close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
గడ్డం పెరిగింది గ్లామర్‌ అదిరింది

గడ్డం పెరిగింది గ్లామర్‌ అదిరింది

‘అరె, భాయ్‌ ఆ గడ్డమేందిరా...’ అన్న పలకరింపు స్థానంలో...‘నీ గడ్డం స్టైల్‌ అదిరిందిరా... ఏం చేయించావ్‌... ట్రిమ్మింగా... లేజర్‌ కట్టా... సెలూన్‌ పేరేంటి... అడ్రసెక్కడ...’ వంటి సంభాషణలు నేటి యువత మధ్య చాలా కామన్‌ అయిపోయాయి. వాళ్లనే కాదు, మగమహారాజులంతా గడ్డాలమీద మనసు పారేసుకుంటున్నారు. ఒకప్పుడు గడ్డం పెంచితే వయసు పైబడినట్లు కనిపిస్తామని అనుకునేవారట. దాంతో నీట్‌ షేవ్‌తోనే అందంగా చురుగ్గా కుర్రాళ్లలా ఉన్నామనుకునేవారు. కానీ గడ్డం వయసుని కనిపించనీయదనే పరిశోధనలు వెల్లువెత్తడంతో నలభై దాటిన అంకుల్సూ అరవైలు దాటిన తాతయ్యలు సైతం గడ్డాలు పెంచడంలోనూ వాటిని అందంగా కత్తిరించడంలోనూ కుర్రాళ్ళతో పోటీపడి లైను కడుతున్నారు.

అందమంతా అందులోనే ఉన్నదీ..!
నిజానికి గడ్డం, మీసం అనేవి పురుషులకు జన్మతః సిద్ధించిన అందాలు. పక్షుల్లో జంతువుల్లో ఆడవాటిని ఆకర్షించేందుకు రంగుల రెక్కలూ ఈకలూ కిరీటాలూ జూలూ ఉన్నట్లే మగవాళ్లలో గడ్డం, మీసాలనేవి ఆడవాళ్లని ఆకర్షించే శృంగార సాధనాలు. ఇంకా చెప్పాలంటే అబ్బాయికి వయసొచ్చిందనో పెళ్లీడొచ్చిందనే తెలియజేసే చిహ్నాలవి. నూటికి 97 శాతం మహిళలు గడ్డం ఉన్న మగవాళ్ల పట్లే ఆకర్షితులవుతారనీ, అందులోనూ పదిరోజుల్లో పెరిగే గడ్డంలో మగవాళ్లు మరెంతో మ్యాన్లీగా సెక్సీగా కనిపిస్తారనేది యూనివర్సిటీ ఆఫ్‌ న్యూసౌత్‌వేల్స్‌కు చెందిన ఓ పరిశీలన. మొత్తమ్మీద ప్రేమించాలన్నా ప్రేమించబడాలన్నా గడ్డం రావాల్సిందే, పెంచాల్సిందే అనేది సశాస్త్రీయమైన విషయం. అయితే గడ్డం అడ్డమనో గుచ్చుకుంటుందనో ట్రిమ్‌ చేయడం కష్టమనో లేదా రకరకాల భయాలతోనో దాన్ని తీసేయడం పూర్వ కాలంలోనే మొదలైంది. గడ్డాన్ని ప్రమాదకరంగా భావించే అలెగ్జాండర్‌, తన సైన్యంలో ఎవరూ గడ్డం పెంచుకోకూడన్న నిబంధన పెట్టాడట. అలాగే 17వ శతాబ్దంలో రష్యాలో గడ్డాన్ని పనికిమాలిన బరువుగా భావించి, దాన్ని పెంచుకునేవాళ్లు ఏడాదికి 100 రూబుల్స్‌ పన్ను విధించాలనే నిబంధన ఉండేదట. ఇలా చెప్పుకుంటూ పోతే చరిత్రలో గడ్డాన్ని గురించి బోలెడు సంగతులు.

వర్తమానానికి వస్తే- మగవాళ్లలో ఆరోగ్య స్పృహ పెంచేందుకు ‘నో షేవ్‌ నవంబరు’ పేరుతో ఆ నెలంతా గడ్డాలూ మీసాలు పెంచడం అనేది ఆమధ్య ఆస్ట్రేలియాలో ఓ ఉద్యమంలా మొదలైంది. దాన్ని ప్రస్తుతం ప్రపంచదేశాలన్నీ అనుసరిస్తున్నాయి. మనకి మాత్రం నవంబరు మాత్రమే గడ్డాల మాసం కాదు, ఇప్పుడు మొత్తంగా గడ్డాల కాలం నడుస్తోందని చెప్పాలి. ఫ్యాషనేదయినా వాటిని వ్యాప్తిలోకి తెచ్చేది నటులే. దానికి బాలీవుడ్‌, టాలీవుడ్‌ అన్న తేడా లేదు. వెండితెరా బుల్లితెరా అన్న భేదం లేదు. పాత్రను బట్టి కాకుండా రకరకాల గడ్డాల లుక్స్‌తోనే అభిమానుల్ని అలరిస్తున్నారు. దాంతో పురుష సమాజానికి అమాంతం గడ్డంమీద ప్రేమ పెరిగిపోయింది.

ఎన్ని రకాలో..!
గడ్డం అనగానే ఎక్కువగా సాధువులూ గురువులూ పెంచుకునే పొడవాటి గుబురుగడ్డాలూ లేదా దేవదాసులూ రోమియోలూ పెంచుకునే ఓ మాదిరి గుబురుగడ్డాలే గుర్తుకొస్తాయి. కానీ గడ్డాన్ని రకరకాలుగా పెంచుతుంటారు. హిట్లర్‌ మీసం మాదిరిగానే పెదవి కిందిభాగంలో చిన్నగా ఉండే సోల్‌ ప్యాచ్‌; మీసంతో కలవకుండా చుబుకం దగ్గర మాత్రమే ఉండి, దాన్నుంచి కింది పెదవికి చిన్న ప్యాచులా అతుక్కుని ఉండే వాన్‌ హైక్‌; దాదాపు ఇదే పద్ధతిలోనే ఉండి చుబుకం దగ్గర మాత్రం కాస్త పొడవుగా ఉండే బాల్బొ, చుబుకం నుంచి కణతల పైవరకూ సన్నని ప్యాచ్‌లా కత్తిరించిన పెన్సిల్‌ షార్ట్‌; దీన్నే కాస్త వెడల్పుగా కత్తిరించే చిన్‌ స్ట్రిప్‌, చిన్‌ కర్టెయిన్‌లూ; ఎక్కడా ఖాళీ లేకుండా గడ్డాన్ని పెంచి, చుబుకం దగ్గర మాత్రం వి ఆకారంలో గుబురుగా కత్తిరించిన డక్‌ టెయిల్‌, చుబుకం దగ్గర నున్నగా ఉంచి, మీసాల నుంచి చెంపలమీదకి ఒక పద్ధతిలో కత్తిరించే మటన్‌ చాప్స్‌, మీసాల నుంచి చుబుకం వరకూ అంటే నోటి చుట్టూ గుండ్రంగా పెంచుకునే ఫ్రెంచ్‌ గడ్డం, కింది పెదవికి రెండు వైపులా ఖాళీలుంచి చుబుకం దగ్గర పెంచే గోటీ... ఇలా గడ్డాల్లో లక్ష రకాలు.

చెంపల దగ్గర నుంచీ ఉన్న గడ్డాన్ని ఓ పద్ధతిలో ట్రిమ్‌ చేస్తూ మీసాలనూ గడ్డాన్ని కలిపినట్లుగా ఉండే ఎక్స్‌టెండెడ్‌ గోటీ, మీసమే లేని ప్యూర్‌ గోటీ, మీసంతో పాటు ఉండే ఫుల్‌ గోటీ, యాంకర్‌ గోటీ... ఇలా చిన్న చిన్న తేడాలతో గోటీ రకంలోనే మళ్లీ బోలెడు. అలాగే చెక్కినట్లుగా కత్తిరించే లైన్‌ కట్‌ వెరైటీలకు లెక్కే లేదు. ఇవేనా... మొహంమీద వచ్చే వెంట్రుకల్ని ఓ ఆకారం లేకుండా దానంతట దాన్ని రెండు రోజులపాటు పెంచే షార్ట్‌ స్టబుల్‌, సుమారు ఐదు మి.మీ. వరకూ పెంచిన మీడియం స్టబుల్‌, ఆరు నుంచి పది మి.మీ. వరకూ పెంచి, ట్రిమ్‌ చేసే లాంగ్‌ స్టబుల్‌ గడ్డాలు ఎవర్‌గ్రీన్‌ యూత్‌ ఫ్యాషన్‌.

కొందరికి గడ్డం సరిగ్గా పెరగదు. పెరిగినా ఓ పద్ధతి ప్రకారం ఉండకపోవచ్చు. అలాంటి సందర్భాల్లో హెయిర్‌ ట్రాన్స్‌ప్లాంటేషన్‌, ప్లేట్‌లెట్‌ రిచ్‌ ప్లాస్మా, లేజర్‌ చికిత్సల ద్వారా రకరకాల ఆకారాల్లో గడ్డాల్ని మొలిపిస్తున్నారు కాస్మొటిక్‌ సర్జన్లు. పైగా గడ్డం ఆరోగ్యంగా పెరగాలంటే ప్రొటీన్లూ ఒమెగా ఫ్యాటీ ఆమ్లాలు పుష్కలంగా ఉండే చేపలు, గుడ్లూ, డ్రైనట్లూ ఫ్రూట్సూ... వంటి పోషకాహారం తినాలి. యూకలిప్టస్‌ నూనె పట్టించాలి.. తరచూ షాంపూ చేయాలి. కండిషనర్లూ పెట్టాలి. క్రమబద్ధంగా ట్రిమ్‌ చేయాలి... అంటూ తగు సూచనలూ అందిస్తున్నారు. కారణమేదయినా గడ్డం ఉన్నట్టుండి ఫ్యాషనయిపోయింది. మొన్నటివరకూ నున్నగా షేవ్‌ చేసుకుని, చాకొలెట్‌ బాయ్స్‌లా కనిపించడమే అందం అనుకున్న అబ్బాయిలంతా, కాస్త రఫ్‌లుక్‌తో మ్యాన్లీగా కనిపించేందుకు శతథా ప్రయత్నిస్తున్నారు. రకరకాల గడ్డం కట్స్‌తో తెగ స్టైల్‌ కొట్టేస్తున్నారు.

గడ్డంతో కొన్ని... 

ప్రతిరోజూ గడ్డం గీసుకునేవాళ్లకి తమ జీవితకాలంలో 3,350 గంటలు దానికే సరిపోతాయట.
* ‘మీరు గడ్డం పెంచుకుంటే చాలా బాగుంటారు’ అని పదకొండేళ్ల గ్రేస్‌ బెడెల్‌ అనే చిన్నారి రాసిన లేఖ కారణంగానే అబ్రహం లింకన్‌ గడ్డాన్ని పెంచడం ప్రారంభించాడట.

* గడ్డం రాత్రివేళల్లోకన్నా పగలే వేగంగా పెరుగుతుందట. ఓ మనిషి జీవిత కాలంలో గడ్డం గీయకపోతే అది కనీసం 27.5 అడుగుల పొడవు పెరుగుతుందనేది ఓ లెక్క.

* ఇప్పటివరకూ అత్యంత పొడవైన గడ్డం నార్వేకి చెందిన హన్స్‌ లాంగ్‌సేత్‌దే. 1927లో ఆయన మరణించేనాటికి దాని పొడవు 5.33 మీటర్లు. అంటే 17 అడుగుల ఆరు అంగుళాలు. ప్రస్తుత రికార్డు మాత్రం కెనడాకి చెందిన సర్వన్‌సింగ్‌ సొంతం చేసుకున్నాడు. అతని గడ్డం పొడవు ఎనిమిది అడుగుల రెండున్నర అంగుళాలు.

* గడ్డాన్ని చూసి భయపడితే పొగనఫోబియాతో బాధపడుతున్నారన్నమాటే. అదే గడ్డాన్ని ప్రేమించే లక్షణాన్ని పొగనఫైల్‌ అంటారు.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.