close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
వూర్వారుకమివ బంధనాత్‌

వూర్వారుకమివ బంధనాత్‌
- నందిరాజు పద్మలతా జయరాం

‘‘ఛ! అలా అనకు. శ్రీను అలాంటివాడు కాదు’’ నచ్చచెప్పడానికి ప్రయత్నిస్తున్నాడు కేశవ. ‘‘బావుంది. నా అన్న గురించి నాకు తెలీదా! వాడంతే... ముందునుంచీ స్వార్థం. వాడూ, వాడి చదువూ, వాడి సంసారం... అంతే! మరేమీ ఆలోచించడు. అసలు వాడి మాట నా దగ్గర ఎత్తకు’’ కోపంగా అన్నాను. ‘‘సర్లే, కానీయ్‌! గుళ్ళొకెళ్తూ ఈ నకారాత్మక భావాలొద్దు’’ అంటున్న కేశవ, వెనుక నుంచీ వస్తున్న బండి శబ్దానికి తిరిగి చూశాడు. శనివారం కదా అని, బాలాజీ గుడికి వెళ్తున్నాం ఇద్దరం. పిల్లల్ని బళ్ళకి పంపేసి ఇద్దరం ప్రతి వారం ఇలా గుడికి వెళ్ళడం అలవాటు చేసుకున్నాం. ఇద్దరికీ శనాదివారాలు సెలవులే.

వెనుక లూనా మీద మహర్షిగారు. ఆయన వయసు డెబ్భైఅయిదు పైచిలుకే! ఎప్పుడో కొన్న ఆ బండినే ఇంకా వాడుతూ ఉంటారు. ఖంగుమనే కంఠం, వడిగాసాగే ఆయన నడక, దృఢంగా ఉండే శరీరం ఆయన్ని యాభై ఏళ్ళ వ్యక్తిలాగా కన్పింపజేస్తూ ఉంటాయి.
‘‘ఏవయ్యా కేశవక్రిష్ణా... ఎలా ఉన్నావ్‌? ఏమ్మా అర్చనా... కులాసానా’’ ఆయనే బండి ఆపి పలకరించారు.
కుశల ప్రశ్నలయ్యాక ముగ్గురం కలిసి గుడికెళ్ళాం. స్వామివారి దర్శనం అయ్యాక మెట్లమీద కూర్చున్నాం.
మా కాలనీలోని మూడు గుళ్ళకీ మహర్షిగారు నిత్య సందర్శకుడు. ఏ ఉత్సవం అయినా, పండగొచ్చినా అనౌన్స్‌మెంట్ల దగ్గర్నుంచీ, ప్రసాద పంపిణీలదాకా దగ్గరుండి చూసుకుంటారు. గోదారి యాసలో గబగబా మాట్లాడేస్తుంటారు. ఒక్కోసారి ముఖాన కొట్టినట్లుంటుంది ఆయన మాట. కోపం వస్తుంది మనకి. కానీ, మనసులో ఏమీ ఉంచుకోని మనిషి కనుక కొంతా, వయసుతోపాటు వచ్చిన చాదస్తం అని సర్దుకుపోవడం వల్ల కొంతా... మనమే ఆయన్ని గౌరవిస్తుంటాం.
నిజానికి నాకీరోజు మహర్షిగారు మామధ్య ఒక అడ్డంకిగా తోచాడు. ఏదో మాట్లాడుకుందాం అనుకున్నాను. ఇవాళ కేశవ కూడా వేరే పనులేవీ పెట్టుకోకుండా వీలుగా ఉన్నాడు. మగాళ్ళిద్దరూ ఏదో మాట్లాడుకుంటుంటే ఓ చెవి అటు పడేసి వింటున్నాను.
‘‘మీరు ఇంత అకస్మాత్తుగా ఇల్లు అమ్మేశారంటే నమ్మలేదు సార్‌! అలా చేశారేంటి?’’
నవ్వేశారు మహర్షిగారు.
‘‘ఆరోగ్య సమస్యలా, డబ్బు ఇబ్బందేవన్నానా’’ మళ్ళీ కేశవ ప్రశ్న.
‘‘నాకు అనారోగ్యమే! గుండులా ఉన్నాను. తెల్లారగట్ట నాలుగుకి లేచేసి మూడు మైళ్ళు తిరిగేస్తాను. అందుకే రోజూ జీడిపప్పు పాకాలు తిన్నా, పొట్టు మినపగార్లు తిన్నా... ఇనుపగుండల్లే పడుందీ శరీరం. ‘అయ్యో, మరిచేపోయానే వీణ్ణి’ అని ఆ పైవాడు లటుక్కున ఎత్తుకెళ్ళిపోతే తప్ప, ఇదిగో దీనికి శుభంకార్డు పడదోయ్‌ కేశవా’’ పకపకా నవ్వేశారాయన.
‘‘మరి, ఇల్లెందుకమ్మేసినట్లు?’’
‘‘అవును అమ్మేశాను. మెయిన్‌రోడ్డు మీద అపార్టుమెంటు కొనేశాను. అన్నట్టు... ఏమ్మా అర్చనా, అడగడం మరిచాను, మీ నాన్నగారు కులాసానా?’’
‘‘లేదంకుల్‌, నాన్న... నాన్న పోయారు’’ చెప్పలేక చెప్పాను.
‘‘అరె, నాకు తెలియదే. ప్చ్‌, కానీయ్‌... తప్పదు. ఎవరికీ తప్పదు. ఈ విషయాలు గుడిలో ఎందుకులే... వీలు చూసుకుని మీ ఆంటీని తీసుకొస్తానింటికి’’ అంటూ కొబ్బరిచిప్పని జాగ్రత్తగా చేతిసంచీలో వేసుకుని, లూనా స్టార్ట్‌ చేసి వెళ్ళిపోయారు మహర్షిగారు.
‘‘మనిషి మహా గుట్టు. బయట పెట్టలేదు చూడు విషయం’’ కేశవతో అన్నాను.
‘‘కాదులేవోయ్‌, ఏదో తొందరలో ఉన్నారు. పద పోదాం.’’
ఇద్దరం ఇంటికెళ్ళేదాకా ఏం మాట్లాడుకోలేదు.

* * *

నాన్న!
నాన్న గుర్తుకువస్తే చాలు, గుండె తరుక్కుపోతుంది. వద్దన్నా కన్నీళ్ళు ముంచుకొచ్చేస్తాయి. నాన్నకి అరవయ్యయిదే! మహర్షిగారిలాగే నాన్నదీ ఆరోగ్యమైన శరీరమే. మరి, ఎందుకిలా జరిగింది? అందర్నీ వదిలి ఒంటరిగా వెళ్ళిపోయారే..?
‘‘ఏమిటిది అర్చనా, చిన్నపిల్లల్లా ఇంకా అదే ఆలోచనా. పెద్దవాళ్ళయ్యాక వెళ్ళిపోకుండా ఉంటారా ఎవరైనా, వదిలెయ్‌.’’
‘‘అదికాదు నా బాధ. అన్నయ్య అట్లాచేసి ఉండకపోతే నాన్న కచ్చితంగా మరో పదేళ్ళు బతికి ఉండేవారు. ఆయన మరణానికి కారణం వాడే’’ కేశవ గుండెల్లో దాచుకున్నాను తలని.
పొదివి పట్టుకుని తల నిమురుతూ ఉండిపోయాడు తను.
నేనూ, అన్నయ్య ఇద్దరమే సంతానం అమ్మానాన్నలకి. వాడు నాకన్నా పదేళ్ళు పెద్ద. ఇద్దర్నీ గారాబంగా పెంచారు. నాన్నది చిన్న ఉద్యోగమే కానీ, మంచి పొదుపరి. అమ్మా అంతే. ‘ఇది కావాలి’ అని ఏనాడైనా నాన్నని అడగడం నేను చూడలేదు. ఎప్పుడూ ఇంటికి వచ్చేపోయే చుట్టాలకి ‘కాదు, లేదు’ అనకుండా వండి వార్చటం అమ్మ వంతు. వచ్చిన చుట్టాల పిల్లలకీ ఆడవాళ్ళకీ బట్టలు పెట్టి పంపడం, సిటీలో వాళ్ళ పనులకి చేదోడు వాదోడుగా ఉండటం నాన్న వంతు. బామ్మా, తాతయ్యల సేవ చేయడంలోగానీ, మా చదువుల విషయంలోగానీ ఏ లోటూ రాకుండా చూడటానికి నాన్నపడ్డ శ్రమా, అమ్మ ఒంటిచేత్తో చేసుకునే చాకిరీ తలచుకుంటే ఇప్పుడనిపిస్తుంది... ‘పరోపకారం అనేది ఆ తరాలతోనే పోయిందా’ అని.
నాన్న రిటైరయ్యేనాటికి అన్నయ్యకీ నాకూ కూడా పెళ్ళిళ్ళయిపోయాయి. అన్నయ్య పిల్లలు మా పిల్లలకన్నా పెద్దవాళ్ళు. వదినా, అన్నయ్యా ఇద్దరూ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లే. అమ్మానాన్నలతో ఆ చిన్న ఇంట్లోనే సర్దుకుని ఉండేవాళ్ళు. పండగలకీ వేడుకలకీ నేను వెళ్ళినప్పుడు అందరం బాగా కలిసిపోయేవాళ్ళం. నాన్న కళ్ళల్లో కన్పించే ఆ వెలుగు నాకిప్పటికీ కన్పిస్తూంటుంది.
నాన్న రిటైరయ్యారు. రిటైర్‌మెంట్‌ బెనిఫిట్స్‌, ప్రావిడెంట్‌ ఫండ్‌ అన్నీ కలిపి బాగానే వచ్చాయి. సరిగ్గా అప్పుడే అన్నయ్యకి స్టేట్స్‌లో అసైన్‌మెంట్‌ రావడం, వదిన కూడా ప్రయత్నించి మరో మంచి ఆఫర్‌ సంపాదించడం జరిగింది. అన్నయ్య పిల్లలిద్దరికీ నానమ్మా తాతలతో బాగా మాలిమి. వాళ్ళూ అంతే. మనవలంటే మహా ప్రీతి. ఒక్కళ్ళనయినా తమ దగ్గర ఉంచుకోవాలనుకున్నారు. వదిన ఒప్పుకోకపోవడంతో అన్నయ్య కుటుంబం అంతా రెండేళ్ళ కోసం అమెరికా వెళ్ళిపోయింది. నాన్న రిటైర్‌మెంట్‌ డబ్బుకి, ఉన్న ఇంటిని అమ్మిన మొత్తంతో కలిపి ఎప్పుడో కొన్న అయిదొందల గజాల్లో పెద్ద ఇల్లు కట్టించారు. రెండు అంతస్తులూ, ఏడు పడగ్గదులూ.
‘ఎందుకు నాన్నా, అంత పెద్ద ఇల్లు’ అంటే, ‘నీ మొహం... నీ పిల్లలూ, శ్రీను పిల్లలూ పెద్దయి- తాతా మాకు స్పెషల్‌ గదులేవీ అంటే ఎలా? అందరికీ వీలుగా ఉండొద్దూ’ అన్నారు. అన్ని గదులూ తిరిగి రావాలంటే పది నిమిషాలు పట్టేంత పెద్ద ఇల్లు. ఇల్లు పూర్తయ్యేసరికి నాన్న దగ్గర పైసా మిగల్లేదు. నెలనెలా వచ్చే అతి తక్కువ పెన్షన్‌తో నెట్టుకొచ్చేవాళ్ళు. రెండేళ్ళు కాస్తా అయిదేళ్ళయింది. అన్న పిల్లలు కాలేజీ చదువులకి వచ్చారు. అప్పుడు తిరిగి వస్తున్నామని తెలియజేశాడు. ఎగిరి గంతేశాం అందరం. నాన్నయితే మరీనూ! అప్పటిదాకా అద్దెకి కూడా ఇవ్వడానికి వీలులేని ఇంటికి చాకిరీ చేసిచేసి ఉన్నారేమో... ఇంకా కొంత ఖర్చుపెట్టి అమెరికా నుంచి వచ్చే మనవల కోసం ఆధునిక వసతులన్నీ కల్పించారు.

అన్నయ్య కుటుంబం రానే వచ్చింది. ఎయిర్‌పోర్టుకి వెళ్ళాం అందరం. ఎప్పటికప్పుడు వీడియోల్లో చూసేదానికన్నా అందంగా ఉన్నారు నా మేనకోడలూ అల్లుడూ. వాళ్ళని ఇంటికి తీసుకురావడానికి మేం బుక్‌ చేసిన కారులో ఎక్కలేదు వాళ్ళు. అన్నయ్య బావమరిది తెచ్చిన పడవలాంటి పెద్ద కారులో కూర్చున్నారు.
‘‘కొంచెం జెట్‌లాగ్‌ తీర్చుకున్నాక రెండుమూడు రోజుల్లో వస్తాం నాన్నా’’ కిటికీ అద్దం పైకి తీసి అన్నాడు అన్నయ్య.
‘‘థాంక్సేలాట్‌ అర్చనా! థాంక్యూ మావయ్యా!’’ చెయ్యి వూపింది వదిన. కారెళ్ళిపోయింది.
తెల్లబోయి చూస్తున్న నేను ఎవరో దబ్బున కిందపడ్డట్లయి చూసేసరికి, కిందపడిపోయిన నాన్నని పైకి లేపుతున్నారు కేశవ, అమ్మా కలిసి.
‘‘ఇదేమిటే అర్చూ, ఇలా జరిగిందేంటి? ఎక్కడికి వెళ్ళారు వాళ్ళు. లక్ష్మి పుట్టింటికేనా?’’ అయోమయంగా అడిగింది అమ్మ తిరుగు ప్రయాణంలో.
నాన్న ఇంకా పూర్తిగా తేరుకోనేలేదు.
‘‘అత్తయ్యా, శ్రీనివాస్‌ విల్లా కొనుక్కున్నాడట. రెండు కోట్లయిందట. ఇందాక మీ కోడలి అన్నగారు చెప్పారు నాతో’’ కేశవ మాటలు సగమే అర్థమయ్యాయి నాకు.
‘‘ఔనా, సంతోషమే. కానీ, మనకెవ్వరికీ తెలీలేదే’’ ఆశ్చర్యపోయాను.
‘‘అంటే, ఇప్పుడు వాళ్ళక్కడికి ఎలా వెళ్తారు... గృహప్రవేశం కాలేదుగా కేశవా’’ అడిగింది అమ్మ.
‘‘అదీ అయిపోయిందట. మీ వియ్యపురాలూ వియ్యంకుడూ కూర్చుని చేసుకున్నారట. మళ్ళీ మూఢం ఉందని కాస్త తొందరపడ్డారట.’’
కేశవ మాటలు నాన్న హృదయాన్ని ఎంత గాయపరచాయో తెలియదు కానీ, ఇంటికెళ్ళాక నాన్న నేరుగా తన గదిలోకి వెళ్ళిపోయి గడియ వేసుకున్నారు. రాత్రిదాకా టెన్షన్‌తో నలిగిపోతూ అమ్మా మేమూ. బాగా పొద్దుపోయాక బయటికి వచ్చిన నాన్న, అప్పటిదాకా కుమిలిపోతున్న అమ్మ.
బతిమిలాడి ఇద్దర్నీ అన్నాల ముందు కూర్చోపెట్టాను.

‘‘ఎందుకే అర్చనా, మీ అన్న ఎందుకిలా చేశాడు? వాడి డబ్బుతో వాడు ఇల్లు కట్టుకుంటుంటే నేను కాదంటానా! నాకు తెలియనీయకుండా గృహప్రవేశం కూడా చేసుకునేంత అవసరం ఎందుకొచ్చింది వాడికి? ఈ లంకంత కొంప కట్టుకున్నంతసేపూ వాడి గురించీ, వాడి పిల్లల గురించే కదా నేనాలోచించాను. వాడిని సంప్రదించకుండా ఒక్కడుగు కూడా ముందుకెయ్యలేదే. అప్పుడైనా చెప్పొద్దూ. అప్పటికీ అమ్మ ‘అర్చనకి కూడా కొంత సొమ్ము ఉంచండి, దాని పిల్లల పెళ్ళిళ్ళకి అవసరం అవుతుంది’ అని పోరుతూనే ఉన్నా, నేను వినలేదు. నాతో మాట మాత్రం అనకుండా, అయిదేళ్ళపాటు వాడి రాకకోసం ఎదురుచూస్తూ కూర్చుంటే, వాడి దారి వాడు చూసుకున్నాడేమిటే... నాకు అర్థంకావట్లేదు’’ భళ్ళుమన్నారు నాన్న. అమ్మ కన్నీరు కంచంలోని అన్నంలో కలిసిపోయింది.

అంతే! అమ్మ తట్టుకోగలిగిందో లేక నాన్న కోసం నటించిందో తెలియదుగానీ స్థిమితంగా ఉన్నట్లే అన్పించేది. నాన్న మాత్రం బాగా ఒత్తిడికి గురయ్యారు. నిరాశతో కుంగిపోయారు. తిండీ నిద్రా రెండూ కరువయ్యాయి. కేశవ ఉద్యోగం దృష్ట్యా నేనూ దూరంగానే ఉండాల్సిరావడం, ఏ పదిహేను రోజులకోసారో వాళ్ళని కలవడం జరిగేది. అన్నయ్యా వదినా బంధువులలాగా అమ్మానాన్నలని చూడటం, వెళ్ళిపోవడం... అన్నయ్య పిల్లలిద్దరూ కూడా పూర్వంలా కలివిడిగా కాక ఏదో మొక్కుబడిగా నానమ్మా, తాతయ్యలను పలకరించడం జరిగేది.

నాన్న ఆరోగ్యం క్షీణించిపోయింది. అన్నయ్యకి ఫోన్‌ చేసినప్పుడల్లా చాలా ముక్తసరిగా మాట్లాడేవాడు. లాభంలేదని ఓరోజు వాడి ఇంటికే వెళ్ళాం నేనూ, కేశవా.

‘‘ఏంటి అర్చనా, మేమూ పెద్దవాళ్ళమవుతున్నాం. పిల్లలకి కూడా ప్రైవసీ అవసరం. అక్కడి సంపాదనతో ఇక్కడ ఇల్లు కొనుక్కోవడంలో తప్పేం ఉంది? అయినా ఆయనని అంత పెద్ద ఇల్లు కట్టమని నేనడిగానా. వాళ్ళతో ఉంటానని ప్రామిస్‌ చేశానా? గృహప్రవేశం సంగతి అంటావా... విషయం తెలిస్తే నాన్న తట్టుకోలేడేమో అని కొంతా, ఆయన ఇన్‌వాల్వ్‌మెంట్‌ ఉంటే మా ఇద్దరికీ నచ్చినట్లు ఇంటి నిర్మాణం జరగదేమో అన్న అనుమానంతో కొంతా... చెప్పలేదు. అంతగా అయితే, వాళ్ళని చివరి రోజుల్లో నేనే తెచ్చుకుని ఉంచుకుంటాన్లే.’’ అన్నయ్య మాటలకి నాకు తలతిరిగిపోయింది.

‘‘అయినా అర్చనా, ఏంటి ఈ న్యూసెన్స్‌? మా ఇల్లూ మా ఇష్టం. ఇంకా అత్తింటి ఆరళ్ళూ, మావగారి అదుపాజ్ఞలూ- ట్రాష్‌... నావల్ల కాదు. వచ్చారు... ఇల్లు చూశారు... సంతోషం. నీకోసం మంచి చీరె కొనుక్కొచ్చాను. అది తీసుకుని వెళ్ళు. అంతేగానీ, అనవసరంగా మా మూడ్‌ పాడుచెయ్యకు... ప్లీజ్‌! ఇలా అన్నానని ఏమీ అనుకోకు’’ వదిన మాటలు తూటాల్లా తగిలాయి నాకు.

ఇద్దరం వెనక్కొచ్చేశాం- మంచినీళ్ళు కూడా తాగకుండా. తర్వాత అన్నయ్య అప్పుడప్పుడూ ఫోన్‌ చేసినా, నాకు మాట్లాడబుద్ధెయ్యలేదు. కేశవే మాట్లాడుతున్నాడు. నాన్న మంచం పట్టారు. నేను సెలవు పెట్టి సేవ చేశాను. అన్నయ్య వారానికోసారి వచ్చి వెళ్తూనే ఉండేవాడు. నాన్న వాడితో మాట్లాడకపోయినా, అమ్మ మాత్రం మామూలుగానే ఉండేది. వాడు ఇచ్చిన డాక్టర్‌ ఫీజూ, డబ్బూ వగైరా వద్దనేది. బలవంతంగా చేతిలో పెడితే తీసుకునేది. ఎవరు ఎంత సమాధానపరిచినా నాన్న సర్దుకోలేకపోయారు. ఆరు నెలలు తిరక్కుండానే వెళ్ళిపోయారు. ఇప్పుడా రాజభవనంలో అమ్మ ఒంటరి. నా దగ్గరకి రాదు. అన్నయ్య రమ్మన్నా, వదిన మాట వరసకి కూడా రమ్మనదు. ఈ పరిస్థితికి బాధ్యుడు అన్నయ్య కాదా!

* * *

మూడు రోజులు గడిచాయేమో... కాలింగ్‌బెల్‌ మోగింది. తలుపు తీశాను.
‘‘ఈ రాత్రికి మీ ఇంట్లోనే మా ఫలహారం. నీ ఇష్టం అమ్మాయ్‌... జీడిపప్పు ఉప్మా చేస్తావో, పూరీ కూర్మా చేస్తావో... కాస్త కారంగా చెయ్యి చాలు’’ గలగలా మాట్లాడేస్తూ లోపలికి వచ్చారు మహర్షిగారు, ఆయన వెనుకే చిరునవ్వుతో ఆయన భార్య సత్యవాణిగారు. వాళ్ళని సాదరంగా ఆహ్వానించాడు కేశవ. కాఫీ తాగాక కబుర్లు మొదలుపెట్టారు మహర్షిగారు.
‘‘అమ్మేశానయ్యా, కాస్త తక్కువకే అమ్మేశాననుకో... బాధేం లేదు. ఓ పది లక్షలు బ్యాంకులో డిపాజిట్‌ చేసుకుని, మిగతా దానితో చిన్న ఫ్లాట్‌ మెయిన్‌రోడ్‌ మీద కొనేశాను. అన్నింటికీ దగ్గర. ఇక్కడలాగా ఆటో కట్టించుకునే పన్లేదు.’’
‘‘కానీ... ఇండిపెండెంట్‌ ఇల్లు కదండీ. ఈ కాలనీలో సీనియర్‌ మీరు. అందరికీ తలలో నాలుక. అన్ని గుళ్ళల్లో దేవుళ్ళకీ మీరంటేనే మక్కువ’’ కేశవ మాటలని నేనందుకున్నాను.
‘‘అవునంకుల్‌! ఇల్లూ, చుట్టూ చక్కని పూలమొక్కలూ... కొబ్బరి, అరటి, పనస... ఇవన్నీ మీ అమలాపురం నుంచి తెప్పించి మరీ పెట్టారు కదా... అసలు మీ అమ్మాయిలిద్దరూ ఎలా ఒప్పుకున్నారు?’’
పెద్దగా నవ్వేశారు మహర్షిగారు.

‘‘చూడమ్మా, అవన్నీ మాతో వస్తాయా! అసలు ఈ శరీరం మనతో వస్తుందా? కదిలిపోవాలి. కాలంతోపాటు మారిపోవాలి. మా వూళ్ళొ ఈ ఇంటికి పదింతలు పెద్ద భవనం. ముప్ఫై ఎకరాల మాగాణి. ఉద్యోగం కోసం వదిలి రాలా! ఉన్న వూరూ, కన్నతల్లీ అన్నీ వదిలిపెట్టామా లేదా? ఇప్పుడు ఈ ఇంటిని వదిలిపెట్టాం. ఎందుకూ? ఏ రాత్రో అవసరం వస్తుందనుకో... ఏముందీ, మీ ఆంటీ ముసలి గుండెకాయ గుటుక్కున ఆగిపోతోందనుకో... లటుక్కున ఆటో దొరకాలన్నా, అమెరికాలో ఉన్న పెద్దపిల్ల ఏ రాత్రో విమానాశ్రయం నుంచి రావాలన్నా, నేను ఏ గుళ్ళొనో ఉన్నప్పుడు ఠపీమని ఏ చుట్టమో భోజనానికొస్తే మీ ఆంటీ ఏ కూరలో కొందామన్నా... ఇక్కడ వీలుంటుందా చెప్పు? ఏదో, ఉన్నంతకాలం... కాస్త సుఖంగా ఉందాం, అనవసరపు బంధాలొద్దు. జీవం ఉన్నవాటి మీద ప్రలోభం వద్దు. జీవం లేనివాటి మీద వ్యామోహమూ వద్దు. ఒంటరిగా వస్తాం, ఒంటరిగానే పోతాం. అందరం బావుండాలి. అందులో మనముండాలి. ‘వూర్వారుకమివ బంధనాత్‌’ అంటారు. ఏమిటా వాక్యానికర్థం? పండిన దోసపండు దానంతటదే తీగ నుంచి విడివడినట్లు, నన్నూ ఆ బంధం నుంచి విముక్తం చెయ్యి’ అని.’’

రెప్ప వేయకుండా వింటున్నాం కేశవా, నేనూ.
‘‘ఇకపోతే, పిల్లలెలా ఒప్పుకున్నారు అని కదూ అడిగారు- ఎందుకొప్పుకుంటారు... ఒప్పుకోలేదు, ఒప్పించాను. వాళ్ళొకళ్ళు అమెరికా, మరొకళ్ళు బొంబాయి. వాళ్ళు రానూ రారు, వచ్చినా రెండ్రోజులు మించి ఉండనూ లేరు. ఆ కాస్త కోసం ఈ ఇంటి నిర్వహణ, అద్దె వసూళ్ళు... నాకెందుకయ్యా కేశవా ఈ జంఝాటం? తెగ్గోసుకోవాలి ఈ అనవసరపు లంకెలు. కౌపీనం కూడా వెంటేసుకుపోలేరు... కోట్లు గడించినవాళ్ళు కూడా!’’
‘‘చాల్లేండి, వినేవాళ్ళుంటే వదలరు మీరు’’ భర్తని కసిరింది సత్యవాణిగారు.
‘‘చూశారా, మీ బుర్రల్ని తినేశాను అంటోందావిడ. అంతే, ప్రాక్టికల్‌ మనుషుల్ని ప్రపంచం మెచ్చదు సుమీ! ఒక్కటి మాత్రం నిజమయ్యా కేశవా, మానసికారోగ్యం దృఢంగా లేకపోతే శరీరారోగ్యం ఢమాల్‌ అంటుంది. మనసుని మనం గాఠ్ఠిగా లొంగదీసుకుని, ఏది మంచిదో దానికి నచ్చజెప్పే వైద్యం మన చేతుల్లోనే ఉంది. ఇక అప్పుడు, దాని దుంపతెగ... రోగం రమ్మన్నా రాదంతే! ఏదీ అమ్మాయ్‌... ఉప్మానో పూరీనో.. లేక రెండూనో...’’

మహర్షిగారి మాటలతో నా కళ్ళముందున్న తెర ఏదో తొలుగుతున్న అనుభూతి. నాన్న మీద ప్రేమతోనో అన్నయ్యపట్ల ఉక్రోషంతోనో నేను కోపగిస్తూ కుమిలిపోతున్నాను తప్ప- నాన్న మరణానికి కారణం అన్నయ్య కాదు, ఆయనని కట్టిపడేసిన మమతానుబంధం... కళ్ళకి కనిపించని బంధనం!

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.