close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ఆఫీసుకి హాయిగా వెళ్లిరండి!

ఆఫీసుకి హాయిగా వెళ్లిరండి!

నగరాల్లో ఆఫీసుకి వెళ్లి రావడమంటే రోజుకు రెండుసార్లు సహనాన్ని పరీక్షించుకోవడమే! ఉద్యోగులకు అసలు పనికంటే ఈ ప్రయాణమే సమస్యవుతోంది. హైదరాబాద్‌లో ఓ మిత్ర బృందం దీనికి చూపిన పరిష్కారమే ‘కమ్యూట్‌’!

కొత్తపేట నుంచి 30 కి.మీ. దూరంలోని హైటెక్‌సిటీలోని ఆఫీసుకి వెళ్లొచ్చేసరికి హేమంత్‌కి రోజూ నరకం కనిపించేది! ఏడాది తిరిగేసరికి ఆ అనుభవంతో అతడికి ఓ వ్యాపార ఆలోచన తట్టింది కూడా! ఆ ఐడియాని మిత్రులు ప్రశాంత్‌, సందీప్‌, చరణ్‌, శృజయ్‌, అక్షయ్‌లతో పంచుకున్నాడు. వీళ్లంతా హైదరాబాద్‌లోని ట్రిపుల్‌ఐటీ పూర్వవిద్యార్థులు. స్నేహితులకీ ఆ ఆలోచన నచ్చింది... కానీ ఎక్కడో చిన్న అనుమానం. దాన్ని నివృత్తి చేసుకోవాలని 500 మందితో మాట కలిపారు. ‘మీరు ఆఫీసుకి వెళ్లొచ్చే అనుభవం ఎలా ఉంటోంది?’ అన్న ప్రశ్నకు అందరి నుంచీ... ‘తలనొప్పి వ్యవహారంలా ఉంటోంది’ అనే సమాధానమే వచ్చింది. ‘అనుమానంలేదు, ముందడుగు వేయొచ్చు’ అనుకుని కమ్యూట్‌ (commut.co)ని ప్రారంభించారు!

ఇద్దరితో మొదలు
హైదరాబాద్‌ నగరం నలుమూలల నుంచీ హైటెక్‌ సిటీ, రహేజా మైండ్‌ స్పేస్‌, ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌ ప్రాంతాల్లోని ఐటీ కంపెనీల్లో పనిచేసే లక్షల మంది ఉద్యోగులకు సులభమైన రవాణా సౌకర్యం కల్పించే లక్ష్యంతో ఏర్పాటైందే కమ్యూట్‌. ఇది ఒక విధంగా ఓలా, ఉబర్‌లలో ప్రయాణం లాంటిదే. వాటితో పోల్చితే ఖర్చు తక్కువ. కమ్యూట్‌కు చెందిన వింగర్‌, టెంపో వాహనాలు ఎల్బీ నగర్‌, ఉప్పల్‌, ఈసీఐఎల్‌, మియాపూర్‌, భెల్‌ మొదలైన ప్రాంతాల్లో ఉదయం నుంచి సాయంత్రం వరకూ అందుబాటులో ఉంటాయి. వెబ్‌సైట్‌, ఆప్‌లలోకి వెళ్లి ఉద్యోగులు తమ ప్రాంతం నుంచి అందుబాటులో ఉన్న వాహనాల్లో సీట్లు బుక్‌ చేసుకోవచ్చు. కమ్యూట్‌లో ఛార్జీలు ఉబర్‌ పూల్‌, ఓలా షేర్‌లకంటే చాలా తక్కువ, ఆర్టీసీ నడిపే ఏసీ బస్సులకు దాదాపు సమానం. ఈ వాహనాల్లో సీటు మాత్రం కచ్చితంగా దొరుకుతుంది. 2015 సెప్టెంబరులో ‘కమ్యూట్‌’ని ప్రారంభించినపుడు వాహన యజమానులెవ్వరూ ఈ కుర్రాళ్లని నమ్మలేదు. ఒకటికి పదిసార్లు అడిగితే ఇద్దరు మాత్రం తమ వాహనాల్ని అందుబాటులో ఉంచారు. అలా రెండు వాహనాలతో, ఇద్దరు ప్రయాణికులతో మొదలైన కమ్యూట్‌లో ప్రస్తుతం వాహనాల సంఖ్య 80కి పైనే. రోజూ ప్రయాణించేవారి సంఖ్య 1500లకు పైమాటే.

మహిళలే ఎక్కువ
కమ్యూట్‌ 8, 12, 15 సీట్లుండే వాహనాలనే నడుపుతుంది. హైటెక్‌ సిటీతోపాటు కొండాపూర్‌, మణికొండ వైపూ పరిమిత సంఖ్యలో వీటిని నడుపుతున్నారు. ‘సాధారణంగా హైదరాబాద్‌లో ఐటీ ఉద్యోగులు రానుపోనూ మూడు గంటలు ప్రయాణం చేస్తారు. ఉదయం ప్రయాణంలో అనుకోని సంఘటన ఎదురైనా, బస్సులో సీటు దొరక్కపోయినా రోజంతా ఆ ప్రభావం ఉంటుంది. కమ్యూట్‌లో ఎన్ని సీట్లు ఉంటే అందరికే అనుమతి ఉంటుంది. డ్రైవర్లకు వాహనం నడిపే తీరుతోపాటు, ప్రయాణికులతో మాట్లాడే విషయంలోనూ శిక్షణ ఇస్తాం. ముఖ్యంగా మహిళా ప్రయాణికుల విషయంలో ఎంత మర్యాదగా వ్యవహరించాలో చెబుతాం. ఉత్తమ సర్వీసు అందించే డ్రైవర్లకు అవార్డులూ ఇస్తాం. ఆప్‌లో ట్రాకింగ్‌ కూడా ఉంటుంది. ప్రయాణికులు ఏదైనా సమస్య ఉందని చెబితే వెంటనే స్పందిస్తాం. వాహనాల్లో సీట్లూ, సీటు కవర్లూ, విండో కర్టెన్లూ బాగా ఉండేలా చేస్తాం. ఇవన్నీ చూశాక ఒకసారి మా వాహనాల్లో ప్రయాణించినవారే మళ్లీ మళ్లీ వస్తారు. కొత్తవారినీ తెస్తారు. ముఖ్యంగా మా ప్రయాణికుల్లో మహిళలే 60 శాతం ఉంటున్నారు. దీన్నిబట్టి చెప్పొచ్చు మాదెంత సురక్షితమైన, సౌకర్యవంతమైన ప్రయాణమో’ అని చెబుతారు చరణ్‌. కమ్యూట్‌లో ప్రయాణించాలనుకునేవారు పది నిమిషాల ముందు నుంచి నెల రోజుల వ్యవధి వరకూ టికెట్‌ బుక్‌ చేసుకోవచ్చు. నెల మొత్తానికి బుక్‌ చేసుకుంటే ధర తగ్గుతుంది. కొత్త రూట్లలో వాహనాలు కావాలని తగినంతమంది ఆప్‌లో కోరితే తిప్పడానికి సిద్ధంగా ఉంటారు. కమ్యూట్‌ వాహనాల్లో 80 శాతం ఏసీవే ఉన్నాయి. వీటిని ఆఫీసు వేళల్లో ఎక్కువగా నడుపుతారు. ఉదయం ఏడు నుంచి సాయంత్రం నాలుగు వరకూ ఉంటాయి. ఎల్బీనగర్‌-హైటెక్‌సిటీ-గచ్చిబౌలి రూట్లో 15 నిమిషాలకో వాహనం అందుబాటులో ఉంటుంది. శని, ఆదివారాల్లో మాత్రం సర్వీసులు ఉండవు.

వ్యక్తిగత వాహనాల వినియోగాన్ని తగ్గించి, ట్రాఫిక్‌ రద్దీనీ, కాలుష్యాన్నీ తగ్గించాలనేది కమ్యూట్‌ వ్యవస్థాపకుల లక్ష్యాల్లో ఒకటి. దీన్లో భాగంగా ‘గ్రీన్‌ మైల్‌’ సంస్థ హైదరాబాద్‌లో విమానాశ్రయానికి నడిపే ఎలక్ట్రానిక్‌ వాహనాల్లో టికెట్లనూ కమ్యూట్‌ ఆప్‌లో బుక్‌ చేసుకొనే వీలు కల్పిస్తున్నారు! కమ్యూట్‌తో వాహన యజమానులకూ మేలు జరుగుతోంది. అందుకు ఉదాహరణ రాఘవేంద్ర. తన సొంత వాహనాన్ని నడిపే రాఘవేంద్ర కమ్యూట్‌లో చేరాక మరో వాహనాన్ని కొని వేరే డ్రైవర్‌కీ ఉపాధి కల్పిస్తున్నాడు! రాబోయే ఏడెనిమిది నెలల్లో తమ సేవల్ని హైదరాబాద్‌లో మరింతగా విస్తరించాలనేది కమ్యూట్‌ వ్యవస్థాపకుల ప్రస్తుత లక్ష్యం! కమ్యూట్‌ వాహనాల్లో రోజూ ఒకే సమయంలో ఒకే చోటుకి ప్రయాణించేవారి మధ్య స్నేహం కూడా చిగురిస్తోంది! స్నేహితులతో ప్రయాణాన్ని ఎవరు కాదనుకుంటారు! పరోక్షంగా కమ్యూట్‌తోనూ వారి బంధం దృఢపడుతోంది!


 

రోజుకో వ్యాసం... ఏడాది యజ్ఞం!

ఏదైనా సమస్య ఎదురైతే దాన్నుంచి ఎలా బయటపడాలా అని తెగ ఆలోచించేస్తాం. స్నేహితులూ బంధువుల సలహాలు తీసుకుని ఎలాగోలా గట్టెక్కేస్తాం. ఇక అంతే, అక్కడితో ఆ సమస్యను మర్చిపోతాం. కానీ మన వెనక వచ్చేవాళ్లకి కూడా అదే సమస్య తలెత్తకుండా ఏదైనా చేస్తామా అంటే... నాకేంటి సంబంధం అని తేల్చిపారేస్తాం. కానీ యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరుకు చెందిన ప్రణయ్‌రాజ్‌ తీరు మాత్రం ఇందుకు భిన్నం. తనకు ఎదురైన సమస్యనే తన ప్రవృత్తిగా మలచుకుని ప్రపంచ రికార్డులు నెలకొల్పుతున్నాడు.

అంతర్జాలం గురించి ఏ కొంచెం పరిజ్ఞానం ఉన్నవారికైనా వికీపీడియా సుపరిచితమే. ప్రపంచవ్యాప్తంగా అనేక భాషల్లో కోరిన సమాచారాన్ని ఎంచుకున్న భాషలో క్షణాల్లో అందిస్తుంది వికీపీడియా. అయితే ఆంగ్లంలో లభించే సమాచారంతో పోలిస్తే తెలుగులో లభ్యమయ్యే విషయపరిధి చాలా తక్కువ. ముఖ్యంగా తెలుగువారి భాష, సంస్కృతి, చరిత్ర మొదలైనవాటికి సంబంధించిన అంశాలూ ఆంగ్లంలో కంటే తెలుగులో లభిస్తేనే ఎక్కువమందికి చేరుతాయి. ఇదే విషయాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకున్న ప్రణయ్‌రాజ్‌ వంగరి అనే యువకుడు తెలుగు వికీపీడియాలో వ్యాసాలు రాయడం ప్రారంభించాడు. రాయడం అంటే ఏదో అడపాదడపా రాయడం కాదు, ఇప్పటికి 740 వ్యాసాలను వికీపీడియాలో పొందుపరిచాడు. అంతేకాదు ఇప్పటికీ ఆ పనిని కొనసాగిస్తూనే ఉన్నాడు.

ఏడాదిపాటు రోజుకో వ్యాసం చొప్పున రాసిన ప్రణయ్‌ వికీపీడియాలో ఎక్కువ సంఖ్యలో తెలుగు వ్యాసాలు రాసిన వ్యక్తిగా ప్రపంచ రికార్డునీ సాధించాడు. ఇంతటితో ఆగకుండా ‘వెయ్యిరోజులకు వెయ్యి వ్యాసాలు రాసి త్వరలోనే గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్‌ సాధించాలనేదే నా లక్ష్య’మంటూ ముందుకు సాగుతున్నాడు. భువనగిరి జిల్లా మోత్కూర్‌కు చెందిన ప్రణయ్‌రాజ్‌కు చిన్నప్పటి నుంచే కళారంగంపై ఆసక్తి ఎక్కువ. అందుకే నాటకరంగం (థియేటర్‌ ఆర్ట్స్‌)లో పీజీ పూర్తిచేసి, అదే అంశంపై ఎం.ఫిల్‌ చేస్తున్నాడు. తన పరిశోధనలకు సంబంధించిన వ్యాసాలు తెలుగు వికీపీడియాలో లభించకపోవడంతో కొంత ఇబ్బంది పడ్డాడు. అదే విషయాన్ని తన గైడ్‌ పెద్ది రామారావుగారికి చెబితే ‘నీలా మరొకరు ఇబ్బంది పడకుండా నువ్వే వికీలో వ్యాసాలు ఎందుకు రాయకూడద’ని సలహా ఇచ్చారు. దీంతో 2013 మార్చి 8న మహిళా దినోత్సవం సందర్భంగా తొలి వ్యాసాన్ని రాసి వికీపీడియన్‌గా తన ప్రవృత్తిని ప్రారంభించాడు. ఇక అప్పటి నుంచీ ఇప్పటివరకూ తన రచనలను కొనసాగిస్తూనే ఉన్నాడు.

వ్యాసాలతో రికార్డు
నాటక రంగానికి చెందిన వ్యాసాలతోపాటూ తెలంగాణలోని ప్రఖ్యాత స్థలాలూ, చరిత్ర, సంస్కృతీ, సంప్రదాయాలూ, వ్యక్తులూ... ఇలా అనేక అంశాలకు సంబంధించిన వ్యాసాలూ ప్రణయ్‌ చేతిలో అక్షరరూపం దాల్చాయి. ఈ సందర్భంలోనే వందరోజుల్లో వంద వ్యాసాలు రాయాలని కొందరు వికీపీడియన్లు విసిరిన సవాలును స్వీకరించిన ప్రణయ్‌రాజ్‌ సునాయాసంగా వాటిని పూర్తిచేశాడు. అక్కడితో ఆగిపోకుండా 365 రోజులూ రోజుకో వ్యాసం రాయాలంటూ వికీపీడియా సంవత్సర ఛాలెంజ్‌ని తనకు తానే నిర్దేశించుకున్నాడు. 2016 సెప్టెంబరు 8న ప్రారంభించిన ఈ ప్రక్రియను 2017 సెప్టెంబరు 7కి పూర్తిచేశాడు. తెలుగులో ఈ లక్ష్యాన్ని పూర్తిచేసిన ఏకైక వ్యక్తి ప్రణయ్‌రాజ్‌ కావడం విశేషం. అతడు రాసిన వ్యాసాల్లో తెలంగాణ సంస్కృతిని తెలియజేసేవీ, మహిళలకు సంబంధించినవీ సుమారు రెండువందల వరకూ ఉన్నాయి.

ఓపక్క పెళ్లి, మరోపక్క వ్యాసం...
క్రమం తప్పకుండా రోజూ ఒక వ్యాసం రాయడం అంత సులువుకాదు. అందులోనూ ప్రతీ అంశానికి సంబంధించిన మూలాలతో సహా దాన్ని అందించడం మరింత కష్టమైన పని. అలాంటి పనిని నిరంతరం కొనసాగించడమే కాకుండా తన పెళ్లి జరిగినరోజు కూడా వ్యాసాన్ని రాసి తన ప్రవృత్తిమీద మక్కువను చాటుకున్నాడు ప్రణయ్‌. అంతేకాదు, తన భార్యను సైతం వికీపీడియాలో సభ్యురాలిగా నమోదు చేశాడు. ఒకవైపు హైదరాబాద్‌లోని తెలుగు విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన థియేటర్‌ ఔట్రీచ్‌ యూనిట్‌లో ప్రాజెక్ట్‌ అసిస్టెంట్‌గా తన విధులను నిర్వహిస్తూనే వికీలో వ్యాసాలు రాయడం, దానికి సంబంధించి వివిధ దేశాల్లో జరిగిన ఉత్సవాలూ, సమావేశాల్లో చురుగ్గా పాల్గొనడం చేస్తుంటాడు ప్రణయ్‌. ‘మాయ’, ‘డింభకారాజ్యం’, ‘పిపీలికం’, ‘కల్పితం... కానీ నిజం’ మొదలైన నాటకాలూ రచించాడు. తెలుగు నాటక రంగంలో కృషిచేస్తున్న కొంతమంది మిత్రులతో కలిసి పాప్‌కార్న్‌ థియేటర్‌నూ ప్రారంభించాడు. దేవత, చంటిగాడు, స్వయంవరం మొదలైన టీవీ సీరియళ్లకూ అవంతిక చిత్రానికీ సహాయదర్శకుడిగా పనిచేశాడు.

ఉపరాష్ట్రపతి ప్రశంస...
తెలుగు వికీపీడియాలో 365 రోజులపాటు రోజుకో వ్యాసం రాసి ప్రపంచ రికార్డు సాధించిన ప్రణయ్‌రాజ్‌ను భారత ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ట్వీట్‌ చేసి మరీ అభినందించారు. తెలంగాణ రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌ కూడా అభినందనలు తెలియజేశారు.


 

తన మరణవార్తను నోబెల్‌ చదవడం వల్లనే..!

నోబెల్‌... ప్రపంచంలోనే అత్యుత్తమ పురస్కారాల్లో ప్రధానమైంది. 116ఏళ్ల చరిత్ర ఉన్న దీని వెనక ఉన్న ఆసక్తికర ఘట్టాలూ అపురూప సంఘటనలూ ఎన్నో. ఇప్పటికే 2017 నోబెల్‌ అవార్డుల గ్రహీతల వివరాలు వెల్లడయ్యాయి. ఈ సందర్భంగా నోబెల్‌ గురించి మనకు తెలియని కొన్ని విషయాల్ని తెలుసుకుందామా...

‘ద మర్చంట్‌ ఆఫ్‌ డెత్‌ ఈజ్‌ డెడ్‌’... 1888 సంవత్సరంలో ఓరోజు ఫ్రెంచ్‌ పత్రికలో ఆల్ఫ్రెడ్‌ నోబెల్‌ను ఉద్దేశించి పెట్టిన శీర్షిక ఇది. నోబెల్‌ సోదరుడు లుడ్‌విగ్‌ మరణించగా, చనిపోయింది నోబెల్‌ అని పొరబడి వారు ఈ శీర్షికతో ఓ కథనాన్ని ప్రచురించారు. ‘ఇంతకుముందు ఎన్నడూ లేనంతగా వేగంగా మనుషుల్ని చంపే రకరకాల పద్ధతుల్ని కనిపెట్టి డబ్బుల్ని సంపాదించిన డాక్టర్‌ ఆల్ఫ్రెడ్‌ నోబెల్‌ చనిపోయాడు’ అన్నది ఆ వార్త సారాంశం. కెమిస్టు, ఇంజినీర్‌ అయిన స్వీడన్‌కు చెందిన నోబెల్‌ - డైనమైట్‌, బాల్లిస్టైట్‌లాంటి ప్రమాదకరమైన పేలుడు పదార్థాలను సృష్టించాడు. ఇలా తన జీవితకాలంలో కనిపెట్టిన 355 రకాల ఉత్పత్తులూ పరికరాలతో నోబెల్‌ అపర కుబేరుడయ్యాడు. అయితే, పొరపాటున ప్రచురితమైన ఆ కథనం నోబెల్‌లో ఎంతో మార్పును తెచ్చింది. ‘నేను చనిపోయాక ప్రపంచం నన్ను ఇలా గుర్తు పెట్టుకుంటుందా...’ అని ఆలోచించాడు. అంతే తన వీలునామాని పూర్తిగా మార్చి రాయించాలనుకున్నాడు. తన మరణానంతరం ప్రజలకు ఉపయోగపడేలా వివిధ రంగాల్లో విశేష కృషి చేసిన వారికి ఏటా తన పేరుతో బహుమతులను ఇవ్వాలని కోరుతూ ఆస్తిలో 94శాతం(ప్రస్తుత లెక్కల ప్రకారం రూ.1636 కోట్లు) వాటాను ఆ పురస్కారాల కోసం కేటాయిస్తూ 1895లో వీలునామా రాశాడు. తర్వాత ఏడాదికి అతడు మరణించాడు. అప్పుడు అసలు విషయం తెలిసి కుటుంబ సభ్యులు నోబెల్‌ ఫౌండేషన్‌ని ఏర్పాటుచెయ్యడానికి అంగీకరించలేదట. కానీ స్థానిక చట్టాలు ఒప్పుకోకపోవడంతో వాళ్లేం చెయ్యలేకపోయారు. తర్వాత నోబెల్‌ వీలునామాలో సూచించిన విధంగా ఫౌండేషన్‌ ఏర్పాటు జరిగింది. 1901 నుంచి నోబెల్‌ పురస్కారాలను ఇవ్వడం ప్రారంభించారు.

* నోబెల్‌ మెడల్‌ను మొదట్లో 23క్యారెట్ల బంగారంతో రూపొందించేవారు. ప్రస్తుతం 18క్యారెట్ల బంగారంతో తయారుచేసి పైన 24క్యారెట్ల బంగారపు పూత పూస్తున్నారు.

* రసాయన శాస్త్రం, భౌతికశాస్త్రం, సాహిత్యం, శాంతి, వైద్యం... ఈ అయిదు రంగాల్లోనే మొదట్లో పురస్కారాలను ఇచ్చేవారు. ఆర్థికశాస్త్రానికి సంబంధించిన పురస్కారం 1968లో వీటితో చేరింది. నోబెల్‌ జ్ఞాపకార్థం ఆర్థికశాస్త్రంలో కృషి చేసినవారికి ‘నోబెల్‌ మెమోరియల్‌ ప్రైజ్‌’ను ఇవ్వాలని కోరుతూ ‘స్వీడన్‌ సెంట్రల్‌ బ్యాంకు’ ఇచ్చిన నిధులతో దీన్ని ప్రారంభించారు.

* నోబెల్‌ ఒక్కసారి రావడమే గగనం. కానీ ఇంటర్నేషనల్‌ కమిటీ ఆఫ్‌ ద రెడ్‌ క్రాస్‌(ఐసీఆర్‌సీ) మూడుసార్లు నోబెల్‌ శాంతి పురస్కారాన్ని అందుకుంది. ఐసీఆర్‌సీని స్థాపించిన హెన్రీ డునంట్‌ మొట్ట మొదటి నోబెల్‌ శాంతి బహుమతిని అందుకున్నారు.

* నోబెల్‌ చరిత్రలో ఎవరితోనూ పంచుకోకుండా రెండు నోబెల్‌ పురస్కారాలు(శాంతి స్థాపన, రసాయన శాస్త్ర రంగాల్లో) అందుకున్న ఒకే ఒక్క వ్యక్తి ‘లైనస్‌ పాలింగ్‌’.

* ఇప్పటివరకూ నోబెల్‌ని అందుకున్న పిన్నవయస్కురాలు మలాలా యూసఫ్‌జై. 2014లో నోబెల్‌ శాంతి పురస్కారం అందుకునేసరికి ఆమె వయసు 17 ఏళ్లు. నోబెల్‌ (ఆర్థికశాస్త్రంలో) అందుకున్న ఎక్కువ వయసున్న వ్యక్తి లియోనిడ్‌ హర్‌విజ్‌(90 ఏళ్లు).

* నోబెల్‌ ఫౌండేషన్‌ సంపద మీద ఏటా వచ్చే ఆదాయాన్ని అవార్డు గ్రహీతలకు పంచుతారు. అందుకే, బహుమతిగా ఇచ్చే నగదు విలువ ఏటా మారుతుంది. ఈ ఏడాది రూ.7.25 కోట్ల(9.0 మిలియన్‌ స్వీడిష్‌ క్రొనర్‌లు)ను ఇవ్వబోతున్నారట.

* నోబెల్‌ గ్రహీతలను నోబెల్‌ లారియట్స్‌ అంటారు. గ్రీకు పురాణాల ప్రకారం వృత్తాకారంలో ఉన్న కిరీటం పెట్టుకున్న అపోలో దేవుడిని లారియట్‌గా పిలుస్తారు.

* నోబెల్‌ పురస్కారాలను ఏటా డిసెంబర్‌ 10(ఆల్ఫ్రెడ్‌ నోబెల్‌ వర్ధంతి రోజు)న ప్రదానం చేస్తారు. నోబెల్‌ పురస్కారాలన్నిటినీ స్వీడన్‌ రాజధాని స్టాక్‌హోమ్‌లో స్వీడన్‌ రాజు అందిస్తారు. ఒక్క శాంతి పురస్కారాన్ని మాత్రం నార్వేలోని ఓస్లోలో ఇస్తారు.

* నిబంధనల ప్రకారం చనిపోయినవారికి నోబెల్‌ ఇవ్వరు. అయితే, 2011లో కెనడాకు చెందిన ఇమ్యునాలజిస్ట్‌ రాల్‌ü్ఫ ఎమ్‌.స్టెన్‌మ్యాన్‌కు మరణించిన మూడు రోజులకు అవార్డుని ప్రకటించారు. నోబెల్‌ గ్రహీతల ఎంపిక ఆఖరునిమిషం వరకూ రహస్యంగా ఉంచాలి కాబట్టి ఆయన ఆరోగ్యం గురించి కమిటీ ఆరా తీయలేకపోయింది.

* నోబెల్‌ పురస్కారాలను ఏటా అన్ని విభాగాల్లోనూ ఇవ్వాలని లేదు. ఇప్పటివరకూ అలా 49 సార్లు పురస్కారాలను ఇవ్వలేదు. 116 ఏళ్లలో 48 మంది మహిళలు మాత్రమే నోబెల్‌ పురస్కారాన్ని అందుకున్నారు.

* మహాత్మాగాంధీ అయిదుసార్లు నోబెల్‌ శాంతి పురస్కారానికి నామినేట్‌ అయ్యారు. ఆఖరుసారి 1948లో ప్రతిపాదన వచ్చిన కొద్దిరోజులకే బాపూజీ హత్యకు గురయ్యారు. అందుకే, ఆ సంవత్సరం నోబెల్‌ శాంతి పురస్కారాన్ని ఎవరికీ ఇవ్వలేదు.

మన దేశానికి వచ్చిన మొత్తం నోబెల్‌ పురస్కారాలు కేవలం అయిదు మాత్రమే. కానీ ఫ్రాన్స్‌కి చెందిన మేరీ క్యూరీ కుటుంబానికే ఏకంగా అయిదు నోబెల్‌ పురస్కారాలు వచ్చాయి. మేరీ క్యూరీ రెండు నోబెల్‌ ప్రైజులనూ ఆమె భర్త, కూతురూ అల్లుడూ తలొకటీ అందుకున్నారు. అందుకే, వారి కుటుంబాన్ని నోబెల్‌ కుటుంబం అంటారు.

 

మలి వయసులో ‘ఆసరా’! 

చెట్టు ఎంత ఎత్తుకి పెరిగినా వేళ్లు భూమిలోనే ఉంటాయి. వ్యక్తి ఏ స్థాయిలో ఉన్నా అనుబంధాలు మాత్రం పుట్టిపెరిగిన వూరితోనే పెనవేసుకుంటాయి. సిరిసంపదలతో పొందలేని సంతృప్తి అక్కడి జ్ఞాపకాలూ, అనుబంధాల్లో దొరుకుతుంది. అందుకే తాము పుట్టి పెరిగిన ప్రాంతం రుణం తీర్చుకుంటున్నారా స్నేహితులు!

ది 1960వ దశకం... ఒంగోలులోని సి.ఎస్‌.ఆర్‌.శర్మ కళాశాలలో కొత్తగా చేరిన విద్యార్థుల్లో 25 మంది బృందంగా ఏర్పడి తమకు తాము వసతి గృహాన్ని ఏర్పాటుచేసుకున్నారు. ఏటా సీనియర్లు వెళ్తున్నా, జూనియర్లు వచ్చి చేరేవారు. అందులో ఎక్కువగా ఏఐఎఎఫ్‌ విద్యార్థి సంఘం సభ్యులు ఉండేవారు. అలా ఆ హాస్టల్‌ని కొన్నేళ్లపాటు విద్యార్థులే నడుపుతూ వచ్చారు. అక్కడ వసతి పొందుతూ చదువుకున్నవారు 200 మందికి పైగానే ఉంటారు. ఆ క్రమంలో వారి మధ్య స్నేహాలూ ఏర్పడ్డాయి. చదువు పూర్తయి ఉపాధి కోసం ఎవరి దారిన వారు వెళ్లి దాదాపు నాలుగైదు దశాబ్దాలు గడిచినా వారి మనసుల్లో ఆ జ్ఞాపకాలు మాత్రం పదిలంగా ఉండిపోయాయి. ఎప్పుడైనా ఒకరికొకరు ఎదురైతే పలకరించుకోవడం, ఫోన్లలో యోగక్షేమాలు తెలుసుకోవడం తప్ప అందరూ ఒక వేదికమీద కలిసింది లేదు. ఆలోటు తీర్చుకునేందుకు ఏడాదిన్నర కిందట ఒంగోలులో వారందరూ ఆత్మీయ కలయిక సమావేశం ఏర్పాటుచేసుకున్నారు. ఆ కలయిక వారిని ఓ కొత్త మార్గంవైపు నడిచేలా చేసింది. ‘అందరం కలిసి చదువుకున్నాం. వృత్తి, కుటుంబ జీవితాల్లో ఎంతో సంతృప్తితో ఉన్నాం. ఇకనుంచి మనమంతా సమాజసేవ కోసం చేతులు కలుపుదాం’ అంటూ ఒక నిర్ణయానికి వచ్చారు. ఆ ఆలోచనల్లోంచి పుట్టిందే ఆసరా(అసోషియేషన్‌ ఫర్‌ సోషల్‌ రీసెర్చ్‌ అండ్‌ అడ్వాన్స్‌) సంస్థ. దీనికి అనుబంధంగా నిధుల సమీకరణకోసం ‘సరోజ్‌ సేవా ఫౌండేషన్‌’ను ఏర్పాటు చేశారు.

వృద్ధులకు ఆసరా...
‘సేవ చేయాలి... కానీ, ఎవరికి’ అన్న విషయంలో కాస్త సందిగ్ధత. ‘విద్యార్థుల్ని చదివిద్దాం’, ‘పేదల్ని ఆర్థికంగా ఆదుకుందాం’, ‘వృద్ధులకు చేయూతనిద్దాం’... తమ మనసులోని మాటని ఒక్కొక్కరూ చెబుతూ వచ్చారు. మిత్ర బృందానికి మార్గదర్శి, వయసులో పెద్ద అయిన నల్లూరి వెంకటేశ్వర్లుని ఈ విషయమై సలహా అడిగారు. ‘ఇవన్నీ చేద్దాం కానీ అన్నింటికంటే ముందు వృద్ధాశ్రమం నిర్మించి, జీవిత చరమాంకంలో ఉన్నవారికి ఆసరా ఇద్దాం’ అన్నారాయన. తమ ప్రణాళికల్ని అమలు చేసేందుకు అప్పటికప్పుడే ఓ కార్యవర్గాన్ని ఏర్పాటుచేసుకున్నారు. దీనిలో నాగార్జున విశ్వవిద్యాలయం ఆచార్యులు అంజయ్య, మరికొందరు ఉపాధ్యాయులూ, వివిధ వృత్తుల్లో ఉన్నతస్థాయిలో స్థిరపడినవారూ, సీనియర్‌ పాత్రికేయులూ ఉన్నారు. ‘సరోజ్‌ సేవా ఫౌండేషన్‌’కు నల్లూరి గౌరవాధ్యక్షుడిగా, బెంగళూరులో వ్యాపారిగా స్థిరపడిన చిడిపోతు వెంకటేశ్వర్లు అధ్యక్షుడిగా ఉన్నారు.

మూడు కోట్లతో ఆశ్రమం...
ముందుగా మూడెకరాల విస్తీర్ణంలో అన్ని వసతులతో వృద్ధాశ్రమాన్ని నిర్మించాలని ఆసరా కార్యవర్గం నిర్ణయించింది. దీనికోసం మూడు కోట్ల రూపాయలు అవసరమని లెక్క తేల్చారు. చిడిపోతు వెంకటేశ్వర్లు తన వంతుగా రూ.కోటి అందించారు. మిగిలిన వారిలో కొందరు రూ.10 వేల నుంచి 5లక్షల వరకూ చందాలు ఇచ్చారు. ఆ మొత్తం రూ.50 లక్షలైంది. తర్వాత పరిచయం ఉన్న స్థానిక పెద్దలనూ, కళాశాలలో తమతోపాటే చదువుకుని ఉన్నతంగా స్థిరపడిన వారినీ విరాళాలు అడిగారు. అంతా కలిపి రూ.2.5 కోట్లు అయింది. గతేడాది ఏప్రిల్‌లో ఒంగోలు సమీపంలోని మారెళ్లగుంటపాలెం గ్రామ పరిధిలో వృద్ధాశ్రమ భవన నిర్మాణాన్ని ప్రారంభించారు. ఈ ఏడాది ఆగస్టు 15న ఆశ్రమాన్ని ప్రారంభించారు. ఈ భవనాన్ని మూడు అంతస్తులుగా నిర్మించారు. సుమారు 100 మంది ఇక్కడ ఆశ్రయం పొందొచ్చు. ఆశ్రమంలో ఉండేవారికి ఆహ్లాదాన్ని కలిగించేలా పూలతోటా, విశాలమైన ప్రాంగణాలూ, వైద్యసేవలకి ప్రత్యేక గదీ ఉన్నాయి. 60ఏళ్లు దాటినవారికే ఇక్కడ ఆశ్రయం ఇస్తారు. దీన్లో చేరాలనుకునేవారు సంస్థ ప్రతినిధి నలజాల కొండయ్య (9849063206)ను సంప్రదించవచ్చు. ‘మా సొంతూరు ఒంగోలు దగ్గర్లోని టంగుటూరు. పిల్లలు ఉపాధి కోసం వలస పోతుండటంతో వృద్ధులైన తల్లిదండ్రులు గ్రామాలూ, పట్టణాల్లో ఇబ్బందులు పడుతున్నారు. ఇన్నాళ్లూ కుటుంబ బాధ్యతల్ని మోసిన వారికి ఆ పరిస్థితి రావడం బాధాకరం. అలాంటివారి కోసం వృద్ధాశ్రమం పెట్టాలని ఉండేది. ఈ ప్రతిపాదన రాగానే మా కుటుంబ సభ్యుల సాయంతో రూ.కోటి విరాళం అందించాను’ అని చెబుతారు వెంకటేశ్వర్లు.

సామాజిక బాధ్యత
వృద్ధాశ్రమ భవన సముదాయంలో మరిన్ని కార్యక్రమాల్ని చేపట్టాలని చూస్తోంది ఆసరా సంస్థ. ‘ఇక్కడ మహిళలకు వృత్తి నైపుణ్యాల్లో శిక్షణ ఇచ్చి వారు స్వయం ఉపాధి పొందేందుకు సాయపడే సామాజిక వికాస కేంద్రాన్ని ఏర్పాటుచేయనున్నాం’ అని చెబుతారు నల్లూరి. వీటితోపాటు సామాజిక, సాంస్కృతిక, చారిత్రక అంశాలపైన పరిశోధనలు చేసేందుకు ఒంగోలులో ఒక వేదికను ఏర్పాటుచేయనుందీ సంస్థ. దేశంలోని వివిధ కళారూపాలనూ, జానపదాలనూ, నాటక బృందాన్ని ప్రోత్సహించేందుకు పేద విద్యార్థులకు చేయూతనిచ్చేందుకూ ఇప్పటికే ఆయా రంగాల్లో ఉన్న సంస్థలతో కలిసి పనిచేయాలనుకుంటోంది. ఒంగోలులో సకల సౌకర్యాలతో ఓ గ్రంథాలయాన్ని ఏర్పాటు చేయడంతోపాటు సమకాలీన అంశాలపైన ప్రజలకు చైతన్యం కలిగేలా చర్చావేదికల్ని నిర్వహించనున్నారు. వీటికే పరిమితం కాకుండా, ఆకలి, ఆపద, అవసరం... ఎప్పుడు ఎవరికి ఎలా వచ్చినా ఆసరా ఇవ్వాలనేది వీరి లక్ష్యం!

- మానెం శ్రీనివాసరావు, ఈనాడు ఒంగోలు
ఫొటోలు: సత్యనారాయణ

 

అచ్చు గుద్దినట్టు ఒకేలా..!