close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ఆ ముందడుగు మహిళలవైపు!

ఆ ముందడుగు మహిళలవైపు!

ఆన్‌లైన్లో ఆర్డరిచ్చిన వస్తువుల్ని చేరవేసే వాళ్లని మామూలుగా అబ్బాయిల్నే చూస్తుంటాం. కానీ ఆ రంగంలో అమ్మాయిలు ఎందుకుండకూడదు అనుకుంది ‘హే దీదీ’ సంస్థ. అందుకే అచ్చంగా ఆడవాళ్లతోనే పార్సిల్‌ సర్వీసును ప్రారంభించింది. ముంబయి, బెంగళూరు మహానగరాల్లో ఆన్‌లైన్‌ ఆర్డర్ల పార్సిళ్లు అందించడమే కాదు అప్పటికప్పుడు వస్తువుల్ని చేరవేయడానికీ పనిచేస్తోన్న ఈ సంస్థ మానవ వనరుల్ని అందించే రంగంలో కొత్త దిశలో ముందడుగేసింది.

హానగరాల్లో ఒక చోట నుంచి మరో చోటుకి ప్రయాణం చేయాలంటే గంటల సమయం పడుతుంది. హడావిడిలో ఏ ముఖ్యమైన ఆఫీసు కాగితాన్నో మర్చిపోయామంటే తిరిగివెళ్లి తెచ్చుకోవడం ఎంతో కష్టం. దగ్గరి వాళ్ల వేడుక... వెళ్లేందుకు కుదరకపోయినా ఆ సమయానికి బహుమతి పంపుదాం అనుకుంటాం. పనుల్లో పడిపోయి... ఆ విషయం చివరి నిమిషంలో గుర్తొస్తుంది. అప్పటికప్పుడు వాటిని అందించడానికి ఒక మనిషి దొరికితే బాగుండు అనిపిస్తుంది. అచ్చంగా ఇలాంటి సందర్భాల్లోనే తన సంస్థకు చెందిన మనుషుల్ని పంపిస్తుంది హే దీదీ... వస్తువు ఏదైనా వేగంగా చేరవేయడానికి వ్యక్తుల్ని అందించడం ఈ సంస్థ విశేషమైతే, అచ్చంగా ఆడవాళ్లనే ఇందుకు వినియోగించడం దీని ప్రత్యేకత.

సేవలు ఇలా...
ఈ సంస్థ పనిచేస్తున్న నగరాల్లో నివసించేవాళ్లు ఎవరైనా సంస్థ వెబ్‌సైట్‌ heydeedee.com లోకి వెళ్లి, అడ్రస్‌ పంపితే సంస్థలో పనిచేసే అమ్మాయిలు వెంటనే బైక్‌ మీద అక్కడికి చేరుకుంటారు. అక్కడి నుంచి వాళ్లు ఏ ప్రాంతానికి ఆ వస్తువులు అందించాలో చెబితే, పనైపోయినట్టే. వీళ్లు... వేడుకల ఆహ్వానాలూ, బహుమతులూ, ఆహారపదార్థాలూ, సరకులూ ఏవి ఎవరికి అందించమంటే వాళ్లకి అందిస్తారు. మందులూ, ఆస్పత్రి రిపోర్టులూ, టికెట్లూ, చెక్కులూ, బిల్లులూ, అత్యవసర డాక్యుమెంట్లనూ జాగ్రత్తగా చేరవేసేందుకు పనిచేస్తారు. హే దీదీ సంస్థలో ఇప్పటికి 100 మంది మహిళలు ఉద్యోగులుగా ఉన్నారు. ఒక్క హేదీదీ సంస్థ కోసం పనిచేసేందుకే కాదు మిగతా ఆన్‌లైన్‌ సంస్థలూ, రెస్టారెంట్లూ తదితరాలకు డెలివరీ పర్సన్‌లను సమకూర్చేందుకూ ఈ సంస్థ పనిచేస్తుంది. ప్రస్తుతం అమెజాన్‌, సబ్‌వే, పిజ్జాహట్‌, సియట్‌ తదితర ఎన్నో సంస్థలు హేదీదీ సేవల్ని వినియోగించుకుంటున్నాయి.

ఆమె అడుగే...
ఆడవాళ్లు పనిచేయని ఈ రంగంలోకి మహిళాశక్తిని తీసుకురావడం వెనుక ఉన్నది సీరియల్‌ సోషల్‌ ఎంట్రప్రెన్యూర్‌గా పేరు తెచ్చుకున్న 57 ఏళ్ల రేవతి రాయ్‌. సుఖాల నుంచి కష్టాల వైపూ... కష్టాల నుంచి సుఖాల వైపూ మళ్లిన ఆమె జీవితం నలుగురి జీవితాల్నీ సుఖాలవైపు నడిపించే దిశగా సాగింది. రేవతిది ఉన్నతంగా బతికిన కుటుంబమే. ఆమె తన భర్తతో కలిసి ప్రింటింగ్‌ ప్రెస్‌, లెదర్‌ ఫ్యాక్టరీల పనులు చూసుకుంటూ ఉండేవారు. కానీ 2004లో ఆమె భర్తకు గుండెపోటు వచ్చి కోమాలోకి వెళ్లే సరికి ఆయన్ను బతికించుకోవడానికి సుమారు 3 కోట్ల రూపాయల వరకూ ఖర్చు పెట్టారు రేవతి. కానీ ఫలితం లేకపోయింది. ఆస్పత్రి ఖర్చులకు ఇంటితో సహా అన్నీ అమ్మేసిన ఆమె ముగ్గురు పిల్లలతో ఒంటరిగా మిగిలారు. సరదాకి తాను నేర్చుకున్న కార్‌ డ్రైవింగ్‌ను వృత్తిగా చేసుకోవాలని అప్పుడే అనుకున్నారు. స్నేహితుల దగ్గర అప్పుచేసి ఒక టాక్సీని కొని ముంబయి ఎయిర్‌పోర్టు నుంచి టాక్సీ నడపడం ప్రారంభించారు. తర్వాత మహిళా డ్రైవర్లకు తానే శిక్షణఇస్తూ మూడు టాక్సీలతో ‘ఫర్‌ షి’ అనే మహిళా టాక్సీ సర్వీసును ప్రారంభించారు. కార్పోరేట్‌ మహిళల్ని క్షేమంగా ఇంటికి చేర్చడమే లక్ష్యంగా ఈ సర్వీసు పనిచేసేది. మీడియాలో దీనికి మంచి కవరేజీ రావడంతో స్పాన్సర్లూ, భాగస్వాములూ వచ్చారు. ఫర్‌ షి టాక్సీల సంఖ్య 20కి చేరింది. 2009లో ఆమె ఫర్‌ షిని వదిలి మహిళలకే ప్రత్యేకమైన మరో సర్వీసు ‘వీరా’ను ప్రారంభించారు. తర్వాత ఆడవాళ్లను బైక్‌లూ, స్కూటర్లను నడపడంలో నిపుణుల్ని చేయాలన్న దిశలో ఆలోచన చేశారు. పెరుగుతున్న ఆన్‌లైన్‌ అమ్మకాల నేపథ్యంలో డెలివరీ రంగంలో పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు ఉంటాయని గుర్తించి 2016లో ఆడవాళ్లకు బైక్‌ నడపడం నేర్పి, లైసెన్సులు ఇప్పించే సంస్థ ‘జాఫిరో లెర్నింగ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌’ను స్థాపించి, వాళ్లకు ఉద్యోగాలను తామే కల్పించేలా ‘హే దీదీ’ని ప్రారంభించారు.

ఇందులో పనిచేసే మహిళలంతా దారిద్య్రరేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు చెందినవాళ్లే. హేదీదీ ద్వారా ఉద్యోగం పొందాలంటే ముందుగా రూ.1500 ఫీజుకట్టి జాఫిరోలో చేరాలి. శిక్షణకయ్యే మిగతా 10వేల రూపాయలను ప్రభుత్వం, టెక్‌మహీంద్రా సంస్థలు అందిస్తున్నాయి. శిక్షణ అయ్యాక బండి కొనుక్కునేందుకూ సంస్థ సాయం చేస్తుంది. ప్రస్తుతం జాఫిరో ముంబయితో పాటు బెంగళూరు, పుణె, నాగ్‌పూర్‌లలోనూ దాదాపు 2900 మందికి శిక్షణ ఇస్తోంది. హేదీదీ కార్యకలాపాలు బెంగళూరులోనూ వూపందుకున్నాయి. హైదరాబాద్‌, నాసిక్‌లలోనూ సంస్థను విస్తరించే ఆలోచనలు సాగుతున్నాయి. 2018 కల్లా పదివేల మంది మహిళల్ని పార్సిల్‌ డెలివరీ రంగంలోకి తీసుకురావాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నారు రేవతి. కొన్ని వందల మంది మహిళల జీవితాల్లో వెలుగులు నింపిన ఈమెను గతేడాది నీతి ఆయోగ్‌ ‘ఉమెన్‌ ట్రాన్స్‌ఫార్మింగ్‌ ఇండియా’ అవార్డుతో సత్కరిస్తే, ఫోర్బ్స్‌ పత్రిక శక్తిమంతమైన మహిళల ప్రత్యేక సంచికలో కవర్‌ పేజీ మీద స్థానాన్ని కల్పించింది. మారుతున్న కాలంతో పాటు అవకాశాల్ని అందిపుచ్చుకునేలా ఆడవాళ్లను తీర్చిదిద్దుతున్న ఈమె ముందడుగును ఎవరుమాత్రం అభినందించకుండా ఉండగలరు మరి!

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.