close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
అవగాహన

అవగాహన
- అద్దేపల్లి సుచిత్రాదేవి

‘‘శ్రుతీ, చెప్పేది జాగ్రత్తగా విను తల్లీ. ఇప్పుడు నీకు పెళ్ళయింది. ఇక బాధ్యతగా మెలగాలి. ఇంకా చిన్నపిల్లలా అక్కడ ఎలా అంటే అలా మాట్లాడేయడం, మొండిగా ఉండడం చేయకూడదు, సరేనా!?’’ మొదటిసారిగా అత్తగారింటికి వెళుతున్న గారాల కూతురికి సూట్‌కేసులు సర్దుకోవడంలో సాయం చేస్తూ అంది సరిత.
‘‘అబ్బ, ఎన్నిసార్లు చెప్తావు... పొద్దున్నే లేవాలి, అత్తకి పనుల్లో హెల్ప్‌ చేయాలి, విశాల్‌ పనులన్నీ నేనే చూసుకోవాలి. నగలు తీస్తే డ్రెస్సింగ్‌ టేబుల్‌ మీదా, బట్టలు మంచంపైనా పడేయకూడదు. అన్నీ జాగ్రత్తగా బీరువాలో పెట్టుకోవాలి... ఎట్‌సెట్రా, ఎట్‌సెట్రా - ఇవే కదా
నీ లిస్టు - అలాగేలే. అయినా నేనేమైనా టీవీ సీరియల్స్‌లో వచ్చే అత్తగారిళ్ళ లాంటి ప్లేసుకెళుతున్నానా? భాను అత్త దగ్గరకే కదా... అన్నీ తను చూసుకోదా?’’ తేలిగ్గా అనేసింది శ్రుతి.
‘‘అదేమరి, భానత్తని ఎప్పటిలా నీ మేనత్త అనే చూడకు. తను నీకిప్పుడు అత్తగారు. ఆమెకిచ్చే మర్యాద ఆమెకివ్వాలి.’’
ఈసారి తల్లి వంక కాస్త ఆశ్చర్యంగా చూసింది శ్రుతి.
‘‘బావతో పెళ్ళయినంత మాత్రాన భానత్త మన అత్త కాకుండా పోతుందా? అంటే ఏంటీ, చిన్నప్పటినుంచీ ఉన్న అలవాటు మానుకుని, ఇప్పుడు నేను అత్తయ్యగారూ, మామయ్యగారూ అని పిలవాలా? పొద్దున్నే లేచి కాఫీ టిఫిన్లన్నీ చేసి వాళ్ళని నిద్రలేపాలా? మాధురి అక్కవాళ్ళింట్లోలాగా, వాళ్ళముందు సోఫాలో
కూర్చోనుకూడా కూర్చోకూడదా? ఇంకా...’’
విసుగ్గా అరుస్తున్న కూతుర్ని ‘‘ఇష్‌, ఇష్‌’’ అంటూ ఆపింది సరిత- ఎవరైనా ఆ మాటల్ని విన్నారా అన్నట్లు గది బయటకు చూస్తూ.
‘‘ఇదిగో, ఇదే... అన్నింటికీ ఇలా విసుక్కుని ఇంత పెద్ద గొంతుతో అరవకూడదు. మరీ అంత ఓవర్‌ యాక్షన్‌ అక్కర్లేదు కానీ, పెళ్ళయిన తర్వాత కాస్త మారాలి అంటున్నాను’’ చిరుకోపంతో అంది సరిత.
‘‘మాధురి అక్క విషయం వేరు. వాళ్ళ
అత్తగారి అత్తగారు కూడా ఉన్నారాయింట్లో. పెద్ద ఉమ్మడి కుటుంబం, ఏవో పాత పద్ధతులు. అలానే ఉంటుంది నీక్కూడా అని చెప్పడం లేదు నేను. కానీ, ఎంత మేనత్త అయినా నువ్వు ముందులా చిన్నపిల్లలా కాకుండా కాస్త పద్ధతిగా ఉండాలీ అంటున్నా.’’
తను చెబుతున్నది సీరియస్‌గా తీసుకోకుండా తనపాటికి తను బట్టలు సర్దుకుంటున్న
కూతురికి ఎలా చెప్పాలో అర్థంకాలేదు సరితకి. కాస్త ఆలోచించుకుని దగ్గరకెళ్ళి శ్రుతి చేతిలోని డ్రెస్సు అందుకుని పక్కనపెట్టి చేయి పట్టుకుని తీసుకొచ్చి మంచం మీద కూర్చోపెట్టి తనూ పక్కనే కూర్చుని అడిగింది- ‘‘శ్రుతులూ, నీకు నా స్నేహితురాలు రాధ తెలుసు కదా?’’
‘‘నీ బెస్ట్‌ ఫ్రెండు... తిరుపతిలో ఉంటారు, ఆవిడేనా?’’
‘‘అవును. మా ఇద్దరిదీ హైస్కూల్‌ నుంచీ స్నేహం. పక్కపక్క ఇళ్ళల్లో ఉండేవాళ్ళం. ఇద్దరం ఒకే కాలేజీలో కూడా చేరాం. ఇంటర్‌లో ఒకే గ్రూపు కూడా తీసుకున్నాం. కానీ, తనకి బిఏ ఫస్టియర్‌లోనే పెళ్ళి అయిపోవటంతో చదువు మానేసి తిరుపతికి వెళ్ళిపోయింది. రాధకు వాళ్ళ మేనమామ మాధవరావుతోనే- అంటే అమ్మ తమ్ముడితోనే పెళ్ళి అయింది. వాళ్ళ అమ్మమ్మకు రాధ అంటే తగని ముద్దు, ఇష్టం. మనవరాల్ని తన ఒక్కగానొక్క కొడుక్కి ఇచ్చి పెళ్ళి చేయకపోతే మీతో మాట్లాడనని ఒత్తిడిచేసింది రాధ అమ్మానాన్నల్ని. బాగా ఆస్తి ఉంది. చక్కగా వ్యాపారం చేసుకుంటున్నాడు. ఎవరో తెలియని వాళ్ళకిచ్చి చేసే బదులు ఇంట్లో సంబంధం కదా అని వాళ్ళూ పెళ్ళి చేశారు. రాధకప్పుడు పదిహేడేళ్ళు కూడా
నిండలేదు. డిగ్రీ పూర్తిచేస్తాననీ, తర్వాత పెళ్ళి చేసుకుంటాననీ అన్నా వాళ్ళ అమ్మమ్మ అసలు వినలేదు. తన ఆరోగ్యం బాగాలేదు, వెంటనే జరగాల్సిందేనని బలవంతపెట్టింది. పెళ్ళి అయింది. మొదటి ఏ రెండునెలలో ఏమో అది సుఖంగా ఉండి ఉంటుంది. అంతే, ఆ తర్వాత నుంచీ మొదలైంది అసలు కథ... పెళ్ళయిన మూడు నెలలకి రాధ పుట్టింటికొచ్చింది. పక్కిల్లే కదా, నేను చూడ్డానికి వెళ్ళాను. వాళ్ళింట్లో అంతా ఒకటే ఏడుపులూ గొడవలూ. నన్ను చూసి రాధ భోరున ఏడ్చేసింది.’’
అంతవరకూ కథలాగా వింటున్న శ్రుతి సస్పెన్సు భరించలేనట్లు అడిగింది- ‘‘ఏమైంది, వాళ్ళ హజ్బెండుకి... రాధాంటీ ఇష్టంలేదటనా?’’
‘‘అయ్యో, అదేంలేదు. తనూ వాళ్ళాయనా ఎంతో అన్యోన్యంగా ఉంటారట. పేచీ వాళ్ళ అత్తగారితోనే వచ్చింది దానికి.’’
‘‘అదేంటి, అమ్మమ్మే కదా అత్తగారు.
పైగా ఆవిడే ఇష్టపడి ఆ పెళ్ళి చేసింది అన్నావు కదా!’’
‘‘అదేమరి ట్విస్టు. కొడుక్కు పెళ్ళవడంతోనే విచిత్రంగా మారిపోయిందట ఆవిడ. రాధను
మనవరాలిగా ఎంత ప్రేమించిందో, ముద్దు చేసిందో... కోడలిగా అంత ద్వేషించడం మొదలుపెట్టిందట. మనవరాలిగా ఉన్నప్పుడు ప్రతి పండుగకూ వచ్చి పట్టులంగాలు తెచ్చి, పూలజడలు వేయించి, అన్నీ కొనిచ్చి ముద్దుచేసే అమ్మమ్మ ఎందుకలా కఠినంగా మారిపోయి, కూర్చున్నా లేచినా తప్పుపడుతుందో అర్థంకాక రాధ ఏడుస్తుంటే ‘ఇంట్లో అస్తమానం ఏమిటా శోకాలు? ఏడుపుగొట్టు మొహందానా’ అని
తిట్టేదట.
రాధ ఏం చేసినా వంకలు పెట్టేదట. ఇంకా ‘ఒక్క పని చేతకాదు, మొగుడ్ని కొంగుకి కట్టుకుని తిప్పుకోవడం తప్ప’ అనేదట. వాళ్ళాయనకేమో ఇంట్లో
అరుపులూ ఏడుపులూ ఇష్టంలేక, తల్లీ పెళ్ళాం గోల చూడలేక ఇంట్లో ఉండేందుకే నచ్చక బాగా పొద్దుపోయాక తల్లి నిద్రపోయిన తర్వాతే ఇంటికి వస్తాడట.
‘నేనిక కాపురానికి వెళ్ళను’ అని రాధ ఏడుపు. వాళ్ళ అమ్మానాన్న ఏమో ‘అలా వెళ్ళనంటే ఎలా, సర్దుకోవాలి కదా’ అని ఎలాగో నచ్చచెప్పి పంపించేవాళ్ళు. సరే, ఈ గొడవంతా ఎందుకు- తల్లిని తన దగ్గరకొచ్చి ఉండమని రాధవాళ్ళ అమ్మ తల్లినడిగితే- ‘ఏం, నీ కూతురి కోసం నన్ను నా ఇంట్లోంచే తరిమేద్దాం అనుకుంటున్నావా? లక్షణంగా కొడుకుండగా కూతురింటికి వచ్చి ఉండాల్సిన ఖర్మ నాకేమిటి?’ అని
పెద్దావిడ విరుచుకుపడేది.
అమ్మమ్మే కదా అని చనువుతో రాధ తనకు అత్తగారిగా ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వటంలేదనో, ఒక్కగానొక్క కొడుకు పెళ్ళాం ప్రేమలోపడి తనను పట్టించుకోడేమోననో, ఇంట్లో తన పెత్తనం పోతుందనో... పెద్దావిడ కారణాలేవో ఆవిడకుండేవి కాబోలు, మొత్తానికి చిన్నచిన్న కారణాలే పెద్దవై గొడవలయ్యేవి. ఒక్కోసారి కొన్ని బంధాలు విరిగిపోతే ఇక అతుక్కోవు. రాధ పరిస్థితి అలాగే అయింది.
ఆవిడ బతికి ఉన్నన్ని రోజులూ అది
నలిగిపోయింది.
నిజంగా రాధను చూసి నేనూ - పెళ్ళి అన్నా, అత్తగారిల్లన్నా భయపడ్డాను. కానీ,
నీకు తెలుసు కదా, నానమ్మ ఏనాడూ నన్ను పల్లెత్తుమాట అనలేదు. నేనూ ఆవిడ్ని అత్తగారిలాగ కాదు, అమ్మలాగే అనుకునేదాన్ని.’’
‘‘భానత్త కూడా మారిపోతుందంటావా?’’ కాస్త బేలగా, కొద్దిగా భయంగా అంటున్న కూతుర్ని చూసి ఉలిక్కిపడింది సరిత. తన ధోరణిలో తను చెప్పుకుపోతున్నదల్లా ఆగింది.
జాగ్రత్తలు చెప్పబోయి భయపెడుతున్నానా అనుకుంది. ఏమీ అర్థంకాలేదో క్షణం. అంతలోనే తేరుకుని ‘‘ఛఛ, నేను చెప్పాలనుకున్నది నీకు సరిగా చెప్పలేకపోతున్నాను. నువ్వేం కంగారుపడకు, అందరూ ఎందుకలా మారతారు? నేను చెబుతున్నదల్లా జీవితాన్ని నువ్వు కొంచెం బాధ్యతగా, తెలివిగా హ్యాండిల్‌ చేసుకోమ్మా అని.’’
‘‘ఏంటి శ్రుతీ, ఇంకా నీ సర్దుడు కాలేదా... టైమ్‌ చూశావా, బయల్దేరాలి కదా...’’ అంటూ హడావుడిగా విశాల్‌ గదిలోకి రావడంతో తల్లీకూతుళ్ళ సంభాషణ ఆగిపోయింది.
‘‘అమ్మలూ, నీతో పంపించే వస్తువులన్నీ సరిగా సర్దారో లేదో చూస్తుంటా. నువ్వు త్వరగా ముగించి రా’’ గదిలోంచి వచ్చేసింది సరిత- కొత్త జంట మధ్య తానుండకుండా.

                            *

హైదరాబాద్‌ నుంచి చెన్నైకి వచ్చిన శ్రుతికి జీవితం కాస్త కొత్తగానే తోచింది. ఇంతకుముందు రెండు మూడుసార్లు వచ్చిన ఇల్లే అది. అప్పుడు మేనకోడలిగా సెలవుల్లో ఎంజాయ్‌ చేయడానికి వచ్చి వెళ్ళింది.
ఇప్పుడిక ఇంటి కోడలిగా - అదే తన ఇల్లు అనుకోవడమే - ఆ కొత్తదనం.
తమిళం రాకపోవడాన్ని అప్పుడసలు
పట్టించుకోనేలేదు. అయితే ఇప్పుడు పనిమనిషితోనో, వాచ్‌మేన్‌తోనో ఎవరితో మాట్లాడాలన్నా భాష రాక భానుమతి దగ్గరకెళ్ళి మీడియేట్‌ చేయమంటే ఆమె నవ్వేసేది.
‘‘శ్రుతీ, నువ్విక్కడే ఉండాలిక, చిన్నగా
ప్రయత్నిస్తూ మాట్లాడుతూ ఉండు, అదే వస్తుంది. నాకూ పెళ్ళయిన కొత్తలో
ఇబ్బందిగానే ఉండేది. కానీ, ఇప్పుడు
వచ్చేసింది కదా... అంతే.’’
భానుమతి అలా చెప్పడం బాగనిపించలేదు శ్రుతికి.
ఏ పనైనా అంతే... చేస్తూండు, అలవాటవుతుంది అంటుంది భానుమతి. అది చిరాగ్గానే ఉండేది శ్రుతికి.

                            *

పెళ్ళయి రెండు నెలలవుతోంది. హైదరాబాద్‌ నుంచి శ్రుతి స్నేహితురాలు ప్రియ వచ్చింది చెన్నైకి. శ్రుతి పెళ్ళప్పుడు సెలవు లేక తను అమెరికా నుంచి రాలేకపోయింది. అందుకే ఇప్పుడు ఇండియా రావడం కుదరడంతో
వీలుచూసుకుని ప్రాణ స్నేహితురాలిని
చూసేందుకు వచ్చింది. ఒక్కరోజు ఉండి నైట్‌ ఫ్లైట్‌కే తిరిగి వెళ్ళిపోవాలంది ప్రియ.
ఉదయమే రావడంతో బ్రేక్‌ఫాస్ట్‌ టైమ్‌కి కలుసుకుంది.
‘‘ఆంటీ, అంకుల్‌, విశాల్‌గారూ... ఈ ఒక్క రోజుకీ శ్రుతిని మీరు నాకు వదిలెయ్యాలి ప్లీజ్‌. కలిసి చాలా రోజులైందిగా... బోలెడు
కబుర్లున్నాయి మాకు.’’
శ్రుతి మేనత్త, మావయ్య, బావ... అంతకుముందు పరిచయం ఉన్నందువలన చనువుగా అడిగింది ప్రియ వాళ్ళని.
‘‘ఒకే ప్రియా, నువ్వూ నీ ఫ్రెండూ
మీ ఇష్టం. ఎనీవే, నేనూ నాన్నా ఇప్పుడు ఫ్యాక్టరీకి వెళితే ఈవినింగ్‌కే వచ్చేది. ఎంజాయ్‌ యువర్‌ డే’’ అన్నాడు విశాల్‌ నవ్వుతూ.
‘‘ఆంటీ, నేను చెన్నై చూడలేదు. శ్రుతి
నాకివాళ చెన్నై చూపిస్తుందన్నమాట. మేము సిటీ చూస్తూ, లంచ్‌ బయటే తినేసి వస్తాం. నేను నైట్‌కే మళ్ళీ ఊరికి వెళ్ళిపోవాలి కదా’’ అంది ప్రియ.
‘‘అలాగే కానీ, ఇద్దరికీ సిటీ కొత్త కదా... మన కారులో వెళ్ళండి. డ్రైవరు తోడు ఉంటే మీరు ఎక్కడికంటే అక్కడికెళ్ళవచ్చు’’ అంది భానుమతి.
‘‘వద్దాంటీ, మేము ఏ షాపింగ్‌మాల్‌లోనో ఉండి, మా ధ్యాసలో అతన్ని మర్చిపోతే
అతనికీ ఇబ్బంది, బోరు. మేమేం చిన్నపిల్లలం కాదు కదా? గూగుల్‌ ఉంది, ఊబర్లున్నాయి’’ అనేసింది ప్రియ.

శ్రుతికీ అదే బెటరనిపించడంతో ‘‘అవునత్తా, రోజంతా మాకూడా అతనెందుకు? మావయ్యకీ కారు కావాలి కదా, మేమెళతాంలే’’ అంది.
భానుమతి సరేననడంతో ఇద్దరూ
ఉత్సాహంగా బయలుదేరారు.
కాలేజీనాటి కబుర్లతో మళ్ళీ ఇద్దరూ కాలేజీ అమ్మాయిలే అయిపోయారు. సాయంత్రానికి వచ్చేస్తామన్న శ్రుతి షాపింగులోనూ కాఫీ షాపుల్లో కబుర్లతోనూ లేటయి ఏకంగా ప్రియని ఎయిర్‌పోర్టులో వదిలి అక్కడ్నుంచి ఇల్లు చేరుకునేసరికి రాత్రి పదిన్నర దాటింది. మధ్యలో మధ్యాహ్నం ఒకసారి భానుమతి కాల్‌ చేస్తే ఫోన్‌ ఆన్సర్‌ చేసిందికానీ, తర్వాత తన సెల్‌ను సైలెంట్‌లో పెట్టేసింది- అదో డిస్ట్రబెన్స్‌ అని.
అంత ఆలస్యంగా ఇంటికి వచ్చిన శ్రుతిని భానుమతి బాగా కోప్పడింది. ‘‘అసలేమనుకుంటున్నావు నువ్వు- పెళ్ళయింది, ఇంట్లో అత్తమామలూ, భర్తా ఎదురుచూస్తుంటారు... చెప్పిన టైమ్‌కి ఇల్లు చేరుకోవాలన్న స్పృహ లేదా? అరె, లేటయింది... ఇంటికి ఫోన్‌ చేసి చెబుదామన్న బాధ్యత కూడా లేకపోతే ఎలా? పైగా నేను ఎన్నిసార్లు ఫోన్‌ చేసినా తియ్యకపోతివి. ఇద్దరూ ఆడపిల్లలే వెళ్ళారు, సిటీ కొత్త, మేము ఎంత కంగారుపడుతుంటాం- అన్న జ్ఞానం ఉండొద్దూ. పైగా చదువుకున్నారు ఎందుకూ?’’ విశాల్‌ కూడా తల్లినే సమర్థిస్తున్నట్లు భార్య వంక కోపంగా చూశాడు. శ్రుతికి ఏడుపు వచ్చేయగా, ఎవరితో మాట్లాడకుండా వెళ్ళి పడుకుంది.

                           *

మరునాడు పొద్దున్నే టెర్రెస్‌ మీదకెళ్ళి
తల్లికి ఫోన్‌ చేసి ముందురోజు జరిగిందీ, దానికి భానుమతి ఎలా తిట్టిందీ అన్నీ చెప్పి, ‘‘అమ్మా, నువ్వు చెప్పింది నిజమే. పెళ్ళితో బంధాలు మారిపోతాయి. భానత్త కూడా
మారిపోయింది. అత్తగారిలానే సాధిస్తోంది’’ అంటూ కన్నీళ్ళు పెట్టుకుంది.
అవతల సరితకి సీనంతా అర్థమైంది. కూతుర్ని బుజ్జగిస్తూ... ‘‘శ్రుతులూ, ఆరోజు నేను సరిగా చెప్పలేదనిపిస్తోంది. నేను
చెప్పాలనుకున్నది ఒకటీ, నువ్వు అర్థంచేసుకున్నది ఒకటి. మీ భానత్త ‘అత్తగారు’లాగా మారకుండా ఉండాలంటే నువ్వు కాస్త మారాలి తల్లీ అని చెప్పాను. ఒక్కటి చెప్పు అమ్మలూ,
నిజంగానే నిన్న నువ్వలా లేటుగా వస్తే,
ఫోన్‌ కూడా తీయకపోతే నేనయినా నిన్ను కోప్పడేదాన్నా కాదా? నేను అరిస్తే అది
అమ్మ కోపంలాగే అనిపించి కొద్దిసేపటికి
నీ కోపం, అలకా పోతాయి. అదే అత్త స్థానంలో భానుమతి అరిస్తే నీకది అత్తగారి సాధింపులా ఉంది కదూ?
చిన్నచిన్న సంఘటనలే- అర్థం చేసుకుంటే అపార్థాలు తొలగుతాయి, లేదా అవే బంధాల మధ్య అగాధాలు ఏర్పరుస్తాయి. నువ్వు చదువు
కున్నదానివి, తెలివైనదానివి, మీ అత్త ప్రేమ తెలిసినదానివి. ఒక్కసారి శాంతంగా ఆ కోణంలోంచి ఆలోచించి చూడు. ఆ! తర్వాత కాల్‌ చేస్తా నీకు, మీ నాన్న పిలుస్తున్నారు’’ ఇంకా ఎక్కువ మాట్లాడకుండా పెట్టేసింది ఫోన్‌ సరిత- కూతురికి ఆలోచించుకునే సమయం ఇవ్వాలని.
అయిదు నిమిషాల తర్వాత శ్రుతి కిందకు వచ్చింది. కిచెన్‌లో టిఫిన్‌కని పెసరట్లు చేస్తోంది భానుమతి. దగ్గరకెళ్ళి ఆమె చేతిలోని గరిటె తీసుకుని ‘‘నువ్వెళ్ళి కూర్చో అత్తా, ఈరోజు నీకు హెల్ప్‌ కాదు, మొత్తమంతా
నేనే చేస్తాను’’ అంది.
‘‘ఇవి పెసరట్లే తల్లీ, తినేట్లు చేస్తావా?’’ నిన్నటి అలక ఛాయలేవీ లేకుండా
మామూలుగా తన దగ్గరికొచ్చిన కోడల్ని చూసి హాయిగా అనిపించగా, కావాలని భయం నటిస్తూ హాస్యంగా అడిగింది భానుమతి.
‘‘తినేట్లే చేస్తాను. అసలు నా పెసరట్లు ఒకసారి తిన్నారంటే ఇంకా ఇంకా కొసరట్లు కూడా కావాలంటారు మీరంతా’’ ఊరిస్తున్నట్లు అంటున్న శ్రుతిని దగ్గరకు తీసుకుంటూ,
‘‘నా బంగారం, నువ్వేం మారలేదే!’’
మురిపెంగా అంది భానుమతి.
‘లేదత్తా, నేను మారాను కాబట్టే మన బంధం మారలేదు’ మనసులోని మాట పైకి అనలేదు శ్రుతి.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.