close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
సహచర్యం

సహచర్యం
- ఆకెళ్ళ భవాని

సాయంత్రం ఆరు గంటలయ్యుంటుంది నేను చైత్ర దగ్గరికి వెళ్ళేసరికి. తన ముచ్చటైన పూతోటలో కూర్చుని నవ్వుతూ ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతోంది. కోర్టు నుంచి అప్పుడే వచ్చినట్టుంది - ముఖం అలసటగా, వడిలినట్లు ఉన్నా తన కళ్ళల్లో కనపడుతున్న మెరుపు చూస్తుంటే మాట్లాడుతున్నది ‘అతనే’ అయ్యుంటాడని అనిపించింది. లోపలికి వెళ్ళి మంచినీళ్ళు తాగి వచ్చాను. ఇంకా ఫోన్లో మాట్లాడుతూనే ఇప్పుడే వస్తానన్నట్టు సైగ చేసింది. పర్లేదన్నట్టు తలూపి వెళ్ళి మొక్కల మధ్యనున్న ఉయ్యాలలో కూర్చున్నాను.

చైత్ర నా పిన్ని కూతురు. మా చిన్నతనమంతా ఒకే వూరిలో గడిచింది. ఇద్దరి ఆలోచనలూ అభిరుచులూ కలవటం వలనా, వయసులో కూడా పెద్ద తేడా లేకపోవటం వలనా మా ఇద్దరిమధ్యా సొంత అక్కాచెల్లెళ్ళకంటే ఎక్కువ అనుబంధం పెనవేసుకుంది. ప్రపంచంలోని ఏ విషయం గురించైనా సంకోచం లేకుండా, ఎటువంటి దాపరికాలూ లేకుండా మాట్లాడుకోగల సాన్నిహిత్యం మాది.

ముందు ఉద్యోగరీత్యా, ఆ తరవాత పెళ్ళి చేసుకునీ నేను హైదరాబాద్‌లో స్థిరపడిపోయిన కొద్దికాలానికే తనూ హైదరాబాద్‌లో ఒక లాయర్‌ దగ్గర జూనియర్‌గా చేరింది. కాబట్టి మేం దూరంగా ఉన్న కాలం చాలా తక్కువ. ప్రైవేట్‌ ప్రాక్టీస్‌ పెట్టాలనీ ఏదో బతికెయ్యటానికి ఒక పని అన్నట్టు కాకుండా, నలుగురికీ ఉపయోగపడేలా, ముఖ్యంగా అవసరం ఉన్న పేదలకీ మహిళలకీ ఏదైనా చేయాలనే ఆరాటం తనది. కానీ అందుకు తన శక్తిసామర్థ్యాలు సరిపోవేమో అని ఒక జంకు. ‘ప్రైవేట్‌ ప్రాక్టీస్‌ అయితే దానికి చాలా లౌక్యం కావాలక్కా, అది మన దగ్గర ఉండనంటోందే’ అంటుండేది. తెలివికలదే కానీ స్వతహాగా తనది చాలా సరళ స్వభావం. ‘అసలు నువ్వు కోర్టులో ఏమైనా వాదిస్తావా, గట్టిగా వాదిస్తే అవతలి లాయర్‌ ఫీల్‌ అవుతాడేమో అని కామ్‌గా ఉండిపోతావా’ అని ఆటపట్టిస్తుండేదాన్ని. తనకున్న ఆ జంకు వలన, ప్రైవేట్‌ ప్రాక్టీస్‌ జోలికిపోకుండా, ఏదైనా కంపెనీలో ఉద్యోగం చూసుకోవడమో, జడ్జి పరీక్షలకి ప్రిపేర్‌ కావడమో ఉత్తమం అనుకుంది. హైదరాబాద్‌ వస్తే ఆ పరీక్షలకీ ప్రిపేర్‌ కావచ్చు, ఏదైనా ఉద్యోగానికీ అప్లై చెయ్యొచ్చు అని వచ్చింది. ఈలోపల ఎక్కడైనా జూనియర్‌గా చేరితే అనుభవం వస్తుందని, బాగా తెలిసిన ఒక పేరున్న హైకోర్టు లాయర్‌ దగ్గర జూనియర్‌గా చేరింది.

ఇంతలో మా పిన్ని పెళ్ళి సంబంధాలు చూడటం మొదలుపెట్టింది. లాయర్‌ సంబంధం అయితే ఇద్దరూ కలిసి ప్రాక్టీస్‌ పెట్టుకోవచ్చు. ఆఫీసు వర్కూ, పేపర్‌ వర్కూ వంటివన్నీ తను చూసుకుంటే, బయట చక్కబెట్టవలసినవి ఆ అబ్బాయి చూసుకుంటాడు అనేది చైత్ర ఆలోచన. అప్పుడు ఈ ఉద్యోగాలతో పని ఉండదు. మనం సొంతంగా సంపాదించుకోవచ్చు, కలిసొస్తే ఇంకో నలుగురికీ పని కల్పించవచ్చు. సొంత ఆలోచనలూ నిర్ణయాలూ అమలుపరచవచ్చు అనుకునేది. రెండు, మూడు లాయర్‌ సంబంధాలే వచ్చాయి కానీ అవేవీ తనకి నచ్చలేదు. ఇక మొదలైంది ఇంట్లోవాళ్ళకి దిగులు. నన్ను మాట్లాడమన్నారు. ‘అప్పుడే ఏమంత మునిగిపోయింది. ఇంకా చిన్న వయసే కదా. అయినా పెళ్ళి ఏమైనా వ్యాపారమా, లెక్కలు వేసుకుని సెటిల్‌ చేసుకోవడానికి. చైత్ర లాయర్నే చేసుకుంటానన్న మాట నిజమే కానీ, తనకు నచ్చి మనసు స్పందించటం దానికంటే ముఖ్యం కదా. తనకీ కొంత సమయం ఇద్దాం’ అన్నాను. ‘నీ సంగతి తెలిసి కూడా నిన్ను చెప్పమనటం మాదే బుద్ధి తక్కువ తల్లీ, నీ మాటైతే వింటుంది అని చెప్పమన్నాం కానీ, మాకు క్లాస్‌ పీకమని కాదు’ అని నాకు చీవాట్లు పెట్టారు. నవ్వుకున్నాను. కానీ, తనని ఒకసారి కదుపుదామని నిర్ణయించుకున్నాను.

ఒకరోజు సీరియస్‌గా ఏదో పుస్తకం చదువుకుంటున్న చైత్ర దగ్గరకి వెళ్ళి ఏ ఉపోద్ఘాతం లేకుండా ‘ఏంటీ, ఈమధ్య చాలా బిజీగా ఉంటున్నావు, ప్రేమలో కానీ పడ్డావా ఏంటీ’ అని టీజింగ్‌గా అడిగాను. లాయర్‌ కదా తను నా ఉద్దేశ్యం సులభంగానే కనిపెట్టేసింది. చదువుతున్న పుస్తకం పక్కన పెట్టేసి ‘అక్కా, నువ్వెందుకు అడుగుతున్నావో నాకు తెలుసు. అయినా అడిగావు కాబట్టి చెబుతున్నా... ఇంకా ఎవరికీ అంత అదృష్టం కలగలేదు’ అంది తనూ నవ్వుతూ. మళ్ళీ తనే ‘సహచర్యంలోని మాధుర్యాన్ని అనుభవిస్తున్న నీకు నేను చెప్పనక్కర్లేదు- పెళ్ళి అంటే ఎలా ఉండాలీ అని. వాళ్ళకేమో చెప్పినా అర్థంకాదు’ అంది. ‘ఇద్దరం ఒకే వృత్తిలో ఉంటే సౌకర్యంగా ఉంటుందని లాయర్ని చేసుకుంటాను అన్నాను కానీ, పెళ్ళి అంటే ఒక్క లెక్కలే వేస్తాననుకుంటే ఎలా? ఎలా ఉండాలి అక్కా సహచర్యం అంటే... తన తలపు మనసులోకి వచ్చీరాగానే నా పెదాలపై నవ్వులు విరబూయాలి. మమత నిండిన చూపు ఈ ప్రపంచాన్ని మరిపించగలగాలి. తను పక్కనుంటే ఈ ప్రపంచంలో ఇంకెవరూ అక్కరలేదు అనే భావన కలగాలి. తను తోడుంటే ఈ ప్రపంచాన్నే జయించగలనన్న ధీమా కలగాలి. ఒకరి హృదయ స్పందనకి ఇంకొకరు ప్రతిస్పందించటానికి ఏ దూరాలూ అడ్డు కాకూడదు. డబ్బూ పలుకుబడీ కులాలూ ఆస్తులూ అంతస్తులూ సెక్సూ... వీటన్నిటికీ అతీతంగా ఇద్దరికీ ‘ఏదో’ ఫీలింగ్‌ కలగాలి. ఇద్దరినీ కట్టిపడేసే ఒక ‘మేజిక్‌’ ఉండాలి. అంతెందుకు, తన సాహచర్యంలో నన్ను నేను కోల్పోవాలి’ కలలో ఉన్నట్టుగానే మాట్లాడుతోంది తను. ఆ ట్రాన్స్‌లోంచి బయటికి వచ్చాక అంది- ‘ఎవరి స్పేస్‌, ప్రైవసీ వారు మెయింటైన్‌ చేస్తూ జీవితాంతం ఈ ఫీలింగ్స్‌ని నిలుపుకోగలగాలి ఇద్దరమూ’ ఒక సెకండ్‌ ఆగి, ‘అసాధ్యమేమో కదా’ అని నవ్వింది. ‘లేదు, అసాధ్యమేమీ కాదు కానీ కష్టసాధ్యం’ అన్నాను. మళ్ళీ నేనే ‘మామూలు పెళ్ళిచూపుల్లో ఇవన్నీ ఎలా కనుక్కోగలవు. కాస్తయినా పరిచయం ఉంటే నీ కోరిక తీరుతుందో లేదో తెలుసుకోవడం కొంచెం సాధ్యం అవుతుంది కానీ’ అన్నాను. ‘నాకుండే పరిచయాలే తక్కువ. ఇంతవరకూ నాకెవరూ అలా ఎదురుకాలేదు. ఎదురయ్యేదాకా ఆగుతానంటే ఇంట్లో ఒప్పుకోరు కదా. అందుకే పెళ్ళిచూపుల్లోనే వెతుక్కుంటా అలాంటివాళ్ళని. అంత తీవ్రమైన భావాలు కలగకపోయినా, మనసు కొంచెం స్పందిస్తే చాలు. అది పునాదిగా నా ఆశలన్నీ తీర్చుకోగలననే నమ్మకం నాకు వస్తే తప్ప, నేను ఒప్పుకోనక్కా’ అంది స్థిరంగా. నేను మెచ్చుకోలుగా తలూపాను. ఆ తర్వాత కొన్నాళ్ళకి తనకు నచ్చిన, తను మెచ్చిన లాయర్‌ కార్తీక్‌తో తన వివాహం మా ఆధ్వర్యంలోనే, ఖర్చుపరంగా అయితే నిరాడంబరంగా, హాజరైన ఆప్తులూ, స్నేహితులపరంగానైతే చాలా ఆడంబరంగా జరిగింది. కొంచెం రంగు తక్కువనే కానీ చక్కటి కనుముక్కు తీరూ, ఒడ్డూ పొడవూ... అన్నిట్లో చైత్రకు దీటైన అందగాడూ మనసున్నవాడూ కార్తీక్‌.

కార్తీక్‌ వాళ్ళది కర్నూల్‌ కావటం వలనా, అక్కడ అతని ప్రాక్టీస్‌కి కావలసిన పునాది పడటంవలనా, చైత్ర కర్నూల్‌ షిఫ్ట్‌ కావటం అనివార్యమైంది. ప్రాక్టీస్‌ మొదలుపెడితే ఆఫీసూ ఇల్లూ రెంటికీ ఉపయోగపడేటట్టు ఒక ఇల్లు చూసుకున్నారు. అక్కడి సీనియర్‌ లాయర్‌ భరణి దగ్గర జూనియర్‌గా చేరిన కార్తీక్‌ త్వరలోనే మంచిపేరు తెచ్చుకున్నాడు. భరణికి కార్తీక్‌ అన్నా, అతని తెలివితేటలన్నా చాలా ఇష్టం, నమ్మకం. ఆ నమ్మకంతోనే తన కేసులు కొన్ని అతనికి ఇచ్చి సొంతంగా ప్రాక్టీస్‌ పెట్టుకోవటానికి అప్పటికే దారి ఏర్పరిచారు. ఇంతలో- ఒకరోజు పొద్దున్నే వచ్చిన ఆ ఫోన్‌, కొత్త జీవితానికి సిద్ధమవుతున్న చైత్రకే కాదు, మాకు కూడా పెద్ద షాక్‌, కోలుకోలేని దెబ్బ. ఏదో కేసు విషయమై పక్క వూరికి బయలుదేరిన కార్తీక్‌ యాక్సిడెంట్‌లో అక్కడికక్కడే మరణించాడు అనేది ఆ ఫోన్‌ సారాంశం. పెళ్ళయి నెల కూడా కాలేదు. పెళ్ళికి పెట్టుకున్న పారాణి ఎరుపు ఇంకా ఆరనేలేదు. పెళ్ళికళతో కళకళలాడుతున్న చైత్రకి ఆ విషయం ఏమని చెప్పాలో, ఎలా చెప్పాలో కూడా నాకు అర్థంకాలేదు. విషయం తెలిశాక ‘నేను దురదృష్టవంతురాలినని తెలుసుకానీ మరీ ఇంత దురదృష్టం అని అనుకోలేదక్కా’ అంటూ కన్నీరు మున్నీరవుతున్న తనని ఎలా ఓదార్చాలో తెలియక నిస్సహాయంగా చూస్తూండిపోయాను, నా దుఃఖాన్నే మోయలేకపోతున్న నేను. చేస్తున్న ఉద్యోగం ఇంకా మానలేదు కాబట్టి, ఆ వ్యాపకం కూడా లేకపోతే ఆ విషాదంలోంచి బయటపడటం మరీ కష్టం అవుతుందని అందులోనే కొనసాగింది. నాకే ఆ బాధలోంచి బయటపడటానికి కొన్ని సంవత్సరాలు పట్టిందంటే చైత్ర పరిస్థితి ఎలా ఉంటుందో వూహించుకోవచ్చు.

భర్త చనిపోతే పాటించవలసిన ఆచారాల గురించి ఇంట్లో కొందరు పెద్దలు గుసగుసలాడుకున్నప్పటికీ తన వయసు దృష్టిలో ఉండటంవలనో, నాకు భయపడో మౌనంగా ఉండిపోయారు. మరీ పెద్దవాళ్ళు ఏదో మాట్లాడబోయినా నేను పడనీయలేదు. వీళ్ళల్లోనే కొందరు, తను ఆ షాక్‌ నుంచి ఇంకా పూర్తిగా బయటపడకముందే మళ్ళీ పెళ్ళి గురించి చర్చలు మొదలుపెట్టారు. నాకే విసుగ్గా అనిపించేది. అసలు ఈ సంఘటన తరవాత ఎక్కడ పెళ్ళి బాజాలు మోగినా కసిగా ఉండేది. అందరూ బావున్నారు, మాకే ఎందుకిలా జరిగింది అని, ఎవరిమీద చూపాలో తెలియని కోపంతో రగిలిపోయేదాన్ని. మళ్ళీ నా ఆలోచనలకి నన్ను నేనే తిట్టుకునేదాన్ని.

తరవాత కొన్ని సంబంధాలు వచ్చాయి చైత్రకి. కొందరు పెళ్ళై పిల్లలున్నవాళ్ళూ కొందరు విడాకులు తీసుకున్నవాళ్ళూ... ఇలా రకరకాలుగా. నిండా పాతికేళ్ళు కూడా లేని తనకి అలాంటి సంబంధాలు చూడటం నాకు బాధగా ఉండేది. ఈ విషయాలేవీ తన దగ్గర ప్రస్తావించలేదు నేను. అయితే నన్ను నేరుగా సంప్రదించిన రెండు సంబంధాల గురించి ఇక్కడ ప్రస్తావించాలి. ఒకరు నా స్నేహితురాలి స్నేహితుడు. నా స్నేహితురాలితో కబురు పంపాడు. అభ్యుదయ భావాలున్నాయి అని అనుకుంటూ ఉంటాడు. ఏవో సంఘాలలో పనిచేస్తూ ఉంటాడు. సంఘాలలో పనిచేసేవాళ్ళ పట్ల నాకైతే చిన్నచూపేమీ లేదు కానీ అభ్యుదయ భావాలున్నాయి అని నలుగురూ అనుకోవాలని తాపత్రయపడటం మాత్రం కచ్చితంగా నచ్చదు. చైత్ర ఫొటో చూపించమని అడిగాడు. చూపించాక ‘నాకేమీ పెద్ద ఫీల్‌ కలగటం లేదు, అయినా కలుస్తాను’ అన్నాడు. అక్కడికి మేమేదో తన వెంటపడినట్టూ, తానేదో మమ్మల్ని ఉద్ధరిస్తున్నట్టు. నాకు కోపంగా ఉన్నా నా స్నేహితురాలి ముఖం చూసి మౌనంగా ఉండిపోయా. ఆ అబ్బాయిది చిన్న ఉద్యోగం, ఉమ్మడి కుటుంబం. నా చెల్లి ఇతన్ని చేసుకుంటే చాలా సర్దుబాట్లు చేసుకోవలసి వచ్చేది. అయితే పెళ్ళి విషయంలో ఉద్యోగం, డబ్బు, కుటుంబ నేపథ్యం ఇవేవీ చైత్రకి ఇబ్బంది కలిగించవు... అయితే, అది ఆ చేసుకోబోయే వ్యక్తి ముఖ్యుడైనప్పుడు కానీ, వివాహం ముఖ్యంగా భావిస్తే కాదని మాత్రం నాకు బాగా తెలుసు. తనని పెళ్ళి చేసుకోవటమే గొప్ప విషయంగా భావించే వ్యక్తి తనకి ఎప్పటికీ ముఖ్యుడు కాలేడనీ తెలుసు. ఫొటో చూపకముందే చైత్రని పరిచయం చేస్తానని మాట ఇచ్చాను కాబట్టి పెళ్ళిచూపులని చెప్పకుండా చైత్రను పార్కుకి తీసుకువెళ్ళాను. కానీ, వస్తానన్న ఆ అబ్బాయి రాలేదు, ఏమీ కబురూ పంపలేదు. కొంచెంసేపు గడిపి వచ్చేశాం. తరవాత చాలా క్యాజువల్‌గా చెప్పాడు ‘మర్చిపోయాను’ అని. చైత్రకి ఈ విషయాలు చెప్పి గాయపరచకుండా ఉండగలిగినందుకు నన్ను నేను అభినందించుకున్నాను.

తరవాత రెండు మూడేళ్ళకు ఇంకొక అతను కూడా ఇంచుమించు ఇలాగే అనుకున్నాడు. అతను చెల్లెళ్ళూ తమ్ముళ్ళ బాధ్యతల వలన ఇన్నాళ్ళూ పెళ్ళి చేసుకోలేదు. కానీ, వయసులో ఎక్కువ వ్యత్యాసం ఉండటం వలన చైత్ర ఇష్టపడలేదు. నేను ముందు కొంచెం సుముఖంగానే ఉన్నాను కానీ తనకు నచ్చింది కాబట్టి ఇక చైత్ర అభిప్రాయంతో పనిలేదన్నట్టు, ముహూర్తాలదాకా వెళ్ళిపోయిన అతన్ని చూస్తే చిరాకేసింది. చైత్ర జీవితంలో ఒక అపశృతి జరిగింది కాబట్టి ఇక ఎవరైనా సరే పెళ్ళి చేసుకోవడానికి ఒప్పుకుంటే చాలు... అదే పెద్ద అదృష్టమనుకోవాలి తను అనేది వాళ్ళందరి అభిప్రాయం. కానీ మాకు పెళ్ళి జీవితంలో ఒక భాగం మాత్రమే. ఆ భాగం లేకపోయినా అంతే సంతోషంగా, సంతృప్తిగా బతకగల అవకాశాలు ఉన్నాయని నమ్మే మేము అతన్ని ఎలా అంగీకరిస్తాం?

నేను మొదట్లో చెప్పేదాన్ని... ‘చైత్రా, మళ్ళీ పెళ్ళి చేసుకుంటే కార్తీక్‌కి అన్యాయం చేసినట్టేమో అని ఆలోచించకు. ఎవరైనా ప్రతిపాదిస్తే తప్పేమో- అని వెంటనే తిరస్కరించకు. ఒక్కసారి ఆలోచించు. మనసుకి నచ్చితే మళ్ళీ పెళ్ళి చేసుకోవటం తప్పుగా అనుకోకు’ అని. అదీ తను ఆ బాధలోంచి కొంచెం తేరుకున్నాక నెమ్మదిగా చెప్పేదాన్ని కానీ, పెళ్ళి చేసుకోకపోతే జీవితమే వ్యర్థం అనే భావనని వ్యతిరేకించే నేను, నన్ను ఎవరు ఎన్ని విధాలుగా అనుకున్నా తనని పెళ్ళి చేసుకోమని బలవంతం మాత్రం చేయలేదు. ‘అందరూ చేసుకుంటున్నారు కాబట్టి, పెళ్ళి ఒక పనిలాగా చేసుకోవాలా అక్కా? తను నా పక్కన లేకపోతే జీవితం శూన్యంగా అనిపిస్తే తప్ప, పెళ్ళి వూసే ఎత్తకూడదు. పెళ్ళయినా, సహజీవనమైనా ఆ వ్యక్తి సమక్షంలో కాలం ఆగిపోతే బావుండును అనిపించాలి, తన సుతిమెత్తని కౌగిలింతలో రాత్రిళ్ళు కరిగిపోవాలి, తెల్లవారి కళ్ళు తెరవగానే కనిపించే తన దరహాసంలో రోజంతా వెలిగిపోవాలి’ అనే తన మాటలు నాకింకా గుర్తు.

‘‘అక్కా’’ అంటూ గట్టిగా పిలుస్తున్న చైత్ర పిలుపు - కాదు, అరుపుకి ఈ లోకంలోకి వచ్చాను.

స్నానం చేసి వచ్చినట్టుంది- ఇస్త్రీ చేసిన కాటన్‌ చీరలో ఫ్రెష్‌గా, చూపు తిప్పుకోలేనంత అందంగా ఉంది. ‘‘ఇచ్చిన కాఫీ చల్లారిపోయింది, నా స్నానం అయింది. ఏంటీ అంత ఆలోచనలు? అసలు నేను మాట్లాడినవన్నీ విన్నావా లేదా’’ అంది చిరుకోపంగా.

‘‘మాట్లాడావా... ఏం మాట్లాడావు?’’ అన్నా కొంచెం భయంగా.

‘‘కాఫీ తాగుతావా అని అడిగితే ‘సరే’ అన్నావు. కాఫీ తెచ్చిచ్చాక స్నానం చేసి వస్తా అంటే ‘సరే’ అన్నావు. ఇక్కడికి వచ్చి కూడా బావగారి కలలే కనాలా’’ అంటూ గొడవేసుకుంది.

‘‘నా ఈ కలలు నీ గురించే తల్లీ’’ అన్నాను.

‘‘ఏంటి, మళ్ళీ ఫ్లాష్‌బ్యాకా’’ అంది.

‘‘కాదు, ఇందాక అంతసేపు ఫోన్లో మాట్లాడుతున్నావు కదా. నేను డిస్టర్బెన్స్‌ ఏమో అని ఆలోచిస్తున్నా’’ అన్నాను.

‘‘అక్కా’’ అంది కొంచెం కోపంగా.

‘‘నీకు కోపం సూట్‌ కాదులే కానీ చెప్పు... నీ రాత్రులని కరిగించేవాడూ, నీ రోజులని వెలిగించేవాడూ ఎవరో’’ అన్నాను.

కోపం ఎక్కువైనట్టుంది ‘‘నా మనసులోని భావాలు చెప్తే ఎగతాళి చేస్తావా? ఎవరూ లేరు’’ అంది.

‘‘నేనిప్పుడు ఏమన్నానని అంత కోపం? నీ కళ్ళల్లో మెరుపూ బుగ్గల్లో ఎరుపూ ముఖంలో మెరుపూ... ఇవన్నీ చెప్పకనే చెప్తున్నాయి కానీ, చెప్పు... ఎవరతను’’ అన్నాను.

‘‘శ్రావణ్‌ అని తను కూడా లాయర్‌’’ అంది.

‘‘ఎన్నాళ్ళనుంచి పరిచయం’’ అంటే, ‘దాదాపు సంవత్సరం’ అంది.

‘‘అంటే సంవత్సరం నుంచీ నా దగ్గర దాచావా, అంత కానిదాన్నై పోయాను కదా’’ ఇప్పుడు అలగటం నా వంతయింది.

‘‘అక్కా, ప్లీజ్‌... నాకే సరిగా అర్థంకాలేదు. నేనే ఒక గందరగోళంలో ఉన్నా’’ అని ఇంకా ఏదో చెప్పబోతూ ఉంటే నేను నవ్వేసి-

‘‘సరేలే నీ గురించి చెప్పావా?’’ అన్నాను.

‘‘చెప్పబోయాను కానీ, నేను మొదలుపెట్టకముందే నాకు అన్నీ తెలుసు అన్నాడు. మన చుట్టాలు ఎవరో వాళ్ళ ఫ్యామిలీ ఫ్రెండ్స్‌ అట’’ అంది.

తనకి ఎంతో నమ్మకం కుదిరితే తప్ప అంత తేలిగ్గా ఒప్పుకోదు అని నాకు నమ్మకం ఉండటం వలన నేను ఇక ఏమీ తరచి అడగలేదు.

‘‘సరేకానీ, ఎలా ఉంటాడు- పొట్టిగానా పొడుగ్గానా... తెలుపా నలుపా... లావా సన్నమా?’’ అని కుతూహలంగా ప్రశ్నల మీద ప్రశ్నలు కురిపిస్తుంటే,

‘‘ఆగాగు ఇప్పుడు వస్తాడు, నువ్వే చూద్దువుగానీ’’ అంటూండగానే బయట బైక్‌ ఆగిన శబ్దం, అతను లోపలికి రావటం జరిగింది.

చైత్ర పక్కనే అతన్ని వూహించుకున్న నాకు నా దిష్టే తగులుతుందేమో అని అనిపించింది.

పరిచయాలయ్యాక ‘‘సరే చైత్రా, మళ్ళీ కలుస్తాను’’ అని నేను వెళ్ళబోతుంటే-

‘‘ఆగు అక్కా, నిన్ను కూడా కలవవచ్చనే తనని ఇంటికి రమ్మన్నాను’’ అంది.

‘‘అవునండీ చాలా రోజులుగా మిమ్మల్ని కలవాలని అనుకుంటున్నా. ఢిల్లీ వెళ్ళి వారం అయింది. పొద్దున్న రైలు దిగగానే - ఒక్కసారి కలవాలని ఉంది కలుస్తానంటే - సాయంత్రమైతే మిమ్మల్ని కూడా కలవచ్చు అని ఇప్పుడు ముహూర్తం పెట్టి ఇప్పటిదాకా ఆపింది మీ చెల్లెలు’’ అని ఆరోపించాడు శ్రావణ్‌.

చైత్రమీంచి చూపు మరల్చుకోవడానికి అష్టకష్టాలు పడుతున్న శ్రావణ్‌ని ఆ ఇబ్బంది నుంచి తప్పించటానికి కాఫీ కలిపే నెపంతో చైత్ర వారిస్తున్నా వినకుండా లేచాను. నింపాదిగా ఒక పావుగంట తరవాత మూడు కప్పులలో కాఫీ కలుపుకు వచ్చాను.

తలా ఒకటి తీసుకుని కూర్చున్నాక అడిగాను- ‘‘చెప్పండి, ఎందుకు నన్ను కలవాలనుకుంటున్నారు?’’ అని.

శ్రావణ్‌- చైత్ర వంక చూశాడు. తన కళ్ళలో ఏమి సందేశం కనపడిందో... వెంటనే నావైపుకి తిరిగి నేరుగా విషయంలోకి వచ్చేశాడు. ‘‘మా ఇద్దరికీ ఒకరంటే ఒకరికి ఇష్టమండీ. మీరందరూ అనుమతిస్తే కలిసి జీవితాన్ని గడపాలనుకుంటున్నాం’’ అని చిన్నగానే కానీ... సూటిగా, స్పష్టంగా చెప్పాడు.

‘‘అనుమతించకపోతే?’’ ఠక్కున అడిగాను నేను.

బిత్తరపోయి ముందు నావైపూ తరవాత కంగారుగా చైత్ర వైపూ చూశాడు.

బలవంతాన నవ్వు ఆపుకుంటున్నట్టున్న చైత్రని చూశాక నేను ఆటపట్టిస్తున్నానని అర్థం అయినట్టుంది, వెంటనే తేరుకుని ‘‘అనుమతించకపోతే ఎత్తుకెళ్ళిపోతాను’’ అన్నాడు ధీమాగా.

‘‘ఆ మాత్రం దానికి మా అనుమతి అడగటం దేనికో’’ అన్నాను, అదే సీరియస్‌నెస్‌ మెయింటైన్‌ చేస్తూ.

‘‘పెద్దవాళ్ళు కదా, గౌరవం ఇద్దామనుకున్నాను. మీరు దాన్ని నిలుపుకోలేకపోతే చైత్రని వదులుకోలేను కదా, ఎత్తుకెళ్ళి గుండెల్లో పెట్టుకుని పదిలంగా చూసుకుంటాను’’ అన్నాడు ఇంకా సీరియస్‌గా.

‘‘అక్కడ పట్టకపోతేనో? అయినా మా చైత్ర రావాలి కదా’’ అన్నాను.

ఇక నవ్వు ఆపుకోలేకపోయింది చైత్ర. నవ్వుతూనే ‘‘వదిలెయ్‌ అక్కా, పాపం శ్రావణ్‌ చాలా మంచివాడు’’ అంది.

‘‘అబ్బో, అప్పుడే ప్రయారిటీస్‌ మారిపోయాయా? అంతలా తనని వెనకేసుకు వస్తున్నావ్‌. అంత అమాయకుడిలా ఏమీ కనపడటం లేదులే- పాపం అనుకోవడానికి’’ అన్నాను.

‘‘అక్కా ప్లీజ్‌’’ అంది.

నేనూ నవ్వేసి ‘‘మా చైత్ర నెమ్మదితనానికి ఆ మాత్రం గడుసుతనం జత కలవాలిలే శ్రావణ్‌’’ అన్నాను.

చాలాసేపు మాట్లాడుకున్నాక భోజనం అక్కడేచేసి, వాళ్ళ పెళ్ళి బాధ్యతని నామీదే వేసి శ్రావణ్‌ వెళ్ళటానికి లేచాడు. తనని సాగనంపటానికి వాకిలిదాకా వెళ్ళిన చైత్ర వచ్చేలోపలే, వాళ్ళు సాహచర్య మాధుర్యాన్ని తనివితీరా అనుభవించటానికి చేయవలసిన ఏర్పాట్లకు నాందిగా పిన్నివాళ్ళకి ఈ తీపికబురు తెలియచేయటానికి మొబైల్‌ కోసం లోపలికి పరిగెత్తాను.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.