close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ఫలితం

ఫలితం
డి.వి.జి.శంకరరావు

వైజాగ్‌ జగదాంబ జంక్షన్‌. ఈ జంక్షన్‌ క్రాస్‌ చేస్తుంటే చాలు, నా ఒళ్ళు ఒక్కసారిగా చల్లబడిపోతుంది.గుండెల్లో దడ, ఏదో తెలియని భయం... చుట్టూ ఉన్న బిల్డింగులూ, సినిమా హాలూ, బస్టాపూ... అన్నీ మినియేచర్‌ బొమ్మల్లా అనిపిస్తాయి. మనుషులు మరుగుజ్జుల్లా... కాదు కాదు చీమల్లా హడావుడిగా ఇష్టమొచ్చిన దిశల్లో కదులుతున్నట్టు ఫీలింగు. బహుశా ఆరు మాసాల క్రితం ఇక్కడే జరిగిన సంఘటన వల్ల కావొచ్చు...ఈ ఇల్యూజన్‌, చిత్తభ్రాంతి.

ఆరోజు కూడా ఇలాగే ఈ జంక్షన్‌ మీదుగా వెళ్తున్నాను. అయితే ఈ రోజులా కార్లో కాదు- బైక్‌ మీద.
అప్పటికి కారు లేక కాదు... బైక్‌ ఇష్టమై. ఏభై ఏళ్ళొచ్చినా ఎంత దూరమైనా బైక్‌ మీద వెళ్ళే నా సరదా- మా ఆవిడకీ, పిల్లలకీ కూడా నచ్చదు. అందులోనూ మేముంటున్న విజయనగరంలో కాకుండా వేరే వూళ్ళొ కూడా ఇలానే చేగువేరాలా మోటార్‌సైకిల్‌ని ఎంజాయ్‌ చేయడం అస్సలు నచ్చదు. నాకు నా ఉద్యోగంతో సంబంధం లేకుండా పొలాలూ పుట్రలూ కొనడం ఎలా వ్యసనమో ఇదీ అలానే. అయితే, ఆరోజు జగదాంబ జంక్షన్‌ ఇప్పటిలా డిస్టార్టెడ్‌గా కనబడలేదు. ఉదయాన్నే అందంగా కొంచెం మంచు దుప్పటి కప్పుకుని కనబడింది. అలా టర్నింగ్‌ తిరిగానో లేదో... అదే అప్పటికి గుర్తున్న ఆఖరి సన్నివేశం... శబ్దం వినడమే తెలుసు... ఎలా జరిగిందో, ఏం జరిగిందో తెలియని అయోమయం. కొంతసేపటికి రోడ్డుమీదపడి ఉన్నానని అర్థమైంది. కళ్ళు తెరవలేకపోతున్నాను. శబ్దాలు వినబడుతున్నాయి. అలికిడి పెరుగుతోంది. ఒళ్ళంతా నొప్పి. అతి కష్టమ్మీద కళ్ళు కొంచెం తెరిచే ప్రయత్నం చేశాను. లీలగా ఒక యువకుడు నావైపు పరుగున వస్తున్నాడు. కొంచెం ధైర్యమనిపించింది. మన కష్టాన్ని ఎదుటివాడు ఏమాత్రం తగ్గించలేకపోయినా, పక్కనే ఉన్నాడన్న భరోసా ధైర్యాన్నిస్తుందేమో మరి! వచ్చినవాడు వచ్చినట్టే నా తల దగ్గరకు చేరాడు. ఆదరాబాదరాగా తన మొబైల్‌ ఓపెన్‌ చేశాడు. ఆత్రుతలోపడి అంబులెన్స్‌ నంబర్‌, హాస్పిటల్‌ నంబర్‌, పోలీస్‌ నంబర్‌ డయల్‌ చేయడానికి చేతులు వణుకుతున్నాయేమోనని అర్థం చేసుకున్నాను. అయితే, అది సెల్ఫీ తీసుకోవడమని ఆ కుర్రాడి పోజు చూస్తే అర్థమైంది.
రెండోవైపు నుండి మాటలు వినబడుతున్నాయి. తల తిప్పలేను కాబట్టి మసక మసకగానైనా కనబడే ఛాన్సు లేదు.
‘‘రక్తం చాలా పోయిందిరా... ఎంతోసేపు బతకడం కష్టం.’’
‘‘అంతేనంటావా, పాపం ఎవడో... పోలీసులకి ఫోన్‌ చేద్దామా?’’
‘‘భలేవాడివిరా. వాళ్ళు యాక్సిడెంట్‌ మనమే చేశామంటారు. ఎందుకొచ్చిన గొడవ, పోదాం పద.’’
మరి వినలేకపోతున్నాను. వినకుండా చెవులు మూసుకోనూలేను. చుట్టూ వాహనాలు వస్తూ పోతూన్న శబ్దాలతో చెవులు చిల్లులుపడుతున్నాయి. చాలామంది గుమిగూడి ఉన్నట్లు అర్థమవుతోంది. ఆడ గొంతులూ, ఇంగ్లిషు గొంతులూ, యువ గొంతులూ... అన్నిట్లో ఒకటే భావం- అయ్యో పాపం. బహుశా ఈపాటికి సోషల్‌ మీడియా అంతా సెల్ఫీలతో, కామెంట్లతో నిండిపోయే ఉంటుంది. అంతా బిజీగా ఉన్నారు. అసలు చేయాల్సిన పని తప్ప అంతా చేస్తున్నారు.
ఇక బతుకుతానన్న ఆశ పోతోంది... మెలమెల్లగా నా స్పృహలాగే!
‘వీళ్ళు చదువుకుంటున్న నాగరీకులా’ అన్న భావం ముంచెత్తుతోంది... మీద పడ్తున్న మగతలాగే!
మళ్ళీ ఆ సీను వరకూ అదే ఆఖరి జ్ఞాపకం.
కళ్ళు తెరిచి చూస్తే హాస్పిటల్‌ బెడ్‌ మీద ఉన్నాను. భార్యా పిల్లలూ చుట్టూ ఉన్నారు. సుఖాంతం. ఆ సంఘటనకి సంబంధించి ఇంతకన్నా డీటైల్స్‌ పెద్దగా తెలీవు. తెలిసిన చిన్నచిన్న విషయాలు అప్రస్తుతం కూడా.

* * *

ఆ పల్లెటూర్లో వెంకట్రావుగారి ఇల్లు కనుక్కోవడం కష్టం కాలేదు. గేటు ముందు కారాగగానే ఓ పద్దెనిమిది ఏళ్ళ యువకుడు ముందుకొచ్చి ఆహ్వానించాడు.
‘‘ఇంట్లోకి రండంకుల్‌. నాన్నగారిప్పుడే వస్తారు’’ అంటూ కూర్చోబెట్టాడు.
‘‘ఏం చదువుతున్నావు బాబూ?’’
‘‘ఇంటర్‌మీడియట్‌ సెకండ్‌ ఇయర్‌ ఎగ్జామ్‌ రాయాలంకుల్‌.’’
‘‘ఈరోజు కాలేజీకి వెళ్ళలేదా? ఈ వూర్లో పిల్లలు చదవాలంటే వైజాగ్‌ వెళ్ళాల్సిందేనా?’’
‘‘అవునంకుల్‌. అయితే నేను కాలేజీకి వెళ్ళడం లేదు. ఇది పోయిన సంవత్సరం ఉండిపోయిన పరీక్ష. మళ్ళీ రాయాల్సి ఉంది.’’
ఈలోగా ఆ అబ్బాయికేదో ఫోన్‌ వచ్చింది. ‘‘ఎక్సూ్యజ్‌ మీ అంకుల్‌...’’ అంటూ అటు ఫోన్‌ ఆన్సర్‌ చేస్తున్నాడు. ‘‘ఒరేయ్‌, మీరు గ్రౌండ్‌కి వెళ్ళండిరా, పది నిమిషాల్లో వచ్చేస్తాను.’’ నేను షాక్‌ తిన్నాను ఆ నిర్లిప్త ధోరణికి.
పిల్లలంతా 90 శాతం మార్కులొచ్చినా సంతోషించలేని పరిస్థితుల్లో సతమతమవుతుంటే ఇంత బాధ్యతారహితంగా ఫెయిలవడం ఒకటైతే, సాదాసీదాగా దాన్ని తీసుకోవడం మరొకటి. ఏమాత్రం గిల్టీ ఫీలింగు లేకుండా ఆటలూ పాటలూ సెల్‌ఫోన్లూ.
నా ఆలోచనల్లో ఉండగానే ఆ అబ్బాయి చెప్పాడు- ‘‘అంకుల్‌, నాన్న వస్తున్నారు. మీరూ మీరూ మాట్లాడుకోండి, నేను బయటకు వెళ్ళాలి.’’
‘‘బాబూ, ఒక్క మాట...’’
‘‘చెప్పండంకుల్‌’’ సెల్‌ఫోన్‌ చూస్తూనే బదులిచ్చాడు.
‘‘సరిగ్గా చదువుకుంటేనే భవిష్యత్తు. మీ అమ్మా నాన్నలు కష్టపడేది మీ భవిష్యత్తు బాగుండాలనే. ఫెయిలవడమంటే సిగ్గుపడాలి. మా అబ్బాయి నీ వయసువాడే. అన్నీ అమర్చాను. అయినా ఏవీ మిస్‌యూజ్‌ చేయలేదు. చక్కగా ఇప్పుడు ఇంజినీరింగు చేస్తున్నాడు. మరి, ఈ పల్లెటూర్లో... ఇన్ని అసౌకర్యాల మధ్య నువ్వెంత ఎక్కువ కష్టపడాలీ..? ఆటలూ పాటలూ అంటే ఎలా?’’ కడుపులో ఉన్నది వెళ్ళగక్కాను.
‘‘థాంక్యూ అంకుల్‌, వస్తానూ’’ అంటూ బయటకు ఉరికాడు.
వెంకట్రావుగారు వస్తూనే ‘‘క్షమించండి, అర్జెంట్‌ పనిమీద వీధిలోకి వెళ్ళాను. మావాడు కంపెనీ ఇచ్చాడా..? ఒక్క క్షణం నిలవలేడు’’ అంటూ సంజాయిషీ మొదలెట్టారు.
ఆ గొంతులోని పుత్రోత్సాహానికి నాకు ఒళ్ళు మండింది. అయినా ‘నాకనవసరం’ అనుకుంటూ మాటలు కొనసాగించాను.

* * *

‘‘పదండి, పొలం చూసొద్దాం’’ అంటే కాలినడకనే బయల్దేరాం. వూరిని ఆనుకునే ఉందది. చక్కగా పంటతో ఉంది. నీటి వసతి లేకపోయినా ఏపుగా ఉన్న పంట- రైతు కష్టాన్నీ శ్రద్ధనీ తెలియజేస్తోంది. పొలం మీద ఎంతో ప్రేమ ఉంటేనేగానీ సాధ్యం కాదు ఇలా పెంచడం.
‘‘వెంకట్రావుగారూ, పొలాన్ని చూస్తుంటే- సొంత బిడ్డని సాకుతున్నట్టు సాకుతున్నారు. మరెందుకు అమ్మాలని చూస్తున్నారు?’’
‘‘అందులో ఆశ్చర్యపడాల్సిందేముందండీ? అవసరాలలాంటివి. చిన్న కష్టమొచ్చినా అదే ఆధారం. కొంచెం పెద్ద కష్టమొస్తే అమ్ముకోవడమే ఏకైక మార్గం. మధ్యేమార్గం ఏముందండీ, ఇది ప్రతీ రైతు కథే. మాకిది మామూలే. పంట చేతికొచ్చే వరకూ మదుపులు పెట్టాల్సిందే’’ అంటూ వంగి గట్టుమీద ఉన్న ఒక కలుపు మొక్కని పట్టి లాగాడాయన.
‘‘మీ పర్సనల్‌ విషయాలు ప్రస్తావిస్తున్నానని ఏమనుకోకండి వెంకట్రావుగారూ. ఇలాంటి పరిస్థితుల్లో మీ అబ్బాయి పరీక్షలు తప్పడమేమిటండీ... మీరు కొంచెం బాధ్యత నేర్పాలి కదా.’’
‘‘ఓహ్‌, వాడు మాట కలిపాడా మీతో. వాడంతే, సగమే చెప్తాడు. నాక్కూడా అసలు విషయం వాడి స్నేహితుల ద్వారానే తెలుస్తుంది...’’ నా అయోమయాన్ని చూస్తూ కొనసాగించాడు. ‘‘వాడు ఫెయిలవలేదండీ... చదువు మీద శ్రద్ధ ఉన్నవాడే వాడు. పరీక్ష ఒకటి రాయలేదంతే! రాసి ఉంటే ఈపాటికి ఏదో మెడికల్‌ కాలేజీలో ఫస్టియర్‌లో ఉండేవాడు. నాకా నమ్మకముంది. ఆ పరీక్ష రోజు సెంటర్‌కి ఆటోలో వెళ్తూండగా జగదాంబ సెంటర్లో ఒక యాక్సిడెంట్‌ చూశాడట. ఒకాయన రోడ్డుమీద పడి ఉంటే అంతా చోద్యం చూస్తున్నారట. వెంటనే ఆగి, ఆయన్ని హాస్పిటల్లో చేర్పించి, వాళ్ళింటికి తెలియచేసి వెళ్ళేలోగా పరీక్షకి అనుమతించే టైముకన్నా గంట లేటయిందట. తర్వాత ఇన్‌స్టంట్‌ రాయడమూ వీలు కాలేదు...’’
షాక్‌ మీద షాక్‌ ఇది. నా ప్రాణాలు నిలిపింది ఈ కుర్రాడా!? నన్ను పోల్చుకోలేదంటే తను ఎవరికి సాయం చేశాడో కూడా గుర్తుంచుకోలేదు, గమనించుకోలేదన్నమాట.
అప్రయత్నంగా అడిగాను ‘‘మరి, మీరేం అనలేదా?’’
‘‘అనడానికేముందండీ, ప్రాణంకన్నా ఏం ఎక్కువ? విద్యార్థుల పరీక్షల్లో ‘సోషల్‌ బిహేవియర్‌’కి కూడా మార్కులుంటే బాగుండేది కదా, వీడికి ఫస్టు మార్కులొచ్చి ఉండేవి అనిపించింది.’’
ఎంతో తేలిగ్గా అన్న ఆయన మాటలతో నాకు ఆయన మీదనే కాదు, యావత్‌ మానవజాతి మీదనే గౌరవం కలిగింది. భవిష్యత్తు మీద నమ్మకం మిగిలింది.
‘‘మీరేమీ అనుకోకండి వెంకట్రావుగారూ, మీ పొలం మీతోనే ఉండనివ్వండి. అవసరమైనంత డబ్బు నేను అప్పుగా ఇస్తాను. చేతిలోకి సొమ్ము రాగానే తీర్చేద్దురుగానీ. పొలమైనా, రానున్న తరమైనా సరిగ్గా సాకగల చేతిలో ఉన్నప్పుడే ఫలవంతం అయ్యేది’’ అని చెప్పి వెనుదిరిగాను.
ఈసారి క్రాస్‌ చేసినపుడు జగదాంబ జంక్షన్‌ మళ్ళీ అందంగానే కనబడింది.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.