close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ఈ తిప్పలన్నీ అందం కోసమే!

ఈ తిప్పలన్నీ అందం కోసమే!

జలగలు కుడితే అందం... పాములు పాకితే ఉత్తేజం... బీర్‌లో మునిగితే సొగసు... రక్తం పూసుకుంటే మెరుపు... మంట పెడితే సౌందర్యం... గడ్డకట్టుకుపోయే మంచులో కూర్చుంటే ఆనందం... నిజమండీ బాబూ ఇవన్నీ ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన సౌందర్య చికిత్సలు.

ఒకప్పుడు సినిమా తారలూ మోడల్సే అందం కోసం స్పాలకు వెళ్లడం సౌందర్య చికిత్సలు తీసుకోవడం చేసేవారు. కానీ కొంతకాలం నుంచీ అందంగా ఉండడం, అలా ఉండేందుకు ప్రయత్నించడం సామాన్యులకూ సాధారణమైన విషయం అయిపోయింది. అందుకే, బ్యూటీ పార్లర్లూ స్పాలూ పెరగడంతో పాటు వాటిలో ఎన్నో రకాల సౌందర్య చికిత్సలూ అందుబాటులోకి వచ్చాయి. అయితే, అవి ఈమధ్య ఎంత వింతగా తయారయ్యాయంటే... అసలు ఇలాంటి సౌందర్య చికిత్సలు కూడా ఉంటాయా... అని మనం అవాక్కయ్యేంతగా.

పక్షి రెట్టలూ అందానికే!

పక్షులు ఎక్కడైనా రెట్టలు వేస్తేనే చూసి చిరాకుపడతాం... కానీ జపాన్‌లో నైటింగేల్‌ పక్షి వేసే రెట్టలు ఎండాక తీసి ఆ పొడిని బియ్యం నీటిలో కలిపి ముఖానికి పూసుకోవడం 17వ శతాబ్దం నుంచీ ఉంది. స్థానికంగా నృత్యకళాకారులైన గెయిషా మహిళలు రోజూ మేకప్‌ వేసుకోవడం వల్ల వచ్చే చర్మ సమస్యల్ని దూరం చేసుకునేందుకు ఈరకం ఫేషియల్‌ని వేసుకుంటారట. అదికాస్తా కొన్నేళ్ల నుంచీ ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది. బ్రిటన్‌, అమెరికాల్లోని పెద్ద పెద్ద బ్యూటీ స్పాల్లో సైతం ఈ ఫేషియల్‌ను చేస్తున్నారు.

ఎంత వణికితే అంత ఆనందం

ఉష్ణోగ్రత 15 డిగ్రీలకు పడిపోతేనే ఆ చలికి మనం తట్టుకోలేం. అలాంటిది మైనస్‌ 130 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతలో మూడు నిమిషాలు ఉంటే ఎంతలా గడ్డకట్టిపోతామో చెప్పనక్కర్లేదు. అయితే క్రయోథెరపీలో భాగంగా అంత తక్కువ ఉష్ణోగ్రతలో అతిథుల్ని ఉంచుతున్నాయి కొన్ని స్పాలు. కాకపోతే చలికి తట్టుకునేలా అన్ని జాగ్రత్తలూ తీసుకుంటారు. ఇంత కష్టపడి అంత చలిలో ఉండడం ఎందుకంటే గడ్డకట్టే చలి వల్ల శరీరం ఆనందాన్ని కలిగించే సెరటోనిన్‌ అనే హార్మోన్‌ని విడుదల చేస్తుందట. సగం అందం సంతోషంలోనే దాగుంటుంది అంటారు కదా!

నత్తలతో నవ యవ్వనం

నత్తలు పాకేటపుడు ఒకరకమైన జిగట ద్రవాన్ని విడుదల చేస్తాయని తెలిసిందే. ఆ ద్రవంలో చర్మం పైన ముడుతలను తగ్గించి వృద్ధాప్యలక్షణాలు కనిపించకుండా చెయ్యగల ఔషధగుణాలున్నాయట. దాంతో జపాన్‌తో పాటు కొన్ని పాశ్చాత్య దేశాల్లోని స్పాలలో ఈమధ్య ప్రత్యేకంగా స్నెయిల్‌ ఫేషియల్స్‌ని చేస్తున్నారు. దీనికోసం ఆఫ్రికన్‌ నత్తల్ని సేకరించి వాటికి ప్రత్యేకమైన ఆహారం ఇచ్చి మరీ పెంచుతారట. వీటిని ముఖం మీద వదిలితే అవి పాకుతున్నపుడు శరీరానికి సేదతీరిన అనుభూతి కలగడంతో పాటు అవి విడుదల చేసే ద్రవం వల్ల మేను యవ్వనంగా మారుతుందట.

మంటల్లో ఏమి హాయిలే!

కూరగాయల్ని ఉడికించినట్లు కవా హాట్‌ బాత్‌ పేరుతో ఫిలిప్పీన్స్‌లోని టిబియావొ ప్రాంతంలో మనుషుల్ని నీటితో నింపిన పెద్ద పెద్ద పాత్రల్లో పడుకోబెట్టి కింద మంట పెడతారు. ఔషధ మూలికలు వేసిన ఆ నీరు వేడెక్కుతుంటే హాయైన అనుభూతి కలగడంతోపాటు మృతకణాలు తొలగుతాయట. ఇలాంటిదే చైనాలో పుట్టిన ఫైర్‌ థెరపీ. దీన్లో భాగంగా ముఖంమీదా ఇతరభాగాలపైనా ఔషధ క్రీముల్ని పూసి దానిపైన ఆల్కహాల్‌లో ముంచిన బట్టను వేసి నిప్పు పెడతారు. దీంతో చర్మం మీది ముడుతలు పోయి యవ్వనంగా కనిపిస్తారట. ఒళ్లునొప్పులూ జలుబూ ఉబ్బసం లాంటి వ్యాధులకూ ఇది మంచి చికిత్సట.

జర జరా పాకే విషంలా...

ఒంటిమీద కోరలు పీకిన పాములూ హాని చేయని కొండచిలువల్నీ పాకించి వాటితో మసాజ్‌ చేయిస్తున్నాయి కొన్ని స్పాలు. ఫిలిప్పీన్స్‌తో పాటు పాశ్చాత్య దేశాల్లోనూ ప్రాచుర్యం పొందిన ఈ మసాజ్‌ వల్ల ఒత్తిడి దూరమై శరీరం సాంత్వన పొందుతుందంటారు వైద్యులు.

ఒళ్లు జలదరించాల్సిందే!

మామూలుగా జలగల్ని చూస్తుంటేనే ఒళ్లు జలదరిస్తుంది. అలాంటిది వాటిని శరీరం మీద పాకించుకోవడం అవి రక్తాన్ని పీల్చుతుంటే కదలకుండా పడుకోవడం అంటే ఓసారి వూహించుకోండి. కానీ కొన్ని బ్యూటీ స్పాల్లో ఈ తరహా థెరపీ ఉంది. జలగలు చర్మం పై పొరల్లో ఉండే చెడు రక్తాన్ని పీల్చేస్తాయట. అందుకే, లీచ్‌ థెరపీలో భాగంగా పదుల సంఖ్యలో చిన్న చిన్న జలగల్ని ముఖం మీదా ఒంటిమీదా వేస్తారు.

రక్తం ఫేషియల్‌

వాంపైర్‌ ఫేషియల్‌... మన శరీరంలోని రక్తాన్ని తీసి ముఖానికి పుయ్యడమే ఈ ఫేషియల్‌ ప్రత్యేకత. దీనికోసం రక్తం నుంచి ప్లాస్మాను వేరు చేసి, దాన్ని ముఖంలో ముడుతలూ కమిలినట్లు ఉన్న భాగాల్లో అతి సన్నగా ఉండే సూదులతో ఇంజెక్ట్‌ చేస్తారు. దాంతో చర్మం నిగారింపును సంతరించుకుని యవ్వనంగా మారుతుందట. దీనివల్ల ముఖంలోని ముడుతలూ మచ్చలూ కూడా తగ్గుతాయట. ఇలాంటిదే ప్లాసెంటా చికిత్స కూడా. శిశు జననం సమయంలో ఉండే బొడ్డుతాడులోని స్టెమ్‌సెల్సూ, ఎంజైమ్‌లకు ఎలాంటి గాయాన్నైనా మాన్పించే అద్భుత గుణం ఉంటుందని తెలిసిందే. అందుకే, మహిళలూ గొర్రెల నుంచి సేకరించిన మూలకణాలతో ప్లాసెంటా ఫేషియల్‌ క్రీమ్‌ను తయారుచేస్తున్నారు. ఇది చర్మంలో కొలాజెన్‌ స్థాయుల్ని పెంచి ముడుతల్నీ మచ్చల్నీ పోగొట్టి యవ్వనంగా చేస్తుంది. వృద్ధాప్యలక్షణాలను నివారించే చికిత్సగా ఈ ఫేషియల్‌ ప్రాచుర్యం పొందింది.

బీరూ వైనూ కాఫీ టీ... అన్నీ స్నానానికే

ద్రాక్షలతో తయారయ్యే వైన్‌లో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి, దీన్లో వృద్ధాప్యలక్షణాలను దూరం చేసే గుణాలు కూడా అధికమే. అందుకే, జపాన్‌లోని యునెస్సాన్‌ స్పా అతిథులకోసం ఈతకొలనులో నీటికి బదులు వైన్‌ని నింపి ఉంచుతోంది. జర్మనీ, ఆస్ట్రియా, చెక్‌ రిపబ్లిక్‌... లాంటి దేశాల్లోని స్పాల్లో బీరు స్నానాలు సాధారణం. బీరులోని ఈస్ట్‌ బ్యాక్టీరియా, ఇతర లవణాలూ చర్మ సౌందర్యానికి మంచి పోషకాలుగా పనిచేసి, ఒత్తిడినీ దూరం చేస్తాయట. ఇలాంటివే బ్లాక్‌ కాఫీ, గ్రీన్‌ టీ బాత్‌ థెరపీలూ ఉన్నాయి. వీటితో స్నానం చేస్తే చర్మం బిగుతుగా అవడంతో పాటు, కొలాజన్‌ స్థాయులు పెరుగుతాయి. కాఫీ టీల్లో ఉండే కెఫీన్‌ వల్ల మేను యవ్వనంగా కూడా కనిపిస్తుంది.

ఇవేకాదు, తేనెటీగలతో కుట్టించుకునే సౌందర్య చికిత్సలూ పాములూ తేనెటీగల నుంచి తీసే విషంతో చేసే ఫేషియల్సూ... ఇలా చాలా రకాలే ఉన్నాయి.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.