close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
స్టాంపు... చాలా సీనుంది..!

స్టాంపు... చాలా సీనుంది..!

నిజమే, ఎస్సెమ్మెస్సులూ ఈమెయిల్సూ రాజ్యమేలుతున్న ఈ కాలంలోనూ స్టాంపులేంటీ... సిల్లీగా... అనిపించడం సహజం. కానీ తపాలాశాఖ ఏటా స్టాంపుల్ని ముద్రిస్తూనే ఉంది. ఫేస్‌బుక్‌, వాట్సాప్‌, ట్విట్టర్‌... వంటి సోషల్‌మీడియా వేగానికి సవాళ్లు విసురుతూ తనదైన అస్థిత్వంకోసం పోరాడుతోంది. ఉత్తరం జాడ లేకున్నా గ్రీటింగు కార్డు కనుమరుగవుతున్నా రిజిస్టరు పోస్టుల హడావుడి తగ్గినా.. నిరాశ చెందకుండా స్టాంపుల్ని విడుదల చేస్తూ ఆదాయాన్ని ఆర్జిస్తూనే ఉంది. అలాగే ఈ ఏడాదీ ఎన్నో స్టాంపులతో తెరమీదకొచ్చింది.

స్టాంపుల రామాయణం!
ప్రతిదేశానికీ తమకే సొంతమైన వంటకాలు కొన్ని ఉంటాయి. సువిశాల భారతావనిలో రుచులకు హద్దెక్కడ... అందుకే ప్రపంచవ్యాప్తంగా పేరొందిన తిరుపతి లడ్డూ, హైదరాబాదీ బిర్యానీ, సేమ్యా, దక్షిణాది అల్పాహార రుచులుగా ప్రసిద్ధి చెందిన ఇడ్లీ దోసె, పొంగలి, పొంగనాలూ; ఉత్తరాదికి చెందిన డోక్లా, పానీపూరీ, చోళెబతూరా, లిట్టీచోకా, వడాపావ్‌, గుజియా... ఇలా దాదాపు 24 వంటకాలను స్టాంపులద్వారా పరిచయం చేసింది తపాలాశాఖ.

రామాయణాన్ని ఆదికావ్యంగానే కాదు, మంచిచెడులను వివరిస్తూ వ్యక్తిత్వ వికాసానికి దోహదపడే గ్రంథంగానూ కొనియాడతారు. ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకునే వాల్మీకి రామాయణం థీమ్‌తోనూ స్టాంపుల్ని తీసుకొచ్చింది. గతంలో రాముడి బొమ్మతో స్టాంపుల్ని ముద్రించినా సీతా స్వయంవరం నుంచి రామరావణ యుద్ధం వరకూ విభిన్న ఘట్టాలను ఎంపికచేసి, పదకొండు స్టాంపుల సిరీస్‌గా తీసుకురావడం మాత్రం ఇదే తొలిసారి. అలాగే పాతకాలంనాటి పల్లకీలూ రిక్షాలూ కార్లూ బస్సుల నుంచి నేటి మెట్రో వరకూ రకరకాల వాహనాలూ, విభిన్న ప్రాంతాలకు చెందిన తలపాగాలూ, క్విట్‌ ఇండియా ఉద్యమం నాటి సంఘటనలూ... ఇలా అనేకానేక అంశాలను ఈ ఏడాదిలోనే ముద్రించడం విశేషం.

స్టాంపుల పరిమళం!
స్టాంపుమీది బొమ్మను చూసి ఆనందించడం మాత్రమే కాదు, కాఫీ ప్రియులకోసం ఆ పరిమళాన్ని వెదజల్లే స్టాంపుల్నీ ఈ ఏడాది ప్రవేశపెట్టింది తపాలాశాఖ. ఒక్కోటీ వంద రూపాయల విలువచేసే ఈ స్టాంపుల్ని లక్షకు పైగా ముద్రించింది. గతంలో విడుదల చేసిన మల్లె, గులాబీ, చందన పరిమళాలకు కొత్తగా కాఫీ గుబాళింపుల్నీ జోడించింది. అయితే 1973లోనే ప్రపంచానికి గులాబీ సువాసనల స్టాంపుల్ని పరిచయం చేసినది మాత్రం భూటాన్‌. తరవాత బ్రెజిల్‌, స్విట్జర్లాండ్‌, ఫ్రాన్స్‌, చైనా, భారత్‌... ఇలా పలుదేశాల స్టాంపులు సువాసనలను వెదజల్లుతున్నాయి. స్వాతంత్రోద్యమంలో ఖాదీ ప్రాముఖ్యతను చాటుతూ నూలు ఒడికే గాంధీబొమ్మతో నేసినస్టాంపునీ తీసుకొచ్చింది.

ఇది నా స్టాంపు..!
ఎన్ని రకాల స్టాంపుల్ని తయారుచేసినా వాటితో నాకేంటీ అనుకునే తరం మనది... అందుకే ‘మై స్టాంప్‌’ పేరుతో మన స్టాంపును మనమే డిజైన్‌ చేసుకునే సౌకర్యాన్నీ అందిస్తోంది భారత ప్రభుత్వం. ఇందుకోసం తపాలాశాఖ అందించే స్టాంపుల జాబితాలోకి వెళ్లి, నచ్చినది ఎంపిక చేసుకుని, దానికి మనవీ, మనకిష్టమైనవారివీ; లోగోలూ, సంస్థలూ, పువ్వులూ... ఇలా మనకు నచ్చిన ఫొటోలను జోడించి ముద్రించమని కోరవచ్చు. ఒక్కో షీటులో పన్నెండు స్టాంపులు ఉంటాయి. ధర మూడు వందల రూపాయలు. ఇలాంటి షీట్లు కనీసం రెండు నుంచి గరిష్టంగా వంద వరకూ ముద్రిస్తారు. ఈ ‘మై స్టాంప్‌’ కారణంగానే కొన్ని ప్రాంతాల్లో తపాలాశాఖ ఆదాయం ఎంతో పెరిగిందట. పుట్టినరోజు, పెళ్లిరోజు... ఇలా ప్రత్యేక సందర్భాల్లో ఈ స్టాంపుల్ని అతికించిన కార్డులతో అతిథుల్ని ఆహ్వానించేస్తున్న వాళ్ల సంఖ్య పెరిగింది. ఈ సరికొత్త ఆలోచన, స్టాంపుకి పునర్జీవాన్ని ఇచ్చిందనే చెప్పాలి.

స్టాంపుల శాస్త్రం!
మనదేశం అనే కాదు, ఏ దేశమైనా ఆ దేశ చరిత్ర, సంస్కృతి, ప్రకృతి, వన్యప్రాణులు, ప్రదేశాలు, వాస్తునిర్మాణం... ఇలా పలు అంశాలను స్టాంపులమీద ముద్రిస్తూ వాటిని సంరక్షించే ప్రయత్నం చేస్తుంటాయి. ప్రముఖ వ్యక్తుల గౌరవార్థం, వారి స్మారకార్థం ఎప్పటికప్పుడు స్టాంపుల్ని విడుదల చేస్తుంటారు. అందుకే స్టాంపుల సేకరణ అనేది ఓ హాబీ మాత్రమే కాదు, అదో విజ్ఞాన సముపార్జన, ఓ అద్భుత పరిశోధన. అదో ప్రత్యేక శాస్త్రం. దాని పేరే ఫిలాటలీ. పిల్లల్లో ఈ ఫిలాటలీ పట్ల ఆసక్తిని పెంచేందుకు ఇటీవల మన ప్రభుత్వం ఆరు నుంచి తొమ్మిదో

తరగతి విద్యార్థులకోసం స్కాలర్‌షిప్‌లను ప్రవేశపెట్టింది. స్కూల్లో లేదా వ్యక్తిగతంగా ఫిలాటలీ క్లబ్‌ సభ్యులై ఉండటంతోబాటు, ప్రథమశ్రేణి విద్యార్థులై ఉండి, రకరకాల స్టాంపుల్ని సేకరించి వాటిని ఓ పద్ధతిలో ప్రదర్శించిన వాళ్లకి దాదాపు ఆరువేల రూపాయల గౌరవ పురస్కారాన్ని అందిస్తారు. ఆమధ్య కాలంలో ముంబై తపాలాశాఖ ఏర్పాటుచేసిన ఓ ప్రదర్శనలో టియా గోగ్రి అనే చిన్నారి అత్యున్నత పురస్కారాన్ని అందుకుంది. స్టాంపుల సేకరణ ఇంకా జీవించే ఉంది అనడానికి ఇంతకన్నా నిదర్శనం ఇంకేం కావాలి..?

కోట్ల రూపాయల్లో..! 

ప్రపంచంలోని తొలి స్టాంపును 1840లో ముద్రించారు. పేరు పెన్నీ బ్లాక్‌. మనదేశంలో 1852లో ముద్రించిన తొలి స్టాంపు సిండీ డాక్‌. స్వాతంత్య్రానంతరం భారత్‌ మొట్టమొదటి స్టాంపును గాంధీజీ బొమ్మతో విడుదల చేసింది. స్వాతంత్య్రానంతరం మనదేశంలో స్టాంపుల్ని విడుదల చేయనిది ఒక్క 1955లోనే.

* సుమారు రూ.62 కోట్ల విలువ చేసే బ్రిటిష్‌ గయానా స్టాంపు, ప్రపంచంలోకెల్లా ఖరీదైనది. మెజంతా రంగులో అష్టభుజి ఆకారంలో ఉండే ఇది అత్యంత అరుదైనది కూడా. గాంధీ బొమ్మ ఉన్న నాలుగు స్టాంపుల స్ట్రిప్‌ సుమారు రూ.4 కోట్ల 30 లక్షలతో ఖరీదైన వాటిల్లో ఒకటిగా పేరొందింది.

* ఆస్ట్రియా తపాలాశాఖ స్వరోవ్‌స్కీ రాళ్లూ బుల్లి వజ్రాలు పొదిగిన స్టాంపులతోబాటు, తమ దేశ సాంస్కృతిక సంపదగా చెప్పే ఎంబ్రాయిడరీ స్టాంపుల్నీ రూపొందించింది.

* తమ నేలమీదపడ్డ తోకచుక్కల పొడిని అతికించిన తపాలాబిళ్లల్ని ముద్రించింది మొరాకో.


 

* అమెరికా తపాలాశాఖ మన దీపావళి పండగను గౌరవిస్తూ ఓ స్టాంపును విడుదల చేసింది..


 

* కకోవా సువాసనలతో స్టాంపుల్ని చాలా దేశాలే చేస్తున్నాయి. దానివెనకుండే చాక్లెట్‌ రుచినీ చప్పరించే స్టాంపుల్ని బెల్జియం రూపొందించింది.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.