close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
కర్మయోగం గీతాసారం

కర్మయోగం గీతాసారంమనిషి కష్టాల్లో ఉన్నప్పుడు, సంశయంలో మునిగినప్పుడు, ఘర్షణ పడుతున్నప్పుడు, నైరాశ్యంలోకి వెళ్లినప్పుడు... ఇలా వెళ్లు - అని దిశానిర్దేశం చేయగలిగిన వ్యక్తుల్నే మనం గురువులుగా పిలుస్తాం. అచ్చంగా ఇలాంటి లక్షణాలన్నీ భగవద్గీతలోనూ ఉన్నాయి. విషయమేదైనా సందర్భమేదైనా ఒక సమస్యకు ఆత్మసంతృప్తి కలిగేలా చక్కటి పరిష్కారమివ్వగల సత్తా ఈ గ్రంథానికి ఉంది. అందుకే ఏ ఒక్క మనిషికో బృందానికో కాదు ఒక జాతికే దిశానిర్దేశం చేయగల మహోన్నత గ్రంథంగా శోభిల్లుతోంది. (నవంబరు 30 గీతా జయంతి)

భారతం ఓ అద్భుత ఇతిహాసం. అందులోని పాత్రలూ ఒకదానికొకటి సరితూచలేనంత మహోన్నతమైనవి. బుద్ధిపరంగా, బలం పరంగా, జ్ఞానం పరంగా ఎందరో ధీరులు ఇందులో మనకు తారసపడతారు. అయితే వారిలోని గుణదోష భేదాల కారణంగా కొందరు కౌరవుల పక్షానా మరికొందరు పాండవుల పక్షానా నిలబడ్డారు. కురుక్షేత్ర మహాసంగ్రామం ఆ కావ్యంలోని అద్భుత ఘట్టం. ఒక పక్క పాండవులూ, మరో పక్క కౌరవులూ... అక్షౌహిణుల కొద్దీ సైన్యం... గుర్రపుడెక్కల చప్పుళ్లూ... మదగజాల ఘీంకారాల మధ్య గంభీరవాతావరణం అది. అవతలి పక్క తనకు గురువులూ, మిత్రులూ, మేనమామలూ, మనవలనూ చూసిన అర్జునుడి మనసు వాళ్లతో యుద్ధం చేయడానికి అంగీకరించదు. తనను చంపడానికి వాళ్లు సిద్ధంగా ఉన్నారని తెలిసినా సరే, అంతమందినీ ఎదుర్కొనగల సమర్థుడైనా సరే... పాశాన్ని వీడలేకపోతాడు. అందుకే,

న కాంక్షే విజయం కృష్ణ
న చ రాజ్యం సుఖాని చ
కిం నో రాజ్యేన గోవిన్ద
కిం భోగైర్జీవితేన వా... అంటాడు.

కృష్ణా... ఆ యుద్ధంలో కలిగే విజయం కానీ, రాజ్యం కానీ, దాని ద్వారా వచ్చే సుఖాల పట్ల కానీ నాకు కోరికలేదు... అలాంటి రాజ్యం, ఆ భోగ జీవితం ఎందుకు... అనేది ఆ సమయంలో అర్జునుడి మాట. రక్త సంబంధీకులను చంపడమెలా అన్నది పార్థుడి ధర్మసంకటం. ఆ సందర్భంలో యుద్ధం చేయవలసిన ఆవశ్యకతను ధర్మబద్ధంగా చెబుతాడు శ్రీకృష్ణుడు. ఇందులో అర్జునుడికి వచ్చిన అనేకానేక అనుమానాలూ, దానికి శ్రీకృష్ణుడు చెప్పిన వివరణలూ మనం నిత్యజీవితంలో అనుసరించదగ్గ ధర్మబద్ధమైన మార్గాన్ని బోధించేవిగా ఉంటాయి. ఒక్కో సంకటం ఏర్పడ్డప్పుడు దానికి పరిష్కారాలు వెతుక్కునేందుకు దోహదపడతాయి.

గీతోపనిషత్తు
నిజానికి గీత మహాభారత ఇతిహాసంలో ఉంది. కానీ దాన్ని గీతోపనిషత్తుగా పిలుస్తారు. ఇతిహాసాన్ని ఎవరమైనా ఎప్పుడైనా చదువుకోవచ్చు, అవి అలా చదువుకున్నా అర్థమవుతాయి. కానీ, ఉపనిషత్తులు ఎవరికి వారు చదువుకోలేరు. వాటిని అర్థం చేసుకునేందుకు గురువు సహాయం తీసుకోవాల్సిందే. గురువు అందులోని విషయాల్ని తాను అర్థం చేసుకుని, ఆచరించి ఆయా విషయాలకు ఉదాహరణలను జోడిస్తూ శిష్యుడికి అర్థమయ్యేలా బోధిస్తాడు. అలాంటి విషయాలు ఆచరణీయాలుగా మారతాయి. గీతను చెప్పడం ద్వారా శ్రీకృష్ణుడు జగద్గురువుగా మారాడు. ఆయన చెప్పిన ఆ వాక్యాలను ఎందరో మహనీయులూ, గురువులూ పారాయణం చేశారు. అందులోనే అద్వైతాన్నీ, ద్వైతాన్నీ, విశిష్టాద్వైతాన్నీ దర్శించుకున్నారు. శంకారాచార్యుల వారు భజగోవిందంలో గీత గొప్పదనాన్ని చెబుతారు. భగవద్గీతలోని ఒక్కశ్లోక భావాన్ని అర్థం చేసుకుని దాన్ని మననం చేసుకుంటూ, ఆచరణలో పెడుతూ జీవిస్తే చాలు... అటువంటి వ్యక్తి జన్మరాహిత్యాన్ని పొందుతాడు. మరణ సమయంలో ఆ జీవికి యమదూతలతో చర్చే అవసరం ఉండదు అంటారు శంకరులు. ఎంతటి మహత్తర గ్రంథం కాకపోతే ఏక శ్లోకం ప్రాణికోటికి ఉత్కృష్టమైన మోక్షమార్గాన్ని చూపగలదు! అలాగని గీతాచార్యులు సాధారణ మానవులకు అర్థం కాని భాషలో, రుషితుల్యులకు మాత్రమే సాధ్యమయ్యే కర్మలు చేయమంటూ నీతివాక్యాల్ని వల్లించడు. అరటిపండు వలిచి పెట్టినట్టు చేయాల్సిన పనిని కళ్లకు కడతారు. ఎంతో లోతైన సముద్రం మీదా గాలిబుడగలా తేలుతూ ప్రయాణం చేయడమెలాగో విశదీకరిస్తాడు. పనిచేయమంటాడు...ఎంతలా అంటే... మనకు మనమే యజమానులం అన్నట్టూ... ఆ పని చేయడంలో అంతకు మించిన నిష్ణాతులెవ్వరూ ప్రపంచంలో లేరు అన్నట్టూ. అయితే, ఫలితాన్ని మాత్రం తనకే వదిలేయమంటాడు.

కర్మణ్యే వాధికారస్తే
మాఫలేషు కదాచన
మాకర్మఫలహేతుర్భూః
మాతే సంగోస్త్వకర్మణి

కర్మ చేయడానికే నీకు అర్హత ఉంది. కానీ, ఆ కర్మ ఫలం మీద నీకు ఎలాంటి అధికారమూ లేదు. కర్మలకు నువ్వే హేతువువని ఎప్పుడూ భావించకు. ధర్మాన్ని నిర్వహించడం పట్ల ఎప్పుడూ అనాసక్తుడవుగా ఉండకు... అని దీని అర్థం. మనిషికి మనశ్శాంతిని కలిగించే గొప్ప శ్లోకం ఇది. తనకు సంక్రమించిన పనిపట్ల ప్రేమతో తప్ప దాని మీద ఆశతో చేసే పని మనిషిని స్థితప్రజ్ఞుడిగా ఉండనీయదు మరి! ఆ సంతోషానికీ దుఃఖానికీ దూరంగా భగవంతుడి యందు మనసుని లగ్నం చేసి జ్ఞానంతో జీవితాన్ని గడపమని గీతాచార్యులు అర్జునుడి పేరిట మానవాళికి బోధించింది ఈ మార్గశిర శుద్ధ ఏకాదశి నాడే!

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.