close
పోనీటెయిల్సూ కొనుక్కోవచ్చు..!

పోనీటెయిల్సూ కొనుక్కోవచ్చు..!

పొడవైన జుట్టు ఉండాలనీ రకరకాల పోనీలు వేసుకోవాలనీ మారుతున్న స్టైల్‌కి అనుగుణంగా వెంట్రుకలను రోజుకో రంగుతో కళకళలాడించాలనీ... ఇలా బోలెడు కలలుంటాయి అమ్మాయిలకు. కానీ కాలుష్యం, ఒత్తిడి... లాంటి కారణాల వల్ల జుట్టు వత్తుగా పెరగడమే చాలామందికి కలగా మిగిలిపోతోంది. ఇక, పొడవైన పోనీలు వేసుకోవడమూ వాటికి రంగులు పూసుకోవడమూ... ఎలా సాధ్యమవుతుందీ... ఇలా బాధపడేవారికోసమే ఇప్పుడు ‘వేవీ హార్స్‌టెయిల్‌ హెయిర్‌ ఎక్స్‌టెన్షన్స్‌’ పేరుతో చిటికెలో కట్టుకునేలా రకరకాల పోనీలు మార్కెట్లోకి వస్తున్నాయి. లేస్‌ రిబ్బన్‌కి అతికి ఉండే ఈ పోనీల్లో వేరు వేరు సైజులవీ కొంచెం గిరజాలతోనూ పూర్తిగా స్ట్రెయిట్‌గా ఉన్నవీ జుట్టుకి రకరకాల రంగులు వేసుకోవడాన్ని ఇష్టపడే వారి కోసం వర్ణాలు అద్దినవి కూడా ఉంటాయి. మనకు చిన్న పోనీ ఉన్నా చాలు, ఆ రిబ్బన్‌తో దీన్ని మన పోనీకి కట్టేయొచ్చు, స్టైల్‌ కొట్టేయొచ్చు... కాదంటారా..?

మంచం... ఒక్కటి చాలు! 

రోజంతా ఎన్నో పనులు... ఎక్కడెక్కడో తిరుగుతాం... రాత్రి మంచం మీద నడుంవాల్చితే తప్ప ఆ అలసటకు విశ్రాంతి దొరకదు. అందుకే, మంచం ఎంత సౌకర్యంగా ఉంటే మనసుకూ శరీరానికీ అంత హాయి. అందుకోసం వచ్చిందే ఈ ‘అల్టిమేట్‌ బెడ్‌ విత్‌ ఇంటిగ్రేటెడ్‌ మసాజ్‌ చెయిర్‌’. ఇది కేవలం మంచం మాత్రమే కాదు, బ్లూటూత్‌తో పనిచేసే దీన్లోని స్పీకర్‌లో ఆహ్లాదాన్ని కలిగించే పాటల్ని వినొచ్చు. ఒళ్లునొప్పులనిపిస్తే మంచంతో పాటే ఉండే మసాజ్‌ చెయిర్‌ మీద పడుకుంటే రకరకాల వైబ్రేషన్లతో అది శరీరాన్ని సేదతీరుస్తుంది. ఇక, ఉన్నట్టుండి ఏదైనా పుస్తకం చదువుకోవాలనిపిస్తే కష్టపడి పుస్తకం తీసుకోవడానికి లేచి వెళ్లక్కర్లేదు. ఈ మంచంలో బోలెడు అరలుంటాయి. అక్కడ పుస్తకాలతో పాటు మనక్కావల్సిన మందులూ ఇతర వస్తువులన్నీ పెట్టుకోవచ్చు. తల దగ్గర రీడింగ్‌ లైట్‌ ఉంటుంది కాబట్టి చదువుకోవడానిక్కావల్సిన కాంతి కూడా బాగా ఉంటుంది. అంతేనా, ల్యాప్‌టాప్‌లో పనిచేసుకునేందుకు వీలుగా మూసి, తెరిచే వీలుండే టేబుల్‌, గ్యాడ్జెట్లకు ఛార్జింగ్‌ పెట్టుకోవడానికి ప్లగ్గులు కూడా ఈ మంచానికే ఉంటాయి. మంచం కింది భాగంలోని అరలో విలువైన వస్తువులూ నగల్ని దాచుకునేందుకు ఓ లాకరూ ఉంటుంది. వీటితోపాటు, పరుపు కిందా కాళ్లు పెట్టుకునే దగ్గరా బోలెడంత సామాను పెట్టుకునేలా అరలుంటాయి. ఇంకో విషయం ఏంటంటే... మంచానికి అమర్చి ఉన్న ఈ అదనపు ఏర్పాట్లలో మనక్కావల్సిన వాటిని ఉంచుకోవచ్చు, తీసేయొచ్చు. చదువుతుంటేనే వావ్‌ అనిపిస్తోంది కదూ... ఇది అమెజాన్‌తో పాటు ఇతర ఆన్‌లైన్‌ వెబ్‌సైట్లలోనూ దొరుకుతుంది.

అందానికి ‘క్యాండీలు’

రంగు రంగుల్లో చాక్లెట్లు భలే ఉన్నాయి కదూ... వీటిని చూసి, మీరూ ఇలాగే అనుకున్నారా... అయితే, పొరబడినట్లే. ఎందుకంటే ఇవి తినే చాక్లెట్లు కాదు, గాజు చాక్లెట్లు. అందం కోసం టీపాయ్‌ పైన రకరకాల రంగు రాళ్లు పోసి ఆ పైన అద్దాన్ని అమర్చడం... టేబుల్‌ మీద గాజు పాత్రలో రంగు రంగు రాళ్లనూ చిన్నచిన్న పువ్వులూ బొమ్మల్ని అమర్చడం తెలిసిందే... అయితే, ఇప్పుడు ఆ మామూలు రంగు రాళ్లకు బదులు అలంకరణకోసం ‘మురానో గ్లాస్‌ క్యాండీస్‌’ పేరుతో ఇలా రకరకాల గాజు చాక్లెట్లు మార్కెట్లోకి వస్తున్నాయి. నోరూరించే అందమంటే ఇదేనేమో!

నడిచే అక్వేరియం!

పూసలూ రత్నాలూ పొదిగినవీ బట్టతో లెదర్‌తో చేసిన పూలు కుట్టినవీ... అమ్మాయిల చెప్పుల్లో బోలెడన్ని రకాలు. అవన్నీ ఎప్పట్నుంచో వస్తున్న డిజైన్లే. మరి, ‘ఎంతకాలమని అవే వేసుకుంటాం కాస్త కొత్తగా ప్రయత్నిద్దాం’ అని అమ్మాయిలకు అనిపించడంలో తప్పేముందీ... ఆ ఆలోచనతోనే హాలీవుడ్‌ తారల చూపు ఇప్పుడు ‘అక్వేరియం శాండల్స్‌’ మీద పడింది. చెప్పు వెనకభాగంలో హీల్‌ ఉన్నట్లే వీటికి ముందుభాగంలో కూడా గాజుతో చేసిన హీల్‌ ఉంటుంది. పారదర్శకంగా పెట్టెలా కనిపించే దీన్లో నీటిని పోసి తేలిగ్గా ఉండే ప్లాస్టిక్‌ చేపలూ, మొక్కల్లాంటివాటిని ఉంచుతారు. దాంతో ఈ చెప్పుల కిందిభాగం చూడ్డానికి అచ్చం అక్వేరియంలానే కనిపిస్తుంది. ఇక, వీటిలో టిప్‌ జార్‌ శాండల్స్‌ పేరుతో ఖాళీ హీల్‌తో ఉన్నవీ వస్తున్నాయి. వీటిలో మనమే ఎప్పటికపుడు పువ్వులూ చిన్న చిన్న బొమ్మల్లాంటివి వేసుకునే వీలుంటుంది. మీకూ కావాలంటే ఆన్‌లైన్‌ వెబ్‌సైట్లలో తెప్పించుకోవచ్చు.

ఈ షర్ట్‌ చాలా ‘హాట్‌’!

వర్షాకాలంలోనూ శీతాకాలంలోనూ చల్లటి వాతావరణంలో బయటికి అడుగుపెట్టాలంటేనే భయమేస్తుంది. కానీ ఆఫీసుకెళ్లడం, ఇంకా ఇతర ప్రయాణాలూ తప్పవు కదా... అలా అని ఎప్పుడూ స్వెటర్‌ వేసుకుని తిరగలేం. దానికి ప్రత్యామ్నాయంగా వచ్చిందే ఈ ‘పోలార్‌ సీల్‌ హీటెడ్‌ స్మార్ట్‌ టాప్‌’. చూడ్డానికి స్టైలిష్‌గా మామూలు టీషర్టులానే ఉండే ఇది ప్రత్యేకమైన టెక్నాలజీతో తయారైంది. అందుకే, చలిగా ఉన్నపుడు ఈ చొక్కా చేతులకున్న బటన్లు నొక్కి షర్టుని కావల్సినంత మేర వేడిచేసుకోవచ్చు. షర్టు లోపల అమర్చిన చిన్నసైజు రీఛార్జబుల్‌ యూఎస్‌బీ పవర్‌ బ్యాంకుతో పనిచేసే ఇది చలిగా ఉండే ప్రాంతాలకు పర్యటనలకు వెళ్లినపుడు కూడా బాగా ఉపయోగపడుతుంది.

స్క్రీన్‌ ముందూ వెనకా...

స్మార్ట్‌ఫోన్‌... ఓ గంట అది చేతిలో ఉంటే చాలు, ఎవరైనా ఆ మైకంలో పడిపోవాల్సిందే. అందుకే, దాన్లో ఎన్ని ఫీచర్లు వచ్చినా ఇంకో కొత్త ఫీచర్‌ వచ్చిందంటే మనసు అటు లాగేస్తుంటుంది. అయితే ఇన్నిరోజులూ ఆప్స్‌లోనూ, ఫోన్‌ స్క్రీన్‌ సైజూ, కెమేరా క్వాలిటీ, మెమరీ... లాంటి విషయాల్లోనే మార్పులొచ్చాయి. దీనికి మరో అడుగు ముందుకేసి చైనా కంపెనీ మెజు ఏకంగా ఫోన్‌ వెనకభాగంలో కూడా చిన్న సైజు స్క్రీన్‌ని ఏర్పాటు చేసి ‘మెజు ప్రొ 7’ పేరుతో మార్కెట్లోకి తీసుకొచ్చింది. సుమారు రెండంగుళాల సైజులో యాక్టివ్‌ మ్యాట్రిక్స్‌ ఓఎల్‌ఈడీ స్క్రీన్‌తో వచ్చే ఈ ఫోన్‌ ఉంటే సెల్ఫీలను ముందూ వెనకా ఉన్న ఏ కెమేరాలతో అయినా తీసుకోవచ్చు. వేరేవాళ్ల ఫొటోలు తీస్తున్నప్పుడు వాళ్లు కూడా వెనక ఉన్న స్క్రీన్‌లో తాము ఎలా నిలబడ్డారో చూసుకునే వీలుంటుంది. ఇక, డ్యూయల్‌ స్క్రీన్‌ ఫోన్‌ కావడంతో సమయాన్నీ నోటిఫికేషన్లనూ చూసుకునేందుకు మాటిమాటికీ పెద్ద స్క్రీన్‌ని ఆన్‌ చెయ్యనక్కర్లేదు.

అద్దంతో ఛార్జింగ్‌

ఫోన్‌, ఐపాడ్‌ లాంటి వాటిని మనం ఇంటి దగ్గరున్నప్పటి కన్నా ప్రయాణాల్లో ఎక్కువ వాడతాం. అలాంటపుడు ఛార్జింగ్‌ అయిపోయినా సమస్య లేకుండా పవర్‌ బ్యాంకుని వెంట ఉంచుకోవడం ఈమధ్య సాధారణమైపోయింది. కానీ అమ్మాయిల బ్యాగుల్లో మామూలుగానే లిప్‌స్టిక్‌, పాకెట్‌ మిర్రర్‌, దువ్వెన, బొట్టు బిళ్లలు... ఇలా బోలెడన్ని ఉంటాయి. దానికి తోడు అదనంగా పవర్‌ బ్యాంకు అంటే ఆ బరువు ఇంకాస్త పెరుగుతుంది. పైగా సర్దుకోవడానికీ ఇబ్బందే. అందుకే, మగువల కోసం ఇప్పుడు పవర్‌బ్యాంకులు చిన్నసైజు అద్దం రూపంలో వచ్చేస్తున్నాయి. ‘పర్ల్‌ కాంపాక్ట్‌ మిర్రర్‌ పవర్‌ బ్యాంక్‌’ పేరుతో రకరకాల ఆకర్షణీయమైన రంగుల్లో ఆన్‌లైన్‌ షాపింగ్‌ వెబ్‌సైట్లలో దొరుకుతున్నాయి. ఇవి అబ్బాయిలు అమ్మాయిలకు కానుకగా ఇవ్వడానికీ బాగుంటాయి. ఏమంటారు..?

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.