close
అమితాబ్‌ @ 75

అమితాబ్‌ @ 75

మితాబ్‌ ఇంటిపేరు శ్రీవాస్తవ. తండ్రి కలం పేరైన బచ్చన్‌నే అమితాబ్‌ తన ఇంటిపేరుగా కొనసాగించారు. అమితాబ్‌కి తొలుత ఇంక్విలాబ్‌ (విప్లవం) అనే పేరు పెడదామనుకున్నారట ఆయన తండ్రి హరివంశ్‌రాయ్‌. కానీ తన స్నేహితుడూ, కవీ అయిన సుమిత్రా నందన్‌ పంత్‌ సూచన మేరకు అమితాబ్‌ (అనంతమైన ప్రకాశం) అని పెట్టారట.

* అమితాబ్‌ బచ్చన్‌ పొడవు ఆరడుగుల రెండు అంగుళాలు. ఆయన ఆర్ట్స్‌లో రెండు పీజీలు చేశారు.

* అమితాబ్‌ది కాస్త బొంగురుగొంతని ఆలిండియా రేడియో, రేడియో ఏస్‌ లాంటి రేడియో స్టేషన్లు ఉద్యోగమివ్వడానికి నిరాకరించాయి.

* కోల్‌కతాలోని షిప్పింగ్‌ సంస్థ - షా అండ్‌ వాల్లెస్‌లో ఎగ్జిక్యూటివ్‌గా, బర్డ్‌ అండ్‌ కో సంస్థలో ఫ్రైట్‌ బ్రోకర్‌ (రవాణా సంస్థ దళారి)గా కూడా అమితాబ్‌ పనిచేశారు. ఆయన తొలి సంపాదన రూ.500. కోల్‌కతాలో ఉండగానే సెకండ్‌ హ్యాండ్‌ ఫియట్‌ కారు కొనుక్కున్నారు. అదే ఆయన కొన్న మొదటి కారు.

* సునీల్‌ దత్‌ సినిమా రేష్మా ఔర్‌ షేరాలో ఒక మూగవాడి పాత్రకోసం అమితాబ్‌ని ఎంపిక చేశారట. అమితాబ్‌కు ఆ అవకాశం ఇప్పించడం కోసం ఇందిరా గాంధీ తన స్నేహితురాలైన నర్గీస్‌కు లేఖ రాయడం విశేషం.

* సినీపరిశ్రమలో నిలదొక్కుకునేందుకు కష్టాలు పడుతున్న రోజుల్లో అమితాబ్‌ ముంబయిలోని మెరీనా బీచ్‌లో ఉన్న ఒక బెంచీమీద ఎన్నో రాత్రులు గడిపారట. ఇప్పటికీ ఆ వైపుగా వెళ్లేటప్పుడు ఆ రోజులను గుర్తు చేసుకుంటారు అమితాబ్‌.

* నటుడిగా అమితాబ్‌ తొలి సినిమా సాత్‌ హిందుస్థానీ. ఆయన నటించిన ఏకైక బ్లాక్‌ అండ్‌ వైట్‌ సినిమా కూడా ఇదే. ఈ సినిమాకి అమితాబ్‌ అందుకున్న పారితోషికం వెయ్యి రూపాయలు. ఆయనకు తొలి సూపర్‌హిట్‌ని అందించిన సినిమా జంజీర్‌. ఈ సినిమాకి ముందు బిగ్‌బీ నటించిన 12 సినిమాలు వరుసగా ఫ్లాప్‌ అయ్యాయి. ఇక, సినిమాల్లో ఆయనకు ఇష్టమైన పేరు విజయ్‌. ఆ పేరుతో దాదాపు 20 సినిమాల్లో నటించారు బిగ్‌బీ.

* అమితాబ్‌ తన జీవితభాగస్వామి అయిన జయ బాధురిని పుణె టెలివిజన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియాలో తొలిసారి కలిశారు. ‘గుడి’్డ సినిమా సెట్‌లో రెండోసారి చూశారు. 1973లో అమితాబ్‌ జయబాధురిని ప్రేమవివాహం చేసుకున్నారు.

* 1971లో వచ్చిన ఆనంద్‌ నుంచీ 1988లో వచ్చిన షెహన్‌షా వరకూ పదిహేడేళ్లపాటు ఏటా శతదినోత్సవ సినిమా ఇచ్చిన ఏకైక నటుడు అమితాబ్‌. ఎక్కువ ద్విపాత్రాభినయాలు చేసిన నటుడు కూడా అమితాబే.

* తన సినిమా (షోలే) రీమేక్‌ (ఆగ్‌)లో తానే హీరోగానూ విలన్‌గానూ నటించిన ఏకైక వ్యక్తి అమితాబ్‌.

* 90వ దశకం చివర్లో వచ్చిన మృత్యుదాత సినిమాతో అమితాబ్‌ తన రెండో ఇన్నింగ్స్‌ని మొదలుపెట్టారు. అప్పటి నుంచే అమితాబ్‌ బిగ్‌బీగా పేరుపొందారు.

* మిస్టర్‌ ఇండియాలోని ప్రధాన పాత్రను అమితాబ్‌ని దృష్టిలో పెట్టుకునే రాశారట సలీం జావేద్‌.

* సిల్‌సిలా సినిమాలోని హిట్‌ సాంగుల్లో ఒకటైన రంగ్‌ బర్సేను అమితాబ్‌ తండ్రి హరివంశ్‌రాయ్‌ బచ్చన్‌ రచించారు.

* వహీదా రెహ్మాన్‌ కంటే అందమైన హీరోయిన్‌ లేరని బిగ్‌బీ ఎప్పుడూ అంటూఉంటారు.

* ఎన్నో సినిమాల్లో మద్యం తాగుతూ కనిపించిన అమితాబ్‌ నిజజీవితంలో అసలు మద్యం తీసుకోరు. అంతేకాదు ఆయన పూర్తి శాకాహారి కూడా.

* ఏకాంతాన్ని ఎక్కువగా ఇష్టపడే అమితాబ్‌ రెండు చేతులతోనూ రాయగలరు.

* మేడం టుస్సాడ్స్‌ మ్యూజియంలో చోటుదక్కించుకున్న తొలి ఆసియా నటుడు అమితాబ్‌.

* 2001 ఈజిప్టులో జరిగిన అలెగ్జాండ్రియా ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో అమితాబ్‌ని ‘యాక్టర్‌ ఆఫ్‌ ది సెంచరీ’ పురస్కారంతో గౌరవించారు.

* బీబీసీ నిర్వహించిన యాక్టర్‌ ఆఫ్‌ ది మిలీనియం పోల్‌లో చార్లీచాప్లిన్‌, మార్లన్‌ బ్రాండోలను సైతం వెనక్కునెట్టి అమితాబ్‌ ఆ టైటిల్‌ని సొంతం చేసుకున్నారు. 2015లో భారత ప్రభుత్వం అమితాబ్‌ని పద్మవిభూషణ్‌తో సత్కరించింది.

* అమితాబ్‌కి ఆస్తమా, మైస్తీనియా గ్రావీస్‌ అనే కండరాల వ్యాధీ ఉన్నాయి.

* అమితాబ్‌ రాజ్‌కపూర్‌ కుమార్తెతో వియ్యమందారు. తన కుమార్తె శ్వేతను రాజ్‌కపూర్‌ మనవడైన నిఖిల్‌ నందాకిచ్చి వివాహం జరిపించారు.

* అమితాబ్‌కి ‘ప్రతిక్ష’, ‘జల్సా’ అనే రెండు బంగ్లాలున్నాయి. వీటి విలువ రూ.200 కోట్లకు పైమాటే. ఇందులో ‘జల్సా’ను ప్రముఖ దర్శకుడు రమేష్‌ సిప్పీ బహుమతిగా ఇవ్వడం విశేషం. అమితాబ్‌ ప్రతి ఆదివారం తన ఇంటి బయట వేచి ఉండే అభిమానులకు చేతులూపుతూ అభివాదం చేస్తారు.

* అమితాబ్‌కి సూట్స్‌ అంటే చాలా ఇష్టం. అతడి ఫేవరెట్‌ బ్రాండ్‌ గబ్బానా. గత ముప్ఫైఅయిదు సంవత్సరాలుగా అమితాబ్‌కి అదే సంస్థ సూట్స్‌ని డిజైన్‌ చేస్తోంది. ఈ సూట్స్‌కు ఉపయోగించే వస్త్రం ఇటలీ నుంచీ, దారాలు జర్మనీ, ఫ్రాన్స్‌ల నుంచీ, బటన్స్‌ ఇంగ్లండ్‌ నుంచీ దిగుమతి అవుతాయి.

* వాచీలు సేకరించడం బిగ్‌బీ హాబీ. ఆయన ఫేవరెట్‌ వాచ్‌ బ్రాండ్‌ లాంజిన్స్‌. ఒక్కో వాచీ ఖరీదు రూ.2 లక్షలపైనే. వివిధ రకాల పెన్నులు సేకరించడం అమితాబ్‌కి ఉన్న మరో వ్యాపకం. దాదాపు వెయ్యిరకాల పెన్నులు ఆయన దగ్గర ఉన్నాయి. ఏటా అమితాబ్‌ పుట్టిన రోజున మాంట్‌ బ్లాంక్‌ కంపెనీ ఆయనకో ప్రత్యేకమైన పెన్నును బహుమతిగా ఇస్తోంది.

* బిగ్‌బీకి కార్లన్నా కూడా చాలా ఇష్టం. అందుకే ఆయన దగ్గర పదుల సంఖ్యలో కార్లున్నాయి. ఆ జాబితాలో లెక్సస్‌తోపాటు బీఎండబ్ల్యూలూ, మెర్సిడెస్‌లూ చోటుదక్కించుకున్నాయి. ఆయన ఫేవరెట్‌ లెక్సస్‌ అనే బుల్లెట్‌ ప్రూఫ్‌ కారు. ఈ కారు టైర్ల ఖరీదు ఒక్కొక్కటీ రూ.2.5 లక్షలు.

* అమితాబ్‌ పిల్లలైన శ్వేత, అభిషేక్‌ తాము చదివే స్కూల్‌కి అమితాబ్‌ని రావద్దని చెప్పేవారట. ఆయన్ని చూడటానికి అందరూ గుమికూడటం వారికి ఇబ్బందిగా ఉండేదట.

* హిందీ సినీపరిశ్రమను బాలీవుడ్‌ అని పిలవడం మొదటి నుంచీ వస్తున్న ఆనవాయితీ. కానీ అమితాబ్‌కి ఆ పేరు అసలు నచ్చదు. తన మనవరాలైన ఆరాధ్యను బేటీ బీ అని పిలవడం కూడా అమితాబ్‌కి ఇష్టం ఉండదు. ఆయన తన మనవరాలిని బిటియా అని పిలుస్తారు.

* ఒలింపిక్‌ జ్యోతిని అందుకునే అరుదైన గౌరవం అమితాబ్‌కి లభించింది. 2012 జులై 27న లండన్‌లో ఒలింపిక్‌ జ్యోతిని చేతబట్టి ఆయన 300 మీటర్లు పరుగుతీశారు.

* 2015లో జరిగిన ఐసీసీ వరల్డ్‌ కప్‌లో ఇండియా-పాకిస్థాన్‌ క్రికెట్‌ మ్యాచ్‌కి కామెంటేటర్‌గా వ్యవహరించారు బిగ్‌బీ.

* అమితాబ్‌ సోషల్‌ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు. ట్విటర్‌, బ్లాగుల్లో తన అనుభవాలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటారు. ఒక్క ట్విటర్‌లోనే ఆయనకు కోటీ డెబ్భై లక్షలకు పైగా ఫాలోవర్లు ఉన్నారు.

* అమితాబ్‌కు ఇటీవల కాలంలో బాగా నచ్చిన చిత్రం రాజమౌళి తీసిన బాహుబలి.

* అమితాబ్‌కి ఇష్టమైన కొటేషన్‌ ‘పుస్తకాన్ని అందరూ చదవలేరు... కానీ సినిమాని ప్రతి ఒక్కరూ చూడగలరు’.

* అమితాబ్‌ 2000లో వచ్చిన కౌన్‌ బనేగా కరోడ్‌పతి (కెబిసి) మొదటి సీజన్‌కి వ్యాఖ్యాతగా పనిచేసినందుకు ఒక్కో ఎపిసోడ్‌కు రూ.25 లక్షలూ, తర్వాత సీజన్లలో ఎపిసోడ్‌కు రూ.3.5 - 5 కోట్ల వరకూ పారితోషికం అందుకున్నారట.

* గుజరాత్‌ రాష్ట్ర పర్యటకానికి 2010 నుంచి బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నారు బిగ్‌బీ.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.