close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
కోటీశ్వరుల దేశం... మొనాకో..!

కోటీశ్వరుల దేశం... మొనాకో..!

‘మొనాకో... వాటికన్‌ తరవాత ప్రపంచంలో రెండో అతి చిన్న దేశం. కానీ తలసరి ఆదాయంలో మాత్రం రెండోస్థానంలో ఉన్న సంపన్న ప్రదేశం. అందుకే ఆ బుల్లి దేశంలోని వింతల్నీ విశేషాల్నీ ప్రత్యక్షంగా చూసి రావాలన్న ఆసక్తితో మధ్యధరా సముద్రతీర అందాల్లో ఒకటైన మొనాకోనీ, ఫ్రెంచ్‌ రివియెరాలోని నగరాలనీ సందర్శించి వచ్చాం’ అంటున్నారు విజయవాడకు చెందిన మన్నం కృష్ణమూర్తి.

తంలో ఫ్రాన్స్‌కు వెళ్లినప్పుడు అందరిలానే మేం కూడా ఈఫిల్‌ టవర్‌, సీన్‌ నది, యూరో డిస్నీలను సందర్శించాం. అయితే అక్కడివాళ్లు ఫ్రెంచ్‌ రివియెరా ఎంతో బాగుంటుందని చెప్పారు. దాంతో ఈసారి వెళ్లినప్పుడు దాన్ని తప్పక చూడాలనుకుని ఆ భాగంలోని ప్రధాన నగరమైన నీస్‌కు బయలుదేరాం.

ఫ్రాన్స్‌కి ఆగ్నేయదిశలో ఉన్న మధ్యధరా కోస్తా ప్రాంతాన్నే ఫ్రెంచ్‌ రివియెరా అని పిలుస్తారు. ఈ ప్రాంతంలో చలికాలంలోనూ మంచు తక్కువ కావడంతో 18, 19, 20వ శతాబ్దం తొలినాళ్లలో బ్రిటన్‌రాజులూ రష్యన్‌ చక్రవర్తులూ ప్రముఖ చిత్రకారులూ రచయితలూ విడిది కేంద్రంగా వాడుకునేవారు. మొదట్లో ఆరోగ్య రిసార్టులకు పేరొందిన ఈ ప్రాంతం, క్రమంగా ఆటపాటలకూ విందువినోదాలకూ నిలయంగా ప్రాచుర్యం పొందింది. మొనాకో కూడా ఈ భూభాగంలోనే ఉండటంతో ఇది కూడా అద్భుత పర్యటక వినోద కేంద్రంగా రూపుదిద్దుకుంది.

నిటారైన కొండ!
మంచుకొండల్నీ, లోయల్నీ దాటి, సముద్రంమీదుగా ప్రయాణిస్తూ నీస్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో వాలిన విమానంలోంచి బయటకు వచ్చి, నగరంలోని లిబరేషన్‌ ప్రాంతంలోని విడిది కేంద్రానికి వెళ్లి, కాసేపు విశ్రాంతి తీసుకుని, సాయంత్రం నగరంలోని మెస్సినాకి బయలుదేరాం. లక్షలమంది ఏకకాలంలో సేదదీరే ప్రదేశం అది. దీన్ని ఆనుకుని మిర్రర్‌ డియో అనే ప్రాంతం ఉంటుంది. అది ఫౌంటెయిన్‌లకి ప్రత్యేకం. అవి నిరంతరం నీటిని వెదజల్లుతుంటాయి. కానీ ఆ ప్రాంతంలో ఎక్కడా కాస్త కూడా పాకుడు కనిపించలేదు. నీటిమట్టం కూడా ఓ సెంటీమీటరుకన్నా ఎక్కువ లేకపోవడంతో అవి అద్దంలా మెరుస్తున్నాయి. అక్కడి నుంచి మరోవైపు దిగువకు నడిస్తే నీస్‌ ఫ్లోరైడ్‌ బీచ్‌ వస్తుంది. రాత్రివేళల్లో రంగురంగుల కాంతిదీపాలు ఆహ్వానం పలుకుతుంటాయి. ఆ కాంతుల్లో అలల సాగరాన్ని చూస్తూ కూర్చుంటే గంటలు నిమిషాల్లా దొర్లిపోతాయి. బీచ్‌లో సంగీత నృత్య కార్యక్రమాలూ తినుబండారాలూ

షరా మామూలే. మర్నాడు నగరంలోని బోయెర్‌ అనే ప్రాంతం నుంచి బస్సులో ఈజ్‌ అనే చిన్న పల్లెకి వెళ్లాం. అక్కడ కొన్ని శతాబ్దాల క్రితం కట్టిన ఓ చర్చి ఉంది. దాని పక్కనే మొదటి ప్రపంచ యుద్ధంలో మరణించిన సిపాయిల సమాధులు కనిపిస్తాయి. నిటారైన కొండ ఆ వూరికి ప్రత్యేక ఆకర్షణ. దీన్ని ఎక్కడానికి సన్నని రాతి మెట్లదారి ఉంది. దారిలోని ప్రతి మలుపు దగ్గరా చిన్న చిన్న దుకాణాలు ఉంటాయి. వాటిని చూస్తుంటే ఓ మ్యూజియాన్ని చూసిన అనుభూతి కలిగింది. పైకి వెళితే రాళ్ల మధ్యలో రూపొందించిన అద్భుత వనం కనువిందు చేస్తూ ఆశ్చర్యం కలిగిస్తుంది. అక్కడి నుంచి చూస్తే ఒకవైపు చర్చిమీద గల గడియార స్తంభం, మరోవైపు పచ్చని చెట్లూ ఇంకోవైపు సముద్రం కనిపిస్తూ ఎంతో ఆహ్లాదంగా అనిపించింది. అక్కడ నుంచి తరవాత సుగంధద్రవ్యాలు అమ్మే వీధికి వెళ్లి సాయంత్రానికి నీస్‌ నగరానికి చేరుకున్నాం.

నీస్‌ నుంచి మొనాకోకి విమానాలు ఉండవు. ఎందుకంటే ఆ దేశ విస్తీర్ణం కేవలం 2.02 చదరపు కిలోమీటర్లే. అయితే హెలీకాప్టర్‌ సదుపాయం ఉంది. కానీ ధర ఎక్కువ. రైలూ పడవల్లోనూ వెళ్ళొచ్చు. కానీ మేం బస్‌ టికెట్‌ తీసుకుని అందులోనే వెళ్లాలనుకున్నాం. అదయితే 2 యూరోలు మాత్రమే. నీస్‌ ఓడరేవు పక్కగా ఉన్న మధ్యధరా సముద్ర తీరంలో దాదాపు గంటసేపు బస్సులో ప్రయాణించడం మరపురాని అనుభూతిని అందించింది.

కోటీశ్వరుల దేశంలో...
సంపన్నుల ఆటస్థలంగా పేరొందిన మొనాకోలో నివసించే ప్రతి ముగ్గురిలో ఒకరు కోటీశ్వరులే. ప్రపంచ బిలియనీర్లలో అత్యధికులు మొనాకో వాసులే. అలాగని అక్కడ చేపలు తప్ప ఇతరత్రా ప్రకృతి వనరులేవీ లేవు. వ్యవసాయం అసలే లేదు. సుగంధద్రవ్యాలు, సిగరెట్ల తయారీ మినహా మరే పరిశ్రమలూ పెద్దగా లేవు. వాటికన్‌ మాదిరిగానే ఇదీ దేశంగా గుర్తింపు పొందిన ఓ బుల్లి నగరం. పేదరికం లేని తొలి దేశం. మానవాభివృద్ధి సూచిక ఒకటి కన్నా ఎక్కువగా ఉన్న ఒకే ఒక్క దేశం మొనాకో. ప్రజలకు ఆదాయపు పన్ను లేదు. భూమి తక్కువ కావడంతో స్థిరాస్థి ధరలు ప్రపంచంలోకెల్లా ఎక్కువ. నేరాలసంఖ్య మాత్రం తక్కువ. ప్రజలకన్నా పోలీసుల సంఖ్యే ఎక్కువ.

జనాబా సుమారు 40 వేలకి మించదు. వారి సగటు జీవితకాలం 94 ఏళ్లకు పైబడే. స్థానిక మొనాకో వాసుల్ని మొనగాస్కెలనీ విదేశాల్లో పుట్టి అక్కడ నివసిస్తోన్న వాళ్లను మొనాకోయన్లనీ పిలుస్తారు. కానీ చిత్రంగా ఆ దేశంలో స్థానికులే మైనారిటీలు. జనాభాలో ఐదో వంతు మాత్రమే వాళ్లు ఉంటారు. బస్సు దిగి ముందుగా మొనాకో విల్‌ అనే ప్రాంతానికి వెళ్లాం. ఇది కొండమీద వెలసిన ఓ పల్లె. విల్‌ అంటే రాయి అని అర్థం. మధ్యయుగాన్ని ప్రతిబింబించే ఈ పల్లెలో పాతకాలంనాటి భవంతులూ ప్రపంచ యుద్ధంలో వాడిన ఫిరంగులూ మందుగుండ్లూ కనిపిస్తాయి. లాపోస్టే అనే తపాలా భవంతి, క్యాథెడ్రల్‌, సముద్రజీవుల ఆక్వేరియం, సముద్ర ఉత్పత్తుల మ్యూజియం ప్రధానంగా సందర్శించదగ్గ ప్రాంతాలు. మేం వాటిని చూసి, సెయింట్‌ మార్టిన్‌ ఉద్యానవనానికి బయలుదేరాం. అక్కడి చెట్ల మధ్య తిరుగుతుంటే అది మధ్యాహ్నం అన్న విషయమే తెలీలేదు. ఎండ లేకుండా ఎంతో చల్లగా ఉందక్కడ. తరవాత అక్కడే ఉన్న జార్డిన్‌ ఎక్సోటిన్‌ అనే మరో పార్కునీ చూశాం. అక్కడి నుంచి కొండమీద ఉన్న రాజభవనాన్ని చూడ్డానికి వెళ్లాం. అందులో మధ్యయుగం నాటి ఆనవాళ్లు స్పష్టంగా ఉన్నాయి. భవనం వెలుపల ప్రతిరోజూ మధ్యాహ్నం 11.55 గంటలకు సంగీతవాద్యాల మధ్యలో కరేబియన్ల పద్ధతిలో వందన కవాతు జరుగుతుంటుంది.

స్థానికులకు ప్రవేశం లేదు!
తరవాత మాంటికాలో అనే ప్రాంతానికి బయలుదేరాం. ఇది మొనాకో అధునాతన నగర విభాగం. ఇక్కడ విభిన్న ఆకారాల్లో నిర్మించిన కట్టడాలూ బహుళ అంతస్తుల భవనాలూ నీటి మార్గాలూ మరపడవలను చూసి తీరాల్సిందే. తరవాత 1863లో ఇక్కడ ప్రారంభించిన డె మాంటికాలో క్యాసినోకి వెళ్లాం. ఇప్పటికీ ప్రపంచ జూద గృహాల్లో ఇదే ప్రధానమైనది. జేమ్స్‌బాండ్‌ సిరీస్‌లో మూడింటిని ఈ క్యాసినోలో చిత్రీకరించారు. కానీ మొనాకో పౌరులకు ఇందులో ప్రవేశం నిషేధం. అది ఆ దేశానికి ఉద్యోగాల ద్వారా ఆదాయాన్ని సమకూర్చే కల్పతరువే తప్ప, వాళ్లు డబ్బులు పోగొట్టుకునే వేదిక కాకూడదన్న కారణంతోనే ఈ నిబంధన. ప్రజలపట్ల ఆ దేశ ప్రభుత్వానికి ఎంతటి నిబద్ధత ఉన్నదన్నది ఈ ఒక్కదాంతోనే తెలుస్తోంది. పర్యటకులకి మాత్రం ప్రవేశ రుసుము పది యూరోలు.

దీనికి పక్కనే ఉన్న కార్ల పార్కింగులో ప్రపంచంలోని ఖరీదైన కార్లన్నింటినీ ఏకకాలంలో చూడొచ్చు. ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఫార్ములా వన్‌ గ్రాండ్‌ ప్రిక్స్‌ కార్ల పోటీ ఏటా మాంటికాలో వీధుల్లో జరుగుతుంది. మూడు వేలమంది వీక్షకులు ఆసీనులై చూస్తుంటారు. అందుకోసం రహదారిని ఆనుకునే స్టేడియాలు నిర్మించారు. ఈ దేశ ఆర్థిక ప్రగతికి క్యాసినోలూ, ఫార్ములా వన్‌ పోటీలూ తద్వారా వచ్చే పర్యటకులూ... ఇవే ప్రధాన కారణాలు.

మూడువైపులా ఫ్రాన్స్‌ భూభాగం నాలుగో వైపు మధ్యధరా సముద్రంతో ఉన్న ఆ దేశంలో ఇప్పటికీ రాచరిక పాలనే కొనసాగుతోంది. 1297లో రిపబ్లిక్‌ ఆఫ్‌ జెనోవా నుంచి స్వేచ్ఛాస్వాతంత్య్రాలను పొందినప్పటి నుంచీ అక్కడ రాచరిక పాలనే కొనసాగుతుండటం విశేషం. మొనాకోని పాలించే గ్రిమాల్డీ వంశం ఐరోపా రాచరిక వ్యవస్థలోకెల్లా ప్రాచీనమైనది. 2002లో ఫ్రాన్స్‌- మొనాకోల మధ్య జరిగిన ఒప్పందం ప్రకారం- ఆ కుటుంబంలో వారసులు లేని పక్షంలో ఆ దేశం ఫ్రాన్స్‌ అధీనంలోకి వెళ్లిపోతుంది. ఇప్పటివరకూ ఆ దేశానికి అలాంటి పరిస్థితి ఏర్పడలేదు. కాబట్టి రాచరిక పాలన కొనసాగుతున్న స్వతంత్రదేశాల్లో అదీ ఒకటి. 1956లో ప్రిన్స్‌ రెయినీర్‌॥।, అమెరికాకి చెందిన గ్రేస్‌ కెల్లీ సినీనటిని వివాహం చేసుకున్నాడు. వారి రెండో సంతానమే ప్రస్తుత చక్రవర్తి, ఆల్బర్ట్‌॥.

జనసాంద్రత అక్కడ ఎక్కువ!
తరవాత లాకొండమిన్‌ ప్రాంతానికి వెళ్లాం. ప్రపంచంలోకెల్లా జన సాంద్రత ఎక్కువగా ఉండే ప్రాంతం ఇదే. ఇక్కడి జనావాసాలకు ఓ వైపు రోడ్డు ప్రయాణానికి అవసరమైన కార్లూ బైకులూ పార్కు చేసి ఉంటాయి. మరో వైపున సాగరయానానికి అనువైన మరపడవలు ఉంటాయి. అక్కడినుంచి పొంటేవిల్‌ ప్రాంతానికి వెళ్లాం. దాదాపు 35 ఏళ్ల క్రితం వచ్చిన సునామీ కారణంగా ఏర్పడిన మైదాన ప్రాంతం ఇది. నీస్‌ నుంచి వచ్చే హెలీకాప్టర్లు ఇక్కడే ల్యాండ్‌ అవుతాయి. ఇక్కడ గాజు కిటికీలు అమర్చిన మరపడవలు ఉంటాయి. అందులో కూర్చుని సముద్ర అడుగుభాగంలోని రంగురంగుల చేపల్ని చూసి రావడం వింత అనుభూతిని కలిగించింది.

మర్నాడు నీస్‌ విల్లీ రైల్వేస్టేషన్‌ నుంచి కేన్స్‌ నగరానికి వెళ్లాం. 1946 నుంచీ అంతర్జాతీయ చలనచిత్రోత్సవానికి పేరొందిన ఈ నగరంలోని స్క్వేర్‌ రెనాల్డో హన్‌ దగ్గర ఉన్న గ్రాండ్‌ ఆడిటోరియాన్నీ క్రొయ్‌సెటీ క్యాసినోలనూ చూశాం. తరవాత వాటర్‌ ఫ్రంట్‌ బీచ్‌ రోడ్డు మీదుగా ప్లానారియా హార్బర్‌ను చూసి, మరపడవలో మధ్యదరా సముద్రంలో గంటసేపు ప్రయాణించి సెయింట్‌ మార్గురియట్‌ ద్వీపానికి వెళ్లి ఫ్రెంచి రివీరా అందాలను ఆసాంతం ఆస్వాదించాం. సాయంత్రం రైల్లో నీస్‌కు తిరిగి వస్తూ ఆంటీబ్‌ తీరంలో ఆగాం. అక్కడ నౌకాశ్రయం, పాత రాజప్రాకారం చూడదగ్గ ప్రదేశాలు. తీరం బారునా ఓ ఎత్తైన గోడ కట్టి ఉంటుంది దానికి రెండువైపులా ప్లాట్‌ఫామ్‌ కూడా కట్టి ఉంటుంది. ఈ తీరంలో సముద్ర అలల ఎత్తు తక్కువ. నీరు ఎంతో తేటగా ఉంటుంది. అందుకే మేం అక్కడ స్నానం చేసి నీస్‌కు చేరుకున్నాం. మర్నాడు నగరంలో కాసేపు షాపింగ్‌ చేసుకుని మధ్యధరా సముద్ర అందాలను గుర్తు చేసుకుంటూ భారత్‌కు తిరుగు ప్రయాణమయ్యాం.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.