close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
మళ్లీ పుట్టారా..?

మళ్లీ పుట్టారా..?

  ‘మనం’ సినిమా గుర్తుందా? నాగార్జున, శ్రియ, చైతన్య, సమంతా ప్రమాదంలో మరణిస్తారు, మళ్లీ పుడతారు... అచ్చం అవే రూపాలతో. ‘మగధీర’లోనూ అంతే. ఆ సినిమాల్లో చూపించినట్లు పునర్జన్మలు ఉన్నాయా లేవా అన్న అంశాన్ని కాసేపు పక్కనపెడితే, నిజజీవితంలోనూ- ఏనాడో చనిపోయిన కొందరు ప్రముఖుల్ని పోలినవాళ్లు మళ్లీ పుడితే, వాళ్లూ సెలెబ్రిటీలయితే ఆశ్చర్యం కలగడం సహజమే కదూ..!
ఫేస్‌బుక్‌ వ్యవస్థాపకుడైన మార్క్‌ జుకర్‌బర్గ్‌ గురించి తెలియని వాళ్లు ఉండరంటే అతిశయోక్తి కాదు. అయితే పదిహేడో శతాబ్దానికి చెందిన స్పెయిన్‌ చక్రవర్తి, నాలుగో ఫిలిప్‌ చిత్రాన్ని చూసినవాళ్లు మాత్రం ఆ బొమ్మనీ, జుకెర్‌బర్గ్‌నీ మార్చి మార్చి చూడటం మాత్రం ఖాయం. అంత అచ్చు గుద్దినట్లుగా ఉండటం ఎలా సాధ్యమా అని ఆశ్చర్యపోవడమూ అంతే సహజం.
ఎంజో ఫెరారి... స్పోర్ట్స్‌ కారు సృష్టికర్త. స్వస్థలం ఇటలీ. పుట్టిన తేదీ 18, ఫిబ్రవరి 1898. వ్యాపారవేత్త, రేసింగ్‌ డ్రైవర్‌ కూడా. కారు టెస్ట్‌ డ్రైవర్‌గా కెరీర్‌ ప్రారంభించిన ఫెరారి, తరవాతికాలంలో తనే ఫెరారి ఆటోమొబైల్స్‌ నెలకొల్పాడు. స్కుడెరియా ఫెరారి గ్రాండ్‌ ప్రిక్స్‌ మోటర్‌ రేసింగ్‌ వ్యవస్థాపకుడు కూడా. 14 ఆగస్టు 1988న తొంభై ఏళ్ల వయసులో ఆయన ఇటలీలోనే మరణించాడు. అయితే ఆయన్ని పోలిన వ్యక్తి మరోచోట పుట్టడమే ఇక్కడి విశేషం. అతనే మెసుట్‌ ఓజిల్‌. అంతర్జాతీయ ఫుట్‌బాల్‌ క్రీడాకారుడిగా పేరొందిన ఓజిల్‌, ఫెరారి మరణించిన మూడు నెలల అనంతరం జర్మనీలో 15అక్టోబరు 1988లో పుట్టడం కాకతాళీయమే కావచ్చు. కానీ ఇద్దరూ పోలికల్లోనే కాదు, నచ్చిన ఆటల్లో రాణించడం చెప్పుకోదగ్గవిషయం.
సెబాస్టియన్‌ డె మోరా... 17వ శతాబ్దంలో స్పెయిన్‌ను పరిపాలించిన నాలుగో ఫిలిప్‌ చక్రవర్తి కోర్టులో హాస్యాన్ని పండించిన మరుగుజ్జు వ్యక్తి. డిగో వెలాజ్‌కెస్‌ అనే చిత్రకారుడు గీసిన ఆనాటి చిత్రానికి ప్రతి సృష్టే నేటి పీటర్‌ డింక్‌లిజ్‌. 1969లో పుట్టిన పీటర్‌, టీవీ, సినీనటుడూ, నిర్మాత. ఎన్నో అవార్డుల్నీ అందుకున్నాడు. టీవీ నటుల్లో అత్యధిక పారితోషికం తీసుకునేవాళ్లలో పీటర్‌ ఒకరు. 4 అడుగుల 5 అంగుళాల ఎత్తుండే పీటర్‌ సైతం మరుగుజ్జు కావడం మరో కొసమెరుపు.
కేటూ-డూప్లికేటుల్లా ఎవరు ఎవరో చెప్పలేనట్లుగా ఉంటారు రొమానియాకి చెందిన నికొలాయ్‌ గ్రిగొరెస్కు, బ్రిటన్‌ నటుడైన ఓర్లాండొ బ్లూమ్‌లు. ఆధునిక రొమానియా చిత్రకళకు ఆద్యుడైన నికొలాయ్‌ 1838లో జన్మించి, 69 ఏళ్ల వయసులో 1907లో మరణించాడు. 1977లో పుట్టిన ఓర్లాండో కుంచె పట్టుకుని చిత్రాలను చిత్రించకున్నా కళాఖండాల సేకరణలో మంచి అభిరుచి ఉన్న వ్యక్తి.
మిలార్డ్‌ ఫిల్‌మోర్‌, అలెక్‌ బాల్డ్‌విన్‌లను చూసినవాళ్లెవరయినా కవలసోదరులు అనే అనుకుంటారు. కానీ కనిపిస్తున్న వీళ్లిద్దరికీ రెండు తరాల అంతరం ఉంది. 1958లో అమెరికాలో పుట్టిన అలెక్‌ హాలీవుడ్‌ నటుడు, రచయిత, నిర్మాత, కమెడియన్‌ కూడా. 1874లో మరణించిన అమెరికా 13వ అధ్యక్షుడైన మిలార్డ్‌ ఫిల్‌మోర్‌కు ప్రతిబింబంలా కనిపించే బాల్డ్‌విన్‌ చూసినవాళ్లెవరయినా చకితులవ్వాల్సిందే.
ఈ పెయింటింగ్‌లోని వ్యక్తి పేరు పాల్‌ మోనెట్‌(1847-1922). ఫ్రాన్స్‌కు చెందిన వైద్యుడు, నటుడు కూడా. ఎన్నో నాటకాల్లో నటించిన ఆయనకు షేక్‌స్పియర్‌ హామ్లెట్‌ ఎంతో ప్రాచుర్యం తీసుకొచ్చింది. ఆయన ఎన్నో సినిమాల్లోనూ నటించాడు. హృద్రోగంతో ఫిబ్రవరి 10, 1922న మరణించాడు. అయితే 1964 సెప్టెంబరు 2వ తేదీన లెబనాన్‌లో పుట్టిన కియానూ ఛార్లెస్‌ రీవ్స్‌ ఆయనకు జిరాక్సు కాపీలా ఉండటమే కాదు, పాల్‌లానే నటుడు కూడా. హాలీవుడ్‌ నటుడిగా పేరొందిన రీవ్స్‌ దర్శకుడు, నిర్మాత, మంచి గిటార్‌ వాద్యకారుడు.
లియోన్‌ ట్రటస్కీ, బెన్‌ ష్వార్జ్‌... ఇద్దరూ చూడ్డానికి ఒకేలా ఎంతో అమాయకంగా కనిపిస్తారు. 1879లో పుట్టిన లియోన్‌, సోవియట్‌ రష్యా నాయకుడు, మార్క్సిస్టు ఉద్యమకారుడు. 1981లో అమెరికాలో పుట్టిన బెన్‌ నటుడు, రచయిత, కమెడియన్‌. వృత్తి, ప్రవృత్తిలో ఏమాత్రం సంబంధం లేని వీరిద్దరి రూపంలో తేడా పసిగట్టడం కష్టమే మరి.

వీళ్లే కాదు, ఆల్బర్ట్‌ ఐన్‌స్టీన్‌, లూయీవీటన్‌... ఇలా మరణించిన వాళ్ల పోలికలతో ఉన్నవాళ్లు చాలామందే ఉన్నారు. అంటే మన తాత ముత్తాతల్ని పోలినవాళ్లూ ఎక్కడో ఉండే ఉంటారా... ఏమో!

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.