close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
అమ్మమ్మ కానుక

అమ్మమ్మ కానుక
- పి.వి.వి.సత్యనారాయణ

రోజు నా హ్యాపీ బర్త్‌డే. తలంటి పోసుకుని కొత్త బట్టలు తొడుక్కున్నాను. ఉదయం నుంచీ పుట్టినరోజు శుభాకాంక్షలూ గిఫ్ట్‌లూ అందుతున్నాయి. రాత్రికి పార్టీ ఉంది. దానికి నా స్నేహితులను ఆహ్వానించాను. ఆరోజు ఆదివారం కావడంతో బడి లేదు. హాల్లో కూర్చుని అంతవరకూ వచ్చిన గిఫ్ట్‌ ప్యాకెట్లు ఒక్కొక్కటీ కుతూహలంతో విప్పి చూడసాగాను.

‘‘నిన్న మొన్నటి వరకూ చిట్టి పొట్టి అడుగులతో ముద్దు ముద్దు మాటలతో ఇల్లంతా తిరిగిన నా చిట్టితల్లికి అప్పుడే పదేళ్ళు వచ్చేశాయంటే నమ్మబుద్ధి కావడంలేదు’’ అంటోంది అమ్మ ఫోన్లో ఎవరితోనో.

‘‘మమ్మీ, అయామ్‌ ఇన్‌ ఫిఫ్త్‌క్లాస్‌ నౌ’’ అని అరిచాను నేను. అమ్మ నావంక చూసి చిరునవ్వు నవ్వింది.

ఆ గిఫ్ట్‌లన్నీ బొమ్మలే. అధికభాగం ఎలక్ట్రానిక్‌వి. వాటిని చూస్తుంటే నా మనసు ఆనందంతో నిండిపోయింది. రాత్రి మరిన్ని వస్తాయి. వాటన్నిటినీ మర్నాడు బడికి తీసుకువెళ్ళి నా స్నేహితులందరికీ చూపించేంత వరకూ నాకు నిద్రపట్టదు. వాటిని చూసి అంతా కుళ్ళుకోవాలి.

కొరియర్‌ అన్న పిలుపుతో హుషారుగా గుమ్మం దగ్గరకు పరుగెత్తాను. కొరియర్‌ బాయ్‌ ఇచ్చిన ప్యాకెట్‌ని అందుకుంటుంటే నా ఉత్సాహం నీరుకారిపోయింది. అది ఎవరు పంపారో, అందులో ఏముంటుందో చూడగానే తెలిసిపోయింది నాకు... అది అమ్మమ్మ పంపించినది. ఎప్పుడూ ఒకే రకం గిఫ్ట్‌ పంపిస్తుంది తను. నిరుత్సాహంతో ప్యాకెట్‌ని ఎప్పటిలాగే నా పుస్తకాల అరలోకి విసిరేశాను, విప్పకుండానే.

అమ్మమ్మ స్కూల్‌ ప్రిన్సిపాల్‌గా రిటైరయింది. కానీ, బర్త్‌డేకి పిల్లలకు ఎలాంటి గిఫ్ట్‌ ఇవ్వాలో తెలియకపోవడం ఆశ్చర్యకరం! పల్లెలో ఒంటరిగా ఉంటుంది తాను. తాతయ్య చదువుకున్నా, వ్యవసాయం చేసేవాడట. అమ్మమ్మ కూడా బాగానే చదువుకుందట. తాను ఉద్యోగం చేయవలసిన అవసరం లేకపోయినా, ఉపాధ్యాయ వృత్తిపైన మక్కువతో ఓ కాన్వెంటులో టీచరుగా చేరిందట. చివరగా ఓ పబ్లిక్‌ స్కూల్లో ప్రిన్సిపాల్‌గా చేసి పదవీ విరమణ చేసిందట. నేను పుట్టేటప్పటికే తాతయ్య పోయారు. కనుక ఆయన్ని ఎరుగను నేను. అమ్మమ్మకు- మమ్మీ, మామయ్య ఇద్దరే సంతానం. మామయ్య అమెరికాలో ఉంటున్నాడు. అమ్మమ్మను తన దగ్గరకు రమ్మంటే- తాతయ్య జ్ఞాపకాలతో నిండిన ఆ ఇంటినీ వూరినీ వదిలి ఎక్కడికి రానన్నదట. పొలాన్ని కౌలుకు ఇచ్చేసి, వూళ్ళొని పేద పిల్లలకు ఉచితంగా చదువు చెబుతోంది.

అమ్మమ్మ మంచిది. సెలవుల్లో నేను వెళితే నాపైన అపారమైన ప్రేమానురాగాలను కురిపిస్తుంది. నాకు ఏమేమి ఇష్టమో అడిగి తెలుసుకుని కమ్మగా వండి కొసరి కొసరి తినిపిస్తుంది. నాకు కొత్త బట్టలు కొనిపెడుతుంది. అయితే, అమ్మమ్మలో నాకు నచ్చనివి రెండే. ఒకటి- ఎప్పుడూ నా చదువు, బడి, టీచర్స్‌, నా స్నేహితులు, నా స్కూల్‌ ప్రోగ్రెస్‌ల గురించే ఆరా తీస్తుంది. రెండవది- పుట్టినరోజుకుగానీ పండుగలకుగానీ తాను నాకిచ్చే గిఫ్ట్‌ ఒకటే- పుస్తకాలు!

నాకు చదువు మీద కంటే ఆటలమీదే ఆసక్తి ఎక్కువ. సగటు విద్యార్థిని. అందుకే అమ్మమ్మ ఆరాలు నాకు ఇష్టం ఉండవు. ఇక పుస్తకాలు చదవడమంటే పరమ బోర్‌. అస్సలు ఆసక్తిలేదు. అవి కథల పుస్తకాలైనా సరే! ‘అమ్మమ్మ కూడా అందరిలాగే బొమ్మలు గిఫ్ట్‌గా ఇస్తే ఎంత బావుంటుంది’ అనిపించేది చాలాసార్లు.

అమ్మమ్మ పంపిన పుస్తకాలు నా అలమరలో ఓ మూల పడి ఉండేవి. కొన్నిటినైతే అసలు తెరిచి కూడా చూసేదాన్ని కాదు. అమ్మమ్మ అడిగితే, చదివినట్లు చెప్పేదాన్ని. అయితే, ఎప్పుడైనా బోర్‌గా ఫీలైనప్పుడు ఆ పుస్తకాలను తీసి చదివేదాన్ని. నిజం చెప్పొద్దూ... కొన్నిటిలోని కథలూ బొమ్మలూ నన్ను ఆకట్టుకునేవి. ‘అమరచిత్ర కథ’ వంటివి ఆసక్తిదాయకంగా ఉండేవి. అయినా చదివేదాన్ని కాదు, అంత ఓపిక ఎక్కడ!

నేను తొమ్మిదో తరగతిలో ఉండగా ఓసారి మా క్లాస్‌ టీచర్‌ కొందరు బాయ్స్‌నీ గర్ల్స్‌నీ ఎంపికచేసి ‘సోషల్‌ సర్వీస్‌ క్యాంప్‌’కి ఓ గిరిజన ప్రాంతానికి తీసుకువెళ్ళారు. పది రోజుల క్యాంప్‌. అందులో నేనూ భాగం కావడం హుషారు కలిగించింది. మగపిల్లలకు పల్లెలను శుభ్రంచేసే పనులు కేటాయిస్తే, ఆడపిల్లలకు అక్కడి బాలబాలికలకు చదువు చెప్పే బాధ్యత అప్పగించారు.

చిన్నపిల్లలకు చదువు చెప్పడం- అందునా ఆ గిరిజన పిల్లలను క్లాసులకు రప్పించడం- ఎంత కష్టమో అప్పుడుకానీ తెలిసిరాలేదు నాకు. మొదటిరోజున పిల్లల్ని మచ్చిక చేసుకోవడంతోనే సరిపోయింది. రెండవరోజున పాఠాలు చెప్పబోతే పెద్దగా శ్రద్ధ చూపలేదు వాళ్ళు. దాంతో పద్ధతి మార్చాలనుకున్నాను. అమ్మమ్మ నాకు గిఫ్ట్‌గా పంపించిన పుస్తకాలలో నేను చదివిన కథలను జ్ఞప్తికి తెచ్చుకుని వాటిని వారికి అర్థమయ్యే రీతిలో చెప్పనారంభించాను. ఓ పక్క కథలు చెబుతూనే మరోపక్క పాఠాలు చెప్పసాగాను. దాంతో నా క్లాసు పట్ల పిల్లలలో ఆసక్తి పెరిగింది. రోజూ క్రమం తప్పకుండా క్లాసుకు రావడమేకాక, కుదురుగా కూర్చుని శ్రద్ధగా పాఠాలు వినేవారు.

అదంతా గమనిస్తున్న మా టీచర్‌ మెచ్చుకోలుగా చూశారు నావంక. ‘‘ఏమో అనుకున్నాను కానీ, నువ్వు పిల్లలకు పాఠాలు చెప్పే పద్ధతి వినూత్నంగా ఉంది స్నేహితా! నీలో మంచి ఉపాధ్యాయిని కనిపిస్తోంది నాకు’’ అన్నారు.

క్యాంప్‌ ముగిశాక ‘బెస్ట్‌ బాయ్‌’, ‘బెస్ట్‌ గర్ల్‌’ ప్రైజులు ఉన్నాయి. ‘బెస్ట్‌ గర్ల్‌’ ప్రైజ్‌ నాకే రావడం ఆనందం కలిగించింది. అప్పుడప్పుడైనా, అమ్మమ్మ పంపించిన పుస్తకాలను తిరగవేసినందుకు నన్ను నేనే అభినందించుకున్నాను.

ఓసారి మా క్లాస్‌టీచర్‌ సెలవులో ఉండటంతో, లైబ్రరీ మేడమ్‌ వచ్చి మాకు క్లాస్‌ తీసుకున్నారు. పాఠాలకు బదులుగా పుస్తకాల గురించీ, పుస్తక పఠనం గురించీ ఆసక్తికరంగా వివరించారు. పుస్తకం హస్తభూషణమే కాదు, మంచి స్నేహితుడు కూడా అని చెప్పారు.

మా క్లాసులో ఎంతమందికి పుస్తకాలు చదివే అలవాటు ఉన్నదో చేతులు ఎత్తమన్నారు. క్లాస్‌ మొత్తానికి అయిదారుగురే చేతులు ఎత్తారు. నేనూ ఎత్తాను, రెగ్యులర్‌ రీడర్ని కాకపోయినా. మేడమ్‌ మమ్మల్ని మెచ్చుకున్నారు. ఆమధ్య మేము చదివిన పుస్తకంలోంచి ఏదైనా చెప్పమన్నారు. అంతా దిక్కులు చూస్తుంటే, నేను ధైర్యంగా లేచి నిలుచున్నాను.

నెలక్రితం ఓ రోజున వర్షం ఎడతెరిపి లేకుండా కురుస్తున్న కారణంగా ఆడుకోవడానికి బైటకు వెళ్ళడం కుదరలేదు నాకు. టీవీ కూడా ఆఫ్‌ అయింది. ‘ఏం చేద్దామా’ అని ఆలోచిస్తుంటే, అమ్మమ్మ గిఫ్ట్‌లు గుర్తుకువచ్చాయి. ఓ పుస్తకం తీసుకుని, అమ్మ చేసిన వేడివేడి పకోడీలు తింటూ చదవనారంభించాను. చదువుతూ పడిపడి నవ్వాను. ఆసక్తికరంగా ఉండటంతో విడవకుండా చదివి ఒక్క సిట్టింగులోనే దాన్ని పూర్తిచేసేశాను. నేను ఎన్నడూ అంత కుదురుగా కూర్చుని చదవడం ఎరుగని అమ్మ ఆశ్చర్యపోయింది.

ఇప్పుడు ఆ పుస్తకంలోని కథను నేను క్లుప్తంగా చెబుతుంటే క్లాసంతా నవ్వులతో నిండిపోయింది. చప్పట్లు చరిచారంతా. అంతమందిలో మేడమ్‌ నన్ను పొగుడుతుంటే గర్వంగా అనిపించింది నాకు.

‘పుస్తకాలు జీవితాలను చక్కదిద్దడమే కాదు, ఒక్కోసారి అవి జీవితాలను మలుపు తిప్పడం కూడా కద్దు’ అన్నారు మేడమ్‌. పుస్తక పఠనాసక్తిని అలవరచుకోమని మరీమరీ చెప్పారు. పిల్లలు చదవవలసిన పుస్తకాల లిస్ట్‌ను చెప్పి, వాటిలో కొన్ని స్కూల్‌ లైబ్రరీలో ఉన్నాయనీ, లేనివాటిని బైట కొనుక్కునైనా తప్పక చదవమనీ సలహా ఇచ్చారు.

మేడమ్‌ ఇచ్చిన జాబితాలోని పుస్తకాల పేర్లలో చాలామటుకు ఫెమిలియర్‌గా అనిపించి విస్తుపోయాను నేను. ఇంటికి వెళ్ళగానే యూనిఫామ్‌ కూడా మార్చుకోకుండా పరుగెత్తుకు వెళ్ళి అమ్మమ్మ పంపించిన పుస్తకాలన్నిటినీ బైటకు తీసి మేడమ్‌ ఇచ్చిన లిస్టుతో సరిచూసుకున్నాను. మూడు వంతుల పుస్తకాలు అందులో ఉన్నవే! వాటిలో సగం కూడా చదవనందుకు ఎలాగో అనిపించింది నాకు. చదివిన కొద్ది పుస్తకాల పరిజ్ఞానంతోనే టీచర్ల ప్రశంసలను అందుకున్నాను నేను. వాటినన్నిటినీ చదివుంటేనో..!? మొదటిసారిగా అమ్మమ్మ ఇచ్చిన గిఫ్టుల విలువ తెలిసివచ్చింది నాకు.

పుస్తకాలకన్నా ఆట వస్తువులూ వగైరాలే గొప్ప అనుకునేదాన్ని నేను. ఆ గిఫ్టులన్నీ ఇప్పుడు ఎక్కడ ఉన్నాయో ఏమయ్యాయో కూడా తెలియదు. కొద్దిరోజులపాటు వాటితో ఆడుకుని పాతబడిపోవడంతోనో విరిగిపోవడంతోనో వాటిని ఓ మూల పడేయడం జరిగేది. కానీ, పుస్తకాలో... వాటి విలువ తరగనిది. ఆట వస్తువుల జీవితం అత్యల్పమైతే, పుస్తకాల లైఫ్‌ అనంతం! మేడమ్‌ అన్నట్టు... జీవితాంతమూ మనకు తోడు నీడలా ఉండే నేస్తాలు అవి! వాటిని నిరాసక్తంగానే కొద్దో గొప్పో చదివినందుకే సోషల్‌ సర్వీస్‌ క్యాంపులో బహుమతిని అందుకున్నాను నేను. క్లాసు మెప్పు పొందాను. అదే వాటన్నిటినీ చదివుంటే ఎంత బాగుండేదో!

‘ఐ లవ్‌ యూ అమ్మమ్మా!’ అనుకున్నాను అప్రయత్నంగా. వాటిని అందుకున్నప్పుడల్లా అమ్మమ్మ పైన విసుక్కున్నందుకు పశ్చాత్తాపం కలిగింది. నాకు వచ్చిన బహుమతి గురించీ, నేను పొందిన ప్రశంసలను గురించీ వివరిస్తూ, అంత మంచి బహుమతులను ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ అప్పుటికప్పుడే అమ్మమ్మకు ఓ ఉత్తరం రాసేశాను. మర్నాడు దాన్ని పోస్ట్‌బాక్స్‌లో వేస్తుంటే, దాన్ని చదువుకున్న అమ్మమ్మ ఎంత ఆనందిస్తుందో వూహించుకుని సంబరపడ్డాను.

అయితే, నా ఉత్తరం తన చేతికి చేరకముందే- సరిగ్గా ఆరోజు తెల్లవారుజామునే అమ్మమ్మ నిద్రలోనే కన్నుమూసిందన్న వార్త నన్ను కుంగదీసింది. ‘దూరదృష్టితో నువ్వు ఇచ్చిన గిఫ్టులు నాలో తెచ్చిన పరివర్తనను గూర్చి తెలుసుకోకుండానే వెళ్ళిపోయావా అమ్మమ్మా’ అని ఏడ్చాను.

* * *

చప్పట్లతో ఆలోచనల నుండి తేరుకున్నాను నేను.

‘‘... శ్రీమతి స్నేహిత వంటి ఉత్తమ ఉపాధ్యాయుల అవసరం సమాజానికి ఎంతైనా ఉంది. విద్యార్థులు కేవలం పాఠ్యపుస్తకాలకే పరిమితం కాకుండా వారిలో పఠనాసక్తిని పెంచడానికీ, వ్యక్తిత్వ వికాసాన్ని పెంపొందించడానికీ ఆమె చేస్తున్న నిస్వార్థ, నిర్విరామ కృషి ఎంతో శ్లాఘనీయం!’’ సభాధ్యక్షుడి ప్రసంగం సాగిపోతోంది.

నా మనసు మళ్ళీ ఆలోచనల్లోకి జారిపోయింది... నేను ఇంజినీరునో, డాక్టరునో కావాలనుకున్నారు అమ్మానాన్నలు. కానీ, ఓ యావరేజ్‌ స్టూడెంటుగా నా సత్తా ఏమిటో నాకు తెలుసు. అందుకే ఎమ్‌.ఎడ్‌. చేసి టీచర్ని అయ్యాను. బహుశా, సోషల్‌ సర్వీస్‌ క్యాంపులో మా క్లాస్‌టీచర్‌ నా టీచింగును చూసి అన్న మాటలు కూడా నన్ను ప్రభావితం చేసి ఉండవచ్చు.

ఎంత అలసటగా ఉన్నా, రాత్రి పడుకునేముందు కొన్ని పేజీలైనా చదవనిదే నిద్రపట్టదు నాకు. అది నా దినచర్య అయింది. అలసిపోయిన నా మదిని పుస్తకాలు సేదదీర్చేవంటే అతిశయోక్తి కాదు.

నా జీతంలో కొంత పుస్తకాలను కొనడానికి కేటాయించి, ఓ ప్రైవేట్‌ లైబ్రరీని నెలకొల్పాను. క్లాసులోని పిల్లలకు వాటిని ఇచ్చి, పాఠ్య పుస్తకాలతోపాటు ఇతర పుస్తకాలను కూడా చదవడంపట్ల ఆసక్తిని రేకెత్తించాను. వారివారి వయసులకు తగ్గ మంచిమంచి పుస్తకాలను సేకరించి సర్క్యులేట్‌ చేసేదాన్ని. దాంతో పిల్లలలో రీడింగ్‌ హ్యాబిట్‌ అలవడటమేకాక, చదువుపట్ల వారి దృక్పథం మారింది. వ్యక్తిత్వ వికాసంలో ఆశాజనకమైన మార్పులు వచ్చాయి. ఉద్యోగంలో అంచెలంచెలుగా ఎదుగుతూన్న నాతోపాటు నా చిల్డ్రన్స్‌ లైబ్రరీ కూడా ఎదుగుతూ వచ్చింది. రీడర్షిప్‌ కూడా పెరిగింది. కొత్తకొత్త పుస్తకాలే కాక, అరుదైన పాత పుస్తకాలను కూడా సేకరించేదాన్ని. అటు విద్యార్థుల తల్లిదండ్రులూ ఇటు విద్యాధికారులూ నా ప్రయత్నాన్ని గుర్తించి ప్రశంసించడం జరిగింది. రెండు మూడుసార్లు ప్రభుత్వం నుండి ‘ఉత్తమ ఉపాధ్యాయిని’ అవార్డులు కూడా అందుకున్నాను నేను.

చూస్తుండగానే కాలచక్రంలో పాతికేళ్ళు దొర్లిపోయాయి. ఇప్పుడు నేను ఓ విమెన్స్‌ కాలేజీలో లిటరేచర్‌ ప్రొఫెసర్ని. కాలేజీ లైబ్రరీ కమిటీకి చెయిర్‌పర్సన్‌ని కూడా. విద్యార్థులలో పుస్తక పఠనాసక్తిని పెంపొందించే దిశగా నేను చేస్తున్న అవిరళ కృషిని గుర్తించిన ‘యునెస్కో’ నాకు అవార్డ్‌ను ప్రకటించింది. మెమెంటోతోపాటు పెద్ద నగదు బహుమతి కూడా ఉంటుంది.

ఆగకుండా మోగుతున్న కరతాళధ్వనులతో నా ఆలోచనలకు మళ్ళీ గండిపడింది.

నా సన్మానసభ అది. ‘యునెస్కో’, విద్యాశాఖలకు చెందిన పలువురు పెద్దలూ ప్రముఖులూ నా కృషిని కొనియాడుతూ ప్రసంగాలు చేశారు. ముఖ్య అతిథి ప్రసంగం ముగియడంతో చప్పట్లు మార్మోగాయి. చివరగా నా స్పందనను తెలుపవలసిందిగా కోరడంతో కుర్చీలోంచి లేచాను నేను.

బహుమతిగా ఇచ్చే నగదుతో గ్రంథాలయాలు అందుబాటులో లేని గ్రామాలలోని విద్యార్థుల కోసం ఓ మొబైల్‌ లైబ్రరీని ప్రారంభించి, దానికి అమ్మమ్మ పేరు పెట్టాలని నిశ్చయించుకున్నాను నేను. అదే విషయాన్ని సభాముఖంగా ప్రకటించేందుకు - స్టాండింగ్‌ ఒవేషన్‌ నడుమ - పోడియం వద్దకు నడిచాను.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.