close
ఆ కథ పట్టుకుని రెండేళ్లు తిరిగా!

ఆ కథ పట్టుకుని రెండేళ్లు తిరిగా! ­

వూహ తెలియని వయసులో రోజూ సినిమా హాలుకి వెళ్లిన ఆ పిల్లాడు ఇప్పుడు లక్షల మందిని సినిమా హాళ్లకి రప్పిస్తున్నాడు. కెరీర్‌ ప్రారంభంలో తన మాటలతో గారడీ చేసిన ఆ కుర్రాడు దర్శకుడిగా మారి మేజిక్‌ చేస్తున్నాడు. తన రాకను భారీ ‘పటాస్‌’ పేల్చి చెప్పిన ఆ యువ దర్శకుడు అనిల్‌ రావిపూడి. ఈ దీపావళికి ‘రాజా ది గ్రేట్‌’ని తీసుకొచ్చిన అనిల్‌ తన సినిమా ప్రస్థానాన్ని మనతో పంచుకుంటున్నారిలా...

‘ఇండస్ట్రీలో ఎవరూ చెప్పని కొత్త కథ ఏదైనా ఉంటే చెప్పు అనిల్‌...’ సుప్రీమ్‌ తర్వాత దిల్‌రాజు గారన్న మాటలివి. ఆయన అంత ధైర్యంగా అడిగేసరికి వెంటనే ‘తప్పకుండా చెబుతానండీ’ అన్నాను. ఆ మర్నాడే వెళ్లి కథ వినిపించాను. ‘కొత్తదనం అన్నాను కానీ మరీ ఇంతలా అనుకోలేదు. సబ్జెక్ట్‌ చాలా కష్టమేమో’... హీరో అంధుడు అని చెప్పగానే రాజుగారు అన్న మాటలివి. ‘కష్టమే అయినా చేస్తాను. చేయగలను’ అని చెప్పాను. అప్పటికే కొన్నాళ్లుగా ఆ కథ మీద పనిచేస్తున్నాను. అందుకే నాకా ధైర్యం. మరొక రోజు కథ మొత్తం వివరంగా చెప్పాను. ‘ఓకే స్టార్ట్‌’ అన్నారు. తర్వాత రవితేజ గారిని హీరోగా అనుకున్నాక నా జోష్‌ మరింత పెరిగింది. దిల్‌రాజూ, రవితేజా నన్ను గుడ్డిగా నమ్మి చేసిన కథే ‘రాజా ది గ్రేట్‌’. హిట్టూ ఫ్లాపూ అన్న సంగతి పక్కనపెడితే ఇదో పెద్ద ప్రయోగం. అందుకే ఈ సినిమాకి మేమంతా 24 గంటలూ ఎంతో ఉత్సుకతతో పనిచేశాం. దర్శకుడిగా నాకిది మూడో సినిమా. ఇక్కడి వరకూ ఎలా వచ్చానో చెప్పలేదు కదా..!

సినిమాల్లో అక్షరాభ్యాసం
నా జీవితంలో స్కూలు, సినిమా రెండూ దాదాపు ఒకేసారి మొదలయ్యాయి. మా సొంతూరు ప్రకాశం జిల్లా చిలుకూరువారి పాలెం. నా చిన్నపుడు అమ్మానాన్న అక్కణ్నుంచి మహబూబ్‌నగర్‌ జిల్లాలోని అమరవాయి ప్రాంతానికి వచ్చి వ్యవసాయం చేసేవారు. అక్కడ వూ­రి చివరన మా ఇల్లు. ఇంటి పక్కనే టెంట్‌ హాల్‌ ఉండేది. స్కూల్‌కి సెలవు అయితే నన్ను ఆ హాల్లో ప్రొజెక్టర్‌ తిప్పే గిరి అనే అతని పక్కన కూర్చోబెట్టి పొలానికి వెళ్లిపోయేవారు. అతని దగ్గర కూర్చుని సినిమా చూసేవాణ్ని. అలా చాలా చిన్నపుడే నా ప్రమేయం లేకుండానే జీవితంలో సినిమా ఒక భాగమైపోయింది. ­వూహ తెలిశాక కూడా ఆటలూ, చదువూ, సినిమా ఈ మూడూ ఉండేవి. వారంలో నాలుగైదు సినిమాలైనా చూసేవాణ్ని. బాగా చదువుతుండటంతో మావాళ్లు సినిమాలకి అడ్డు చెప్పలేదు. అలా పుస్తక జ్ఞానంతోపాటు సినిమా జ్ఞానమూ పెరిగింది. అప్పట్లో సినిమా కథలు ఆడియో రూపంలో వచ్చేవి. వాటిని విని అందులోని పాత్రల డైలాగుల్ని ఇమిటేట్‌ చేస్తూ స్నేహితులకి చెప్పేవాణ్ని. నాలుగో తరగతిలో ఉండగా నాన్నకు ఆర్టీసీలో డ్రైవర్‌గా ఉద్యోగం రావడంతో అద్దంకి వచ్చేశాం. అక్కడ పదో తరగతి వరకూ, ఇంటర్మీడియెట్‌ గుంటూరులో చదివాను. ఇంటర్‌ ఫస్టియర్‌లో 90 శాతం మార్కులు వచ్చాయి. ఎందుకంటే ఆ ఏడాది నాలుగే సినిమాలు చూశాను. కానీ సెకండ్‌ ఇయర్‌కి వెళ్లాక ఫ్రెండ్స్‌తో కలిసి సెకండ్‌ షోలు చూడ్డం, వాటి గురించి చర్చించుకోవడం... ఇదే పని. దాంతో మార్కులు తగ్గాయి.

కాలేజీలో ‘డైరెక్టర్‌’ని...
ఇంటర్మీడియెట్‌ తర్వాత వడ్లమూడిలోని ‘విజ్ఞాన్‌ ఇంజినీరింగ్‌ కాలేజీ’లో చేరాను. క్లాసులో బ్యాక్‌ బెంచ్‌లో కూర్చునేవాణ్ని. అలాగని అల్లరి విద్యార్థిని కాదు. అనిల్‌ అంటే, ‘కామ్‌గా కూర్చొనే అబ్బాయి’... అన్నట్లు ఉండేవాణ్ని. 2003లో థర్డ్‌ ఇయర్‌లో ఉండగా ‘విజ్ఞాన్‌ మహోత్సవ్‌’ పేరుతో కాలేజీలో ఒక వేడుక జరిగింది. ఆరోజు మా ఈసీఈ క్లాస్‌మేట్స్‌చేత ఒక స్కిట్‌ చేయించాను. దానికి మంచి స్పందన వచ్చింది. ఒకటే ఈలలూ చప్పట్లూ. ఆ స్పందన చూసి ఓ వైపు ఆశ్చర్యం, మరోవైపు ఆనందం. ‘స్కిట్‌ సూపర్‌ డైరెక్టర్‌’ అని అరవడం మొదలుపెట్టారు. ఆ మాటలకి బాగా కనెక్ట్‌ అయిపోయాను. ‘డైరెక్టర్‌’... అయితే అన్న ఆలోచన మొదలైంది. ఇంజినీరింగ్‌ అయ్యాక ఇంట్లో సినిమాల్లోకి వెళ్తానని చెప్పాను. అమ్మ, అక్క ఓకే. నాన్న ఏం అంటారోనని భయపడ్డాం. కానీ ఆయనా సరేనన్నారు. కానీ, ఒక షరతు పెట్టారు. నాలుగేళ్లలో కుదురుకోకుంటే మాత్రం ఉద్యోగం చూస్కోవాలీ అని, సరేనన్నాను.
నేను సినిమాల్లోకి అంత ధైర్యంగా రావడానికి మరో కారణం ఉంది. మా బాబాయి అరుణ్‌ ప్రసాద్‌... అప్పటికే దర్శకుడిగా ఉన్నారు. ‘తమ్ముడు’ సినిమాకి ఆయనే దర్శకుడు. ఆయనతో మాట్లాడితే రమ్మన్నారు. 2005లో హైదరాబాద్‌లో అడుగుపెట్టాను. అప్పుడు ఆయన చేస్తున్న ‘గౌతమ్‌ ఎస్‌ఎస్‌సీ’కి డైరెక్షన్‌ డిపార్ట్‌మెంట్‌లో అప్రెంటీస్‌గా చేరాను. సినిమా కష్టాలు అర్థమవడానికి నాకు రెండు వారాలు సరిపోయింది. మంచి వేసవి ఎండల్లో షూటింగ్‌. నన్ను ఎవరూ పట్టించుకోవడంలేదన్న ఫీలింగ్‌. ఒక దశలో తిరిగి వెళ్లిపోదాం అనుకున్నాను. దిగాలుగా ఉన్న నన్ను పిలిచి ‘ఏరా అలా ఉన్నావు’ అని అడిగారు బాబాయి. విషయం చెప్పాను. ‘ఇక్కడ ఎవరూ పనిచెప్పరు. నీకు నువ్వే పని కల్పించుకుని నిన్ను నిరూపించుకోవాలి’ అన్నారు. ఆ మాటలు నా ఆలోచనల్ని మార్చాయి. ఆ తర్వాత నుంచీ ఎక్కడ అవకాశం వచ్చినా నా ఉనికిని చాటుకునేవాణ్ని.
అజిత్‌తో వీరం, వెదలం, వివేకం సినిమాలు తీసిన దర్శకుడు శివ... ‘గౌతమ్‌ ఎస్‌ఎస్‌సీ’కి కెమెరామేన్‌. నాకు మంచి మిత్రుడు. దర్శకుడిగా అతడి తొలి సినిమా ‘శౌర్యం’. ఆ సినిమాకి దర్శకత్వం, మాటల విభాగాల్లో పనిచేశాను. తర్వాత అతడి ‘శంఖం’కీ పనిచేశాను. అవి చేస్తున్నపుడు కెమెరామేన్‌ సంతోష్‌ శ్రీనివాస్‌తో పరిచయమైంది. దర్శకుడిగా ఆయన మొదటి సినిమా ‘కందిరీగ’కి పనిచేశాను. పూర్తి స్వేచ్ఛతో స్క్రిప్టూ, మాటలూ రాసిన నా తొలి సినిమా ఇది. అరుణ్‌ ప్రసాద్‌ గారి దగ్గర పనిచేస్తూ డైలాగులు రాయడం, స్పాట్‌లో స్క్రిప్టుకి మెరుగులు దిద్దడం, ఆర్టిస్టులని సమన్వయం చేసుకోవడం... తెలుసుకున్నాను. తర్వాత నేను పనిచేసిన ఇద్దరు దర్శకులూ కెమెరామేన్లు కావడంతో వారి దగ్గర షాట్‌ డివిజన్‌, మేకింగ్‌లో మెలకువలు నేర్చుకున్నాను. ‘కందిరీగ’ నుంచీ రామ్‌తో స్నేహం కుదిరింది. తర్వాత వెంకటేష్‌, రామ్‌ నటించిన ‘మసాలా’కి మాటలురాసే అవకాశం ఇచ్చారు.

మొదటి సినిమా
శివతో రవితేజ ‘దరువు’కి పనిచేస్తున్న సమయంలోనే మరోవైపు డైరెక్టర్‌గా ప్రయత్నాలు మొదలుపెట్టాను. ‘పటాస్‌’ కథని మొదట రవితేజకి వినిపించాను. అప్పటికి మెహర్‌ రమేష్‌, రవితేజ కాంబినేషన్లో ఓ సినిమా అనుకుంటున్నారు. దాని టైటిల్‌ ‘పవర్‌’. కథ రాసింది వక్కంతం వంశీ. ‘ఈ రెండు కథల మధ్యా పోలిక కనిపిస్తోంది. నీ కథ బాగుంది. కానీ ఇప్పటికే అది ఓకే చేశాను. ఇంకో కథ ఉంటే చూడు’ అన్నారు రవి. ఆ తర్వాత అదే పూరీ-తారక్‌ల టెంపర్‌గా వచ్చింది. ‘పటాస్‌’ కథని ఇండస్ట్రీలో చాలామందికి వినిపించాను. రానా, విష్ణు అనుకున్నాం. కొన్ని కారణాలవల్ల కుదరలే. ఆ టైమ్‌లో కల్యాణ్‌రామ్‌ గారిని కలిశాను. కథ విన్నాక ‘ఇంత పెద్ద స్థాయిలో యాక్షన్‌, ఎంటర్‌టైన్మెంట్‌ నేనిప్పటివరకూ చేయలేదు. పెద్ద హీరో ఎవరైనా చేస్తేనే బెటర్‌’ అన్నారు. ఆ దశలో ‘ఆగడు’కి మాటలు రాసే అవకాశం వచ్చింది. కామెడీలో ఒక్కో దర్శకుడిదీ ఒక్కో శైలి. శ్రీనువైట్ల కామెడీలో ఒక టైమింగ్‌ ఉంటుంది. అది కొంత నేర్చుకున్నాను. స్క్రిప్టు రైటింగ్‌ పరంగా కొన్ని విషయాలు నేర్చుకున్నాను. ఆ సినిమా అంత బాగా ఆడలేదన్న విషయాన్ని పక్కనపెడితే నేర్చుకోవడానికి నాకో మంచి అవకాశమైంది. ‘ఓం’ రిలీజైన తర్వాత మళ్లీ వెళ్లి కల్యాణ్‌రామ్‌ని కలిశాను. ‘ఒక్క ఛాన్స్‌ ఇవ్వండి. మనం చేయగలం’ అన్నాను. నా నమ్మకాన్ని చూసి అవకాశం ఇచ్చారు. అంతే, ఆ తర్వాత మాత్రం ఎలాంటి పరిమితులు పెట్టలేదు. అలా రెండేళ్ల నా ప్రయత్నం ఎట్టకేలకు ఫలించింది. బయట ప్రొడక్షన్‌ కోసం చాలా ప్రయత్నించాం. ఎవరూ ముందుకు రాలేదు. అయితే కల్యాణ్‌రామ్‌ ముందే ఒక మాట చెప్పారు. ‘నిర్మాత దొరక్కపోతే, నేనే నిర్మిస్తా. నువ్వు కథ మీదే బాగా దృష్టి పెట్టు’ అని. చివరకు ఆయనే నిర్మించారు. కల్యాణ్‌రామ్‌ని ఎంతో ఫ్రెష్‌ లుక్‌లో చూపించిన సినిమా అది. 2015లో వచ్చిన పటాస్‌ మంచి హిట్‌ అయింది. నామీద కల్యాణ్‌రామ్‌ ఉంచిన నమ్మకం వమ్ము కానందుకు ఎంతో సంతోషించాను. నిజానికి ‘పటాస్‌’ను ఎన్నో ఒత్తిళ్ల మధ్య తీశాను. 2012లో నాకు పెళ్లి అయింది. లైఫ్‌లో సరిగ్గా సెటిల్‌ అవలేదన్న ఫీలింగ్‌ ఒకవైపు, ప్రాజెక్టు ఆలస్యమవుతోందన్న టెన్షన్‌ మరోవైపు... మొత్తానికి ఆరంభం అదిరింది. దర్శకుడిగా నా కెరీర్‌కి పునాది వేసిన కల్యాణ్‌రామ్‌ని ఎప్పటికీ మర్చిపోలేను.

సినిమా పండుగ
పటాస్‌ తర్వాత ‘సుప్రీమ్‌’ కథని దిల్‌రాజు గారికి వినిపించాను. సాయి ధరమ్‌తేజ్‌- రాశీఖన్నాల కాంబినేషన్లో వచ్చిన ఆ సినిమా కూడా బాగా ఆడింది. ఆ సినిమా చేస్తున్నపుడే దిల్‌రాజు గారితో మంచి అనుబంధం ఏర్పడింది. అందుకే ఆయనకి ‘రాజా ది గ్రేట్‌’ లాంటి విభిన్నమైన కథని చెప్పగలిగాను. నా మొదటి సినిమాకి అనుకున్న రవితేజ మూడో సినిమాకి వచ్చారు. కథ మొత్తం అంధుడిగా నటించడాన్ని ఆయన ఛాలెంజ్‌గా తీసుకున్నారు. హీరో అంధుడు కాబట్టి కథలో ప్రతి మాటనీ, ప్రతి సీన్‌నీ జాగ్రత్తగా ప్లాన్‌ చేసుకున్నాం. దర్శకుణ్ని నమ్మితే, ఎంతటి ప్రయోగానికైనా సిద్ధమయ్యే నిర్మాత దిల్‌రాజు. నిర్మాత శిరీష్‌ గారితోనూ నాది మంచి అనుబంధం. ఇప్పుడు ‘ఎస్వీసీ’ నా సొంత సంస్థ అన్నంత కంఫర్ట్‌ లెవెల్‌ ఉంది. ‘దసరా, సంక్రాంతిలకు భిన్నంగా దీపావళి సినిమావాళ్లకి ఆఫ్‌ సీజన్‌. ఈసారి దీపావళిని మనం సినిమా పండుగ్గా మారుద్దాం’ అని చెప్పి సినిమా విడుదల చేయించారు రాజుగారు. దర్శకుడిగా నా జర్నీలో నాతోపాటు కొందరు వ్యక్తులు ఉన్నారు. సాయికార్తీక్‌, ఎస్‌.కృష్ణ, తమ్మిరాజు, ప్రకాశ్‌... మాదంతా ఒక బృందం. మేం స్నేహితులం కూడా. ప్రతి ప్రాజెక్టునీ ఎంతో ఇష్టంతో పనిచేసుకుంటాం. ప్రతి విషయాన్నీ వీళ్లతో చర్చిస్తాను. కానీ అంతిమ నిర్ణయం నేనే తీసుకుంటా. దర్శకుడిగా అది నా బాధ్యత కూడా. నా సినిమా ఫలితాన్నిబట్టీ నా శ్రేయోభిలాషులు ఇచ్చే సలహాలనుబట్టీ తర్వాత ఏం చేయాలనేది నిర్ణయించుకుంటా. ప్రస్తుతం ఆ పనిలోనే ఉన్నాను.

బెల్లం శ్రీదేవి ఎవరంటే...

నాన్న బ్రహ్మయ్య, అమ్మ అనంత లక్ష్మి. నా భార్య భార్గవి. సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌. మాకో పాప. అక్క రాధిక... కాలేజీ ప్రిన్సిపల్‌. ఆర్థికంగా, మానసికంగా నాకు మంచి మద్దతు ఇచ్చింది. వాళ్లకి నేను చేయాల్సింది చాలా ఉంది. ఇప్పుడు ఇంట్లో నా శ్రీమతి నుంచి కూడా పూర్తి మద్దతు ఉంటుంది.
* నాకు ఇష్టమైన రచయిత, దర్శకుడు... జంధ్యాల. ఆయన సినిమాలు చూసుండకపోతే నా సినిమాల్లో ఇంత ఎంటర్‌టైన్‌మెంట్‌ ఉండేది కాదు. ఇప్పటికీ వీలుకుదిరినప్పుడల్లా జంధ్యాల సినిమాలు చూస్తాను. అభిమాన హీరో రాజేంద్రప్రసాద్‌.
* 1980, 90ల సినిమాలు చూస్తూ పెరిగాను. ‘రౌడీ ఇన్‌స్పెక్టర్‌’ బాగా ఇష్టమైన సినిమా. అందుకే ఆ సినిమాలోని ‘అరె ఓ సాంబా’ పాటని పటాస్‌లో పెట్టా. ‘సుప్రీమ్‌’లో తేజూ హీరో కాబట్టి చిరంజీవిగారి పాట ‘అందం హిందోళం’ పెట్టాను. పాత పాటల్ని రీమిక్స్‌ చేయడమంటే వారిని గుర్తు చేసుకోవడం, గౌరవించడం.
* సోషల్‌ నెట్‌వర్క్‌... సినిమా ప్రమోషన్‌కి ఉపయోగిస్తాను. కొన్నాళ్ల కిందట ఫేస్‌బుక్‌లో నాకో అమ్మాయి ‘హాయ్‌ ఐయామ్‌ బెల్లం శ్రీదేవి. ఏక్సెప్ట్‌ మి యాజ్‌ యువర్‌ ఫ్రెండ్‌’ అని మెసేజ్‌ పెట్టింది. ఆ పేరు, ఆమె ఆటిట్యూడ్‌ బావున్నాయనిపించింది. అందుకే సుప్రీమ్‌లో రాశీఖన్నాకి ఆ పేరు పెట్టేసి ఓ పాట కూడా రాయించా!

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.