close
దీపలక్ష్మీ నమోస్తుతే!

దీపలక్ష్మీ నమోస్తుతే!

దీపావళి వెలుగుల పండగ. చీకటిలోంచి వెలుగుల్ని పుట్టించే పండగ. చెడుపై మంచి విజయాన్ని గుర్తు చేసే విజయకాంతుల పండగ. వెలుగుల్ని చిమ్మే దీపాలు ఆరోజు ఇంటా బయటా వరుసలు కడతాయి. మనలోని మనోతిమిరాన్ని పారదోలేలా ప్రకాశిస్తాయి.

దీపానికి హైందవ సంప్రదాయంలో విశిష్ట స్థానముంది. భగవంతుడ్ని ప్రార్థించే చాలా ఇళ్లలో నిత్య దీపారాధన పరిపాటి. దేవుడి పూజ చేయాలంటే మొట్టమొదట చేసే పని దీపారాధనే. ఆ తర్వాతే ఏ తంతైనా.

దీపం జ్యోతి పరబ్రహ్మ
దీపం సర్వతమోపహం
దీపో హరతుమే పాపం
దీపలక్ష్మీ నమోస్తుతే

దీపం పరబ్రహ్మ స్వరూపం. బ్రహ్మ సకల జ్ఞానానికీ ప్రతిరూపం. జ్ఞానం మనలోని చెడుని పారదోలే అస్త్రం. అలాంటి దీపాన్ని ఆరాధించడం వల్ల ఎలాంటి పనులైనా సులువుగా పూర్తవుతాయట. పూజలు పెద్దగా చేయని వాళ్లూ, చేయలేని వాళ్లూ కూడా దేవుడి ముందు దీపం పెట్టుకుని నమస్కారం చేసుకుంటారు. మంచి కార్యక్రమాన్ని మొదలు పెట్టేటప్పుడు జ్యోతి ప్రజ్వలన చేస్తారు. ఒక మంచి పనిని ప్రారంభించేటప్పుడు అది నిర్విఘ్నంగా దిగ్విజయంగా పూర్తవ్వాలంటే దానికి చక్కని దారి చూపే దీపం తప్పక ఉండాల్సిందే. దీపపు వెలుగు మెదడుకు ఏకాగ్రతను ప్రసాదిస్తుందట. ఏ పని పూర్తి చేయడానికైనా మొట్టమొదట కావలసిన తొలి సాధనం అదే. దీపంలోని ఒక్కో భాగాన్ని ఒక్కో దేవతా స్వరూపంగా వివరిస్తుంది శాస్త్రం. దీపం అడుగు భాగంలో బ్రహ్మ, మధ్యభాగంలో విష్ణువు, ప్రమిదలో శివుడు, వెలుగులో సరస్వతి, నిప్పుకణికలో లక్ష్మీదేవీ స్థిరనివాసం ఉంటారని శాస్త్రవచనం. అందుకే పూజలో భాగంగా దీపానికి నమస్కరిస్తారు. పూలు పెడతారు. కుంకుమ పెడతారు. అక్షతలు వేస్తారు. ఏ ఎండు ఖర్జూరాన్నో నైవేద్యంగా సమర్పిస్తారు. నిత్యాగ్నిహోత్రం చేయలేని వాళ్లు నిత్యదీపారాధన ద్వారా అగ్ని దేవుడిని ఇంట్లో ఆవాహనం చేసుకుంటారు. దీపాన్ని సూర్యుడి ప్రతిరూపంగానూ చెబుతారు. ఇలా దీపారాధన చేసేప్పుడు, దేవా... నేను వెలిగించిన ఈ దీపం నా ఒక్క ఇంట్లోనే కాదు మూడు లోకాలకూ వెలుగుల్ని పంచాలి. సర్వత్రా మంగళమే జరిగేలా చేయాలి... అని మనస్ఫూర్తిగా కోరుకుంటారు. అవును...చీకట్లను పారదోలేదే దీపం. కాంతిని నింపేదే దీపం. అందుకే దీపావళినాడు అన్ని దీపాలను వెలిగిస్తారు. మంచి-వెలుతురు, చెడు-చీకటి. చెడు మీద మంచి విజయానికి గుర్తు దీపావళి.

ఆనాడే దీపావళి
విష్ణుమూర్తి భూదేవిల పుత్రుడు నరకాసురుడు. అపర శివ భక్తుడు. కఠోర దీక్షతో శివుణ్ణి ప్రార్థించాడు. అన్నపానాలు ముట్టకుండా అర్చించాడు. శివయ్య పొంగిపోయాడు. భక్తుడిని కరుణించాడు. ఏం వరం కావాలో కోరుకోమన్నాడు. ఇంకేముంది, మరణమే లేకుండా వరమియ్యమన్నాడు నరకుడు. అది కుదరదన్నాడు శివుడు. చివరికి తన తల్లి చేతిలో తప్ప ఇంకెవరి వల్లా మరణం సంభవించకుండా వరం పొందాడు. ఆడవాళ్లను చెరబట్టాడు. మునుల్ని హింసించాడు. అలవికాని ఘోరాలకు పాల్పడ్డాడు. అది ద్వాపరయుగం. ఆడవాళ్లంతా వాళ్ల వేలుపు శ్రీకృష్ణుడికి మొరపెట్టుకున్నారు. నువ్వే కాపాడాలంటూ వేడుకున్నారు. స్వామి సత్యభామా సమేతంగా రథమెక్కాడు. ధనుర్బాణాలు సంధించాడు. నరకుడి బాణానికి మూర్ఛపోయినట్టు నటించాడు, జగన్నాటక సూత్రధారి. నా హృదయేశ్వరుడినే స్పృహతప్పేలా చేస్తావా... అంటూ కళ్లెర్రజేసి, విల్లు ఎక్కుపెట్టింది సత్య. సాక్షాత్‌ భూదేవీ స్వరూపిణి ఆమె. అంతే నరకుడు నేలకొరిగాడు. భూమి మీద చీకటి తొలగిపోయింది. ఆ విజయానికి గుర్తుగా ఆ రాత్రి దీపాల వెలుగులు వూరూవాడా విరజిమ్మాయి. మంచి గెలిచింది, చెడు ఓడిపోయింది. ప్రజలు బాధల నుంచి విముక్తులయ్యారు. ఆనాటి దివ్వెల కాంతి సత్యకాంతి. ఈ నాటికీ గుర్తుచేసుకునేంతటి విజయకాంతి.

వెలుగులు విరజిమ్మేలా...
భోదీపదేవి రూపస్త్యం కర్మసాక్షిహ్యామిఘ్నకృత
యావత్పూజాం కరిష్యామి తావత్వం సిద్ధిదోభవ!

దీపం కొలువైన ఇంట శ్రీమహాలక్ష్మి నివసిస్తుంది. దరిద్రాన్ని పారదోలుతుంది. ఆరోగ్యాన్నిస్తుంది. ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తుంది. శాంతిని చేకూర్చుతుంది. దీపావళి సమయంలో ఏ ఇంట దీపకాంతులు విరజిమ్ముతాయో ఆ ఇంటికి నడిచి వెళుతుందట ధనలక్ష్మి. అందుకే ఆ రోజు సాయంకాలం పూట ఇంటినిండా దీపాలను వెలిగించి, లక్ష్మీపూజలు నిర్వహిస్తారు. సకల శుభకారిణి అయిన అమ్మను ఆ దీపకాంతుల్లో ఇంటికి ఆహ్వానిస్తారు. పూర్వం దూర్వాసుడు ఇంద్రుడి ఆతిథ్యానికి మెచ్చి విలువైన మహిమాన్వితమైన ఒక హారాన్ని ఆయనకు ఇచ్చాడట. అయితే దాని గొప్పతనాన్ని గుర్తించకుండా, ఆయన దగ్గర ఉండే ఐరావతమనే ఏనుగు మెళ్లొ వేశాడట ఇంద్రుడు. అది ఆ హారాన్ని కింద పడేసి కాళ్లతో మట్టసాగిందట. ఆ అపచారం ఫలితంగా ఇంద్రుడు రాజ్యాన్ని కోల్పోయి దీనస్థితికి చేరుకున్నాడు. పరిహారం కోసం విష్ణుమూర్తిని ప్రార్థించాడు. దీపావళి సమయాన ఒక దీపాన్ని వెలిగించి సాక్షాత్‌ మహాలక్ష్మీ స్వరూపంగా దాన్ని పూజించమన్నాడు శ్రీహరి. అలాగే చేసిన ఇంద్రుడు సిరిసంపదలను తిరిగి పొందాడట. అందుకే ఆనాడు దీపాలు పెట్టి పూజ చేసిన ఇంట సకల ఐశ్వర్యాలూ కొలువౌతాయని పురాణవాక్కు. ఇక దీపావళి ముందు వచ్చే త్రయోదశిని యమత్రయోదశిగా పిలుస్తారు. ఆ రోజు ఇంటి బయట యముడి కోసం దీపాన్ని వెలిగిస్తే అపమృత్యువు దరిచేరదట. చతుర్దశి, అమావాస్య రోజుల్లో ప్రదోషకాలాన దీపదానమిస్తే యమబాధల నుంచి విముక్తిపొందుతారట. మరణించిన పెద్దలను తలచుకుంటూ ఒక్కొక్కరి పేరిట ఒక్కో దీపాన్ని నరకచతుర్దశినాడు దేవుడి ముందు వెలిగించాలన్నది శాస్త్రòక్తి. ఆ దీపాలు పితృదేవతలకు స్వర్గాన్ని చేరే దారిని చూపుతాయట. తమసోమా జ్యోతిర్గమయా... జీవించి ఉన్నప్పుడే కాదు ఆ తర్వాతా జ్ఞాన స్వరూపమైన ఆ జ్యోతి మనకు దారి చూపుతుందన్నమాట!

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.