close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
సర్కారు నిలబడింది

సర్కారు నిలబడింది

ఒకప్పుడు.. వలసెళ్లిన వూరులా బోసిపోయిన ఆ 32 బడులూ ఇప్పుడు ఆదర్శపాఠశాలలుగా నిలిచి వేలాది మంది విద్యార్థులతో కళకళలాడుతున్నాయి. మూతబడుతున్న ఎన్నో ప్రభుత్వ పాఠశాలలకు గుణపాఠాలు నేర్పుతున్నాయి.

‘అక్కడ ఒకటీ రెండూ కాదు.. 17 పాఠశాలలు మూతపడ్డాయి!’
‘ఆఁ ఇంగ్లిష్‌ నేర్పరు... టీచర్లు ఉండరు... కనీసం టాయిలెట్లు కూడా ఉండవ్‌! మరి అలాంటి ప్రభుత్వ స్కూళ్లు మూతపడక.. పిల్లలు పరుగెత్తుకుంటూ వస్తారా అనేయొచ్చు’
సరిగ్గా వినండి.. వింటున్నారా?
పైన మూతపడింది ప్రభుత్వ బడులు కాదు ప్రైవేట్‌ స్కూళ్లు.. రాజన్నసిరిసిల్ల జిల్లాలోని ఎల్లారెడ్డిపేట, వీర్నపల్లి మండలాల్లో ఉన్న ప్రభుత్వ పాఠశాలల అద్భుతమైన పనితీరు ముందు ప్రైవేటు పాఠశాలలు చేతులెత్తేశాయి. కారణం... ఉపాధ్యాయులూ, గ్రామస్థులూ విద్యార్థులు.. రాజయ్యలాంటి మంచి అధికారులూ..

చేపా.. చేపా ఎందుకు ఎండలేదు అనే కథ గుర్తుందా? సరిగ్గా అలాంటి కథే... ఎల్లారెడ్డిపేట, వీర్నపల్లి మండలాల్లోని ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి. ఇది ఏడేళ్ల క్రితం మాట. అవి పేరుకే బడులు. కానీ... అక్కడ పిల్లలు ఉండేవారు కాదు. ఎందుకూ అంటే... ఆంగ్ల మాధ్యమం లేదు. నర్సరీ చదువు లేదు. వసతుల మాట దేవుడెరుగు. ఎప్పుడు బడి తెరుస్తారో తెలియదు. మధ్యాహ్న భోజన సదుపాయం అంతంతమాత్రం. ఆయాలు, అటెండర్లే కాదు పాఠాలు చెప్పేందుకు ఒక్క ఉపాధ్యాయుడూ దిక్కులేడు. దీనికి తోడు ప్రైవేటు పాఠశాలల ప్రచారం. ఇవి చాలవా! ఆ బడులు మూతబడటానికి. సరిగ్గా అదే జరిగింది. ఈ సర్కారు బడుల్లో చదువుకోవడానికి ఎవరూ ముందుకు రాలేదు. మొత్తం 17 పాఠశాలలు ఉంటే అందులో రెండు అడ్రస్‌ లేకుండా పోయాయి. మరో 15 పాఠశాలలు మూసివేతకు సిద్ధం అయ్యాయి. కొంతకాలానికి ఆ వూర్లో ప్రభుత్వ బడులు ఉన్నాయనే విషయాన్నే మర్చిపోయారు ఆ వూరివాళ్లంతా.

చేయి చేయి కలిపితే అదెంత పని?
నాలుగు గోడలూ.. పైౖన కప్పు అదేనా బడంటే? కాదు.. రేపటి సమాజాన్ని నిర్మించే అద్భుతమైన ప్రయోగశాల. అందులో ప్రయోగాలు చేసే ఉపాధ్యాయుడి గుండెచప్పుడు. అందుకే ఎవ్వరికీ కాకుండా పోతున్న ప్రభుత్వ బడుల పరిస్థితి ఆ వూరి ఉపాధ్యాయులని కదిలించింది. ఆ తర్వాత ఆ కదలిక ప్రజల మెదళ్లనూ తొలిచింది. స్వయంగా ప్రజలే నడుంబిగిస్తే నాయకులు మాత్రం వూరికే ఉండిపోగలరా? ప్రజాప్రతినిధులు సహకరించారు. అన్ని వర్గాలు సమావేశమయ్యాయి. సమస్యలకు కారణాలను అనేక కోణాల్లో విశ్లేషించారు. ఆ సమస్యలేవీ పరిష్కరించలేనంత క్లిష్టమైనవి కావు. కావాల్సింది ఓ సమష్టితత్వం. అందుకే అంతా కలిసి అడుగు ముందుకు వేశారు.

క్రమ శిక్షణ

ఆంగ్లంతోపాటూ...
పిల్లలు బడుల్లో చేరాలంటే మారుతున్న సమాజ అవసరాలను దృష్టిలో పెట్టుకుని కొత్తకొత్త కోర్సులని, పాఠాలనీ వాళ్లకు నేర్పించాలి. సదుపాయాలు కల్పించాలి. ముందు ప్రభుత్వ పాఠశాలలో చదువంటే ఇష్టపడాలి. అందుకు తగినట్టుగా ప్రణాళికలు వేసుకున్నారు. అడుగులు ముందుకు వేసుకున్నారు. ఆంగ్లం చెప్పాలి కాబట్టి తెలుగుని దూరం చేయాలని ఎక్కడా అనుకోలేదు. అదే ఈ పాఠశాలలు తీసుకున్న గొప్ప నిర్ణయం. ప్రాథమిక తరగతుల్లో తెలుగు మాధ్యమాన్ని కొనసాగిస్తూనే... ఆంగ్లమాధ్యమాన్ని ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టారు. ఏదో చేశామంటే చేశాం అని కాకుండా...చిత్తశుద్ధితో పనిచేయడం మొదలుపెట్టారు. ప్రజలు, దాతలు, ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘాలు, ప్రజాప్రతినిధులు, యువజన సంఘాలు ఓ కమిటీగా ఏర్పడి పర్యవేక్షణ మొదలు పెట్టారు. ఆంగ్ల బోధనతోపాటు విద్యార్థుల సమగ్ర వికాస కేంద్రాలుగా ప్రభుత్వ బడులను తీర్చిదిద్దడం మొదలుపెట్టారు. 2010లో ప్రభుత్వ పాఠశాలల పరిరక్షణే లక్ష్యంగా ‘మన బడి- మనందరి బాధ్యత’ కార్యక్రమాన్ని రెండు గ్రామాల్లోని ప్రాథమిక పాఠశాలల్లో ప్రవేశపెట్టారు. మంచి ఫలితాలు రావడంతో ఇతర గ్రామాల ప్రజలు ఆ స్ఫూర్తిని అందిపుచ్చుకున్నారు. . దీంతో ‘మన బడి- మనందరి బాధ్యత’ విజయం 32 పాఠశాలలకు విస్తరించింది.

చలో.. చేలో..

ఎలాంటి మార్పులొచ్చాయి...
స్కూలు బస్సులూ.. టైలూ, బ్యాడ్జీలతో కనిపించే అక్కడి పిల్లలని చూస్తే ఎవరూ ప్రభుత్వ స్కూల్లో చదువుతున్న విద్యార్థులని అనుకోరు. ఈ రెండు మండలాల్లోని 32 పాఠశాలల్లో కార్పొరేట్‌ పాఠశాలలకు దీటుగా బోధన జరుగుతోంది. కావాల్సినంత మంది విద్యావలంటీర్లు, సహాయక సిబ్బంది ఉన్నారు. వాళ్లకు జీతాలు ఇవ్వడానికి కావాల్సిన నిధిని సమకూర్చుకున్నారు. వీటన్నింటికోసం ఏడేళ్లలో ప్రజలు రూ. కోటి వరకు ఖర్చు చేశారు. ఎల్లారెడ్డిపేట, వీర్నపల్లి మండలాల్లో 32 మంది ప్రజాప్రతినిధులు, 12 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు వారి పిల్లలను స్థానికంగా ఉండే ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించి స్ఫూర్తిగా నిలిచారు. సొంతంగా స్కూల్‌ బస్సులు ఉన్నాయి. విద్యార్థులకు టై, బెల్టు, బ్యాడ్జీలు సహా ప్రత్యేక ఏకరూప దుస్తులను అందిస్తున్నారు. పాఠశాలల్లో చిన్నపాటి మరమ్మతులకు నిధులు వెచ్చిస్తున్నారు. ఉపాధ్యాయులూ తమవంతుగా విరాళాలు అందిస్తున్నారు. గత ఏడాది ప్రభుత్వం ప్రాథమిక స్థాయిలో ఆంగ్లమాధ్యమానికి అనుమతులివ్వడం, అంగన్‌వాడీ కేంద్రాలను ప్రాథమిక పాఠశాలలకు అనుసంధానం చేయడం వంటి నిర్ణయాల అమలుతో ఈ పాఠశాలలన్నీ మరింత బలపడ్డాయి. నాటి నుంచి నేటి వరకు ప్రాథమిక తరగతుల్లో 2200 మంది విద్యార్థులు కొత్తగా చేరగా 520 మంది చిన్నారులు పూర్వ ప్రాథమిక విద్యను అభ్యసిస్తున్నారు.

కళల్లో ముందడుగు

ఇది టీచర్ల విజయం..
టైం అయితే చాలు ఇంటికెళ్లిపోదామనే ధోరణి ఇక్కడి ఉపాధ్యాయుల్లో కనిపించదు. అంకిత భావంతో పనిచేస్తూ తమ అదనపు సమయాన్నీ పాఠశాలలకు కేటాయిస్తున్నారు. ప్రత్యేక శ్రద్ధతో ఇంగ్లిష్‌ బోధిస్తున్నారు.
* విద్యా నాణ్యతను పెంచేందుకు జవాబు పత్రాలను తల్లిదండ్రులకే పంపిస్తున్నారు.
* క్రమం తప్పకుండా ఎస్‌ఎమ్‌సీ సమావేశాలను నిర్వహిస్తూ విద్యా ప్రగతిని సమీక్షిస్తున్నారు.
* తల్లిదండ్రుల ఎదుటే విద్యార్థుల ప్రతిభాపాటవాలను ప్రదర్శిస్తున్నారు. ఇలా చేయడం ద్వారా తల్లిదండ్రుల భాగస్వామ్యాన్ని పెంచుతున్నారు.
* వెనుకబడిన విద్యార్థులకు వారి స్థాయికి తగిన సిలబస్‌తో ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. పాఠశాల రోజువారీ తరగతి నిర్వహణను డైరీ ద్వారా తల్లిదండ్రులకు తెలుపుతున్నారు.
* ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటూ విద్యార్థుల ప్రగతిని తల్లిదండ్రులకు ఎస్‌ఎంఎస్‌ల ద్వారా పంపిస్తున్నారు.
* పాఠశాలలకు సొంత వెబ్‌సైట్‌లను ఏర్పాటు చేసుకోవడం ద్వారా కార్యక్రమాలను అందులో పొందుపరుస్తున్నారు. ప్రొజెక్టర్‌, కంప్యూటర్లలతో ఆన్‌లైన్‌ పాఠాలను బోధిస్తున్నారు.

12 ప్రైవేటు పాఠశాలలే మూసేశారు...
ప్రభుత్వ విద్యాలయాల్లో తీసుకువచ్చిన సంస్కరణల దెబ్బకు ప్రైవేటు పాఠశాలలు కుదేలయ్యాయి. వాటిలో నుంచి సర్కారు బడులకు వలసల మొదలయ్యాయి. 17 ప్రైవేటు పాఠశాలల్లో పన్నెండింటిని మూసివేయాల్సి వచ్చింది. విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగిపోవడంతో నాడు వెలవెలబోయిన ప్రభుత్వ పాఠశాలలు నేడు కళకళలాడుతున్నాయి. ఎల్లారెడ్డిపేట, వీర్నపల్లి మండలాల్లో కలిపి 44 ప్రాథమిక, 8 ప్రాథమికోన్నత, 11 ఉన్నత పాఠశాలలతోపాటు గిరిజన సంక్షేమ బాలికల ఆవాస పాఠశాల, కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం, ఆదర్శపాఠశాలలలో ప్రస్తుతం మొత్తం 6753 మంది చదువుతున్నారు. వారిలో బాలురు 3121 కాగా బాలికలు 3632 ఉన్నారు. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా పరిధిలో విద్యార్థులు లేక 750 ఉపాధ్యాయ స్థానాలు రద్దు చేశారు. ఎల్లారెడ్డిపేట మండలానికి వచ్చే సరికి పరిస్థితి భిన్నం. ఇక్కడి ప్రాథమిక పాఠశాలల్లో ఈ కార్యక్రమానికి ముందు 164 ఉపాధ్యాయ స్థానాలుండగా... ప్రస్తుతం 199కి పెరగడం ఇక్కడి విజయానికి నిదర్శనం. ‘సామాజిక భాగస్వామ్యం- బడులు బలోపేతం’ అనే నినాదంతో సరస్వతి నిలయాలను ఉన్నత ప్రమాణాలతో తీర్చిదిద్దిన ఎల్లారెడ్డిపేట, వీర్నపల్లి మండలాలు రాష్ట్రానికే ఆదర్శంగా నిలుస్తున్నాయి.

* ఇల్లెందుల రాజిరెడ్డి, న్యూస్‌టుడే, ఎల్లారెడ్డిపేట

* ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో విద్యార్థుల్లేక 750 ఉపాధ్యాయ స్థానాలు రద్దుచేస్తే... ఇందుకు భిన్నంగా ఈ రెండు మండలాల్లో పోస్టులు పెరగడం గమనార్హం.
* ఉపాధ్యాయులు తమ జేబు నుంచి రూ.4 లక్షల వరకూ ఖర్చుపెట్టారు. విద్యావాలంటీర్లకు జీతాలు ఇస్తున్నారు.
* సొంత వెబ్‌సైట్లూ.. ఆన్‌లైన్‌లో పాఠాల బోధన జరుగుతోంది.

 

అలుపెరగని రాజయ్య

 
కేంద్రమంత్రి స్మృతి ఇరాని చేతుల మీదుగా రాజయ్యకు పురస్కారం

మొత్తం విజయం వెనుక ఒక అధికారి అకుంఠిత దీక్ష కూడా ఉంది. పట్టుదల, చిత్తశుద్ధి, నిజాయతీ, లక్ష్యం కోసం పనిచేసే తత్వం ఉంటే ఏదైనా సాధ్యం చేయవచ్చని నిరూపించిన ఆయన మండల విద్యాధికారి మంకు రాజయ్య. మొదట ఈయనో సామాన్య ప్రభుత్వ ఉద్యోగి. స్కూల్‌ అసిస్టెంటు. ఆయనకి ప్రభుత్వ పాఠశాలలకు సంబంధించిన అనేక సవాళ్లు స్వాగతం పలికాయి.. ప్రాథమిక పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య క్రమంగా తగ్గిపోయి మూసివేసే దశకు చేరుకున్నాయి. ఈ పరిస్థితిని మార్చాలనుకున్నారు. గ్రామాల్లో స్థానికులతో కలిసి ఇంటింటా ప్రచారం చేశారు. ‘మన బడి - మనందరి బాధ్యత’ అనే నినాదంతో కదిలారు. కదిలించారు. అద్భుత ఫలితాలు సాధించారు. ఎంఈవో రాజయ్య కృషిని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం జాతీయ ఉత్తమ విద్యా పరిపాలన అధికారిగా ఆయనను ఎంపిక చేసింది. ఆ ప్రతిష్ఠాత్మక అవార్డును దిల్లీలో కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి స్మృతి ఇరాని చేతుల మీదుగా అందుకున్నారు.
‘ఆంగ్లం నేర్పించడం మాత్రమే మా లక్ష్యం కాదు.. తెలుగుకు ప్రాధాన్యం తగ్గించకుండా, విద్యార్థుల్లో బడికి రావాలనే ఉత్సాహాన్ని కలిగించడం లక్ష్యంగా అడుగులు ముందుకు వేస్తున్నాం’ - రాజయ్య.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.