close
భళా... బాహుబలి థాలీ!

భళా... బాహుబలి థాలీ!

బాహుబలి బిర్యానీ, భళ్లాల దేవ చికెన్‌ 65, దేవసేన దోశ, అవంతిక ఆలూ గోబీ ఫ్రై... ప్రస్తుతం దేశవ్యాప్తంగా వివిధ హోటళ్లలో నడుస్తోన్న బాహుబలి మెనూ మానియా ఇది. టేబుల్‌ అంత ప్లేటులో యాభైఅరవై రకాల వంటకాలతో ఏ బాహుబలో దిగొస్తేగానీ తినలేనంత భారీ విందుభోజనాలు ఈ ట్రెండ్‌ ప్రత్యేకత. కుంభకర్ణ థాలీ, బకాసుర థాలీ, రాజభోగం, మహరాజా భోజనం లాంటివీ ఆ కోవలోనివే. ఒక్కటి మాత్రం నిజం... వీటిలో ఏ భోజనాన్ని తినాలన్నా ఒక్కరు సరిపోరు. పళ్లెం చుట్టూ జనం ఉండాల్సిందే!

బాహుబలి... ఓ అద్భుతం. ఓ ఘన విజయం. దాదాపు అయిదేళ్లపాటు జనం మంత్రంలా జపించిన పేరు. అంతకు మించిన బ్రాండ్‌ వ్యాపారానికి ఇంకేం ఉంటుంది. అందుకే, ఆ సినిమా దుస్తులమీద ఫ్యాషన్‌ ప్రింట్లుగా మారి అమ్మాయిల్ని చుట్టుకుంది. నగల్లో దూరి మెడను అలంకరించింది. పిల్లల బొమ్మల్లో చేరి ఆడించింది. ఆ క్రేజ్‌ అక్కడితోనూ ఆగలేదు. ఇప్పుడు హోటళ్లలోకీ అడుగుపెట్టింది. వెండితెరమీద కనులకు ఎంత విందు చేసిందో బాహుబలి థాలీ పేరుతో అంతకుమించిన విందుని నోటికీ రుచి చూపిస్తోంది. మామూలుగా హోటళ్లకెళ్లి భోజనం కోసం ఆర్డరిస్తే అన్నం, రోటీ, ఓ స్వీటూ నాలుగైదు కూరలూ పప్పూ పచ్చడీ రసం పెరుగూ లాంటి వాటితో భోజనం పళ్లెం(థాలీ) ఇస్తారు. కానీ బాహుబలి పేరుతో వచ్చిన థాలీ అలా ఇలా ఉంటే ఎలా... అసలు ఆ పళ్లాన్ని ఎత్తాలంటేనే బలమైన బాహువులు ఉండాలన్నంత గొప్పగా ఉండాలి... అంతటి శక్తిమంతుడు తప్ప మరెవరూ తినలేనన్ని పదార్థాలూ ఉండాలి... ఇక, ఆ రుచులు మహారాజులు తినేంత ఘనంగా ఉండాలి... అందుకే, టేబుల్‌కి సరిపోయేంత ప్లేటులో రకరకాల వంటకాలతో నోరూరించే రుచులతో బాహుబలి థాలీని అతిథులకు వడ్డిస్తున్నాయి హోటళ్లు. ముంబై, పుణెల్లోని ‘ఆవోజీ ఖావోజీ’ హోటల్‌ ఇచ్చే బాహుబలి థాలీలో అయితే పది రకాల పరాఠాలూ ఆరు రకాల డెజర్ట్‌లూ మూడు అన్నం వెరైటీలూ రెండు రకాల రోటీలూ 13 రకాల కూరలూ రెండు పటియాలా లస్సీలూ అప్పడాలూ పెరుగూ వెన్నా సలాడ్లూ ఉంటాయి. ఈ హోటల్‌లో రజనీకాంత్‌, సన్నీలియోని, దీపికా పదుకొణె, సచిన్‌ తెందుల్కర్‌... ఇలా బోలెడంతమంది సెలెబ్రిటీల పేర్లతోనూ థాలీ భోజనాలున్నాయి. ఇక్కడ పెట్టే కుంభకర్ణ భోజనాన్ని దంపతులు ఇద్దరూ కలిసి 45 నిమిషాల్లోపు తినగలిగితే పదకొండువేల రూపాయల్ని బహుమతిగా అందుకోవచ్చట. అంటే దాన్ని తినడం అంత కష్టమన్నమాట. అహ్మదాబాద్‌కి చెందిన రాజ్‌వాడు హోటల్‌ యాభై అరవై పదార్థాలతో వడ్డించే బాహుబలి థాలీ కూడా ఎంతో ప్రాచుర్యంపొందింది. పుణెలోని ‘హౌస్‌ ఆఫ్‌ పరాఠా’ హోటల్‌ బాహుబలి పరాఠా ఛాలెంజ్‌ పేరుతో ఓ థాలీని అందిస్తోంది. దీన్లో పేద్ద పేద్ద బాహుబలి పరాఠాలతో పాటు దేవసేవ పరాఠా, కట్టప్ప బిర్యానీ, శివగామి షాహి పక్‌వాన్‌, భళ్లాలదేవ పటియాలా లస్సీ, అయిదు రకాల స్నాక్స్‌, అయిదు డెజర్టులూ, మిల్క్‌షేక్‌, సలాడ్‌, వూరగాయలూ, పచ్చళ్లూ, మూడు రకాల ఐస్‌క్రీమ్‌లతో విందుభోజనాన్ని పెడతారు. ఈ మొత్తాన్నీ ఒక్కరు తినాలన్నది పోటీ. వద్దనుకున్నవారు కుటుంబంతోనూ స్నేహితులతోనూ కలిసి అన్ని రుచుల్నీ ఆస్వాదించొచ్చు.

కుంభకర్ణ థాలీ... బకాసుర థాలీ...
నిజానికి అతిథుల్ని ఆకర్షించడానికి కుంభకర్ణ థాలీ, బకాసుర థాలీ... పేర్లతో పేద్ద పళ్లెంలో ఎక్కువ సంఖ్యలో వంటకాలను వడ్డించే హోటళ్లు ఇంతకుముందే ఉన్నాయి. అయితే, ఈతరం వారు బాహుబలికీ అందులోని పాత్రలకూ ఎంత త్వరగా కనెక్ట్‌ అవుతారో తెలిసిందే. అందుకే, బాహుబలి థాలీ తెరమీదికొచ్చాకే అవీ సోషల్‌ మీడియాలో బాగా ప్రాచుర్యంలోకొచ్చాయి. హైదరాబాద్‌లోని డైన్‌హిల్‌ హోటల్‌ కూడా పేద్ద ప్లేటులో హైదరాబాద్‌ బిర్యానీతో పాటు రకరకాల భారతీయ, అరబిక్‌ వంటకాలను అందిస్తోంది. ‘ఆ పళ్లెంలో స్నేహితులతో కలసి తినడం ఎంతో మజాగా ఉంటుంది’ అంటుంటారు అక్కడికొచ్చే యువత. అంతేకాదు, తింటూనే సెల్ఫీలు తీసుకుని ఫేస్‌బుక్‌, ట్విటర్లో పోస్ట్‌ చేసేస్తుంటారు కూడా. తెలుగు రాష్ట్రాల్లోని మరికొన్ని హోటళ్లూ ‘మహరాజా భోజనం’ పేరుతో పదుల సంఖ్యలో శాకాహార మాంసాహార వంటకాలు నింపిన పళ్లేలను అతిథుల ముందు ఉంచుతున్నాయి. బెంగళూరులోని ఓషియన్‌ పర్ల్‌ హోటల్‌ వడ్డించే బకాసుర థాలీలో 56 రకాల వంటకాలుంటాయి. ఇక, ముంబైలోని మహారాజభోగ్‌ హోటల్‌లో ఏకంగా టేబులే ఓ ప్లేటు. దాన్లోనే 36 రకాల వంటకాలను వడ్డిస్తారు. చెప్పాలేకానీ భారీ విందుభోజనాల లిస్టు భారీగానే ఉంది. పళ్లేలు పెద్దవి కానీ ఈ థాలీలన్నిటి ధరా రూ.500 నుంచి 2000 లోపే ఉంది. ఎలాగో కుటుంబం మొత్తం వెళ్లి కడుపునిండా తినాలంటే అంతకన్నా ఎక్కువే అవుతుంది. పైగా ఇన్నిరకాల రుచులు ఒకేసారి తినే అవకాశం ఉండదు. అందుకే, బాహుబలి థాలీలు అంత ప్రాచుర్యం అవుతున్నాయి.

ఇక థాలీలతో సంబంధం లేకుండా మెనూలో వంటకాలకు బాహుబలి పాత్రల పేర్లు పెట్టి వినూత్నంగా వడ్డిస్తున్న హోటళ్లైతే ఎన్నో.
చూస్తుంటేనే నోరూరిపోతోంది కదూ...

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.