close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
అనాథ పిల్లలకు అన్నీ తానై..!

అనాథ పిల్లలకు అన్నీ తానై..!

కష్టం విలువ కష్టాలు పడినవారికన్నా బాగా ఇంకెవరికి తెలుస్తుంది... ఎనిమిదిమంది సంతానం ఉన్న కుటుంబంలో పేదరికంతో సావాసం చేసి, బాధలతో కాలం గడిపిన ఆ కుర్రాడు చదువుకోవడానికి ఎన్నో ఇబ్బందులు పడ్డాడు. వసతిసౌకర్యాల కోసం అనాథాశ్రమంలో పిల్లల బాగోగులు చూసే పనికి కుదిరాడు. అందుకే, తనలా ఇంకెవరూ కష్టపడకూడదని అనాథపిల్లలకూ పేద పిల్లలకూ ఆశ్రయం ఇచ్చి చదివిస్తున్నాడు.

పెద్ద ఉద్యోగాలు సంపాదించాలనీ ఉన్నంతలో గొప్పగా జీవించాలనీ సరదాగా గడపాలనీ యువత కలలు కనడం సహజం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని తోగ్గూడేనికి చెందిన రామటెంకీ రమేష్‌కీ ఓ కల ఉండేది. పీజీ పూర్తి చేశాక వీలైనంత త్వరగా ఏదైనా ఉద్యోగంలో చేరి ఎంతో కొంత సంపాదించాలనీ ఆ కలను నెరవేర్చుకోవాలనీ తపన పడ్డాడు. అనుకున్నట్లే ఉద్యోగం వచ్చింది. ఇక ఆగలేదు. పాతికేళ్ల వయసులోనే ‘మాతృ అభయ ఫౌండేషన్‌’ పేరుతో అనాథాశ్రమాన్ని స్థాపించాడు. అవును, అతడి కల అదే. తెలంగాణలోని మేడ్చల్‌ జిల్లా మేడిపల్లి ఫరిధిలోని విశ్వం విహార్‌ కాలనీలో ఉన్న ఈ ఆశ్రమంలో ప్రస్తుతం అరవైమంది అనాథ పిల్లలు ఆశ్రయం పొందుతున్నారు. వారి ఆలనాపాలనా చూడటం, వసతి సౌకర్యాలు కల్పించడమే కాదు, ఉన్నత చదువులు చదివించే బాధ్యతను కూడా తీసుకున్నాడు రమేష్‌.

ఇదీ నాంది...
రమేష్‌ తల్లిదండ్రులది చాలా పేద కుటుంబం. దానికితోడు ఎనిమిదిమంది పిల్లలు. చాలా కష్టపడి కుటుంబాన్ని నెట్టుకొచ్చేవాడు తండ్రి. రమేష్‌ పాఠశాల చదువు మధ్యలో ఉండగానే ఆయన మరణించాడు. దాంతో ఆర్థిక ఇబ్బందులు మరింతగా చుట్టుముట్టాయి. తర్వాత గురుకుల బాలుర వసతి గృహంలో చేరి కొంతకాలం చదివాడు. అయినా, చిన్నచిన్న అవసరాలకూ డబ్బుల కోసం ఇబ్బంది పడాల్సిన పరిస్థితి. ఆ సమయంలోనే తన అన్నయ్య స్నేహితుడు ఒకరు హైదరాబాద్‌లో అనాథశరణాలయం నడిపిస్తున్నాడని తెలిసి అందులో చేరాడు. ఆశ్రమంలో ఉండే పిల్లల్ని చూసుకుంటూ వారికి వంట చేసిపెడుతూ చదువుకునేవాడు. అక్కడ అమ్మానాన్నా లేని పిల్లల్ని చూసి, ‘ఇలాంటి పిల్లలు ఇంకెందరు ఉన్నారో, వాళ్లందరూ చదువుకి దూరమైనట్లేగా’ అని ఆలోచించేవాడు. ఎప్పటికైనా అలాంటి వారికోసం తానూ ఆశ్రమాన్ని ప్రారంభించాలని నిర్ణయించుకున్నాడు. తన కోరిక నెరవేరాలంటే ముందు ఏదైనా మంచి ఉద్యోగం సంపాదించాలన్నది అతడి ఆలోచన. 2009లో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎంఎస్సీ పూర్తిచేశాక ఓ కార్పొరేట్‌ కాలేజీలో లెక్చరర్‌ ఉద్యోగంలో చేరి మాతృ అభయను స్థాపించాడు. ఆశ్రమానికి అవసరమైన రెండు గదుల షెడ్డుని ఓ దాత నిర్మించి ఇచ్చాడు. మొదట్లో ఇక్కడ పద్దెనిమిది మంది చిన్నారులు ఉండేవారు. నెమ్మదిగా ఆ సంఖ్య పెరిగింది. వారిని దగ్గర్లో ఉన్న ప్రైవేటు, ప్రభుత్వ విద్యాసంస్థల్లో చేర్పించాడు రమేష్‌. ప్రస్తుతం మాతృ అభయలో నర్సరీ నుంచి డిగ్రీవరకూ చదువుతున్న 60 మంది విద్యార్థులున్నారు. ఉదయం లేచినదగ్గర్నుంచి వారికి వండిపెట్టడం, ఇతర అవసరాలను చూడటం, ట్యూషన్లు చెప్పడం వంటి పనులతోనే సరిపోతుండటంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఉద్యోగాన్ని కూడా వదిలేశాడు అతను. పిల్లల ఫీజులూ బట్టలూ వసతి సౌకర్యాలతో కలిపి ఆశ్రమాన్ని నడిపేందుకు ఏడాదికి దాదాపు రూ.14 లక్షలు ఖర్చవుతోంది. ఆ మొత్తాన్నీ స్నేహితులూ తెలిసినవాళ్లూచేసే ఆర్థికసాయంతోనే సమకూర్చుకుంటున్నాడు. పిల్లలు బట్టలు ఉతుక్కోవడానికి వాషింగ్‌ మెషీన్లూ పాఠశాలకు వెళ్లి రావడానికి అవసరమైన వ్యాను... అన్నీ దాతలు ఇచ్చినవే. ప్రధానంగా ఇన్ఫోసిస్‌లో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేసే రవి, అతని సహోద్యోగులతో పాటు ఆశ్రమానికి దగ్గర్లో ఉండే సురేందర్‌రెడ్డి ఎంతో చేయూతను అందిస్తున్నారు. కొందరు దాతలు విద్యార్థులకు ఫీజులు కడుతుంటే పుట్టినరోజు, పెళ్లిరోజు లాంటి వేడుకల్ని ఆశ్రమంలో జరుపుకుని వంటసామగ్రి అందిస్తుంటారు మరికొందరు. దుస్తులూ పుస్తకాలూ బ్యాగుల్ని ఏటా 25మంది దాతలు సమకూరుస్తుంటారు.

అన్నీ తానై!
మహబూబ్‌ నగర్‌ జిల్లాలోని కల్వకుర్తి గ్రామానికి చెందిన గంగోత్రి పసివయసులోనే తల్లిదండ్రుల్ని కోల్పోయింది. పిల్లలులేని ఓ జంట ఆ పాపని దత్తత తీసుకుంది. తర్వాత వారికి పిల్లలు పుట్టడంతో గంగోత్రిని వదిలేశారు. తెలిసినవాళ్లు మాతృ అభయలో చేర్పించడంతో ఇప్పుడు తొమ్మిదో తరగతి చదువుతోంది. మరో చిన్నారి అఖిల తల్లిదండ్రులు పశువుల్ని కాసేందుకు అడవికి వెళ్లి వరదలో కొట్టుకుపోయారు. స్థానిక అంగన్‌వాడీ టీచర్‌ సాయంతో ఆ చిన్నారి ఆశ్రమానికి చేరుకుంది... ఇలా చెప్పుకుంటూ పోతే రమేష్‌ ఆశ్రయమిస్తున్నవారిలో ఒక్కొక్కరిదీ ఒక్కో దీనగాథ.

‘తండ్రిని కోల్పోయి చదువుకోవడానికి నేను పడిన కష్టాలు ఇంకొకరు పడకూడదు. అందుకే, మాతృ అభయను ప్రారంభించాను. నర్సరీ నుంచి అయిదో తరగతి చదివే చిన్నారుల్ని నేనే దగ్గరుండి చూసుకుంటా. పెద్ద పిల్లల్లో అమ్మాయిలూ అబ్బాయిలకు వేరువేరు వసతి గృహాలున్నాయి’ అంటారు రమేష్‌. అతడి మంచి మనసు మరింత మందికి సాయం చెయ్యాలని కోరుకుందాం.

- తేరాల రంజిత్‌ కుమార్‌, ఈనాడు, హైదరాబాద్‌
ఫొటోలు: సుదర్శన్‌, న్యూస్‌టుడే, బోడుప్పల్‌

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.