close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
శాంతి

శాంతి
- అప్పరాజు నాగజ్యోతి

సిటీలోని నంబర్‌ వన్‌ ఇండస్ట్రియలిస్టు అయిన ధీరేంద్ర అగర్వాల్‌ బర్త్‌డే పార్టీకి అటెండ్‌ అయిన అభిమన్యు డిన్నర్‌ పూర్తవుతూనే ఇంటికి బయలుదేరాడు.

‘‘ఒక్క క్షణం ఆగరా అభీ, నా కారు చెడిపోయింది. నేను కూడా నీతోపాటు వస్తాను’’ అంటూ గబగబా వచ్చాడు ప్రవీణ్‌.

ముందు సీట్లో ప్రవీణ్‌ కూర్చోగానే అభిమన్యు కారుని స్టార్ట్‌ చేశాడు.

స్నేహితుడి మొహం అదోలా ఉండటాన్ని గమనించాడు ప్రవీణ్‌.

‘‘అలా ఉన్నావేమిటి అభీ, దేనికో ఆందోళన పడుతున్నట్లున్నావు?’’

‘‘అలాంటిదేమీ లేదురా’’ అన్న అభిమన్యు మరికొద్ది క్షణాల తరవాత తన బాధని స్నేహితుడితో పంచుకున్నాడు.

‘‘ఎందుకోగానీ ఈమధ్య కొద్ది రోజులుగా మనసంతా భారంగా, ఏదో తెలీని దిగులుగా ఉంటోందిరా.’’

‘‘కష్టపడి చదివి మొదటి ప్రయత్నంలోనే సివిల్‌ సర్వీసెస్‌కి- అందులోనూ ఐఏఎస్‌కి సెలెక్ట్‌ అయ్యావు. పెద్ద పదవీ, పేరు ప్రఖ్యాతులతో పాటు డబ్బు కూడా బాగానే సంపాదించావు. ఇక కుటుంబపరంగా చూస్తే నీ మనసెరిగి నడుచుకునే అందమైన భార్య, ముత్యాల్లాంటి పిల్లలు... అన్నీ ఉన్న నీకు దిగులేమిట్రా?’’ ఆశ్చర్యపడ్డాడు ప్రవీణ్‌.

‘‘నువ్వు చెప్పిందంతా నిజమేరా, కానీ ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే నాకు తెలీకుండానే నేను ఎన్నో పొరపాటు నిర్ణయాలు తీసుకున్నట్లుగా అనిపిస్తోంది. దాంతో మనసంతా అశాంతిగా అన్పిస్తోందిరా. ఎప్పుడూలేనిది ఈమధ్య దేవుడిని కూడా పదేపదే తలుచుకుంటున్నాను. ఆ భగవంతుడే ప్రత్యక్షమై నేను గతంలో తీసుకున్న తప్పుడు నిర్ణయాల్ని ఇప్పుడు మార్చుకోగలిగేటట్లుగా వరమిస్తే బావుండును అని చాలా గాఢంగా అన్పిస్తోందిరా.’’

మాటల్లోనే ప్రవీణ్‌ ఇల్లు రావడంతో కారు ఆపాడు అభిమన్యు.

‘‘నీకు దొరికినటువంటి అద్భుతమైన జీవితం కోటి మందిలో ఒక్కరికి కూడా దొరకదురా అభీ. అనవసరమైన ఆలోచనలతో మనసు పాడుచేసుకోకు’’ అంటూ స్నేహితుడికి సలహా ఇచ్చి కారు దిగాడు ప్రవీణ్‌.

***

మళ్ళీ కారు స్టార్ట్‌ చేసి కొంత దూరం వెళ్ళగానే, తన పక్క సీటులో ఎవరో కదులుతున్నట్లుగా అనిపించడంతో తలని పక్కకు తిప్పి చూశాడు అభిమన్యు.

ధవళవస్త్రాలు ధరించిన ఒక అపరిచితుడు తన పక్క సీట్లో కూర్చుని ఉండటాన్ని చూసి ఆశ్చర్యపోయాడు.

పెదవులపై చిరునవ్వు, ప్రశాంతత నిండిన నయనాలు, అఖండమైన తేజస్సుతో వెలిగిపోతున్న ఆ ముఖారవిందాన్ని చూస్తూనే రెండు చేతులూ ఎత్తి నమస్కారం చేయాలనిపించింది అభిమన్యుకి.

‘‘చేతులెత్తి నమస్కారం చేయాలని ప్రయత్నిస్తే కారుకి యాక్సిడెంట్‌ కాగలదు సుమా.’’

అతని మాటలకి షాక్‌ అయ్యాడు అభిమన్యు.

‘‘నేను మనసులో అనుకున్న విషయం మీకెలా తెలిసింది, అసలు మీరెవరు... నా కారులోకి ఎలా వచ్చారు?’’ అంటూ ప్రశ్నించాడు.

‘‘ఇప్పుడేగా నన్ను ఈమధ్య తరచుగా తలుచుకుంటున్నానని నీ స్నేహితుడితో చెప్పుకున్నావు. అందుకే వచ్చాను.’’

అతని మాటలకి ఒక్క క్షణం పజిల్‌ అయిన అభిమన్యు వెంటనే తేరుకున్నాడు.

‘‘అయితే, ఈ భూమ్మీద ప్రజలందరూ కొలిచే దేవుడు మీరేనా స్వామీ? సాక్షాత్తూ ఆ భగవంతుడే ఇలా నా ఎదుట ప్రత్యక్షమయ్యాడంటే నమ్మలేకపోతున్నాను’’ ఎగ్జైటింగ్‌గా చెప్పాడు అభిమన్యు.

‘‘త్వరలోనే నమ్మిక కలుగుతుందిలే నాయనా. దేవుడు ప్రత్యక్షమై వరమీయాలి అని కోరుకున్నావుగా, తథాస్తు. మరి నువ్వు కోరుకున్నట్లుగానే నీ గత నిర్ణయాలని మార్చుకునే వరం నీకు ఈ క్షణమే ప్రసాదిస్తున్నాను. కాకపోతే కేవలం ఒకే ఒక్క నిర్ణయాన్ని సుమా. అయితే ముందే హెచ్చరిస్తున్నాను, ఒకమారు నిర్ణయం అంటూ మార్చుకున్నావంటే ఆ నిర్ణయం తాలూకు గత ఫలితాల్ని కూడా నువ్వు కోల్పోతావు. కాబట్టి బాగా ఆలోచించుకో.’’

సరేనన్నట్లుగా తలూపిన అభిమన్యు ‘ఏ నిర్ణయాన్ని మార్చుకుంటే బావుంటుంది’ అనుకుంటూ ఆలోచనలోపడ్డాడు.

***

అభిమన్యు ఆలోచనల్లో మొదటగా మెదిలిన వ్యక్తి అతని భార్య శాంతి. ఆమెని తలుచుకోగానే అతని మొహం కోపంతో ఎరుపెక్కింది.

‘ఛ, ఎంతసేపూ పూజలూ పునస్కారాలూ అంటూ దేవుడి మందిరాన్నే అంటిపెట్టుకుని ఉంటుంది, లేదా సమాజసేవ అంటూ అనాధాశ్రమాల చుట్టూ వృద్ధాశ్రమాల చుట్టూ తిరుగుతూ ఉంటుంది. మనిషి అందంగా ఉంటుందే కానీ ఏం ఉపయోగం, ఒక ఐఏఎస్‌ ఆఫీసర్‌ భార్య ఎంత ఠీవీగా ఉండాలో అలా ఉండదు. ఒళ్ళంతా చుట్టేసుకున్న చీరతో ముసలమ్మలా తయారై వచ్చే తనని పార్టీలకి తీసుకెళ్ళడం నామోషీగా, తోటి ఆఫీసర్ల ముందు తల కొట్టేసినట్లుగా ఉంటుంది. ఇలాంటి కంట్రీ బ్రూట్‌ని నేనసలు పెళ్ళి చేసుకుని ఉండవలసింది కాదు. నా జీవితంలో నేను తీసుకున్న అతి పెద్ద తప్పుడు నిర్ణయం అంటూ ఏదైనా ఉందంటే అది శాంతిని పెళ్ళి చేసుకోవడమే. దేవుడిచ్చిన ఈ చక్కటి అవకాశంతో ఆ నిర్ణయాన్ని మార్చుకుని నా జీవితాన్ని నందనవనం చేసుకోవాలి’ అని అభిమన్యు మనసులో అనుకోగానే దేవుని గంభీరమైన గొంతు వినిపించింది.

‘‘నాయనా, ఆ నిర్ణయాన్ని గనుక నువ్వు ఇప్పుడు మార్చుకుంటే, నీ భార్య శాంతి ద్వారా నీకు కలిగిన నీ సంతానాన్ని కూడా శాశ్వతంగా కోల్పోవలసి వస్తుంది. గత నిర్ణయ ఫలితాన్ని కోల్పోవటం అని నేను నీకు మొదట్లో చెప్పింది అదే’’ విశదీకరించాడు భగవంతుడు.

కూతురు అద్రిజ, కొడుకు అనిరుధ్‌ అంటే అభిమన్యుకి ప్రాణం.

‘అమ్మో, పిల్లలు లేకుండా ఒక్క క్షణం కూడా ఉండలేను’ అనుకున్నాడు అభిమన్యు.

***

ఆ నిర్ణయం అలా వీగిపోవడంతో తిరిగి ఆలోచనలోపడ్డాడు అభిమన్యు.

‘కంప్యూటర్‌ ఇంజినీరింగ్‌ చదివిన నేను అనుకోకుండా ఈ సివిల్‌ సర్వీసెస్‌లో చేరిపోయాను. నా ఫేవరెట్‌ సబ్జెక్టు సైబర్‌ సెక్యూరిటీ మీద రీసెర్చి చేయటానికి స్టాన్‌ఫోర్డ్‌ యూనివర్సిటీలో సీటు వచ్చినా కూడా వెళ్ళకుండా అనవసరంగా ఈ సివిల్‌ సర్వీసెస్‌లో ఇరుక్కుపోయాను. ఈ పోస్టులో అనవసరమైన టెన్షన్లనీ ఒత్తిళ్ళనీ ఎదుర్కోవలసి వస్తోంది. వీటిమూలాన మొన్ననే హార్ట్‌ ప్రాబ్లమ్‌ కూడా వచ్చింది.’

‘‘నాయనా, నువ్వు ఇప్పుడు ఉంటున్న నీ బంగళా, నీ స్వస్థలంలో నీవు కొనుక్కున్న వేల ఎకరాల పొలాలూ, మరెన్నో ఇళ్ళ స్థలాలూ, ప్రతిష్ఠాత్మకమైన కాలేజీల్లో నీ పిల్లలకి నువ్వు సంపాదించి పెట్టిన సీట్లూ ఇవన్నీ కూడా నువ్వు ఈ క్షణాన మరిచిపోయావనుకుంటాను. అవన్నీ నీ ఐఏఎస్‌ పదవితో ఆర్జించినవేగా. మరి వాటన్నింటిని కూడా వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నావా?’’ అంటూ ప్రశ్నించాడు దేవుడు.

కోట్ల విలువచేసే తన ఆస్తులన్నీ కంటిముందు కదలగానే ఆ ఆలోచనకి స్వస్తి పలికాడు అభిమన్యు.

మరికాసేపు తీవ్రంగా ఆలోచించిన మీదట పదిరోజుల కిందట కుటుంబంతో కలిసి అక్క తన ఇంటికి వచ్చిన సంఘటన అభిమన్యు మనసులో మెదిలింది.

***

చాలా కాలానికి తమ ఇంటికి వచ్చిన వదినగారిని ఆప్యాయంగా రిసీవ్‌ చేసుకుంది శాంతి.

‘‘ఒక్కమాట ముందుగా చెప్పుంటే స్టేషన్‌కి కారు పంపించేవాళ్ళంగా అన్నయ్యా’’ అంటూ అభిమన్యు బావ రవీంద్రని పలకరిస్తూనే, ‘‘చందూ బాగా పొడవయ్యాడు వదినా, స్వాతి కూడా బాగా ఎదిగింది’’ అంటూ పిల్లలిద్దరినీ దగ్గరకు తీసుకుంది శాంతి.

‘‘చందూ, నీ ఇంటర్‌ చదువు అయిపోయినట్లుందిగా, తరవాత ఏం చదవాలనుకుంటున్నావు?’’ అడిగింది శాంతి.

‘‘ఇంజినీరింగ్‌లో మంచి ర్యాంక్‌ వచ్చింది అత్తా.’’

ఈ సంభాషణ అంతా హాల్లో అటూ ఇటూ తిరుగుతూ సెల్‌ఫోన్‌లో ఎవరితోనో మాట్లాడుతున్న అభిమన్యు చెవుల్లో పడుతోంది.

ఫోన్లో మాట్లాడటం పూర్తికాగానే అక్కా, బావలతో కబుర్లు చెబుతూ కూర్చున్నాడు అభిమన్యు.

మధ్యాహ్నం భోజనాలు ముగించి అందరూ తీరిగ్గా సోఫాలో కూర్చున్నాక తమ్ముడిని మెల్లిగా కదిపింది అతని అక్క ప్రభావతి.

‘‘అభీ, మన చందూకి ఇంజినీరింగ్‌లో మంచి ర్యాంక్‌ వచ్చింది. నీకు తెలుసుగా, ఈ ఏడు వర్షాల్లేక పొలాలు ఎండిపోయాయి. పంట చేతికి రాలేదు. ఇప్పుడు వాడిని ఇంజినీరింగ్‌ కాలేజీలో చేర్పించడానికిగానీ, సిటీలో హాస్టల్లో పెట్టి చదివించడానికిగానీ చాలినంత డబ్బు ప్రస్తుతానికి మా దగ్గర లేదు. వాడేమో ఎలాగైనా సరే, ఇంజినీరింగ్‌ చేయాలని ఒకటే పట్టుదలగా ఉన్నాడు. ఈ నెలాఖరుకల్లా ఇంజినీరింగ్‌ కౌన్సెలింగ్‌ మొదలవుతుంది. మాకేం చేయాలో తోచక ఇక్కడికి వచ్చాం. వాడి ఫీజులకి నువ్వు కాస్త సాయం చేశావంటే నీ మేలు ఎన్నటికీ మర్చిపోమురా.’’

‘‘చూద్దాంలే అక్కా’’ అంటూ క్లుప్తంగా సంభాషణని తుంచేశాడు అభిమన్యు.

పొలం పనులున్నాయంటూ ఆ రాత్రి చివరి బస్సుకే వాళ్ళు ­రు వెళ్ళిపోయారు. వెళ్ళేముందు మరొక్కసారి తమ్ముడికి తన కొడుకు ఇంజినీరింగ్‌ చదువు గురించి గుర్తుచేసి వెళ్ళింది ప్రభావతి.

‘ఈరోజు ఇంజినీరింగ్‌ అడ్మిషన్‌ ఫీజులకి డబ్బులడిగారు. ఆ తరవాత వరుసగా నాలుగు సంవత్సరాలపాటు సెమిస్టరు ఫీజులకి సహాయం అడుగుతూనే ఉంటారు. ఆపైన కూతురు ఎదిగొస్తే దాని పెళ్ళికి డబ్బులడుగుతారు. ఎందుకొచ్చిన తంటా- అంత్య నిష్ఠూరంకంటే ఆది నిష్ఠూరం మేలు కదూ-’ అనుకున్న అభిమన్యు ఆ తరవాత అతనితో ఫోనులో మాట్లాడటానికి అక్క ఎన్నిసార్లు ప్రయత్నించినా కూడా ఆమెకి చిక్కకుండా తప్పించుకున్నాడు.

అభిమన్యుకీ అతని అక్కకీ వయసులో పదేళ్ళపైనే వ్యత్యాసం ఉంది. అతని చిన్నతనంలో తల్లి జబ్బుతో మంచానపడితే అక్క ప్రభావతే అతనికి గోరుముద్దలు పెట్టి తల్లిలా పెంచింది. బావ రవీంద్ర కూడా చాలా మంచిమనిషి. బావమరిదిని తమ కుటుంబసభ్యుడిలాగే చూసేవాడు. ఎన్నోమార్లు అతని చదువుకి వాళ్ళ నాన్నవద్ద డబ్బులు లేకపోతే రవీంద్రే సహాయం చేశాడు.

ఇప్పుడవన్నీ జ్ఞప్తికి రాగానే తన ప్రవర్తనకి తానే సిగ్గుపడ్డాడు అభిమన్యు. మొట్టమొదటిసారిగా అక్కయ్య నోరు తెరిచి కొడుకు చదువుకి కాస్త సాయం అడిగితే తను మొహం చాటేసిన వైనం తలుచుకుంటే తనమీద తనకే అసహ్యమేసింది.

ఇంజినీరింగ్‌ కౌన్సెలింగ్‌ మొదలై కూడా రెండు రోజులైంది.

‘సొంత అక్కకి అవసరంలో సహాయపడని తన తప్పుడు నిర్ణయాన్ని ఇప్పుడు దేవుడిచ్చిన ఈ వరంతో మార్చుకోవాలి’ అని అభిమన్యు మనసులో అనుకోగానే దేవుడు ‘తథాస్తు’ అన్నట్లనిపించింది.

వెంటనే అక్కకి ఫోన్‌ చేశాడు అభిమన్యు. మొదటి రింగ్‌కే ఫోన్‌ ఎత్తింది ప్రభావతి.

‘‘అక్కా, నేను అభీని. మన చందూకి ఇంజినీరింగ్‌ కౌన్సెలింగ్‌ ఎప్పుడు?’’

‘‘వాడి ర్యాంకుకి నిజానికి ఈరోజే ఉండిందిరా కౌన్సెలింగ్‌. ‘ఇంకా డబ్బులు జమ కాలేదు, ఎలాగా’ అని కంగారుపడుతుండగా ఆ వెంకన్న తండ్రి మహత్యమో ఏమో మరి కౌన్సెలింగ్‌ ఎల్లుండికి వాయిదా పడినట్లుగా ఇప్పుడే తెలిసిందిరా.’’

‘‘అయితే డబ్బులు తీసుకుని ఎల్లుండి నేను డైరెక్ట్‌గా కౌన్సెలింగ్‌ సెంటర్‌కి వచ్చేస్తాను. మీరు చందూని తీసుకుని అక్కడికి వచ్చేయండి అక్కా.’’

‘‘నీ మనసు వెన్న అని నాకు తెలుసురా అభీ. మీ బావ, చందూ ఇద్దరూ కూడా ఈ విషయం గురించి ఆందోళనపడుతుంటే ‘మా తమ్ముడు ఉండగా మనకి భయమేమిటి, వాడు మనకి తప్పకుండా సాయం చేస్తాడు’ అంటూ వాళ్ళకి నేను గట్టిగా చెబుతున్నానురా, ఇంతలోగా నీ ఫోన్‌ వచ్చింది. ఈవేళ ఉదయం లేస్తూనే చందూ ఇంజినీరింగ్‌లో చేరాక వాడి తలనీలాలు సమర్పించుకుంటానని ఆ తిరుపతి స్వామికి మొక్కుకున్నానురా. అంతా ఆ ఏడుకొండలవాడి మహిమ’’ అని చెబుతున్న అక్క మాటల్లో తొణికిసలాడుతున్న ఆనందం అతని మనసుకి చందనం పూతలా చల్లగా హాయిగా అనిపించింది.

***

కారుకి కుక్క అడ్డంవస్తే సడెన్‌ బ్రేక్‌ వేశాడు అభిమన్యు. కీచుమంటూ ఆగింది కారు. అది పక్కకి తప్పుకున్న తరవాత మళ్ళీ స్టార్ట్‌ చేస్తుండగా ఇంకా కార్లోనే కూర్చున్న భగవంతుడు కనిపించాడు.

‘ఒక్క నిర్ణయం మాత్రమే మార్చగలను అన్నాడుగా, మరి ఇంకా ఇక్కడే ఎందుకున్నట్లు?’ అని అభిమన్యు మనసులో అనుకుంటూండగానే-

‘‘నువ్వు మార్చుకున్న నిర్ణయం కాస్తా, ఆ ఏడుకొండలవాడి మొక్కుల కోటాలోకి వెళ్ళిపోయింది కదా నాయనా. కాబట్టి నీకు మరో నిర్ణయాన్ని మార్చుకునే అవకాశమొచ్చింది. షరతులు మామూలే’’ అన్నాడు భగవంతుడు.

‘ఈసారి ఏ నిర్ణయాన్ని మార్చుకుంటే బాగుంటుందీ’ అనుకుంటూ మళ్ళీ ఆలోచనలోపడ్డ అభిమన్యు దృష్టి కార్లోని మిర్రర్‌కి ఒక పక్కగా అతికించిన శివుడి స్టిక్కర్‌ మీద పడగానే వెంటనే అతనికి తన బాల్య స్నేహితుడు శివ జ్ఞప్తికి వచ్చాడు.

‘కారుని అంత స్పీడ్‌గా నడపకురా అభీ. ఇదిగో ఇక్కడ నీకు కనిపించేటట్లుగా శివుడి బొమ్మని అంటిస్తున్నా. దీన్ని చూసినప్పుడల్లా నేను గుర్తుకువచ్చి కారు వేగాన్ని తగ్గించాలి సుమా’ ఆప్యాయంగా చెబుతూ ఆ స్టిక్కర్‌ని అతికించాడు శివ.

నెలరోజుల కిందట తనని నమ్ముకుని తనింటికి వచ్చిన స్నేహితుడు శివ గుర్తుకురాగానే అభిమన్యు మనసు మళ్ళీ బరువెక్కింది. ఆ రోజున ‘‘ఒరేయ్‌ అభీ, ఇంతకాలానికి నా కూతురికి చక్కటి సంబంధం కుదిరిందిరా. అబ్బాయి కర్నూల్‌లో రెవెన్యూ శాఖలో పనిచేస్తున్నాడు. మంచి సంప్రదాయమైన కుటుంబం. వాళ్ళకి మన తులసి బాగా నచ్చడంతో కట్నం కూడా అడగలేదు. కానీ పెళ్ళి మాత్రం ఘనంగా చేయాలన్నారు. నీకు తెలీనిదేముందిరా, చిన్నతనంలో మేము చాలా దర్జాగా బతికినప్పటికీ ఆ తరవాత బిజినెస్‌లో నష్టాలు రావడంతో ఉన్నదంతా పోయింది. ఇప్పుడు ఏంపెట్టి కూతురి పెళ్ళి ఘనంగా చేయాలో నాకేమీ అర్థంకావట్లేదురా. నువ్వే ఏదో విధంగా ఆదుకోవాలిరా’’ అంటూ తన రెండు చేతులూ పట్టుకుని అర్ధించిన స్నేహితుడికి ఒక పూట తనింట్లో భోజనం పెట్టి పంపించడం తప్ప మరే సాయమూ చేయలేదు అభిమన్యు.

చిన్నతనంలో స్కూల్‌ ఫీజులకీ పుస్తకాలకీ అభిమన్యుకి ఎన్నోమార్లు సాయం చేశాడు శివ. అభిమన్యు ఇంటర్‌ చదువు, ఆపైన ఇంజినీరింగ్‌ ఎంట్రన్స్‌ కోచింగ్‌ వగైరాలన్నీ కూడా శివ సాయంతోనే జరిగాయి.

ఇంటర్‌ ఫెయిల్‌ అయిన తరవాత ఇక చదువు జోలికి వెళ్ళకుండా తండ్రితోపాటు బిజినెస్‌లోకి దిగాడు శివ. కానీ, దురదృష్టవశాత్తూ కాలం కలిసిరాక అయిదేళ్ళలో బిజినెస్‌ పూర్తిగా దివాలా తీయడంతో కుటుంబాన్ని పోషించడం కోసమని ఏదో చిన్న ఉద్యోగంలో చేరాడు.

స్నేహితుడు చేసిన సాయంతోనే తానీ స్థితికి రాగలిగానన్న విషయాన్ని విస్మరించి, తానిప్పుడు అతనికి సహాయపడే స్థితిలో ఉన్నా కూడా సాయం చేయకపోవడం అనేది చాలా నీచంగా అనిపించింది అభిమన్యుకి. వెంటనే స్నేహితుడితో మాట్లాడాలనీ, సాయపడాలనీ అతనికి గాఢంగా అనిపించింది.

ఇక ప్రత్యేకంగా చెప్పేదేముంది, దేవుడు వెంటనే ‘తథాస్తు’ అనడమూ, అభిమన్యు తన స్నేహితుడికి ఫోన్‌ చేయడమూ, అతని కూతురి పెళ్ళి తన ఆధ్వర్యంలో తనే దగ్గరుండి తన ఖర్చుతో చేస్తానని అతని మాట్విడమూ జరిగిపోయాయి.

ఇప్పుడతని మనసుకి తృప్తిగా ఉంది.

***

భగవంతుడు ఇంకా తన కారులోనే ఉండటంతో విస్మయం చెందాడు అభిమన్యు.

‘‘అంత తొందర దేనికి నాయనా, వెళతానులే. నీకు తెలుసుగా, నీ స్నేహితుడు ఆ పరమశివుని భక్తుడు. కూతురి కల్యాణం నిర్విఘ్నంగా జరిగితే కాశీ విశ్వేశ్వరుడి దర్శనం చేసుకుని, తనకెంతో ప్రీతిపాత్రమైన అరటిపండుని వదిలేస్తానని మొక్కుకున్నాడు. అలా నువ్వు నీ స్నేహితుడికి చేసిన సాయం కాస్తా ఆ మహేశ్వరుడి వరాల జాబితాలో కలిసిపోయింది. కాబట్టి నీకు నేనిచ్చిన వరం ఇంకా అలాగే ఉంది మరి.’’

దేవుడి మాటలకి అభిమన్యు మళ్ళీ గతంలోకి తొంగి చూడబోయేంతలోగానే అతని జేబులోని సెల్‌ మోగింది.

ఆఫీసు నుండి అతని సెక్రటరీ చేసిన ఫోన్‌ కాల్‌ అది.

‘‘సార్‌, మొన్న మన ఆఫీసులో ఇంజినీర్‌ పోస్టుల నియామకాలు జరిగాయి కదా, ఆ లిస్టుని రిలీజ్‌ చేసేయమంటారా?’’ అంటూ సెక్రటరీ మూర్తి అడుగుతుండగా అభిమన్యు కళ్ళల్లో ఆనాడు ఇంటర్వ్యూకి వచ్చిన శ్రవణ్‌ అనే కుర్రాడు కదలాడాడు.

అతి పేద కుటుంబం నుండి వచ్చిన ఆ కుర్రాడు కష్టపడి స్కాలర్‌షిప్‌ల మీద చదువుకుని రాత పరీక్షలో మొదటి ర్యాంకులో నిలిచి ఇంటర్వ్యూకి వచ్చాడు. ఇంటర్వ్యూ బోర్డులో అడిగిన అన్ని ప్రశ్నలకీ ఎంతో చక్కగా సమాధానాలు చెప్పాడు. అలాంటి మెరిట్‌ క్యాండిడేట్‌ని పక్కన పెట్టేసి చివరి క్షణంలో పెద్ద మొత్తంలో డబ్బులు ఇచ్చిన వ్యక్తి కొడుకు పేరుని ఆ సెలక్షన్‌ లిస్టులో చేర్చాడు అభిమన్యు.

డబ్బు కోసం గడ్డి తింటూ మెరిట్‌ని భ్రష్టు పట్టించిన తన నైజం తనకే నచ్చలేదు. ‘‘లిస్టుని మార్చండి మూర్తిగారూ. అందులో ఉన్న ‘కుమార్‌’ అన్న పేరుని తీసేసి, ఆ స్థానంలో ‘శ్రవణ్‌’ పేరుని రాసి, ఆ తరవాత ఫైల్‌ని నా సంతకం కోసం పంపించండి.’’ ‘తథాస్తు’ అంటూ భగవంతుడి స్వరం వినిపించకుండానే ఫోన్‌లో చెప్పేశాడు.

ఏ ప్రలోభాలకీ లొంగకుండా తన విద్యుక్తధర్మాన్ని తాను సక్రమంగా నిర్వర్తించిన తృప్తి మొదటిసారిగా అనుభవంలోకి వచ్చింది అభిమన్యుకి.

ఈవేళ దేవుడి అనుగ్రహం వలన మనసు మార్చుకుని చేసిన మంచి పనులతో కలిగిన సంతోషం మనసంతా ఆక్రమించుకున్న అభిమన్యుకి ‘నలుగురికీ ఉపయోగపడే పనుల్ని చేసేవాళ్ళ మనసులు ఆనందంగా, ప్రశాంతంగా, తేలిగ్గా ఉంటాయండీ’ అని ఎప్పుడూ అంటుండే భార్య శాంతి మాటలు చటుక్కున గుర్తుకొచ్చాయి.

ఆ వెంటనే కొద్దిరోజుల కిందట ఆమె మనసుని తను తీవ్రంగా గాయపర్చిన విషయం అతని మనసులో ముల్లులా గుచ్చుకుంది.

***

సమాజసేవా కార్యకలాపాలలో చురుగ్గా పాలుపంచుకుంటూ అందరికీ సహాయకారిగా ఉండే శాంతికి చిదానందస్వామి వారంటే చాలా గురి. నిస్వార్థంగా ఆ స్వామివారు సమాజ శ్రేయస్సు కోసం చేస్తున్న పనులకి బాగా ఆకర్షితురాలైన శాంతి, తమ ­రిలో ఇరవై ఏళ్ళకిందట అతి చవకగా తాము కొన్న పదెకరాల బంజరు భూమిని స్వామివారు ప్రారంభించాలనుకున్న సేవాశ్రమానికి ఉచితంగా ఇస్తానని మాట ఇచ్చింది.

ఒకప్పుడు బంజరు భూమే అయినప్పటికీ ఇప్పుడు ఆ స్థలం మంచి ధర పలుకుతోంది. అలాంటి స్థలాన్ని ఉచితంగా దానం చేయటానికి అభిమన్యుకి మనసు రాలేదు. దాంతో ఎన్నడూలేనిది మొదటిసారిగా భర్తతో వాదనకి దిగిన శాంతి అతనితో గెలవలేకపోయింది. ఆ వాదులాటలో అతని నోటినుండి వెలువడిన పరుషమైన పదజాలానికి ఆమె మనసు తీవ్రంగా గాయపడటంతో మౌనంగా ఉండిపోయింది. భార్య ముభావం అతన్ని బాధపెట్టినా కూడా తన మాటే నెగ్గాలనే అతని పంతం, ఇగో వలన ఆమె మౌనాన్ని లెక్కచేయనట్లుగానే ఉండిపోయాడు.

‘శాంతి మనసుని నేను చాలా బాధపెట్టాను. అందుకేనేమో, నా మనసుకి శాంతి అనేది లేకుండాపోయింది. ఇన్ని కోట్లు గడించినా నాకు ఎక్కడో చిన్న పల్లెటూర్లో ఉన్న స్థలాన్ని కూడా పోనీయకూడదు అన్న దుర్బుద్ధి అవసరమా? సౌమ్యమూర్తి అయిన నా భార్యని కేవలం నా అహంభావం వల్లే ఇంతకాలంగా బాధపెట్టాను’ అని పశ్చాత్తాపంతో పునీతమైన మనసుతో వెంటనే భార్యకి ఫోన్‌ చేశాడు.

‘‘శాంతీ, నిన్ను చాలా విషయాల్లో నేను బాధపెట్టాను. ఐయాం వెరీ సారీ. నువ్వు మాట ఇచ్చినట్లుగానే మన ­ళ్ళొ ఉన్న ఆ స్థలాన్ని స్వామివారి ఆశ్రమం పేరిట రిజిస్టర్‌ చేయించే ఏర్పాట్లు వెంటనే చేస్తాను.’’

‘‘థ్యాంక్స్‌ అభీ. రేపు ఉదయం తొమ్మిది గంటలకి ప్యాలెస్‌ గ్రౌండ్స్‌లో స్వామివారి ఉపన్యాసం ఉంది. మీరూ ఈ ఒక్కసారికి నాతోపాటుగా వచ్చి ఆయన ఉపన్యాసాన్ని వింటే ఆయన కార్యక్రమాల పట్ల మీకేమైనా సందేహాలుంటే అవన్నీ కూడా తొలగిపోతాయి, మీకూ నమ్మకం కుదురుతుంది.’’

శాంతి గొంతులో ఆనందం స్పష్టంగా వినిపిస్తోంది.

‘‘నాకే సందేహాలూ లేవు శాంతీ. అంతేకాదు, నీమీద నాకు పూర్తి నమ్మకం ఉంది. అయినాసరే, నీకు కంపెనీగా నీతోపాటు నేనూ స్వామివారి ప్రసంగానికి వస్తాను’’ అని చెప్పి ఫోన్‌ కట్‌ చేశాడు అభిమన్యు.

గాల్లో తేలిపోతున్నట్లుగా మనసంతా తేలిగ్గా హాయిగా ఉండటంతో ‘జీవితంలో ఎన్నో సాధించినా కూడా ఇంతకాలం తన మనసంతా భారంగా, దిగులుగా, అశాంతిగా ఎందుకుంటోంది?’ అన్న తన ప్రశ్నకి సమాధానం ఇంత కాలానికి దొరికినట్లనిపించిందతనికి.

***

ముందు వరుసలో కూర్చుని భార్యతోపాటు స్వామివారి ఉపన్యాసాన్ని శ్రద్ధగా వింటున్న అభిమన్యు మనసుని ఒక సందేహం తీవ్రంగా తొలిచేస్తోంది.

‘దేవుడి మీద తనకు వ్యతిరేక భావమంటూ లేకపోయినా కూడా తన జీవితంలో ఎక్కువగా స్వయంకృషికే ప్రాధాన్యాన్నిచ్చాడు. దేవుడికి ఎప్పుడూ శ్రద్ధగా పూజలు చేసిందీ లేదు, ఆయనముందు చేతులు జోడించి కోరికల చిట్టాని వల్లించిందీ లేదు. అలాంటిది ఆ దేవుడు ప్రత్యేకంగా తనకే ప్రత్యక్షమై వరాలని ఎందుకు అనుగ్రహించినట్లు?’

స్వామివారి గొంతు మైక్‌లో పెద్దగా వినిపిస్తోంది.

‘‘తనని నమ్మనివారికే దేవుడు ప్రత్యక్షం కావలసిన ఆవశ్యకత ఎక్కువగా ఉంది. భగవంతుడి మీద పూర్తి విశ్వాసాన్ని నిలిపి ఆయన్ని నిత్యం కొలిచేవారికి ఆ భగవంతుడు స్వయంగా కనిపించకపోయినా కూడా వారి అవసరాలన్నీ కనిపెట్టుకుని వారి కోరికలని మరెవరి ద్వారానో తప్పకుండా తీరుస్తాడు.’’

వెంటనే ఫ్లాష్‌లా వెలిగింది అభిమన్యుకి.

‘నిజమే అక్క, శివ, శాంతి... వీళ్ళందరూ కూడా ప్రతిరోజూ ఆ దేవుడి మీదే మనసంతా నిలిపి ధ్యానిస్తారు. అందుకే వాళ్ళ మనసులోని కోరికలన్నింటినీ తన ద్వారా తీర్చడం కోసమే ఆ దేవుడు తనకు ప్రత్యక్షమయ్యాడు. అంతేకాదు, తన మొదటి రెండు నిర్ణయాల్ని మార్చుకోవాలన్న ప్రయత్నంలోని అనౌచిత్యాన్ని గుర్తించాడు కాబట్టే అలా జరగకుండా అడ్డుపడ్డాడు.’

సందేహ నివృత్తి జరగడంతో ఎంతోకాలంగా మనసు నిండా పేరుకుపోయిన అశాంతి అంతా తొలగిపోగా ‘శాంతి అన్నది ఎక్కడో లేదు, మన ఆలోచనల్లోనూ, మన జీవన విధానంలోనూ ఉంది’ అన్న విషయాన్ని తనకి అర్థమయ్యేటట్లుగా బోధపరిచిన ఆ భగవంతుడికి మనసులోనే భక్తిగా అంజలి ఘటించాడు అభిమన్యు.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.