close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
పసిమనసులు

పసిమనసులు
- అప్పరాజు నాగజ్యోతి 

‘‘మమ్మీ, అత్తావాళ్ళు వచ్చారు’’ అంటూ హర్ష పరిగెత్తుకుంటూ బెడ్‌రూమ్‌లోకి వచ్చి చెప్పడంతో, పనులన్నీ ముగించుకుని అప్పుడే నడుం వాల్చబోయినదాన్నల్లా హాల్లోకి నడిచాను.

‘‘వదినా, కింద కార్లో మావారు వెయిట్‌ చేస్తున్నారు. మేమిద్దరం ఆయన కొలీగ్‌ గృహప్రవేశానికి వెళ్తున్నాం. రెండు గంటల్లో వచ్చేస్తాం. అందాకా మా నిఖిల్‌తో కాస్త ఫిజిక్స్‌ చదివించవా... ప్లీజ్‌! మొన్నటి పరీక్షల్లో ఆ ఒక్క సబ్జెక్టులోనే వాడికి మార్కులు తక్కువొచ్చాయి’’ హడావుడిగా చెప్పేసి వెళ్ళిపోయింది మా ఆడపడుచు శైలజ.

‘‘భోంచేశావా నిఖిల్‌?’’ అడిగాను.

‘‘చేశానత్తా’’ అన్నాడు.

నిఖిల్‌ని తన రూమ్‌కి తీసుకుని వెళ్ళాడు హర్ష. ఇక నిద్ర తేలిపోవడంతో అక్కడే హాల్లోనే కూర్చుని న్యూస్‌పేపర్‌ని తిరగేస్తున్నాను. పిల్లలిద్దరి సంభాషణా నా చెవుల పడుతోంది.

‘‘ఏరా నిఖిల్‌, సైన్సులో జెమ్‌వి... నీకు తక్కువ మార్కులు రావడమేమిటిరా? అసలెన్ని మార్కులు వచ్చాయిరా ఫిజిక్స్‌లో?’’

‘‘తొంభై మార్కులు వచ్చాయి హర్షా. పేపర్‌ ఈసారి కొంచెం టఫ్‌గా వచ్చింది కదూ...’’

‘‘ఏంటీ తొంభై మార్కులనా... అత్త తక్కువ మార్కులంటున్నది! నాకైతే ఈసారి ఎనభైనాలుగే వచ్చాయి తెలుసా’’ హర్ష గొంతులో ఆశ్చర్యం.

‘‘తొంభైఅయిదు మార్కులకి ఒక్క మార్కు తక్కువొచ్చినా సరే, అమ్మ వాటిని తక్కువ అనే అంటుందిరా. మరి నీకు తక్కువ మార్కులొచ్చినందుకు అత్త నిన్నేమీ అనలేదా?’’

‘‘లేదురా. ఈసారి ఇంకాస్త ఎక్కువగా చదివి ఇంప్రూవ్‌ చేసుకోవాలి అని మాత్రమే చెప్పిందిరా మమ్మీ.’’

‘‘నువ్వు లక్కీరా హర్షా, అన్నట్టు... మీ గిటార్‌ టీచర్‌ కొత్త పాటలేవైనా నేర్పించిందా?’’

హర్ష వారానికి రెండు రోజులు గిటార్‌ క్లాసెస్‌కి వెళ్తాడు. నిఖిల్‌ కూడా గిటార్‌ మీద చాలా ఇంట్రెస్ట్‌ని చూపిస్తుండటంతో ‘శైలూ, నిఖిల్‌ని కూడా గిటార్‌ క్లాసెస్‌లో చేర్పించకూడదూ, హర్షతోపాటు వెళ్ళి వస్తాడు’ అని కొన్నాళ్ళకిందట నేనన్నదానికి ‘వాడిప్పుడు మ్యూజిక్‌ అంటూ గిటార్‌ పట్టుక్కూర్చుంటే వాడి చదువు పాడవదూ’ అనేసింది శైలజ.

శైలజకి పిల్లవాడి చదువు తప్ప మరో ధ్యాస లేదు. ఇరవైనాలుగ్గంటలూ చదువుకోమంటూ నిఖిల్‌ వెంటపడుతుంటుంది. పసితనం నుంచీ చదువొక్కటే ధ్యేయం అన్నట్టుగా పెంచుతోంది. ఒక సినిమాకిగానీ పార్క్‌కిగానీ పార్టీకిగానీ వాడిని తీసుకెళ్ళడం అనేది లేనేలేదు. ఏ యాక్టివిటీస్‌కీ పంపదు సరికదా, కనీసం ఓ అరగంటపాటు వాడిని టీవీ అయినా చూడనివ్వదు. చివరకి క్రికెట్‌లాంటి ఆటలకి కూడా పంపదు.

‘అలా పిల్లల్ని కేవలం చదువుకే పరిమితం చేస్తే వాళ్ళకి లోకజ్ఞానం లేకుండా పోతుంది శైలూ. పిల్లల మనోవికాసానికి చదువుతోపాటు ఆటలూ అవసరమే. ఆటలవల్ల శరీరానికి తగినంత ఎక్సర్‌సైజ్‌ అవడమే కాకుండా టీమ్‌స్పిరిట్‌, సోషల్‌ మూవ్‌మెంట్‌, క్రీడాస్ఫూర్తి లాంటి లైఫ్‌స్కిల్స్‌ కూడా ఇంప్రూవ్‌ అవుతాయి. వాడిని కాస్త ఫ్రీగా వదిలేయ్‌ శైలూ, ఫ్రెండ్స్‌తో ఆడుకోనీ వాడిని’ అన్నానొకసారి తనతో.

‘వూరుకో వదినా, నీకేం నువ్వలానే చెబుతావు. నువ్వూ అన్నయ్యా ఇద్దరూ ఐఐటీలలో చదివి మంచి ఉద్యోగాలు చేస్తున్నారు. రేప్పొద్దున్న మీ గైడెన్స్‌లో హర్ష కూడా ఐఐటీలోనే చదువుతాడు. మీలాగే చక్కగా సెటిల్‌ అవుతాడు. మరి మా విషయం అలాకాదే. నేను బీఈడీ చేసి చిన్న స్కూల్లో టీచర్‌గా చేస్తున్నాను. మావారేమో ఎదుగూబొదుగూ లేని ఒక ప్రైవేట్‌ ఫర్మ్‌లో మార్కెటింగ్‌ ఎగ్జిక్యూటివ్‌గా ఉన్నారు. మా నిఖిల్‌ మాలాగా కాకుండా బాగా చదువుకుని ఐఐటీలో సీటు తెచ్చుకోవాలనే కోరికతో మేం సెంటర్‌లో ఉన్న మా సొంత ఇంటిని అద్దెకిచ్చేసి, వాడి కోచింగ్‌ సెంటర్‌కి దగ్గరలో ఉన్న ఇంటిని అద్దెకి తీసుకుని మరీ వాడిని చదివిస్తున్నామని నీకు తెలుసుగా. అలాంటిది వాడిప్పుడు ఆటలకంటూ వెళ్ళి టైమ్‌ వేస్ట్‌ చేసుకుంటే వాడి చదువేం కావాలి చెప్పు’ అన్న తనతో ఇంకేమీ వాదించలేకపోయాను నేను.

నిఖిల్‌ని చూస్తే చాలా జాలేస్తుంది. వాడి ఈడు పిల్లలందరూ ఐఫోన్‌, ఐపాడ్‌లతో ఆడుకుంటుంటే, నిఖిల్‌కి కనీసం ఆ గేమ్స్‌ పేర్లు కూడా తెలియవు. పిల్లల చేతికి ఎలక్ట్రానిక్‌ గాడ్జెట్‌లు ఇచ్చేసి వదిలేయమని కాదు చెప్పేది. మా హర్షకి కూడా మేము వీకెండ్స్‌ మాత్రమే ఒక గంటసేపు ఐపాడ్‌ ఇస్తాం. హర్ష వారానికి ఐదు రోజులు బాడ్మింటన్‌కి వెళ్తాడు. వాడి స్కూల్లో బాడ్మింటన్‌ ట్రోఫీ ఎప్పుడూ వాడిదే. కొన్ని ఇంటర్‌ స్కూల్‌ టోర్నమెంట్లలో కూడా ఆడి కప్పులు తెచ్చుకున్నాడు. గిటార్‌ కూడా బాగానే వాయిస్తాడు. వీటన్నిటితోపాటు చదువులోనూ క్లాస్‌లో మొదటి ఐదారు ర్యాంకులలోనే ఉంటాడు. ఎప్పుడూ ఫస్ట్‌ర్యాంకే తెచ్చుకోవాలని వాడిని మేం ఒత్తిడి చేయం. కానీ, శైలజ అలాకాదు, ఎప్పుడైనా పొరపాటున నిఖిల్‌కి సెకండ్‌ ర్యాంక్‌ వస్తే పిల్లాడని కూడా చూడకుండా చెంపలు వాయించేస్తుంది వాడిని.

‘పిల్లల్ని అలా కొడితే, వాళ్ళల్లో భయం పెరిగిపోయి కాన్ఫిడెన్స్‌ చచ్చిపోతుంది శైలూ. ఏ క్లాస్‌లోనైనా సరే, ఎల్లకాలం ఒక్కరే ఫస్ట్‌ రాలేరు కదా. అప్పుడప్పుడూ ఓడిపోవడం కూడా జీవితంలో భాగమే. పిల్లలు ఓటమిని స్పోర్టివ్‌గా తీసుకుని జీవితంలోని ప్రతీ దశలోనూ ఎదురయ్యే సమస్యలనన్నింటినీ ధైర్యంగా ఎదుర్కొనేటట్లుగా మనం వాళ్ళని ప్రిపేర్‌ చేయాలి’ అని నేను ఎన్నిసార్లు చెప్పినా కూడా తను అర్థం చేసుకోదు, వినదు.

నిఖిల్‌ చదువులో ఎంత చురుకుగా ఉన్నా, వాళ్ళ అమ్మ చేసే అతి కట్టడి వలన ఎప్పుడూ భయంభయంగానే ఉంటాడు. నోరు తెరిచి గట్టిగా మాట్లాడను కూడా మాట్లాడలేడు. ఒక్క మా హర్షతోనే కాస్త చనువుగా ఉంటాడు.

‘అభి తుమ్‌ హి హో’ అంటూ గిటార్‌లో మంద్రంగా మ్యూజిక్‌ వినిపిస్తుంటే ఆలోచనల నుండి బైటపడి హర్ష రూమ్‌కి వెళ్ళాను. కళ్ళు మూసుకుని గిటార్‌ని ఎంతో తాదాత్మ్యతతో వాయిస్తున్నాడు నిఖిల్‌. వాడికి మ్యూజిక్‌ అంటే ప్రాణం. వాళ్ళ అమ్మ పుణ్యమా అని వాడు గిటార్‌ క్లాసెస్‌కి వెళ్ళలేకపోయినా ఒక్కసారి హర్ష వాయించి చూపిస్తే చాలు... ఇట్టే పట్టేస్తాడు ఎలాంటి రాగాన్నైనా సరే. గిఫ్టెడ్‌ ఫెలో.

* * *

‘‘ఈరోజు నిఖిల్‌ ఫోన్‌ చేశాడు మమ్మీ. నెక్స్ట్‌వీక్‌ వాడి క్లాస్‌ పిల్లలందరూ ఎక్స్‌కర్షన్‌కి వెళ్తున్నారట. అత్త వాడిని పంపించటంలేదని పాపం చాలా ఫీల్‌ అవుతున్నాడు మమ్మీ. నువ్వు అత్తకి కాస్త చెప్పకూడదూ’’ బాడ్మింటన్‌ నుంచి వస్తూనే చెప్పాడు హర్ష.

‘‘అలాగేరా’’ అని వాడితో అన్నానే కానీ, ‘నేను చెబితే మాత్రం తను వింటుందా’ అనుకున్నాను మనసులో.

ఆ రాత్రి డిన్నర్‌ తినడం అయిన తరవాత మావారితో విషయం చెప్పి ‘‘నందూ, కొంచెం మీ చెల్లెలితో మీరు మాట్లాడి నిఖిల్‌ని ఎక్స్‌కర్షన్‌కి పంపించేట్టు చూడండి’’ అన్నాను.

‘‘నీకు తెలియందేముంది రేణూ, చిన్నతనం నుండీ శైలూ చాలా మొండిది. ఎవ్వరి మాటా వినదు తను. తనకెంత తోస్తే అంతే. వాళ్ళాయనదేమో ఎక్కువగా టూర్స్‌కి వెళ్ళే జాబ్‌ కావడంతో దీనికి గట్టిగా చెప్పేవాళ్ళు లేకుండా పోయారు. అయినా ప్రయత్నించి చూద్దాం’’ అంటూ శైలజకి ఫోన్‌ చేశారు మావారు.

ఫోన్‌లో స్పీకర్‌ ఆన్‌ చేసి ఇద్దరమూ కొంతసేపు తనతో మాట్లాడిన తరవాత అసలు విషయానికొచ్చారాయన. ‘‘అన్నట్లు శైలూ, నిఖిల్‌ స్కూల్లో అందరూ ఎక్స్‌కర్షన్‌కి అజంతా కేవ్స్‌కి వెళ్తున్నారు కదా, నిఖిల్‌ని కూడా పంపించు. ఇలా అప్పుడప్పుడూ తోటివాళ్ళతో కలిసి ఎడ్యుకేషనల్‌ టూర్స్‌కి వెళ్ళి వస్తుంటే, పిల్లలు ఎంజాయ్‌ చేయడమే కాకుండా వాళ్ళకి లోకజ్ఞానం కూడా పెరుగుతుంది.’’

‘‘అమ్మో, వారంరోజులుగానీ వాడు టూర్‌కి వెళ్ళాడంటే చదువులో చాలా వెనకబడిపోతాడు అన్నయ్యా.’’

శైలజ మాటలు ఆయనకి చిరాకుని కలిగించినా కూడా ఓపికగా చెప్పారు ‘‘ఇప్పుడు పరీక్షలేమీ లేవు కదా శైలూ. పైగా స్కూల్‌కి ఎలాగూ ఆ వారంరోజులూ సెలవులేగా. పంపడానికి ఇంకా ఏమిటీ ప్రాబ్లమ్‌?’’

‘‘స్కూల్‌కి సెలవులే అన్నయ్యా, కానీ కోచింగ్‌ క్లాసెస్‌ ఉన్నాయిగా, అవి మిస్‌ అవుతాడు. అయినా ఒకసారంటూ వాడు ఐఐటీలో సీటు తెచ్చుకుని లైఫ్‌లో సెటిల్‌ అయ్యాడంటే ఇలాంటి టూర్స్‌ ఎన్నింటికో వెళ్తాడులే, అదో పెద్ద విషయమా’’ అంటూ తేలిగ్గా తీసేసింది శైలజ.

ఇక ఉండబట్టలేక నేనందుకున్నాను.

‘‘అలా కాదులే శైలూ, చిన్నప్పుడు స్టూడెంట్‌గా ఫ్రెండ్స్‌తో కలిసి వెళ్తే ఉండే సరదా వేరు. పెద్దయిన తరవాత వెళ్ళడం కష్టం. మమ్మల్నే చూడు... మీ అన్నయ్య ఎప్పుడూ బిజీయే. ఇద్దరం బిజీగా ఉంటే బాబుకి కష్టమని నేను కంపెనీలో జాబ్‌ మానేసి లెక్చరర్‌గా చేరినా కూడా నాలుగేళ్ళకి ఒక్కసారైనా ఎక్కడికీ టూర్‌ ప్లాన్‌ చేయడం కుదరట్లేదు. నిఖిల్‌ని ఈ వయసులో వాడి ఫ్రెండ్స్‌తో కలిసి ఎంజాయ్‌ చేయనీ శైలూ.’’

‘‘నేను చెప్పేదీ అదే కదా వదినా. నువ్వెలా మీవాడి కోసం నీ ఉద్యోగాన్ని సైతం మార్చుకున్నావో... నేనూ అలాగే మావాడి చదువుకోసమేగా వాడ్ని ఎక్స్‌కర్షన్‌కి పంపనంటున్నది’’ అని కాలికేస్తే వేలికి అన్నట్లుగా తను మాట్లాడుతుండటంతో ఇక నోరు మూసేసుకున్నాను.

* * *

ఆరోజు ఐఐటీ ఎంట్రన్స్‌ రిజల్ట్స్‌ వస్తాయి. ఉదయమే దేవుడికి పూజ చేసి మొక్కుకున్నా- ‘స్వామీ, పిల్లలిద్దరికీ కూడా మంచి ర్యాంకులు వచ్చేట్టుగా చూడు. ముఖ్యంగా నిఖిల్‌కి ఐఐటీలో సీటు వచ్చేట్టు చేయి తండ్రీ’ అని.

హర్షకి ఏ ర్యాంకు వచ్చినా మేమూ వాడూ తట్టుకోగలం కానీ, నిఖిల్‌కి పొరపాటున పెద్ద ర్యాంకుగానీ వచ్చిందంటే శైలజ చంపేస్తుంది వాడిని.

నా ప్రార్థన ఫలించింది. నిఖిల్‌కి మంచి ర్యాంకు వచ్చింది. హర్షకీ ఫర్వాలేదు... మంచి ర్యాంకే.

శైలజ ఆనందం వర్ణనాతీతం. స్వీట్స్‌ పట్టుకుని వెలిగిపోతున్న మొహంతో మా ఇంటికి వచ్చింది.

‘‘అన్నయ్యా, నిఖిల్‌కి ఐఐటీలో సీటు వస్తుంది కదూ...’’

‘‘వస్తుంది శైలూ, వాడి ర్యాంకుకి అన్ని టాప్‌ ఐఐటీల్లోనూ మంచి బ్రాంచీలోనే సీటు వస్తుంది’’ చెప్పారాయన.

‘‘వదినా, నువ్వు కాస్త హర్షని కట్టడిచేసి ఆ బాడ్మింటన్‌ అవీ మాన్పించి ఉంటే వాడికి ఇంకా మంచి ర్యాంకు వచ్చుండేది’’ అని కొద్దిసేపు నా దగ్గర బాధపడింది.

‘‘ఫరవాలేదు శైలూ, వాడిదీ మంచి ర్యాంకే. ఐఐటీలో మంచి బ్రాంచీలో సీటు రాకపోయినా, ఏ ఎన్‌ఐటీలోనైనా మంచి బ్రాంచీలోనే సీటు వస్తుందిలే’’ అన్నాను.

* * *

సూరత్‌కల్‌ ఎన్‌ఐటీలో కంప్యూటర్‌ ఇంజినీరింగ్‌లో జాయిన్‌ అయ్యాడు హర్ష. నిఖిల్‌వాళ్ళ నాన్న అర్జెంటు పనిమీద వాళ్ళ వూరికి వెళ్ళాల్సి రావడంతో, శైలజతోపాటు మావారు కూడా వెళ్ళి నిఖిల్‌ని చెన్నై ఐఐటీలో కంప్యూటర్‌ ఇంజినీరింగ్‌లో జాయిన్‌ చేసి వచ్చారు.

‘‘నిఖిల్‌ని హాస్టల్‌లో వదిలేసి వస్తుంటే బిక్కమొహం పెట్టాడు పాపం. వాడు అమాయకుడు, మన హర్షలాగా కాదు. చదువు తప్ప, వాడికి మరొకటి తెలీదు రేణూ. నా క్లాస్‌మేట్‌ మూర్తి తెలుసుగా నీకు.... వాడిప్పుడు అక్కడే అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా ఉన్నాడు. నిఖిల్‌ని కాస్త కనిపెట్టుకుని చూస్తుండమని అతనికి చెప్పి వచ్చాను. నువ్వు కూడా నీకు కుదిరినప్పుడల్లా నిఖిల్‌ని ఫోన్‌లో పలకరిస్తుండు’’ అన్నారు.

‘‘కుదిరినప్పుడల్లా కాదులే నందూ, ప్రతిరోజూ చేస్తాను. నాకు హర్ష ఎంతో, నిఖిలూ అంతే’’ అన్నాను మనస్ఫూర్తిగా.

అన్నట్లుగానే ప్రతిరోజూ ఫోన్‌లో పిల్లలిద్దరితోనూ మాట్లాడుతూనే ఉన్నాను.

నిఖిల్‌ చాలా రిజర్వ్‌డ్‌. వాడొక్క హర్షతోనే కాస్త మనసు విప్పి మాట్లాడుతాడు కాబట్టి వాడి ద్వారానే నిఖిల్‌ విషయాలు కొద్దిగా తెలుస్తున్నాయి మాకు.

‘‘నిఖిల్‌కి అక్కడ ఎవరూ ఫ్రెండ్సయినట్టు లేరు మమ్మీ. వాడెవ్వరితోనూ పెద్దగా కలుస్తున్నట్టు లేడు. లోన్లీగా ఫీల్‌ అవుతున్నాడు’’ అని చెబుతుండేవాడు హర్ష.

‘హాస్టల్‌లో ఉండటం మొదటిసారి కదా, మెల్లగా అలవాటుపడతాడులే’ అనుకున్నాం.

* * *

మూడు నెలలు గడిచాయి. అర్ధరాత్రి ఫోన్‌ మోగుతుంటే నిద్రమత్తులోనే ఫోన్‌ ఎత్తారాయన. అవతల నుండి చెబుతున్నది వింటూనే ‘‘వ్వాట్‌... మేం ఇప్పుడే బయలుదేరి వస్తున్నాం’’ అని చెప్పి ఫోన్‌ పెట్టేశారు.

‘‘త్వరగా తయారుకా రేణూ, మనం అర్జెంటుగా చెన్నై వెళ్ళాలి. నిఖిల్‌ సూసైడ్‌ అటెంప్ట్‌ చేశాడట, మూర్తి చెప్పాడు’’ అని నాకు చెబుతూనే మాకు రెగ్యులర్‌గా వచ్చే క్యాబ్‌ డ్రైవర్‌కి ఫోన్‌ చేసి వెంటనే రమ్మని చెప్పారు.

నిఖిల్‌వాళ్ళ నాన్న టూర్‌లో ఉండటం వలన శైలూని కూడా దారిలో పికప్‌ చేసుకుని చెన్నైలో డైరెక్ట్‌గా మూర్తి చెప్పిన హాస్పిటల్‌కే వెళ్ళాం. మేం వెళ్ళేసరికి మూర్తి హాస్పిటల్లోనే ఉన్నాడు. నిఖిల్‌ పరిస్థితి క్రిటికల్‌గానే ఉంది. ఐసీయూలో పెట్టారు.

‘‘అసలేం జరిగింది మూర్తీ’’ అన్న మావారితో జరిగిన విషయం చెప్పుకొచ్చాడు మూర్తి...

అనుకోకుండా ఆ రాత్రి నిఖిల్‌ ఉన్న హాస్టల్‌ వైపుగా వెళ్తున్న మూర్తి ఒకసారి నిఖిల్‌ని పలకరించి వెళ్దామని హాస్టల్‌ రూమ్‌కి వెళ్తే, అక్కడ బెడ్‌ మీద అపస్మారకంగా పడి ఉన్న నిఖిల్‌ని చూసి వెంటనే హాస్పిటల్లో అడ్మిట్‌ చేసి ఆ తరవాత మాకు ఫోన్‌ చేశాడట. నిఖిల్‌ పాయిజన్‌ తీసుకున్నాడని చెప్పిన డాక్టర్స్‌ వెంటనే అతని స్టమక్‌ వాష్‌ చేసి ట్రీట్‌మెంట్‌ మొదలుపెట్టారు.

* * *

ఇంకో ఆరుగంటలు గడిస్తేనే కానీ ఏ విషయమూ చెప్పలేమన్నారు డాక్టర్స్‌. ఐసీయూ బైట వరండాలో అందరం క్షణాలు లెక్కబెట్టుకుంటున్నాం. కంటికీ మింటికీ ఏకధారగా శైలజ ఏడుస్తుంటే తనకి ధైర్యం చెబుతున్నాం మేం.

ఇంతలో హర్ష నుంచి ఫోన్‌ వస్తే వాడికీ విషయం చెప్పాం.

‘‘నాకు రెండు రోజులకిందట నిఖిల్‌ ఫోన్‌ చేశాడు మమ్మీ. మొన్న జరిగిన టర్మ్‌ ఎగ్జామ్స్‌లో వాడికి మార్కులు తక్కువ వచ్చాయట. అక్కడ జాయిన్‌ చేసేటప్పుడు అత్త వాడిని ఐఐటీలో కూడా టాప్‌ అవ్వాలని గట్టిగా చెప్పిందట. ‘ఇప్పుడు నాకిలా తక్కువ మార్కులు వచ్చాయని తెలిస్తే అమ్మ నన్ను చంపేస్తుంది’ అంటూ భయపడ్డాడు మమ్మీ వాడు...’’ అంటూ హర్ష ఇంకా ఏదో చెప్పబోతుంటే వాడిని మధ్యలోనే అడ్డుకున్నాను.

‘‘నిఖిల్‌కి తక్కువ మార్కులు రావడమేమిటిరా, వాడు చాలా బాగా చదువుతాడుగా’’ అన్నాను.

‘‘నిజమే మమ్మీ, కానీ కొన్ని సబ్జెక్ట్స్‌లో గ్రూప్‌ అసైన్‌మెంట్స్‌, గ్రూప్‌ ప్రెజెంటేషన్స్‌ ఉంటాయి కదా... నిఖిల్‌ ఎవ్వరితోనూ కలవడు. పైగా వాడికి అంత కమ్యూనికేషన్స్‌ స్కిల్స్‌ కూడా లేవు. అందుకని వాడిని మంచి మెరిట్‌ గ్రూప్స్‌ వాళ్ళెవ్వరూ కలుపుకోలేదుట. దాంతో గ్రూప్‌ ప్రాజెక్ట్స్‌లో తక్కువ మార్కులు రావడంవల్ల మొత్తంమీద వాడి పర్సంటైల్‌ తగ్గిపోయిందట. వీడికి క్రికెట్‌గానీ, మరే ఇతర గేమ్‌ కానీ రాదు. అత్త నిఖిల్‌ని న్యూస్‌పేపర్‌ కూడా చదవనిచ్చేది కాదు కాబట్టి వాడికి పాలిటిక్స్‌ కూడా పెద్దగా తెలియవు. దాంతో ఎవరితోనైనా మాట్లాడేందుకు చదువు తప్ప, ఇంకే టాపిక్‌ తెలియదు వీడికి. అందుకే ఎవరితోనూ కలవలేక బాగా లోన్లీగా ఫీల్‌ అయినట్టున్నాడు. దానికితోడు మార్కులు కూడా తక్కువొచ్చేటప్పటికి ఇంకా డిప్రెస్‌ అయి ఇలా చేసినట్టున్నాడు మమ్మీ’’ అంటూ చాలా బాధపడ్డాడు హర్ష.

విషయం తెలుసుకుని ఆయన కూడా ‘‘నిఖిల్‌ని చివరకు ఈ స్థితికి తీసుకొచ్చింది శైలు’’ అంటూ బాధపడ్డారు.

ఇంతలో డాక్టర్‌ బైటకు రావడంతో ఫోన్‌ కట్‌ చేశాను.

‘‘హి ఈజ్‌ అవుట్‌ ఆఫ్‌ డేంజర్‌ నౌ. బట్‌, హి నీడ్స్‌ రెస్ట్‌’’ అని డాక్టర్‌ చెప్పగానే అంతా రిలీఫ్‌ ఫీలయ్యాం.

* * *

నిఖిల్‌ని ఐసీయూ నుంచి వార్డ్‌కి షిఫ్ట్‌ చేశారు. వాడిని చూసేందుకు మేమందరం లోనికి వెళ్ళాం. లోనికి వస్తున్న వాళ్ళ అమ్మని చూస్తూనే భయంతో వణికిపోయాడు నిఖిల్‌. శైలజకి ఏమీ అర్థంకాలేదు.

‘‘ఏం భయంలేదు నిఖిల్‌. కొన్నాళ్ళపాటు మాతో వచ్చి మా ఇంట్లోనే ఉండి రెస్ట్‌ తీసుకుందువుగానీ’’ అంటూ వాడిని దగ్గరకు తీసుకుని మేమిద్దరం ధైర్యం చెప్పాం.

‘‘ఇప్పుడు వాడిని ఇంటికి తీసుకెళ్ళడం దేనికన్నయ్యా, క్లాసెస్‌ పోవూ- పైగా అటెండెన్స్‌...’’ అంటూ శైలజ ఇంకా ఏదో చెప్పబోతుంటే కోపం ఆపుకోలేక అది హాస్పిటల్‌ అని కూడా మరిచిపోయి గట్టిగా అరిచేశారాయన.

‘‘నోర్ముయ్‌, ఇంకొక్క మాట మాట్లాడావంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. చదువూ చదువూ అంటూ వాడి బాల్యాన్ని బందిఖానా చేశావు. వాడికంటూ ఏ మధుర జ్ఞాపకాలూ మిగలకుండా చేశావు. ఇప్పుడిక వాడికి అసలు జీవితమనేదే లేకుండా చేస్తావా? ఇంతదాకా నువ్వు చేసింది చాలు, ఇంకేమీ మాట్లాడకు. నిఖిల్‌ని మాతోపాటు తీసుకుని వెళ్తాం. వాడు కోలుకునే వరకూ మా ఇంట్లోనే ఉంటాడు.’’

ఆయన్ని అంత కోపంలో చూడటం అదే మొదటిసారి నాకు. శైలజ అయితే భయపడిపోయింది వాళ్ళ అన్నయ్య కోపాన్ని చూసి.

ఆ తర్వాత అయిదు నిమిషాలకి తమాయించుకుని సౌమ్యంగా చెప్పారాయన ‘‘శైలూ, ఇక్కడి ప్రొఫెసర్స్‌తో నేను మాట్లాడి పర్మిషన్‌ తీసుకుంటాను. క్లాసెస్‌, అసైన్‌మెంట్స్‌ అవన్నీ రేణు చూసుకుంటుందిలే’’ అని.

* * *

నిఖిల్‌ని మాతోపాటు ఇంటికి తీసుకొచ్చేశాం.

‘‘నేనసలు పదేళ్ళకిందటే ఈ పని చేయవలసింది రేణూ. తన మొండితనంతో- జీవితం అంటే కేవలం చదువే అన్న మూర్ఖత్వంతో నిఖిల్‌కి ఇలాంటి పరిస్థితిని తెప్పించింది శైలజ. కొన్నాళ్ళపాటు నిఖిల్‌తోనే ఉండి వాడిని మామూలు మనిషిని చేయవలసిన భారం నీదే రేణూ. హర్షని ఎంత కాన్ఫిడెంట్‌గా తీర్చిదిద్దావో ఇప్పుడు నిఖిల్‌ని కూడా అలాగే మార్చాలి ప్లీజ్‌’’ అంటూ ఆ రాత్రి నా చేతులు పట్టుకున్నారు మావారు.

‘‘మీరు నన్ను రిక్వెస్ట్‌ చేయడమేమిటి నందూ, అది నా బాధ్యత. నా శాయశక్తులా ప్రయత్నిస్తాను. నాకు హర్ష వేరూ, నిఖిల్‌ వేరూ కాదు. చదువు విషయంలో నిఖిల్‌ని అంతలా కట్టడి చేయకుండా కాస్త ఫ్రీగా వదిలేయమని నేను ఎన్నోసార్లు చెప్పి చూశాను శైలజకి. కానీ తను నా మాట వినలేదు. చదువు తప్ప వాడికి మరో లోకం అంటూ లేకుండా చేసింది. పిల్లలు మైనపు ముద్దలు, వారిని మనం ఎలా మలిస్తే అలా తయారవుతారు. ఇప్పటికీ మించిపోయిందేమీ లేదు లెండి. హర్ష కూడా ఉంటే నిఖిల్‌ కాస్త త్వరగా కోలుకుంటాడని ఒక వారం రోజులు కాలేజీలో పర్మిషన్‌ తీసుకుని ఇక్కడికి వచ్చేయమని హర్షకి ఆల్రెడీ ఫోన్‌ చేసి చెప్పాను. అలాగే నిఖిల్‌కి మ్యూజిక్‌ అంటే చాలా ఇష్టం కదాని, హర్షకి గిటార్‌ నేర్పించే టీచర్‌ని కొన్నాళ్ళపాటు మన ఇంటికి వచ్చి నిఖిల్‌కి గిటార్‌ నేర్పించేటట్టుగా కూడా మాట్లాడాను. నిఖిల్‌ త్వరలోనే కోలుకుంటాడని నాకు పూర్తి నమ్మకముంది నందూ. మీరేం దిగులుపడకండి’’ అంటూ నేనిచ్చిన హామీతో ఆయన నిశ్చింతగా పడుకున్నారు.

నిద్రలోనే అస్థిమితంగా అటూ ఇటూ కదులుతున్న నిఖిల్‌ని చూస్తూ ‘పిల్లల మనసులు అప్పుడే విచ్చుకుంటున్న పూమొగ్గల్లాంటివి. అవి సహజంగా విచ్చుకునేందుకు కావలసిన వాతావరణాన్ని పెద్దలు కల్పించాలి. అలా కాకుండా ఆ పసిమనసులపై వయసుకి మించిన ఒత్తిడిని పెడితే, ఆ పిల్లలు మొగ్గలుగానే రాలిపోతారు లేదా వాడిపోతారు. శైలజ లాంటి తల్లిదండ్రులు ఇది ఎప్పుడు అర్థం చేసుకుంటారో’ అనుకున్నాను మనసులో.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.