close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ఆర్టోస్‌... ఇది గోదారోళ్ల కూల్‌డ్రింక్‌!

ఆర్టోస్‌... ఇది గోదారోళ్ల కూల్‌డ్రింక్‌!

గోదావరి జిల్లాలనగానే పూత రేకులు, చీరమీను, కాకినాడ కాజా... లాంటివే గుర్తొస్తాయి. కానీ చాలామందికి తెలియని విషయం ఏంటంటే దాదాపు వందేళ్ల కిందట అక్కడ పుట్టిన ఆర్టోస్‌ కూల్‌డ్రింక్‌కీ స్థానికులు అంతే ప్రాధాన్యాన్ని ఇస్తారు. భారత్‌లో పెప్సీ కోలాలు అడుగు పెట్టక ముందే గోదావరి ప్రజలకు కూల్‌డ్రింక్‌ని పరిచయం చేసిన ఘనత ఆర్టోస్‌దే. అందుకే, ఇన్నేళ్లైనా కోనసీమ కొబ్బరి బొండాంలా వారినే అంటిపెట్టుకుని ఉంది.

ప్రపంచంలో ఏ మూలకెళ్లినా మన నేల, మన వూరు అనే ప్రేమ పోదు. అలాగే ఎన్ని అంతర్జాతీయ ఉత్పత్తులు మార్కెట్లోకి వచ్చినా తమ ప్రాంతంలో మాత్రమే దొరికే ఆ కూల్‌డ్రింకు మీద తూర్పుగోదావరి వాసులకున్న అభిమానం తగ్గదు. అక్కడ కూల్‌డ్రింక్‌ అనగానే గుర్తొచ్చే మొదటి పేరు ఆర్టోస్‌దే మరి. బ్రిటిషర్ల కాలం నుంచీ ఇప్పటివరకూ స్థానికంగా హవా ఆ కంపెనీదే. బహుళజాతి కంపెనీల నుంచి వచ్చే పోటీని తట్టుకుని తమకున్న కొద్ది పరిధిలోనే ఏడాదికి రూ.25 కోట్ల టర్నోవర్‌ను సాధిస్తోన్న ఈ సంస్థ ప్రస్థానంలో మలుపులూ గెలుపులూ ఎన్నో.

  సరిగ్గా 98ఏళ్ల కిందట... ఆంగ్లేయులు మన నేలను పాలిస్తున్న కాలంలో... తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురానికి చెందిన అడ్డూరి రామచంద్రరాజు కాంట్రాక్టరుగా పనిచేస్తుండేవారు. ఓసారి పనిమీద జిల్లా కలెక్టర్‌ కార్యాలయానికి వెళ్లిన ఆయనకు బ్రిటిష్‌ అధికారి వాడి వదిలేసిన ఓ యంత్రం కనిపించింది. చూడ్డానికి వింతగా ఉన్న దాన్ని కొని ఇంటికి తీసుకెళ్లారాయన. కానీ అదేంటో ఎలా పనిచేస్తుందో తెలీలేదు. దాంతో ఆ యంత్రాన్ని విశాఖపట్నం పోర్టుకు వచ్చే ఓ అధికారి దగ్గరకు తీసుకెళ్లి ఆరా తీశారు. ఇంగ్లాండ్‌లో ఎక్కువమంది తాగే సోడాను ఉత్పత్తి చేసేందుకు ఆ యంత్రాన్ని వాడతారని చెప్పాడు ఆయన. అంతే, ఆ సోడాను ఇక్కడా తయారు చేసి అమ్మాలనే ఆలోచన వచ్చింది రామచంద్రరాజుకి. వెంటనే విదేశాల నుంచి సీసాలు దిగుమతి చేసుకుని సోడా తయారు చేసి అమ్మడం మొదలు పెట్టారు. కానీ సీసాలోకి నీళ్లూ గ్యాసూ నింపి ఇవ్వడమూ దాని మూత తియ్యగానే అదొకరకమైన శబ్దం రావడమూ చూసి జనం తాగాలంటే భయపడిపోయేవారు. అయినా రామచంద్రరాజు నిరుత్సాహపడలేదు. వూరూరా తిరిగి వాటిని అమ్మడానికి ప్రయత్నించేవారు. ఆ సమయంలోనే మొదటి ప్రపంచ యుద్ధం ప్రారంభమైంది. యుద్ధం కోసం బయల్దేరిన సైనికులు ఓరోజు రామచంద్రపురంలో బస చేశారు. వాళ్లు సోడాను అడిగి మరీ తెప్పించుకుని తాగడం చూసిన స్థానికులు నెమ్మదిగా ఆ రుచికి అలవాటు పడ్డారు. ఇదంతా 1914లో జరిగింది.

కూల్‌డ్రింక్‌ అలా వచ్చింది
కొంతకాలానికి రామచంద్రరాజు తమ్ముడు జగన్నాథరాజు పనిమీద మద్రాసు వెళ్లారు. అక్కడ బ్రిటిష్‌ వాళ్లు తయారుచేసి అమ్మే స్పెన్సర్స్‌ కూల్‌డ్రింకుని చూసిన ఆయన తాము కూడా అలాంటి పానీయాన్ని తయారుచెయ్యాలనుకున్నారు. తయారీవిధానం కోసం గ్రంథాలయాల్లో జర్నల్స్‌ తిరగేస్తే ఇంగ్లాండ్‌లోని ఓ సాఫ్ట్‌డ్రింక్‌ సంస్థ చిరునామా కనిపించింది. వారికి తాము భారత్‌లో శీతల పానీయాలు తయారు చెయ్యాలనుకుంటున్నామనీ సహకారం అందించమనీ ఓ ఉత్తరం రాశారు జగన్నాథరాజు. వాళ్లు ఓ ఒప్పందం చేసుకుని కూల్‌డ్రింకు సీసాలతోపాటు ఇతర ముడి సరకుని పంపించారు. అలా 1919లో రామచంద్రపురంలో స్వదేశీ కూల్‌డ్రింక్‌ తయారీ మొదలైంది. అప్పటికి దేశవ్యాప్తంగా ఉన్న కూల్‌ డ్రింక్‌ సంస్థలు అయిదే అయిదు. వాటిలో కొన్ని బ్రిటిషర్లు నడిపేవే.

అప్పట్లో ఆర్టోస్‌తో పాటు మిగిలిన కూల్‌డ్రింక్‌ సంస్థలకూ ముడిసరకు విదేశాల నుంచే వచ్చేది. అయితే రెండో ప్రపంచయుద్ధం సమయంలో సరకు రావడం పూర్తిగా ఆగిపోయింది. దాంతో సాఫ్ట్‌డ్రింకులు తయారు చేసే ఇతర సంస్థలు కొన్ని మూతపడ్డాయి. రామచంద్రరాజు, జగన్నాథరాజులు మాత్రం సంస్థను మూసెయ్యకుండా స్థానిక అడవుల్లోకి వెళ్లి నారింజలు తెచ్చి వాటికి నిమ్మరసాన్ని కలిపి గ్యాస్‌ లేకుండా కూల్‌డ్రింకుల్ని తయారుచేసి అమ్మడం మొదలుపెట్టారు. అది చూసి ఆంగ్లేయులు నడిపే స్పెన్సర్స్‌ కంపెనీ కూడా రాజు సోదరులను కూల్‌డ్రింకులు తయారుచేసిపెట్టమని కోరడం విశేషం.

వారి ప్రేమే నడిపిస్తోంది
భారత్‌కి స్వాతంత్యం వచ్చాక దేశంలోకి అంతర్జాతీయ కంపెనీల కూల్‌డ్రింకులు అడుగుపెట్టాయి. ఆ పోటీలో ఎన్నో ఒడుదొడుకులు. అయినా తడబడకుండా నిలబడింది ఆర్టోస్‌. మరో రెండేళ్లలో వందేళ్లు పూర్తి చేసుకోబోతున్న ఈ సంస్థకు జగన్నాథరాజు మనవడు అడ్డూరి జగన్నాథవర్మ మేనేజింగ్‌ పార్ట్‌నర్‌. ‘మా కూల్‌డ్రింక్‌ని ఇన్నేళ్లుగా ఇక్కడి ప్రజలు ఆదరిస్తున్నారంటే అందుక్కారణం స్థానికంగా దొరికే పండ్లూ ఇతర పదార్థాలతో వచ్చే ప్రత్యేకమైన రుచీ వాసనే. ఎక్కడ స్థిరపడినా ఇక్కడికొచ్చినపుడు ఆ వాసన చూస్తే చాలు, చిన్ననాటి రోజులు గుర్తొస్తాయంటారు చాలామంది. వారి ప్రేమ, స్వదేశీ బ్రాండ్‌ అన్న నమ్మకమే మమ్మల్ని నడిపిస్తున్నాయి. 2001 నుంచి విజయవాడ, తాడేపల్లిగూడెం, భీమవరంలోనూ అమ్మకాలను ప్రారంభించాం. మేం ముగ్గురు అన్నదమ్ములం. వీరభద్రరాజు, పద్మనాభవర్మ, నేను. త్వరలోనే ఆర్టోస్‌ బాధ్యతల్ని మా పిల్లలకి అప్పగించి రాష్ట్రవ్యాప్తంగా విస్తరించాలనుకుంటున్నాం’ అంటారు జగన్నాథవర్మ.
ఇదీ వందేళ్ల ఆర్టోస్‌ కథ.

- నాదెళ్ల తిరుపతయ్య, ఈనాడు, కాకినాడ
- పి.రాజేష్‌, ఈనాడు జర్నలిజం స్కూలు
ఫొటోలు: పల్లా వాసు

 

జనం కదిలారు... వూరు గెలిచింది!

ఒకప్పుడు ఆ వూరు మారుమూల పల్లె అన్న పదానికి అచ్చమైన ఉదాహరణ. మావోయిస్టుల ప్రాబల్యంతో అట్టుడికిన వూళ్లలో అదీ ఒకటి. ఆ వూరికి వెళ్లాలంటేనే అధికారులు ఆలోచించాల్సి వచ్చేది. కానీ ఇప్పుడదే వూరు ఆదర్శగ్రామంగా కొత్తరూపు తెచ్చుకొంది, విదేశీ ప్రతినిధుల్నీ తన వైపు వరుసలు కట్టిస్తోంది. ఆ మార్పు వెనక ఉన్నది అచ్చంగా ప్రజాచైతన్యమే. స్వచ్ఛభారత్‌ స్ఫూర్తిని ఆకళింపు చేసుకుని ఆ దిశలో వందో ఆదివారాన్ని పూర్తిచేసుకున్న ఆ వూరే మెదక్‌ జిల్లాలోని మల్కాపూర్‌!

లసికట్టుగా పనిచేస్తే ఎంతటి పనైనా సులువుగా అయిపోతుంది అన్నమాటలకు ప్రత్యక్షనిదర్శనంగా నిలుస్తుంది మెదక్‌ జిల్లా తూప్రాన్‌ మండలంలోని మల్కాపూర్‌ గ్రామం. మౌలిక సదుపాయాల లేమి, అపరిశుభ్రత, నీటిఎద్దడితో వెనుకబడిన పల్లెల్లో ఒకటిగా ఉండే ఈ వూరిని ప్రభుత్వాధికారుల ప్రోత్సాహం, గ్రామస్థుల అంకితభావం సుందరంగా తీర్చిదిద్దాయి. ఇప్పుడక్కడ చెత్తకాగితం కనిపించదు, బహిరంగ మలవిసర్జన అనే మాటే వినిపించదు, నీటి కొరత అన్న వూసేరాదు. అక్కడ వూరి బాగుసేత ఓ ఉద్యమంలా సాగుతోంది. అందుకే డిసెంబరు 6, 2015న ప్రారంభించిన స్వచ్ఛమల్కాపూర్‌ కార్యక్రమం వందవారాలు పూర్తిచేసుకుంది. చిన్నాపెద్దా వూరూవాడా తప్పక తెలుసుకోవలసిన విజయగాథ ఆ గ్రామానిది.

తొలి అడుగు...
ఏళ్లతరబడి అభివృద్ధికి దూరంగా ఉన్న మల్కాపూర్‌ గురించి తెలుసుకున్న అప్పటి జిల్లా కలెక్టరు రొనాల్డ్‌ రాస్‌ ‘గ్రామజ్యోతి’లో భాగంగా 2015లో ఈ వూరిని దత్తత తీసుకున్నారు. ప్రజల భాగస్వామ్యంతో సమస్యల్ని పరిష్కరించొచ్చు అనుకున్న ఆయన గ్రామంలోని యువతనూ మహిళా సంఘాలనూ భాగస్వాములుగా చేస్తూ నీరు-పారిశుద్ధ్యం, ఆరోగ్యం-పౌష్టికాహారం, విద్య, పేదరిక నిర్మూలన తదితర ఏడు గ్రామ కమిటీలు ఏర్పాటు చేశారు. ‘మీరు వూరికోసం పనిచేయండి మీ వెనక నేనుంటాను’ అన్న భరోసా కల్పించారు. మొదటి లక్ష్యం గ్రామాన్ని బహిరంగ మల విసర్జన రహితంగా చేయాలని వూరందరికీ మరుగుదొడ్ల ఆవశ్యకతను తెలియజేసి అందరూ వాటిని నిర్మించుకునేలా చేసింది పారిశుద్ధ్య కమిటీ. అయినా వాటిని వాడటం లేదని తెల్లవారుజామున ఐదుగంటలకు విజిల్‌వేస్తూ గస్తీ తిరిగే వారు బృంద సభ్యులు. బహిరంగ మల విసర్జన చేస్తే జరిమానాలు విధిస్తామని హెచ్చరించారు. దీంతో వందశాతం బహిరంగ మలవిసర్జన రహిత గ్రామంగా మారింది మల్కాపూర్‌. నీటిఎద్దడిని అధిగమించేందుకు ఇంటింటికీ ఇంకుడుగుంత ఏర్పాటు చేయాలని మరో లక్ష్యం పెట్టుకున్నారు. ఇంకుడుగుంతల నిర్మాణంలో ఆదర్శంగా నిలిచిన ఇబ్రహీంపూర్‌ స్ఫూర్తితో ప్రతి ఇంటికీ ఇంకుడుగుంతలు నిర్మించుకున్నారు. ఇంట్లోవాడిన ప్రతి నీటి చుక్కా అందులోకే వెళ్లేలా ఏర్పాటు చేసుకోవడంతో ఎండిపోయిన బావుల్లో నీటివూట ప్రారంభమైంది. అభివృద్ధి పనులు మొదలుపెట్టిన తొమ్మిది నెలల్లోనే ఆ వూరికి తెలంగాణ ప్రభుత్వం ఆదర్శగ్రామంగా అవార్డునందించింది. అధికారుల ప్రోత్సాహంతో గ్రామాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తోన్న యువత ‘మేక్‌మల్కాపూర్‌’ అనే వాట్స్‌అప్‌ గ్రూపును ప్రారంభించింది.

స్వచ్ఛత దిశగా...
ప్రధాని పిలుపుతో రెండేళ్ల క్రితం ‘స్వచ్ఛ మల్కాపూర్‌’ కార్యక్రమాన్ని ప్రారంభించారు గ్రామస్థులు. అందులో భాగంగా ప్రతి ఆదివారం వూరిని శుభ్రం చేస్తారు. దీనికోసం గ్రామాన్ని ఆరు భాగాలుగా విభజించుకుని నాయకుల పేర్లు పెట్టుకున్నారు. ఏ ప్రాంతంలో స్వచ్ఛభారత్‌ నిర్వహించాల్సి ఉందో శనివారం సాయంత్రమే చర్చించుకొని ఆమేరకు ఆదివారం ఉదయం పనులు చేస్తారు. గ్రామస్థులు ‘స్వచ్ఛ మల్కాపూర్‌’కు శ్రీకారం చుట్టి ఈ ఆదివారానికి సరిగ్గా వంద వారాలు. ఇళ్లనుంచి వచ్చే తడి, పొడి చెత్తను రిక్షా ద్వారా వేర్వేరుగా సేకరించి డంప్‌యార్డుకు తరలించి ఎరువును తయారు చేసుకుంటున్నారు. హరితహారంలో భాగంగా రెండేళ్లకాలంలో లక్షాడెబ్భైవేల మొక్కలు నాటి, ఎండాకాలంలో బిందెలతో నీళ్లుపోసి బతికించుకున్నారు. రొనాల్డ్‌రాస్‌ ప్రోద్బలంతో ఓ పరిశ్రమ ఈ వూరికి 100 సౌరవిద్యుద్దీపాలను అందించింది. మిషన్‌భగీరథలో భాగంగా ఒక్కరోజులోనే అంతర్గత పైపులైను పనులు పూర్తిచేసి వందశాతం నీటి సరఫరా రికార్డును నెలకొల్పిందీ వూరు. వూళ్లొ ఉన్న 264 మంది నిరక్షరాస్యుల్ని గుర్తించి అందరికీ అక్షరాలు దిద్దించింది విద్యాకమిటీ. ప్రస్తుతం పేదరిక నిర్మూలన కమిటీ ఆధ్వర్యంలో సంక్షేమ పథకాలకు అర్హుల ఎంపిక, వ్యవసాయ కమిటీ ఆధ్వర్యంలో సేంద్రియ వ్యవసాయం పనులు చేపడుతున్నారు. మౌలిక సదుపాయాల్లో భాగంగా కమ్యూనిటీహాలు, పంచాయతీ భవనం, అంగన్‌వాడీ కేంద్రం తదితరాల నిర్మాణం జరుగుతోంది. గ్రామానికి ఓ వైపున రెండెకరాల్లో ఉన్న గుట్ట దగ్గర నగరాల తరహాలో రాక్‌గార్డెన్‌ను రూపొందిస్తోంది సహజవనరుల కమిటీ. చుట్టు పక్కల ఉన్న 20 గ్రామాలు మల్కాపూర్‌ బాటలో నడుస్తున్నాయి. ఇక్కడి అభివృద్ధిని చూసేందుకు దేశవ్యాప్తంగా ఉన్న 800 మంది సర్పంచులూ, కేంద్ర బృందాలు సహా వివిధ రాష్ట్రాల ప్రజాప్రతినిధులూ 13 దేశాల ప్రతినిధులూ వచ్చారు. మల్కాపూర్‌ విజయాన్ని చూడాలంటే మనమూ ఆవైపుకు కదలాల్సిందే... జయహో మల్కాపూర్‌ అనాల్సిందే!

- క్రాంతికుమార్‌ కొలిశెట్టి, ఈటీవీ, సంగారెడ్డి
చిత్రాలు: సందీప్‌ కుమార్‌, న్యూస్‌టుడే, తూప్రాన్‌

 

అతడు జీవితాన్నిస్తున్నాడు..!

ఫుట్‌పాత్‌లమీదా బస్టాపులూ రైల్వే స్టేషన్ల దగ్గరా మురికి పట్టేసిన బట్టలూ జడలు కట్టేసిన జుట్టుతోనూ ఒక్కోసారి చూడలేనంత తీవ్రంగా ఉన్న గాయాలతోనూ మతిస్థిమితం లేని ఎంతోమంది దీన స్థితిలో కనిపిస్తుంటారు. ఆ దార్లో వెళ్తూ అలాంటి వారిని చూసినపుడు అయ్యో అనుకోవడం అందరూ చేసే పనే. కానీ అతడు అలా వెళ్లిపోడు. వాళ్లను వెంట తీసుకెళ్లి, మామూలు మనుషుల్ని చేసి, సొంత గూటికి చేర్చేవరకూ వదిలిపెట్టడు కూడా.

దిహేనేళ్ల కిందట... కరీంనగర్‌ జిల్లా పెద్దపల్లి మండలానికి చెందిన ఒగ్గుకథ కళాకారుడు రాజమల్లు మతిస్థిమితం కోల్పోయి ఇల్లు వదిలి వెళ్లిపోయాడు. భార్యాపిల్లలు ఎంత వెతికినా దొరకలేదు. చివరకు పోలీసులకు ఫిర్యాదు చేయగా వాళ్లు ఓ గుర్తు తెలియని శవాన్ని చూపించారు. అది రాజమల్లు మృతదేహమే అని బంధువులు అంత్యక్రియలు నిర్వహించారు. మరోపక్క... ఇంటి నుంచి వెళ్లిపోయిన రాజమల్లు ఎక్కడెక్కడో తిరిగి చివరకు ఖమ్మం నగరానికి చేరుకున్నాడు. ఒంటిమీద కనీసం దుస్తులు కూడా లేకుండా వీధి కుక్కలతో కలసి ఉంటున్న అతడిని కొంతకాలం కిందట స్థానికంగా ఉండే అన్నం శ్రీనివాసరావు చూసి చలించిపోయాడు. దగ్గరికెళ్తే కాలికి గాయమై కుళ్లిపోయి ఉంది. వెంటనే అతణ్ని తనింటికి తీసుకెళ్లి, శుభ్రంగా స్నానం చేయించి మంచి బట్టలు తొడిగాడు. గాయానికి వైద్యం చేయించి, రోజూ మందులు వేసి సపర్యలు చేశాడు. తర్వాత పోలీసుల సాయంతో హైదరాబాద్‌లోని మానసిక చికిత్సాలయంలో చేర్పించాడు. అక్కడ చికిత్స మొదలైన కొద్దిరోజులకు తన పేరుతో పాటు కొన్ని వివరాలను చెప్పాడు రాజమల్లు. చనిపోయాడనుకున్న వ్యక్తి పదిహేనేళ్ల తర్వాత కనిపించడంతో రాజమల్లు భార్యా పిల్లల ఆనందం అంతా ఇంతా కాదు. అతడికి తన జీవితాన్నీ కుటుంబాన్నీ అతడి పిల్లలకు తండ్రినీ భార్యకు భర్తనూ తిరిగిచ్చిన ఘనత శ్రీనివాసరావుదే. రాజమల్లులాంటి వారు ఆయన జీవితంలో ఒకరూ ఇద్దరూ కాదు, అయిదు వందల మందికి పైనే కనిపిస్తారు.

ఇది అతడి దినచర్య
శ్రీనివాసరావు తల్లిదండ్రులది వ్యవసాయ కుటుంబం. దాంతో చిన్నతనంలో ఇల్లు గడవని పరిస్థితుల్లో అడవికి వెళ్లి కట్టెలు కొట్టి, అమ్మి కుటుంబానికి సాయపడేవాడు. పెద్దయ్యాకా చదువుకుంటూనే పరిశ్రమల్లో కూలిపనులకు వెళ్లేవాడు. తర్వాత బీఎస్‌ఎన్‌ఎల్‌లో ఉద్యోగం వచ్చింది. కానీ కష్టాల్లో పెరిగిన ఆయన తన గతాన్ని ఎప్పుడూ మర్చిపోలేదు. అందుకే, ఎవరు ఇబ్బందుల్లో ఉన్నా తనవంతు సాయం చెయ్యడానికి ముందుకొచ్చేవాడు. ముఖ్యంగా మతిస్థిమితం లేకుండా దీనావస్థలో ఉన్నవారిని చూస్తే ఆయన మనసు అసలు ఆగేది కాదు. ఖమ్మం నగరంలో అలాంటివారు ఎవరు కనిపించినా చేరదీయడం మొదలుపెట్టాడు. ఇంటికి తీసుకెళ్లి సపర్యలు చెయ్యడం, తర్వాత ఆసుపత్రుల్లో చేర్పించి నయమయ్యాక కుటుంబ సభ్యుల దగ్గరకు పంపించడం...ఇలాంటివి ఎన్నో ఏళ్ల నుంచీ శ్రీనివాసరావు దినచర్యలో భాగం అయిపోయాయి. ఆయన గురించి తెలిసి కొందరు మేము సైతం... అంటూ ఆయనతో కలసి పనిచేయడానికి ముందుకొచ్చారు. వారి సహకారంతోనే కొంతకాలం కిందట ‘అన్నం ఫౌండేషన్‌’ ఏర్పాటైంది. దీని ఆధ్వర్యంలో ఖమ్మం నగరానికి దగ్గర్లో ఉన్న ఏదులాపురంలో ఓ భవనాన్ని అద్దెకు తీసుకుని మతిస్థిమితం లేని వారికి ఆశ్రయం ఇస్తున్నారు. దాతల విరాళాలతో నడుస్తున్న ఈ ఆశ్రమంలో ప్రస్తుతం 75 మంది ఉన్నారు. ఆశ్రమం గురించి తెలిసినవారు కొందరు పాత దుస్తులూ శుభకార్యాల్లో మిగిలిన వంటకాలనూ పంపిస్తుంటారు. శ్రీనివాసరావు కూడా తన జీతంలో చాలా భాగాన్ని సేవలకే ఖర్చుపెడుతున్నారు. అందుకే, అయిదంకెల జీతం వస్తున్నా ఇప్పటికీ వారికి సొంత ఇల్లు లేదు. ‘ఇంట్లో మేం తక్కువ ధరకు వచ్చే బియ్యంతోనూ నూకలతోనే అన్నం వండుకుని తింటాం’ అంటారాయన.