close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
అగ్నిపర్వతమ్మీద మంచు మేఘం!

అగ్నిపర్వతమ్మీద మంచు మేఘం!

ప్రకృతిలో చిన్న వింతను సైతం అందమైన పర్యటక ప్రదేశంగా తీర్చిదిద్దడంలో అమెరికన్ల తరవాతే ఎవరైనా. దానికితోడు ఆ సువిశాల దేశంలో వైవిధ్యభరితమైన సహజ ప్రకృతి అందాలతోబాటు మానవనిర్మిత అద్భుతాలెన్నో ప్రపంచ పర్యటకుల్ని నిత్యం ఆకర్షిస్తుంటాయి. వాటిల్లో కొన్నింటినైనా చూడాలన్న కోరికతో దాదాపు నెలరోజులపాటు ఏకబిగిన దేశమంతా పర్యటించి, ఆ విశేషాలను చెప్పుకొస్తున్నారు వైజాగ్‌ వాసి గుమ్మా వేణుప్రసాదరావు.

మెరికా పర్యటనలో భాగంగా ముందుగా తూర్పు తీరంలో పర్యటించాలనుకుని బయల్దేరాం. వాషింగ్టన్‌లో దిగగానే అక్కడికి 200 కి.మీ. దూరంలో దట్టమైన అడవుల మధ్యలో ఉన్న లూరీ గుహల్ని చూడ్డానికి మనుమలతో కలిసి వెళ్లాను. కిలోమీటరు మేర విస్తరించిన సున్నపురాయి గుహలవి. లక్షల సంవత్సరాలుగా కొండలమీద నుంచి లోపలకు ఇంకిన నీరు కారణంగా సున్నపురాయి కరిగి రకరకాల ఆకారాల్లో ఏర్పడ్డాయి. ఆ వింత రూపాలన్నీ గుహల్లోని నీటిమడుగుల్లో ప్రతిబింబిస్తూ చకితుల్ని చేస్తున్నాయి. అవన్నీ చూశాక మళ్లీ వెనక్కి వచ్చి క్యాపిటల్‌ హిల్స్‌ భవనం చూడ్డానికి బయలుదేరాం. ఇది మన పార్లమెంట్‌ లాంటిదే. తరవాత జెఫర్‌సన్‌ మెమోరియల్‌, వైట్‌హౌస్‌ చూసి హోటల్‌కు చేరుకున్నాం.

చాకొలెట్‌ ఫ్యాక్టరీలో...
మర్నాడు ట్రావెల్‌ సంస్థ వాళ్లు ఏర్పాటు చేసిన బస్సులో నగరంలోని నేషనల్‌ ఎయిర్‌ అండ్‌ స్పేస్‌ మ్యూజియం చూడ్డానికి వెళ్లాం. అందులో విమానాల పుట్టుక నుంచి నేటి వరకూ పరిణామక్రమంలో ప్రదర్శనకు ఉంచారు. అంతరిక్షయానం, చంద్రయానానికి సంబంధించిన రాకెట్ల గురించీ అక్కడ సమగ్రంగా తెలుసుకోవచ్చు. తరవాత హర్షె చాకొలెట్‌ వరల్డ్‌కి వెళ్లాం. ఎలక్ట్రిక్‌ మోనో రైల్లో ప్రయాణిస్తూ ముడి కకోవా శుద్ధినుంచి చాకొలెట్‌ తయారీ వరకూ అన్నీ చూశాం. కాంప్లిమెంట్‌గా ఓ చాకొలెట్‌ ఇచ్చారు. ఆర్డరుమీద కావల్సిన ఆకారాల్లో చాకొలెట్లు కూడా చేసి ఇస్తారు.

నయాగరా అందాలు!
ఆ సాయంత్రం నయాగరా ఫాల్స్‌ చూడ్డానికి వెళ్లాం. అమెరికా వైపు ఉన్న మూడు జలపాతాలూ ఫ్లడ్‌ లైట్ల కాంతులతో మెరుస్తుండగా హోరున నీరు కిందకు పడుతున్న శబ్దం, ఒకింత భయాన్ని కలిగిస్తుంది. అయినప్పటికీ ఆ జలపాతం నయనానందకరం. అవతలి పక్కన కెనడా వైపున ఉన్న జలపాతం కూడా మెరిసే దీపాలతో కనువిందు చేస్తుంటుంది. లైట్లు రంగులు మారుతున్నప్పుడల్లా వింత కోణాల్లో కనిపించే జలపాత సౌందర్యం ఆనందాశ్చర్యాలలో ముంచెత్తుతుంది. ఓ గంటసేపు అక్కడే గడిపి హోటల్‌కి చేరుకున్నాం. ఉదయాన్నే అల్పాహారం చేశాక నయాగరాను పగటివేళలో చూడ్డానికి వెళ్లాం. మేం చూస్తున్నప్పుడే ఆ జలపాతం మీదుగా ఓ ఇంద్రధనుస్సు విరిసింది. దాన్ని ఫొటోల్లో బంధించి, జలపాత పాదం దగ్గరకు వెళ్లేందుకు పడవలో బయలుదేరాం. జలపాతం దిశ నుంచి గాలి బలంగా వీస్తుంది. దానికి బోటు వూగిసలాడుతుంది. మా దుస్తులు తడవకుండా ఉండేందుకు పలుచని రెయిన్‌ కోటు ఇచ్చారు కానీ అదేమీ ఆగలేదు. దగ్గరకు వెళుతున్నకొద్దీ తుంపరలు ఎక్కువ అవుతున్నాయి. పక్కనున్న వాళ్లు సైతం కంటికి కనిపించడం లేదు. శరీరస్పర్శ ద్వారా అందరం బోటులోనే ఉన్నామని తెలుస్తోంది. జలపాతహోరులో జనం గోల ఏమీ వినిపించడం లేదు. ఉన్నట్టుండి మా పడవ ఆ తుంపర నుంచి బయటకొచ్చింది. బట్టలు పూర్తిగా తడిసిపోయాయి. ఎండగా ఉండటంతో దుస్తులు అరగంటలోనే ఆరిపోయాయి. జలపాత నీటి తుంపరలు మీదపడుతుంటే కలిగే అనుభవాన్ని వర్ణించలేం. దీన్నే ‘మెయిడ్‌ ఆఫ్‌ మిస్ట్‌ టూర్‌’ అని పిలుస్తారు. మరోసారి నయాగరాను తనివితీరా చూసి, రాత్రికి న్యూయార్క్‌కి బయలుదేరాం.

అక్కడ స్టాచ్యూ ఆఫ్‌ లిబర్టీని చూసి, యునైటెడ్‌ నేషన్స్‌ భవంతిని సందర్శించాం. తరవాత బ్రూక్లిన్‌ వంతెన, మన్‌హటన్‌ స్కైలైన్‌లను చూశాక వాల్‌స్ట్రీట్‌ చూడ్డానికి వెళ్లాం. ప్రపంచ ఆర్థికరంగాన్ని శాసించే ఆ వీధి ఓ కిలోమీటరు పొడవునా ఎత్తైన భవంతుల సముదాయంతో ఉంది. సెప్టెంబరు 11 నాటి సంఘటన జరిగిన ప్రదేశాన్ని చూశాక, ట్రంప్‌ వాణిజ్య భవంతిని కూడా చూశాం. అక్కడే ఉన్న వన్‌ వరల్డ్‌ అబ్జర్వేటరీలోని 102వ అంతస్తు నుంచి చూస్తే న్యూయార్క్‌ నగరం మొత్తం కనిపించింది. మర్నాడు నగరంలోని అమెరికన్‌ మ్యూజియం ఆఫ్‌ నేచురల్‌ హిస్టరీ చూడ్డానికి వెళ్లాం. ప్రపంచంలోని అన్ని ప్రాంతాల్లో నివసిస్తోన్న ప్రజల అలవాట్లూ సంస్కృతీ సంప్రదాయాలకు సంబంధించిన అంశాలను అక్కడ ప్రదర్శిస్తున్నారు. నాలుగు అంతస్తుల్లో ఉన్న ఆ చారిత్రక అంశాలన్నీ చూడ్డానికి ఒకరోజు సరిపోదు. ఓ నాలుగురోజులైనా కావాలనిపించింది.

తరవాతిరోజు ఇంటికి వందమైళ్ల దూరంలో ఉన్న స్టెర్లింగ్‌ హిల్‌ మైనింగ్‌ మ్యూజియం చూడ్డానికి వెళ్లాం. ఆ గనిలో సేకరించిన రాళ్లను ఓ అద్దాల గదిలో బీరువాలో ఉంచారు. చీకటిలో అవి రకరకాల రంగుల్లో మెరుస్తుంటే ప్రకృతిని మించిన కళాకారులెవరు అనిపించింది. అక్కడినుంచి ఫిలడెల్ఫియాలోని నేషనల్‌ ఆర్ట్‌ మ్యూజియం చూడ్డానికి వెళ్లాం. మూడు అంతస్తుల్లో ఉన్న ఈ మ్యూజియంలో చిత్రపటాలనూ శిల్పాలనూ దేశాలవారీగా ఏర్పాటుచేశారు. హాల్లో అమర్చిన ఓ దేవాలయ కారిడార్‌ కళను కట్టి పడేస్తుంది. స్వామినారాయణ మందిరాన్నీ సందర్శించాం. దాని నిర్మాణానికి అవసరమైన తెల్ల పాలరాయిని జైపూర్‌ నుంచే తెచ్చారట.

మంచు మేఘం!
ఉదయాన్నే న్యూయార్క్‌ నుంచి సియాటల్‌కు విమానంలో బయల్దేరాం. సియాటల్‌కి 300 కి.మీ. దూరంలోని ఎత్తైన పర్వతాలమీద మంచు కురిసి చూడ్డానికి ఎంతో బాగుంది. అక్కడకు కాస్త దూరంలోని బల్లార్డ్‌లో నది, సముద్రం కలిసేచోట లాకులు కట్టారు. చేపల వేటకు వెళ్లే పడవలు సముద్ర ఆటుపోటులతో సంబంధం లేకుండా లాకుల ద్వారా ప్రయాణిస్తాయి. సాల్మన్‌ చేపలు నదిలో గుడ్లు పెట్టి, పిల్లలు పెద్దవయ్యాక సముద్రంలోకి వెళ్లే సమయంలో అవి లాకుల దగ్గర కనువిందు చేస్తాయట.

కెనడాకు అత్యంత సమీపంలో ఉండటంతో సియాటల్‌ వాతావరణం చాలా చల్లగా ఉంది. దీనికి మూడువైపులా రెయినియర్‌, కోస్‌కియాస్కో, ఒలింపస్‌ అనే అగ్నిపర్వతాలు ఉండగా, మరో పక్క పసిఫిక్‌ మహాసముద్రం ఉంటుంది.. ఒకరోజు అక్కడ నుంచి రెయినియర్‌ పర్వతాన్ని చూడాలని బయల్దేరాం. దారిలో దీనికి సంబంధించిన మ్యూజియంలో ఎనిమిది అడుగుల వ్యాసం కలిగిన చెట్టు మొదలును కోసి ప్రదర్శనకు ఉంచారు. అది చూశాక రెయినియర్‌ పర్వతం దగ్గరకు చేరుకున్నాం. జూన్‌ నెలలోనూ అక్కడ విపరీతమైన మంచు కురుస్తోందీ అంటే ఇక, చలికాలంలో వూహించుకోవడానికే భయమేసింది. సందర్శకుల భవంతిలో అక్కడ నివసించే జంతువుల గురించీ పూలమొక్కల గురించీ డాక్యుమెంటరీ ద్వారా తెలుసుకున్నాం. నీలాకాశంలో ఎక్కడా మేఘాలు లేవు. కానీ పర్వతంమీద మాత్రం గొడుగులాంటి తెల్లని మేఘం కళ్లను కట్టిపడేస్తుంటుంది. శిఖరంపై కురిసిన మంచు అగ్నిపర్వతంలోంచి వచ్చే లావా వేడికి ఆవిరై, తెల్లని పొగమంచుగా మారి, శిఖరమ్మీద గొడుగులాగా ఏర్పడి, ఓ ప్రకృతి వింతగా మారిందన్నమాట.

మరోరోజు సియాటల్‌కి సంకేతంగా నిలిచే స్పేస్‌ నీడిల్‌ కట్టడాన్ని చూడ్డానికి వెళ్లాం. 605 అడుగుల ఎత్తులో ఉన్న ఈ టవర్‌కి 520 అడుగుల ఎత్తులో చుట్టూ ఓ కారిడార్‌ను కట్టారు. అక్కడ నుంచి నగరాన్ని అన్ని వైపులనుంచీ చూడొచ్చు. మర్నాడు బోయింగ్‌ విమానాలు తయారుచేసే ఫ్యాక్టరీకి వెళ్లాం. ఇక్కడ నెలకు 144 విమానాలు తయారవుతాయట. 35 వేల మంది పనిచేస్తున్నారు. రెండుమూడు అంతస్తులుగా ఉన్న ఆ విమానాల తయారీని చూస్తుంటే మానవ మేధస్సుకి ఆశ్చర్యపడకుండా ఉండలేం.

కాలిఫోర్నియా అందాలు!
తరవాతి మజిలీ... పడమట భాగంలోని కాలిఫోర్నియా రాష్ట్రంలోని శాన్‌హోసై. అక్కడికి శాన్‌ఫ్రాన్సిస్కో దగ్గరే కావడంతో ఆ నగరాన్ని చూడ్డానికి బయలుదేరాం. మెట్రోరైల్లో డౌన్‌టౌన్‌నూ, నగరంలోని గోల్డెన్‌ గేట్‌ బ్రిడ్జినీ, బే బ్రిడ్జినీ చూశాక, సమీపంలోని ద్రాక్షతోటల్నీ వైన్‌ ఫ్యాక్టరీల్ని చూసి తిరిగి వచ్చేటప్పుడు గూగుల్‌, ఒరాకిల్‌, సిస్కో ఆపిల్‌... వంటి ఐటీ ఆఫీసులన్నీ కూడా చూశాం. మర్నాడు స్థానికంగా ఉన్న రైతు బజారుకు వెళ్లాం. చుట్టుపక్కల వ్యవసాయ క్షేత్రాల్లో పండించిన కూరగాయల్ని ట్రక్కులతోనూ జీపులతోనూ ఉదయం ఆరుగంటలకే నగరంలోని మార్కెట్లకు తీసుకొస్తారు. సాయంత్రం అక్కడికి 30 మైళ్ల దూరంలోని రెడ్‌వుడ్‌ ఫారెస్ట్‌ సందర్శనకు వెళ్లాం. అక్కడ 16 అడుగుల వ్యాసం కలిగిన ఓ చెట్టు వయసు 1800 సంవత్సరాలు. కొన్ని చెట్లు తొలిచి ఉన్నాయి. వాటిల్లో ఆరు నుంచి ఎనిమిది మంది మనుషులు పట్టేంత ఖాళీ ఉంది. ఒకరోజు యోసమిటి పార్కుకి వెళ్లాం. ఇది శాన్‌ఫ్రాన్సిస్కోకి 200 మైళ్ల దూరంలో సియెర్రా నెవాడా పర్వతపంక్తుల్లోనే ఉంది. గ్రానైట్‌ రాయితో ఎవరో శిల్పి చెక్కినట్లున్న ఇక్కడి పర్వత సౌందర్యాన్ని మాటల్లో వర్ణించలేం. ఏళ్ల తరబడి ప్రకృతి మార్పులకు తట్టుకుంటూ నిట్టనిలువుగా రూపొందిన ఆ పర్వతాలు పర్వతారోహకులకు సవాళ్లను విసురుతుంటాయి.

నిశాచర నగరంలో...
తరవాతి సందర్శన లాస్‌వేగస్‌. నెవాడా ఎడారి అంచున ఉన్న ఈ నగరం రాత్రంతా చురుగ్గా ఉంటుంది. సాయంత్రం ఆరుగంటలకు మేల్కొని, తెల్లవారుజామున నాలుగు గంటల వరకూ ఆటపాటలతో అలసిపోయి, ఉదయానికి నిద్రలోకి జారుకుంటుంది. అందుకే ఆ నగరాన్ని నిశితంగా చూడాలంటే రాత్రివేళల్లోనే మేల్కొనాలి. మర్నాడు కొలరాడో నదిమీద ఉన్న హూవర్‌ వంతెన చూడ్డానికి వెళ్లాం. ఏటా ఈ నదికి వచ్చే వరదల కారణంగా అనేక వందలమంది చనిపోతుండటంతో దీన్ని నిర్మించారు. విల్లు మాదిరిగా డిజైన్‌ చేసిన ఈ ఆనకట్ట, సుమారు ఐదు వందల అడుగుల ఎత్తు ఉంటుంది. దీన్నుంచి ఉత్పత్తి అవుతోన్న విద్యుచ్ఛక్తి సిలికాన్‌ వ్యాలీ అవసరాలను తీరుస్తోంది. తరవాత ఈరీ సరస్సు ఒడ్డున ఉన్న బోస్టన్‌ నగరాన్ని సందర్శించాం. కొలంబస్‌ అమెరికాను కనిపెట్టాక, ఇది బ్రిటిష్‌ సామ్రాజ్యంలో ఓ వలస ప్రాంతంగా మారింది. దాంతో బ్రిటన్‌లో శిక్ష పొందినవారూ దేశ బహిష్కరణ పొందినవారూ నీగ్రో బానిసలూ... ఇలా విభిన్న వర్గాలకు చెందినవాళ్లు ఇక్కడ స్థిరపడ్డారు. ఈ ప్రాంతం ఇంగ్లాండ్‌ వాతావరణాన్ని పోలి ఉంటుంది. పైగా ఇక్కడ తుఫానులు తక్కువ కావడంతో ఈ ప్రాంతం బాగా అభివృద్ధి చెందింది. ఇక్కడ ఇళ్లు కూడా ఇంగ్లాండ్‌లో మాదిరిగానే ఉంటాయి. ఇక్కడి ప్రజలు మాట్లాడే భాష కూడా బ్రిటిష్‌ ఇంగ్లిష్‌నే తలపిస్తుంది. చివరగా పెన్‌గుహల్ని కూడా చూసి వైజాగ్‌కు తిరిగొచ్చాం.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.