close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
యూట్యూబ్‌..ఓ పాఠశాల!

యూట్యూబ్‌..ఓ పాఠశాల! 

యూట్యూబ్‌ అంటే కామెడీ వీడియోలూ, సినిమాలూ, పాటలూ... వీటికే పరిమితం అనుకుంటారు. కానీ కాస్త లోతుకి వెళ్లి చూడండి... అదో విజ్ఞాన భాండాగారం, ఎన్‌సైక్లోపీడియా, ఆన్‌లైన్‌ క్లాస్‌రూమ్‌. ఇంకా సందేహమా, అయితే ఈ యూట్యూబ్‌ ఛానెళ్లని ఓసారి వీక్షించండి!

కొందరికి సైన్స్‌ అంశాలపైన ఉన్న అవగాహన ఆర్ట్స్‌ సబ్జెక్టులపైన ఉండదు. మరికొందరి పరిస్థితి దీనికి పూర్తి భిన్నం. కానీ అందరికీ అన్ని విషయాలూ తెలుసుకొని తమ విజ్ఞాన పరిధిని పెంచుకోవాలని ఉంటుంది. అలాంటివారికి సరిపోయే యూట్యూబ్‌ ఛానల్‌ crashcourse. దీన్ని నిర్వహిస్తున్నది జాన్‌ గ్రీన్‌, హ్యాంక్‌ గ్రీన్‌ అనే సోదరులు. చరిత్ర, ఆంగ్ల సాహిత్యం, ఆర్థికశాస్త్రం... మొదలైన ఆర్ట్స్‌ అంశాల్ని జాన్‌ వివరిస్తే, భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, జీవశాస్త్రం లాంటి సైన్స్‌ అంశాల్ని హ్యాంక్‌ వివరిస్తాడు. దాదాపు 10 నిమిషాలు నిడివి ఉండే ఈ వీడియోల్లో ఆయా సబ్జెక్టుల్ని వివరిస్తూ బుల్లెట్‌ పాయింట్స్‌ లాంటివి చెబుతారు. ఇవి విద్యార్థులకే కాదు, టీచర్లకీ ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. వీరే పిల్లలకు ప్రత్యేకమైన ‘క్రాష్‌ కోర్స్‌ కిడ్స్‌’, ‘వ్లాగ్‌బ్రదర్స్‌’ ఛానళ్లనీ నిర్వహిస్తున్నారు.

 

ప్రశ్నలూ- జవాబులు
‘క్యూరియాసిటీ కిల్డ్‌ ద క్యాట్‌’ అనేది ఆంగ్ల సామెత... ‘క్యూరియాసిటీ మేక్స్‌ యు స్మార్టర్‌’ అనేది curiosity.com ట్యాగ్‌లైన్‌. నిజమే కదా, తెలుసుకోవాలన్న తపన ఉండాలే కానీ, ప్రపంచంలో తెలుసుకోవాల్సిన వింత విషయాలు బోలెడన్ని! వాటి వెనక దాగి ఉన్న సైన్స్‌ని తెలిపే వెబ్‌సైట్‌ ఇది. వీరి యూట్యూబ్‌ ఛానల్‌ ‘క్యూరియాసిటీ’. మానవ శరీర నిర్మాణం, విశ్వం, చరిత్ర, భౌగోళిక అంశాలూ, వ్యక్తిత్వ వికాసం, సాంకేతిక ఉత్పత్తులు... ఇలా అన్ని విభాగాలకు సంబంధించిన అంశాల్నీ ఈ వెబ్‌సైట్లో తెలుసుకోవచ్చు. వాటిని వివరించేందుకు వేల సంఖ్యలో వీడియోలూ, ఫొటోలతో కథనాలు ఉంటాయి. దీన్ని ప్రారంభించింది ‘డిస్కవరీ’ సంస్థ. పిల్లలకే కాదు పెద్దలకూ ఆసక్తిగొలిపే అంశాల్ని ఈ వెబ్‌సైట్లో చూడొచ్చు. ‘బబుల్‌గమ్‌ని ఎలా తయారుచేస్తారు?’, ‘గోల్డెన్‌ బ్లడ్‌గ్రూప్‌ అంటే ఏంటి?’, ‘ఐన్‌స్టీన్‌ చేతిరాత ఆయన గురించి ఏం చెబుతుంది?’ ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు జవాబుల్ని ఈ వెబ్‌సైట్లో చూడొచ్చు.

క్లుప్తంగా చెప్పేస్తారు!
నేరుగా చూడలేని సైన్స్‌ అంశాల్ని అర్థం చేసుకోవడం ఎవరికైనా చాలా కష్టం. కానీ సాంకేతికత అందుబాటులోకి రావడంతో ఇప్పుడా పరిస్థితిలో చాలా మార్పు వచ్చింది. వూహకు అందని క్లిష్టమైన అంశాల్ని కూడా యానిమేషన్‌ వీడియోలద్వారా ఎంతో సులభంగా అర్థమయ్యేలా చెప్పగలుగుతున్నారు. యూట్యూబ్‌ ఛానల్‌ kurzgesagt కూడా ఈ మార్గాన్నే ఎంచుకుంది. జర్మనీలో కుర్జ్‌గిసాక్డ్‌ అంటే ‘క్లుప్తంగా’ అని. ఈ ఛానెల్‌లో ఎంతటి క్లిష్టమైన అంశాన్నైనా చాలా తేలికైన భాషలో వీడియోల సాయంతో క్లుప్తంగా వివరిస్తారు. ‘మానవజాతి ఎలా అంతరించవచ్చు’, ‘రోబోల విప్లవం వస్తే మన జీవనశైలి ఎలా మారుతుంది’, ‘డిజైనర్‌ బేబీస్‌’, ‘అణు విద్యుత్‌’, ‘చరిత్రకు పూర్వం మానవ మనుగడ’... మొదలైన అంశాల్ని రెండు నుంచి ఏడు నిమిషాల నిడివి ఉండే వీడియోల్లో చూపారు. ఈ వెబ్‌సైట్లో వీడియోలు నెలకు ఒకటి రెండు మాత్రమే వస్తాయి. దాన్నిబట్టి చెప్పొచ్చు వీరు ఎంచుకునే అంశాలు ఎంత క్లిష్టమైనవో, వీరి వీడియోలు ఎంత నాణ్యమైనవో!

విశాస్‌...
ఈ ప్రపంచంలో మీకు అర్థంకాని విషయం ఏదైనా ఉందంటే అది అర్థమయ్యేట్టు వివరించే వీడియో ఇప్పటికే vsauce లో ఉండే ఉంటుంది. ఎందుకంటే ఈ ఛానెల్‌లో ఉండేవి ప్రధానంగా అలాంటి అంశాలే. ఈ అంశాల్ని ఈ ఛానల్‌ వ్యవస్థాపకుడు మైఖేల్‌ స్టీవెన్స్‌ ఎంతో వివరంగా చెబుతాడు. మెదడుపైన అల్జీమర్స్‌ చూపించే ప్రభావం, అంగారకుడిమీద మనం నివసించగలమా, భూమ్మీద అత్యంత భయానక ప్రదేశం ఎక్కడ ఉంది, భూభ్రమణానికి కారణం... మొదలైన ఎన్నో క్లిష్టమైన అంశాల్ని విశాస్‌లో స్టీవెన్స్‌ మాటల ద్వారా సులభంగా అర్థం చేసుకోవచ్చు. విశాస్‌2, విశాస్‌3 ఛానళ్లు కూడా ఉన్నాయి. వీటిని అతడి స్నేహితులు నిర్వహిస్తున్నారు.

సినిమా అభిమానులకు...
స్టీవెన్‌ స్పీల్‌బర్గ్‌ సినిమా తీసే విధానంలోని ప్రత్యేకత, జాకీచాన్‌ యాక్షన్‌లో కామెడీ పండించగలగడం వెనుక రహస్యం, హిచ్‌కాక్‌ సీన్‌ తీసే నేర్పు... వీటి గురించి తెలుసుకోవాలంటే... ‘ఎవ్రీ ఫ్రేమ్‌ ఏ పెయింటింగ్‌’ యూట్యూబ్‌ ఛానల్‌కు వెళ్లండి. అక్కడ ఒక్క స్పీల్‌బర్గ్‌ చిత్రీకరణ విధానమే కాదు, ప్రపంచంలోని పలువురు ప్రముఖ దర్శకుల విధానాల గురించి ఈ ఛానల్‌ నిర్వహకుడు టోనీ జౌ వివరిస్తాడు. టోనీ కెనడాకు చెందిన సినిమా దర్శకుడు, ఎడిటర్‌. ఈ ఛానల్‌లో వీడియోల నిడివి పది నిమిషాలలోపే ఉంటుంది. ఏదైనా సినిమాలో ఒక సీన్‌ని ఎంపికచేసి దాన్లోని సైన్స్‌, భావోద్వేగాలు, ట్రిక్‌ల గురించి వివరిస్తారు టోనీ. ఔత్సాహిక సినిమా దర్శకులూ, సినిమా అభిమానులూ ఈ ఛానల్‌ నుంచి ఎన్నో పాఠాలు నేర్చుకోవచ్చు!
అందుకే యూట్యూబ్‌ ఒక ఆన్‌లైన్‌ పాఠశాల.


 

ఈ అంబులెన్సు చెట్ల కోసం! 

చెట్లకూ ప్రాణం ఉంటుందనే విషయం మనకు తెలుసు. వాటికీ ఎన్నో రకాల వ్యాధులు సోకుతూ ఉంటాయి. పంటల విషయంలో అయితే ఇలాంటి చీడపీడలను పోగొట్టడానికి పురుగుమందుల్లాంటి వాటిని వాడతారు. మరి రోడ్ల వెంట నీడనిచ్చే చెట్లకు జబ్బు చేస్తే వాటి పరిస్థితేంటి... ఆ వృక్షాలను పట్టించుకొని బాగుచేసే వాళ్లేరీ... అనే ప్రశ్నలకు దేశ రాజధాని దిల్లీ విషయంలో మాత్రం ఒక సమాధానం చెప్పొచ్చు. అదే ట్రీ అంబులెన్సు. గత ఏడేళ్లుగా ఎన్నో చెట్లకు తిరిగి ప్రాణం పోసిందిది.

‘బాధ మనుషులకు కాకపోతే మానులకు వస్తుందా’ అని అనేస్తుంటాం. ఏదో ఓదార్పు కోసం అనే మాటే కానీ, నిజానికి మానులకు కూడా లెక్కకు మిక్కిలి తెగుళ్లూ, రకరకాల చీడపీడలూ వస్తుంటాయి. కాకపోతే వాటికి నోరు లేదు కాబట్టి అవి కష్టాన్ని చెప్పలేవు. అలాంటి ఆలనా పాలనాలేని చెట్లను కంటికి రెప్పలా కాపాడుతూ, వాటికి ఏ జబ్బు చేసినా నయం చేసి తిరిగి జీవం పోసుకునేలా చేసేందుకు ట్రీ అంబులెన్సును నడుపుతోంది దిల్లీ నగరపాలక సంస్థ. తమ ప్రయత్నంలో ప్రజలనూ భాగస్వాముల్ని చేసేందుకు ట్రీ హెల్ప్‌లైన్‌నూ నిర్వహిస్తోంది.

అన్ని సౌకర్యాలూ...
పర్యావరణ పరిరక్షణ పనుల్లో భాగంగా నగరంలో రోడ్ల వెంట ఉన్న చెట్లకు వైద్య సదుపాయాన్ని కల్పించి, చక్కని నీడనూ, స్వచ్ఛమైన గాలినీ ఇస్తున్న ఆ చెట్లను కాపాడాలన్న ఉద్దేశంతో అప్పటి ముఖ్యమంత్రి షీలాదీక్షిత్‌ చేతుల మీదుగా 2010లో ట్రీ అంబులెన్సును ప్రారంభించింది దిల్లీ నగరపాలక సంస్థ. మనుషులకు సంబంధించిన అంబులెన్సులో మనకు చికిత్స చేసేందుకు కావలసిన వస్తువులూ, మందులూ ఉన్నట్లే ఈ అంబులెన్సులోనూ చెట్లను బాగుచేయడానికి కావలసిన పరికరాలూ, మందులూ ఉంటాయి. పెద్ద చెట్లను ఎక్కేందుకు వీలుగా ఉండే 60 అడుగుల నిచ్చెనతో పాటు, గొలుసులా ఉండే రంపం, పొడవాటి వాటర్‌పైపులూ, మందులు కలిపే ట్రేలూ తదితరాలతో పాటు విభిన్న రకాల కీటకనాశనులూ, శిలీంద్రనాశనులూ ఉంటాయిందులో. ఇవన్నీ పెట్టుకునేందుకు ప్రత్యేక ఏర్పాటు ఉండేలా రూపొందించారీ వాహనాన్ని. ఇందులో పనిచేసే సిబ్బంది నిత్యం నగరంలోని ఒక్కో ప్రాంతాన్ని ఎంచుకొని అక్కడ కనిపించే చెట్లకు ఏదైనా వైద్యం అవసరం ఉంటే చేస్తారు. ముఖ్యంగా నగరంలోని వందేళ్లు పైబడి వయసున్న చెట్లను తరచూ పర్యవేక్షిస్తుంటారు. పెద్ద చెట్ల విషయంలో ఎక్కువగా వచ్చే సమస్య, చెట్టు కాండంలో తొర్ర ఏర్పడటం. చెట్టుకు ఒకరకమైన ఇన్‌ఫెక్షన్‌ వచ్చినప్పుడు ఆ పురుగు లోపలి కాండాన్ని తినేయడం వల్ల ఇది జరుగుతుంది. అలాంటి సందర్భాల్లో చెట్లు నిలబడే బలాన్ని కోల్పోయి పడిపోతుంటాయి. దీన్ని నయం చేసి వృక్షాన్ని కాపాడేందుకు ఈ అంబులెన్సు సిబ్బంది ముందుగా చెట్టు లోపలి భాగమంతా పురుగు మందును కొడతారు. తర్వాత చెట్టు కణజాలం కోలుకునేందుకు సాయపడే ప్రత్యేక మందు మిశ్రమాన్ని పూస్తారు. ఆ తర్వాత తొర్రను ధర్మాకోల్‌లాంటి పదార్థంతో నింపి కట్టుకడతారు. నెమ్మదిగా తొర్ర పూడటం మొదలయ్యేకొద్దీ లోపల నింపిన పదార్థం బయటకు వచ్చేస్తుంది. పెద్ద గాలులు వచ్చి కూలిపోయిన చెట్లను తిరిగి నిలబెట్టేందుకు ఇనుప కడ్డీల సాయాన్ని తీసుకుంటారు. చెట్లలో కిరణజన్యసంయోగక్రియ జరిగినప్పుడే వాటి నుంచి ప్రాణవాయువు బయటకు వస్తుంది. ఆ చర్య చెట్ల ఆకులద్వారా జరుగుతుంది. కానీ నగరాల్లోని చెట్లు కాలుష్యం కారణంగా దుమ్మూమసీ పేరుకుపోయి నల్లగా మారిపోతాయి. వానా కాలంలో మినహాయిస్తే ఇలాంటి చెట్లనుంచి పెద్ద మొత్తంలో స్వచ్ఛమైన గాలి రావడం కష్టం. ఇందువల్ల చెట్లకూ నష్టమే. అందుకే అంబులెన్సులోనే ఉండే ఐదున్నరవేల లీటర్ల సామర్థ్యం కల ట్యాంకు నుంచి పొడవాటి పైపుల ద్వారా నీళ్లను చల్లుతూ తరచూ చెట్లను శుభ్రంగా కడుగుతారు ఈ బృంద సభ్యులు.

చక్కటి శిక్షణ
ఈ తరహా ట్రీ అంబులెన్సు ప్రస్తుతం ఒక్కటే ఉంది. అందులో నలుగురు సిబ్బంది పనిచేస్తున్నారు. వీళ్లకు చెట్ల సంరక్షణ గురించి ప్రభుత్వం తరఫున ఫారెస్ట్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌, అగ్రికల్చర్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌, స్కూల్‌ ఆఫ్‌ గార్డెనింగ్‌ లాంటి జాతీయ స్థాయి సంస్థల్లో శిక్షణఇచ్చారు. చెట్టుని చూడగానే దానికి ఎలాంటి రోగం ఉందీ, ఏ మందు వేస్తే సరిపోతుందీ అన్నది వీళ్లు చెప్పగలరు. గాలివానల కారణంగా పడిపోయిన చెట్లనూ తిరిగి బతికించేందుకూ, భవంతుల నిర్మాణ సమయంలో అడ్డమొచ్చిన చెట్లను తిరిగి నాటినప్పుడు అవి జీవం పోసుకునేందుకూ కూడా వీళ్లు సాయమందిస్తున్నారు. ట్రీహెల్ప్‌లైన్‌కు రోజుకు 25 దాకా కాల్స్‌ వస్తాయి. ఆయా చోట్లకు వెళ్లి చెట్లకు కావలసిన వైద్యాన్ని అందించడంతోపాటు, వాహనాన్ని నెమ్మదిగా పోనిస్తూ రోడ్ల వెంట ఏ చెట్లకైనా ఇబ్బంది ఉందా అని గమనించడం వీళ్ల పని. ఈ అంబులెన్సు ప్రారంభించిన ఏడేళ్ల కాలంలో గాలీవానల కారణంగా రోడ్ల మీద పడే చెట్ల సంఖ్య చెప్పుకోదగ్గ స్థాయిలో తగ్గడమే కాకుండా, పచ్చని చెట్ల శాతమూ నగరంలో పెరిగిందట. ఈ ప్రయత్నం విజయవంతం కావడంతో మరిన్ని అంబులెన్సులను అందుబాటులోకి తేవాలనుకుంటోంది దిల్లీ నగరపాలిక. ఇలాంటి ప్రయత్నం మన దగ్గరా అతి త్వరలోనే జరగాలని కోరుకుందాం!


 

ఏడాదికి రూ.150 కోట్ల జీతం! 

నెలంతా కష్టపడితే వచ్చే జీతంలో ఇంటి ఖర్చులూ పిల్లల ఫీజులకు సరిపోగా నాలుగైదువేల రూపాయలు వెనకేసుకుంటే చాలు... అనుకునే వారు మన దేశంలో కొన్నికోట్ల మంది ఉన్నారు. ఇది నాణానికి ఒక పక్క..
మరి, మరో పక్కా... ప్రతి నెలా జీతంగా కోట్ల రూపాయలను ఇంటికి తీసుకెళ్లేవారూ ఉన్నారు. అలా ప్రస్తుతం అతి ఎక్కువ జీతాన్ని(స్టాక్‌ ఆప్షన్స్‌తో కలిపి) తీసుకుంటున్న మొదటి పదిమందే వీళ్లు...

సీపీ గుర్నానీ... రూ.150 కోట్లు
ఏడాదికి 150 కోట్ల రూపాయలు... టెక్‌ మహీంద్రా లిమిటెడ్‌ కంపెనీకి మేనేజింగ్‌ డైరెక్టర్‌, చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌గానూ పనిచేస్తున్న సీపీ గుర్నానీ జీతం ఇది. అందుకే, భారత్‌లో అతి ఎక్కువ జీతం తీసుకుంటున్నవారిలో ఆయన మొదటి స్థానంలో ఉన్నారు. దేశంలో అయిదో అతిపెద్ద సాఫ్ట్‌వేర్‌ సర్వీసెస్‌ ప్రొవైడర్‌ అయిన టెక్‌ మహీంద్రాలో గుర్నానీ 2004లో చేరారు. ఆ తర్వాత అయిదేళ్లకే ఎండీగానూ సీయీవోగానూ బాధ్యతలు చేపట్టారు. భారత్‌లో టాప్‌ త్రీ ఐటీ సంస్థలుగా పేరుపొందిన టీసీఎస్‌, ఇన్ఫోసిస్‌, విప్రో కంపెనీల సీయీఓల మొత్తం జీతం కన్నా నెలనెలా గుర్నానీ బ్యాంకు ఖాతాలో పడుతున్నదే ఎక్కువ.

నిఖిల్‌ మెశ్వాని, హితల్‌ మెశ్వాని... రూ.80.8 కోట్లు
రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ కంపెనీలో ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్లుగా పనిచేస్తున్న నిఖిల్‌ మెశ్వానీ, హితల్‌ మెశ్వానీలు ఒక్కొక్కరూ ఏడాదికి రూ.80.8 కోట్ల జీతాన్ని అందుకుంటున్నారు. ఆశ్చర్యం ఏంటంటే వీరితో పోల్చితే ఆ కంపెనీ సీయీవో ముఖేష్‌ అంబానీ జీతం చాలా తక్కువ. ఎందుకంటే 2009 నుంచి ఆయన తన జీతంగా ఏడాదికి రూ.15 కోట్లు మాత్రమే తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. నిఖిల్‌, హితల్‌లు ముఖేష్‌ అంబానీకి వరుసకు బావలు అవుతారు. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ బోర్డులో సభ్యులైన ఈ ఇద్దరూ ఆ కంపెనీ అభివృద్ధిలో కీలకపాత్ర పోషిస్తున్నారు.

ఏయమ్‌ నాయక్‌... రూ.79 కోట్లు
అనిల్‌ మణిభాయ్‌ నాయక్‌... 1965లో జూనియర్‌ ఇంజినీర్‌గా ఎల్‌ అండ్‌ టీ(లార్సెన్‌ అండ్‌ టుబ్రో)లో చేరారు. తన ప్రతిభతో సంస్థ సీయీవో, ఎండీగా ఎదిగిన నాయక్‌ 2003లో ఛైర్మన్‌ బాధ్యతల్ని చేపట్టారు. 2007-08లో రూ.29,819 కోట్లు ఉన్న ఎల్‌ అండ్‌ టీ ఆదాయాన్ని 2016-17 సంవత్సరానికి రూ.1,10,011 కోట్లకు తీసుకొచ్చిన ఘనత నాయక్‌దే. అందుకే, ఆయనకు ఏడాదికి రూ.79 కోట్ల రూపాయలను జీతంగా అందజేస్తోంది ఆ కంపెనీ. ఆదివారాలు కూడా సెలవు తీసుకోకుండా పనిచేసే నాయక్‌ కేవలం లీవ్‌ ఎన్‌క్యాష్‌మెంట్‌ కిందే గతేడాది రూ.32.2 కోట్లను అందుకున్నారట.

కళానిధి మారన్‌, కావేరీ మారన్‌... రూ.78 కోట్లు
వార్తా పత్రికలూ వార పత్రికలూ వివిధ భాషల్లో టీవీ ఛానెళ్లూ ఎఫ్‌ ఎమ్‌ రేడియో స్టేషన్లూ డీటీహెచ్‌ సర్వీసులతో పాటు చిత్ర నిర్మాణంలోనూ వ్యాపారం నిర్వహిస్తున్న సన్‌ గ్రూపుకి కళానిధి మారన్‌ ఛైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌. ఆయన భార్య కావేరీ మారన్‌ సన్‌ టీవీ నెట్‌వర్క్‌కి ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌. ఈ ఇద్దరూ ఏడాదికి రూ.78 కోట్ల జీతాన్ని తీసుకుంటూ మీడియా రంగంలోనే అత్యధిక వేతనం అందుకుంటున్న వారిలో తొలిస్థానంలో నిలిచారు. ఫోర్బ్స్‌ లిస్టు ప్రకారం భారత్‌లో అత్యంత సంపన్నుల వరుసలో కళానిధి మారన్‌ది 29వ స్థానం.

ఆదిత్య పూరీ రూ.67.5 కోట్లు
1994లో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు ప్రారంభమైనప్పట్నుంచీ దానికి ఎండీగా పనిచేస్తున్న ఆదిత్య పూరీ ఆ బ్యాంకు అంకుర సంస్థ స్థాయి నుంచి భారత్‌లో రెండో అతిపెద్ద ప్రైవేట్‌ సెక్టార్‌ బ్యాంకుగా ఎదిగేందుకు కృషి చేశారు. కంపెనీకి తాను అందిస్తున్న సేవలకు గానూ ఆదిత్య అందుకుంటున్న మొత్తం ఏడాదికి రూ.67.5 కోట్లు. బ్యాంకింగ్‌ రంగంలో అత్యధిక వేతనాన్ని అందుకుంటున్న అధికారి ఈయనే.

పవన్‌ ముంజాల్‌ రూ.60 కోట్లు
హీరో గ్రూపు వ్యవస్థాపకుడైన బ్రిజ్‌మోహన్‌లాల్‌ ముంజాల్‌ నలుగురు పిల్లల్లో ఒకరైన పవన్‌ ముంజాల్‌ ప్రస్తుతం హీరో మోటో కార్ప్‌కి ఛైర్మన్‌, ఎండీ, సీయీవో. ఆ కంపెనీ ప్రపంచంలోనే అతిపెద్ద ద్విచక్ర వాహనాల తయారీ సంస్థగా ఎదిగేందుకు పవన్‌ముంజాల్‌ తీసుకున్న కీలక నిర్ణయాలే కారణం అంటారు ఆర్థిక వేత్తలు. అందుకే, ఆయన వాహన రంగంలో అత్యధిక జీతం ఏడాదికి రూ.60 కోట్లు అందుకుంటున్న వ్యక్తిగా రికార్డు సృష్టించారు.

మురళి దివి రూ.46.5 కోట్లు
హైదరాబాద్‌, విశాఖ పట్టణాల్లో ఉన్న ఔషధ తయారీ సంస్థ దివీస్‌ లాబొరేటరీస్‌ను 27 ఏళ్ల కిందట ప్రారంభించారు మురళీ దివి. ఈ ఏడాది ఫోర్బ్స్‌ లిస్టు ప్రకారం భారత్‌లోని వందమంది అత్యంత సంపన్నుల్లో 77వ స్థానంలో ఉన్న మురళీ - దివీస్‌ కంపెనీ సీఎమ్‌డీగా ఏడాదికి అందుకుంటున్న జీతం రూ.46.5 కోట్లు.

ఓంకార్‌ కన్వర్‌ రూ.45.7 కోట్లు
కేరళలోని త్రిసూర్‌లో తండ్రి ప్రారంభించిన అపోలో టైర్స్‌ సంస్థను అంతర్జాతీయంగా విస్తరించారు ఓంకార్‌ కన్వర్‌. భారత్‌లోని అతిపెద్ద టైర్ల కంపెనీల్లో ఒకటిగా పేరుపొందిన అపోలో టైర్స్‌కి సీఎమ్‌డీ అయిన ఆయన ఏడాదికి తీసుకునే వేతనం రూ.45.7 కోట్లు. 16వేల కోట్ల రూపాయల ఆదాయం కలిగిన ఈ కంపెనీ శాఖలు దక్షిణాఫ్రికా, నెదర్లాండ్స్‌లో కూడా ఉన్నాయి.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.