరుగుతుంది. ఆకుపచ్చని వస్త్రాలు ధరించి భక్తులు మాలధారణ చేపడతారు. దసరా శరన్నవరాత్రుల్లో మూలవిరాట్‌కు ప్రత్యేక పూజలూ జరుగుతాయి. వీటిలో పాల్గొనడానికి ఇతర రాష్ట్రాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు వస్తుంటారు.

ఇలా చేరుకోవచ్చు...
ఈ ఆలయానికి రెండు కిలోమీటర్ల దూరంలో రామకృష్ణా బీచ్‌, అయిదు కిలోమీటర్ల దూరంలో కైలాసగిరి, పదిహేను కిలోమీటర్ల దూరంలో సింహాచలం లాంటి ప్రసిద్ధ పర్యటక ప్రదేశాలు ఉన్నాయి. విశాఖ చేరుకోవడానికి రైలు, రోడ్డు, వాయు మార్గాలు అందుబాటులో ఉన్నాయి. బస్‌స్టాండ్‌, రైల్వేస్టేషన్ల నుంచి కనకమహాలక్ష్మి అమ్మవారి ఆలయం మీదుగా ప్రయాణించే బస్సు ప్రతి పది నిమిషాలకొకటి సిద్ధంగా ఉంటుంది.

- బొద్దల పైడిరాజు, ఈనాడు డిజిటల్‌, విశాఖపట్నం
ఫొటోలు: బి.గోపీకృష్ణ

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.