close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
అం‘తరం’

అం‘తరం’
- గన్నవరపు నరసింహమూర్తి

రోజు ఆదివారం... తెల్లవారుజామునే లేచి పార్కు దాకా నడుస్తూ వెళ్ళి అక్కడ కాసేపు కూర్చుని ఇంటికొచ్చాను. ఇంటి ముందర మామిడిచెట్టు కింద వాలుకుర్చీలో కూర్చుని పేపరు చదువుతుంటే హాయిగా అనిపించసాగింది.

ప్రత్యూషపువేళ... తూర్పుదిక్కు రాగ రంజితం అవుతున్న దృశ్యం మనోహరంగా ఉంది. ఇంతలో నా శ్రీమతి మాధురి కాఫీ తెచ్చి ఇచ్చింది. ఆమె వాకిలి దగ్గర నీళ్ళు కల్లాపి జల్లి ముగ్గు వేస్తుంటే నాకు పాత రోజులు గుర్తుకు రాసాగాయి.

నేనింకా మొన్ననే ఉద్యోగంలో చేరినట్లనిపిస్తోంది. కానీ, కాలచక్రానికి పరుగెక్కువ. అప్పుడే షష్ఠిపూర్తి దాటిపోయింది. సంవత్సరం క్రితం నేను పదవీ విరమణ చేశాను. కాలం, ప్రవాహం ఎవరికోసం ఆగవు.

మాధురితో పెళ్ళి, ఇద్దరు పిల్లలు పుట్టడం, వాళ్ళ చదువులు... ఇలా అన్నీ గుర్తుకు రాసాగాయి.

‘ఇంతేరా ఈ జీవితం... తిరిగే రంగుల రాట్నమూ...’ జీవిత నిర్వచనాన్ని ఎంత బాగా చెప్పాడో ఆ కవి.

ఇంతలో గేటు తలుపు తీసుకుని నా మిత్రుడు రాఘవ వస్తూ కనిపించాడు. వాడు నాతోపాటే మా స్కూల్లో టీచరుగా పనిచేసి నాతోపాటే పదవీ విరమణ చేశాడు. ‘‘రారా! నేనే ఈరోజు నీ దగ్గరికి వద్దామనుకుంటున్నాను’’ అన్నాను వాడికి కుర్చీ చూపిస్తూ.

కొద్దిసేపటి తరవాత మాధురి కాఫీ తెచ్చి వాడికిచ్చి ‘‘ఏం అన్నయ్యా, అందరూ బాగున్నారా?’’ అని అడిగింది.

‘‘బాగున్నారమ్మా. మీ మరదలు మొన్ననే కూతురు దగ్గరికి వెళ్ళింది. దానికి నాలుగో నెల’’ అని చెప్పాడు రాఘవ.

కాసేపు లోకాభిరామాయణం, పిచ్చాపాటి కబుర్ల తరవాత రాఘవ ‘‘సూర్యం... నీ పెన్షన్‌, మిగతా రావలసిన డీసీ ఆర్జీ అన్నీ వచ్చేశాయా? నాకు రెండు నెలలక్రితం అన్నీ వచ్చాయి. ఈ విషయం కనుక్కునేందుకే వచ్చాను’’ అన్నాడు.

‘‘ఆ... రెండు నెలలక్రితం డీసీ ఆర్జీ, అంతకుమునుపే మిగతా డబ్బులూ వచ్చాయి. జిల్లా పరిషత్‌వాళ్ళు చాలా ఆలస్యం చేశారు. అందరికీ డబ్బులు కావాలి... నేను లంచాలివ్వటానికి వ్యతిరేకం. ముప్ఫై ఏళ్ళపాటు ఉపాధ్యాయ వృత్తిలో నీతులు చెప్పి పదవీ విరమణ తరవాత న్యాయంగా మనకి రావలసిన డబ్బుల కోసం లంచాలివ్వడానికి నాకు మనసొప్పలేదు. అందుకే ఆలస్యం అయింది. రెండు నెలల నుంచీ ఫించను కూడా అందుతోంది’’ అన్నాను వాడితో.

‘‘మంచిపని చేశావు, ఆ డబ్బే మనకి జీవనాధారం... ఈ చరమాంకంలో. అది లేకపోతే మనల్నెవ్వరూ చూడరు. దాన్ని జాగ్రత్త చేశావు కదా?’’ అన్న రాఘవ ప్రశ్నకు ఏం చెప్పాలో నాకర్థం కాలేదు. కాసేపు మామధ్య మౌనం.

‘‘మానవ సంబంధాలన్నీ వ్యాపార సంబంధాలన్న కారల్‌మార్క్స్‌ మాటలు మా పిల్లలకి సరిగ్గా సరిపోతాయి. ఒకే మొత్తంగా నాకొచ్చిన డబ్బుని చూసిన తరవాత వాళ్ళకి దురాశ పుట్టింది.’’

‘‘ఇంతకీ ఏం జరిగిందిరా?’’ అన్నాడు రాఘవ.

‘‘మన చిన్నతనంలో తల్లిదండ్రులు చిల్లిగవ్వ ఆస్తి ఇవ్వకపోయినా వాళ్ళని వృద్ధాప్యంలో బాగా చూసుకునేవారు పిల్లలు. కానీ, ఇప్పుడంతా వ్యతిరేకమే. వాళ్ళకి లక్షలుపెట్టి చదివించాలి, లక్షలు పోసి పెళ్ళిళ్ళు చెయ్యాలి. మళ్ళీ వాళ్ళు ఇళ్ళు కొనుక్కునేందుకు కూడా మనమే డబ్బివ్వాలి... ఇందుకా మనం వీళ్ళని కనేది? వీళ్ళకేం బాధ్యతల్లేవా?’’ ఆవేశంగా నేను మాట్లాడుతుంటే, రాఘవ ఆశ్చర్యపోతూ ‘‘ఒరేయ్‌, నేనెప్పుడూ నీలో ఇంతటి ఆవేశాన్ని చూడలేదు. ఏం జరిగిందసలు?’’ అన్నాడు కాఫీగ్లాసు కింద పెడుతూ.

‘‘నాకు పదవీ విరమణ తరవాత వచ్చిన ముప్ఫై లక్షల్ని నేను బ్యాంకులో ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేస్తున్న విషయాన్ని వాళ్ళమ్మ ద్వారా తెలుసుకున్న నా కొడుకులిద్దరూ మర్నాడే వచ్చి ఆ డబ్బుని చెరిసగం వాళ్ళకిమ్మని అడిగారు.’’

‘‘ఎందుకట?’’

‘‘వాళ్ళిద్దరూ లోన్‌ పెట్టి ఫ్లాట్స్‌ కొన్నారట. ప్రతి నెలా ఈఎంఐలకి బోలెడు డబ్బు కట్టవలసి వస్తోందట. జీతాలు సరిపోవటం లేదట. ఎలాగూ నా తదనంతరం ఆ డబ్బు వాళ్ళదే కాబట్టి ఇప్పుడే ఇస్తే వాళ్ళు ఆ లోన్లని తీర్చేసుకుంటారట.’’

‘‘మరి నువ్వేమన్నావ్‌?’’

‘‘ససేమిరా ఇవ్వనని చెప్పాను. పదవీ విరమణ తరవాత వచ్చే డబ్బు ఉద్యోగికి ప్రాణధనం లాంటిదనీ, అది ఎవరికీ ఇవ్వననీ కరాఖండీగా చెప్పడంతో వాళ్ళిద్దరూ నాతో తగవుపడి వెళ్ళిపోయారు. అప్పట్నుంచీ నాతో మాట్లాడటం లేదు. అంత ఘోరంగా తయారయ్యారు వాళ్ళు. మనం చిన్నప్పుడు ఎంత త్వరగా చదువులైపోతే అంత త్వరగా ఉద్యోగాల్లో చేరి తల్లిదండ్రులను ఆదుకోవాలని ఆలోచించాం. నాన్నగారు అప్పు చేసి నాకు ఫీజు కడుతుంటే నాకు చాలా బాధ కలిగేది.’’

కోపంతో నేను చెప్పిన మాటలు విన్న రాఘవ కొద్దిసేపు మౌనం వహించి చెప్పటం మొదలుపెట్టాడు... ‘‘మా పిల్లలు కూడా నీ పిల్లలకేం తీసిపోలేదు. నా కొడుకైతే ఏకంగా ఒక విల్లా కోటి రూపాయలకు కొన్నాడట. అందుకని ఇక్కడ నా ఇంటిని అమ్మేసి, ఆ డబ్బులిస్తే అందరం కలిసి వాడి దగ్గర ఉండొచ్చనీ చెబుతున్నాడు. ఇదివరకు వాడింటికి వెళ్ళి నెలరోజులున్నప్పుడు మా కోడలి ప్రవర్తన మా దంపతులిద్దరికీ చాలా బాధ కలిగించింది. బతికుండగా మళ్ళీ వాడింటికి వెళ్ళకూడదని అప్పుడే నిర్ణయించుకున్నాం. అందుకే ఇల్లు అమ్మే ప్రసక్తిలేదని చెప్పడంతో ఆరు నెలలుగా మాతో మాట్లాడటంలేదు. ఆ ఇంటిని నేనూ, మీ చెల్లెలూ ఇటుక మీద ఇటుక పేర్చి కట్టాం. అలాంటిదాన్ని అమ్మడమంటే మా ప్రాణాలు పోయినట్లే అనుకో. ఏం చేస్తాం, ఇదంతా మన ప్రారబ్దం’’ అన్నాడు రాఘవ చెమ్మగిల్లిన కళ్ళను తుడుచుకుంటూ.

‘‘అయినా మన పిల్లలకేం తక్కువచేశాం చెప్పు? మన తాహతుకు మించి ఫీజులూ డొనేషన్లూ కట్టి చదివించాం. బోలెడు డబ్బు ఖర్చుపెట్టి పెళ్ళిళ్ళు చేశాం... వాళ్ళనుంచి ఇప్పటిదాకా చిల్లిగవ్వ కూడా ఆశించలేదు. అయినా వాళ్ళకి సంతృప్తిలేదు’’ అని నేను రాఘవతో చెబుతున్న సమయంలో ఇంటి ముందర ఒక ఆటో శబ్దం చేస్తూ ఆగింది. మేమిద్దరం ‘ఇంత పొద్దున్నే ఎవరొచ్చారు చెప్మా’ అని అటు చూస్తూ ఉంటే అందులోంచి పొడవుగా, సన్నగా ఉన్న ఒక యువకుడు చేతిలో బ్యాగుతో దిగి ఆటోవాడికి డబ్బులిచ్చి ఇంట్లోకి వచ్చాడు. ఆ యువకుణ్ణి చూస్తుంటే ఎక్కడో చూసినవాడిలా కనిపించసాగాడు. అయినా గుర్తుకురావడం లేదు.

అతను తిన్నగా మా దగ్గరకు వచ్చి ‘‘సూర్యం అంకుల్‌ ఇల్లే కదా’’ అని అడిగాడు.

‘‘ఔను, నేనే సూర్యాన్ని... నువ్వు?’’

అతను వెంటనే బ్యాగుని కిందపెట్టి నాకు నమస్కారం చేసి ‘‘నేను నారాయణ కొడుకు శ్రీనుని అంకుల్‌. చాలా సంవత్సరాల క్రితం మిమ్మల్ని చూడటంవల్ల పోల్చుకోలేకపోయాను’’ అని చెప్పడంతో నాకు ఆశ్చర్యంవేసింది.

నారాయణా, నేనూ చిన్నప్పట్నుంచీ మా వూళ్ళొ కలిసి చదువుకున్నాం. తన పేదరికం వల్ల నారాయణ ఇంటర్‌తో చదువు ఆపేసి కలెక్టర్‌ ఆఫీసులో బంట్రోతుగా చేరి అయిదేళ్ళ క్రితం తీవ్రమైన అనారోగ్యం చేయడంతో చనిపోయాడు. అప్పటికి వాడికింకా సంవత్సరం సర్వీసుంది. వాడికిద్దరు పిల్లలు. చనిపోవడానికి సంవత్సరం ముందు కూతురు సుశీలకి పెళ్ళి చేశాడు. ఆ సమయంలో నా దగ్గరకు వచ్చి లక్ష రూపాయలు అప్పు కావాలని అడిగితే కూతురు పెళ్ళి కాబట్టి కాదనలేక నా దగ్గర లేకపోయినా ప్రావిడెంట్‌ ఫండ్‌ లోన్‌ పెట్టి వాడికిచ్చాను. దురదృష్టవశాత్తూ వాడు అప్పు తీర్చకముందే చనిపోయాడు.

వాడు చనిపోయినప్పుడు వాడి భార్య సావిత్రిని పరామర్శించడానికి వెళ్ళినపుడు ఆమె ఆ డబ్బు విషయం ప్రస్తావించకపోవడంతో బహుశా నారాయణ ఆవిడకి చెప్పి ఉండడని అనుకుని వచ్చేశాను. అప్పుడు నా దగ్గర అప్పు తీసుకున్న విషయం చెబితే అపార్థం చేసుకునే అవకాశం ఉందని నేను ఆవిడను అడగకుండానే వచ్చేశాను. ఇది జరిగి అప్పుడే అయిదేళ్ళవుతోంది. రానురాను నేను నారాయణనీ, వాడికిచ్చిన లక్ష రూపాయల అప్పునీ మరిచిపోయాను.

మళ్ళీ ఇన్నాళ్ళకు వాడి కొడుకు రావటంతో నాకా రోజులు గుర్తుకువచ్చాయి.

వెంటనే నేను లేచి వాడిని కుర్చీలో కూర్చోమని చెప్పి ‘‘మాధురీ, నారాయణ కొడుకొచ్చాడు’’ అని చెప్పడంతో మాధురి మా దగ్గరకు వచ్చింది.

శ్రీనుని చూసి ‘‘చాలా రోజులైంది బాబూ నిన్ను చూసి...’’ అంటూ వాడిని లోపలికి తీసుకెళ్ళింది.

కానీ, అరగంట తరవాత వాడు మళ్ళీ బ్యాగుతో మా దగ్గరికి వచ్చి ‘‘అంకుల్‌, ఇంకో గంటలో నాందేడ్‌ ఎక్స్‌ప్రెస్‌కి నేను హైదరాబాద్‌ వెళ్ళిపోవాలి... అర్జెంట్‌ పని ఉంది’’ అని చెప్పడంతో, ‘‘అప్పుడే వెళ్ళిపోతావా? చాలా రోజుల తరవాత వచ్చావు... భోజనం చేసి వెళ్ళు. ఇంతకీ నువ్వేం చేస్తున్నావ్‌? అమ్మా వాళ్ళు ఎక్కడున్నారు? ఇవన్నీ చెప్పకుండానే వెళ్ళిపోతావా?’’ అన్నాను వాడితో.

‘‘రెండేళ్ళక్రితం నా డిగ్రీ పూర్తవగానే స్టాఫ్‌ సెలెక్షన్‌ కమీషన్‌ ద్వారా నాకు ఆడిటర్‌గా ఉద్యోగం వచ్చి హైదరాబాద్‌లో పోస్టింగిచ్చారు. అమ్మ ప్రస్తుతం నా దగ్గరే ఉంది. అంకుల్‌... నేనో ముఖ్యమైన పనిమీద మీ దగ్గరకు వచ్చాను. నాన్నగారు చనిపోయేముందర నన్ను పిలిచి, అక్క పెళ్ళికి మీ దగ్గర లక్ష రూపాయలు అప్పు తీసుకున్న విషయం చెప్పి, దాన్ని తీర్చమని చెప్పి నా దగ్గర మాట తీసుకున్నారు. నాకు ఉద్యోగం వచ్చి రెండేళ్ళయినా కొన్ని ఇబ్బందులవల్ల మీ డబ్బు తీర్చలేకపోయాను. ఈమధ్యనే ఆ డబ్బు సమకూరింది. ఆలస్యం అయినందుకు క్షమించండి’’ అంటూ బ్యాగులోంచి ఒక కవర్‌ తీసి, అందులోనుండి అయిదొందల రూపాయల కట్టలు రెండు తీసి నాకిచ్చాడు.

ఆ సమయంలో వాడికేం చెప్పాలో నాకర్థం కావట్లేదు. నా నోరు ఆనందంతో మూగబోయింది. ఆ తరవాత వాడు టైమైపోయిందని వెళ్ళిపోయాడు. వాడు వెళ్ళిపోయిన చాలాసేపటి వరకు నేనూ రాఘవా మాటలురాక మౌనం వహించాం.

కొద్దిసేపటి తరవాత నేనే తేరుకుని ‘‘ఆశ్చర్యంగా ఉంది కదరా రాఘవా- నారాయణ కొడుకుని చూస్తుంటే. ఈ కాలంలో కూడా ఇలాంటి పిల్లలున్నారంటే నాకు ఆనందం వేస్తోంది. ఇందాకే మనం ఈ కాలం పిల్లల గురించి మాట్లాడుకున్నాం. కానీ, వీడొచ్చి అందరూ అలాంటివాళ్ళు కారనీ చెప్పకనే చెప్పాడు’’ అన్నాను.

‘‘మంచి పిల్లలు లేరని కాదురా... కాకపోతే మన పిల్లలలాంటివాళ్ళు ఎక్కువైపోయారు సమాజంలో.’’

‘‘మరి మన పెంపకంలో ఏదైనా లోపం ఉందంటావా? మనం వాళ్ళకి సరైన మార్గనిర్దేశం చెయ్యలేదంటావా? ఎందుకు మన పిల్లలు ఇలా ప్రవర్తిస్తున్నారు? ఎందుకు తల్లిదండ్రుల నుంచి అతిగా ఆశిస్తున్నారు?’’ నా ప్రశ్నలకు రాఘవ చాలాసేపటి వరకూ మౌనం వహించాడు.

‘‘ముప్ఫై ఏళ్ళక్రితంకీ ఇప్పటికీ సమాజంలో చాలా మార్పులొచ్చాయి. అప్పుడన్నీ పేద, మధ్య తరగతి కుటుంబాలే. పేదరికంలో పుట్టడం వల్ల మనకి ఆకలి విలువ తెలుసు. పదో తరగతి కూడా చదివించే స్థితిలో ఉండేవికావు చాలా కుటుంబాలు. అందుకే త్వరగా చదువు ముగించి, ఉద్యోగంలో చేరి కుటుంబాన్నీ తల్లిదండ్రుల్నీ ఆదుకోవాలని మన తరంవాళ్ళు ఆలోచించేవారు. అదొక బాధ్యతగా భావించేవారు. కానీ, మన పిల్లల తరం వచ్చేసరికి మనలా మన పిల్లలు బాధపడకూడదనీ వాళ్ళకి ఆకలీ, పేదరికం తెలియకుండా పెంచాం. జీవితంలో వాళ్ళకి ఏ సమస్య వచ్చినా మనమే పరిష్కారాలు వెతికామే తప్ప వాళ్ళకి పరిష్కరించుకునే అవకాశం మనం ఇవ్వలేదు. ఇవన్నీ మనకివాళ శాపంలా పరిణమించాయి. కానీ, నారాయణ కొడుకులాంటివాళ్ళు ఆకలి విలువ తెలిసి పెరిగారు కాబట్టి, మంచివాళ్ళుగా తయారయ్యారు’’ రాఘవ మాటలు ఒక వేదంలా, ప్రణవనాదంలా నా చెవులకు సోకుతున్నాయి.

‘‘నువ్వు చెప్పింది అక్షరాలా సత్యం. తల్లిదండ్రుల్ని వాళ్ళ వార్ధక్యంలో ఆదుకోవాలన్న శాఖాచంక్రమణ ధర్మాన్ని వాళ్ళకి తెలిసేటట్లు పెంచకపోవడం మన తరం తల్లిదండ్రులు చేసిన తప్పు. ఏదైనా... అతి సర్వత్రా వర్జయేత్‌! తరతరాల నుంచీ వస్తున్న వారసత్వ వారధిని నిర్మించడంలో విఫలమై మన తరం ఒక చారిత్రక తప్పిదం చేసిందని నా భావన’’ చెమర్చిన కళ్ళను తుడుచుకుంటూ చెప్పాను.

‘‘మార్పు అన్నది సహజం. ఈ పరిణామం కొన్నాళ్ళుంటుంది. తరవాత మళ్ళీ మారుతుంది. ఇవన్నీ సరే, రిటైర్మెంటు డబ్బుని జాగ్రత్త చెయ్యి. ఈ వయసులో అదే మనల్ని కాపాడే సంజీవని...’’ అంటూ వాడు బయలుదేరడానికి లేచాడు.

‘‘తప్పకుండా, అంతా జాగ్రత్త చేశాను’’ అంటూ వాడితోపాటు నేను కూడా లేచాను.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.