close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
నిశ్శబ్ద ప్రకృతిలో... కృష్ణమ్మ ఒడిలో...

నిశ్శబ్ద ప్రకృతిలో... కృష్ణమ్మ ఒడిలో...

‘ఆకాశాన్ని అందుకోవాలనుకునే పచ్చని కొండలూ... ఆ కొండల మధ్యలో పరవళ్లు తొక్కుతున్న కృష్ణమ్మ హొయలూ... ఆ నల్లని నదీజలాల మీదుగా తేలివచ్చే చల్లని పిల్లగాలులూ... లాంచీ శబ్దం తప్ప మరే సవ్వడీ వినిపించని నిశ్శబ్ద ప్రకృతిలో సాగిన ఆ ప్రయాణం... వేనవేల మధురానుభూతుల సమ్మేళనం...’ అంటూ నాగార్జునసాగర్‌ - శ్రీశైలం యాత్రా విశేషాలను మనతో పంచుకుంటున్నారు నల్గొండ ఈనాడు విలేకరి జీడిపల్లి దత్తురెడ్డి.

సాగర్‌ నీటిమట్టం 570 అడుగులకు పైగా చేరడంతో నాగార్జునసాగర్‌ నుంచి శ్రీశైలం వరకు లాంచీని నడపాలని తెలంగాణ రాష్ట్ర పర్యటక అభివృద్ధి సంస్థ (టీఎస్‌టీడీసీ) నిర్ణయించింది. అందులో భాగంగా ట్రయల్‌ రన్‌ నిర్వహించాలని టీఎస్‌టీడీసీ తలపెట్టింది. ఉదయం ఏడు గంటలకు ఆరుగురం మిత్రులం సాగర్‌కు బయల్దేరి, 9 గంటలకల్లా సాగర్‌ లాంచీ స్టేషన్‌కు చేరాం. 11.30 గంటలకు హైదరాబాద్‌ నుంచి పర్యటకశాఖ అధికారులు వచ్చి, ట్రయల్‌రన్‌ను ప్రారంభించారు. 12.00 గంటలకు స్టేషన్‌ మేనేజరు సత్యం జెండా వూపడంతో మా విహారం మొదలైంది.

సుమారు రూ.2 కోట్ల రూపాయలు వెచ్చించి, సకల సౌకర్యాలతో నిర్మించిన ఫల్గుణి లాంచీ శ్రీశైలానికి బయలుదేరింది. దాదాపు ఎనిమిది మంది లాంచీ సిబ్బందీ ఇద్దరు డ్రైవర్లతోపాటు 80 మంది ప్రయాణికులం...120 సీట్లతో నిర్మించిన ఈ లాంచీలో ఏసీ సౌకర్యమూ ఉంది. పర్యటకశాఖలో పదవీవిరమణ చేసిన కె. వెంకటేశ్వర్లు గైడ్‌లా వ్యవహరించారు. సాగర్‌ నుంచి శ్రీశైలానికి 112 మైళ్ల దూరం ఉందనీ, ఆరు గంటల్లో అక్కడకు చేరుకుంటామనీ చెప్పారు.

కృష్ణానదిలో 50 నిమిషాలపాటు గంటకు 20 కిలోమీటర్ల వేగంతో లాంచీలో ప్రయాణిస్తూ నాగార్జునకొండ ఎడమవైపునకు చేరుకున్నాం. దీన్నే నందికొండ అనేవారు. బౌద్ధాన్ని ప్రపంచానికి పరిచయం చేసి, నందికొండలో ఒక విశ్వవిద్యాలయాన్ని స్థాపించి, ఆయుర్వేద వైద్యంతో చరిత్ర సృష్టించిన ఆచార్య నాగార్జునుడు నడియాడిన నేల అది. ఈ ప్రాంతంలోనే నాగార్జునసాగర్‌ను నిర్మించారు. ఆనకట్ట కారణంగా ముంపునకు గురైన ప్రాంతంలో దొరికిన నాటి నాగార్జునుడి వస్తువులని ఈ కొండమీద ఒక మ్యూజియంలో భద్రపరిచారు. దీన్ని చూడ్డానికి నేపాల్‌, టిబెట్‌, థాయ్‌లాండ్‌... తదితర దేశాలనుంచీ పర్యటకులు వస్తుంటారు. నాగార్జున కొండ ఎడమవైపు నుంచి అరగంట ప్రయాణించాక ఏలేశ్వరం గుట్ట వచ్చింది. నల్గొండ, నాగర్‌కర్నూల్‌, కర్నూల్‌, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లోని ఆదివాసీలు, చెంచులు, గిరిజనులు ఆ గుట్టపైనున్న శివుడిని ఆరాధ్య దైవంగా భావిస్తారు. అక్కడి నుంచి మా లాంచీ ఎడమవైపునకు తిరగడంతో నాగర్‌కర్నూల్‌ జిల్లా సరిహద్దుల్లోకి అడుగుపెట్టాం.

ఎటుచూసినా దట్టమైన నల్లమల అడవులే. మధ్యమధ్యలో కేవీ చెబుతున్న మాటల ధ్వనీ, పక్షుల కువకువలూ, లాంచీ శబ్దమూ తప్ప మరేమీ వినిపించని ఆ గాఢమైన నిశ్శబ్ద ప్రకృతిలో ఆకాశాన్ని అందుకోవాలనుకునే ఎత్తైన పచ్చని కొండల్నీ, నీలి జలాల్లో తన అందాన్ని చూసుకుని మురుసుకునే నీలాకాశాన్నీ, ఆ పచ్చని కొండల్నీ తెల్లని మేఘాలనీ ప్రతిబింబిస్తూ నిశ్చలంగా కదులుతున్న కృష్ణమ్మ సౌందర్యాన్నీ ఆస్వాదిస్తూ ప్రయాణం సాగుతోంది. మధ్యలో పచ్చని ద్వీపాలు కనువిందు చేస్తున్నాయి.

జీవవైవిధ్యానికి పుట్టినిల్లు...
తెలంగాణలో ఉన్న ఏకైక టైగర్‌ రిజర్వు ఫారెస్ట్‌ అయిన ఆమ్రాబాద్‌ అడవుల అంచులగుండా లాంచీ వెళుతోంది. దేశంలోని అయిదు జీవవైవిధ్య కేంద్రాల్లో నల్లమల ఒకటి. అరుణాచల్‌ ప్రదేశ్‌లోని నాందాఫా, పశ్చిమ కనుమల్లోని అగస్త్యమలై, తమిళనాడులోని నీలగిరి, హిమాలయాల్లో నందాదేవి మిగిలిన కేంద్రాలు. అంతరించిపోతున్న జాతీయ జంతువు పులికి నల్లమలే ఆవాసం. ప్రస్తుతం ఇక్కడి పులుల అభయారణ్యంలో 80 వరకూ ఉండొచ్చనేది ప్రభుత్వ అంచనా. ఈ అడవుల్లో ఉన్న 70 - 80 జాతుల ఔషధ మొక్కలు హిమాలయ సానువుల్లో తప్ప ఎక్కడా దొరకవట. దాదాపు 70 రకాల క్షీరదాలూ 300 రకాల పక్షులూ ఉన్నాయిక్కడ. చుక్కల జింకలూ అరుదైన బల్లి జాతులకూ ఈ ప్రాంతం పెట్టింది పేరు.

కొంతదూరం వెళ్లాక ఏటవాలుగా ఉన్న పగులురాళ్ల గుట్టలు కనువిందు చేశాయి. వీటిని చూస్తుంటే ఎవరో రాజులు నిర్మించారేమో అనిపిస్తుంది. కానీ సహజంగా ఏర్పడినవే. ఆ రాళ్లగుట్టల్లో కృష్ణానది మీదే ఆధారపడి జీవిస్తున్న చెంచుగూడెలతోపాటు, నాటుపడవలతో చేపలవేట సాగిస్తున్న మత్స్యకారులూ కనిపించారు.

కుడివైపు ఆంధ్ర, ఎడమవైపు తెలంగాణ ప్రాంతంలోని నల్లమల కొండలు... వాటి మధ్యలోని కృష్ణమ్మ ఒడిలో మా ప్రయాణం... తీరంలోని చెట్లకొమ్మలమీద కోతులూ నదిలో దాహం తీర్చుకోవడానికి వచ్చిన ఆవులూ, గొర్రెల మందల్నీ చూస్తూ ముందుకు వెళ్లాం. అక్కడ మర పడవలో గొర్రెలను నది దాటిస్తున్న దృశ్యం ఆకర్షించింది. లాంచీ కింది భాగంలో భోజనాలు ప్రారంభమయ్యాయి. భోజనాలు ముగించుకుని, మళ్లీ 3.00 గంటలకు లాంచీ పైభాగానికి చేరుకున్నాం. నల్లమల ప్రాంతానికే ప్రత్యేకమైన కొంగలు లాంచీ మీద వాలి మళ్లీ ఎగిరిపోతున్నాయి. వాటిని చూస్తూ కాసేపు ఆనందించాం. అంతలోనే మా కుడివైపున సన్నని ధారల్లా కిందకి పడుతోన్న జలపాత దృశ్యం మమ్మల్ని మంత్రముగ్ధుల్ని చేసింది.

కనువిందు చేసిన సూర్యాస్తమయం...
నాలుగున్నర గంటల ప్రయాణం తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సాగర్‌ వెనకజలాలు నిల్వ ఉండటానికి కట్టిన చెక్‌డ్యామ్‌ ప్రాంతానికి చేరుకున్నాం. సాగర్‌ నీటిమట్టం 570 అడుగుల కంటే తక్కువ ఉంటే ఈ చెక్‌డ్యామ్‌ లాంచీ ప్రయాణానికి అడ్డు వస్తుంది. నది పైభాగం నుంచి చెక్‌డ్యామ్‌ ఎంత లోతులో ఉందోనని అంచనా వేస్తూ, లాంచీ అసలు కదులుతుందా లేదా నదిలోనే నిలిచిపోయిందా అన్నంత మెల్లిగా పోనిచ్చాడు డ్రైవర్‌. మత్స్యకారులు వేసిన వలలను తప్పిస్తూ లాంచీ ప్రయాణం ముందుకు సాగింది. దాదాపు సాయంత్రం ఐదు గంటలు కావస్తుండటంతో నల్లమల గుట్టల మధ్యలోంచి కృష్ణా నదిమీదుగా మెల్లగా కిందకి దిగుతోన్న సూర్యబింబాన్ని చూసేందుకు రెండు కళ్లూ చాలలేదు. రెండు గుట్టల మధ్య పాతాళగంగ వద్ద కట్టిన వారధి కింది నుంచి శ్రీశైలం డ్యామ్‌ ఎదురుగా ఎడమవైపు ఉన్న లింగాల గట్టుకు చేరి, అప్పటికే అక్కడ సిద్ధంగా ఉన్న ట్యాక్సీల్లో శ్రీశైలం చేరుకున్నాం. టీఎస్‌టీడీసీ ఏర్పాటుచేసిన సత్రంలో భోజనం చేసి నిద్రకు ఉపక్రమించాం.

మల్లన్న దర్శనం
తెల్లవారుజామున నాలుగున్నరకే లేచి స్నానాదికాలు పూర్తి చేసుకొని మల్లన్న దర్శనానికి బయల్దేరాం. ఆలయ ప్రాంగణంలోని కౌంటర్‌లో టిక్కెట్‌ తీసుకొని ఆలయంలోకి ప్రవేశించాం. కార్తీకమాసం కావడంతో భక్తుల రద్దీ బాగా ఉంది. అర్చకుడు మూడు నామాలతో నుదుట తిలకం దిద్దారు. అది అక్కడి సంప్రదాయం. ఎదురుగా ధ్వజస్తంభం... చేతులు తాకించి మొక్కుకున్నాం. స్వామి వారి గర్భగుడిలోకి వెళ్లగానే ఒక్కసారిగా మనసు పులకించిపోయింది. కైలాసవాసిని కనులారా వీక్షించాం. భ్రమరాంబికా దేవినీ దర్శించుకుని, లడ్డూ ప్రసాదాలను తీసుకొని, అల్పాహారం ముగించుకోగానే తిరుగు ప్రయాణం ప్రారంభమైంది. సత్రం నుంచి బయల్దేరి ట్యాక్సీలో నీలం సంజీవరెడ్డి సాగర్‌- అంటే శ్రీశైలం ప్రాజెక్టుకు చేరుకున్నాం. మేం వెళ్లేసరికే అక్కడికి చేరుకున్న కేవీ బృందం ఉన్నతాధికారుల అనుమతి తీసుకోవడంతో డ్యామ్‌ పైకి వెళ్లాం. 2009లో వచ్చిన అకస్మిక వరద, అప్పటి పరిస్థితులను అధికారులు వివరించారు. డ్యామ్‌ చరిత్ర గురించి కేవీ మా బృందానికి తెలిపారు. అక్కడి నుంచి మళ్లీ ట్యాక్సీలో లాంచీ పాయింటైన లింగాల గట్టుకు చేరుకున్నాం. సరిగ్గా 11.30 గంటలకు తిరుగు ప్రయాణం లాంచీలో మొదలైంది.

వెళ్ళేటపుడు మిట్టమధ్యాహ్నం కావడంతో వేడిగాలుల కారణంగా కాస్త ఉక్కపోతగా అనిపించింది. కానీ తిరుగుప్రయాణంలో వాతావరణం చల్లగా ఉండటంతో చల్లగాలుల పలకరింపులు హాయిగా అనిపించాయి. ప్రయాణికులంతా లాంచీ పైకి చేరి, నదీ సౌందర్యాన్ని ఆస్వాదించసాగారు. వెళ్లేటపుడు మా కళ్లబడని నల్లమల అందాలూ దుంధుబీ నది సంగమం తిరుగు ప్రయాణంలో కనువిందు చేశాయి. సాయంత్రం 5.30 గంటలకు నాగార్జునసాగర్‌లోని లాంచీ పాయింట్‌కు చేరుకుంది. ఒకరికొకరం వీడ్కోలు చెప్పుకుంటూ మరిచిపోలేని అనుభూతులతో వెనుతిరిగాం.

- ఫోటోలు: సిరిపురం రవీందర్‌, ఈనాడు, నల్గొండ

ఇలా వెళ్లొచ్చు..! 

నీటిమట్టం ఎక్కువగా ఉండే నవంబరు, డిసెంబరు, జనవరి నెలల్లోని ప్రతివారంలో రెండుసార్లు బుధ, శనివారాల్లో సాగర్‌ నుంచి శ్రీశైలం వరకూ లాంచీని నడపాలని టీఎస్‌టీడీసీ నిర్ణయించింది. ఇందుకోసం కొన్ని ప్యాకేజీలనూ ప్రకటించింది. అవేమంటే...

  * హైదరాబాద్‌ - సాగర్‌ - శ్రీశైలం ఈ ప్యాకేజీలో హైదరాబాద్‌ నుంచి పర్యటక శాఖ వారు ఏర్పాటు చేసిన బస్సులో ప్రయాణికులను సాగర్‌కు తీసుకువెళతారు. అక్కడి నుంచి శ్రీశైలానికి లాంచీలో తీసుకెళతారు. ఉదయం సాగర్‌ నుంచి 10 గంటలకు బయలుదేరి శ్రీశైలానికి సాయంత్రం 4 గంటలకు చేరుకుంటుంది. తిరిగి మరుసటి రోజుఉదయం శ్రీశైల మల్లికార్జునుడి దర్శనం అనంతరం అక్కడి నుంచి 10 గంటలకు బయల్దేరి సాయంత్రం 4 గంటలకు సాగర్‌కు చేరుకుంటుంది. భోజనం, వసతి, మల్లన్న దర్శనం మొత్తం పర్యటక శాఖవారే ఏర్పాటుచేస్తారు. రుసుము పెద్దలకు ఒక్కొక్కరికీ రూ.3,800. పిల్లలకు రూ. 3,000. 

  * సాగర్‌ - శ్రీశైలం ఈ ప్యాకేజీ సాగర్‌ నుంచి కాబట్టి పెద్దలకు రూ. 3,000, పిల్లలకు రూ. 2500. 

* ఏదో ఒక వైపు ప్రయాణానికయితే... సాగర్‌ నుంచి శ్రీశైలం లేదా శ్రీశైలం నుంచి సాగర్‌ ఏదో ఒక్కవైపు ప్రయాణానికి పెద్దలకు రూ. 1500, పిల్లలకు రూ.1200.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.