close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
పేద పిల్లలకు కార్పొరేట్‌ చదువు!

పేద పిల్లలకు కార్పొరేట్‌ చదువు!

ఆంగ్ల మాధ్యమంలో చదువు, తరగతికి గరిష్ఠంగా 30 మంది విద్యార్థులు, విశాలమైన మైదానం... ఇన్ని ప్రత్యేకతలు ఉన్నాయంటే ఫీజులు వేలూ, డొనేషన్లు లక్షల రూపాయల్లో ఉంటాయని అనిపిస్తోంది కదా! కానీ ఇక్కడ చదువు ఉచితం!

నెల్లూరు జిల్లాకు చెందిన వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి గనుల తవ్వకంలో అంతర్జాతీయ వ్యాపారవేత్త. ఎంతో శ్రమంచి ఆర్థికంగా ఉన్నత స్థాయికి చేరారు. ‘ఇంత సంపాదించాను... సమాజానికి తిరిగి ఎంత ఇచ్చాను..?’ ఈ ప్రశ్న ఒకరోజు ఆయన మనసులో ఉదయించింది. అప్పుడే ‘వూహూ, ఇలా కాదు. సమాజానికి ఏదైనా చేయాలి’ అనుకున్నారు. అందుకు కుటుంబ సభ్యులూ మద్దతు పలకడంతో ‘వీపీఆర్‌ ఫౌండేషన్‌’ను ఏర్పాటుచేశారు.

చదువులో ముందడుగు
‘సేవ చేయాలి... కానీ ఎక్కడ మొదలుపెట్టాలి’ అన్న దగ్గర ప్రభాకర్‌రెడ్డి ఆగినపుడు... ‘వృద్ధులకు చేయూతనివ్వడం అవసరమే కానీ, భావి పౌరులైన పిల్లలకు మంచి చదువు చెప్పడం ఇంకా బావుంటుంది’ అని స్నేహితులూ, కుటుంబ సభ్యులూ సలహా ఇచ్చారు. రిషీవ్యాలీలో చదువుకున్న ప్రభాకర్‌కు చదువుల విలువ తెలియంది కాదు. దాంతో ‘వీపీఆర్‌ విద్య’ పేరిట నెల్లూరు నగరానికి సమీపంలోని కనపర్తిపాడు దగ్గర అత్యాధునిక వసతులతో పాఠశాలను ప్రారంభించారు. అందులో కార్పొరేట్‌ స్థాయిలో విద్యను ఉచితంగా అందిస్తున్నారు. 2016-17 విద్యా సంవత్సరంలో ప్రారంభమైన ఈ పాఠశాలలో మొదట 6-8 తరగతుల విద్యార్థుల్ని చేర్చుకున్నారు. ప్రవేశానికి వేల సంఖ్యలో దరఖాస్తులు రావడంతో అందరికీ పరీక్ష నిర్వహించి, తరగతికి 30 మంది చొప్పున 90 మంది విద్యార్థుల్ని ఎంపికచేశారు. ఏటా ఒక్కో తరగతినీ పెంచుకుంటూ 6-12 వరకూ మొత్తం 210 మందికి ఉచిత విద్యా బోధన చేయనున్నారు.

పేదలకే చోటు
విద్యార్థుల ఎంపికకు చదువు, వారి కుటుంబ ఆర్థిక నేపథ్యం ప్రధాన అర్హతలు. నిరుపేద కుటుంబాల పిల్లలకే ఇక్కడ చోటు ఉంటుంది. దరఖాస్తు సమయంలోనే విద్యార్థులకు సంబంధించిన రేషన్‌ కార్డు, ఆధార్‌ కార్డు వివరాలను తీసుకుని పరిశీలిస్తారు. అర్హత పరీక్షలో నెగ్గిన విద్యార్థుల కుటుంబ ఆర్థిక స్థితిగతుల్ని పరిశీలించాకే తుది జాబితాను ప్రకటిస్తారు. తల్లిదండ్రులు లేని పిల్లలూ, తల్లి లేదా తండ్రిలేని వాళ్లూ, ఇద్దరూ ఉన్నా పేదరికాన్ని అనుభవిస్తున్న వాళ్లని గుర్తించి ఎంపిక చేస్తారు. ఈ విద్యా సంవత్సరానికి ఆరో తరగతిలో 30 మందిని చేర్చుకున్నారు. ఆ 30 ఖాళీల కోసం 300 మంది పరీక్షకు హాజరయ్యారు. దీన్నిబట్టి ఆ పాఠశాలలో చదువుకు ఉన్న డిమాండ్‌ని అర్థం చేసుకోవచ్చు. పాఠశాలలో చేరిన విద్యార్థుల సంరక్షణ అంతా ఫౌండేషన్‌ చూసుకుంటుంది. విద్యార్థుల్ని రోజూ ఇంటి నుంచి బస్సుల్లో తీసుకొచ్చి సాయంత్రం మళ్లీ బస్సుల్లోనే పంపిస్తారు. స్కూల్లో చేరగానే నాలుగు జతల యూనిఫామ్‌, ఒక జత షూ అందిస్తారు. ఇంగ్లిష్‌ మీడియంలోనే పాఠాలు బోధిస్తారు. విద్యార్థులకు పాఠశాల ప్రాంగణంలోనే మధ్యాహ్న భోజనం ఏర్పాటుచేశారు. వారికి వడ్డించే పదార్థాలన్నీ ఫౌండేషన్‌కు చెందిన 26 ఎకరాల పొలంలో సేంద్రియ పద్ధతుల్లో సాగుచేసిన వరి, కూరగాయలూ, ఆకుకూరలతో వండినవే. ఇక్కడికి వచ్చే విద్యార్థుల ఆలోచనా విధానంలో మార్పు రావాలంటే ముందుగా తల్లిదండ్రుల మానసిక పరిస్థితీ బావుండాలి. అందుకే విద్యార్థుల తల్లిదండ్రులకు ప్రత్యేక కౌన్సిలింగ్‌ ఇస్తున్నారు.

ఇంకెన్నో సేవలు...
వీపీఆర్‌ ఫౌండేషన్‌ ఈ ఏడాది తన సేవల్ని మరికొన్ని విభాగాలకూ విస్తరించింది. పాఠశాల సమీపంలోనే ఒక ఆసుపత్రిని ఏర్పాటుచేశారు. ఇక్కడ ఓపీ సేవలు అందించే వైద్యులతోపాటు మహిళల ఆరోగ్య సమస్యలకు సంబంధించిన వైద్య నిపుణులు అందుబాటులో ఉంటారు. జిల్లా వ్యాప్తంగా వైద్య సేవలు అందించడానికి ‘చక్రాలపై వైద్యం’ పేరిట ఒక సంచార వైద్యశాలనీ ప్రారంభించారు. ఇంకా గ్రామాల్లో కంటి చూపునకు సంబంధించి వైద్య శిబిరాల్ని ఏర్పాటుచేసి అవసరమైనవారికి శస్త్రచికత్సలు ఉచితంగా చేయిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా గ్రామాల్లో తాగునీటి శుద్ధి ప్లాంట్లను ఏర్పాటు చేయిస్తున్నారు. రూ.3.5కోట్లతో వంద ప్లాంట్లను ఏర్పాటుచేయాలని లక్ష్యం పెట్టుకోగా ఇప్పటికే 31 గ్రామాల్లో ఏర్పాటుచేశారు. ప్లాంట్‌ ఏర్పాటుకు స్థలాన్ని ఇవ్వడంతోపాటు నిర్వహణ బాధ్యతను తీసుకోవడానికి ముందుకు వచ్చిన గ్రామాల్లో వీటిని ఏర్పాటుచేస్తున్నారు. విద్యుత్తు బిల్లులూ, మరమ్మతులకు అవసరమయ్యే ఖర్చుల కోసం వినియోగదారుల నుంచి నామమాత్రంగా కొంత మొత్తం వసూలు చేస్తారు. గ్రామాల్లో యువతను సంఘాలుగా ఏర్పాటుచేసి వారికి క్రీడా పరికరాల్ని ఇస్తున్నారు. గ్రామాల్లో చెత్త డబ్బాలను ఏర్పాటుచేసి ఆరుబయట చెత్త వేయకుండా చేసే బాధ్యతని యువకులకు అప్పగిస్తున్నారు.

వ్యాపారంలో ఎంత బిజీగా ఉన్నా ఎప్పటికప్పుడు ఫౌండేషన్‌ద్వారా చేపట్టే సేవా కార్యక్రమాల గురించి సిబ్బందిని అడిగి తెలుసుకుంటారు ప్రభాకర్‌. తన శ్రీమతి ప్రశాంతితో కలిసి తరచూ పాఠశాలకు వచ్చి విద్యార్థులతో మమేకమవుతారు. వారిద్దరూ పిల్లలకు భోజనాలు వడ్డిస్తూ బాగోగులు తెలుసుకుంటారు. సమాజసేవతో పొందే సంతృప్తికి ఏదీ సాటిరాదంటారు ప్రభాకర్‌.

- సీహెచ్‌.నాగేశ్వరరావు, ఈనాడు నెల్లూరు
ఫొటోలు: రాజా రమేష్‌

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.