close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ఆ వూరు స్టీరింగ్‌ పట్టింది!

ఆ వూరు స్టీరింగ్‌ పట్టింది!

పల్లెటూరంటే, అక్కడ అందరికీ వ్యవసాయమే జీవనాధారం. తేల్చినా ముంచినా సాగుతోనే వారి జీవితాలు సాగిపోతాయి. కొన్నాళ్ల కిందటి వరకూ ఆ గ్రామంలోనూ అదే పరిస్థితి ఉండేది. కానీ దాదాపు మూడు దశాబ్దాల కిందట ఆ వూళ్లొని యువకులు నాగలి వదలి స్టీరింగ్‌ పట్టారు. డ్రైవింగ్‌నే తమ వృత్తిగా మార్చుకున్నారు. ఎందుకూ ఎలా అంటే...

తెలంగాణాలోని జయశంకర్‌ భూపాలపల్లి పరిసర ప్రాంతాల్లో ఒకప్పుడు అంతా దట్టమైన అడవులు ఉండేవి. నాటి వరంగల్‌ జిల్లాలోనే అత్యధికంగా అటవీ విస్తీర్ణం ఉన్న ప్రాంతమిది. ఈ ప్రాంతంలో ప్రజల రాకపోకలకోసం జీపులూ, ట్రావెల్‌ బస్సులూ నడిచేవి. అటవీ ఉత్పత్తుల రవాణాకూ లారీలు వచ్చేవి. కొందరు యువకులు వాటిలో క్లీనర్లుగా చేరి క్రమంగా డ్రైవింగ్‌ నేర్చుకున్నారు. అలా దాదాపు నలభై ఏళ్ల కిందటే ప్రస్తుత భూపాలపల్లి నగర పంచాయతీ పరిధిలోని ఖాసీంపల్లి గ్రామం నుంచి మేకల రాజయ్య మొదటి డ్రైవర్‌ అయ్యాడు. అతడి బాటలోనే ఆ వూరంతా నడుస్తుందని అప్పటికి ఎవరూ వూహించి ఉండరు. ఆ తర్వాత అయిదారేళ్లకు ఇక్కడ గుర్తించిన బొగ్గు నిక్షేపాలను వెలికితీసేందుకు ప్రభుత్వం ‘సింగరేణి కాలరీస్‌’ను ఏర్పాటుచేసింది. తవ్వితీసిన బొగ్గును హైదరాబాద్‌, విజయవాడ, బెంగళూరు తదితర ప్రాంతాలకు లారీలద్వారా తరలించేవారు. కాంట్రాక్టర్ల దగ్గర లారీలు ఉండేవి కానీ డ్రైవర్ల కొరత ఉండేది. ఆ సమయంలో ఖాసీంపల్లి యువత గురించి తెలుసుకుని కాంట్రాక్టర్లు వారిని లారీ డ్రైవర్లుగా, క్లీనర్లుగా పెట్టుకునేవారు. భూములున్నా సాగునీటి సౌకర్యాలు లేకపోవడం, వర్షాభావం, బొగ్గు తవ్వకాలతో భూగర్భ జలాలు అడుగంటిపోవడం... ఇలా రకరకాల కారణాలతో గ్రామంలో యువత నాగలి వదిలి స్టీరింగ్‌ పట్టారు.

వందల మంది
వ్యవసాయం లాభసాటి కాకపోవడంతో ఎన్ని కష్టాలొచ్చినా, నష్టాలొచ్చినా డ్రైవింగ్‌ని విడవని వారెందరో ఉన్నారా వూళ్లొ. వీరిలో తండ్రీ కొడుకులూ, అన్నదమ్ములూ ఉన్నారు. బొగ్గు గనుల నుంచి రవాణా చేసే లారీల్లో డ్రైవర్లూ క్లీనర్లుగా మారిన కొందరు తరవాత కాలంలో యజమానులుగా మారారు. 2000 సంవత్సరం నుంచి ఇక్కడి గనుల్లో తవ్వకాలు గణనీయంగా పెరిగాయి. దీంతో లారీల అవసరం మరింత ఏర్పడింది. ఆ సమయంలో కొందరు గ్రామస్థులు లారీలను కొనుగోలు చేశారు. కొందరు ప్రైవేటు అప్పులు చేసీ, మరికొందరు బ్యాంకులూ, ఫైనాన్స్‌ సంస్థల నుంచి రుణాలు తీసుకుని మరీ కొన్నారు. గ్రామంలో 600 ఇళ్లుంటే దాదాపు ప్రతి ఇంటికీ ఒక లారీ ఉండేది. రోడ్డుమీద ద్విచక్ర వాహనాలు ఆగి ఉన్నట్టు లారీలు ఉండేవి. ఆ లారీల మీద ఆధారపడేవాళ్ల సంఖ్యా దాదాపు రెట్టింపు అయింది. పిల్లల చదువులు బాగా నడిచేవి. ఆడపిల్లల పెళ్లిళ్లూ బాగా జరిగేవి. అంతా సవ్యంగా నడుస్తుందనుకుంటున్న దశలో వారి జీవితాల్లో ఒక కుదుపు. గనులకు సమీపంలోనే జెన్‌కో విద్యుదుత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. దాంతో దూర ప్రాంతాలకు బొగ్గు సరఫరా చేయాల్సిన అవసరం పోయింది. ఆ దశలో లారీలన్నీ ఇళ్లముందే ఆగిపోయాయి. అప్పటికే రుణాల్ని పూర్తిగా తీర్చేసింది ఒకరిద్దరు మాత్రమే. మిగిలిన వారిలో కొందరు భూముల్ని అమ్మి అప్పులు తీర్చారు. కొన్ని లారీల్ని ఫైనాన్సు కంపెనీలు జప్తు చేసుకోగా, మరికొన్నిటిని నష్టానికే అమ్ముకుని రుణాల్ని తీర్చారు. ఇప్పుడు ఇంటికో లారీ లేకపోయినా ప్రతి ఇంట్లోనూ ఓ డ్రైవర్‌ ఉన్నాడు. వారికి తెలిసిన వృత్తి డ్రైవింగ్‌ మాత్రమే. అందుకే మళ్లీ అందులోనే కొనసాగారు. ఈసారి జీతాలు కూడా తగ్గిపోయాయి. ఒకప్పుడు నాలుగు లారీలకు యజమాని అయిన తిరుపతి, మూడు లారీల ఓనర్‌ సురేందర్‌రెడ్డి తర్వాత సింగరేణి ఉపరితల గనిలో లారీ డ్రైవర్లుగా మారారు. అలా మారినందుకు తామేమీ బాధపడటం లేదంటారు వీళ్లు.

ఉల్లాసంగా ఉత్సాహంగా
ప్రస్తుతం ఎక్కువమంది సింగరేణి ఉపరితల గనుల్లో పనిచేస్తున్నారు. ఈ గనుల్లో బొగ్గు తవ్వేటపుడు వచ్చే వృథా మట్టిని వీరు లారీలతో సమీప ప్రాంతాలకు తరలిస్తుంటారు. ప్రస్తుతం వీరి నెల జీతం రూ.13,500. బయటి టిప్పర్లూ, ఇతర సరకు రవాణా లారీల్లో డ్రైవర్లుగా వెళ్లేవారికి నెలకు రూ.12వేలు వరకూ వస్తుంది. వాటితోనే కుటుంబాలను పోషించుకుంటున్నారు. ఉపరితల గనుల్లో ఒప్పంద పద్ధతిన సుమారు 80 మంది పెద్ద పరిమాణంలో ఉండే వోల్వో లారీలకు డ్రైవర్లుగా, ఇంకా టిప్పర్లూ సరకు తరలింపు లారీలూ, ట్యాంకర్లూ, కార్లూ నడిపేవారితో కలిపి ఖాసీంపల్లి గ్రామంలో ప్రస్తుతం 500 మంది వరకూ డ్రైవర్లుగా ఉపాధి పొందుతున్నారు. శ్రమకు తగ్గ ఫలితం ఉండటంలేదంటూ ప్రభుత్వం ముందుకు వచ్చి తమకు మంచి వేతనాలు అందేలా చేసేరోజు ఎప్పటికైనా వస్తుందని వారంతా ఆశగా ఎదురుచూస్తున్నారు. ఆర్థిక ఇబ్బందులూ, ఇతర కష్టాల గురించి మాట్లాడేది స్టీరింగ్‌ పట్టనంతవరకే, ఒకసారి డ్రైవర్‌ సీట్లో కూర్చున్నాక ఎంతో ఉల్లాసంగా, ఉత్సాహంగా బండి పోనివ్వడం ఒక్కటే వాళ్లకి తెలుసు!

- సోగాల స్వామి, ఈనాడు డిజిటల్‌, భూపాలపల్లి
ఫొటోలు: తోట శ్రీనివాస్‌

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.