close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
అవసరానికో అబద్ధం

అవసరానికో అబద్ధం
- జి.ఎస్‌. 

‘‘అప్పుడే దిగబడిపోతోంది మహా తల్లి’’... కోడలిని ఉద్దేశించి గొణుక్కుంటోంది కాంతమ్మ హాల్లోని సోఫాలో కూర్చొని.

రెండు రోజులు ట్రైనింగ్‌ ఉందని బెంగళూర్‌ వెళ్ళిన ఆమె కోడలు శిరీష తిరిగి వచ్చేస్తోంది. శిరీష లేని రెండు రోజుల్లో ఒక్కసారైనా కొడుకుతో మనస్ఫూర్తిగా మాట్లాడాలనుకుంది కానీ... ఉదయం ఆఫీసుకి వెళ్ళే హడావుడి, రాత్రి లేట్‌గా అలసిపోయి ఇంటికి తిరిగి వచ్చే తన కొడుకు సుందరంతో సరిగ్గా మాట్లాడే అవకాశం రాలేదు కాంతమ్మకి. ఆ మాటకొస్తే సుందరం పెళ్ళయిన రెండున్నర సంవత్సరాల నుండీ కాంతమ్మకి ఆ అవకాశం దొరకలేదు. ఆ అవకాశం రాకపోవటానికి కారణం... తన కోడలు కొడుకుని కొంగుకు కట్టుకుని తిరగటమే అని ఆమె అభిప్రాయం.

కాంతమ్మ భర్త నారాయణ గవర్నమెంటు ఉద్యోగి. సుందరం- వాళ్ళ ఏకైక సంతానం కావటం వలన చాలా గారాబంగా పెంచారు. పెళ్ళయ్యే వరకూ సుందరం వాళ్ళమ్మ కొంగు పట్టుకునే తిరిగేవాడు. పెళ్ళినాటికి సుందరం ఓ పెద్ద కన్‌స్ట్రక్షన్‌ కంపెనీలోనూ, కోడలు సాఫ్ట్‌వేర్‌ కంపెనీలోనూ ఉద్యోగం చేసేవారు. శిరీష ఆఫీసుకి వెళ్ళి రావటానికి కష్టమవుతోందని పెళ్ళైన వారానికే సుందరం వేరు కాపురం పెట్టాల్సివచ్చింది. ఇలా జరుగుతుందని పెళ్ళి సంబంధం కుదిరినప్పుడే కాంతమ్మ కొంచెం భయపడింది కానీ తన కొడుకు మీద చాలా నమ్మకం... అలా జరగనివ్వడనీ, అవసరమైతే కోడలి చేత ఉద్యోగం మానిపిస్తాడనీ.

పెళ్ళి... ప్రతి మనిషి జీవితంలో కొత్త బంధాలతోపాటు కొంత మార్పుని కూడా తీసుకొస్తుంది. ఈ విషయం కాంతమ్మకీ తెలుసు కానీ కొడుకు విషయంలో ఆ మార్పుని ఆమె మనసు అంగీకరించటం లేదు.

‘అందరం ఒకేచోట ఉందాం, మాతోపాటే వచ్చేయ’మని సుందరం అడిగాడు. కానీ నారాయణ గారికి ఇంకా రెండు సంవత్సరాలు సర్వీస్‌ ఉండటం, కొడుకుని తమ నుండి తీసుకుపోతున్న కోడలితో ఉండటానికి కాంతమ్మ ఇగో ఒప్పుకోకపోవటంతోపాటు పైసా పైసా కూడపెట్టి కొంతా, మరికొంత బ్యాంకు లోన్‌ తీసుకుని ఎంతో కష్టపడి కట్టుకున్న ఇంటిని వదిలి వెళ్ళటానికి కాంతమ్మా, నారాయణగార్లు ఇష్టపడలేదు. దగ్గరుండి మరీ ఇల్లు కట్టించుకున్నారు, ఇంటికి వాడిన ప్రతి ఇటుకతో వారికి అనుబంధం ఉంది. ఆ ఇంటి గృహప్రవేశం అయిన వెంటనే సుందరం పెళ్ళి చేశారు. సుందరం అత్తగారిది కూడా హైదరాబాదే.

ఒక సంవత్సరం ఉద్యోగం చేసిన తర్వాత సుందరం సొంతంగా కన్‌స్ట్రక్షన్‌ కంపెనీ స్టార్ట్‌ చేశాడు. నారాయణగారు రిటైరైన కొన్ని రోజులకే గుండెపోటుతో చనిపోయారు. ఎంతో ఇష్టంతో కష్టపడి కట్టుకున్న ఇల్లు వేరేవాళ్ళకి అద్దెకిచ్చి కొడుకు దగ్గరకు రావటం కాంతమ్మకి సుతరామూ ఇష్టంలేదు కానీ తప్పలేదు. కొడుకు అపార్ట్‌మెంట్‌కు వచ్చి నాలుగు నెలలు అవుతోంది. కొడుకునే సర్వస్వంగా భావించి ఎంతో ప్రేమగా పెంచింది, కానీ కోడలి వలన కొడుకు తనకు దూరమయ్యాడనే బాధ ఆమె గుండెల్లో నిండిపోయింది. భర్త బతికి ఉన్నన్నాళ్ళూ ఆ బాధను కొంత మరవగలిగింది. కానీ ఇప్పుడు కొడుకు దగ్గరే ఉంటున్నా ఆ ‘దూరాన్ని’ ఇంకా ఎక్కువగా ఫీలవుతోంది.

‘‘అమ్మా, టిఫిన్‌ అయిందా? నేను అర్జెంటుగా బయలుదేరాలి, ఆఫీసులో మీటింగ్‌ ఉంది’’ అన్నాడు సుందరం తన బెడ్‌రూమ్‌ నుండి హడావుడిగా వస్తూ.

‘‘నీకు ఏ రోజు అర్జెంట్‌లేదురా, ప్రతిరోజూ అర్జెంటే కదా, ఉండు వచ్చి పెడతాను’’ అంది సోఫాలోంచి లేస్తూ.

‘‘నువ్వు కూర్చో, నేను పెట్టుకుంటాలే’’ అన్నాడు డైనింగ్‌ టేబుల్‌ దగ్గర కూర్చుంటూ.

‘‘నువ్వు టిఫిన్‌ తింటూ ఉండు, స్టవ్‌ మీద పాలు మరుగుతున్నాయ్‌, కాఫీ కలుపుకొస్తాను’’ అంటూ కిచెన్‌లోకి వెళ్ళింది కాంతమ్మ.

‘‘ఈ రెండు రోజులూ నీకు కొంచెం ఇబ్బంది అయింది, శిరీష ఈరోజు వచ్చేస్తుందిగా... నో ప్రాబ్లమ్‌’’ అన్నాడు ఇడ్లీలోకి చట్నీ వేసుకుంటూ, తన తల్లికి కలిగిన కాస్త ఇబ్బందికి నొచ్చుకుంటూ.

కానీ కాంతమ్మకి ఆ మాటల్లో అర్థం వేరుగా అనిపించింది. కోడలు వచ్చేస్తున్నందుకు కొడుకు మాటల్లో ఆనందం కనిపించింది ఆవిడకు.

‘‘నాకేం ఇబ్బందిరా, చెట్టుకు కాయ ఎప్పుడూ బరువు కాదు, పడితే గిడితే నువ్వు ఇబ్బందిపడి ఉండాలి. అయినా ఈ రోజుల్లో పిల్లలందరూ తల్లిదండ్రులు బతికి ఉండటమే పెద్ద ఇబ్బందిగా ఫీలవుతున్నారు’’ అంది.

ఈమధ్య తల్లి మాటలు కొంత బాధనీ కొంత ఆశ్చర్యాన్నీ కలిగిస్తున్నాయి సుందరానికి.

‘‘ఎందుకు అంత పెద్దపెద్ద మాటలు అంటున్నావ్‌, ఇప్పుడు నేనేమన్నానని.’’

‘‘నువ్వేమనలేదురా, ఆ మాటకొస్తే నేను మాత్రం ఏమన్నాను... లోకం పోకడ చెబుతున్నాను అంతే’’ అంది కాంతమ్మ కాఫీ కప్పు డైనింగ్‌ టేబుల్‌ మీద పెడుతూ.

ఏం మాట్లాడాలో తెలియక మౌనంగా కాఫీ తాగి ‘‘నేను వెళ్ళొస్తాను, ఇప్పటికే లేట్‌ అయింది’’ అని బయలుదేరాడు సుందరం వాచీ చూసుకుంటూ.

‘‘రోజూ ఇదే హడావుడి కదా, ఈరోజు కొత్తేముంది’’ అనుకుంటూ వెళ్ళి హాల్లో సోఫాలో కూర్చుంది కాంతమ్మ.

‘నేను ఎక్కడికీ రాను, మన ఇంటికే ఇంకో ఫ్లోర్‌ వేయిస్తే కింద పోర్షన్‌ అద్దెకిచ్చి ఇక్కడే ఉంటానురా అంటే వినలేదు వీడు... పై ఫ్లోర్‌కి అయ్యే డబ్బుతో బిజినెస్‌ పెట్టుకోవచ్చు, నువ్వుండే ఒక గదికీ, ఒక మంచానికీ, ఒక కంచానికీ అంత డబ్బు అవసరమా? అయినా ఎందుకు ఒంటరిగా ఉండటం’ అని తీసుకొచ్చి ఇక్కడ పడేశాడు. ఇక్కడ మాత్రం నాది ఒంటరి బతుకేగా... తెల్లారితే ఇద్దరూ తలో దిక్కుకు పోయి చీకటిపడితేగానీ రారు... వాళ్ళు వచ్చే వరకూ ఈ నాలుగు గోడల మధ్య బందీనే కదా... అదే నా ఇంట్లో ఉండి ఉంటేనా... కాంతమ్మకి ఇల్లూ, ఇంటి ప్రహరీగోడ చుట్టూ తను పెంచుకున్న చెట్లూ మొక్కలూ గుర్తుకొచ్చాయి.

ఒక్క ఈశాన్యం మూల తప్ప అన్ని దిక్కుల్లోనూ మొక్కల్నీ చెట్లనూ పెంచింది. వంటగదికి ఆనుకుని ఉన్న మేడ మెట్ల దగ్గరగా దక్షిణం గోడ వద్ద పెంచిన జామచెట్టు ఈ ఏడాదే కాయలు కాసింది. తూర్పున మెయిన్‌గేట్‌కు కుడివైపున పెంచిన పాల సపోటా చెట్టు కూడా బాగానే పెరిగింది. గృహప్రవేశం జరిగిన కొత్తలో ఒకరోజు బజారు నుండి తెచ్చిన బంగినపల్లి మామిడిపండ్లు చాలా తియ్యగా ఉన్నాయని ఇష్టంగా తిన్నాడు సుందరం. ఆ మామిడి టెంకల్ని ఎండబెట్టి రెండిటినీ నేలలో పాతింది. ఒకటి మాత్రం మొక్క వచ్చింది. కాంతమ్మ ఇల్లు వదిలివచ్చే నాటికి ఆ మొక్క బాగా గుబురుగా పెరిగింది. ఇంకో ఏడాదిన్నర రెండేళ్ళలో పూత పూస్తుందిలే అనుకుంది వచ్చేటప్పుడు. బొప్పాయి చెట్టు కాయలు కాసినప్పుడూ, పెంచిన గులాబీమొక్కలు పువ్వులు పూసినప్పుడూ వాటిని చూసుకుని అనిర్వచనీయమైన తృప్తినీ ఆనందాన్నీ పొందేది ఆవిడ.

ఎలాగైనా ఇంటికి తిరిగి వెళ్ళిపోవాలి అనిపించింది. ఈ ఒంటరి జీవితం ఏదో అక్కడే గడుపుదాం. సరైన సందర్భం చూసి సుందరంతో చెప్పేస్తే మంచిది అని ఒక నిర్ణయానికి వచ్చింది కాంతమ్మ.

* * *

‘‘ఆ... సుందరం, స్టేషన్‌కి నాన్నగారు వచ్చారు, అమ్మా వాళ్ళింటికి వెళుతున్నాను. సాయంత్రం నువ్వు ఆఫీసు నుండి వెళ్ళేటప్పుడు ఇటు రా, కలసి వెళ్ళిపోదాం’’ యశ్వంత్‌పూర్‌ ట్రైన్‌ దిగిన శిరీష సుందరానికి ఇన్ఫర్మేషన్‌ కం ఇన్‌స్ట్రక్షన్‌ ఇచ్చింది ఫోన్‌ చేసి.

‘‘ఓకే... ష్యూర్‌... సిక్స్‌కి వచ్చేస్తాను, రెడీగా ఉండు’’ చెప్పాడు సుందరం.

కాచిగూడకి దగ్గర్లోనే శిరీషవాళ్ళ పేరెంట్స్‌ ఉండేది. ‘‘ఎలానూ ఈరోజు ఆఫీసుకి వెళ్ళవు, మళ్ళీ ఆఫీసు వర్కు అంటూ రొటీన్‌లో పడ్డావంటే ఇటువైపు రావు. పద, ముందు మన ఇంటికి వెళ్దాం. ఒక పూట ఉండి సాయంత్రానికల్లా మీ ఇంటికి వెళ్దువులే’’ అని శిరీష నాన్నగారు ఇంటికి తీసుకెళ్ళిపోయారు.

అన్నట్టుగానే సుందరం ఆరింటికల్లా వెళ్ళి శిరీషను తీసుకుని వచ్చేశాడు.

శిరీష, సుందరం ఇంటికి వచ్చేటప్పటికి టీవీలో ఏదో సీరియల్‌ చూస్తోంది కాంతమ్మ.

‘‘ఏమ్మా, ప్రయాణం బాగా జరిగిందా? ట్రైన్‌ చాలా ఆలస్యం అయినట్లుంది, మధ్యాహ్నం భోజనం టైమ్‌కే వస్తావనుకున్నాను’’ అంది లోపలికి వస్తున్న శిరీషను చూసి.

‘‘ట్రైన్‌ టైమ్‌కే వచ్చింది కానీ, నేనే మా అమ్మగారింటికి వెళ్ళి వస్తున్నాను అత్తయ్యగారూ, అందుకే లేట్‌ అయింది’’ అంది కుర్చీలో కూర్చుంటూ శిరీష.

‘‘కన్నబిడ్డలతో కష్టం సుఖం మాట్లాడుకునే అదృష్టం అందరికీ ఉండదులేమ్మా, మీ అమ్మా నాన్నలు అదృష్టవంతులు’’ అంది కాంతమ్మ.

‘‘నీకేం తక్కువమ్మా?’’ అన్నాడు సుందరం లగేజ్‌ బ్యాగ్‌ లోపలికి తీసుకువస్తూ.

‘‘సముద్రం నడుమ ఉన్నా, తాగటానికి నీళ్ళు కరువని- నా సంగతి ఎందుకులేరా... భక్తుడికీ దేవుడికీ మధ్యలో పూజారి అడ్డు ఉన్నట్టు... కొంతమందికి కొందరు అడ్డు ఉంటారులే’’ అంది కొడుకునీ కోడలినీ మార్చిమార్చి చూస్తూ.

ఆమె మాటల్లోని ఆంతర్యం సుందరానికీ శిరీషకూ అర్థమైంది. కాంతమ్మ ఇలా మాట్లాడటం మొదటిసారి కాదు. ఆమె మాటలు ఎంత బాధపెడుతున్నా సహనంతో ఉంటూ ఆమెను గౌరవిస్తూ ఎప్పటికైనా ఆమెలో మార్పు రాకపోతుందా- అని ఎదురుచూస్తుంది శిరీష.

సుందరం అసహనంగా కదిలాడు. శిరీష మౌనంగా ఉండిపోయింది.

కాంతమ్మ మాత్రం కొడుకూ కోడళ్ళ రియాక్షన్‌ పట్టించుకోనట్లుగా టీవీ చూస్తోంది.

రెండు నిమిషాల తర్వాత శిరీష తన బ్యాగ్‌ నుండి అత్తగారికి కొన్న చీర తీసి ‘‘బెంగళూర్‌లో కొన్నాను మీకోసం, చూడండి’’ అని కాంతమ్మ చేతిలో పెట్టింది.

‘‘షాపింగ్‌ చేసేంత టైమ్‌ కూడా దొరికిందా నీకు’’ అంది కాంతమ్మ. చీర నాణ్యతని వేళ్ళతో పరీక్షిస్తూ ధర అంచనా వేయసాగింది. ఖరీదైన చీరలాగే అనిపించింది, చీర బాగా నచ్చింది. కానీ ఫీలింగ్స్‌ కనబడనీకుండా ‘‘మరి మీ అమ్మకు ఏం తెచ్చావ్‌?’’ అంది చీర పక్కన పెడుతూ.

‘‘ఏమీ తేలేదు అత్తయ్యగారూ, డైరెక్ట్‌గా ఇటే వచ్చేద్దామనుకున్నాను, మా అమ్మవాళ్ళ ఇంటికి వెళతాననుకోలేదు, అందుకే ఏమీ తేలేదు’’ అంది శిరీష.

‘‘అయ్యో, నిజమా... అయినా మీ అమ్మకు నువ్వేమైనా తెచ్చి ఇచ్చిందీ లేనిదీ మేమేమైనా చూశామా, నువ్వు చెప్పింది నమ్మాలి కదా!’’ అంది నువ్వు చెప్పేది నేనేమీ నమ్మట్లేదు అన్నట్టు.

అత్తగారి మాటలు ఈటెల్లా తాకాయి శిరీషకు, సుందరం వైపు చూసింది బాధతో.

సుందరం జాలిగా, నిస్సహాయంగా చూశాడు.

కాంతమ్మ కళ్ళు ఏదో తెలియని ఆనందంతో మెరిశాయి.

‘‘ఎవరో ఒకరు వెళ్ళి కాస్త టీ చేసి తీసుకురండి, తలనొప్పిగా ఉంది’’ అన్నాడు సుందరం టాపిక్‌ మారుస్తూ.

‘‘ఆగండి అత్తయ్యా, నేను చేస్తాన్లే. నేను లేకపోవటంతో ఈ రెండు రోజులూ మీకు బాగా శ్రమ కలిగింది’’ అంది శిరీష లేవబోతున్న కాంతమ్మతో.

‘‘అవ్వకు మనవడు ఆవులింత నేర్పినట్టుంది నువ్వు చెప్పేది. పాతికేళ్ళు పైనే ప్రాణానికి ప్రాణంగా ఎంతో ప్రేమతో పెంచాను, వాడికి అన్నం వండిపెట్టడం శ్రమ అనుకుంటానా?’’ అంది విసురుగా.

ఏది మాట్లాడినా తప్పులు వెదుకుతున్న అత్తగారి మాటల్ని తట్టుకోలేకపోతోంది శిరీష.

మౌనంగా వెళ్ళి టీ తీసుకువచ్చింది. మౌనంగానే ముగ్గురూ టీ తాగారు.

శిరీష, సుందరం లగేజ్‌ బ్యాగ్‌తో వాళ్ళ బెడ్‌రూమ్‌కి వెళ్ళిపోయారు. కాంతమ్మ టీవీ చూడ్డం కంటిన్యూ చేసింది.

అత్తగారి మాటలు కలిగించిన బాధ వలన శిరీషకు ఏదో తెలియని నిస్సత్తువ ఆవహించింది. నీరసంగా బెడ్‌ మీద వాలిపోయింది, ఆ పూట భోజనం కూడా చేయకుండా. సుందరానికి శిరీష పరిస్థితి చూసి జాలి కలిగింది.

* * *

టైమ్‌ సాయంత్రం ఏడున్నర కావస్తోంది. శిరీష ఆఫీసు నుంచి వచ్చి పదిహేను నిమిషాలు అవుతోంది. ఫ్రెష్‌ అయి అప్పుడే హాల్లోకి వచ్చింది. ఆఫీసులో ఎవరో ఇచ్చిన తిరుపతి లడ్డూని శిరీష అత్తగారికిచ్చింది. కాంతమ్మ ప్రసాదాన్ని కొంచెం తుంచుకుని కళ్ళకద్దుకుని నోట్లో వేసుకుని, మిగిలింది శిరీషకి ఇచ్చింది. ఇంతలో సుందరం వచ్చాడు, చాలా డల్‌గా ఉన్నాడు.

‘‘ఏంట్రా, అంత నీరసంగా ముఖం వేలాడేసుకున్నావ్‌?’’ అంది ప్రసాదం తింటూ కాంతమ్మ.

సుందరం కుర్చీలో కూర్చుని వెనక్కి జారబడి పైకి చూస్తున్నాడు కానీ ఆమెకు సమాధానం చెప్పలేదు.

‘‘నిజంగానే చాలా డల్‌గా ఉన్నారు, ఏం జరిగింది?’’ అడిగింది శిరీష.

సుందరం అలాగే పైకి చూస్తూ ఉన్నాడు కానీ సమాధానం లేదు. ఏదో విషయం ఉందని అత్తాకోడళ్ళకి అర్థమైంది.

సుందరం మౌనం వాళ్ళల్లో ఆందోళన పుట్టిస్తోంటే, సమాధానం కోసం ఎదురుచూస్తున్నారు.

సుందరం దీర్ఘంగా శ్వాస తీసుకుని వదిలి ‘‘మన కన్‌స్ట్రక్షన్‌ ప్రాజెక్ట్‌లో ఒక దానిలో ప్రాబ్లమ్‌ వచ్చింది. పార్టనర్స్‌కి అమౌంట్‌ అర్జెంట్‌గా సర్దాలి. ఉన్న అన్ని సోర్సెస్‌ నుంచీ డబ్బు సర్దగా ఇంకా ముప్ఫైలక్షల పైనే కావాలి’’ అని ఒక క్షణం ఆగి కాంతమ్మని చూస్తూ ‘‘అందుకే మన ఇల్లు అమ్మేద్దామనుకుంటున్నాను, ఆల్రెడీ బేరం అయిపోయింది, రేపే అగ్రిమెంట్‌... నువ్వు సంతకం పెట్టాలి’’ అన్నాడు.

కాంతమ్మకి కాళ్ళకింద భూమి కదిలినట్టనిపించింది, గుండె ఒక్కసారిగా ఆగి మళ్ళీ వేగంగా కొట్టుకోసాగింది.

‘‘ఏంట్రా నువ్వనేది?’’ ఆయాసపడుతూ కుర్చీలోంచి పైకి లేచింది.

శిరీష కాంతమ్మ దగ్గరకు వచ్చి ‘‘మీరు కంగారుపడకండి అత్తయ్యగారూ’’ అంది కుర్చీలో కూర్చోపెడుతూ.

‘‘ఏంటండీ మీరనేది, మీరు చెప్పేది నిజమా?’’

అవునన్నట్లుగా తలూపాడు.

రెండు నిమిషాలు ఎవరూ మాట్లాడలేదు. కాంతమ్మ ముఖంలో భర్త చనిపోయిన్పటికంటే ఎక్కువ బాధ అలుముకుంది. అకస్మాత్తుగా వచ్చిన ఈ కుదుపును తట్టుకోవటం కష్టంగానే అనిపించింది శిరీషకు. తన పరిస్థితే ఇలా ఉంటే, పాపం సుందరంకి ఇంకెలా ఉందో అనుకుని, సుందరం దగ్గరకు వెళ్ళి చెయ్యి పట్టుకుని ‘‘ఒకసారి లోపలికి వస్తారా’’ అని బెడ్‌రూమ్‌లోకి తీసుకెళ్ళింది.

‘‘ఇటువంటి కష్టాల్లో ఆస్తులో, ఆభరణాలో అమ్ముకోవటం తప్పుకాదు. తప్పనిసరైతే అమ్మేద్దాం, కానీ చిన్న రిక్వెస్ట్‌’’ అంది శిరీష.

ఏమిటన్నట్టు చూశాడు సుందరం.

‘‘అత్తయ్యగారికి ఆ ఇల్లంటే ఎంత ఇష్టమో మీకు తెలుసు కదా, ఇక్కడకు రావటానికి కూడా ఇష్టపడలేదు. ఆ ఇంట్లో మామయ్యగారి జ్ఞాపకాలకు దూరంగా కొంచెం ఛేంజ్‌ కోసం మనమే బలవంతంగా తీసుకువచ్చాం కదా.’’

‘‘అవును, అయితే..?’’

‘‘మా అమ్మావాళ్ళు నాకిచ్చిన కూకట్‌పల్లిలోని ప్లాట్‌ మీ అవసరం కోసం అమ్ముకోండి, నాకేం అభ్యంతరం లేదు. మీకు కావాల్సిన అమౌంట్‌ వస్తుంది.’’

‘‘అంటే, నాకు ఆ ఐడియా రాలేదనుకుంటున్నావా? మనం ఎప్పటికీ వూళ్ళొని ఇంట్లో ఉండటం అనేది జరగదు, పైగా ఆ ఇల్లు మా అమ్మానాన్నల అభిరుచి మేరకు కట్టుకున్నారు. మనకు నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు. ఈ స్థలంలో అయితే మనకు నచ్చినట్టు కట్టుకోవచ్చు.’’

‘‘అత్తయ్యా మామయ్యలు ఎంతో ప్రేమగా కట్టుకున్న ఇల్లు కనీసం అత్తయ్యగారు బతికున్నంత కాలమైనా ఉండనివ్వండి. పరిస్థితులు బాగుపడ్డాక మరొక స్థలం ఇంతకన్నా మంచి ప్లేస్‌లో కొనొచ్చు. అంతేకానీ, మీ అవసరం కోసం అత్తయ్యగారికి ఆ ఇంటితో ఉన్న అనుబంధాన్ని బలిచేయకండి.’’

‘‘అనుబంధం అంటూ సెంటిమెంటల్‌గా కాకుండా ప్రాక్టికల్‌గా ఆలోచించు.’’

‘‘నేను కరెక్ట్‌గానే ఆలోచిస్తున్నాను. నామీద ఏమాత్రం ప్రేమ ఉన్నా నేను చెప్పినట్టు చేయండి’’ అంది చాలా సీరియస్‌గా.

‘‘తప్పదంటావా?’’

‘‘తప్పదు’’

‘‘సరే, నీ ఇష్టం.’’

ఈ సంభాషణ మొత్తం కాంతమ్మకి వినపడుతూనే ఉంది. ‘నేను ద్వేషించిన కోడలే సరిగ్గా అర్థంచేసుకుంది కానీ, ప్రేమగా పెంచిన కొడుకే నన్ను అర్థం చేసుకోలేకపోయాడు’ అనే బాధతో ఆమె కళ్ళలో నీళ్ళు తిరిగాయి.

‘‘అయితే, ఇల్లు అమ్మటంలేదనే విషయం అత్తయ్యగారికి చెప్పండి, ఆమె చాలా టెన్షన్‌గా ఉన్నారు.’’

సుందరం బయటకు వచ్చి ‘‘అమ్మా...’’ అంటుండగానే-

‘‘శిరీషను ఒకసారి బయటకు పిలవరా’’ అంది కాంతమ్మ కుర్చీలో నుండి లేస్తూ.

శిరీష బయటకు రాగానే శిరీషను కౌగిలించుకుని ‘‘ఇన్నాళ్ళూ నిన్ను అపార్థం చేసుకుని నోటికొచ్చినట్లల్లా మాట్లాడాను, నీ మనసెంతో కష్టపెట్టాను, నన్ను క్షమించమ్మా’’ అంది కాంతమ్మ.

‘‘అలా అనకండి అత్తయ్యా, నామీద మీకు ద్వేషమేమీ లేదు, మీ కొడుకు మీద ఉన్న ప్రేమే మీచేత అలా మాట్లాడించింది, నేను అర్థం చేసుకోగలను.’’

కాంతమ్మ మనసు చాలా తేలికపడింది. ఆమె హృదయంలో ద్వేషం తొలగిపోయి కోడలి మీద ప్రేమ నిండిపోయింది. ఒక మనిషిని ద్వేషించటం కంటే ప్రేమించేటప్పుడు కలిగే ఆనందం అనుభవమైంది. రాత్రి భోజనాల దగ్గర కాంతమ్మలో తేడా సుందరం, శిరీషలకు కూడా కనిపించింది. ప్రశాంతమైన మనసుతో హాయిగా నిద్రపోయింది కాంతమ్మ తన బెడ్‌రూమ్‌లో.

‘‘ఇల్లు అమ్మటంలేదని రేపు మార్నింగ్‌ ఫోన్‌ చేసి చెప్పేయండి, ఇంటికి బదులు ప్లాట్‌ కొంటాడేమో అడగండి. లేకపోతే వేరేవాళ్ళను చూసుకోవాలి కదా’’ బెడ్‌ మీద దుప్పటి సరిచేస్తూ అంది శిరీష.

‘‘అవసరం లేదు, మనం ఇల్లూ అమ్మటం లేదూ, స్థలమూ అమ్మటం లేదు.’’

అర్థంకానట్లు చూసింది శిరీష.

‘‘అవును, నేను ఇందాక మీకు చెప్పిందంతా అబద్ధం. నీ మనసేంటో అమ్మకు తెలియాలనే అలా చెప్పాను.’’

‘‘అత్తయ్యగారు ఎంత టెన్షన్‌ పడ్డారు, తప్పు కదా మీరలా చెప్పటం?’’ అంది శిరీష కోపంగా.

‘‘అవసరానికో అబద్ధం... తప్పేమీ కాదు.’’

‘‘రేపు స్థలం అమ్మలేదని అత్తయ్యకు తెలిస్తే అప్పుడేం చెబుతారు?’’

‘‘అవసరానికి ఇంకో అబద్ధం’’ అన్నాడు సుందరం కన్నుగీటుతూ.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.