close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
మీ కంపెనీ గురించి అంబానీకి చెప్పండి!

  మీ కంపెనీ గురించి అంబానీకి చెప్పండి!

మీ అంకుర సంస్థలో రిలయన్స్‌ పెట్టుబడి పెట్టొచ్చు! మైక్రోసాఫ్ట్‌ మీ ఉత్పత్తుల్ని పరీక్షించి స్పందన తెలపొచ్చు! స్టార్టప్‌ ప్రపంచంలో నెక్స్ట్‌ సంచలనం మీరే కావొచ్చు! ఇవన్నీ నిజం కావాలంటే, మీ సంస్థ ‘జెన్‌నెక్స్ట్‌హబ్‌’కి ఎంపిక కావాలంతే!

వైడ్లీ... జియో ఫోన్లలో వెబ్‌ బ్రౌజర్‌ని అభివృద్ధి చేసిన సంస్థ. హెడ్‌స్పిన్‌... వేర్వేరు మొబైల్‌ ఫోన్ల నెట్‌వర్క్‌లలో ఆప్‌ల పనితీరును పరీక్షించే సాంకేతికత. పేట్యూన్స్‌... కాలర్‌ట్యూన్లూ, రింగ్‌ టోన్లను ప్రకటనలుగా వినిపించే ఆప్‌. తమ సాంకేతికతను జియో నెట్‌వర్క్‌ మీద ఉచితంగా పరీక్షించుకునే అవకాశం ఈ సంస్థలకు లభించింది. వారికీ అవకాశం రావడానికి కారణం ‘జెన్‌నెక్స్ట్‌హబ్‌ (gennexthub.com) శిక్షణ కార్యక్రమానికి ఎంపిక కావడమే. భారత్‌లో అంకుర సంస్థల్ని ప్రోత్సహించేందుకు 2014లో ఈ హబ్‌ని రిలయన్స్‌ సంస్థ మైక్రోసాఫ్ట్‌ వెంచర్స్‌ సహకారంతో ప్రారంభించింది. ఈ ఏడాది వేసవిలో దీన్లో ప్రవేశానికి దరఖాస్తుల్ని ఆహ్వానించినపుడు వెయ్యి సంస్థలు ప్రతిపాదనలు పంపాయి. వాటినుంచి 11 సంస్థలనే ఎంపికచేశారు.

ఎన్ని లాభాలో...
ఈ కార్యక్రమానికి రెండు విభాగాల్లో సంస్థల్ని ఎంపికచేస్తారు. అందులో ఒకటి స్కేల్‌రేటర్‌... ఇందులో ఉత్పత్తితో మార్కెట్‌లోకి కొన్నాళ్ల కిందట ప్రవేశించి, విస్తరణకు అవసరమైన మార్గనిర్దేశం పెట్టుబడి గురించి చూసేవి ఉంటాయి. రెండోది యాక్సలరేటర్‌... ఇందులో ఉత్పత్తి ప్రాథమిక, మాధ్యమిక దశలో ఉన్న సంస్థలు ఉంటాయి. మార్కెట్‌లో అప్పుడప్పుడే అడుగుపెడుతున్న సంస్థలన్నమాట. జెన్‌నెక్స్ట్‌ హబ్‌కి ఎంపికైనవారికి దిగ్గజాల మార్గనిర్దేశం దొరుకుతుంది. పెట్టుబడిదారులూ, సాంకేతిక, డిజైన్‌ రంగాల్లో నిపుణులూ అందుబాటులో ఉంటారు. ఎంపికైన సంస్థ ప్రతినిధులకు నాలుగు నెలలపాటు ఇక్కడ శిక్షణ ఉంటుంది. దీన్లో అడుగుపెట్టిన రోజునే రానున్న నాలుగు నెలల్లో సంస్థను ఏ స్థాయికి తీసుకువెళ్లాలో నిర్దేశించుకొని కార్యక్రమాన్ని మొదలుపెడతారు. కార్యక్రమం చివరి దశలో ఏంజిల్‌ ఇన్వెస్టర్ల నుంచి పెట్టుబడుల్ని పొందేలా చూస్తారు. నవీ ముంబయిలో 100 ఎకరాల విస్తీర్ణంలో అభివృద్ధి చేసిన రిలయన్స్‌ కార్పొరేట్‌ పార్కులోని ‘మెయిన్‌ అడ్మినిస్ట్రేటివ్‌ బిల్డింగ్‌’ ఈ శిక్షణకు వేదిక. ఇక్కడి ల్యాబ్‌లో అత్యాధునికమైన సదుపాయాలెన్నో ఉన్నాయి. దాదాపు 100 రకాల పరికరాలమీద తమ ఉత్పత్తుల్ని పరీక్షించుకునే సదుపాయం ఉంటుంది. స్ట్రీమింగ్‌ వెబ్‌సైట్‌/ఆప్‌ అయిన ‘హాట్‌స్టార్‌’ ఈ ల్యాబ్‌నే ప్రయోగశాలగా వాడుతుండటం గమనార్హం. అభ్యర్థులు ఈ కేంద్రంలో ఉండేందుకు అయ్యే ఖర్చుల్ని తప్పించి మరెలాంటి రుసుములూ వసూలుచేయరు. ఒక్కో కంపెనీ నుంచి నలుగురు సభ్యులకు చోటు ఉంటుంది. దీంట్లో మైక్రోసాఫ్ట్‌ కూడా భాగస్వామి అయినందువల్ల దీనికి ఎంపికైన వారు ‘మైక్రోసాఫ్ట్‌ బిజ్‌స్పార్క్‌’ కార్యక్రమానికి హాజరయ్యే అవకాశాన్ని కల్పిస్తున్నారు. అంతేకాదు మైక్రోసాఫ్ట్‌ సర్వీసుల్లో కొన్నిటిని ఉచితంగా పొందొచ్చు. ఇంకా ఆ సంస్థకు చెందిన నిపుణుల నుంచి తమ ఉత్పత్తులపైన ఫీడ్‌బ్యాక్‌ పొందొచ్చు. ఏంజిల్‌ ఇన్వెస్టర్‌ అయిన సంజీవ్‌ మెహతా, సీరియల్‌ ఆంత్రొప్రెన్యూర్‌ రవి గురురాజ్‌... మొదలైనవారు మార్గ నిర్దేశకుల జాబితాలో ఉన్నారు.

రిలయన్స్‌ పెట్టుబడి
గత మూడేళ్లలో ఈ హబ్‌కి ఎంపికైన సంస్థలు 52. ఇవి మొత్తం రూ.285కోట్ల పెట్టుబడుల్ని సేకరించాయి. వాటిలో జెన్‌నెక్స్ట్‌హబ్‌లో అడుగుపెట్టాక పొందినవే రూ.200 కోట్లు. మూడు కంపెనీలు రూ.50 కోట్లూ ఆపైన పెట్టుబడి సాధించాయి. ఈ హబ్‌కు ఎంపికైన వాటిలో నెట్రాడైన్‌, వీడియోనెటిక్స్‌, ఎడ్‌కాస్ట్‌ సహా ఆరు సంస్థల్లో రిలయన్స్‌ పెట్టుబడి పెట్టడం గమనార్హం. రవాణా రంగంలో ట్రాకింగ్‌ సేవల్ని అందిస్తోన్న లాజినెక్స్ట్‌, ఇంధన రంగంలోని ఆల్గో ఇంజిన్స్‌, రెసిపీబుక్‌ ఆప్‌... ఈ హబ్‌లో శిక్షణ కార్యక్రమానికి ఎంపికైన సంస్థల్లో మరికొన్ని. రెసిపీబుక్‌కి ఇక్కడికి వచ్చే సమయానికి ఎనిమిది లక్షల డౌన్‌లోడ్లు ఉంటే ఇప్పుడది 40 లక్షలకు వెళ్లింది. ‘రానున్న దశాబ్దంలో చిన్న, యువ వ్యాపారుల్ని ప్రోత్సహిస్తూ భారత్‌లో పరిశ్రమల విస్తరణకు కృషిచేస్తున్న సంస్థగా రిలయన్స్‌ పేరు వినిపించనుంది’ అని ఇటీవల ఆ సంస్థ వార్షిక సమావేశంలో ప్రకటించారు ఛైర్మన్‌ ముఖేశ్‌ అంబానీ. రూ.5000 కోట్లతో ‘జియో డిజిటల్‌ ఇండియా స్టార్టప్‌ ఫండ్‌’ను తెస్తామని ఇప్పటికే ఆయన ప్రకటించారు కూడా. ఇక్కడి అంకురాల గురించి తరచూ తెలుసుకుంటారు ముఖేశ్‌. జియోకి ‘చీఫ్‌ ఆఫ్‌ స్ట్రాటజీ’గా ఉన్న ముఖేశ్‌ తనయుడు ఆకాశ్‌కి ఈ విభాగంపైన ప్రత్యేక శ్రద్ధ. ఈ అంకుర సంస్థల్లో జియోతో కలిసి పనిచేయగలవాటి గురించి పరిశీలిస్తారు. ఇక్కడ మార్గనిర్దేశం కోసం ఎంపికైన సంస్థల్లో రిలయన్స్‌ సంస్థకు ఆసక్తి ఉంటే పెట్టుబడి పెడుతుంది కూడా. కాకపోతే అది ఇద్దరికీ ఆమోదయోగ్యమైతేనే. అయితే ఇక్కడికి వచ్చే సంస్థల్లో చాలావరకూ పెట్టుబడికంటే కూడా మార్గనిర్దేశం కోసం వస్తున్నవే ఉన్నాయని చెబుతారు ‘మెంటర్‌ ఇన్‌ రెసిడెన్స్‌’ అమెయ్‌ మశేల్కర్‌. ఇక్కడి నుంచి ఒక యూనికార్న్‌(బిలియన్‌ డాలర్‌) కంపెనీని చూడాలన్నది తమ లక్ష్యంగా చెబుతారాయన. ప్రస్తుతం మరో విడత ఎంపిక ప్రక్రియ మొదలైంది. ఆ యూనికార్న్‌ కంపెనీ మీదేనేమో చూడండి!


 

ఇక్కడ వైద్యం పూర్తిగా ఉచితం!

వైద్యం ఖరీదైన సేవగా మారిపోతోంది. ఏ చిన్న ఆరోగ్య సమస్య వచ్చినా వేలల్లో ఖర్చు చేయాల్సిందే. అలాంటి పరిస్థితిని డబ్బున్నవాళ్లు ఎదుర్కోగలరు. కానీ పేదల మాటేమిటి? ఈ విషయాన్నే ఆలోచించాడు ఆ ఆయుర్వేద వైద్యుడు. బదులుగా తన ఇంటినే వైద్యశాలగా మార్చి సేవలు అందిస్తున్నాడు.

రంగల్‌ నగరం, మట్టెవాడ ప్రాంతంలో ఉన్న తన ఇంటినే వైద్యశాలగా మార్చి ఉచిత వైద్యం అందిస్తున్నారు నగరానికి చెందిన డాక్టర్‌ పాములపర్తి రామారావు. నగరంలోని అనంతలక్ష్మి ప్రభుత్వ ఆయుర్వేద కళాశాల వైస్‌ప్రిన్సిపల్‌గా పనిచేసి గతేడాది పదవీ విరమణ పొందిన రామారావు ప్రస్తుతం పూర్తి సమయం వైద్య సేవలు అందించేందుకు కేటాయిస్తున్నారు. దీర్ఘకాలికంగా పీడించే వెన్నునొప్పి, నడుంనొప్పి, మోకాళ్లనొప్పి, కీళ్లనొప్పులతోపాటు తలనొప్పి, ఉదర సంబంధిత వ్యాధులు, దృష్టి లోపాలతో వచ్చేవారూ దగ్గు, ఆయాసం, అలర్జీ, జ్వరాలతో వచ్చేవారూ రామారావు అందించే ఆయుర్వేద వైద్యంతో ఉపశమనం పొందుతున్నారు.

రెండు పూటలూ...
వరంగల్‌లోని ప్రభుత్వ ఆయుర్వేద కళాశాలలో బీఏఎమ్‌ఎస్‌(బ్యాచిలర్‌ ఆఫ్‌ ఆయుర్వేద మెడిసిన్‌, సర్జన్‌) చేసిన రామారావు... తర్వాత కేరళలోని ‘యూనివర్సిటీ ఆఫ్‌ త్రివేండ్రం’లో ఎండీ(డాక్టర్‌ ఆఫ్‌ మెడిసిన్‌ ఇన్‌ ఆయుర్వేద) పూర్తిచేశారు. ఆపైన బోధన వృత్తిపైన ఉన్న మక్కువతో తాను చదువుకున్న కాలేజీలోనే అధ్యాపకుడిగా చేరారు. రామారావు తండ్రి సదాశివరావు కూడా ఆయుర్వేద వైద్యుడు. అధ్యాపక వృత్తిలో కొనసాగుతూనే తండ్రి సూచన మేరకు 1993 నుంచీ తన ఇంటి పై అంతస్తునే వైద్యశాలగా మార్చి వైద్యసేవలు అందిస్తున్నారు రామారావు. ఆయన ఇంటికి రోగులు రావడం ఉదయం నుంచే మొదలవుతుంది. ఉదయం ఏడింటినుంచే అక్కడ వైద్య సేవలు మొదలవుతాయి. నగరంతోపాటు తెలుగు రాష్ట్రాలూ, ఇంకా పొరుగు రాష్ట్రాలైన కర్ణాటక, మహారాష్ట్ర, ఒడిశాల నుంచీ ఇక్కడికి వైద్య సేవల కోసం వస్తారు. వచ్చిన వారందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ వారి సమస్యల్ని అడిగి తెలుసుకుంటారు రామారావు. వారి ఆర్థిక పరిస్థితిని గుర్తించి పేదలకు మందుల్నీ ఉచితంగానే ఇస్తారు. మధ్యాహ్నం 12 గంటల వరకూ రోగుల్ని పరీక్షిస్తారు. మళ్లీ సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి తొమ్మిదింటి వరకూ వైద్య సేవలు కొనసాగుతాయి. సాధారణ రోజుల్లో 100 మందీ, వారాంతాల్లో 150-200 మందీ వైద్యం కోసం ఇక్కడికి వస్తారు. నేత్ర సంబంధిత నరాల సమస్యలను శాశ్వతంగా పరిష్కరించడంలో రామారావుది అందెవేసిన చేయి. పాతికేళ్లలోపు వాళ్లు కళ్లజోడు పెట్టుకునే అవసరం లేకుండా చికిత్స అందిస్తారు. మెల్ల కన్ను సమస్యను సరిచేయడంలో ఈయన నేర్పరి. వెన్నుపూస(డిస్క్‌) సమస్యలకు స్వయంగా మసాజ్‌ థెరపీతో సరిచేయడం రామారావు ప్రత్యేకతని రోగులు చెబుతారు. ఇంకా నడుంనొప్పి, మోకాలి నొప్పి, మెడనొప్పి, ఒకవైపు కాలు లాగడం, చేయి లాగడం లాంటి సమస్యలతో ఎక్కువ మంది చికిత్స కోసం వస్తుంటారు. దూర ప్రాంతాల నుంచి వచ్చి రెండు మూడు రోజులపాటు ఉండి చికిత్స పొందాల్సిన అవసరం ఉన్నపుడు పేదలకు తన ఆసుపత్రిలోనే ఆశ్రయం కల్పిస్తారు.

పింఛనుతో నిర్వహణ
పాములపర్తి సొంతూరు పూర్వ వరంగల్‌ జిల్లాలోని వంగర గ్రామం. మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు ఈయన సమీప బంధువు కూడా. రామారావు తండ్రి సదాశివరావు ఆయుర్వేద వైద్య విధానాలను వివరిస్తూ పలు పుస్తకాలు రాశారు. కాకతీయ పత్రిక వ్యవస్థాపక సంపాదకులు కూడా. రామారావు కూడా ‘ఆనందమయ జీవితం’, ‘ఆయుర్వేదం- ఒక పరిచయం’, ‘మన జీవన విధానం మారాలి’ అనే పుస్తకాల్ని రచించారు. సమాజసేవలో తండ్రి తనకు స్ఫూర్తి అని చెప్పే రామారావు తన పింఛను డబ్బు రూ.37వేలలో 20వేలను ఆసుపత్రి నిర్వహణకు కేటాయిస్తారు. ఆసుపత్రి నిర్వహణలో ముగ్గురు వ్యక్తుల్ని సహాయకులుగా నియమించుకున్నారు. మిగిలిన డబ్బుని వ్యక్తిగత అవసరాలకు ఖర్చుచేస్తూ ఆదర్శవంతమైన జీవతాన్ని గడుపుతున్నారు. రామారావు భార్య నీరజ కొన్నాళ్ల కిందట స్వర్గస్తులయ్యారు. ఆయనకు కుమార్తె అర్చన, కొడుకు ఆదిత్య ఉన్నారు. హైదరాబాద్‌, బెంగళూరులలో స్థిరపడిన వారిని చూసేందుకు ప్రతినెలా ఒకటి నుంచి అయిదో తేదీ వరకూ సెలవు తీసుకుంటారు. ఆరో తేదీ నుంచి నెల మొత్తం ఆసుపత్రిలోనే ఉంటారు. గత 24 ఏళ్లుగా వైద్య సేవల్ని ఉచితంగా అందిస్తూ ప్రజా వైద్యుడిగా రోగుల మన్ననలు పొందుతున్న రామారావుకి ఆయన దగ్గర వైద్యం పొందినవారు కృతజ్ఞతగా ఇంటి ప్రాంగణంలో ఆయన విగ్రహాన్ని ప్రతిష్టించి దానిపైన ‘మీ ఆత్మీయ పాత రోగులు’ అని రాసి పెట్టడం విశేషం.

ఆరోగ్యం సహకరించే వరకూ ఆయుర్వేద వైద్యంలో ఉచిత సేవలు కొనసాగిస్తానని చెప్పే రామారావు(ఫోన్‌:9440514999), ‘పాములపర్తి’ పేరుతో ఒక ట్రస్టును ఏర్పాటుచేసి మరింత మంది ఆయుర్వేద వైద్య విద్యార్థులకు మెలకువలను నేర్పిస్తానంటారు. ‘ఆ విధంగా నా తదనంతరం కూడా నా సేవలు కొనసాగాలనేది నా లక్ష్యం’ అనేది రామారావు మాట.

- వానపల్లి శ్రీనివాసరావు ఈనాడు, వరంగల్‌
ఫొటోలు: చిన్నబాబు, న్యూస్‌టుడే, మట్టెవాడ

 

ఒక్కక్లిక్‌.. కోటి పుస్తకాలు..!

నేడు సమాచారం ఒక సంపద. అది ఏ రూపంలో ఉన్నా దాని విలువ అనంతం. అలాంటి గొప్ప సంపదకు కేరాఫ్‌ అడ్రస్‌ లైబ్రరీలే. కానీ ఇప్పుడు వాటి మనుగడ ప్రశ్నార్థకమైపోయింది. గ్రంథాలయాలు అడపాదడపా అందుబాటులో ఉన్నా వాటిలో లభించే పుస్తకాల సంఖ్య అంతంతమాత్రమే. ఒకరు తీసుకెళ్లిన పుస్తకం మన చేతికి రావాలంటే అది మళ్లీ గ్రంథాలయాన్ని చేరేవరకూ వేచి చూడాల్సిందే. ఇలాంటి ఎన్నో సమస్యలకు పరిష్కారాన్ని చూపిస్తోంది నేషనల్‌ డిజిటల్‌ లైబ్రరీ.

‘మీవూళ్లొ లైబ్రరీ ఎక్కడుందనేది నీకు కచ్చితంగా తెలిసుండాల్సిన విషయం’ అంటూ గ్రంథాలయ గొప్పదనాన్ని ఒక్క వాక్యంలో వివరించారు ప్రఖ్యాత శాస్త్రవేత్త ఐన్‌స్టీన్‌. అయితే మారుతున్న కాలానికి అనుగుణంగా పుస్తకాలు కూడా సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటూ డిజిటల్‌ పుస్తకాలుగా కొత్తరూపును సంతరించుకుంటున్నాయి. ఐఐటీ ఖరగ్‌పూర్‌ సాయంతో కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వశాఖ ఈ డిజిటల్‌ లైబ్రరీని తయారుచేసింది. ఒకటో తరగతి నుంచి పీహెచ్‌డీ వరకూ అవసరమైన పుస్తకాలన్నీ రిఫరెన్స్‌ పుస్తకాలతో సహా ఈ డిజిటల్‌ లైబ్రరీలో అందుబాటులో ఉన్నాయి. అయితే వీటిని చదవాలంటే ఇంటర్నెటü సదుపాయం తప్పనిసరి. ఈ డిజిటల్‌ పుస్తకాల్లో తమకు కావల్సిన వాటిని ఎవరికివారు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు, ఆన్‌లైన్‌లోనూ చదువుకోవచ్చు. వాటికి సంబంధించిన వీడియోలూ, ఆడియోలూ పొందే అవకాశమూ ఉంది. పీడీఎఫ్‌ కాపీల ద్వారానూ భద్రపరచుకోవచ్చు. ndl.iitkgp.ac.in అనే లింక్‌పై క్లిక్‌ చేస్తే కోటి పుస్తకాలతో సిద్ధంగా ఉన్న నేషనల్‌ డిజిటల్‌ లైబ్రరీ మనముందు ప్రత్యక్షమవుతుంది.

అరచేతిలో లైబ్రరీ...
స్మార్ట్‌ఫోన్‌ అందుబాటులోకి వచ్చాక ప్రపంచమంతా అరచేతిలోకి వచ్చినట్లైంది. దీన్ని దృష్టిలో ఉంచుకునే నేషనల్‌ డిజిటల్‌ లైబ్రరీ ఆప్‌ని కూడా రూపొందించారు. దీంతో చేతిలో ఒక్క స్మార్ట్‌ఫోన్‌ ఉంటే చాలు, ఏకంగా గ్రంథాలయాన్ని మన వెేంటతీసుకెళ్లొచ్చు. పుస్తకాలు చదివినందుకుగానీ, డౌన్‌లోడ్‌ చేసుకున్నందుకుగానీ ఎలాంటి రుసుమూ చెల్లించాల్సిన అవసరం లేదు. సాధారణ గ్రంథాలయాల తరహాలో ఎలాంటి డిపాజిట్లూ కట్టాల్సిన పనీలేదు. అంతేకాదు మనకు కావల్సిన పుస్తకాన్ని వెతుక్కునేందుకు గంటలగంటల సమయాన్ని వృథా చేయాల్సిన అవసరమూ లేదు. ఆప్‌ని ఓపెన్‌చేస్తే చాలు కోరిన సమాచారాన్ని క్షణాల్లో చదువుకోవచ్చు.

పుస్తకాలేకాదు...
జానీజానీ రైమ్‌ నుంచి బిగ్‌ బ్యాంగ్‌ థిµయరీ వరకూ, ప్రముఖుల వ్యాసాల నుంచి విద్యార్థుల థీసిస్‌ వరకూ, సాధారణ విద్య నుంచి సాంకేతిక చదువుల వరకూ, చరిత్ర నుంచి తాజా పరిణామాల వరకూ, అలనాటి సాహిత్యం నుంచి ఆధునిక లిటరేచర్‌ వరకూ... ఇలా ప్రతీ అంశానికీ సంబంధించిన పుస్తకాలను డిజిటలైజ్‌ చేసి ఈ గ్రంథాలయంలో అందుబాటులో ఉంచారు. వీటితోపాటు దేశంలోని పలు విశ్వవిద్యాలయాలూ, పరిశోధన సంస్థలూ, ప్రభుత్వ విభాగాలకు సంబంధించిన పుస్తకాలనూ ఇక్కడ చదవొచ్చు. నేషనల్‌ రిసెర్చ్‌ వర్క్స్‌, దేశంలోని విద్యామండలి అనుసరిస్తున్న వివిధ నమూనాలకు సంబంధించిన పుస్తకాలనూ ఈ గ్రంథాలయంలో పొందుపరిచారు. డెబ్భైకి పైగా భాషల్లో ఈ పుస్తకాలను డిజిటలైజ్‌ చేశారు. లక్షల మంది ప్రముఖులు రాసిన సుమారు మూడు లక్షల వ్యాసాలనూ మనం డౌన్‌లోడ్‌చేసుకోవచ్చు. వివిధ భాషల్లోని ఆడియో లెక్చర్లూ, వేల సంఖ్యలో ఉపన్యాసాలూ, వెబ్‌కోర్సులకు సంబంధించిన మెటీరియల్స్‌, పలురకాల నివేదికలూ, కోర్టులు వెలువరించిన ముఖ్యమైన తీర్పులూ...ఇలా వివిధ స్థాయులవారికి అవసరమైన ప్రతీ అంశాన్నీ ఈ లైబ్రరీలో భద్రపరిచారు.

విద్యార్థులకు ప్రత్యేకం...
విద్యార్థులకూ, పోటీపరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులకూ ఈ డిజిటల్‌ లైబ్రరీ ఎంతో ఉపయోగకరం. మార్కెట్లో దొరికే వందల కొద్దీ పుస్తకాలను కొనాలంటే ఎక్కువ డబ్బుతోపాటు అధిక సమయాన్నీ వెచ్చించాల్సి ఉంటుంది. కానీ ఈ డిజిటల్‌ లైబ్రరీతో ఆ అవసరముండదు. మార్కెట్లో ఉన్న పుస్తకాలతోపాటు డిజిటల్‌ లైబ్రరీ అందించే అదనపు పుస్తకాలను లేదా సమాచారాన్ని కంప్యూటర్‌ తెరమీద చదివేయొచ్చు. పాఠ్యపుస్తకాలే కాకుండా గతంలో జరిగిన వివిధ పరీక్షలకు సంబంధించిన ప్రశ్నపత్రాలూ, వాటి సమాధానాలనూ తెలుసుకోవడానికి వీలుంటుంది.

ఇలా చదువుకోవచ్చు...
డిజిటల్‌ లైబ్రరీ నుంచి పుస్తకాలు తీసుకోవడం చాలా సులభం. ఈ-మెయిల్‌ ఐడీ, చదువుతున్న కోర్సు లేదా చదివిన కోర్సు, యూనివర్సిటీ పేరు మొదలైన వివరాలను నమోదు చేసిన తర్వాత ముందుగా ఇచ్చిన ఈ-మెయిల్‌ ఐడీకీ సంబంధిత లింక్‌ వస్తుంది. దానిమీద క్లిక్‌ చేస్తే చాలు నమోదు ప్రక్రియ పూర్తయినట్లే. ఈ మెయిల్‌ ఐడీ, పాస్‌వర్డ్‌లతో డిజిటల్‌ లైబ్రరీలో ఎప్పుడు కావాలంటే అప్పుడు లాగిన్‌ అవ్వొచ్చు. కావల్సిన పుస్తకాలు చదువుకోవచ్చు, వీడియో, ఆడియోపాఠాలూ, లెక్చర్లూ క్షణాల్లో పొందొచ్చు.


 

ఆడవాళ్లకి ఆడవాళ్లతోనే పెళ్లి..!

అక్కడ... ఆరేడు ఆవుల్ని ఇస్తే వయసురాని పిల్లల్ని కూడా కన్యాదానం చేసే తండ్రులున్నారు...గొడ్ల పాకలో ఆవుల మంద పెరగగానే భార్యల సంఖ్యను పెంచే ప్రబుద్ధులూ ఉన్నారు...కొడుకులు లేని తల్లి భర్త ఆస్తికి వారసురాలు కాదు అని చెప్పే కట్టుబాట్లూ ఉన్నాయి... మరి, అబల బతికేదెలా... దానికి సమాధానంగా పుట్టుకొచ్చిన సంప్రదాయమే మహిళ మరో మహిళను పెళ్లిచేసుకోవడం.

మామూలుగా పెళ్లి అనగానే ఎవరైనా అమ్మాయి పేరేంటీ అబ్బాయిది ఏ వూరు... లాంటి వివరాలు అడుగుతారు. కానీ టాంజానియాలోని మరా ప్రాంతంలో పెళ్లి మాట ఎత్తగానే అమ్మాయికీ అబ్బాయికీ జరిగేదా లేదంటే ఇద్దరు స్త్రీలకు మధ్య జరిగేదా... అని అడుగుతారు. ఎందుకంటే ‘న్యుంబా టొబు(ఆడవాళ్ల ఇల్లు)’ పేరుతో అక్కడ వితంతువైన మహిళ మరో యువతిని పెళ్లి చేసుకోవడం పూర్వం నుంచీ ఉన్న ఆచారం. అలా అని ఇది ఆధునిక పోకడలతో పుట్టుకొచ్చిన గే, లెస్బియన్ల తరహా సంస్కృతిలాంటిది కాదు. స్థానిక కుర్యా తెగలోని పురుషాధిక్య కట్టుబాట్లతో బతుకును కోల్పోయిన ఆడవాళ్ల ఆసరా కోసం పుట్టిన ఓ వింత సంప్రదాయం.

ఆవులకు బదులు అమ్మాయి
కుర్యా... టాంజానియా మొత్తమ్మీద ఈ తెగవాళ్లు ఏడు లక్షలమందికి పైనే ఉంటారు. వీళ్ల ప్రధాన జీవనాధారం ఆవుల్ని పెంచడం. అక్కడివారికి ఆలిని తెచ్చిపెట్టే ఆస్తి కూడా అదే. వేలం పాటలో పాడినట్లూ కన్యాశుల్కంగా ఎవరు ఎక్కువ ఆవుల్ని ఇవ్వజూపితే వారికే పిల్లను కట్టబెడతారు తండ్రులు. అందుకే, ఆవులు లేకపోతే యువకులక్కూడా పిల్ల దొరకదు. అవి ఎక్కువుంటే పళ్లూడిన ముసలాడికైనా మళ్లీ పెళ్లైపోతుంది. మరా ప్రాంతంలోని న్యామొంగొ గ్రామంలో ఉండే జుమా కూడా అలాగే పదమూడేళ్ల వయసులో ఓ యాభయ్యేళ్ల వ్యక్తికి రెండో భార్యగా వెళ్లింది. ఆమె విలువ ఎనిమిది ఆవులు. భర్త ఇంట్లో అడుగుపెట్టిన దగ్గర్నుంచీ జుమాది బానిస బతుకే. పసి వయసులోనే అతడి కోరికకు బలై ఓ మగబిడ్డకు జన్మనిచ్చింది. ఆ తర్వాతా పరిస్థితి మారలేదు. ఇక, అక్కడ ఉండలేక బిడ్డను తీసుకుని పారిపోయింది. ఎక్కడ ఉండాలో ఏం చెయ్యాలో తెలియని పరిస్థితుల్లో అండగా నిలబడతానని నమ్మబలికి మరో ఇద్దరు పిల్లలకు ఆమెను తల్లిని చేశారు ఇద్దరు మగాళ్లు. ‘ఆ తర్వాత ఇక, నేను మగాళ్లను నమ్మాలనుకోలేదు. అందుకే, ‘న్యుంబా టొబు’ పెళ్లి చేసుకోవడానికి నాకో భార్యను చూసిపెట్టమని తెలిసినవాళ్లను కోరాను. వాళ్లు యాభయ్యేళ్ల ‘ముగోసీ’ని చూపించారు. ఆమె కూడా కష్టాల్లో ఉంది. ఇద్దరం మాట్లాడుకున్నాక కలిసి బతకాలని నిర్ణయించుకున్నాం’ అంటుంది జుమా.

ముగోసీకి పిల్లలు పుట్టలేదని ఎన్నో ఏళ్లకిందట భర్త ఆమెను వదిలేసి దూరంగా వెళ్లిపోయాడు. అప్పట్నుంచీ ఒంటరిగానే వూళ్లొ తమకున్న కొంత పొలాన్నీ పండించుకుంటూ ఆవుల్ని కాస్తూ బతుకు వెళ్లదీసింది. కొన్ని నెలల కిందట ఆమె భర్త చనిపోయాడు. కుర్యా తెగ చట్టాల ప్రకారం కుటుంబానికి చెందిన ఏ ఆస్తి మీదైనా వారసత్వపు హక్కు మగవారికే ఉంటుంది. భార్యకు మగ పిల్లల్లేకపోతే ఆస్తి భర్త తరఫు బంధువులకు వెళ్లిపోతుంది. ఆ పరిస్థితే వస్తే ముగోసీ తనకున్న నాలుగు గుడిసెలనూ కొద్ది పొలాన్నీ కోల్పోయి నిలువ నీడలేకుండా అయిపోతుంది. అలా కాకూడదంటే- ఆమె మరో అమ్మాయిని పెళ్లి చేసుకోవడం ఒక్కటే మార్గం. ఆ పెళ్లితో వచ్చిన అమ్మాయి పిల్లలు ముగోసీ పిల్లలకిందే లెక్క మరి. అందుకే, జుమాకు మొదటి భర్త కట్నం కింద ఇచ్చిన ఎనిమిది ఆవుల్నీ అతడికి తిరిగిచ్చి ఆమెను పెళ్లాడింది ముగోసీ. కుర్యా తెగలో విడాకులు కావాలంటే పెళ్లి సమయంలో కట్నంగా ఇచ్చినన్ని ఆవుల్ని తిరిగివ్వాల్సిందే. ఇప్పుడు ముగోసీ, జుమా ఇద్దరూ ఒకరికి ఒకరు. ఇద్దరూ కలిసి ఇంటిపనీ వంట పనీ పొలం పనులూ చేసుకుంటారు. పిల్లల్నీ కలిసి పెంచుతారు.

ఇలాంటివారెందరో...
న్యుంబాటొబు పద్ధతి ప్రకారం పెళ్లై పిల్లలున్న అమ్మాయిల్నే కాదు, పెళ్లికాని యువతుల్ని కూడా వితంతువులు వివాహం చేసుకోవచ్చు. అయితే, ఆ యువతి నచ్చిన అబ్బాయితో సహజీవనం చేసి, తన వితంతు భార్యకు పిల్లల్ని కనివ్వాలి. ఒకవేళ ఆ అబ్బాయి వితంతు మహిళ కుటుంబంతోనే ఉండాలనుకున్నా ఉండొచ్చు.

కుర్యా తెగలో మగవాళ్లు వృద్ధులయ్యాక కూడా పెళ్లిళ్లు చేసుకుంటారు కాబట్టి, అక్కడ ఎక్కువ మంది మహిళలు వితంతువులయ్యే అవకాశం ఉంటుంది. ఇక, ఆవుల్ని తీసుకుని అమ్మాయిల్ని ఇచ్చే దురాచారం కారణంగా చాలామంది యువతులు తమకు ఇష్టంలేని వ్యక్తుల్నీ ముసలాళ్లనూ పెళ్లిచేసుకుని నానా కష్టాలూ పడుతున్నారట. అదే ‘న్యుంబా టొబు పెళ్లి చేసుకుంటే గృహ హింస ఉండదు, మనసుకు నచ్చిన వ్యక్తితోనే పిల్లల్ని కనొచ్చు’ అని యువతులు ఆవైపు మొగ్గు చూపుతున్నారట.

అందుకే, టాంజానియా మొత్తం జనాభాలో ఇలా ఆడవాళ్లు ఆడవాళ్లనే పెళ్లి చేసుకుని ఉంటున్న కుటుంబాలు పది నుంచి పదిహేను శాతం వరకూ ఉన్నాయట.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న