close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
అనుబంధాలు

అనుబంధాలు
- కె.బి.కృష్ణ

వీధిలో ప్రవేశించారు మూర్తిగారు. అన్నీ పెద్దపెద్ద మేడలే. అందరూ స్థితిమంతులేనేమో తమ కాబోయే వియ్యంకులలాగా. తనకు కావాల్సిన ఇంటి నంబరు దొరికింది. ఆటో ఆపుచేసి దిగి ఆటోవాడిని పంపించివేసి, పెద్దగేటు తీసి కాలింగ్‌బెల్‌ నొక్కారు. వీధి తలుపు టేకుతో చేసి ఉంది, కమలం మీద ఆసీనురాలై ఉన్న లక్ష్మీదేవి విగ్రహం చెక్కి ఉంది. ఆ తల్లి స్వాగతం చెబితే ఇంకేముందీ, అంతా లక్ష్మీమయమే!

‘‘అన్నయ్యగారా, రండి రండి... ఏమండోయ్‌, ఇటువచ్చి చూడండి ఎవరు వచ్చారో...’’ అంటూ మూర్తిగారి వియ్యపురాలు శ్రీలక్ష్మి తలుపు తీసింది. ఐదున్నర అడుగుల ఎత్తులో చామనఛాయకన్నా మెరుగైన ఛాయలో, లేత గులాబీ రంగు గద్వాల్‌ చీరతో, సిరిసంపదలు రూపలావణ్యాలలో నిండుకుని ఆమె చాలా కళగా ఉంది. మూర్తిగారి కాబోయే అల్లుడు కూడా అచ్చంగా తల్లిలాగే చాలా బావుంటాడు.

ఇంతలో పొందూరు ఖద్దరు పంచెలో పైన తెల్లనిచొక్కాలో వియ్యంకులు విష్ణుమూర్తిగారు వచ్చేశారు. ‘‘రండి రండి బావగారూ...’’ అంటూ మూర్తిగారి చేయి పట్టుకుని లోపలకు తీసుకువెళ్ళి హాల్లో సోఫాలో కూర్చోబెట్టారు.

హాలు, వెనుక రెండు బెడ్‌రూమ్‌లు, ఒక అతిథి గది, వంటిల్లు, పక్కనే తలుపుకు గంటలు ఉన్న పూజగది, మెట్లమీదుగా పైకి దారి అనుకుని మూర్తిగారు ఇల్లు చూస్తూంటే, ‘‘అన్నయ్యగారూ, ఆనక ఇల్లు అంతా తిరిగి చూద్దురుగాని... ముందు ఇది చెప్పండి... మా కోడలు పిల్ల ఎలా ఉంది? మా ఇల్లు ఎలా ఉందో చూసి రమ్మందా...’’ అని శ్రీలక్ష్మి నవ్వుతుంటే-

‘‘కాదమ్మా, రిటైర్‌మెంట్‌ దగ్గరపడుతోంది కదా, ఆఫీసులో కొంచెం పనులు ఉండి వచ్చాను. కానీ, ఈరోజు ఉండిపోవాల్సి వచ్చింది. సరే అని అమ్మాయిని అడిగితే మీ ఇంట్లో నిద్ర చేయమంది’’ అన్నారు మూర్తిగారు.

‘‘అయితే మా కోడలు పర్మిషన్‌ ఇచ్చేసిందన్నమాట. రండి, కాళ్ళు కడుక్కుందురు’’ అంటూ అతిథి గదిలోకి తీసుకువెళ్ళింది.

‘వినయం, మంచి, మర్యాద - మనిషికి భూషణం అంటారు. వీళ్ళ కుటుంబానికి కోడలు కావడం తన కూతురు చేసుకున్న పుణ్యం. కాదు కాదు... తాను చేసిన పూజాఫలం వలన అలాంటి కూతురు పుట్టింది. అది అదృష్టవంతురాలు’ అనుకుంటూ మూర్తిగారు కాళ్ళూ ముఖం కడుక్కుని హాల్లోకి వచ్చారు.

సమయం ఐదున్నర గంటలయింది.

వియ్యపురాలు వేడివేడి టీ పట్టుకువచ్చింది. ‘‘ఇప్పుడెందుకమ్మా... దారిలో తాగి వచ్చాను’’ అంటూనే టీ కప్పు అందుకుని సిప్‌ చేసి కళ్ళు మూసుకున్నారు తన్మయత్వంతో. చిక్కని పాలతో యాలకుల పొడి వేసి మధురంగా తయారుచేశారు టీ.

‘‘బావగారికి ఇవ్వనే లేదు’’ అన్నారు మూర్తిగారు.

‘‘ఆయన అరగంట క్రితమే తీసుకున్నారు. ఇంత వెంటనే తాగరు’’ అంది శ్రీలక్ష్మి.

‘‘టీ చాలా బావుందమ్మా, మీ మనసులాగే’’ అని మూర్తిగారు అంటూంటే నవ్వుతూ చూసింది ఆమె.

‘‘అన్నయ్యగారూ, మీ గదిలోకి వెళ్ళి స్నానం చేయండి. జపం చేసుకోడానికి పూజగదిలో ఏర్పాట్లుచేశాను’’ అంది శ్రీలక్ష్మి.

ప్రశ్నార్థకంగా చూస్తున్న మూర్తిగారిని చూస్తూ ‘‘మీరు మూడుపూటలా గాయత్రీ జపం చేసుకుంటారని తెలిసింది. మా పూజగదిలో మీరు గాయత్రీ మంత్రం గానం చేస్తే మా ఇల్లు పావనం అవుతుంది అన్నయ్యగారూ, వెళ్ళండి... జపం అయ్యాక మాట్లాడుకుందాం’’ అంది.

కాబోయే వియ్యంకుల ఆతిథ్యం చవిచూస్తూ వూపిరాడని ఆనందంలో మునిగిపోయిన మూర్తిగారు స్నానం చేసి, పూజగదిలోకి వెళ్ళి వేదమాత గాయత్రీదేవిని ఆవాహన చేసి జపం చేసుకున్నారు. ఆ ఇంటిని సదా కాపాడమనీ అలాగే వారి కాబోయే కోడలు- తన కూతురిని కూడా ఈ ఇంట్లో లక్ష్మీదేవిలా సిరిసంపదలతో, సుఖసంతోషాలతో తులతూగేలా ఆశీర్వదించమనీ, దీవించమనీ అర్ధించారు దేవిని.

మనిషి పరాయి ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ ఎలా ఉంటుందో, తన దైనందిన కార్యక్రమాలూ అలవాట్లూ కొనసాగుతాయో లేక ఇబ్బందిగా ఉంటుందోననే ఆందోళన ఉండటం సహజం. కానీ తన కాబోయే వియ్యంకుల వారింట్లో తనకు ఆతిధ్యమిస్తున్న తీరు, ముఖ్యంగా తన అలవాట్లు వారు గ్రహించడం సంతోషంగా ఉంది మూర్తిగారికి.

సుమారు మూడు నెలలు అయి ఉంటుందేమో... వీరి అబ్బాయి ఐ.బి.ఎం. కంపెనీలో పెద్ద ఉద్యోగంలో ఉన్నాడు. అతనికి వధువు కావాలని వెబ్‌లో ప్రకటించారు. డబ్బు సంపాదనలో పరుగులు పెట్టడం, జీవితంలో ముఖ్యమైన ఆనందానుభూతులకు దూరమైపోవడం లాంటి యాంత్రిక జీవనం అంటే అబ్బాయికి ఇష్టంలేదనీ ఇంటిపట్టున ఉండే అమ్మాయి ఇల్లాలుగా కావాలనీ ప్రకటించారు. అచ్చంగా అతని అభిరుచులకు అనుగుణంగా తన కూతురు హేమ, తమ వూరిలో ఉన్న డిగ్రీ కాలేజీలో డిగ్రీ పూర్తిచేశాక, ‘నాన్నగారూ నాకు ఇక కాలేజీకి వెళ్ళడం ఇష్టంలేదు, పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ దూరవిద్యలో చేస్తాను’ అని, ఇంటిపట్టునే ఉండి ఎం.ఏ. చదివింది. తనకు గృహిణిగా ఉండాలని ఉందనీ, అందుకని అలాంటి ఆలోచనలే ఉన్న అబ్బాయిని చూడమనీ చెప్పింది. మేడ్‌ ఫర్‌ ఈచ్‌ అదర్‌లాగా భలే అమిరారు ఇద్దరూ అనుకుని, మేరేజ్‌ డాట్‌కామ్‌లో సంప్రదించారు మూర్తిగారు. అంతే! వియ్యంకుడూ వియ్యపురాలూ రెండోరోజే అబ్బాయితో వచ్చేశారు. ‘అందరం హాల్లో సోఫాలలో కూర్చుందాం. అమ్మాయిని కూడా మనతోనే కూర్చోమనండి. మనందరం పిచ్చాపాటీ మాట్లాడుకుంటూంటే వాళ్ళిద్దరూ ఒకర్ని ఒకరు చూసుకుంటారు’ అన్నారు వియ్యంకుడు. ‘అలాగే’ అన్నారు మూర్తిగారు. హేమ అసలే పచ్చని మేనిఛాయలో మెరిసిపోతూంటుంది. దానికితోడు గులాబిరంగు మైసూర్‌సిల్క్‌ చీర మీద నేవీబ్లూ కలర్‌ జాకెట్టూ మెడలో సన్నని బంగారు గొలుసుతో బాపుబొమ్మలా వచ్చింది.

అందాలబొమ్మలా ఉన్న హేమను అందరూ కళ్ళార్పక చూస్తుంటే మూర్తిగారి భుజాలు గర్వంతో ఎగిసిపడ్డాయి. కొన్ని క్షణాల మౌనం తరువాత...

‘నాన్నగారూ, క్షమించండి. నేను వారితో విడిగా మాట్లాడవచ్చునా?’ అంది హేమ. సామాన్యంగా ఈ మాటలు అబ్బాయి చెప్తాడు అన్ని పెళ్ళిచూపుల్లోనూ. కానీ ఇదేమిటి ఈ పిల్ల... అనుకుంటున్న మూర్తిగారివైపు చూసి ‘నాన్నగారూ, ఆయన నాతో మాట్లాడతానంటారేమో నా అభిప్రాయాలూ భావాలూ పంచుకోవాలనుకున్నాను. కానీ, ఎవరూ మాట్లాడటం లేదు. అందుకని...’ అన్న హేమ మాటలు పూర్తికాకుండానే ‘అబ్బాయ్‌ వెళ్ళు, మాట్లాడు అమ్మాయితో. పెళ్ళికి ముందే ఒకరి భావాలు మరొకరు తెలుసుకుని పరస్పరం అర్థంచేసుకుంటే తరవాత వైవాహిక జీవితం స్వర్గధామం అవుతుంది’ అన్నారు వియ్యంకులవారు. అమ్మయ్య అనుకున్నారు మూర్తిగారు.

ఇద్దర్నీ మూర్తిగారి బెడ్‌రూమ్‌లోకి పంపించారు. వాళ్ళు లోపలకి వెళ్ళాక, మూర్తిగారు కిటికీ కర్టెన్‌ చాటున నిలబడ్డారు- తన కూతురు ఏం మాట్లాడుతుందో అనే భయంతో విందామని.

‘నేను మీకు నచ్చానా?’ అన్నాడు అబ్బాయి.

‘......’ అమ్మాయి మౌనంగా ఉండిపోయింది.

‘ఏదో మాట్లాడాలన్నారు?’ అన్నాడు.

వెంటనే అమ్మాయి ‘‘చూడండీ, నా మనసులోని మాటలు చెబుతాను. మీకు నచ్చకపోతే పెళ్ళిపీటలదాకా వెళ్ళకుండా ఈ సమావేశంతోనే మనం ఆగిపోదాం.

సామాన్యంగా ప్రతీ కుటుంబంలోనూ అబ్బాయి పెళ్ళి అయి కోడలు కాపురానికి వచ్చాక ‘మా అబ్బాయికి కోడలు ఏదో మందు పెట్టింది, దాని చెంగుపట్టుకునే తిరుగుతున్నాడు, అస్సలు మమ్మల్ని పట్టించుకోవడంలేద’ని, అత్తింటివారు- ముఖ్యంగా అబ్బాయి తల్లి ఆవేదన చెందుతుంటుంది.

అలాగే పెళ్ళి తరువాత అబ్బాయి అమ్మాయితో ‘ఇదిగో చూడూ, ఇకనుంచీ నువ్వూ నేనూ ఒక ప్రపంచం... నువ్వు అస్తమానూ ‘మా అమ్మా నాన్నా మా ఇల్లూ’ అనకూడదు. ఇక వాళ్ళనీ ఆ వాతావరణాన్నీ మర్చిపోవాలి. పండగకో పబ్బానికో- అదీ వీలుకుదిరితే వెళ్తాం, అంతే’ అంటుంటాడు. మన ఇద్దరిమధ్యనా ఇటువంటి మాటలు వద్దు.

నేను మీ అమ్మానాన్నలను నా కన్న తల్లిదండ్రులతో సమానంగా చూసుకుంటాను. అలాగే మీరు కూడా మా అమ్మానాన్నలను మీ ఆత్మీయులుగా చూడాలి. మన ఇద్దరి మధ్యనా మీవాళ్ళు మావాళ్ళు అనేమాట ఉండనే కూడదు.

నాకు పెద్ద చదువు చదువుకుని ఉద్యోగంలో చేరి పెద్ద జీతం తెచ్చుకుంటూ విపరీతంగా డబ్బు సంపాదించాలనే కోరికతో కుటుంబ జీవితాన్ని కోల్పోవడం ఇష్టంలేదు. పవిత్రమైన వివాహబంధాన్నీ, దాంపత్య జీవితాన్నీ సంపూర్ణంగా ఆస్వాదించాలన్నది నా కోరిక.

నాకు మా అమ్మానాన్నలను వదిలి ఉండటం అలవాటు లేదు. కొంతకాలం వరకూ కాస్త బెంగగా ఉంటుంది కాబట్టి వీలుకుదిరినప్పుడల్లా మనం వచ్చి ఇద్దరి అమ్మానాన్నల దగ్గరా వారం రోజులు చొప్పున ఉండి వెళ్దాం.

చివరగా, మన వివాహం అయ్యాక మీరే నేను, నేనే మీరు...అంతే! నా ఇష్టాయిష్టాలూ, అభిప్రాయాలూ అన్నీ మీకు చెబుతాను, మీరూ నాకు అలాగే చెప్పాలి. మన ఇద్దరిమధ్యనా మూడో మనిషి ప్రమేయం వద్దు. ఏమంటారు? ఇక మీ అభిప్రాయాలు చెప్పండి మరి’ అంది హేమ.

వెంటనే క్షణం ఆలస్యం చేయకుండా అబ్బాయి ‘నేను చెప్పేది ఏమీలేదు, అంతా మీరే చెప్పేశారు. మీలాంటి అమ్మాయి నాకు తోడు దొరకడం నా అదృష్టం’ అన్నాడు మాస్టారి దగ్గర విద్యార్థి పాఠం అప్పచెప్పినట్లు. హేమ మాటలూ భావాలూ నిక్కచ్చిగా ఉన్నాయి. మూర్తిగారి మనసూ శరీరమూ ఉప్పొంగిపోయాయి. చడీచప్పుడూ చేయకుండా వచ్చి హాల్లో అందరిమధ్యనా కూర్చుండిపోయారు.

అబ్బాయి తన తల్లిదండ్రులను చూసి కళ్ళతో ఏం చెప్పాడోగానీ ‘బావగారూ మాకు కట్నకానుకలేమీ వద్దు. అమ్మాయికి అబ్బాయి నచ్చితే ఇప్పుడే తాంబూలాలు పుచ్చేసుకుందాం. మంచి పని అనుకున్నప్పుడు తక్షణం చేసేయాలంటారు పెద్దలు’ అన్నారు. అమ్మాయి కూడా సరేననడంతో తాంబూలాలు ఇచ్చిపుచ్చుకున్నారు.

ఇక ముహూర్తాలు పెట్టుకోవాలి. ఈలోగా ఇలా వియ్యంకుల వారింటికి రావాల్సివచ్చింది.

మూర్తిగారు జపం ముగించుకుని హాల్లోకి వచ్చారు. ‘‘రండి అన్నయ్యగారూ, భోజనానికి పదండి. మీకు ఇష్టమని బంగాళాదుంపల వేపుడు, మామిడికొబ్బరి పచ్చడి, టొమాటో రసం చేశాను’’ అంది శ్రీలక్ష్మి.

‘‘అవునా!’’ అంటూ ఆశ్చర్యపోవడం మూర్తిగారి వంతయింది.

భోజనం చేసేముందు ‘‘అన్నయ్యగారూ, షుగర్‌ టాబ్లెట్స్‌ వేసుకోండి, మర్చిపోతారు కబుర్లలో పడి’’ అని గ్లాసుతో నీళ్ళు ఇచ్చింది శ్రీలక్ష్మి.

డైనింగ్‌ టేబుల్‌ మీద పళ్ళెం పక్కనే వెండి చెంబుతో మంచినీళ్ళు, మెత్తని ఉప్పువేసిన గిన్నె పెట్టారు. కొసరి కొసరి వడ్డించారు. ‘తమ ఇంట్లోలాగానే కంచం పక్కనే చెంబుతో నీళ్ళు, తాను భోజనంలో అన్ని పదార్థాలలో వేసుకునే మెత్తని ఉప్పు... ఇవన్నీ ఆమె ఎలా తెలుసుకుంది? ఇంత తక్కువ కాలంలో ఎదుటి మనుషుల అలవాట్లు ఎలా తెలుసుకుంటారు? నిజంగా తన కూతురు ఎంతో అదృష్టవంతురాలు.

‘నాన్నగారూ, మన తల్లి వేదమాత గాయత్రీ దేవి మనకు పెద్దదిక్కు, తోడూనీడానూ- మన కుటుంబాన్ని చల్లగా చూస్తుంది. మనకు ఏ లోటూ ఉండదు నాన్నగారూ’ అంటూంటుంది తన కూతురు. ఇటువంటి సహృదయులైన అత్తమామల్ని దైవమే ప్రసాదించాడేమో’ అనుకున్నారు మూర్తిగారు.

భోజనాలయ్యాక కొంచెంసేపు కబుర్లు చెప్పుకున్నాక అతిథి గదిలోకి వెళ్ళారు మూర్తిగారు. బెడ్‌మీద గులాబీ పూల డిజైన్‌ ఉన్న పలుచని పూలదుప్పటి పరిచి ఉంది. తలవైపు రాగిచెంబుతో మంచినీళ్ళు, అలారం టైమ్‌పీస్‌... ఇవన్నీ తన బెడ్‌ దగ్గర రోజూ పెట్టుకునేవే. తన కూతురూ అల్లుడి దాంపత్యాన్నీ వారి ఆనంద క్షణాలనూ కలల్లో పరికిస్తూ హాయిగా నిద్రపోయారు మూర్తిగారు. తెల్లవారి బ్రష్‌ చేసుకోగానే వియ్యపురాలు గ్లాసుడు వేడినీళ్ళు పట్టుకొచ్చి ఇచ్చి ‘‘తాగండి అన్నయ్యగారూ’’ అంది. అవును, ఇంటి దగ్గర తను బ్రష్‌ చేసుకోగానే వేడినీళ్ళు తాగుతాడు కదా.

స్నానం, జపం అయ్యాక వేడివేడి ఇడ్లీ, కొబ్బరిచట్నీ, అల్లంచట్నీ, నెయ్యీ కారంపొడితో టేబుల్‌ మీద అమర్చారు. కొసరికొసరి వడ్డించి కడుపు నిండేవరకూ టిఫిన్‌లా కాకుండా భోజనంలా వడ్డించారు దంపతులు. అన్నీ తనకు కావాల్సిన రీతిలో ఏర్పాటుచేస్తున్న వియ్యపురాలి అభిమానానికీ శ్రద్ధకీ ఆనందాశ్చర్యాలు కలిగాయి మూర్తిగారికి.

‘‘అన్నయ్యగారూ, పెళ్ళిచూపులనాడు మీ అమ్మాయి మనసులో ఏదీ దాచుకోకుండా నిర్మొహమాటంగా తన అభిప్రాయాలూ ఆశయాలూ చెప్పిందట, మా అబ్బాయి ఎంత సంతోషించాడో చెప్పలేను. ‘అమ్మా, ఈ అమ్మాయి నాకోసమే పుట్టింది’ అన్నాడు’’ అని ఆమె అంటోంటే మూర్తిగారు కొంచెం ఇబ్బందిపడ్డారు.

‘‘అమ్మా, చిన్నపిల్ల... లోకానుభవం లేదు. జీవితం మీద ఒక అవగాహన లేదు. బయట ప్రపంచం తెలీదు. అది ఏమయినా తప్పుగా మాట్లాడితే మన్నించండి’’ అంటున్న ఆయనతో-

‘‘తప్పు తప్పు మీరు అలా అనవద్దు. పండంటి సంసార జీవితానికి పెళ్ళికి ముందు అమ్మాయీ, అబ్బాయీ మనసువిప్పి సరిగ్గా అలానే మాట్లాడుకోవాలి. మాకు ఎంతగానో నచ్చింది’’ అని చెప్పింది ఆమె.

‘‘అమ్మా నిన్న సాయంత్రం నుండీ ఈ ఉదయం టిఫిన్‌ వరకూ నాకు ఏం కావాలో, నేను ఎలా కోరుకుంటానో, నా రోజువారీ అలవాట్లు ఏమిటో అచ్చంగా అలాగే అన్నీ ఏర్పాటు చేశావమ్మా. నిజంగా నాకు చెల్లెలు ఉంటే అన్నయ్యని ఎలా చూసుకునేదో అచ్చంగా అలానే చూసుకున్నావు తల్లీ. ఇప్పటినుండీ నిన్ను చెల్లాయ్‌ అని పిలుస్తాను. మర్యాదగా వియ్యపురాలుగా పిలిచి నిన్ను దూరం చేయడానికి నా మనసు అంగీకరించడం లేదు. నిజంగా మీరిద్దరూ ఆదిదంపతుల్లా ప్రవర్తించారమ్మా’’ అంటూ వారి దగ్గర మూర్తిగారు సెలవు తీసుకుంటూంటే-

‘‘అన్నయ్యగారూ, నన్ను చెల్లాయి అని పిలిస్తే నాకూ చాలా సంతోషం. ఇకపోతే, మిమ్మల్ని ఇలా సంతోషపెట్టడానికి అసలు కారణం ఎవరో మీకు తెలుసునా? మీ అమ్మాయే- కాదు కాదు... మా కోడలు. మీరు ఇలా మా ఇంటికి వచ్చేముందు మీ అమ్మాయి ఫోన్‌ చేసింది. మీకు ఏ సమయంలో ఏం కావాలో, ఏమి ఇష్టమో, మీ అలవాట్లు వగైరాలన్నీ వివరంగా చెప్పి, ‘నాన్నగారికి మొహమాటం ఎక్కువ, ఏదీ కావాలని అడగరు అత్తయ్యగారూ... జాగ్రత్తగా చూసుకోండి’ అని చెప్పిందండీ. ఈరోజు తండ్రిపట్ల ఇంత బాధ్యతగా ఉండే అమ్మాయి రేపు అత్తమామల పట్లా అంతే బాధ్యతగా ఉంటుంది. నిజంగా అలాంటి అమ్మాయిని కని, పెంచి, విద్యాబుద్ధులు చెప్పించి, సభ్యతా సంస్కారం ఆభరణంలా తొడిగి, మాకు కోడలిగా బహుమతిగా ఇస్తున్నందుకు మిమ్మల్ని ఏమని కొనియాడాలో బోధపడటం లేదు’’ అంటున్న శ్రీలక్ష్మిని ఆనందాతిరేకంతో చూస్తూ ‘‘అవునమ్మా, మా హేమ పెళ్ళై వేరే ఇంటికి వెళ్ళిపోతే ఎలాగా అని ఎప్పుడూ దిగులుగా ఉంటుంది మాకు - ముఖ్యంగా నాకు...’’ అన్నారు మూర్తిగారు.

‘‘బావగారూ, మీకు ఈ సందర్భంలో ఇంకో మాట చెప్పాలి. తన కాబోయే అత్తగారికి నడుము నొప్పి అని మాటల్లో తెలుసుకుని, తన పాకెట్‌ మనీతో బెల్ట్‌ కొని కొరియర్స్‌లో పంపించిందండీ మీ అమ్మాయి, నేను పాత సినిమాలు బాగా చూస్తానని ఆ సీడీలన్నీ తెప్పించింది. నాల్రోజులకోసారి ఫోన్‌ చేసి మాకు ఇష్టమైన వంటలేమిటో, ఇంకా ఇతర ఇష్టాయిష్టాలూ అలవాట్లూ ఏమిటో ఆరా తీస్తూ ఉంటుంది. వాళ్ళ అత్తయ్య ఏ రోజైనా మామిడికాయ పప్పు చేశానని చెబితే ‘అప్పడాలూ, ఉప్పు మిరపకాయలూ వేయించడం మరచిపోకండి, మామయ్యగారికి ఇష్టం కదా’ అని చెబుతుందట. కొద్దికాలం పరిచయంలో ఇంతటి బంధాన్ని పెనవేసుకున్న మా కాబోయే కోడలు ఎంతగానో నచ్చేసింది మాకు. ఒకరి అభిరుచులను ఒకరు గుర్తుంచుకోవడం వంటివి మనుషుల మధ్య అనుబంధాలను ఎంతో గట్టిపరుస్తాయి బావగారూ’’ అంటున్నారు వియ్యంకుడుగారు.

జేబు రుమాలుతో తడికళ్ళు అద్దుకుంటున్న మూర్తిగారిని చూస్తూ ‘‘బావగారూ, ఏమిటది?’’ అని విష్ణుమూర్తిగారు అంటోంటే-

‘‘ఏంలేదు బావగారూ, కళ్లల్లో నలక పడింది’’ అన్నారు మూర్తిగారు.

అందుకు ఆయన ‘‘కాదు కాదు...మీ అమ్మాయి గుర్తుకువచ్చింది కదూ’’ అంటూ ఛలోక్తి విసిరి ‘‘పదండి బావగారూ, మిమ్మల్ని బస్టాండ్‌ దాకా దింపుతాను’’ అంటూ కారు తీశారు.

తమకు తొలి సంతానం హేమ పుట్టింది. అయ్యో ఆడపిల్ల పుట్టిందే అని కొందరు నిరాశపరిస్తే, లక్ష్మీదేవి పుట్టింది మీ ఇంట్లో అన్నారు ఇంకొందరు. చిన్నతనంనుండీ తనకు అమ్మ లేదు, తన తల్లి, కూతురి రూపంలో తన ఇంట జన్మించిందని మూర్తిగారు ఆనందపడ్డారు. ఆడపిల్ల అంటే అమ్మానాన్నలకు జీవితమంతా టెన్షనే అంటారుకానీ, ఆమె పదిమంది మగపిల్లలతో సమానం అని చాలామందికి తెలియదు. తన కూతురికి వివాహమయ్యాక ఒక తండ్రి ‘అమ్మా, నువ్వు ఎవరిని ఎక్కువగా ప్రేమిస్తావు- నన్నా, నీ భర్తనా?’ అని అడిగారట. దానికి సమాధానంగా ఆ అమ్మాయి ‘నాన్నగారూ, మిమ్మల్ని చూడగానే నేను నా భర్తతో సహా సర్వం మరిచిపోతాను. కానీ, చిత్రమేమిటంటే నా భర్తను చూడగానే నాన్నగారు గుర్తుకువస్తారు నాకు’ అందిట. కూతురు చిన్నప్పుడు ఆమె ఆపకుండా మాట్లాడేస్తుంటే, ‘ఒక్క క్షణం కూడా మాట్లాడకుండా ఉండలేవా’ అంటారు కానీ, ఎప్పుడైనా ఆమె కాసేపు మౌనంగా ఉంటే ‘ఏమిటీ, ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది, అమ్మాయికి ఒంట్లో బాగాలేదా?’ అని తల్లిని అడుగుతుంటారు తండ్రులు. కన్నకూతురు గలగలా మాట్లాడుతుంటే ఆమె మాటలను సంగీతంలా ఆనందించే తల్లిదండ్రులు చాలా మంది ఉంటారు. తన కూతురు భార్యగా, తల్లిగా, అత్తగారుగా, ఎన్నో పాత్రలు పోషించబోతోందని తెలిసికూడా, తన కూతురు చిన్న పాపాయి అనీ తన సొంతం అనీ తండ్రి అనుకోవడం చిత్రంగా ఉంటుంది. తండ్రీకూతుళ్ళ అనుబంధం అపూర్వం, అద్వితీయం. బయట నుండి ఇంట్లో అడుగుపెట్టగానే ‘అమ్మాయి ఏదీ’ అని తండ్రి అడగటం, ‘ఎక్కడకు వెళ్తుందీ, మీ అమ్మాయి ఇంట్లోనే ఉంది... నా బుర్ర తినేస్తూ’ అని తల్లులు అంటూండటం పరిపాటే. కూతురు అంటే తల్లిదండ్రుల పాలిట అంతులేని మమకారాల పందిరి.

మూర్తిగారు మనసునిండా ఆక్రమించేసుకున్న కూతురి ఆలోచనలతోనే బస్‌ దిగిపోవడం, ఆటో ఎక్కి ఇంటికి వచ్చేయడం కూడా జరిగిపోయింది. ఇంట్లో అడుగుపెడుతూనే ‘‘ఏమోయ్‌ ఎక్కడున్నావ్‌... హేమ ఏదీ, ఎక్కడికి వెళ్ళింది?’’ అన్నారు.

‘‘మీ అమ్మాయిని ఎవరూ ఎత్తుకుపోలేదులెండి. ఇంకా లగ్నాలు పెట్టుకోలేదుగా, అప్పుడైతే అల్లుడికి అప్పచెప్పాలి మరి’’ అంది భర్తవైపు నవ్వుతూ చూస్తూ.

‘‘వాణీ, మా అమ్మ చనిపోలేదోయ్‌. మన ఇంట్లోనే, మన హేమ రూపంలో బతికే ఉంది’’ అన్నారాయన కళ్ళు చెమ్మగిల్లుతుంటే.

‘‘మీరు మరీ అలా అమ్మాయిమీద పిచ్చిప్రేమ పెంచుకోకండి, తర్వాత తర్వాత ఇబ్బందిగా ఉంటుంది’’ అంటూన్న ఆమె నోటికి తన అరచేయి అడ్డంపెట్టి మూర్తిగారు-

‘‘మన వియ్యంకుడి గారింట్లో ఏం జరిగిందో తెలుసా!?’’ అంటూ అక్కడ జరిగిన విషయాలన్నీ చెప్పగానే- తల్లి అపరిమితానందంతో

‘‘మన హేమ బంగారుతల్లి అండీ. నాకు మళ్ళీ కాన్పు ప్రమాదం అని డాక్టరు చెప్పినప్పుడు అబ్బాయిని కనే యోగం లేదని బాధపడ్డాను. కానీ, మన అమ్మాయి- అబ్బాయి లేనిలోటును కూడా తీర్చేస్తుందని ఎంతో తృప్తిగా ఉందండీ. తనకు పెళ్ళయి వెళ్ళిపోతానని దిగులుపడవద్దనీ, తరచూ భర్తతో కలసి వస్తుంటాననీ అస్తమానూ నన్ను ఓదారుస్తూందండీ పిచ్చితల్లి’’ అని తడి కళ్ళను చీరకొంగుతో అద్దుకుంటూ చెప్పింది.

నిజం. ఆడపిల్లలు అమ్మకు ప్రతిరూపాలు. వారు పంచే అనురాగం, పెంచుకునే అనుబంధం జీవితాన్ని ప్రేమమయం చేస్తాయి. రేపటిమీద ఆశను కల్పిస్తాయి.

తన వియ్యంకుడూ వియ్యపురాలూ చెప్పినట్లుగా హేమ పెళ్ళి అయ్యాక అమ్మాయీ అల్లుడూ వాళ్ళ ఉద్యోగ స్థానాన్నుండి వారింటికి వచ్చినప్పుడల్లా తానూ, తన భార్యా అక్కడికి వెళ్ళిపోతారు. కొన్నిసార్లు అందరూ ఇక్కడికే వచ్చేస్తారు. అలా అయితే అల్లుడి తల్లిదండ్రులకూ, తమకూ కూడా బెంగ ఉండదు. వాళ్ళకో బిడ్డ పుడితే, అప్పుడు... మూర్తిగారిలో ఏవేవో ఆలోచనలు... కోరికలు... కలలు... పట్టలేని ఆనందంతో తేలిపోతున్నారాయన.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.