close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
మనలో ఎవరు కోటీశ్వరులు ?

మనలో ఎవరు కోటీశ్వరులు ?

మీలో ఎవరు కోటీశ్వరుడు కార్యక్రమం చూడండి. అందరూ కోటి రూపాయలను గెలుచుకోవాలని తాపత్రయపడతారు.కానీ పుట్టుకతోనే మనం కోటీశ్వరులమని... తెలుసా మీకు?
ప్రపంచాన్ని నీకు చూపించే నీ కన్నుకు విలువ కట్టగలవా... క్షణమాత్రం తీరికలేకుండా పని చేస్తూ రక్త శుద్ధి చేసే గుండె ఖరీదెంత? ఉచ్ఛ్వాస నిశ్వాసలలో కొలువై ఉంటూ నీ పంచప్రాణాలను కాపాడే ప్రాణవాయువును నీవు బయట కొనుగోలు చేయాలంటే ఎన్ని కోట్లు ఖర్చు పెట్టాలో లెక్కకట్టి చూడండి... అప్పుడు తెలుస్తుంది భగవంతుడు మిమ్మల్ని ఎన్ని కోట్లకు అధిపతిగా పుట్టించాడో!
అద్భుతమైన విషయాలు అతి సామాన్యమైనవిగా అనిపిస్తుంటాయి. దీనికి కారణం అద్భుతాలన్నీ అతి మామూలుగా జరుగుతుండడమే. ఒక గ్లాసు పళ్ల రసం తాగామనుకోండి. అదేమంత గొప్పతనం అనిపించదు. కానీ గొంతు కేన్సర్‌ ఉన్నవాడికి అదో అపురూపమైన అనుభవమే. సాయం సంధ్యలో సముద్రం ఒడ్డున నడుస్తున్నామనుకోండి. అందులో పెద్ద విశేషమేముంది? నడవలేని స్థితిలో ఉన్న మనిషికి అదో తీరని కలే. ఒక వేళ జరిగితే అతనికది గొప్ప మహిమ. మరో కారణమేంటంటే అన్ని అద్భుతాలు అందరికీ అందుబాటులో ఉంటాయి. ఒకే అనుభవాన్నిస్తాయి. అందుకే వాటిని పెద్దగా పట్టించుకోం. గొప్పగా గుర్తు పెట్టుకోం. నేను ఉదయాన్నే నిద్ర లేస్తాను. మా పక్కింటాయన కూడా అంతే. నాకు రెండు కళ్లున్నాయి... ఆయనకూ ఉన్నాయి. వింత ఏముందనిపిస్తుంది. ఎన్నో పనులు ఎల్లవేళలా నిరంతరం జరుగుతూనే ఉంటాయి. కాబట్టి అద్భుతాలుగా గుర్తించలేకపోతున్నాం. రోజూ తింటున్నాం... నిద్రిస్తున్నాం... అనుక్షణం శ్వాసిస్తున్నాం... అందుకే వాటిని చిన్న విషయాలుగా పొరబడుతున్నాం.
మరో ముఖ్య కారణమేంటంటే... ఈ అద్భుతాలు అప్రయత్నంగా, అలవోకగా జరుగుతున్నాయి.
ఎంతో శ్రమించి సాధించిన వాటిని మాత్రమే మనం అమూల్యమైనవిగా భావిస్తాం. సూర్యుడు పంచే వెలుగుకు మనం ఎంత ధనం చెల్లిస్తున్నాం? మాట మాత్రమైనా అడగకుండానే కాంతినిస్తున్నాడే. వర్షం కురిసినప్పుడు ఆకాశం పన్ను వసూలు చేస్తోందా? అనాయాసంగా లభించే వస్తువులపై అనాదరణ చూపిస్తాం కదా! ప్రాణవాయువు విలువ పైకమిచ్చి కొనుక్కుంటే తెలిసి వస్తుంది. ఆసుపత్రుల్లో చేరిన వారెందరో ఆక్సిజన్‌ కోసం ఎంతో ఖర్చు చేస్తుండటం గమనించారా?
గాలి, వెలుతురు, నీరు వంటి ముఖ్యావసరాలు తీరకపోతే ఎలా జీవించాలో ఊహకు కూడా అందదు. కానీ ఇంతటి అద్భుతాలకు ఏ మాత్రం విలువ ఇవ్వం.

భగవంతుడి సృష్టిలో ప్రతిదీ అద్భుతమే. అమూల్యమే. అంతుబట్టని ఆ నిగూఢ శక్తి మనకు కల్పించిన సదుపాయాల్లో శ్వాస ఒకటి. మనం బతకాలంటే గాలిని పీల్చాల్సిందే. మనిషి బతకడానికి రోజూ 550 లీటర్ల ఆక్సిజన్‌ను స్వీకరిస్తున్నాడని సైన్స్‌ చెబుతోంది. దాన్ని కృత్రిమంగా పొందాలంటే ఏటా రూ.40 కోట్లకు పైగా చెల్లించాల్సిందే. మన కన్ను 576 మెగా పిక్సల్‌ కెమెరాతో సమానం. ఇదంతా ప్రకృతి సిద్ధంగా మనిషికి అందడం విశేషమే. ఇలాంటి సంపదను సద్వినియోగం చేసుకోవడం మన కర్తవ్యం.

ఎక్కడో గగన మండలం నుంచి పడ్డ జలరాశులు నీ తోటను పలకరించి నీ ఇంటి ప్రాంగణంలో లయబద్దంగా ఆడుతున్న వైనాన్ని నీ బుద్ది కుశలతతో పరిశీలించు. ప్రకృతి మేధోశక్తిని లోతుగా అధ్యయనం చేసి జేజేలు పలుకు.
విజ్ఞానశాస్త్రం ఎలా పెంపొందుతుంది? అవధిలేని జిజ్ఞాస, అంతులేని ఆశ్చర్యం, నిరంతర పరిశోధన వల్ల. జ్ఞానమంటే ఇదే కదా? అమాయకమైన పసిపాప మాదిరిగా ఆశ్చర్యపడుతూ అద్భుతరసావిష్కరణ చేయాలి.
ఎండ తీవ్రతకు సముద్రపు నీరు ఆవిరిగా మారి మేఘమై వర్షించడం, ఒక్కసారిగా కాక అంచెలంచెలుగా జలధారలు కురియడం, వాన వెలిసి తిరిగి ఎండ కాయడం, ఎక్కడి మబ్బులు అక్కడ మాయం కావడం అద్భుతమే కదా! తల్లి తన బిడ్డకు పాలిచ్చినట్లు ప్రకృతి వర్షించి మనల్ని పోషిస్తోంది.
ఇంట్లో తలుపులు మూసుకుని కూర్చుని యాంత్రికంగా భగవద్గీత చదువుకునే వారు బయట ఇలాంటి కమనీయ దృశ్యం చూసి తరించలేరు. దైవాన్ని గ్రంథాలలో వెతకొద్దు. ప్రకృతిలో పరమాత్మను దర్శించండి. పదాల గూఢార్థాలలో పరమేష్టి దాగిలేడు. ప్రకృతి మేధస్సులోనే ఆయనను ప్రత్యక్షంగా వీక్షించాలి.
మనకు ఎంతో అవసరమైన వర్షాన్ని భగవంతుడి అంతులేని ప్రేమ ప్రసాదంగా భావించి హర్షాతిరేకంతో ఆలింగనం చేసుకోవడం భక్తియోగం. వర్షాన్ని కురిపించడంలో పరమాత్మ ప్రదర్శించిన ప్రతిభను, వైజ్ఞానిక మేధస్సును పరిశీలించి, అవగాహన చేసుకోవడం జ్ఞానయోగం. అమృతతుల్యమైన వర్షధారలను కర్షకుడు భగవంతుడి కానుకగా భావించి పంటలను పండించడానికి, దాహాన్ని తీర్చడానికి వాడుకుంటే అది కర్మయోగం. ఈ విధంగా గీతాజ్ఞానం నిత్యజీవితంలో అనుభవైకవేద్యం.

డాక్టర్‌ శ్రీరామ్‌, జీవనబృందావనం

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.