close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
విద్యార్థులకు రుణాలిస్తారు!

విద్యార్థులకు రుణాలిస్తారు!

ఉద్యోగులకూ వ్యాపారులకూ రుణాలివ్వడానికి పోటీపడే బ్యాంకులు విద్యార్థులకు రుణాలివ్వాలంటే మాత్రం వెనకడుగు వేస్తాయి. కారణం వారికి స్థిరమైన ఆదాయం లేకపోవడమే. దాంతో ఉన్నత చదువులు అందుకోలేనివారెందరో! ఇకపైన ఆ సమస్యలేదు, ఎందుకంటే ఇప్పుడు విద్యార్థులకు రుణాలిచ్చే కంపెనీలూ వచ్చాయ్‌!

ఐటీ పూర్వ విద్యార్థులైన అంకిత్‌ మెహ్రా, జైనేష్‌ సిన్హా ప్రారంభించిన రుణ పంపిణీ సంస్థ జ్ఞాన్‌ధన్‌. విద్యార్థులుగా వీరు తమ ఉన్నత చదువులకు డబ్బు అందక ఎంతో ఇబ్బంది పడ్డారు. ‘చదువుకు డబ్బు అడ్డంకి కారాద’నే ఉద్దేశంతో జ్ఞాన్‌ధన్‌ను ప్రారంభించారు. దిల్లీ కేంద్రంగా పనిచేసే ఈ సంస్థ ప్రధానంగా విదేశీ విశ్వవిద్యాలయాల్లో ఉన్నత విద్యను అభ్యసించడానికి అవసరమైన రుణాలు అందిస్తుంది. అయితే వీరు నేరుగా రుణాలివ్వరు. ఎస్‌బీఐ, యాక్సిస్‌ బ్యాంక్‌... మొదలైన స్వదేశీ బ్యాంకులతోపాటు కొన్ని విదేశీ ఆర్థిక సంస్థలతో కలిసి పనిచేస్తూ విద్యార్థులకు రుణాలు అందేలా చేస్తున్నారు. ఇప్పటివరకూ కొన్ని వందల మంది జ్ఞాన్‌ధన్‌ సాయంతో రుణాల్ని పొందారు. విద్యార్థి కుటుంబ ఆర్థిక స్థితికంటే కూడా వారి విద్యార్హత, ఉపాధి అవకాశాలను దృష్టిలో పెట్టుకొని వీరు రుణాలు మంజూరు చేస్తారు. వెబ్‌సైట్‌ gyandhan.com కి వెళ్లి అభ్యర్థులు తమ వివరాలు నమోదుచేస్తే స్కాలర్‌షిప్‌లూ పొందే అవకాశం ఉంది. త్వరలో రుణాలిచ్చేందుకు ఆసక్తి చూపే ప్రైవేటు సంస్థలకూ తమ వెబ్‌సైట్లో చోటు కల్పిస్తామంటున్నారు. సంస్థ నిర్వహణ కోసం మొత్తం రుణంలో దాత నుంచి ఒక శాతం, గ్రహీత నుంచి ఒక శాతం వీరు వసూలు చేస్తారు. రీసెర్చ్‌ విద్యార్థులు తమ పరిశోధనలకు అవసరమయ్యే మొత్తాన్ని ఈ వెబ్‌సైట్లో క్రౌడ్‌ ఫండింగ్‌ ద్వారానూ సమీకరించుకునే వీలుంది. ఈ సంస్థ విద్యార్థులకు ఫారెక్స్‌ సేవల్నీ అందిస్తోంది.

నేరుగా కొనొచ్చు
పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థులు ప్రతిభతో ముందుకు వెళ్లాలని చూస్తుంటే, ఆర్థిక సమస్యలు వారిని వెనక్కు లాగుతుంటాయి. వేతన జీవులు అన్ని అవసరాలకూ ఒకటో తేదీ వరకూ వేచి చూడాల్సిందే! కానీ ఫీజులు, ఇతర అవసరాలు చెప్పాపెట్టకుండా ఏరోజైనా వస్తాయి. అలాంటి వారి సమస్యలను తీర్చేందుకు వచ్చిందే krazybee సంస్థ. ఇది విద్యార్థులకు ఎలాంటి క్రెడిట్‌ హిస్టరీ లేకున్నా కూడా రుణాలు ఇస్తుంది. సెమిస్టర్‌ ఫీజులూ, చదువుకు అవసరమయ్యే ల్యాప్‌టాప్‌, ట్యాబ్లెట్‌ లాంటి టెక్‌ గ్యాడ్జెట్లకీ ఇంకా టూవీలర్లకీ లోన్లు ఇస్తుందీ సంస్థ. విద్యార్థి రుణంగా పొందే మొత్తాన్ని ‘అమౌంట్‌ కార్డ్‌’- రూపంలో, అంటే ఒక క్రెడిట్‌ కార్డులా వాడటానికి వీలుండేలా’ తీసుకునే వెసులుబాటు ఉంది. ఫోన్లూ, కెమెరాలూ, టీవీలూ, ల్యాప్‌టాప్‌లూ ఈ వెబ్‌సైట్లోనే దొరుకుతాయి. బెంగళూరు కేంద్రంగా పనిచేసే ఈ సంస్థని భారత్‌కు చెందిన మధుసూదన్‌, చైనాకు చెందిన వాంగ్‌ హాంగ్‌ కలిసి ప్రారంభించారు. వీరిద్దరూ చైనా టెలికాం కంపెనీ హ్యూవేయ్‌లో సహోద్యోగులు. ప్రస్తుతం బెంగళూరు, పుణె, మైసూరు, వేలూరులలో పనిచేస్తున్న ఈ సంస్థ త్వరలో హైదరాబాద్‌, ముంబయి, చెన్నై, నాగ్‌పూర్‌ సహా పది నగరాలకు విస్తరించాలని చూస్తోంది. ‘2020 నాటికి భారత్‌లో ఉన్నత విద్యనభ్యసించేవారి సంఖ్య ఆరున్నర కోట్లకు చేరనుంది. మున్ముందు అన్ని సేవలకూ ఈ-కామర్స్‌ విస్తరించనుంది. ఈ పరిణామం అటు విద్యార్థులూ ఇటు రుణ సంస్థలూ ఇద్దరికీ లాభదాయకమే’ అని చెబుతారు వాంగ్‌. ఈ సంస్థలో ఆర్థిక సేవలు అందించే రెండు చైనా సంస్థలు రూ.13 కోట్లు పెట్టుబడి పెట్టాయి. రుణాలు పొందదలిచేవారు krazybee.com వెబ్‌సైట్‌కి వెళ్లి వివరాలు నమోదు చేసుకోవాలి.

పోటీ పరీక్షకి రుణం
విద్యార్థులకు అకడమిక్‌ చదువులు ఎంత ముఖ్యమో ప్రవేశ పరీక్షలూ అంతే ముఖ్యం. కానీ చాలా రుణ పంపిణీ సంస్థలు కాలేజీ ఫీజులూ, టెక్‌ గ్యాడ్జెట్‌లకు రుణాలిస్తాయి తప్ప ప్రవేశ పరీక్షలకు సిద్ధమవుతామంటే మాత్రం రుణాలిచ్చేందుకు ముందుకు రావు. ఆ లోటుని తీర్చడానికి ఏర్పాటైందే ‘క్విక్‌లో’. ఇది కాలేజీ ఫీజులూ, గ్యాడ్జెట్‌లతోపాటు జీఆర్‌ఈ, క్యాట్‌, టోఫెల్‌ లాంటి పరీక్షల శిక్షణకూ రుణాలిస్తుంది. విద్యార్థుల తల్లిదండ్రులు సంస్థ వెబ్‌సైట్‌ (quicklo.com) లో తమ వివరాలతోపాటు తమ పిల్లల ఆర్థిక అవసరాల్ని నమోదు చేస్తే ఎంత రుణం వచ్చేదీ చెబుతారు. రుణాలు ఇచ్చేముందు విద్యార్థుల సోషల్‌ నెట్‌వర్కింగ్‌ ఖాతాలను క్షుణ్నంగా పరిశీలించడం ఈ సంస్థ ప్రత్యేకత. బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న ఈ సంస్థను ఐఐటీ పూర్వ విద్యార్థులైన మృగాంక్‌, కుశ్‌ శ్రీవాస్తవ, రాహుల్‌ సక్సేనా ప్రారంభించారు. సంస్థ వెబ్‌సైట్లో టెక్‌ గ్యాడ్జెట్‌లూ ఉంటాయి. డెబిట్‌/క్రెడిట్‌ కార్డులు లేకుండానే వాయిదాల పద్ధతిలో వీటిని కొనుక్కోవచ్చు. కాలేజీలూ, శిక్షణ సంస్థలతో నేరుగా ఒప్పందం కుదుర్చుకొని విద్యార్థులపై భారాన్ని ఇంకా తగ్గించాలని చూస్తున్నట్టు చెబుతారు వ్యవస్థాపకులు. ప్రస్తుతానికి బెంగళూరు, పుణె, ముంబయి, చెన్నై, హైదరాబాద్‌లలో వీరి సేవలు అందుబాటులో ఉన్నాయి. మున్ముందు దేశవ్యాప్తంగా విస్తరించడానికి ప్రణాళికలు వేస్తున్నారు!


 

అడవి జంతువులకు అన్నీ తానై...

  అదో జంతు ఆశ్రమం... గాయపడో అనారోగ్యంతోనో బాధపడే జంతువులెన్నో ఆ కుటుంబం నీడన నెమ్మదిగా కోలుకుంటూ కనిపిస్తాయక్కడ. ఇంతకీ వాటిని అంత ప్రేమగా చేరదీసింది ఎవరో తెలుసా... ఆదివాసీల అభివృద్ధికోసం తండ్రి బాబా ఆమ్టే అడుగుజాడల్లోనే నడవాలని నిర్ణయించుకుని, విదేశాల్లో కోట్లు సంపాదించే ఉద్యోగావకాశాన్ని కాదనుకుని అడవిబాట పట్టిన ప్రకాష్‌ ఆమ్టే. వందలకొద్దీ వన్యమృగాలకు ఆశ్రయం కల్పిస్తోన్న ఆయన ‘యానిమల్‌ ఆర్క్‌’లోకి అడుగుపెడితే...

హారాష్ట్ర, గడ్చిరోలి దండకారణ్యం, హేమలకసా గ్రామంలోని ఆయన ఇంటికి ఆనుకునే ఉంటుందా జంతు ఆశ్రమం. లోపలకు వెళితే ప్రకాష్‌ పులిని నిమురుతోనో హైనాను ముద్దు చేస్తూనో కనిపిస్తారు. ఓ అడవిబల్లి ఆయన భుజమెక్కి ముక్కును ముద్దాడ వస్తే, వెనకకాళ్లతో నడుస్తూ తన నైపుణ్యాన్ని ప్రదర్శిస్తుంటుంది ఎలుగుబంటి. మరోపక్క ఆయన మనుమడు అర్ణవ్‌, తాచుపాముతో ఆడుకుంటూ కనిపిస్తాడు. అలాగని అవన్నీ పెంపుడు జంతువులు కావు. అంతకన్నా ఎక్కువే. కానీ వన్యప్రాణులతో సహవాసం అనేది ఏ ఒక్కరోజులోనో కుదిరేది కాదు. ప్రేమగా ఆహారాన్ని అందిస్తూ ప్రత్యేక శిక్షణతో వాటిని సాధుజంతువులుగా మార్చింది ప్రకాశ్‌ కుటుంబం.

ఆ దృశ్యం కలచివేసింది
డెబ్భయ్యో దశకంలో హేమలకసాలో ఎటుచూసినా పేదరికమే. ఆ సమయంలోనే అక్కడ అడుగుపెట్టారు ఆమ్టే దంపతులు. 20 హెక్టార్ల విస్తీర్ణంలో ‘లోక్‌ బిరాదరీ ప్రకల్ప్‌’ అనే బహుళసేవల ప్రాజెక్టును చేపట్టారు. పేదరికం, పోషకాహారలోపం, అనారోగ్యం, నిరక్షరాస్యతలతో బాధపడుతోన్న మాడియా గోండులకు ఉచిత వైద్యసేవలందించడంతోబాటు చెట్లకిందే పాఠాలూ చెప్పేవారు. వారి కష్టం వూరికే పోలేదు. అలా చదువుకున్నవాళ్లలో డాక్టర్లూ ఇంజినీర్లూ టీచర్లూ అయినవాళ్లెందరో. ఆదివాసీలు వ్యవసాయం నేర్చారు. వేటను సంప్రదాయ వేడుకకే పరిమితం చేశారు. ఆ దంపతుల సేవలు అక్కడితో ఆగలేదు. అందులోకి జంతు ప్రపంచం కూడా చేరింది. అందుకు ప్రకాశ్‌ చూసిన ఓ దృశ్యమే కారణం. ‘మేం అడవితల్లి ఒడిలోకి చేరిన తొలిరోజులవి. కొందరు ఆదివాసీలు కోతిని వేటాడి కర్రకు కట్టి తీసుకెళుతున్నారు. చనిపోయిన ఆ తల్లి కోతిని అంటిపెట్టుకుని ఓ పిల్లకోతి ఉంది. దాన్ని ఏం చేస్తారని అడిగితే, ఆ రెంటినీ వండుకుని తింటామని చెప్పారు. అది నన్ను కలచివేసింది. అలాగని వాళ్ల ఆకలిని తప్పుపట్టలేను. ‘ఆ పిల్లకోతిని నాకివ్వండి... బదులుగా బియ్యం, బట్టలూ ఇస్తాను’ అని వాళ్లతో బేరం కుదుర్చుకున్నాను. ఆ పిల్ల కోతే బబ్లి.. కొద్ది రోజుల్లోనే అది మా ఇంట్లో సభ్యురాలైపోయింది. మా ఇంటి ఆవరణే దానికి నివాసమై, నేటి ‘యానిమల్‌ ఆర్క్‌’ స్థాపనకు కారణమైంది. ఆ సంఘటనే క్రమంగా ఆదివాసీల్లోనూ మార్పు తీసుకొచ్చింది. అప్పటినుంచి వాళ్లు గాయపడ్డ జంతువులను తీసుకొచ్చి వస్తుమార్పిడి పథకం కింద ఇస్తుండటంతో ఆశ్రమంలో జంతువుల సంఖ్య పెరుగుతూ వస్తోంది’ అంటూ ఆనాటి రోజుల్ని గుర్తు చేసుకుంటారు ప్రకాశ్‌. ప్రస్తుతం ఆయన సంరక్షణలో 90 వరకూ వన్యమృగాలు ఉన్నాయి. నక్కలూ చిరుతలూ ఎలుగుబంట్లూ అడవిఉడతలూ కోతులూ పాములూ మొసళ్లూ, నెమళ్లూ జింకలూ... ఇలా వాటిల్లో ఎన్నో రకాలు. ఒక సందర్భంలో హేమలకసా గ్రామం అంతా దాదాపు మూడువందల జంతుజాతులతో నిండిపోయిందట. ‘చిన్నతనంలో నేనూ ఇంకా కొంతమంది పిల్లలం వన్యప్రాణులతో కలిసే నదికి వెళ్లి స్నానం చేసి వచ్చేవాళ్లం.

ఒక చిరుత మాతోనే పడుకునేది. అయినా మేం ఎప్పుడూ వాటికి భయపడలేదు’ అని చెబుతాడు ఆమ్టే కొడుకు అనికేత్‌. గాయాల నుంచి కోలుకున్న వాటిని మొదట్లో అడవిలోనే వదిలేసేవారట. కానీ ప్రకాశ్‌ కుటుంబీకుల లాలనకు అలవాటుపడ్డ అవి అడవిలో ఉండలేక కొన్ని వెనక్కి తిరిగి రావడం, కొన్ని బెంగతో చనిపోతుండడంతో ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన యానిమల్‌ ఆర్క్‌లోనే వాటిని సంరక్షిస్తోంది ఆమ్టే కుటుంబం. చట్టపరమైన నిబంధనలను అనుసరించి వన్యమృగాలకోసం బోనులు ఏర్పాటుచేసినప్పటికీ దాన్ని జంతుప్రదర్శనశాల అని చెప్పలేం. అవి ఆమ్టే కుటుంబసభ్యుల ప్రేమపాశానికే బందీలు తప్ప ఇనుప వూచలకు కాదని చూసినవాళ్లెవరికైనా అనిపిస్తుంది.


 

ఆ షాపులో అన్నీ ఉచితమే!

నగరాల్లో ఎటుచూసినా బ్రాండెడ్‌ షోరూమ్‌లూ అవుట్‌లెట్లూ చిన్నాపెద్దా దుకాణాలే. వాటిల్లో ఎందరో తరచూ షాపింగ్‌ చేస్తూనే ఉంటారు. నచ్చినవి కొనుక్కుంటూనే ఉంటారు. కానీ షాపింగ్‌ అన్న పదం కూడా తెలీని పేదవాళ్లు కూడా తమకు నచ్చిన వస్తువుల్ని ఎంచి తీసుకోగలిగిన దుకాణమే హైదరాబాద్‌లోని ‘గుడ్‌ విల్‌ స్టోర్స్‌’... అదీ ఉచితంగా..!

వును, మీరు విన్నది నిజమే. మెహదీపట్నం అయోధ్యనగర్‌లోని ఓ వీధిలో రోడ్డుపక్కనే కనిపిస్తుందో చిన్న దుకాణం. సరిగ్గా నడవలేని ఓ వృద్ధుడు వచ్చి అక్కడ ఉన్న వూత కర్రను తీసుకుంటే, ఎన్నడూ బట్టల దుకాణంలోకే వెళ్లని బసవమ్మ మూడు చీరలు ఎంచుకుంది. ఎనిమిదేళ్ల షాబుద్దీన్‌ నోటుపుస్తకాలు తీసుకున్నాడు. చీరలూ వూతకర్రా పుస్తకాలూ... ఇలా అన్నీ ఒకే దుకాణంలో ఎలా అన్న సందేహం సహజమే. కానీ అందులో దుస్తులూ యాక్సెసరీల నుంచి ఇంటి అవసరాలకు వాడుకునే వస్తువులూ, పిల్లలకు అవసరమయ్యే స్టేషనరీ వరకూ ఉంటాయి. పైగా అన్నీ ఉచితమే. ఎందుకంటే అది కనీసావసరాలు కూడా లేకుండా బతుకు భారంగా వెళ్లదీస్తున్న వలస కూలీలూ మురికివాడల ప్రజలకోసం ఏర్పాటుచేసిన దుకాణం. ‘అందులో ఉండేవన్నీ దాతలు ఇచ్చిన వస్తువులే. వాటిల్లో కొత్తవీ పాతవీ కూడా ఉంటాయి. కానీ వాడుకోవడానికి పనికిరానివేమీ ఉండవు. అందుకే ప్రారంభించిన రెండేళ్లలోనే పేరుకి తగ్గట్లే అటు దాతలూ ఇటు వినియోగదారుల ఆదరణను చూరగొంది’ అంటున్నారు దీని వ్యవస్థాపకురాలైన పి.మంజుల.

ఆలోచన ఎలా?
బతుకుతెరువుకోసం నగరానికి వలసవచ్చేవాళ్ల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. ఆశ్రయం లేక చాలామంది రోడ్లపక్కనే పడుకుని నానా ఇబ్బందులు పడుతుంటారు. అలాంటివాళ్లకు కాస్తయినా ఆసరా ఇవ్వాలన్న ఉద్దేశంతో ఎల్‌ఎస్‌ఎన్‌ ఫౌండేషన్‌ ద్వారా గత పదేళ్ల నుంచీ సేవలందిస్తున్నారు మంజుల. నింబోలిఅడ్డ, తప్పచాబుత్ర కేంద్రాల్లోని ఆ సంస్థకు చెందిన షెల్టర్లలో రోజూ అనేకమంది తలదాచుకుంటారు.

దాతలకీ ఆనందమే!
‘ఒకసారి మెహదీపట్నం సమీపంలోని బొజ్జగుట్ట మురికివాడకు వెళ్లినప్పుడు ఆహారం, దుస్తులు, వంటపాత్రలు... వంటి కనీసావసరాలు లేక అక్కడి ప్రజలు పడుతున్న ఇబ్బందులు చూస్తే ఎంతో బాధనిపించింది. కాలక్షేపంకోసం షాపింగు చేసేవాళ్లు కొందరయితే, ఏడాదికో జత బట్టలు కూడా కొనుక్కోలేనివాళ్లు ఎందరో కదా అనిపించింది. ఒకవేళ వందో రెండొందలో చేతిలో ఉన్నా ధైర్యంగా దుకాణాల్లోకి వెళ్లి కొనలేరు. అప్పుడు వచ్చినదే ఈ ఆలోచన... వాళ్లకు అవసరమైనవి వాళ్లే తీసుకోగలిగే ఉచిత దుకాణం. ఎందుకంటే ప్రతీ వ్యక్తికీ తమకు కావాల్సినవి తామే స్వయంగా ఎంచుకున్నప్పుడు కలిగే ఆనందం వేరు. ఆ చిన్న కోరికని తీర్చాలన్న ఉద్దేశంతోనే దాతల నుంచి సేకరించిన వస్తువుల్ని ఒకచోట దుకాణంలా ఏర్పాటుచేశాం. పైగా చాలామంది దగ్గర రకరకాల కారణాలతో వాడని దుస్తులూ వస్తువులూ అనేకం పోగుబడి ఉంటాయి. అవి మరొకరి అవసరాన్ని తీరుస్తాయంటే దాతలకీ అది ఆనందాన్నే కలిగిస్తుంది. అందుకే వస్తువుల సేకరణ మాకు అంత కష్టం కాలేదు. అనేకమంది ముందుకు వచ్చి ఇస్తున్నారు. మొదట్లో మా సంస్థ సభ్యులే వెళ్లి తీసుకునేవారు. కానీ రవాణా ఖర్చుల కారణంగా దుకాణానికి తీసుకొచ్చి ఇవ్వమని అడుగుతున్నాం. రాలేని పక్షంలో మా వలంటీర్ల ద్వారా సేకరిస్తున్నాం’ అని వివరిస్తున్నారు మంజుల.

ఈ ఉచిత దుకాణం శని, గురువారాల్లో మాత్రమే తెరచి ఉంటుంది. ఆయా రోజుల్లో చుట్టుపక్కలవాళ్లే కాదు, దూరప్రాంతాల్లో నివసించే పేదలు కూడా వచ్చి తమకు కావాల్సినవి తీసుకువెళుతుంటారు. ‘అలాగని అక్కడకు వచ్చిన అందరికీ అన్ని వస్తువులూ ఇవ్వం. ఎందుకంటే కొందరు అన్నీ తీసుకెళ్లిపోతామంటారు. దాంతో కొన్ని నిబంధనలు పెట్టక తప్పలేదు. ముందుగా షాపుకి వచ్చినవాళ్లు తమకు అత్యంత అవసరమైనది ఏదో చెబితే అది మాత్రమే చూపిస్తాం. వాళ్ల వివరాలూ ఆధారాలూ నమోదు చేసుకుని ఒక్కొక్కరికి విడతకి మూడు వస్తువులు మాత్రమే ఇస్తాం. ఒకసారి తీసుకున్నవాళ్లు మళ్లీ మరో మూడు నెలల తరవాత మాత్రమే రావాలి. లేదంటే తీసుకెళ్లినవాళ్లే మళ్లీ మళ్లీ వస్తుంటారు. అప్పుడు అనేకమంది కనీసావసరాలు తీరాలన్న మా లక్ష్యం పక్కకు వెళ్లిపోయే ప్రమాదం ఉంది. పైగా మురికివాడల్లోని ప్రజలే కాదు, నగరంలోని ఇతర నైట్‌ షెల్టర్లూ, పిల్లల హోమ్‌ల వాళ్లు కూడా మా దుకాణానికి వచ్చి తీసుకెళుతుంటారు’ అంటూ సంస్థ పనితీరుని గురించి చెప్పుకొచ్చారు కోఆర్డినేటర్‌గా పనిచేస్తున్న కిరణ్‌కుమార్‌. ‘ఒంటినిండా కప్పుకోవడానికి కూడా లేనివాళ్లు మనచుట్టూ చాలామందే ఉన్నారు. వాళ్లకు కనీసం దుస్తులయినా సమకూర్చాల్సిన బాధ్యత సమాజానిదే. మేం దాన్ని గుర్తు చేస్తున్నాం అంతే. పదిమందీ కలిస్తే అన్నిచోట్లా ఇలాంటి దుకాణాలు ఏర్పాటు చేయవచ్చు’ అంటున్నారు సంస్థ సభ్యులు. మంచి ఆలోచనే కదూ!


 

ఇరకం.. ఇలలో స్వర్గం!

అక్కడ వాహనాల రణగొణ ధ్వనులు వినిపించవు. కాలుష్యం గురించి ఆందోళనలేదు. చల్లని గాలీ, కనుచూపుమేర నీరు... ఆ ప్రశాంతమైన వాతావరణం చూస్తే కాలానికి కూడా సేదదీరాలనిపిస్తుంది. ఏంటీ మీకూ వెళ్లాలనిపిస్తోందా?

ఆంధ్ర-తమిళనాడు రాష్ట్రాల సరిహద్దు నెల్లూరు జిల్లా తడ మండలంలో ఉన్న దీవి ‘ఇరకం’. దేశంలో రెండో అతిపెద్ద ఉప్పునీటి సరస్సు అయిన పులికాట్‌ మధ్యలో ఉంటుందీ దీవి. ఇక్కడకు పడవలో మాత్రమే చేరుకోగలం! మండలంలోని తీరప్రాంతమైన భీములవారిపాలెం నుంచి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ దీవిని నిశ్చల పులికాట్‌లో తేలికపాటి అలలపైన పడవలో కూర్చొని అటూ ఇటూ వూగుతూ చేరుకోవచ్చు. తెరచాప పడవల హొయలు, వలలను విసిరే జాలరులూ, వారికి దొరకకుండా ఎగిరిపడే చేప పిల్లలూ, వాటిని వేటాడేందుకు పోటీపడే వలస పక్షులూ, ఆహారం కోసం జపం చేసే స్వాతి కొంగలూ, ఇంకా పీకల్లోతు నీళ్లలో దిగి ఆల్చిప్పలను సేకరించే మత్స్యకారుల్ని ఇరకం వెళ్లే దారిలో చూడొచ్చు. పడవ దిగగానే రా రమ్మని పిలిచే బిళ్లగన్నేరు పూలు, మొగలిపూల సువాసనలూ, నీటికోసం వందల ఏళ్ల కిందట తవ్వుకున్న నీటి దొరువులూ(చిన్న చెరువులు), వాటిచుట్టూ కంచెలా పచ్చని పేము చెట్లూ... అడుగడుగునా ఆకట్టుకునే దృశ్యాలెన్నో సందర్శకుల్ని అలరిస్తాయి.

బోటు ప్రయాణం
సుమారు 47 చ.కి.మీ. విస్తీర్ణంలో ఉన్న ఇరకంలో 630 కుటుంబాలున్నాయి. జనాభా మూడు వేలు. వీరి మాతృభాష తమిళం. 90 శాతం తమిళం మాత్రమే మాట్లాడగలరు. పది శాతానికి రెండు భాషలూ వచ్చు. ఈ దీవిలో ఇరకం, మత్స్యకారుల గ్రామం తిరువెంకటానగర్‌ కుప్పం ఉన్నాయి. ఇక్కడ ఉండేవారి ప్రధాన వృత్తి చేపలు పట్టడమైనా వ్యవసాయ, వ్యవసాయ కూలీల కుటుంబాలూ ఉన్నాయి. చుట్టూ ఉప్పు నీరున్నా దీవిలో మంచినీటికి ఇబ్బందిలేదు. చేపలూ వ్యవసాయ ఉత్పత్తులూ అమ్మాలన్నా, నిత్యావసరాలు కొనాలన్నా గ్రామం నుంచి బయటకు వెళ్లాల్సిందే. ప్రజల అవసరాలకు రోజూ రెండుసార్లు మాత్రమే ప్యాసింజరు బోటు అందుబాటులో ఉంటుంది. ఇది గ్రామ ప్రజలు తమకు తాముగా చేసుకున్న నిర్ణయం. ప్రభుత్వం అందించిన ఈ బోటు నిర్వహణను గ్రామస్థులే చూసుకుంటారు. ఉదయం, మధ్యాహ్నం వేళల్లో ఇరకం, తిరువెంకటానగర్‌ కుప్పంల నుంచి రెండు పడవలు భీములవారిపాలెం రేవుకు వెళ్తాయి. అట్నుంచి దీవికి రావడానికి ఉదయం, సాయంత్రం వేళల్లో బోట్లు ఉంటాయి. ఒకవైపు ప్రయాణానికి రూ.10 చెల్లించాలి. అత్యవసరమై దీవి నుంచి బయటకు వెళ్లాలంటే రూ.500 చెల్లించి ప్రత్యేక పడవ ఏర్పాటుచేసుకోవాల్సిందే! సరుకు రవాణాకూ ప్రైవేటు బోట్లు ఉంటాయి.