close
అందుకే ‘గంగోత్రి’ చెయ్యలేదు!

అందుకే ‘గంగోత్రి’ చెయ్యలేదు!

గుంటూరు టౌన్‌. ‘ఇంద్ర’ విడుదలై సంచలన విజయం సాధించిన రోజులు. ఆ చిత్రానికి రచయితగా పనిచేసిన చిన్నికృష్ణది ఆ వూరే. ఆయన సొంతూరు వస్తున్నారన్న వార్త పాకేసింది. అంతే... పట్టణంలోని చిరు ఫ్యాన్స్‌ వందల మంది పోగైపోయారు. చిన్నికృష్ణకి సగర్వంగా స్వాగతం పలికి, వూరేగించాలని ఫిక్సయిపోయారు. రెండొందల బైకులతో ర్యాలీ మొదలైంది. అందులో తొలి బైకు... సంతోష్‌ రవీంద్రనాథ్‌ ఉరఫ్‌ బాబీది. ఆ కుర్రాడే తరువాత రచయితగా మారి, దర్శకుడై... రవితేజ, పవన్‌ కల్యాణ్‌, ఎన్టీఆర్‌లతో సినిమా తీశాడు. ఆ కథను ఇంకాస్త విపులంగా చెప్పుకుంటే...!

నేను చిరు ఫ్యాన్‌ అని మీకు ఈ పాటికే అర్థమైపోయి ఉంటుంది. మా నాన్న నాకంటే పెద్ద అభిమాని. పేరు కె.మోహన్‌రావు. ప్రియదర్శి చిట్‌ఫండ్‌ నడిపేవారు. అది మా అక్క పేరే! మా అమ్మ ఇందిరాగాంధీ. నేనేమో రవీంద్రనాథ్‌. పేర్లు వింటుంటే మా ఇంట్లో దేశభక్తి ఏరులై పారేది అని తెలిసిపోతోంది కదా. నిజమే, మా తాతయ్య స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్నార్ట. తన కూతురికి ఇందిరాగాంధీ అని పేరు పెట్టారు. ఆ సంప్రదాయాన్ని నాన్న కొనసాగించారు.

చిరంజీవి సినిమా విడుదలైతే అందరికంటే ముందు నాన్న తయారైపోయేవారు. ఆయనతో పాటే నేను. ‘అమ్మా.. స్కూలుకెళ్తున్నా’ అని చెప్పి ఎప్పట్లా యూనిఫామ్‌ వేసుకొని, బ్యాగు తగిలించుకొని, క్యారియర్‌ పట్టుకొని వీధిలోకి వెళ్లేవాణ్ని. సందు చివర నాన్న స్కూటర్‌తో రెడీగా ఉండేవారు. ఇద్దరం చక్కగా సినిమాకి వెళ్లిపోయేవాళ్లం.

మూడోతరగతిలో ఇమ్రాన్‌, రఫీ అనే స్నేహితులుండేవారు. వాళ్ల దగ్గర చిరంజీవి పేరు చెప్పి పెన్సిళ్లూ, వాటర్‌ బాటిళ్లూ ఎత్తేసేవాణ్ని. ‘మా నాన్నా, చిరంజీవీ మంచి ఫ్రెండ్స్‌’ అంటూ ఇంకా వారి స్నేహం గురించి ఏవేవో అబద్ధాలు చెప్పేవాణ్ని. డిగ్రీ వరకూ గుంటూరులోనే చదువుకున్నాను.

‘ఇంద్ర’ సమయంలో చిన్నికృష్ణగారు గుంటూరు వచ్చినపుడు సంబరాలు పెద్దగా చేసేశాం. నా హుషారు నచ్చి ‘హైదరాబాద్‌ వస్తే కలువు’ అని మాట వరసకు అన్నారంతే. ఆ మాత్రానికే ‘అమ్మా.. చిన్నికృష్ణగారు నన్ను హైదరాబాద్‌ వచ్చేయమన్నారు’ అని ఇంట్లో కలరింగు ఇచ్చి, నా స్నేహితుడు కిషోర్‌, నేనూ హైదరాబాద్‌ బయలుదేరాం.

‘గంగోత్రి’ అవకాశం వదిలేశా!
బంజారా హిల్స్‌లో చిన్నికృష్ణగారి ఇల్లు. ఆ ఇంటి ముందు చెట్టు కింద నిలబడి అలా చూస్తుండేవాణ్ని. ఉదయం నుంచి సాయంత్రం వరకూ ఇదే పని... పన్నెండు రోజులకు పిలుపొచ్చింది. ‘ఏం చేద్దామనుకుంటున్నావ్‌’ అని అడిగారు. ‘సినిమా అంటే పిచ్చి సార్‌’ అన్నా. ‘సరే.. రాఘవేంద్రరావుగార్ని కలువు’ అని చెప్పి పంపారు. అప్పుడే ‘గంగోత్రి’ సినిమా మొదలవుతోంది. రాఘవేంద్రరావు గారి ముందు నేనూ, కిషోర్‌ నిలబడ్డాం.‘చిన్నీ ఫోన్‌ చేశాడు. బన్నీకి ఎనిమిదిమంది స్నేహితులు కావాలి. వాళ్లలో మీరూ ఉంటారు. బయట కాస్ట్యూమ్‌ డిజైనర్‌ ఉన్నాడు. చొక్కా, నిక్కరు కోసం కొలతలు ఇచ్చి వెళ్లండి’ అన్నారు. ఎప్పుడైతే ఆయన నోటి నుంచి ‘నిక్కరు’ అనే మాటొచ్చిందో, ఇంకేం వినిపించలేదు. నేను మూడో తరగతి నుంచీ ప్యాంటేసిన బ్యాచ్‌. అలాంటిది నిక్కరేసుకోవడమా? మా కిషోర్‌ కూడా ‘నిక్కరైతే నేనూ చేయను బావా’ అన్నాడు.

విషయం చెప్పేసరికి చిన్ని కృష్ణగారికి కోపం వచ్చేసింది. దాంతో నా పాట్లు మళ్లీ మొదటికి వచ్చాయి. అయినా రోజూ రావడం, ఆ ఇంటి వంక దీనంగా చూడడం వెళ్లిపోవడం ఇదే తంతు. నా బాధ భరించలేక చిన్నికృష్ణ మళ్లీ పిలిచారు.

‘ఎందుకిలా...’ అని కాస్త సముదాయించే ప్రయత్నం చేశారు.

‘నాకు మీరు తప్ప ఇంకెవ్వరూ తెలీదు సార్‌’ అన్నాను దీనంగా.

‘నేను రచయితని, ఎవరైనా మంచి దర్శకుడి దగ్గర చేరు’ అని సలహా ఇచ్చారు.

‘అయితే రైటర్‌ని అయిపోతా సార్‌’ అన్నాను అమాయకంగా.

‘నీకేం కావాలో నీకే క్లియర్‌గా తెలీదు. రెండేళ్లు ఆగి రా. అప్పుడు ఆలోచిద్దాం’ అన్నారు. నేను మాత్రం కదల్లేదు. నా పంతంతో ఆయనా విసిగిపోయి మాట్లాడడం మానేశారు. ఓరోజు జాలేసిందో ఏమో మళ్లీ పిలిచారు. ‘గంగోత్రిలో ఓ సన్నివేశం ఉంది. సందర్భం చెబుతా. సీన్‌ తయారు చేయ్‌’ అన్నారు.

ఆ సీన్‌ని ఆయనకు నచ్చినట్లు రాస్తే నేను అక్కడ ఉంటా, లేదంటే వెళ్లిపోవాల్సిందే అనే విషయం అర్థమైంది. సాయంత్రం వరకూ అక్కడే కూర్చుని, సీన్‌ ఎలా ఉంటే బాగుంటుందో మనసులోనే అనుకొని, చిన్నికృష్ణగారి సహాయకుడు శ్రీపురం కిరణ్‌కి చెప్పా. ‘భలే వుంది.. నేను సార్‌కి చెబుతా’ అని పైకి వెళ్లారు. సరిగ్గా పది నిమిషాల తరవాత నన్నూ పైకి రమ్మన్నారు.

‘ఏరా ఈ సీన్‌ నువ్వే చేశావా’ అని అడిగారాయన. ‘అవును సార్‌..’ అని మళ్లీ ఆ సీన్‌ వివరించా.

‘రేపట్నుంచి వచ్చేయ్‌’ అన్నారు.

ఇంట్లోనే ఉంచేశారు...
‘గంగోత్రి’ ఇంటర్వెల్‌ సీన్‌ గురించి పెద్ద చర్చ నడుస్తోంది. తెల్లారితే షూటింగ్‌. అప్పటికి సీన్‌ రెడీ కాలేదు. ‘నాలుగింటికల్లా సీన్‌ లేకపోతే...’ అని వార్నింగ్‌ ఇచ్చారు. కిరణ్‌, చిట్టిబాబు, చంద్ర వీళ్లంతా చిన్నికృష్ణ ప్రధాన శిష్యగణం. నాదేమో ‘ఎల్‌’ బోర్డు. అయినా సరే, ఓ కాగితం తీసుకొని, పిచ్చాపాటిగా ఏదో రాశా. చిన్నికృష్ణ గారు సాయంత్రం వచ్చి ‘ఆ కాగితాలేంట్రా’ అని అడిగారు. ‘సీన్‌ రాశా’ అని చెప్పా.

‘ఏం రాశావో చదువు’ అంటూ సోఫాలో కూర్చున్నారు. సీన్‌ మొత్తం గడగడ చెప్పేశా. అంతే క్లాప్స్‌ పడిపోయాయి.

ఆరోజే ‘ఎల్‌’ బోర్డ్‌ తీసేసి లైసెన్స్‌ ఇచ్చేశారు. అంతే కాదు... తన ఇంట్లో పెట్టేసుకున్నారు. కుటుంబ సభ్యుడిలా చూసుకున్నారు. నాలుగైదు కథలకు పనిచేశా. లైఫ్‌ బాగానే గడిచిపోతున్నా ఏదో వెలితి. పైగా నాకు షూటింగులు చూడాలని పిచ్చి. ‘నా వల్ల కాదు సార్‌. నేను అసిస్టెంట్‌ డైరెక్టర్నవుతా’ అని నా బాధంతా చిన్ని గారి ముందు వెళ్లగక్కా.‘మన సినిమా త్వరలో మొదలవుతుంది. అప్పటి వరకూ ఆగు’ అన్నారు. కానీ నేను వినలేదు.

ఆదినారాయణ ‘పొలిటికల్‌ రౌడీ’ అనే సినిమా తీస్తున్నారు. అక్కడ సహాయకుడిగా చేరిపోయా. ఆ ఒక్క సినిమా పది సినిమాలకు సరిపడినంత అనుభవాన్ని అందించింది.

‘అభిమన్యు’, ‘కత్తి’ చిత్రాల దర్శకుడు మల్లి... అప్పట్లో శ్రీహరి కోసం ఓ కథ వెతుకుతూ ‘నీ దగ్గరేమైనా కథ ఉందా’ అని అడిగారు. ‘నా దగ్గర ఓ రైతు కథ ఉంది’ అని చెప్పా. అదే... ‘భద్రాద్రి’. ఆ సినిమా బాగా ఆడింది.

అయితే నన్ను కథా రచయితగా పెద్దగా గుర్తించలేదు. దాంతో దిల్‌రాజు కంపెనీలో చేరా. ‘మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌’ కోసం దశరథ్‌తో పనిచేశా. ఆయన బాగా ప్రోత్సహించారు. నెలకు 25 వేలు జీతం. సరిగ్గా అదే సమయంలో కోన వెంకట్‌ దగ్గర పనిచేసిన హరీష్‌ శంకర్‌ దర్శకుడైపోయాడు. ఆ బెర్తు నాకు దక్కింది. ఓ పూట దశరథ్‌ గారితో పని. మరో పూట కోన ఆఫీసులో కథా చర్చలు. కోన ‘అదుర్స్‌’, ‘బాడీగార్డ్‌’, ‘డాన్‌ శీను’ సినిమాలకు పని చేశా. ఓ కథని ఎలా అమ్మాలి, మన దగ్గరున్న ఓ ఐడియాని కమర్షియల్‌గా ఎలా మలచుకోవాలన్న విషయం కోన గారి దగ్గరే నేర్చుకున్నా. ‘మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌’ సమయంలోనే గోపీచంద్‌ మలినేని పరిచయం అయ్యాడు. ‘డాన్‌ శీను’, ‘బాడీగార్డ్‌’ సినిమాల కోసం గోపీతో పనిచేశా. రవితేజ ‘బలుపు’ కథ నాదే. ఈ సినిమా కోసం చేసిన ప్రయాణం రవితేజతో నా పరిచయానికీ, దర్శకుడిగా తొలి అడుగు వేయడానికీ కారణమైంది.

‘బలుపు’ బీచ్‌ సీన్‌
వైజాగ్‌లో ‘బలుపు’ షూటింగ్‌ జరుగుతోంది. బీచ్‌లో అంజలి-రవితేజ మధ్య సీన్‌. ఎనిమిది పేజీలుంది. ‘ఫ్లాష్‌ బ్యాక్‌లో ఇంత పెద్ద సీన్‌ అనవసరం. దీన్ని తగ్గించండి’ అన్నారు రవితేజ. దాంతో అప్పటికప్పుడు ఆ సీన్‌ని అరపేజీకి కుదించా. ‘బావుంది...’ అని భుజం తట్టారు రవి. మరుసటి రోజు నన్ను దగ్గర కూర్చోబెట్టుకొని నా గురించి అన్ని వివరాలూ అడిగి తెలుసుకొన్నారు. ‘బలుపు’ విడుదలైన రెండు వారాలకు రవి నుంచి ఫోన్‌... ‘వచ్చి కథ చెప్పు’ అని. గంట పాటు ఓ కథ చెప్పా. ఇంటర్వెల్‌ సమయానికే కథలో లీనం అయిపోయారు. కథ పూర్తయ్యేసరికి ‘ఈ సినిమా మనం చేస్తున్నాం’ అని మాట ఇచ్చేశారు. అదే ‘పవర్‌’.

ఆ సినిమా పవన్‌ కల్యాణ్‌గారికి బాగా నచ్చిందట. అందుకే ఓసారి పిలిపించారు. ‘సర్దార్‌ గబ్బర్‌సింగ్‌ అనే సినిమా చేస్తున్నాం. అదీ పోలీస్‌ కథే కాబట్టి... నువ్వు బాగా హ్యాండిల్‌ చేయగలవు అనుకుంటున్నా. దర్శకత్వం వహిస్తావా’ అని అడిగారు. పవన్‌ లాంటి కథానాయకుడు అడిగితే ‘నో’ అని ఎలా చెప్పను? సంతోషంతో అంగీకరించా. ఆ రోజే కథ మొత్తం చెప్పారు. పది రోజుల్లో నావైన మార్పులూ, చేర్పులూ జోడించి చెప్పా. మా ఇద్దరి అభిరుచులూ బాగా కలిశాయి. అందుకే ‘సర్దార్‌’.. సినిమా ఓ కలలా గడిచిపోయింది. ‘సర్దార్‌’ తరవాత రవితేజతో ఓ సినిమా చేద్దామనుకొన్నాం. రవికి కథ బాగా నచ్చినా బడ్జెట్‌ సహకరించలేదు. ఈలోగా ఎన్టీఆర్‌ ఓ మంచి కథ కోసం ఎదురుచూస్తున్నారని తెలిసింది. కల్యాణ్‌రామ్‌గారిని కలిసి ‘జై లవ కుశ’ కథ చెప్పా. ఆయనకు తెగ నచ్చేసింది. ఆ వెంటనే ఎన్టీఆర్‌ కూడా కథ వినడం, ‘ఓకే’ అనడం జరిగిపోయాయి. ‘జై లవకుశ’ పాత్రల్లో ఎన్టీఆర్‌ని తప్ప మరెవ్వరినీ వూహించలేను. మరీ ముఖ్యంగా ‘జై’గా చెలరేగిపోయారు. ‘మా ఎన్టీఆర్‌ని చాలా కొత్తగా చూపించారు’ అని ఆయన అభిమానులంతా అంటుంటే నా ఆనందానికి అవధుల్లేవు’’

బ్యాంకులో ఓ ఇరవైలక్షలు, నెలకు రూ.25 వేలు సంపాదన, కోరుకున్న జీవిత భాగస్వామి... ఇవుంటే చాలు అనుకొనేవాణ్ని. దేవుడు అంతకంటే ఎక్కువే ఇచ్చాడు. ఈ అవకాశాన్నీ, అదృష్టాన్నీ కాపాడుకోవడం నా బాధ్యత. ‘బాబీ సినిమాలు బాగుంటాయి’ అని ప్రేక్షకులు అనుకోవాలి, ‘బాబీతో సినిమా తీస్తే డబ్బులొస్తాయి’ అని నిర్మాతలు భావించాలి. అలాంటి సినిమాలే తీస్తా.

- అన్వర్‌

శ్రీహరి మా పెళ్లి చేశారు 

నా అర్ధాంగి పేరు అనూష. చెస్‌ ఛాంపియన్‌ హారిక వాళ్ల అక్క. నా స్నేహితుడు ప్రేమికురాల్ని కలుసుకోవడానికి నన్ను తోడుగా తీసుకెళ్లేవాడు. ఆ అమ్మాయేమో మరో అమ్మాయిని వెంట తెచ్చుకునేది. తనే.. అనూష. వాళ్ల మాటల్లో వాళ్లుంటే, మేమిద్దరం కూర్చుని కబుర్లు చెప్పుకునేవాళ్లం. అలా మామధ్య పరిచయం పెరిగి, స్నేహంగా మారింది. మా కులాలు వేరు. ఇంట్లో చెబితే... ‘ముందు నువ్వు స్థిరపడు.. పెళ్లి సంగతి తరవాత’ అని చెప్పేవారు. అనూష కోసమే హైదరాబాద్‌ వచ్చి సినిమాల్లో చేరా. రచయితగా బిజీగా ఉన్నా స్థిరపడలేదన్న కారణంతో పెళ్లి వాయిదా వేసుకుంటూ వచ్చా. మరోపక్క అనూష వాళ్లింట్లో సంబంధాలు చూడ్డం మొదలెట్టారు. ఏం చేయాలో తెలీక శ్రీహరి గారి దగ్గరకు వెళ్లి విషయం అంతా చెప్పేశా. నటుడు చలపతిరావు అనూష వాళ్ల దగ్గరి బంధువు. ఆయనతో మాట్లాడి మా పెళ్లి చేశారు శ్రీహరి. ఈ కథలో కొసమెరుపు ఏంటంటే ఎవరికి తోడుగా మేమిద్దరం వెళ్లామో, వాళ్లు పెళ్లి చేసుకోలేదు.

చిరు మా ఇంటికొచ్చారు

ఆమధ్య నాన్నగారి ఆరోగ్యం పాడైంది. ‘ఏరా.. చిన్నప్పుడు నీకన్ని చిరంజీవి సినిమాలు చూపించా. నాకు ఆయన్ని చూపించవా’ అని అడిగారు. అలా అనేసరికి నాకు చాలా బాధేసింది. వినాయక్‌గారికి విషయం చెప్పా. సరిగ్గా అరగంటలో ఆయన్నుంచి ఫోన్‌... ‘చిరంజీవి గారే మీ ఇంటికి వస్తానన్నారు’ అని. నా గుండె వేగం పెరిగింది. చిరంజీవిగారు స్వయంగా మా ఇంటికొచ్చి నాన్నని పలకరిస్తే, ఆ సంతోషంలో ఆయనేం అయిపోతాడో అని కంగారేసింది. ‘వద్దుసార్‌.. మేమే వస్తాం’ అని వినయ్‌ గారికి చెప్పా. కానీ ఆయన వినలేదు. ‘జై లవ కుశ’ విడుదల రోజున చిరంజీవిగారు మా ఇంటికి వచ్చి మాతో రెండుగంటల పాటు గడిపారు. నాన్నకి నేనిచ్చిన అత్యంత విలువైన గిఫ్ట్‌ అదే!

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.